“నెచ్చెలి”మాట 

ద్వితీయ జన్మదినోత్సవం!  

మీరూ న్యాయనిర్ణేతలే!!

-డా|| కె.గీత 

“నెచ్చెలి” మీ అందరి ఆశీస్సులతో రెండో ఏడాది పూర్తి చేసుకుంది! 

ముందుగా అడగగానే ఒప్పుకుని ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా నెనర్లు! 

లక్షా పాతిక వేల హిట్లు దాటి మీ అందరి మనసు మెచ్చిన “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలో  అగ్రస్థానంలో నిలవడానికి కారణభూతమైన  పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు! 

ద్వితీయ జన్మదినోత్సవ శుభ కానుకగా ఇదిగో ఈ ద్వితీయ వార్షిక సంచిక  మీకు సగర్వంగా సమర్పిస్తున్నాం.  

ఈ ద్వితీయ వార్షిక సంచిక లో నెచ్చెలి ఉత్తమ రచయిత్రు(త)లు, కవులు, కవయిత్రులను ఎన్నిక చేసుకోవడానికి అతి వినూత్నంగా ఒక ప్రయోగం చేస్తున్నాం. అదేవిటంటే అచ్చంగా పాఠకులైన మీరు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నమాట! అందుకు చెయ్యాల్సిందల్లా ఈ సంచికలో వచ్చిన పోటీ రచనలని చదివి విశేషణాత్మక కామెంట్లు పోస్టు చెయ్యడమే.  కామెంటు పోస్టు చేసేటప్పుడు మీ పేరు, ఈ -మెయిలు రాయడం మరిచిపోకండి. అనానిమస్ కామెంట్లు లెక్కింపబడవు. పోటీకి ఎంపికైన  రచనల్ని ఇక్కడ చూడవచ్చు.  ఉత్తమమైన రచనకు పారితోషికంతో బాటూ, “నెచ్చెలి ఉత్తమ రచన అవార్డు”ను ఆగస్టు నెల నెచ్చెలిలో ప్రకటించడం జరుగుతుంది. ఇందుకు దోహదం చెయ్యడానికి మీరంతా ఇతోధికంగా ముందుకు వస్తారు కదూ! 

పాఠకులారా! గొప్ప సదవకాశం!! మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  ఉత్తమమైన కామెంట్లకి బహుమతులు ఉంటాయి.

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” లో కాలమ్స్, నవలలు, ఆడియో-వీడియోలు, ధారావాహికలు మొదలైన ఎన్నో శీర్షికల్లో  కొత్త రచనలు ప్రారంభమయ్యేయి.  

గత ఏడాదిగా ముఖ్యంగా “నెచ్చెలి” పత్రికకు అనుబంధంగా “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందజేస్తున్న రచయిత్రుల ఇంటర్వ్యూలు ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. 

ఈ నెల నుండి ఓ కథ విందాం!, ఓ కవిత విందాం! అనే వినూత్న శీర్షికల్లో రచయిత్రు(త)ల స్వీయ పఠనంతో కథలు, కవితలు అందజేస్తున్నాం. తప్పకుండా వింటారు కదూ! 

ప్రతినెలా 10 వ తారీఖున క్రమం తప్పకుండా  “నెచ్చెలి” మీ “నెట్టిం”ట అడుగుపెట్టే సుదినంగా విడుదల అవుతూ ఉంది! గుర్తు పెట్టుకున్నారుగా!!

పెరిగిన పాఠకులతో బాటూ రచనలూ ఇబ్బడి ముబ్బడిగా చేరుతున్నాయి. ఈ సందర్భంగా రచయిత్రు(త)లందరికీ విన్నపం ఏవిటంటే మీ రచన పంపిన తర్వాత నెల లోపు  రచన ప్రచురణకు స్వీకరించబడినదీ, లేనిదీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది.  ఈ లోగా  మీ రచనలు మరో పత్రికకు పంపుకోదలుచుకుంటే లేదా సోషల్ మీడియాలో ప్రచురించదలుచుకుంటే వెనువెంటనే మీ రచనను పరిశీలించవద్దని తెలియజెయ్యండి. అలాగే హామీపత్రం ప్రతీ రచనతో బాటూ తప్పనిసరిగా జత చెయ్యండి. 

