నిష్కల – 9

– శాంతి ప్రబోధ

తనకు తెలిసిన వాళ్లలో అంకిత్ కూడా ఒకడు అంతే .. 

అంతకు మించి ఏమీ లేదు అని అతనిని ఆలోచనల నుండి దూరంగా నెట్టే ప్రయత్నం చేసింది.  కానీ అది సాధ్యం కావడం లేదు . 

ఇద్దరూ కలిసి నడచిన క్షణాలు కందిరీగల్లా మదిలో చొరబడి గోల చేస్తున్నాయి.                 

ఇప్పుడు అతని ప్రవర్తనను తరచి చూస్తే అర్ధమవుతున్నది.  అతనేంటో.. అతని వ్యూహం ఏమిటో.. 

మన బంధం ఇరుగు పొరుగు లాంటిది కాదు. మన ఇద్దరికీ ఇచ్చిపుచ్చుకునే లెక్కలు ఏంటి అనేవాడు. 

కానీ తన చేతిలో పైసా ఖర్చు కానివ్వడు.  తన సంపాదన ఏం చేస్తాడో తెలియదు. 

అంతా తనతోనే ఖర్చు పెట్టిస్తాడు. 

మెకానికల్ ఇంజనీరింగ్  ప్రొఫెషనల్ గా అతని జీతం అంత గొప్పగా ఏమీ లేదు.  నిష్కల కూడా అటార్నీ గా మొదటి దశలోనే ఉంది. 

ఐటీ ఉద్యోగులతో పోల్చుకుంటే ఇద్దరి జీతాలు తక్కువే.  అయితే, నిష్కల చురుకుదనం, పనిలో ఆమె వేగం ఆమెకు మంచి పేరుతో పాటు మిగతా వాళ్ళ కంటే ఎక్కువ ఆఫర్ చేసింది కంపెనీ. 

అలా అతనికంటే ఆమెకు ఎక్కువ జీతం అందుకుంటున్నది.  

మొదట్లో అది అతనికి సంతోషం కలిగించినప్పటికీ ఇప్పుడది లోపలి పొరల్లో ఎక్కడో గుచ్చుకుంటున్నది. లోలోన బాధనే మిగులుస్తున్నది.

సంపాదన పెరిగినా ఆమె చేతిలో ఉన్న సొమ్ములు ఏదో ఓ రకంగా రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాయి. 

అలా రోజులు కరిగిపోతున్నాయి.  నెలాఖరుకు వచ్చేసరికి ఖాతాలో పైసా ఉండటం లేదు. క్రెడిట్ కార్డు గీకడం మళ్ళీ అది కట్టుకోవడం సరిపోతున్నది. 

తన జీతం ఏమి చేస్తాడో తెలియదు. ఏనాడూ చెప్పలేదు. 

ఊరుకోలేక ఒకరోజు నిష్కల అడిగింది.  

గుడ్లు పెడతాయని భూమిలో పాతరేస్తున్నాను అంటూ పకపకా నవ్వాడు.  కానీ అసలు విషయం చెప్పలేదు.  

అతని ధోరణి ఆమెకు అర్థం కావడం లేదు.  సహచర్యంలో ఇద్దరం అన్ని పనులు సమంగా పంచుకున్నట్లు ఖర్చులు కూడా పంచుకోవాలి కదా అంకిత్ అన్నది ఓ రోజు. 

అఫ్ కోర్స్ .. అంటూ నిష్కలలో ఏదో వెతుకుతున్నట్లు చూస్తున్నాడు. 

నిజానికి డబ్బుతో మనిషిని చూడటం, కొలవడం నిష్కలకు చేతకాని పని. ఇష్టం లేని పని. 

చేతిలో డబ్బులున్నాయంటే నీ నా అని చూడకుండా అవసరానికి ఖర్చు చేయడం ఆమె నైజం.  ఎవరికైతేనేం అవసరానికి ఉపయోగపడుతున్నాయి కదా అనుకునేది. 

ఆమె సంపాదన కోసం వేరే ఎవరూ ఎదురు చూసే వాళ్ళు లేకపోవడం, బాధ్యతలు లేకపోవడం వల్లనో,  తల్లి కూడా ఆ విధంగా ప్రవర్తించక పోవడం వల్లనో ,  లేక వెనుక ఆస్తిపాస్తులు ఉండటం వల్లనో లేక అన్ని కలవడం వల్లనో కానీ నిష్కల డబ్బుల విషయంలో ఎప్పుడు గట్టిగా, కచ్చితంగా ఎవరి వద్దా లేదు.  

అటువంటిది అంకిత్ తో ఇద్దరం పంచుకోవాలని అంటున్నప్పుడు ఆమెకు ఆమెనే అపరిచిత వ్యక్తిలా కొత్తగా అనిపించింది . 

నిష్కల కళ్ళలోకి చిద్విలాసంగా చూస్తూ 

మనం ఒకరికొకరం అధీనం అయిపోయాం. ఇక ఒకరు ఎక్కువ ఇవ్వడం ఒకరు తక్కువ ఇవ్వడం ఏంటి ? మనిద్దరం ఒకటే గా అన్నాడు.

