మా అమ్మ విజేత-3

– దామరాజు నాగలక్ష్మి

అమ్మాజీ సంవత్సరం పాప అయ్యింది. నడక, మాటలు అన్నీ బాగా వస్తున్నాయి. అందరికీ చాలా కాలక్షేపం. 

వీలక్ష్మిగారు మెలికలు తిరిగిపోతున్న సుందరిని చూసి “సుందరీ… ఏమయ్యిందమ్మా…” అనుకుంటూ కంగారు పడిపోయి చుట్టు పక్కల అందరినీ పిలుచుకు వచ్చింది. 

ఎవరో వెళ్ళి ఊరందరికీ నమ్మకంగా వైద్యం చేసే శాస్త్రి గారిని పిలుచుకు వచ్చారు. శాస్త్రిగారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఏవేవో కషాయాలు ఇచ్చారు. ప్రతిదీ సుందరి వాంతి చేసేసుకుంటోంది.  ఉన్నట్లుండి అమ్మా… అని అరిచి కళ్ళు తిరిగి పడిపోయింది.  శాస్త్రిగారు నాడి చూసి తల దించుకున్నారు.

ఊరందరినీ దుఃఖంలో ముంచి సుందరి వెళ్ళిపోయింది.  

అమ్మాజీ… అమ్మా… లే… లే… అంటూ లేపుతోంది. 

వీరలక్ష్మిగారు – అమ్మ దేవుడి దగ్గిరకి వెళ్ళింది. మళ్ళీ వస్తుంది. నువ్వు దా… పాలు తాగుదువుగాని అని పక్క రూములోకి వెళ్ళిపోయింది. 

ఎవ్వరికీ దుఃఖం ఆగట్లేదు. అందరూ ఒకటే మాట అమ్మాజీ తల్లిలేని పిల్లయిపోయిందని. 

సుందరి ముత్తయిదువుగా పోవడంతో కార్యక్రమాలన్నీ సక్రమంగా చేయించారు. ఇక పాప ఆలనా పాలనా చూడాలంటే చాలా కష్టం. వీరలక్ష్మిగారు కోడలు పోయేసరికి కుంగిపోయారు.  సుబ్బారావు బాధ అసలు చెప్పక్కరలేదు. ఒక మూల కూచుని బాధపడుతున్నాడు.

వీరభద్రయ్యగారు అమ్మా… వీరలక్ష్మిగారూ… అమ్మాజీని మేము పెంచుతాం. మా ఇంట్లో పదిమందిమి ఉన్నాం కాబట్టి పాప కూడా అమ్మని మర్చిపోగలుగుతుంది. మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి  అని అమ్మాజీని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళిపోయారు. 

వీరభద్రయ్యగారు ఇంట్లోకి వెడుతూనే… సావిత్రీ… ఇలా రా… అమ్మాజీకి కొంచెం అన్నం పెట్టు. వీరభద్రమ్మగారింట్లో అస్సలు ఏమీ తినలేదుటఅంటూ సావిత్రి చేతికి అందించారు. అప్పటికే సావిత్రికి 5 గురు మగపిల్లలు. అందరూ చిన్న చిన్నవాళ్ళు. మేనమామగా అమ్మాజీ అంటే ఎంత ప్రేమో… సావిత్రికి తెలుసు కాబట్టి భర్తమాటకి అడ్డుచెప్పలేదు.

ఏదిరా… నా కన్నతల్లి ఏది… నా బంగారు తల్లి ఏదీ… నోరు పట్టు ఆ ఆ ఆ ఆమ్. అదిగో కాకి చూశావా… ఒరేయ్ శర్మా ఇటురండిరా…. పాపకి అన్నం పెడుతున్నాను. ఇక్కడ కూచోండి… అని పిల్లలందరినీ పోగేసి అమ్మాజీకి అన్నం తినిపించింది. 

చాలా తొందరగా అమ్మాజీ పిల్లలందరితో కలిసిపోయింది. దగ్గిరలో వున్న పెద్దమ్మ, పెదనాన్న కూడా అమ్మాజీని వాళ్ళింటికి తీసుకెళ్ళేవారు.  పెద్దమ్మ కూతురు సీతమ్మ అంటే అమ్మాజీకి చాలా ఇష్టం. 

