వెనుతిరగని వెన్నెల(భాగం-27)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-27)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది సమీరకి. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లిజరుగుతుంది.  విశాఖపట్నం లో కొత్త కాపురం ప్రారంభిస్తారు.  పెళ్లయిన సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు.

***

తన్మయి సామాన్లని సర్దుతూందే గానీ ఆలోచన్లతో తల బద్దలు అయిపోతూంది

ఇన్ని రోజుల పాటు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని నిలబడినదంతా ఇప్పుడు వెనక్కి వెళ్లిపోవడం వల్ల ఆవిరైపోతూంది.

తనని, బాబుని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోయిన శేఖర్ని వెతుక్కుంటూ తను వెళ్లడం అంటే తన లక్ష్యాలన్నీ గంగలో కలిసినట్టే.  

ఇన్నాళ్లూ అతనెలా నడుచుకున్నా, తనని ఎంతగా బాధిస్తూన్నా ముఖ్యంగా పిల్లాడికి తండ్రిని దూరం చెయ్యడం ఇష్టం లేకనే భరిస్తూ వచ్చింది. కానీ అతనెలా వెళ్లిపోగలిగాడు

చేసినవన్నీ అతను చేసి, తన మీద నిందలు వేసి, అతను బయటకు వెళ్లడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? ఎందుకిదంతా చేస్తున్నాడు

తండ్రి చెప్పినట్టు తాత్కాలిక మైన కోపంతోనే వెళ్లిపోయాడా?

మరి అందరి ముందూ తనని అవమానపరచడం, కరుణతో కాగితాల మీద సంతకాలు పెట్టించుకోవడం ఎందుకు చేసేడు?

సమాధానం తెలియని ప్రశ్నలతో తలమునకలు కాసాగింది.

ఒకటి మాత్రం నిజం. జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయినట్లయ్యి తల్లిదండ్రుల పంచని చేరి, భారంగా బతుకునీడ్చడం తనకి సుతరామూ ఇష్టం లేదు

సామాన్లన్నీ వ్యాను లోకి ఎక్కించేక, కాసిన్ని బట్టలు, క్లాసు పుస్తకాలు సర్దుకున్న సూట్ కేసు, పర్సు పట్టుకునినేను తర్వాత వస్తాను నాన్నా, మీరు బాబును తీసుకుని వెళ్ళండి“. అంది దృఢంగా తన్మయి.

పొద్దుటినించీ కూతురి ముఖంలో చూసిన బెంబేలుతనానికి బదులు కనబడ్డ దృఢత్వానికి భానుమూర్తి ఏమీ అనలేకపోయాడు. పైగా వ్యాను డ్రైవరు కంగారు పెడుతుండడంతో 

సరేనమ్మా, అమ్మకి ఫోను చెయ్యి, లేకపోతే కంగారు పడుతుంది.” అన్నాడు.

వ్యాను బయలు దేరే ముందు కిటికీ అద్దంలోంచి బాబు చిన్నారి చెయ్యి బయట పెట్టి తల్లి చేతిని అందుకున్నాడు. బాబు చేతిని వదల్లేక వదల్లేక వదిలింది తన్మయి. ఒక్క రోజు కూడా బాబుని వదిలి ఉండలేని బేలతనం తనది. అదేవిటో గానీ  తన దురదృష్టం ఎప్పుడూ వాణ్ణి వొదలడం తప్పడం లేదు.

వ్యాను వీధి మలుపు తిరిగేంత వరకూ చూస్తూ నిలబడింది.

తండ్రితో తర్వాత వస్తానని అందే గానీ ఎక్కడికి వెళ్లాలో తెలీదు.

వీధి చివరకు నడిచి వచ్చి తల్లికి ఫోను చేసింది.

తల్లికి ఒక్కొక్కటీ చెపుతున్నపుడు దు:ఖంతో గొంతు పూడుకు పోయింది.

కాగితాలు.. కాగితాలుఅతనెందుకు సంతకాలు పెట్టించుకున్నాడు?…..” అని వెక్కి వెక్కి పడసాగింది.