అవును కదా ..శాస్త్రోక్తంగా, లీగల్ గా పెళ్లి చేసుకోలేదు కానీ అలాగే బతుకుతున్నాం కదా అని సరిపుచ్చుకుంది నిష్కల. 

ఎవరు ఖర్చు చేస్తే ఏమిలే.. అనుకుంది కానీ అతని వ్యూహం ఆమెకు అర్థం కాలేదు.

ఆ రోజుకి ఆ సంభాషణ అక్కడ ఆగిపోయింది. 

అంకిత్ డబ్బు విషయంలో ఎందుకో రిజిడ్ గా ఉంటున్నాడు. మిగతా ఏ విషయంలోనూ అతనితో ఇబ్బంది లేదు కదా.. 

ప్రేమ సమయంలో అతనో అద్భుతమైన వ్యక్తిగా అనిపిస్తాడు కదా.. అన్నింటినీ పట్టించుకోకూడదని తనకు తాను చెప్పుకుంది . 

అటువంటి అంకిత్ లో ఈ మధ్య చాలా మార్పు. నిజంగా అతనిలో మార్పు వచ్చిందా తనకే అలా అనిపిస్తున్నదా తనలో తాను చాలా సార్లు  ప్రశ్నించుకుంటూ ఉన్నది.  తరచి తరచి ఆలోచించుకుంటున్నది.  

కాలేజీ క్యాంపస్ లో చూసి, ఇండియన్ అసోసియేషన్ మీటింగ్ లలో దగ్గరై ప్రేమించిన అంకిత్  ఇతను ఒకరేనా అనే సందేహం కలుగుతున్నది.

ఆ అంకిత్ కి నాలోని చొరవ, దూసుకుపోయే తత్వం అంటే అమితమైన ఆకర్షణ.  ఆడ, మగ తేడా లేకుండా  స్నేహాన్ని స్నేహంగా మాత్రమే చూసే నేనంటే అతనికి అభిమానం. 

ఎవరితో ఎంత స్నేహంగా ఉన్న ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతానని నమ్మకం .

అటువంటి అంకిత్ కి ఇప్పుడు ఏమైంది?  

వేడెక్కిన నేలపై తొలకరి జల్లులు పడితే వచ్చే మట్టి వాసనలా  ఘుమ ఘుమలాడే అతని సాన్నిధ్యం ఎందుకిలా మురికి వాసన వస్తోంది? 

ఎంతగా ఇష్టపడింది అతన్ని.  

చుట్టూ వున్న సంస్కృతి , సంప్రదాయం, ఆచార వ్యవహారాల గోడలు బద్దలు కొట్టుకుంటూ వెళ్లి అతనిని చేరింది.  

ఎంతో ఇష్టంగా అతన్ని తన జీవితంలోకి తీసుకుంది. ఆ ప్రేమని ఆహ్వానించింది. ఆస్వాదించింది. 

అప్పుడతను కూడా అదే విధంగా చేశాడు.  

కానీ… ఇప్పుడు, అదే మనిషి, అదే రూపం.  

కానీ స్వభావం మారిపోయింది. కాదు కాదు .. ఇన్నాళ్లు కప్పుకున్న ముసుగులు తొలిగిపోయాయి.  

పులి మేక తోలు కప్పుకుని ఎన్నాళ్ళు తిరగగలదు..?

ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తప్పదు అసలు రూపం బయట పడక తప్పదు. ఇప్పుడు అదే జరిగింది. 

అంకిత్ కప్పుకున్న ముసుగు అతను అనుకున్న దానికన్నా ముందే తొలిగిపోయింది.  

తనే అతనిపై కప్పుకున్న పొరల్ని గుర్తించలేకపోయింది.  లోపం అతనిది కాదు తనదే అనిపించింది. మనసు భారంగా అయింది. వస్తున్న ఆలోచనల తెమ్మెరలు దూరంగా తరిమేయాలని లేచింది.  

మంచినీళ్లు తాగి మొగ్గతొడిగిన నారింజ, నీలం ఆర్చిడ్స్ ని పలకరించింది. తలలూపుతూ పలకరిస్తున్న వాటికేసి అపురూపంగా చూసింది. 

నెమ్మదిగా వాటిని చెంప దగ్గరకు చేర్చుకుని ఐ లవ్ యూ .. చెప్పి వాటి అందాన్ని చూస్తూ కాసేపు కూర్చుంది.  

వీటికోసం నేనేం చేశానని,  కూసినన్ని నీళ్లు పోస్తున్నందుకేనా… 

ఉహు.. కాదు, ఎటువంటి స్వార్ధం లేకుండా మీరు పంచే ప్రేమకు వెలకట్టలేను.  మనుషుల్లా మీరు లాభనష్టాలు బేరీజువేసుకుని స్నేహం చేయరు. బంధం, అనుబంధం పెంచుకున్నట్లు నటించరు.  మీ నుండి తెలివిగలవాళ్ళం అనుకునే మేం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 

స్వచ్ఛమైన మీ స్నేహం నాకెప్పటికీ అపురూపమే అంటూ ఆర్చిడ్స్ తో ముచ్చటించింది.  