క్వాలిటీ రచనలు అందజెయ్యడం ధ్యేయమైన నెచ్చెలికి చేరిన రచనలన్నీ  ప్రచురణకు స్వీకరించబడవు.  రచనలు పంపే ముందు దయచేసి నెచ్చెలి “రచనలు- సూచనలు పేజీలోని  సూచనలు చూడండి. 

ఇక తెలుగు పాఠకులకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లోనూ అత్యుత్తమ స్థాయికి చేరిన మహిళల స్ఫూర్తిని , సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని  పరిచయం చేసే దిశగా దాదాపు 100 శీర్షికలతో స్త్రీల కథలు, కవిత్వం, నవలలు, జీవితచరిత్రలు, పరిశోధనలు, కళలు, సినిమాలు వంటి అనేక కాలమ్స్, ధారావాహికలతో బాటూ విమర్శ, ట్రావెలాగ్స్, పరిశోధక వ్యాసాలు,  తెలుగు భాష లోంచి ఆంగ్ల భాషలోకి, ఆంగ్లభాష లోంచి తెలుగు భాషలోకి  వస్తున్న అనువాదాలు, పురుషుల రచనలు, ఇతర ప్రత్యేక విశేష రచనలు కూడా కలుపుకుంటూ అన్నిటినీ ఒక  చోటికి  తీసుకొచ్చి అందిస్తున్న మీ “నెచ్చెలి” తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నెలనెలా విడుదల అవుతూ ఉంది. 

“నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి  చేరువవుతూ ఉంది. 

మీ రచనలు ఇంగ్లీషులోకి అనువదింపబడి, పత్రికల్లో అముద్రితమైనవైతే  “నెచ్చెలి- ఇంగ్లీషు”(Neccheli-English) మీకు ఆహ్వానం పలుకుతూ ఉంది. వెంటనే పంపండి. 

“నెచ్చెలి” కి రచనలు పంపడానికి మీరు  స్త్రీలే  కానవసరం లేదు, అందరికీ ఆహ్వానం! 

వినూత్న రచనాపద్ధతి మీ స్వంతమైతే తప్పకుండా editor@neccheli.com ను సంప్రదించండి. 

మీ అభిమాన “నెచ్చెలి” ఇలాగే విజయవంతంగా కొనసాగడానికి మీ సహకారం ఎప్పటిలానే అందిస్తారు కదూ!! 

అన్నట్టు నెచ్చెలి పత్రికకు సబ్ స్క్రైబ్ చేసుకోవడం, నెచ్చెలి యూట్యూబ్ ఛానెల్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవడం, నెచ్చెలి ఫేస్ బుక్ పేజీని  లైకు చెయ్యడం మర్చిపోకండేం!!!

 

*****

Please follow and like us:

22 thoughts on “సంపాదకీయం- జూలై, 2021”