అట్నించి జ్యోతిఏడ్వొద్దమ్మా, నువ్వు అస్సలు ఏడవొద్దు. కాగితాలు ఏం చేసుకుంటాడు? నాలుగ్గీసుకుంటాడా? లేదా వాల్ పోస్టర్లేసి వీధి వీధీ పంచుకుంటాడా? తన పెళ్ళాం గురించి చెడుగా ప్రచారం చేసుకుంటే నష్టం ఎవడికి? చూస్తూండు. నువ్వే కావాలని అతనే దేభ్యం మొహవేసుకుని  తిరిగొస్తాడు. నువ్వు బెంగ పడకు. ఎప్పటిలానే శనివారం ఇంటికి వచ్చెయ్యి. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా ఉండమ్మా.” అంది.

తల్లి  మాటలతో మరింత ధైర్యం వచ్చినట్లయింది తన్మయికి

ముందు రోజు నించి జరిగిన పరిణామాల వల్ల కలుగుతున్న టెన్షన్ తో సరిగా తినక పోవడంవల్ల ఒంట్లో అస్సలు ఓపిక లేకున్నా అడుగు తీసి అడుగు ముందుకు వేస్తూంటే  తెలియని పట్టుదల కలగ సాగింది తన్మయికి..

తనకే ఇన్ని కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయిఅడుగడుగునా పరీక్షలు ఎందుకు ఎదురవుతున్నాయి

అసలు ఎక్కడ తన జీవితం గాడి తప్పింది

ఎక్కడ తప్పు జరిగింది? అందరిలాగే తను కూడా జీవితమ్మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. కోరి వచ్చిన వాడిని మనసారా ఇష్టపడి పెళ్లి చేసుకుంది. అవన్నీ ఎంత మామూలుగా జరిగాయో అంత మామూలుగానూ తన జీవితంలో ఉన్నతాశయాల్ని నెరవేర్చుకోవాలనుకుంది. అది తప్పా?

పెళ్ళి, ఆశయాలు ఒక ఒరలో ఇమడనంత క్లిష్టమైనదా జీవితమంటే?

తనకి నచ్చనివెన్నో అతనిలో ఉన్నాయి. అయినా తనకి అతణ్ణి వదులుకోవాలన్న ఆలోచన ఎన్నడూ రాలేదు. పెళ్ళి పట్ల, సంప్రదాయాల పట్ల ఉండే గౌరవం ఒక కారణమైతే, అతన్ని తను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుందికాబట్టి కష్టమైనా నష్టమైనా అతనితో నెట్టుకు వచ్చింది

అతని అలవాట్లని, హింసని తను భరించగలుగుతున్నపుడు అతనికి నచ్చని ఒకే ఒక్క చదువుకోవాలనే ఆశయాన్ని అతనెందుకు సహించలేక పోతున్నాడు? పైగా చెత్త అనుమానం ఒకటి.

ఇవన్నీ ఒక వైపు సమస్యలు. అసలు తను ఇప్పుడు ఎలా బతకాలి? చదువుని ఎలా కొనసాగించాలి? బాబుని ఎలా పెంచుకోవాలి? అసలు ముందు రాత్రికి ఎక్కడ తలదాచుకోవాలి

 “మిత్రమా! నన్ను రక్షించు. నాకొక దారి చూపించు.” మనస్సులో ప్రార్థిస్తూ , చెయ్యాల్సిన పన్లని మననం చేసుకోసాగింది.

ముందు అనంతని కలవాలి. తనకి తెలిసిన వాళ్ళెవరైనా లేడీస్ హాస్టల్ లో ఉండి, తనకి సహాయం చెయ్యగలరేమో కనుక్కోవాలి

తిన్నగా యూనివర్శిటీకి వెళ్ళింది. చేతిలో బరువుతో యూనివర్సిటీకి వెళ్లే ఎత్తు రోడ్డులో నడిచే సరికి చెమట్లు ధారాపాతంగా కారసాగేయి

డిపార్టుమెంటు బయట చెట్టు కింద నీడలో కూలబడింది.