తలెత్తి పైకి చూస్తే కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న పెర్కొలేషన్ ట్యాంక్ లో ఈదులాడుతున్న బాతులు, చిట్టడవిలా పెరిగిన మొక్కల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న రకరకాల పక్షులు, ఖాళీగా బోసిపోయిన వాకింగ్ ట్రాక్ చూస్తూ కొన్ని నిమిషాలు గడిపింది.  

సృష్టిలో ఏ  జీవికీ లేని స్వార్ధం ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది ఎందుకో…   జీవులకంటే తాను గొప్ప ఎలా అవుతాడు?  

ఒళ్ళు నొప్పులు తగ్గకపోవడంతో నీరసంగా వచ్చి మళ్ళీ మంచం పై వాలింది నిష్కల.  

అంకిత్ ఆలోచనల శకలాలు రాలిపడడం మొదలు పెట్టాయి.  

అతను ప్రొపోజ్ చేసినప్పుడే చెప్పింది. 

నేను మొదట మనిషిని.  ఆ తర్వాతే స్త్రీనని. 

స్త్రీత్వం నాలో చిన్న భాగం. దాని చుట్టూనే నా జీవితం గింగిర్లు కొట్టడం నాకిష్టం లేదు.  నన్ను నేను ఓ వ్యక్తిగా మాత్రమే గుర్తుంచుకుంటానని. 

ఈ వివాహ వ్యవస్థ పై తనకు నమ్మకం లేదని స్పష్టంగా చెప్పింది. 

అప్పుడతను అందుకే నిషీ .. నీ వ్యక్తిత్వం అంటే నాకంత ఇష్టం అంటూ మునగ చెట్టు ఎక్కించాడు.  సహజీవనానికి ఒప్పించాడు. 

ఏడడుగులు, మూడుముళ్ల బంధం లేకపోయినా మనది బ్రహ్మ ముడి అని నిరూపిద్దాం. 

కుటుంబ సంపద, కీర్తి ప్రతిష్టలు మనకి ప్రామాణికం కాదు. 

అలాగే కుటుంబ నేపథ్యం , ఆస్తి అంతస్తులు , ఆచారాలు సంప్రదాయాలు, జాతకాలు, పెళ్లి క్రతువులు , తాళిబొట్టు  ప్రామాణికం కాదు . 

మనకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, నమ్మకం, అన్యోన్యత  మనం కలిసి జీవించడానికి, సహజీవనం ఏర్పరచుకోవడానికి ప్రామాణికం అన్నాడు. 

అతని మాటలకు మురిసి పోయింది. 

పూర్వకాలంలో చారిత్రకంగా చూస్తే ఆడ మగ ఇష్టమైనంత కాలం జత కూడే మానవ సంబంధాలుండేవనీ, ఆ ఇద్దరిలో ఎవరైనా ఎలాంటి లైంగిక సంబంధాల కొనసాగింపు ఇష్టం లేకపోతే విడిపోయి స్వేచ్ఛగా జీవించే విధానం ఉండేదనీ, అలా వెళ్ళిపోయినప్పుడు తల్లితో పాటు పిల్లలు  వెళ్లిపోవడాన్ని నియంత్రించే క్రమంలో స్త్రీల లైంగికత అదుపు చేసేలా పెళ్లి , కుటుంబం ఉనికిలోకి వచ్చాయనీ, మనం వాటిని అధిగమిద్దామనీ చాలా కబుర్లు చెప్పాడు.  

తనకి కూడా అతని అభ్యుదయ భావాలు చాలా నచ్చాయి. 

యువకులంతా అంకిత్ లా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది, పెళ్లి మార్కెట్ లో  వస్తువులా మారదని, ఆడపిల్లల జీవితం ఆనందమయం అవుతుందనీ అనుకుంది. 

తమ ఎరుకలో ఉన్న  కుటుంబాల్లో ఎవరికీ సహజీవనం అనే కాన్సెప్ట్ తెలియదు.  తాను వాళ్లందరికీ భిన్నంగా ఆలోచిస్తుంది. భిన్నమైన ఆచరణ లో ఉంటుంది. 

పెళ్లి అనే తంతు ఇష్టం లేదు కాబట్టి భార్యాభర్తలుగా కలసి ఉంటూ స్నేహితులుగా ఉండొచ్చు.   ముందు కొన్నాళ్ళు కలిసి ఉందాం. అప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడు చూడొచ్చు అనుకుంది. 

చాలా థ్రిల్లింగ్ గా సహజీవనం లోకి అడుగు పెట్టింది నిష్కల.    

మొదట్లో ఇద్దరికీ స్వేచ్ఛ ఉన్నది. అంతా బాగానే ఉంది.  ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది.  బంధుత్వాలు, కట్టుబాట్లు అడ్డు రాలేదు.  ఇద్దరూ ఎలా ఉండాలనుకుంటే అట్లా ఉన్నారు .  ఇద్దరికీ ఒకరిపై ఒకరికి బాధ్యత ఉంది. పెత్తనం లేదు. 

తల్లితో కూడా ఆ విషయం గొప్పగా చెప్పింది.   అంకిత్ ని అంత ఎత్తులో నిలబెట్టింది. 

ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయాలు అమ్మకి తెలిస్తే ఎలా తీసుకుంటుందో.. 

ధ్వంసం అవుతున్న మానవ సంబంధాలకు  నువ్వు నేను ఇద్దరం బాధితులమే అమ్మా .. అని చెప్పాలనిపించింది.  అమ్మ ఒడిలో తల పెట్టుకుని అమ్మ తల నిమురుతుంటే సేద తీరాలని బలంగా అనిపిస్తున్నది. 

 నేను అమ్మ దగ్గరికి వెళ్ళలేను. అమ్మ నా దగ్గరకు రాలేదు. ఇద్దరం కానీ కాలానికి బందీలం.  ఎక్కడివారు అక్కడే .. 

ఆమ్మకి మా సహజీవనంలో వచ్చిన గ్యాప్ గురించి తెలిస్తే ఎంత బాధ పడుతుందో తెలుసు.  అందుకే ఆ విషయం అమ్మతో స్పష్టంగా చెప్పలేక పోయింది. 

అమ్మ కోసం, తన మనసుకు విరుద్ధంగా నడుచుకో గలదా… లేదు. 

అలా నడుచుకోలేదు.  అమ్మకి నిదానంగా పరిస్థితి వివరించి ఒప్పించుకోగలదు. 

అయినా అమ్మ అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, ఆమె నన్ను ఏ విషయంలోనూ నొప్పించలేదు. వత్తిడి చేయలేదు. 

మా అమ్మ బంగారం అనుకుంది నిష్కల

ఓహో .. నీకు అనుకూలంగా ఉంటే అమ్మ బంగారం. లేదంటే … 

అతనికి అనుగుణంగా ఉండి నువ్వు అమ్మ బంగారంగా ఉండొచ్చుగా.. అంతరాత్మ నిలదీసింది. 

నేనెప్పుడూ అమ్మ బంగారాన్నే. 

ఇరవై నాలుగు గంటలూ నా స్త్రీత్వాన్ని మాత్రమే గుర్తుచేస్తూ నాలోని వ్యక్తిని, నా వ్యక్తిత్వాన్ని నల్లిని నిలిపినట్టు నలిపేయడానికి ప్రయత్నించే అతనితో నేనెలా సంతోషంగా ఉండగలను. 

నేను సంతోషంగా ఉండడం అమ్మకు కావాలి.  వేలమైళ్ల దూరంలో ఉన్న అమ్మని వాస్తవం చెప్పకుండా మోసం చేస్తున్నదా … భ్రమల్లో ఉంచుతున్నదా..  ఏమో..

విషయం తెలిస్తే, ఘనీభవించిన ఆమె దుఃఖం ఏరులై పారుతుందేమోనన్న భయంతోనే అమ్మకి ఇంకా విషయం చెప్పలేదు. 

అంకిత్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం గుండెల్లో దిగిన శూలంలా బాధించింది.  అతనికి నాతో ఉండడం నచ్చకపోతే ఇంత దురుసుగా ప్రవర్తించాలా..? స్నేహపూర్వకంగా ఎవరి దారిలో వాళ్ళు నడవొచ్చుకదా ..?

అంకిత్ గతంలో చేసిన బాసలన్నీ మర్చిపోయాడు.  హద్దులు మీరుతున్నాడు. ఫక్తు ఉత్తర భారతీయిడి లాగా ప్రవర్తిస్తున్నాడు. 

నా స్నేహాలు అతనికి నచ్చడం లేదు. నేను ఎవరితో మాట్లాడినా అతనికి ఇబ్బందిగానే ఉంటున్నది. చివరికి నా క్లయింట్స్ ఫోన్ చేసినా అతనికి అసహనంగానే ఉన్నది . 

దిస్ ఇస్ ఆన్ ఫెయిర్ అని చాలా సార్లు అతనితో చెప్పింది కూడా. 

నీ కలలు, కోరికలు అన్నీ ఊహ ప్రపంచంలోనే కానీ వాస్తవ ప్రపంచంలో ఉండవని వాదిస్తున్నాడు. 

కాదు నా జీవితాన్ని నాకు కావలసిన విధంగా పండించుకోవాలని నా ఆరాటం. ఒకప్పుడు ఆశలు, ఆశయాలు నచ్చాయని నా వెంట నడిచాడు. అప్పుడు నా ఆలోచనలు, భావాలు చాలా ఉన్నతంగా ఉన్నాయంటూ ఎంతో గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం తట్టుకోలేకపోతున్నది. అతనిలోని ద్వంద్వ ప్రవృత్తిని ఒప్పుకోలేకపోతున్నది.  అంగీకరించలేక పోతున్నది  నిష్కల. 

మనిషి సామాజిక జీవనానికి మూల కేంద్రం కుటుంబం.  సమాజంలో వస్తున్న ధోరణులు కుటుంబంలోనూ ప్రతిబింబిస్తాయి. అదే విధంగా వ్యక్తుల ధోరణుల్లో వచ్చే మార్పులు కుటుంబంలోనూ, సమాజంలోనూ కన్పిస్తాయి .  