సీతక్కా…. సీతక్కా…. అంటూ వెంట తిరుగుతుంటే… సీత పెరట్లో ఉన్న మామిడి చెట్టుకి ఉయ్యాల కట్టి అందులో కూచోపెట్టి ఊపుతుండేది. సుబ్బారావు వాళ్ళు దగ్గరలోనే వుంటారు కాబట్టి రోజూ వచ్చి అమ్మాజీని చూసి వెడుతుండేవాడు.

అమ్మాజీకి ఐదవ సంవత్సరం వచ్చింది. పిల్లలందరితో కలిసి స్కూలుకి వెడుతోంది. చిన్న వూరు కాబట్టి స్కూల్లో టీచర్లు కూడా అమ్మాజీని  జాగర్తగా చూసుకునేవారు. 

అమ్మాజీ… నువ్వు అ, ఆ లు అన్నీ రాసుకుని రా…. రేపటి నుంచీ గుణింతాలు చెప్తాను అన్నారు సోమయ్య మేష్టారు

నాకు అన్నీ వచ్చేశాయి. నేను రేపు రాయను. ఇప్పుడే రాస్తాను అని అన్నీ రాసి చూపించింది. 

బావుంది. చాలా బాగా రాశావు. ఇలాగే రాస్తే నువ్వు పెద్దయ్యాక బాగా చదువుకుంటావు అన్నారు సోమయ్య మేష్టారు.

సోమయ్య మేష్టారు అమ్మాజీని దగ్గిర కూచోబెట్టుకుని అన్నీ నేర్పించేవారు. ఒకటో తరగతిలోనే తెలుగు చదవడం, రాయడం అన్నీ నేర్చేసుకుంది.  

ఒకరోజు పెద్ద వర్షం వస్తోంది. అమ్మాజీ నీళ్ళలో పరుగులు పెట్టుకుంటూ వెడుతుంటే… అమ్మాజీ… పడిపోతావ్. వుండు నేను వస్తున్నానుఅంటూ ఒక చేత్తో కర్ర పట్టుకుని సోమయ్యగారు వస్తుంటే… తనని కొట్టడానికి వస్తున్నారు అనుకుని ఇంకా రయ్ మని పరుగెత్తింది. 

చిన్న పిల్ల అలా వెడుతుంటే హడావుడి పడిన సోమయ్యగారు బురదలో కాలుజారి పడ్డారు. ఒక్కసారి వెనక్కి చూసిన అమ్మాజీ భయంతో రెండురోజులు స్కూలుకి వెళ్ళలేదు. 

మూడోరోజు సోమయ్యగారు వీరభద్రయ్యగారి ఇంటికి వెళ్ళి తలుపు వెనక నుంచీ నక్కి నక్కి చూస్తున్న అమ్మాజీని అమ్మాజీ… ఇటురా… నాకేం దెబ్బతగల్లేదు. నువ్వలా స్కూలుకి రాకపోతే… నీకు చదువు రావాలికదా… పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి అని దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకున్నారు. 

అమ్మాజీకి భయం పోయింది. రోజూ స్కూలుకి వెడుతోంది. సుబ్బారావు పెద్దబాలశిక్ష కొనిచ్చాడు కూతురికి. 

నాన్నా… నీకు తెలుసా… నేను అన్నీ చదివేస్తున్నాను. నాకు ఇంకా చాలా పుస్తకాలు కావాలి. నేను పేద్ద స్కూలుకి వెడతాను. సోమయ్య మేష్టారు నాకు అన్నీ నేర్పేస్తున్నారు అని ముద్దు ముద్దుగా చెప్పింది. 

అలాగే తల్లీ… నేను నువ్వు పెద్ద స్కూల్లో చేరుదువుగాని. బాగా చదువుకో… నీకు ఏం కావాలంటే అది కొనిస్తాను అని కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు.  వెళ్ళిపోతున్న నాన్నని అలా చూస్తూ నుంచుండిపోయింది. 

అమ్మాజీ 4వ తరగతి మంచి మార్కులతో పాసయ్యింది. ఎప్పుడూ చదువులో ముందరే వుండేది. ఐదోతరగతి కూడా చదువుతానని చెప్పింది. మామయ్యలు ముగ్గురూ, అత్తయ్యలు ఏమీ అడ్డు చెప్పలేదు.  వీళ్ళందరికీ అమ్మాజీ అంటే అంతులేని ప్రేమ.