 1. ఒకప్పుడు అన్ని మాస, వారపత్రికలు దీపావళి కి ప్రత్యేకం సంచికలు ప్రచురించేవారు.అప్పుడు రాస్తున్న ప్రసిద్ధ సాహితీ వేత్తలను ప్రత్యేకంగా అడిగి,వారి రచనలతో పాటూ వర్థమాన రచయితల రచనలను కూడా ప్రచురించేవారు.అవి అపురూపంగా దాచుకునేవాళ్ళం.అవి ఎప్పుడు తీసినా దీపావళి కి వేసిన కునేగా పరిమళం రచనలతో పాటు మనసుని ఆహ్లాదపరిచేది.
  ఇప్పుడు మన నెచ్చెలి ప్రతీ సంచికా చిన్నా, పెద్దా అందరినీ అలరించేలా నెలంతా చదవటానికి సరిపడేటన్ని ఎన్నో శీర్షికలతో మన ముందుకు వస్తోంది.
  ఇంక జూలై నెల ద్వితీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక అయితే ఒక విందు భోజనంలా ఇరవై నాలుగు కేటగిరీ లలో వందకి పైగా రచనలతో ముందుకు వచ్చింది.సీనియర్ రచయిత్రుల అనుభవాలు, జ్ణాపకాలు,రచనల విశ్లేషణలు, సమీక్షలు, నవలలు,నేటితరం తో పోటీపడుతూ రాస్తున్న రచనలు దగ్గర్నుంచి కొత్తగా కలం పట్టిన ఔత్సాహికుల వరకూ ఎన్నో ఎన్నెన్నో రచనలు.ఇవికాక ఆడియోలూ, ముఖాముఖి లు సరేసరి.
  ఏది ముందు చదవాలో , తర్వాత ఏది చదవాలో,ఇంకేమిటి వినాలో నిర్ణయించుకుంటూ కొసరి కొసరి చదువుకోవాలనుకుంటే,అంతలో వచ్చే నెలవారీ సంచికల్ని కలుపుకుంటూ చదువుతూ, తెలుగు సాహిత్యం తీరుతెన్నులు అవగాహన చేసుకుంటూ అధ్యయనం చేయటానికి నిర్విరామంగా చాలా రోజుల వరకూ సాహిత్య దాహం తీరిపోయేలా మనసు నిండి పోయేలా ఉంది.
  మొత్తంగా పూర్తి చేసేసరికి తృతీయ వార్షికోత్సవ సంచికకు మనమంతా సిద్ధం కావాలని,సిద్ధం అవుతామని మన నెచ్చెలిని ప్రేమమీరా ఆహ్వానించుదాం.
  ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపుఉద్యోగబాధ్యతల నడుమ ఇంత నిబద్ధతతో ఇంతమంది రచయిత్రులను కలుపు కుంటూ నిర్విరామంగా పత్రిక బాధ్యతను కూడా తలకెత్తుకుంటూ సాహిత్య కృషి చేస్తున్ధ గీతామాధవికి అనేకానేక ధన్యవాదాలు, మనఃపూర్వక అభినందనలు.

  1. మీ ఆత్మీయ స్పందనకు, అభిమానానికి, ఆశీస్సులకు అనేకానేక ధన్యవాదాలు సుభద్రాదేవి గారూ! రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలిగిన స్ఫూర్తి కలుగుతూ ఉందండి మీ మాటలు చదువుతూ ఉంటే.

 2. కొత్త రచయతల రచనలను ప్రోత్సాహిస్తు , రెండు భాషల్లోనూ నెచ్చలి సంపాదకీయం చేస్తూ , తెలుగు సాహితీ జగత్తులో ఇంత పేరు అందుకున్న నెచ్చెలి కి ,శ్రీమతి గీతగారికి శిరస్సు వంచి హృదయ పూర్వక అభిందనలు. ఎపుడూ ఇలాగే నిర్విరామంగా నెచ్చెలి నా లాంటి రచయత్రులను కూడా తీసుకుంటూ ఇంకా ఇంకా ముందుకు పయనిస్తూ ఉండాలని కాంక్షిస్తూ మి

 3. ఒక పత్రిక ను నిర్వహించడం సులభం కాదు. దినచర్య తో పాటు ఎంతో ప్రతిభ ,ఓపిక ఉంటేనే సాధ్యం.అలాంటిది రెండు భాషల్లో చేస్తూ వంద శాతం న్యాయం చేస్తూ ,పైగా రచయితలను వ్యక్తిగతంగా పలుకరించి ప్రోత్సహించే నెచ్చెలి ,శ్రీమతి గీత గారికి ధన్యవాదాలు.రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