మనం, మన సమాజం చాలా  అభివృద్ధి చెందిందని ఇల్లెక్కి గొంతు చించుకుంటున్నాం. సాంకేతికంగా, విజ్ఞానపరంగా ఎంతో అభివృద్ధి చెందిందని జబ్బలు చరుచుకుంటున్నాం. 

 కానీ ..  ఆ అభివృద్ధి మానవ సంబంధాలను ఎటు తీసుకుపోతున్నట్లు? అని ప్రశ్నించుకుంటే  మారిపోతున్న మానవ విలువలు, పెరిగిపోతున్న ఆర్ధిక విలువలు సమాజ నడకనే మార్చేస్తున్నాయి.  

చివరికి రక్తసంబంధాలు కూడా ఆర్ధిక విలువలముందు తలొంచుతున్నాయి. పెరిగి పోతున్న స్వార్ధం, ధన సంస్కృతి, వస్తు సంస్కృతి, ఎదుటి వారిపట్ల నిర్లక్ష్యం, అవకాశవాదం, మనిషిని సంస్కార హీనంగా మార్చేస్తున్నాయి. 

ప్రపంచీకరణ, ప్రవేటీకరణ,  ఆర్థిక విధానాలు, అవకాశవాదం, ధన – వస్తు సంస్కృతి, ఆధిపత్య ధోరణులు సమాజంపై, ప్రజాజీవనం పై, మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.  

కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు వ్యాపార సంబంధాలుగానూ, ఆర్థిక సంబంధాలు గాను మారిపోయాయని నిష్కల మనసు బాధగా మూలిగింది.

చదువులు  సమాజాన్ని తెలపడం లేదు. మానవ సంబంధాల్ని పెంపొందించడం లేదు.  

డబ్బు, పదవి, పరపతి, అమ్మాయిల వ్యామోహం చుట్టూ పరిగెత్తేలా చేస్తున్నాయి.  సామాజిక వాతావరణాన్ని  విధ్వంసం చేస్తూ, ప్రజల జీవన విధానాలను కొల్లగొట్టడుతున్నాయని అనుకుందామె.

సమాజ గమనాన్ని, జరుగుతున్న మానవసంబంధాల విధ్వంసాన్ని,  పెరుగుతున్న వినిమయ సంస్కృతిని,  చోటు చేసుకుంటున్న మార్పులను లోతుగా పరిశీలిస్తూనే ఉన్న నిష్కల ఆలోచిస్తున్నది.  

వివేకం, సహనం, విలువలు, నియమాలతో కూడిన ప్రవర్తన మనో నిగ్రహం, నిస్వార్ధం, త్యాగం చేయడం వంటివన్నీ ఈ రోజుల్లో చేతకాని వారి లక్షణాలుగా, నిరుపయోగమైనవిగా భావిస్తున్నారు.  

మానవ నైతికత, విలువలు, మనుగడ ప్రశ్నార్థకంగా, ప్రమాదభరితంగా మారుతున్న ఈ తరుణంలో భావోద్వేగంతో కూడిన పైపై చూపుతో కాకుండా  తనలో తాను లోతుగా విశ్లేషించుకుంటున్నది, చర్చించుకుంటున్నది నిష్కల.   

మన సమాజంలో పెరిగిపోతున్న  అగాధాల్ని, అపార్ధాల్ని తొలగించాల్సిన అవసరం,  సమస్యలకు మూలాల్ని వెతికి లోతుగా విశ్లేషించు కోవాల్సిన ఆవశ్యకత  గుర్తించింది ఆమె. 

మానవ సంబంధాలు పెంచుకోవడానికి కావలసిన లక్షణాలతో పాటు విధ్వంసం అవుతున్న మానవ సంబంధాల వల్ల ఏర్పడుతున్న వ్యక్తిత్వ లోపాల రహస్యాల గుట్టు విప్పడంలో  వృత్తి పరంగాను, వ్యక్తిగతంగానూ భాగస్వామి కావాలని తలచింది.  అనుభవాల కలబోతతో చైతన్య పరుచుకుంటూ  ముందుకు నడవాలి అని తనకు తాను అభిప్రాయపడింది నిష్కల. 

ఆ వెంటనే, అంటే నా అభిప్రాయాలను త్యాగం చేసి అతనికి అనుగుణంగా నడుచుకోవాలా.. అతనితో సంబంధాలు మెరుగు పరుచుకోవాలా ..?  ప్రశ్న తలెత్తింది ఆమెలో  

సమాజంలో మనిషికీ మనిషికీ మధ్య అనేక సంబంధాలు నాడు నేడు ఉన్నాయి.  ఉంటాయి కూడా.  

అయితే, అది ఏ స్థాయిలో ఉన్నాయి ఎటు తీసుకుపోతున్నాయి..  

కుటుంబంలో ఉండే లింగ వివక్ష బాగా చూసింది తను. 

ఆడామగా కలిసి జీవించడానికి పరస్పర అవగాహన, ఇష్టం, ప్రేమ లేని పెళ్ళికి తాను వ్యతిరేకం.  

అమ్మ జీవితం ఎలా అన్యాయం అయిపోయిందో చూసి కూడా తాను ఆ గోతిలో పడాలనుకోలేదు. 