మానసికంగా బాగా అలిసిపోయే సరికి ప్రభావం శరీరమ్మీద పడి ఇక ఒక్కడుగు కూడా వెయ్యలేని నిస్సత్తువ కమ్ముకుంది.

పర్సులో ఉన్న వంద రూపాయలతో వారమంతా బతకడమే కాదు, వారాంతంలో ఇంటికి వెళ్లడానికి ఛార్జీలు కూడా సరిపెట్టుకోవాలి.

తల దించుకుని ఆలోచలతో నిమగ్నమైపోయిన తన్మయిరాజు, దివాకర్ దగ్గరకు వచ్చిన సంగతి చూడలేదు

ఏవిటి? ఎక్కడికో వెళ్తూ పొపొరబాటున ఇలా వచ్చేరా?” అన్నాడు దివాకర్.

దివాకర్ కు సమాధానం ఇవ్వకుండానే రాజు వైపు తిరిగిఅనంత ఎక్కడుంది? నేను వెంటనే మాట్లాడాలి.” అంది తన్మయి.

అనంత నాన్నగారికి ఒంట్లో బాలేదని కబురు వచ్చింది. ఆదివారం తను వాళ్ల ఊరు వెళ్లింది. రేపు ఫోను చేసి కనుక్కుంటాను. అంతా బానే ఉంటే ఎల్లుండి వచ్చెయ్యమని చెపుతాను. ఇక్కడ క్లాసులు పోతున్నాయి తనకి. మీరు కనిపిస్తే చెప్పమంది. అవునూ, మీరేవిటి సరాసరి ఊర్నించి ఇటే వొస్తున్నారా?” అన్నాడు రాజు.

నిశ్శబ్దంగా తల ఊపింది తన్మయి.

అవునూ.. మ్మన  మహానుభావుడు  ..ఎక్కడికి వెళ్లేడో. నిన్నట్నించి కనబడ్డం లేదు అన్నాడు కరుణని ఉద్దేశించి.” దివాకర్.

కరుణ గురించి తల్చుకుంటే ఒక విధమైన గిల్టీ ఫీలింగ్ కలగ సాగింది తన్మయికి. “పాపం, ఎలా ఉన్నాడో! ఎంతగా డిస్టర్బ్ అయి ఉంటాడో. తనతో స్నేహం చేసిన పాపానికి అతన్ని కూడా కష్టాల పాల్జేసింది.” తనని తను మనసులో తిట్టుకోసాగింది.

దిగులుగా, నిశ్శబ్దంగా లేచి లేచి  సూట్ కేసు అందుకుని, బస్టాండు వైపు నడవ సాగింది.

అనంత కనబడితే తనకు తెల్సిన వాళ్లెవరితోనైనా మాట్లాడి, లేడీస్ హాస్టల్లో తాత్కాలికంగా ఉండొచ్చని అనుకుంది. ఇప్పుడెలా, ఏం చేయాలి? ఊరికి తిరిగి వెళ్లిపోక తప్పేట్లు లేదు

దివాకర్ పక్కనే నడుస్తూ..ఇటివ్వండి నె..నేను పట్టుకొస్తాను మి..మ్మీ ఇంటి దాకాఅన్నాడు

తన్మయి మొహమాటంగా తల ఊపుతూఫర్వాలేదు దివాకర్అంది. కానీ అప్రయత్నంగా దు:ఖం తన్నుకు వచ్చి మాట్లాడలేకపోయింది.

అంతా ..బానే ఉందా ..తన్మయి గారూ?” అన్నాడు ఖంగారు పడ్తూ.