వేసవి శలవులు అయిపోయాయి. సంచీలో కొత్త పుస్తకాలు పెట్టుకుని సంతోషంగా స్కూలుకి వెళ్ళింది అమ్మాజీ…. ఊరంతా చుట్టాలే అవడంతో… వాళ్ళే స్నేహితులు, వాళ్ళే అక్కలు, చెల్లెళ్ళు. 

సుబ్బారావు వాళ్ళమ్మ వీరలక్ష్మిగారు ఒకరోజు వచ్చి, వీరభద్రంగారూ సుబ్బారావుకి పెళ్ళి కుదిరింది. అమ్మాయి రెండో అమ్మాయి. పెద్దమ్మాయికి పెళ్ళయిపోయింది. మూడో అమ్మాయి చదువుకుంటోంది. వాళ్ళకి ఒక్కడే కొడుకు. పెళ్ళికూతురి పేరు సరోజ. చాలా అందంగా వుంది. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదువుకుంది. సరోజ ఇక నుంచీ అమ్మాజీని చూసుకుంటానని చెప్పింది. పెళ్ళవగానే కొన్నిరోజులు ఆగి అమ్మాజీని తీసుకుని వెళ్ళిపోతాంఅని ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది.

వీరభద్రయ్యగారు తమ్ముళ్ళు సాంబయ్యని, శివయ్యని పిలిచి, అమ్మాజీని తీసుకుని వెడతామంటున్నారు. సుబ్బారావుకి పెళ్ళి కుదిరిందిట. ఇన్నాళ్ళూ మనకి అలవాటయిపోయింది. పంపించాలంటే బాధగా వుంది. ఎంతయినా సవతి తల్లి కదా… ఎలా చూస్తుందో ఏమో… అన్నారు. 

సాంబయ్య, శివయ్య కూడా చాలా బాధపడ్డారు. 

సుబ్బారావు పెళ్ళికి అందరినీ పిలిచారు. ఏలూరులో పెళ్ళి. అందరూ బస్సులో పెళ్ళికి వెళ్ళారు. ఏదో ఉన్నంతలో ఉన్నంత పెళ్ళి బాగానే జరిగింది. సరోజ అత్తవారింటికి వచ్చేసింది. నెలరోజులయ్యాక అమ్మాజీని వాళ్ళింటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. 

సుబ్బారావు దారా బంగారు తల్లీ మనింటికి వెడదాం. నీ బట్టలు, పుస్తకాలు తెచ్చుకో. అమ్మ వచ్చేసింది. నీకు అన్నం పెడుతుంది. చదువు చెప్తుంది. అన్ని పనులూ చేయిస్తుంది అని ఎత్తుకోబోయాడు. 

నేను రాను. మనిల్లు ఇదే కదా… నాకిక్కడే బావుంది అంటూ పెద్దత్త సావిత్రి వెనక్కి వెళ్ళి దాక్కుంది. వాళ్ళందరూ ఎంత చెప్పినా వినలేదు. 

వీరభద్రంగారు – సుబ్బారావ్, ఒక్కసారి రమ్మంటే ఎలా వస్తుంది. దగ్గరలోనే వున్నారు కాబట్టి రోజూ కాసేపు తీసుకుని వెళ్ళండి. అలవాటయ్యాక అప్పుడు తీసుకుని వెడుదురుగాని. మాకూ ఒక్కసారి పంపాలంటే బాధగా వుంది” అన్నారు.

సుబ్బారావు “సరేనండీ” అని వెళ్ళిపోయాడు. 

(తరువాయి భాగం) 

అమ్మాజీ సంతోషంగా మామయ్య దగ్గిరకి వెళ్ళి ముద్దులు పెట్టుకుంది. ఆప్యాయంగా చేతులు రెండూ పట్టుకుని ఊపేసింది. వీరభద్రం గారు “పిచ్చిపిల్లా… నీకు ఇష్టం లేకుండా మేమెక్కడికీ పంపించం. సరేనా… పోయి ఆడుకో” అన్నారు. 

“సరే… మావయ్యా!” అంటూ ఆడుకోడానికి వెళ్ళిపోయింది. 