అంకిత్ తో సహజీవనంలో ఇద్దరికీ పోసిగితే అతనితో కలిసి జీవించాలని లేదంటే అతనికి గుడ్ బై చెప్పేస్తానని మొదటే అతనితో చెప్పింది. 

ఎంచుకున్న వృత్తిలో రాణించడమే ప్రధాన ధ్యేయం అని కూడా స్పష్టం చేసింది. అయినా వాళ్ళ అమ్మతో నన్ను పోల్చడం చాలా చిరాగ్గా ఉంది. 

అతని తల్లి ఉన్నట్లు ఉండమంటే ఎలా ఉంటుంది. ఇద్దరం వేర్వేరు వ్యక్తులు. భిన్న సామాజిక,ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం నుంచి, పరిస్థితుల్లో నుంచి, విభిన్న వాతావరణాల్లోంచి, ప్రాంతల్లోంచి , తరాల్లోంచి వచ్చిన వాళ్ళం. అలా ఎలా ఉండగలం?  ఆ మాత్రం అర్ధం చేసుకోకుండా మాట్లాడేస్తున్నాడు. 

అతని మాట ప్రకారం నడిచి నా వ్యక్తిత్వాన్ని వదులుకోవడం అంటే నన్ను నేను కోల్పోవడమే.. అది తనకు ససేమిరా నచ్చట్లేదు. 

వాళ్ళమ్మ డిగ్రీ చదివినా ఉద్యోగం చేయకుండా ఇంటికే పరిమితం అయింది. అతని తండ్రి చెప్పు చేతల్లో బంధు మిత్రులందరి వద్ద మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది . 

నేను మా నాన్న లాగా కాదు. నీకు ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇస్తున్నా అంటున్నాడు అంకిత్. 

అక్కడే వస్తోంది అతనితో  అసలు  పేచీ.. 

అతను నాకు స్వేచ్ఛ ఇచ్చేది ఏంటి? నాకు చేయాలనిపిస్తే చేస్తాను. లేదంటే లేదు. 

ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నాడు.  రేపు అతని మాట ప్రకారం పెళ్లి చేసుకుంటే, పిల్లల్ని కంటే అతని ప్రవర్తన ఎలా మారిపోతుందో భవిష్యత్ చిత్రం కళ్ళముందు కదలాడింది. 

పెళ్లి అయినా, సహజీవనం అయినా ఒకరినొకరు సర్దుకోవాలి.  భిన్నాభిప్రాయాలు సహజమే. ఒకరినొకరు మన్నించుకోవాలి, అనుకూలంగా మసలుకోవాలి, మలుచుకోవాలి నిజమే కానీ వాళ్ళ అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు కదా.. 

అతని దృష్టిలో భార్య అంటే అతని ఆస్తి. అయితే నేను తాళి కట్టిన భార్యను కాదు.  కాబట్టి తాళి కట్టేస్తానని ఉబలాట పడ్డాడు. అందుకు అమ్మని పావుగా వాడుకుందామనుకున్నాడు.  

ప్రేమలు విలువలు అంటూ నోటితో ఎన్ని మాట్లాడినా ఆచరణలో ఆమడ దూరం జరిగిపోతున్న వ్యక్తితో బంధం కొనసాగించడంలో అర్థం ఉందా… 

చెప్పాపెట్టకుండా మాయమై పోయే వ్యక్తిని నమ్మడం, మన్నించడం సరైన నిర్ణయం అవుతుందా.. 

పెళ్లి అయిన తర్వాత అతను ఇలా ప్రవర్తిస్తే ఏం చేసేదానివి? వైవాహిక బంధాన్ని అంత సులువుగా తెంపుకోగలరా.. ఏదో ఒకలాగా సర్దుకుపోవడానికి ప్రయత్నించే వారే కదా ఇద్దరూ .. గాయత్రి అన్న మాటలు మదిలో తిరుగుతున్నాయి. 

గాయత్రికి తను భిన్న ధ్రువాలు. ఇద్దరి అభిప్రాయాలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.  అయినా ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత సాన్నిహిత్యం ఉంది. 

అంకిత్  సహజీవనం చేద్దామని ప్రపోజ్ చేసినప్పుడు ఆ విషయం రూమ్మేట్ గాయత్రితో చర్చించింది. 

ఆమె సహజీవనాన్ని చాలా వ్యతిరేకించింది.   సమాజం ఆదరించదని, ఆమోదించదని అన్నది.  సహజీవనంలో ఉండేవారిని సమాజం గౌరవించదని వాదించింది.  

ఇక్కడ అమెరికాలో ఉన్నంత వరకు ఎవరూ పట్టించుకోక పోవచ్చు కానీ అది వ్యక్తిగతంగా నీకు నష్టమే చేస్తుందని నచ్చ చెప్పాలని ప్రయత్నించింది.  సహజీవనంలో పుట్టిన పిల్లల సంగతేంటి అని ప్రశ్నించింది.  సమాజానికి అదొక అనారోగ్యకర పరిస్థితి అన్నది 

మన వివాహ వ్యవస్థ లోని గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తున్నాయి.  ఆకర్షణకు లోబడి మీరు శారీరక అవసరాల నిమిత్తం ఏర్పరచుకున్న ఈ ప్రక్రియకి సహజీవనం అని  గొప్ప పేరుపెట్టి కొన్నాళ్ళు కాపురం చేస్తారు .  ఆ తర్వాత .. ఒకరికొకరు కాదనుకుంటే .. ?