లేదు దివాకర్, మా ఇల్లు ఖాళీ చేసేంఅని నాలుగడుగుల్లో  మరో బెంచీ మీద కూలబడింది

అయ్యో, మి..మ్మీకు ఒంట్లో  ఓపిక కూడా లేనట్లుంది. మిమ్మీకు ..అభ్యంతరం లె..లేకపోతే మా ఇంటికి రండి. ఇంట్లో అక్కయ్య, నేనే ఉన్నాం. మా అమ్మా, నాన్నా ఊరు వెళ్లేరు. శు..శుక్రవారం వరకూ రారు. లోగా మి..మీరు ఆలోచించుకోవచ్చు.” అన్నాడు దివాకర్.

కృతజ్ఞతా పూర్వకంగా వెయ్యి నమస్సులు మనస్సులోనే సమర్పించింది తన్మయి.”చాలా థాంక్స్ దివాకర్అని అతని వెనక నడిచింది.

ఎత్తున ఉన్న యూనివర్శిటీ నించి దిగువన యూనివర్శిటీ క్వార్టర్స్ లో దాదాపు సముద్ర తీరపు ఘోష వినిపించే వరకూ వెళ్తే చివరి ఇల్లు వాళ్లది.

దారిలో మరొక త్రోవ వైపు చూపిస్తూమా..మాస్టారి ఇల్లు ఇటే, ..మన  జె.ఆర్.ఎఫ్  పి..ప్రిపరేషన్ కి ఎప్పుడైనా సరే, ..సాయం చేస్తామన్నారు.” అన్నాడు.

జె.ఆర్.ఎఫ్ గురించి తల్చుకోగానే బాగా బెంగ పట్టుకుంది తన్మయికి. “నానాటికి సమస్యాపూరితమైన జీవితంతో తనేవైనా సాధించగలదా?”

నడుస్తున్నంత సేపు క్లాసుల గురించి, చదువు గురించి తప్ప తన స్వంత విషయాలు మాత్రం అడగని దివాకర్  మర్యాదకర ప్రవర్తనకు కృతజ్ఞతలు మనస్సులో సమర్పించింది తన్మయి.

దివాకర్ తో తనకు అంత వరకూ సరిగా పరిచయం లేదు. ఇంత వరకూ అతన్ని లోకం పోకడ తెలియని అమాయకుడిగానే గుర్తించింది. ఇప్పుడు అతను గొప్ప సంస్కరవేత్త అని కూడా అర్థం చేసుకుంది.

గేటు తీసుకుని లోపలికి వెళ్లే త్రోవలో రకరకాల పూల చెట్లు, పళ్ల చెట్ల మధ్య సన్నని త్రోవ గుండా  ఇండిపెండెంట్ క్వార్టర్స్ లోకి అడుగుపెట్టేరు

బయట వరండాకి ఆనుకుని ఉన్న అరుగు మీద కూచున్న అందమైన అమ్మాయి తమని చూస్తూనే పలకరింపుగా నవ్వుతూ దగ్గరకు వచ్చి

ఆగండాగండి, మీరెవరో నేను చెప్తాను. మీరు తన్మయి కదా. మా దివా ఎప్పుడూ మీ గురించే చెప్తాడు. కాలంలో కొంగు కప్పుకుని నడిచే వారు మీరొక్కరే అని మిమ్మల్ని చూస్తూనే గుర్తు పట్టేను.” అంది.

అలిసిపోయి ఉన్న తన్మయిని లోపలికి ఆదరంగా తీసుకెళ్లి, “ముందు మొహం కడుక్కోండి, కాఫీ తెస్తాను.” అంది.

సూట్ కేసులోంచి టవలు తీసుకుని మొహం తుడుచుకుని బొట్టు పెట్టుకుంది తన్మయి.

దివాకర్ అక్క కాత్యాయని వయసులో మహా అయితే అతని కంటే రెండేళ్ళు పెద్దదై ఉండొచ్చు. ఎమ్మే ఫిలాసఫీ చేసింది. పెద్ద కళ్లు, చక్కని రూపం. రూపం కంటే ఆకర్షణీయమైన మృదు భాషణ.

దివాకర్అలా వెళ్లొస్తానని ఎక్కడికో వెళ్లేడు.

