శిశిర శరత్తు

సహృదయ జగత్తు

   -వురిమళ్ల సునంద

కథ చెప్పడం ఓ గొప్ప కళ.మరి ఆ కళను ఆస్వాదించే విధంగా ఉండాలంటే  కథా వస్తువు ఏదైనా సరే
ఎత్తుగడ,నడక తీరు ముగింపు ఒకదాని వెంట ఒకటి -కళ్ళను ఆ వాక్యాల వెంట పరుగులు తీయించేలా ఉండాలి. ‘కథ చదివిన తర్వాత మనసు చలించాలి.మళ్ళీ మళ్ళీ చదివింప జేయాలి.కథ  బాగుంది అని పది మందికి చెప్పించ గలగాలి.మళ్ళీ పదేళ్ళో,ఇరవై ఏళ్ళో పోయిన తరువాత చదివినా అదే అనుభూతి,స్పందన కలగాలి’ అంటారు వాకాటి పాండురంగారావు గారు. అలా చదివించేలా గుర్తు పెట్టుకునేలా  ‘శిశిర శరత్తు‘ కథల్లో సహృదయ జగత్తును సాక్షాత్కరింప జేశారు రచయిత్రి నందిరాజు పద్మలతా జయరాం గారు. ‘కథను ఒడిసిపట్టుకుని ఒద్దికగా గుప్పెట్లోంచి ఒదిలి పెట్టడం, అవకాశాన్ని చూసుకుని పాఠకుడి గుండెల్లోకి సూటిగా విసరడం తెలుగు కథకులకు బాగా తెలుసు’ అంటారు ప్రముఖ సాహిత్య విమర్శకులు,వక్త   ఆచార్య  మేడిపల్లి రవికుమార్ గారు. ఇతివృత్తానికి తగిన వాతావరణం సృష్టించడమనేది రచయితకు కత్తిమీద సాము లాంటిది.కథకుడు కథలో తుపాకీని వర్ణిస్తే కథ ముగిసేలోగా అది పేలాలనీ, పువ్వును చిత్రిస్తే అది ఖచ్చితంగా గుబాళించాలనీ ‘చెకోవ్’ గారు చెప్పారు.
ఈ సంపుటిలో ప్రతి కథా అలాంటి లక్షణాలను పుణికి పుచ్చుకున్నది. ఎంతో సహజంగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని, జరుగుతున్న సంఘటనలను కళ్ళముందు సాక్షాత్కరింప జేశారు రచయిత్రి.
ఈ కథా సంపుటి పేరే పాఠకులను ఎంతగానో ఆకర్షింప జేస్తుంది.  శిశిర వసంతం అనే పదబంధాన్ని తరచుగా కవుల రచనల్లో చదువుతుంటాం.కానీ శిశిరం- శరత్తు ఈ రెంటినీ కలిపి శిశిర శరత్తుగా రాలిపోయిన ఆశలకు  శరదృతువు వెన్నెలను అద్ది రాసిన ‘శిశిర శరత్తు‘కథ చదివిన తర్వాత  ఈ కథకు ఈ శీర్షిక బాగుంది అనుకోకుండా ఉండలేం. అలాగే చదివిన పాఠకుల కళ్ళు చెమర్చకుండా ఉండవు.అంత ఆర్ద్రంగా ఉంటుందీ కథ.
ఇందులోని పదిహేడు కథల్లో  స్త్రీల అస్తిత్వాన్ని చాటే కథలు, వ్యక్తిత్వ నిరూపణ కథలు, మానసిక సంఘర్షణకు లోనవుతూనే తీసుకున్న దృఢమైన నిర్ణయాలు, మన సాంస్కృతి సంప్రదాయం, విలువల గొప్పతనానికి సంబంధించినవి ఉన్నాయి.
 ఇక కథల్లోకి వెళ్దాం.
ఈ కథా సంపుటి శీర్షిక అయిన
 ‘శిశిర శరత్తు‘కథ .ఇందులో  గుజరాత్ లో సంభవించిన భారీ భూకంపం.ఆ సమయంలో జరిగిన భీభత్సం ఆధారంగా రాసిన కథ.మార్చ్ ఫాస్టకు వెళ్ళిన శరత్  భూకంపంలో సజీవ సమాధి కావడం. శిధిలాల్లోనుండి బతికి బయటపడిన అంధురాలైన శిశిర తన అన్న కళ్ళతో ఈ లోకాన్ని చూస్తూనే
 ఓ ఐఏఎస్ అధికారిగా ఎదగడం… వీడ్కోలు సమావేశంలో తమ జీవితానుభవాలు పంచుకునే వేళ ఈ విషయాన్ని తోటి ఆఫీసర్స్ తో షేర్ చేసుకునే సందర్భం.. చదువుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి.ఈ కథ స్వాత సాహస కథల పోటీలో పదివేలు గెలుచుకుంది.
‘పసిడి పంజరం’ కథ చదువుతుంటే తల్లిదండ్రులు  పెట్టే ఒత్తిడికి పిల్లలు మానసికంగా ఎంత కృంగి పోతారో చెప్పే కథ.. పిల్లలు  స్వేచ్ఛా వాతావరణంలో పెరిగితేనే చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. వారి మేథస్సుకు స్వేచ్ఛ ఇవ్వక పోతే పసిమొగ్గలాంటి చిరు ప్రాయం స్తబ్దత తో ముకుళించుకు పోతుంది.  ఆ విషయాన్ని ఆ పాప తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పారు. ఇది ఒక్క పాప సమస్యే కాదు. ఎందరో పసికూనలు నేడు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చడం కోసం వారి బంగారు బాల్యాన్ని కోల్పోతున్నారు.