ఈ పెడధోరణి ని అరికట్టాలి నీ వంటివారు. కానీ నీవే ఆ గోతిలో పడతానంటే ఎలా .. 

ఒక సాంఘిక కట్టుబాటు లేని వ్యవస్థ అది. 

సహజీవనం పేరుతోనో , డేటింగ్ పేరుతోనో మగవాళ్ళు నచ్చిన ఆడవాళ్ళతో కలసి ఉంటారు కానీ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనకు కాబోయే భార్య కన్యగా ఉండాలని అనుకుంటారు .  

సహజీవనం వల్ల తలెత్తే సమస్యల వల్ల మహిళలే బాధితులుగా మిగిలేది . సహజీవనం నుంచి మగవాడు సులభంగా తెగదెంపులు చేసుకు పోతున్నాడు. శారీరక బంధం అనుభవించడం వరకే మగవాడికి కావలసింది .  అదొక బలహీనత . 

వివాహం శాశ్వత బంధం. 

వివాహంలో ఎలాంటి బేధాభిప్రాయాలు వచ్చినా ఆ బంధాన్ని గౌరవిస్తూ పరస్పర విశ్వాసం, నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు అంటూ నిష్కల ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించింది. 

గాయత్రి నిష్కల ల మధ్య కొన్ని రోజులు ఈ విషయంలో రోజు చర్చలు జరిగేవి. 

గాయత్రి వాదనలన్నిటిని నిష్కల కొట్టి పారేసింది. సహజీవనం మనకి కొత్తగా కనిపిస్తున్నదేమో కానీ భారతీయ సమాజంలో శతాబ్దాల క్రితమే ఆచరణలో ఉండేది. 

పెళ్లినాటి ప్రమాణాలు వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా పెద్దలు , దైవ సాక్షిగా జరిగిన పెళ్లిళ్లు ఎన్ని సక్రమంగా ఉన్నాయి అని ప్రశ్నించింది నిష్కల 

అనునిత్యం అపనమ్మకంతో , అవిశ్వాసంతో , ఆధిపత్య ధోరణి లో ఒకే కప్పు కింద జీవించాలనుకునే వారిలో గొడవలు , కీచులాటలు అభిప్రాయభేదాలు ఎన్నో వస్తాయి. అవి విషాదం మిగల్చడం లేదా .. 

తాళికట్టిన భర్త అమ్మని వదిలించుకుంటే అమ్మ ఏం చేసింది  ప్రశ్నించింది నిష్కల 

  నాతిచరామి అంటూ   ఓ పురుషుడు ఓ మహిళకు సంబంధించి ఆర్థిక భారాన్ని భరిస్తూ ప్రధానంగా ఆమెను తన లైంగిక అవసరాలు తీర్చే ఉంపుడుగత్తె గా ఉంచుకోవడం , సేవకురాలిగా పనిచేయించుకోవడం చేయడం వివాహ బంధమా .. 

 ఎవరిమీద ఎవరికీ ఆధిపత్యం ఉండరాదనే. ఒకరి వ్యక్తిగతంలోకి మరొకరు చొచ్చుకు రాకూడదనే సహజీవనం లోకి వెళ్లాలనుకుంటున్నాను.  

 ఏడాదిపాటు సహజీవనం చేసి ఉంటే వాళ్లకు పెళ్లయి పోయినట్లే లెక్క .

అయితే అది నువ్వన్నట్టు చట్టబద్దమైన పెళ్లి లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి , గుళ్లో పెళ్లి ఏది కాదు. అట్లాగని శారీరక సుఖాల కోసమో , ఆర్ధిక అవసరాల కోసమో తప్పుడు వాగ్దానాలతో  సహజీవన సంబంధాన్ని ఏర్పరచుకోలేదు.  అతని ఉద్యోగం చూసో , అతని జీవితం చూసో అతన్ని ఎంచుకోలేదు.  మనస్ఫూర్తిగా మనసులు కలిసి జీవితం పంచుకోవడం కోసమే ఒక బంధంలోకి రావాలనుకున్నా

ఇద్దరం చిన్న పిల్లలం కాదు. జీవితం పై, పెళ్లి , పిల్లలు , సమాజం వంటి వాటిపై చక్కని అవగాహన ఉంది.  ఆ అవగాహనతోనే తాము నమ్మిన విషయాన్నీ ఆచరణలో పెడుతున్నాం అని గాయత్రి కి చెప్పింది.    

ఓ ఆడ మగ కలుస్తారు. ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. ఒకరినొకరు కోరుకుంటారు.  బహుశా ఒకరినొకరు ప్రేమిస్తారు. కొంతకాలం గడిచాక యిక ఒకరినొకరు ప్రేమించుకోరు.  ఒకరినొకరు ఇష్టపడరు. ఒకరినొకరు కోరుకోరు. అసలు ఎప్పుడూ కలవకపోతే బాగుండు అనుకుంటారు. 