” ‘టీ.వీఅని కొత్తగా వచ్చింది. సీరియల్ చూస్తారా?” అంది కాత్యాయని ఉత్సాహంగా

టీవీ అనగానే తన్మయికి తన తల్లిదండ్రులు శేఖర్ కి పండగ బహుమతిగా ఇచ్చిన కలర్ టీవీ సన్నివేశం జ్ఞాపకం వచ్చింది. శేఖర్ తమ్ముడికి పెళ్ళి కుదిరింది. అమ్మాయి తరఫు వాళ్ళు కట్నంతో బాటూ కలర్ టీవీ కూడా ఇస్తున్నారు కాబట్టి మీ వాళ్లు కూడా ఇవ్వవలసిందేనని పట్టుబట్టింది దేవి. అప్పటికిప్పుడు కలర్ టీవీ అంటే అధమం ఇరవై వేల పైమాటే. జ్యోతి కుదరదని చెప్పమన్నాభానుమూర్తి వినిపించుకోకుండా చీటీ పాడి  కొని ఇచ్చి పంపించేడు. సామాన్లతో బాటూ టీవీ ని తీసి వ్యానులోకి ఎక్కిస్తున్నపుడు తండ్రి దవడ బాధతో బిగుసుకోవడం చూసి వ్యధాపూరితురాలైంది తన్మయి.  

కాత్యాయనికి సమాధానంగా చిన్నగా నిట్టూర్చి  “టీ.వీ అలవాటు లేదు కాత్యాయని గారూఅంది తన్మయి

బదులుగాకాత్యా, అని పిలవండి చాలు. మీరు చాలా బాగా చదువుతారని మా తమ్ముడు చెప్తుంటాడు. మీరు టీవీ చూడరంటే ఆశ్చర్యం లేదు లెండిఅంది

కాస్సేపు చదువుల గురించి సంభాషణ సాగేక, కుర్చీ దగ్గర చాప వేసుకుని నేల మీద కూచుంది కాత్యాయని. తన్మయి కూడా చాప మీదికి మారింది. ఉండండి, దిండ్లు తెస్తాను. విశ్రాంతిగా నిద్రపోండి. బాగా అలిసిపోయినట్లున్నారు.” అంది.

నిద్ర రావడం లేదు కాత్యా! రేపు అనంత రాగానే హాస్టలు గురించి ప్రయత్నం చెయ్యాలి. ఒకవేళ దొరకకపోతే మీకభ్యంతరం లేకపోతే నేను రేపు కూడా ఇక్కడే ఉంటాను.” అంది సందేహంగా తన్మయి తటపటాయిస్తూ.

అయ్యో, అలా అడగాలా చెప్పండి. మీకు నచ్చినన్నాళ్లు ఉండొచ్చు. అవునూ, మీ బాబు ఎలా ఉన్నాడు?” అంది కాత్యాయని.

బాబుని తల్చుకోగానే జరిగిన అస్తవ్యస్త సంఘటనలన్నీ  ఒక్క సారిగా జ్ఞాపకం వచ్చి  కళ్లు నిండి పోయేయి.

మిమ్మల్ని అడిగి బాధ పెట్టదల్చుకోలేదు, మీ గుండె భారం తీర్చుకోవడానికి మీ కష్టమేదైనా నాతో చెప్పడానికి వెనకాడకండి.” అంది కాత్యాయని అనునయంగా దగ్గరకు వచ్చి కూచుని.

తన్మయి కళ్లు తుడుచుకుంటూ, మీతో చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అని మొదట్నించీ చెప్పసాగింది.

దాదాపు గంట సేపు తన్మయి చెప్తూండగా  కాత్యాయని కళ్ల నీళ్లతో వింది.

తన బాధని పంచుకుంటూ తన కోసం కన్నీళ్లు కారుస్తూ న్న అపరిచితురాలైన అమ్మాయిని మనస్సు లోనే అభినందించకుండా ఉండలేకపోయింది తన్మయి

తనకి ఆశ్రయమిచ్చి, ఊరట కలిగించిన   అమ్మాయిని జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు.” అనుకుంది.