 4. నెచ్చెలి పత్రిక నిర్వాహకురాలైన గీతగారికి, నెచ్చెలి అంతర్జాల పత్రిక ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా
  శుభాభినందనలు!
  పేరుపొందిన రచయిత్రి/ రచయితల రచనలతో పాటు, కొత్తవారిని కూడా ప్రోత్సహించడం అభినందనీయం. అక్షరాలా ‘నెచ్చెలి’ అనిపించడం చేతనే ధైర్యంగా .. కొత్త అయినా నా రచన పంపగలిగాను. ప్రచురించి.. ప్రోత్సహించినందుకు మీకు ధన్యవాదాలు.

  కేవలం కథలు, కవితలూ మాత్రమే కాక, ప్రముఖులతో ఇంటర్వ్యూ లు,యాత్రారచనలు,సమీక్షలు ఇలా అన్నిటికీ చోటు కల్పిస్తూ, తెలుగు,ఆంగ్ల భాషలలో క్రమం తప్పకుండా నెలనెలా విడుదల చేస్తున్న మీ కృషి కి మరోసారి అభినందనలు. విజయోస్తు!

  1. మీ ఆత్మీయ ప్రతిస్పందనకు ధన్యవాదాలు సునీత గారూ! నెచ్చెలిలో విభిన్నంగా రాసే మీ వంటి కొత్తవారికి తప్పకుండా స్థానం లబిస్తుంది. Keep writing to Neccheli.

 5. నెచ్చెలి కి ద్వి తీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
  పత్రిక నడపటం సామాన్యమైన విషయం కాదు. సాహితీ కృషిలో నిర్విరామంగా ఉన్న గీతగారికి అభినందనలు. విభిన్న శీర్షికలతో అలరిస్తున్న నెచ్చెలి భవిష్యత్తులో మరింత మందికి చేరువవ్వాలని ఆకాంక్ష

  1. శాంతి ప్రబోధ గారూ! మీకు నెచ్చెలి నచ్చడం చాలా సంతోషకరమైన విషయం. మీ ప్రతిస్పందనకు నెనర్లు!

 6. నెచ్చెలితో పరిచయం మొదలైనప్పటినుంచి ప్రతినెలా పత్రిక మరింతమందికి దగ్గరవటం చూస్తూనే ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎందరినో తనవాళ్లను చేసుకుంటూ పేరును సార్ధకం చేసుకుంటోంది. ప్రసిధ్ధిచెందిన రచయిత్రులను, వారి రచనలను పరిచయం చేస్తూ కొత్త తరానికి మార్గనిర్దేశాన్ని చేస్తోంది. కొత్తగా సాహితీలోకంలోకి అడుగుపెడుతున్న ఎందరెందరో రచయిత్రులను ప్రోత్సహిస్తోంది.
  డా. గీతగారి పట్టుదల, శ్రమ, నిజాయితీలు పత్రికలో ప్రతిఫలిస్తున్నాయి. అభినందనలు!

  1. మీ ప్రతిస్పందనకు నెనర్లు అనురాధ గారూ!క్రమం తప్పకుండా నెచ్చెలికి రాస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

 7. మీ సాహితీ సేద్యం ఎన్నెన్నో కొత్త సాహితీ ఫలాలను పండిస్తోంది. మీ కృషి పట్టుదల కు అభినందనలు

  1. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు శ్యామల గారూ!

