మిట్ట మధ్యాహ్నపు మరణం- 1

– గౌరీ కృపానందన్

పెళ్లి పందిరి కళకళ లాడుతోంది. పిల్లలు అటూ ఇటు పరుగులు తీస్తున్నారు. పాట కచ్చేరి ముగిసి, గాయకులంతా తమ తమ వాద్యాలను పక్కకి తీసి పెట్టారు. నాన్నగారు తాంబూలంలో వెయ్యిరూపాయలు ఉంచి ప్రధాన గాయకుడి చేతికి ఇస్తూ, “కచ్చేరి దేవగానంలా అనిపించింది. అందరూ భోజనాలు చేసి మరీ వెళ్ళాలి” అన్నారు.

పెళ్లి కూతురు ఉమ మెడలో ఉన్న పూల దండను తీసేసింది. పక్కనే నిలబడి ఉన్న మూర్తిని, పది గంటల క్రితమే తన మెడలో పసుపుతాడు కట్టిన మూర్తిని మళ్ళీ మళ్ళీ చూసింది. ‘ఇతను తన భర్త! ఇప్పుడు తనకి పెళ్ళైపోయింది.’ తనకి తానే చెప్పుకుంది.

“కూర్చుందామా?” అన్నాడు మూర్తి నవ్వుతూ.

ఆ నవ్వూ, అతనూ పూర్తిగా తనకే సొంతం అన్న భావన ఉమ మనసునిండా వ్యాపించింది.

“కాస్త ఆగండి. ఆఖరుగా ఒక్క ఫోటో, రెండు కుటుంబాలను కలిపి తీయాలి. లేకపోతే అన్నయ్య నన్ను చంపేస్తాడు.” మరిది ఆనంద్ అన్నాడు.

ఉమ మళ్ళీ దండను మెడలో వేసుకుంది. “రా… వచ్చి కూర్చో” అన్నాడు మూర్తి తన పక్కన చోటు చూపిస్తూ. అతని పక్కనే కూర్చోవడానికి, మిగిలిన వాళ్ళనందరినీ ఫ్రేములోకి తీసుకు రావడానికి మూర్తికి మరింత దగ్గరగా జరగాల్సి వచ్చింది. సంతోషంగా అనిపించింది. మామగారు, అత్తగారు, చిన్న పిల్లలు, చేతికర్రతో తాతయ్యలు, “నేను… నేను…” అంటూ తడి చేతులను తుడుచుకుంటూ ఆఖరుగా ఫొటోకు వచ్చి నిలబడ్డ అత్తయ్య,

దివ్య ఒక మూలగా నిలబడింది.

“దివ్యా! నువ్వు కూడా రా.”

“వద్దులే ఉమా.” ఇబ్బంది పడుతున్నట్లుగా అంది.

“అబ్బ… రారాదూ.”

“వద్దు..”

దివ్యను చూస్తుంటే మనసులో ఏదో తప్పు చేసిన ఫీలింగ్ మెదిలింది.

“రండి ప్లీజ్!” అన్నాడు మూర్తి.

“చూడు దివ్యా! ఆయన కూడా పిలుస్తున్నారు.” ఉమ లేచి దివ్య చేయి పట్టి లాక్కుని వచ్చి తన పక్కనే కూర్చో బెట్టింది.

“కారు వచ్చేసిందా?”

“స్టేషనుకు వెళ్ళింది అన్నయ్యా.”

“వచ్చేస్తుంది కదా. వీళ్ళందరినీ అభిరామపురంలో డ్రాప్ చేయడానికి కారు కావాలి.”

“మూర్తిగారూ! కాస్త నవ్వండి. ఫరవాలేదు. ఈ రోజేగా పెళ్లయింది!”

“ఫోటోగ్రాపర్ భలేగా జోక్ చేస్తున్నారే.”

“తాతగారూ! కాస్త ఇటువైపు చూడండి. ఎవరయ్యా గ్యాస్ లైట్? కాస్త ఎడంగా నిలబడు.”

“రెడి! స్మైల్!”

క్లిక్!

కళ్ళు మూసేసుకున్నానా?

“అల్లుడుగారూ! రండి. ఉమా! నువ్వూ రామ్మా. భోజనాలు ముగించేయండి. ఆలస్యం అవుతోంది. తరువాత చాలా పనులున్నాయి.”

“ఉండండి. కోటు సూటు తీసేసి పంచె మార్చుకుని వస్తాను.”

“అలాగే కానివ్వండి మూర్తీ.”