రోడ్డు మీద పరుగులు పెట్టుకుంటూ నేను ఇంకా మావయ్య దగ్గిరే వుంటున్నాను తెలుసా… ” అని చెప్పుకుంటూ తిరిగింది. 

పెద్దమ్మ కూతుళ్ళయిన సీత, పార్వతి, ఇందిర అమ్మాజీని దగ్గరికి తీసుకుని “రా మా ఇంటికి వెళ్ళి ఆడుకుందాం… అమ్మ నీకోసం కొబ్బరిలౌజు, బూరెలు చేసింది” అని తీసుకుని వెళ్ళారు. 

అమ్మాజీకి వీళ్ళందరూ అంటే చాలా ఇష్టం. పరుగులు పెట్టుకుంటూ పెద్దమ్మ అమ్మాడమ్మ ఒడిలోకి వెళ్ళి పడుకుంది. ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న పెద్దమ్మ ఒక చిన్న ప్లేటులో కొబ్బరిలౌజు, బూరెలు తెచ్చి నువ్వు నా చిట్టితల్లివి. ఏది ఇటురా… కొబ్బరి వుండ ఎంత బావుందో… బూరెలో నెయ్యి వేసి తెచ్చాను. గబగబా తినెయ్యాలి అంటూ కబుర్లు చెబుతూ పెడుతుంటే… 

పార్వతి అమ్మా… నాకూ పెట్టవూ… అంది. 

అమ్మాజీ అమ్మ, అమ్మ మా అమ్మ ఏదీ… పెద్దమ్మా… మా అమ్మ ఏదీ… అంటూ ఏడవడం మొదలుపెట్టింది. 

బూరె, కొబ్బరి వుండ తినలేదు. కళ్ళనించీ ధారాపాతంగా నీళ్ళు కారుతుంటే… అమ్మాడమ్మ తనూ కళ్ళనీళ్ళు పెట్టుకుని, అమ్మ వస్తుంది. మీ నాన్న దగ్గిర వుందని చెప్పింది. 

అవునా… నేను నాన్న దగ్గిరకి వెడతాను… పెద్దమ్మా నాకు అమ్మని చూపించు… అంటూ గోల పెట్టింది. 

అమ్మాడమ్మ వెంటనే తన అన్న వీరభద్రం దగ్గిరకి వెళ్ళి అన్నయ్యా… అమ్మాజీ అమ్మ కావాలని ఒకటే పేచీ పెడుతోంది. సుబ్బారావు వాళ్ళింటికి తీసికెళ్ళి దింపుదాం… ఉండలేకపోతే మళ్ళీ తీసుకు వచ్చేద్దాం అంది. 

వీరభద్రరావుకి ఇష్టం లేకపోయినా… సుబ్బారావుకి కబురు చేసి అమ్మాజీ అమ్మ కావాలని పేచీ పెడుతోంది. 

ఒక నాలుగు రోజులు ఉంచుకుని పంపించు అని చెప్పాడు. సుబ్బారావు సంతోషంగా… అమ్మాజీని, బట్టలు తీసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు.  అమ్మాజీ చాలా సంతోషంగా నాన్నతోబాటు వెళ్ళింది. 

వీరలక్ష్మిగారు ఎదురువెళ్ళి అమ్మాజీ…. వచ్చేశావా… ఇదిగో మీ అమ్మ వచ్చేసిందిఅని సరోజని చూపించింది. పసిపిల్లగా వున్నప్పుడే అమ్మ చనిపోవడంతో అమ్మాజీకి అమ్మ గుర్తులేదు. 

నవ్వుతున్న సరోజ దగ్గరికి వెళ్ళి అమ్మ! అమ్మ!” అని ముద్దులు పెట్టుకుంది.  సరోజ కాసేపు ఆడించి వీలక్ష్మిగారికి ఇచ్చేసింది. వీరలక్ష్మిగారు దగ్గరుండి అమ్మాజీకి కబుర్లు చెబుతూ అన్నం పెట్టింది. 

వీలక్ష్మిని చూస్తూ…. అమ్మాజీ… నువ్వు ఇంకో అమ్మ…. అక్కడ ఇంకో పెద్దమ్మ అంటూ మురిపెంగా మాట్లాడుతుంటే… నేను బామ్మని, నానమ్మనివీలక్ష్మిగారు చెప్పింది. 