ఎప్పుడు వచ్చి విన్నాడో ఏమో బయట వరండాలో నిశ్శబ్దంగా కూచుని ఉన్న దివాకర్ కళ్లు కూడా వర్షిస్తూన్నాయి.

ఇటువంటి  మంచి వాళ్లింకా ఉండడం వల్లనే ప్రపంచం మాత్రమైనా మనగలుగుతూంది.

తన్మయి తన బాధా గాథలో అనుకోకుండా ఇరుక్కున్న కరుణ విషయం మాత్రం చెప్పలేదు. ఇప్పటికే తన వల్ల అతనికి కలిగిన నష్టం చాలు. ఇక్కడే కాదు. ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించకూడదు అని నిర్ణయించుకుంది.

****

మర్నాడు డిపార్టుమెంటు లో  అనంత తన్మయిని చూస్తూనేహమ్మయ్య కనిపించావా, మా నాన్నకి కామెర్లు వచ్చి తగ్గకపోతే కె.జి హెచ్ లో జాయిన్ చేసేం. అమ్మ కూడా అక్కడే ఉంది. మీ ఇంట్లో కాస్త కేరియర్ వొండి  పట్టుకెళ్లొచ్చా?” అంది ఆదుర్దాగా.

తన్మయి తన కష్టాన్ని మర్చిపోయి, “అయ్యో ఏమైంది? పద నేనూ వస్తానుఅంది.

తన్మయితో వచ్చిన దివాకర్మి మ్మీరు వెళ్లండి. నేను నోట్సులు సంపాదిస్తాను. క్ల క్లాసులు అయ్యేక క్క కలుద్దాం.” అన్నాడు.

అనంత, రాజులతో బాటూ కె.జి.హెచ్ బస్సెక్కింది తన్మయి

తన్మయి ప్రస్తుత పరిస్థితి అంతా విని, “అయ్యో, అసలు ఇంత మంచిదానివైన నీకే కష్టాలు ఎందుకొస్తున్నాయో. నిన్ను ఇన్ని కష్టాల పాల్జేసి, బంగారం లాంటి నీ కొడుకుని కూడా దూరం చేసుకున్న అతనిదే  దురదృష్టం. నువ్వేం అధైర్య పడకుసాయంత్రం హాస్టలుకి తీసుకెళ్తాను. తెలిసిన అమ్మాయిలెవరి రూములోనైనా గెస్టుగా ఉండొచ్చు.” అంది అనంత.

థాంక్యూ, అనంతాఅంది తన్మయి కళ్లు చెమరుస్తూ ఉండగా

థాంక్స్ మాటికేం గానీ , నువ్విక అన్నిటికీ కంట నీరు పెట్టుకోవడం మానెయ్యాలి. నువ్వు నిలబడి, బాబుకి మంచి జీవితాన్నివ్వాలి.” అంది అనంత.

తన్మయి కళ్ళు తుడుచుకుని తల ఊపింది.

రాజు వాళ్ల బాబాయి రైల్వే లో పనిచేసి రిటైరయ్యేరు. గాజువాక లో రైల్వే క్వార్టర్సులో వాళ్లకొక రెస్టారెంటు ఉంది. ఇప్పుడు యూనివర్శిటీకి దగ్గర్లో జరుగుతున్న ఎగ్జిబిషను లో ఫుడ్ స్టాల్ తీసుకున్నారు. మాకు డబ్బులు బాగా అవసరం కాబట్టి స్టాలులో హెల్పుకి నేను, రాజు ఒప్పుకున్నాం. ఇంకా మరో ఇద్దరు ముగ్గురు కూడా అవసరమన్నారు కూడానువ్వు సరేనంటే, నీ గురించి కూడా మాట్లాడతాను, ఏమంటావ్?” అంది అనంత.