ఆడపిల్లకు అదృష్టమంటే కట్టుకునే భర్త ధనవంతుడు,ఆస్తిపరుడు అందగాడైతే సరిపోతుందా.. అంతకు మించి ఇంకేం ఉండదా.. అసలు ఆడపిల్లకు ఏం కావాలి..ఏం కోరుకుంటుంది అనే విషయాన్ని  తెలుసుకోవాలంటే ‘అదృష్టానికి ఆవలి వైపు కథ చదివితే తెలుస్తుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా కలిసి బాధ్యతలను మోయకుండా స్వార్థంతో ప్రవర్తించినపుడు ఆ స్త్రీ హృదయం ఎంతగా క్షోభకు గురవుతుందో ‘ఒక కెరటం’ కథ చదివితే తెలుస్తుంది. అలాగే తాను తీసుకున్నది ఎంత దృఢమైన నిర్ణయమో చెబుతూ ఇక్కడ రచయిత్రి గారు ఓ చక్కని మాట అంటారు. ‘స్త్రీ అంతరంగం కూడా సముద్రమే.అలజడికి అతలాకుతలం అయినా, లోతుపాతులు ఆలోచించాక నిత్య సత్యానికి అతి దగ్గరలోనే ఉంటుంది’ ఈ వాక్యాలు చాలు రచయిత్రికి స్త్రీ జీవితంలో ఎన్ని సమస్యల అలజడులు ఉంటాయో.. వాటినెలా పరిష్కరించుకోగలదో…
అత్యాశ, స్వార్థం అణువణువూ నింపుకుని, చిన్నప్పటి నుండే పక్కవారి అవకాశాలను కొల్లగొట్టి తనకు అనుకూలంగా మార్చుకుని… దానిని తన తెలివితేటలుగా చిత్రించుకున్న వ్యక్తికి టిట్ ఫర్ టాట్ గా  ఓ యువతి ఏమి చేసిందో తెలుసుకోవాలంటే  ‘వింధ్య’ కథను చదవాల్సిందే.
వృద్దులు కుటుంబం నుంచి ఏం కోరుకుంటున్నారో,వారికి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో  ‘ఆకురాలే వేళ’ తప్పకుండా చదవాలి. వర్థనమ్మ తీసుకున్న నిర్ణయం మనకు సబబే అనిపిస్తుంది.
మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని గురించి సున్నితంగా చెప్పే కథ లక్కీ. వ్యవస్థలో లోపాలను ద్వేషించాలి కానీ వ్యవస్థను కాదు అనే సందేశం ఇందులో ఉంది.
కార్పోరేట్  పాఠశాలల్లో ఉపాధ్యాయులు పడే వ్యథలను గురించి కళ్ళకు కట్టినట్లు చూపించారు. టీచరమ్మ కథలో.. అక్కడ  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఉంటాయి కానీ దాని వెనకాల వారి దాష్టీకం,దోపిడి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ కథ చెబుతుంది. అలాంటి ఆగడాలను అరికట్టడానికి ఏం చేయాలో కూడా ఈ కథ చెబుతుంది. అనుకున్న ఉద్యోగం రావడం లేదని మధనపడుతూ ముప్పై ఏళ్లు వచ్చినా తండ్రి మీద ఆధారపడే జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో.. ఓ నిరుద్యోగి మనసును చిత్రిక పడుతూ అతడు చివరికి ఎంచుకున్న మార్గం ఏమిటి? అది అతనికి  తృప్తా, అసంతృప్తా  దేనిని ఇచ్చిందో . ‘మబ్బు విడిన చందమామ’ కథను నిరాశా నిస్పృహలకు లోనయ్యే నేటి యువత తప్పకుండా చదవాల్సిన కథ ఇది. 
ఇంకా ఇందులో చిరునవ్వు వెల ఎంత? ,పురో’హితం’ భద్రాద్రి రామయ్య మొదలైన కథలు ఉన్నాయి. ఇవి చదవడం మొదలుపెట్టామంటే ఆగకుండా కళ్ళను పరుగులు తీయిస్తాయి. ప్రతి కథ సమాజాన్ని ప్రతిబింబించేదే. ‘శిశిర శరత్తు‘తో  మనల్ని సహృదయ జగత్తు లోకి పయనించేందుకు దారి చూపిన రచయిత్రి నందిరాజు పద్మలతా జయరాం గారి కలం నుండి మరెన్నో కథలు జాలువారి , సమాజాన్ని మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటూ ఇంత మంచి కథలను అందించిన రచయిత్రి గారికి మరొక సారి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను…
 
పుస్తకం పేరు:శిశిర శరత్తు(కథా కదంబం)
కవయిత్రి: నందిరాజు పద్మలతా జయరాం
ప్రచురించిన సంవత్సరం:2016
వెల:100/రూ
ప్రతులకు
నందిరాజు పద్మలతా జయరాం
ప్లాట్ నెం.692/బి, వైదేహి నగర్
వనస్థలిపురం, హైదరాబాద్-500070
9492921383
రంజని తెలుగు సాహితీ సమితి
ఏ.జీ.ఆఫీసు, హైదరాబాద్
 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.