కృష్ణమూర్తి! నా భర్త పేరు కృష్ణమూర్తి! అదిగో ఆరడుగులకు కాస్త తక్కువగా, నిండైన విగ్రహంలాగా నడిచి వెళ్తూ ఉన్నాడే, అతనే నా భర్త.

“నేనూ చీర మార్చుకుని వస్తానమ్మా. దివ్యా! కాస్త ఈ బహుమతులలో ఆయనవి, నావి కాస్త వేరు చేసి పెట్టరాదూ.”

ఆయన! కొత్తగా ఏర్పడిన బాంధవ్యం!

ఉమ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది. “కాస్త అందరూ బైటికి వెళ్ళండి. చీర మార్చుకోవాలి.”

రిసెప్షన్ కోసం చేసుకున్న మేకప్ తీసేసింది. వదులుగా జడ అల్లుకుంటూ, “అమ్మా! నగలన్నీ తీసేయనా?” అని అడిగింది.

“సింపిల్ గా ఒక జత గాజులు వేసుకో. కాటన్ చీర కట్టుకో. త్వరగా భోజనాలు ముగించి బయలు దేరాలి.”

“ఎక్కడికమ్మా?”

“వాళ్ళ ఇంటికి.”

“ఎందుకూ?”

“ఎందుకూ అని ఏమీ తెలియని  దానిలా అడుగుతావేం? ఈ రోజు మీకు శోభనం.”

“ఏమిటీ? ఈ రోజేనా?” అంత సేపూ ఆకలిగా అనిపించిన ఆమెకి భయంగా అనిపించింది. ఈ రోజే… ఈ రోజే… గుండె వేగంగా కొట్టుకుంది.

“ఎందుకమ్మా ఇంత తొందర?”

“ఏమోనమ్మా? వాళ్ళే అడిగారు. మంచి ముహూర్తం ఉందట. ఈ రాత్రికే ఏర్పాట్లు చేయించమన్నారు. అందుకే మణి హడావిడిగా సాయంత్రం బజారంతా గాలించి, డబుల్ కాట్ కొని…  అది సరే. ఎప్పుడు స్నానం చేసావో గుర్తుందా?”

“పోయిన వారం అనుకుంటాను.”

“అయితే ఇబ్బంది ఉండదు.”

ఉమా తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంది.

“అన్నీ తెలుసుగా?”

“ఏమీ తెలియదమ్మా.”

“అన్ని పుస్తకాలు చదువుతావు. ఏమీ తెలియక పోవడమేమిటే? చెప్పనా మరి?”

“వద్దు వద్దు.”

అంతలో మణి వచ్చాడు అక్కడికి.

“ఉమా! అక్కడ ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కయ్యా! రోజ్ వుడ్ మంచం కోసం ఎంత తిరిగానో తెలుసా . స్పెషల్ గా బెడ్ ఆర్డర్ ఇచ్చి, దుప్పట్లు బెడ్ స్ప్రెడ్ ఆన్నీ ఐదు గంటలకే వాళ్ళింట్లో దింపేసి వచ్చాను.”

“మంచి పని చేసావురా మణీ!” ఉమ తల్లి అంది.

“ఉమా! నన్ను పెళ్లి చేసుకోనన్నావు కదూ.” నిట్టూరుస్తూ నిరాశగా అన్నాడు.

“బాధ పడకురా. నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను.”

“ఎంతైనా ఉమకి ఎవరూ సాటి రారు. అక్కయ్యా! నిజంగా చెబుతున్నాను. నాకు కాస్త నిరాశగానే ఉంది.”

“మణీ.. మణీ!” ఉమ నవ్వులాటగా తీసుకుంది.

“నా జాతకం చూడు. పెళ్లి చేసుకోవాలని అనుకున్న అమ్మాయి శోభనం కోసం పందిరి మంచం, పరుపు  కొని తేవాల్సిన బాధ్యత నా మీద పడింది.” మళ్ళీ నిట్టూర్చాడు.

ఉమ కోసం ఆమె భర్త ఎదురుచూస్తూ ఉన్నాడు. అరిటాకులో పదార్థాలు వడ్డించబడి ఉన్నాయి. ఉమకి ఆకలి ఎప్పుడో టా టా చెప్పేసి వెళ్ళిపోయింది. దానికి బదులుగా ఎదురుచూపులు, జ్వరం, ఆవేశం, సంతోషం, బిడియం అన్నీ కలగలిపి మెదడులో ఎవరో నింపేసినట్లు అనిపించింది ఉమకు.

“ఎక్కువగా తినకు మరి. తరువాత నిద్ర ముంచుకు వస్తుంది.”