బస్సు కిటికీ లోంచి కనిపిస్తూన్న ఆకాశం లోకి చూస్తూమిత్రమా! నువ్వు నిజంగా ఉన్నావు.” అనుకుంది తన్మయి.

అనంత చేతిని చేతిలోకి తీసుకుని, “నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అనంతా. తప్పకుండా వస్తాను క్యాంటీను కౌంటరులో పనిచేయడానికిఅంది గద్గదంగా.

ప్రతీ రోజూ సాయంత్రం అయిదు గంటల నించీ రాత్రి పదకొండు గంటల వరకూ కేంటీను లో ఉద్యోగం. కావడానికి కౌంటరు ఉద్యోగమైనా స్టాలు తెరిచిన దగ్గర్నించి కుర్చీలు, టేబుళ్లు వెయ్యడం దగ్గర్నించీ, రాత్రి మూసేసే సమయమయ్యాక సర్దడం వరకూ అన్నీ చెయ్యాలి.

అనంత, రాజు ఉన్నారు కాబట్టి తప్పని నిలువు జీతపు ఉద్యోగం ఎంత కష్టమైనా సులువుగానే అనిపించసాగింది తన్మయికి

శుక్రవారం అనంతశనాది వారాల్లో రోజంతా పని ఉంటుందట. మేమిద్దరం చేస్తున్నాం. వారం ఊరెళ్లడం మానేసి నువ్వూ మాతో రా తన్మయీ.” అంది.

రోజుకి యాభై రూపాయలు, భోజనం పేకెట్టు . పది రోజుల వరకూ పని చేస్తే వచ్చే డబ్బులతో నెలాఖరు వరకూ గడపొచ్చు

వారాంతం లో కూడా పనిచేస్తే రెండు మూడు వారాలు ఇంటికెళ్లి రావడానికి బస్సు ఛార్జీలకొస్తాయి.

తనూ వొస్తానన్నట్లు తలూపింది తన్మయి.

అన్నీ బానే ఉన్నాయి గానీ ఇలాంటి చోట పని చేసేటప్పుడు చెంగు భుజాన కప్పుకోకూడదు తన్మయీ, ఇలా నడుం చుట్టూ బిగించాలి.” అని నవ్వింది అనంత

****

యూనివర్శిటీ లేడీస్ హాస్టల్లో తన్మయి తాత్కాలికంగా అనంతకి తెలిసిన అమ్మాయి గదిలో గెస్టుగా చేరింది.

రోజు యూనివర్శీటీ నించి సాయంత్రం హాస్టలుకి రాగానే చేదు వార్త ఎదురయ్యింది తన్మయికి.

లేడీస్ హాస్టల్లో రూల్సు ప్రకారం ఎక్కువ రోజులు గెస్టుగా ఉండే అవకాశం ఉండదు. వచ్చే వారంలో రూము మరెవరికో కేటాయించబోతున్నారు.

తన్మయికి మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.

మాటిమాటికీ అనంతని సహాయం అడగడమూ తనకు ఇబ్బందిగానే ఉంది. ఏం చెయ్యాలి? ఎక్కడ ఉండాలి?

హాస్టలు నించి రోడ్డు దిగువకి నడిచి సముద్ర తీరం వెంబడి నడుస్తూసముద్రమా! నిన్ను ఇన్ని అలలు ముంచెత్తుతున్నా ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నావు? మిత్రమా! నాకూ కాస్త ధైర్యాన్ని పంచమని సాగరంతో చెప్పవా?” 

ఒక పక్క చదువు, ఒక పక్క జీవనం కోసం పోరాటం, మరో పక్క ఇంటికి వెళ్తే చాలు శేఖర్ అక్కడ కనిపించాడు, ఇక్కడ కనిపించాడని  తెలుస్తున్న కబుర్లు, బాబుని వొదిలి ఉండలేనితనం

రామకృష్ణ  మిషను ఆవరణలోకి వెళ్లి కళ్లు మూసుకుని కూచుంది

అక్కడ ఉన్నంత సేపు ఎంతో ప్రశాంతంగా అనిపించసాగింది తన్మయికి

అప్పటి నుంచి మనసు బాధగా ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్లడం అలవాటు చేసుకుంది

“Strength is Life, Weakness is Death.