ఆడమగ ప్రేమ ఒక రుతువు. అంతే చిగురించేటప్పడు ప్రేమ పచ్చగా ఉంటుంది. పండగలా ఉంటుంది. 

ఆ రుతువు పోగానే అది ఎండిపోయి రాలి పోయి కుళ్లిన ఆకుల కుప్పలా..మారితే అన్నది గాయత్రి. 

ఆ మాటలకు ఆనాడు చాలా కోపం వచ్చింది.  ఎప్పుడూ నెగెటివ్ గా ఆలోచించడం తప్ప పోసిటివ్ గా ఆలోచించలేవా  అని అరిచేసింది. 

గాయత్రి ఏం చేస్తున్నదో .. 

ఫోన్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుంది 

ఫోన్ అన్లాక్ చేయగానే అమ్మ ఫోటో కళ్ళముందు కొచ్చింది.    అమ్మ బొమ్మను చూస్తూ ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టింది నిష్కల 

అమ్మా నేనెప్పుడయినా నింగికి నిచ్చెన వేయాలని చూశానా .. లేదు కదా .. నేలమీదే నిటారుగా నిలబడాలనుకున్నా .. 

కలల లోకంలో విహరిద్దామనుకున్నానా .. లేదే జీవితంలో జీవించాలనుకున్నా అంతే కదమ్మా .. 

మరి నా జీవితం ఇంత చిందరవందరగా అస్తమిస్తున్న సూర్యుడిలా  తయారైందేమిటి ..? వేలమైళ్ల దూరంలో ఉన్న అమ్మని మౌనంగా అడిగింది.   

మళ్ళీ అంతలోనే ఛి ఛీ తను మరీ ఇంత బేలగా ఆలోచిస్తున్నదేంటి? 

ఈ కాలం పిల్లని. అమ్మ కంటే ఎక్కువ ప్రపంచం చూశానని, ఎక్కువ చదువుకున్నానని ప్రపంచ పోకడలు అర్థం చేసుకుంటున్నాని అమ్మతో చెప్పాను. 

అతని విషయం వచ్చే సరికి ఇలా ఆలోచిస్తున్నదేంటి… తాను అందరిలాంటి ఆడపిల్లేనా .. 

ఊహూ .. కాదు కాదు . తను అందరిలాంటి ఆడపిల్ల కాదు. వారికంటే కాస్త భిన్నంగా ఆలోచించే యువతి. 

అమ్మానాన్న, కుటుంబం, సమాజం కోసం తమ ఇస్థాయిష్టాలను, ఆలోచనలను, అభిప్రాయాలను త్యాగం చేయదు.  మార్చుకోదు. అట్లాగని తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం పట్ల గౌరవం, పట్టింపు, బాధ్యత లేదని కాదు. 

ఏ గాలి వీస్తే అటువైపు వంగిపోవడం తనకు చేతకాదు. నడ్డి విరిగి పోతుందని తెలిసినా  నిటారుగానే ఉంటుంది . అది తన నైజం. 

జీవితాన్ని కొత్త దృక్కోణంలో చూసే ఆమె. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ

నలుగురిలో నారాయణా అనే అతను

తనదైన ముద్ర కోసం ఆమె

తన అభిప్రాయాలు ఆమెపై రుద్దాలనుకునే అతను

అది అంగీకరించలేని ఆమె

ఆంక్షల, నిబంధనల చట్రంలో బిగించి బిరడా పెట్టాలని చూసే అతను

తన చుట్టూ ఉండే చట్రాలను బద్దలు కొట్టాలనుకునే , గీతలను దాటాలనుకునే ఆమె ఇతరులు వేసిన బాటపై నడవడానికి ఇష్ట పడదు. సొంత బాటను వేసుకోవాలని తపించే ఆమెలో ఎడతెగని ఘర్షణ లోలోనే జరుగుతున్నది. 

ఆలోచనల సాలెగూటిలో చిక్కి విలవిలలాడుతున్న నిష్కలను ఫోన్ కాల్ బయట పడేసింది.  

కొత్త నంబర్ కాల్ తీసుకోనా వద్దా అని క్షణం తటపటాయించి కాల్ తీసుకుంది.  

సారా జలాల  అని ట్రూ కలర్ చెప్పింది. 

జలాల .. జలాల  మనసులోనే అనుకున్న శబ్దం పైకి వచ్చేసింది. 

పేరు చూస్తే అమెరికన్ పేరు లాగా ఉంది కానీ జలాల తన ఫామిలీ నేమ్ ..  ఆమెకు ఎలా వచ్చింది .  అమెరికన్స్ లో కూడా ఆ జలాల ఫామిలీ నేమ్ ఉందేమో .. ఆశ్చర్యంగా ఉండామెకు 

ఎవరో తెలియని ఆమె ఫోటో  డిస్ప్లే అవుతున్నది .  ఆమెను చూసి షాక్ అయింది నిష్కల  

(మళ్ళీ కలుద్దాం )

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.