 8. విభిన్న శీర్షికలతో…నాణ్యమైన సాహిత్యాన్ని అందరికీ చేరవేస్తూ అవిరామంగా మీరు చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం గీతా మేడం గారు.అపురూపమైన నెచ్చెలుల మనోభావాలను వినువీధిలో నక్షత్రమాలలు కడుతూ అద్భుత కాంతి ఉత్సవానికి తెరతీసిన ఈ మన ద్వితీయ వార్షికోత్సవం మరెన్నో వార్షికోత్సవ పాల పుంతల్ని తోడు తీసుకురావాలి.నెచ్చెలి తో నా అనుబంధం ఏర్పడడం గర్వ కారణంగా చెప్పుకుంటాను.నెచ్చెలిలో కవితల్ని చూసుకోవడం పుట్టింట్లో అమ్మకు ఉత్తరం రాయడం అంత ఆత్మీయంగా ఉంటుంది.ఎంతో విలువైన రచనల పక్కన నా రచనను చూసుకోవడం గొప్ప అనుభూతి.మా అందరికీ ఇంతటి చక్కని అవకాశాన్ని ఓర్పుతో నేర్పుతో…ఉత్సహపు జలపాతంలా నడుపుతున్న గీతా మేడం గారు మీరు ఎంతో అభినందనీయులు.మీకు శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

  డి.నాగజ్యోతిశేఖర్, మురమళ్ల
  10-7-21

  1. మీ ఆత్మీయ ప్రతిస్పందనకు ధన్యవాదాలు నాగజ్యోతి గారూ!

  1. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు మాలతి గారూ!

 9. నెచ్చెలి ఓ అందమైన రంగవల్లి. విభిన్న భావోద్వేగాల మేలి మలుపుల్లో వయ్యారంగా మెలి తిరుగుతూ, ఒక చోట వేదనై, మరొక చోట రాగమై, ఇంకొక చోట ముప్పిరి గొన్న నయాగరా నయగారమై, సరిహద్దులు చెరిపేసుకున్న ఇరు దేశపు సంస్కృతీ సంప్రదాయాల మేళవింపై, గీతమై, గీతాలై, గీతలై పుప్పొడి వర్ణాలని మేనంతా హత్తుకుని, అద్దుకొని అనంతాకాశపు నక్షత్రాల్ని దూసిపోసి ప్రతి వయ్యారపు గీత మలుపులో తురిమి అల్లిన నెచ్చెలి, ఒక రత్న ఖచిత అక్షర సుమ మణుల్ని పొదుగు కొని, కాంతుల్ని వెద జల్లే రంగవల్లి.
  తెలుగు హృదయాలతో గాఢంగా పెనువేసుకుని, వేకువనే తెలుగు వాకిట పరచుకున్న అందమైన ముగ్గు!
  ప్రతి గీతనీ శోభాయమానంగా అలంకరించి అందించే గీత గారికి ద్వితీయ వార్షికోత్సవ శుభాభివందనాలు.

  1. మీ కవితాత్మక ప్రతిస్పందనకు అనేక నెనర్లు విజయకుమార్ గారూ! నెలనెలా అనువాదాలతో నెచ్చెలికి మీరు చేస్తున్న విశిష్టమైన సేవకు మీకు మనఃపూర్వక అభివాదాలు.

 10. అద్వితీయమైన సాహితీ అభిలాష. నెచ్చెలి నిర్వహణ నిజంగా ఒక గొప్ప శ్రమ. మీ నిర్విరామ కృషి కారణంగానే క్రమం తప్పకుండా , క్వాలిటీ రచనలతో పత్రిక సరైన సమయానికి తెస్తున్నారు. ప్రతి శీర్షిక ఒక విజ్ఞాన సాహితీ భాండారమే. తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా, విదేశాల్లోని తెలుగు రీడర్స్ అందరికి, నిజంగా ఒక విందు.. ఈ రకమైన ప్రోత్సాహం గొప్ప సాహితీ సేవ.మీకు ఈ ద్వితీయ వార్షికోత్సవ సందర్బంగా ప్రత్యేక శుభాభినందనలు..

  1. నెచ్చెలి పట్ల మీ ఆత్మీయ స్పందనకు అనేక నెనర్లు సురేష్ గారూ! “ప్రమద” శీర్షిక ద్వారా మీరు పరిచయం చేస్తున్న అసమానస్త్రీలందరి తరఫునా నా హృదయపూర్వక ధన్యవాదాలు!

Leave a Reply

Your email address will not be published.