Expansion is Life, Contraction is Death.

Love is Life, Hatred is Death.”

― Swami Vivekananda “

అక్కడ గోడల మీద తన కోసమే రాసినట్లున్న వాక్యాల్ని మళ్లీ మళ్లీ స్ఫురింపజేసుకుంటూ   

బయట వరండాలో చెప్పులు వేసుకుంటూ ఎదురుగా గోడకున్న ఎడ్వర్టైజుమెంటుని యథాలాపంగా చూసింది తన్మయి.

స్థానిక వివేకానంద ఆశ్రమపాఠశాలలో రెసిడెంటు టీచర్ల కోసం ప్రకటన అది. రెసిడెంటు ఉద్యోగంలో చేరితే తన హాస్టలు బాధలు తీరుతాయి. కానీ చదువు, ఉద్యోగం ఒకటే సమయంలో ఎలా కుదురుతాయో చూడాలి. ఏదైనా సోమవారం వెళ్లి చూద్దాం అనుకుంది.

అడ్రసు వివరాలు రాసుకుని బయటకు వచ్చి సముద్రం వైపు శిరస్సు వంచి కన్నీళ్లతో నమస్కరించిమిత్రమా! నాకీ ఉద్యోగం ఇప్పించుఅంది.

****

మర్నాడు ఇంటికి వెళ్లే ముందు బాబుకి రోడ్డు పక్కన చవకగా వస్తువులు అమ్మే చోట ఒక జత బట్టలు, ఒక చెప్పుల జత కొంది తన్మయి.

స్వయంగా సంపాదించిన డబ్బులతో కొన్న మొదటి వస్తువులని ఎంతో సంతృప్తిగా చూసుకుంది. గుండెలకు హత్తుకుంది. బట్టల్లో బాబు ఎంత ముద్దొస్తాడో. అని ఊహించుకుని మురిసిపోయింది. ముందంతా ఎప్పుడూ లేని అత్యంత అనందం ఇది.

బస్సెక్కే ముందు ఒక్క సారి బాబు గొంతు వినాలనిపించింది

అవతలి నుంచి బాబుఅమ్మా!” అని పిలవగానే తన్మయి గుండె ఉప్పొంగింది. ఫోనులోనే వాడికి ముద్దులు కురిపించింది

కానీ జ్యోతి గొంతు ఎప్పుడూ లేనంత దిగులుగా వినిపించింది.

సాయంత్రం ఇంటికి వెళ్లేక గానీ విషయం అర్థం కాలేదు తన్మయికి.

తండ్రి గుమ్మంలోనే వాలు కుర్చీలో నిశ్శబ్దంగా కూచుని ఉన్నాడు.

జ్యోతి చేతిలో నుంచి పోస్టల్ కవరు తీసుకుని టైపు చేసి ఉన్న మొదటి పేజీని చూసి అక్కడే కూలబడింది తన్మయి. శేఖర్ నించివిడాకుల నోటీసుఅది.

రెండు నెలల నించి కేవలం కోపంతో వెళ్ళిపోయి తిరిగి వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులకి అశనిపాతంలా తగిలింది ఇది.

తన్మయికి ఏం చేయాలో పాలుపోలేదు. బాబుని గుండెలకు హత్తుకుని నిశ్శబ్దంగా రోదించసాగింది.

జ్యోతి కూతురి భుజమ్మీద చెయ్యి వేసి రాస్తూ కూచుంది.

ఇంతలో బయట వరండా లో కూచున్న భానుమూర్తి మూలుగుతున్నట్లు వినిపించి అటు పరుగెత్తారు. అప్పటికే గుండె పట్టుకుని ఎగ ఊపిరితో సతమతమవుతున్న తండ్రిని చూడగానే కెవ్వున అరిచింది తన్మయి

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.