కొత్త వాచీ, ఉంగరం అన్నీ మెరుస్తుండగా మూర్తి తల వంచుకుని భోజనం చేశాడు.

“కొత్త పెళ్ళికొడుకు గారూ! మా అమ్మాయి ఎలా ఉందో చూశారా?” అంటూ దివ్య ఆటలు పట్టించింది.

సమాధానంగా చిన్నగా నవ్వాడు మూర్తి

“అబ్బ! ఊరుకో రాదూ.”

“ఉండవే. నీ గురించి ఆయన తెలుసుకోవద్దూ. మా ఉమ బాగా బొమ్మలు వేస్తుందండి.”

“త్వరగా భోజనాలు కానివ్వండి. టైం అయిపోతోంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి మరి.” అన్నాడు మణి.

“మణీ! నువ్వు కాస్త నోరు మూసుకుంటావా లేదా?”  సన్నగా మందలించింది ఉమ.

రెండు కార్లలో అందరూ వియ్యాల వారింటికి వెళ్ళారు. రెండంతస్థుల ఇల్లు. “రామ్మా!” అంటూ హారతి పట్టారు. “ఇకమీద నువ్వు ఈ ఇంటి అమ్మాయివి.”

దాదాపు పదిన్నర అవుతుండగా మూర్తి ఉన్న గదిలోకి వెళ్ళింది. అతను మంచం మీద పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. ఉమ రాగానే పుస్తకం మూసి పెట్టాడు.

“They make it very obvious కదూ” అన్నాడు.

“ఊం.”

“ఇప్పుడే వద్దని అమ్మతో చెప్పాను. పాత తరం వాళ్ళు కదా. వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్లకి. నాకెందుకో ఈ సంప్రదాయాలు అర్ధం పర్దం లేనివిగా అనిపిస్తాయి.”

“ఊం.”

“ఇలాగే ఊ కొడుతూ ఈ రాత్రి పూర్తిగా గడిపేద్దామనుకుంటున్నావా?”

“ఊం.”

నవ్వాడు. “ఇలా వచ్చి కూర్చో ఉమా.”

ఉమా! మొదటి సారిగా పిలుస్తున్నాడా? ఇంతకు ముందు నా పేరు ఎప్పుడు పలికాడు?

“పెళ్లి జరుగుతున్నప్పుడు నీ చేతిలో రాశాను. గుర్తుందా? ఏమని రాసానో చెప్పు?”

మెల్లగా అంది. “ మొదట ఐ తరువాత ఎల్ ఆఖరున యు.”

“అంటే అర్థం తెలుసా?”

“తెలుసు.”

“నీ ఎత్తు ఎంత?”

“ఐదు మూడు .”

“బరువు?”

“నలబై ఎనిమిది.”

“కూర్చో ఉమా. చెయ్యి పట్టి కూర్చో బెట్టనా మరి.”

“కాస్త మెల్లగా మాట్లాడండి. అందరూ మేలుకునే ఉన్నారు.”

“ఏమైనా అడుగు.”

“నేను మీకు నచ్చానా?”

“నచ్చకుండానా? దివ్య ఏమైనా అన్నదా? నాకు కాస్త గిల్టీగా అనిపించింది.

“నాక్కూడా.”

“ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? నీతో ఓ మాట చెప్పనా? నాకు కొన్ని విషయాలను నువ్వే నేర్పాలి సుమా.”

“ఏమిటీ?”

“నాకేమీ తెలియదు.”

“నాక్కూడా.”

“నిజంగా?”

“నిజంగా.”

“ఎప్పుడూ తాకింది కూడా లేదు,”

“అబద్దం!”

“ఒట్టు! నీ చెయ్యి చూడు. ఎంత మెత్తగా ఉందో. నాకు అన్నీ కొత్త. స్త్రీ అంటే ఎలా ఉంటుందో నాకు అస్సలు తెలియదు. నీ దగ్గరి నించే నేర్చుకుంటాను.”

“మీ వెయిట్ ఎంత?”

“మొదట పరిశోధన. తరువాత చెబుతాను.”

ఎదురు చూడని క్షణంలో ఆమెను తన దగ్గరకి లాక్కున్నాడు. చెంప మీద మృదువుగా ముద్దు పెట్టాడు.

వదిలించు కోవాలని వృధాగా ప్రయత్నం చేసింది.

“జాకెట్టుకి బటన్స్ ఎక్కడ ఉంటాయో కూడా నాకు తెలియదంటే నమ్మవు కదూ.”

“వద్దు వద్దు. లైట్ తీసేయండి.”

“లైటు ఉండనీ, నేను చూడాలి.”

“ప్లీజ్!

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.