యదార్థ గాథలు

శాంతంతో  శాంత విజయం

-దామరాజు నాగలక్ష్మి

శాంత  చిన్నప్పుడంతా చాలా చురుగ్గా ఎప్పుడూ నవ్వుతూ వుండేది. పిల్లలందరికీ శాంతతో ఆడాలంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎంతో చురుగ్గా ఉన్న శాంత స్కూల్లో కూడా ప్రతి విషయంలోనూ ముందే వుండేది. అందరికీ చాలా ఆనందంగా వుండేది.  పాటల పోటీల్లో జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుంది.  పాటలంటే ప్రాణం.  ఎవరు పాడమన్నా మొహమాటం లేకుండా పాడేది. 

శాంతకి డిగ్రీ పూర్తయ్యింది. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. అక్కడ కూడా అందరి మన్ననలు పొందింది. ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు.  అమ్మాయిని నచ్చని వాళ్ళు ఎవరూ లేరు. కానీ శాంతకి, వాళ్ళ అమ్మా నాన్నలకి నచ్చి సంబంధం ఒకటి వుంది. దానినే చివరకి ఫైనల్ చేసుకున్నారు.  అబ్బాయి పేరు కిశోర్. చాలా నెమ్మదస్తుడులా ఉన్నాడు. అబ్బాయి అమ్మానాన్న చాలా మంచివాళ్ళు.  శాంత అందాన్ని, తెలివితేటలని చూసి చాలా సంతోషపడ్డారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టుకున్నారు. పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. కిశోర్ శాంతతో ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా మాట్లాడేవాడు. 

శాంత అత్తగారింటికి వెళ్ళిపోయింది. అక్కడికి దగ్గరలో ఉన్న బ్రాంచికి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది.  బ్యాంకిలో అప్పుడప్పుడు జరిగే ప్రోగ్రాములలో పాటలు పాడడం, కాంపిటీషన్లలో పార్టిసిపేట్ చెయ్యడం చేస్తూ వుండేది. ఇంట్లో కూడా తనకు నచ్చిన పాటలు పాడుకుంటూ వుండేది. కిశోర్  ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు.  ఒకసారి ఆలిండియా బ్యాంక్స్ అసోసియేషన్ వాళ్ళ కార్యక్రమాలు జరిగాయి. శాంత, కిశోర్ కలిసి వెళ్ళారు.  ఆ కార్యక్రమాలలో విరామంలో శాంత పాటల ప్రోగ్రాం పెట్టారు. ఈ సంగతి కిశోర్ కి తెలియదు. శాంతని పాడడానికి పిలిచారు. కిశోర్ వంక చూసింది. ఏమీ మాట్లాడలేదు.  పదే పదే పిలుస్తుంటే గబగబా వెళ్ళి చక్కటి లలిత గేయాలు ఒక రెండు పాడింది.  తెలిసిన వాళ్లు, తెలియని వాళ్ళూ అందరూ కరచాలనం చేశారు. అభినందించారు. 

తన చోటులోకి వచ్చి కూచుంది. కిశోర్ బావుంది, బావుండలేదు అని చెప్పలేదు.  కార్యక్రమాలు అయిపోయాక ఇంటికి వెళ్ళారు. కిశోర్ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. మర్నాడు పొద్దున్న నాకు పాటలంటే ఇష్టం వుండదు. నేను వినలేదు అన్నాడు.  శాంత ఆశ్చర్యపోయింది. అప్పుడు కిశోర్ తో ఏమీ వాదించలేదు. ఇద్దరూ ఆఫీస్ కి వెళ్ళిపోయారు.  కానీ శాంత కొంచెం బాధపడింది. ఎవరైనా పాడద్దు అంటే కళ్ళనించి నీళ్ళు వస్తాయి. కానీ దీనికి కారణం తెలుసుకోకుండా తను బాధపడి ప్రయోజనం లేదనుకుంది. 

శనివారం సాయంత్రం మంచి కాఫీ ఇచ్చింది. తీరుబడిగా కూచుని అసలు పాటలు ఎందుకు ఇష్టం వుండవు అని కిశోర్ అడిగింది. చెప్పిన సమాధానం విని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతకీ కిశోర్ చెప్పిన కారణం ఏమిటంటే చిన్నప్పుడు వాళ్ళింటి పక్కన ఒక కుటుంబం వుండేదిట. ఆయన పాటలు చాలా గట్టిగా బాగా పాడేవాడుట. దాంతోపాటు డబ్బా ఒకటి పెట్టుకుని గట్టిగా దరువేసేవాడు. ఆ చప్పుళ్ళకి, గట్టిగా పాడే ఆయన పాటలకి వాళ్ళావిడకి బి.పి. పెరిగి, హార్ట్ ఎటాక్ వచ్చి, మూడునెలలలో చనిపోయింది. వాళ్ళ అబ్బాయి అప్పుడు చిన్నవాడు. వాడికి చెవులు రెండూ వినిపించకుండా పోయాయి. వాళ్ళమ్మ చనిపోయాక ఆ అబ్బాయి పాపం చాలా అన్యాయమైపోయాడు.  వాళ్ళనాన్న పిచ్చివాడు అయిపోయి రోడ్లమీద తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఎవరైనా పాట పాడితే నాకు చాలా గాభరా వచ్చేస్తుంది. ఎక్కడైనా పాటలు వినిపిస్తే దూది చెవులో పెట్టుకుంటాను అన్నాడు.  

అప్పటి నుంచి శాంత కిశోర్ తో నెమ్మది సంగీతం అంటే ఏమిటో, పాటలు ఆరోగ్యానికి ఎంత మంచి చేస్తాయో చెపుతూ వుండేది. సన్నటి సంగీతం వినిపిస్తూ వుండేది.  కిశోర్ నెమ్మదిగా పాటల మీద ఇష్టం పెంచుకున్నాడు. శాంతని కూడా పాడమని వింటూండేవాడు. శాంతని తనే దగ్గరుండి ప్రోగ్రాములకి పంపిస్తుండేవాడు.  వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు కూడా చదువుతోపాటు చక్కటి సంగీతం నేర్చుకున్నారు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.