అమ్మాజీ నువ్వు బామ్మయ్య అంటూ కిలకిలా నవ్వింది. 

దొంగా… బామ్మయ్య బలే పేరు పెట్టావే… అలాగే పిలు అంది.

అప్పటి నుంచీ అమ్మాజీ బామ్మయ్య అనే పిలిచేది.  రోజూ బామ్మయ్య చిన్న చిన్న జడలు వేసి, చక్కటి గౌను వేస్తే పుస్తకాలు తీసుకుని స్కూలుకి వెళ్ళేది. పాడీ పంటా బాగా వుండడంతో ఎవరో ఒక పాలేరు స్కూల్లో దింపి వచ్చేవాడు. 

మొత్తానికి అమ్మాజీ సుబ్బారావు దగ్గిర బాగా అలవాటు పడిపోయింది. మధ్యలో మావయ్యల దగ్గిరకి వెళ్ళి వస్తుండేది. రోజూ మాత్రం బామ్మయ్య దగ్గిరే పడుకునేది. 

సరోజకి ఉన్నట్టుండి అన్నం సయించడం మానేసింది. చాలా ఇబ్బందులు పడుతుండేది. అప్పటివరకూ కొంచెమైనా  అమ్మాజీనీ చూసుకుంటూ వుండేది. ఇప్పుడు పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. 

వీరలక్ష్మిగారు సరోజ మొదటిసారి గర్భవతి అని తెలుసుకుని,  అటు పొలానికి వెళ్ళి వస్తూ… మధ్య మధ్యలో అమ్మాజీ సంగతులు చూస్తూ వుండేది. అమ్మాజీకి కూడా బామ్మయ్యే బాగా నచ్చేది. 

సరోజకి నెలలు నిండుతున్నాయి. ఊళ్ళో అందరికీ అమ్మాజీ గురించి బెంగ ఎక్కువైంది.  

అమ్మాజీ మాత్రం అందరితో… నాకు ఓ చిన్న చెల్లెలు వస్తుందిట. నాన్న చెప్పాడు. నేను దాంతో ఆడుకుంటాను.   బామ్మయ్య నేను పాపని ఎత్తుకోవచ్చని చెప్పింది అంటూ అందరికీ చెప్పేది. 

సరోజని వాళ్ళమ్మ ఏలూరు డెలివరీకి ఏలూరు తీసుకెళ్ళింది. అనుకున్న రోజు రానే వచ్చింది. సరోజకి మొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆడపిల్ల పుట్టింది. పాపకి సుశీల అని పేరు పెట్టారు. ముద్దుగా తెల్లగా వున్న పాపని చూసి అమ్మాజీ తెగ గంతులేసింది.

సరోజకి అమ్మాజీని చూసుకోవడం కష్టం అయిపోయింది. అమ్మాజీని సుశీల దగ్గిరకి రానిచ్చేది కాదు. కానీ సరోజా వాళ్ళమ్మకి అన్నపూర్ణమ్మకి మాత్రం అమ్మాజీ అంటే చాలా ఇష్టంగా వుండేది. సరోజావాళ్ళ చెల్లెలు మాలతి కూడా సరోజతో బాగా మాట్లాడుతూ… చిన్న చిన్న పనులు చెప్తూ వుండేది. 

సరోజ మళ్ళీ అత్తగారింటికి వచ్చేసింది. అమ్మాజీకి స్కూలుకి వెడుతుంటే… సుశీలని ఆడించడానికి ఎవరూ లేరు. నువ్వు స్కూలుకి వెళ్ళకు అంది.

అమ్మాజీ బిత్తరపోయి ఊహూ… నేను స్కూలుకి వెడతాను. నేను చాలా చదువుకుంటానుఅంటూ ఏడవడం మొదలుపెట్టింది. 

సరోజ చెప్తుంటే వినిపించట్లేదా.. ఇంట్లో వుండి సుశీలతో ఆడుకో… నాన్నకి నేను చెప్తానుఅంటూ పుస్తకాలు లాక్కుని లోపల పడేసింది. 

అమ్మాజీ… ఏడుస్తూ కూచుంది. ఇంతలోకే వచ్చిన సుబ్బారావు – “ఏమైందిరా తల్లీ…! ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను ఎవరేమన్నారు. చెప్పు!” అంటూ ఓదారుస్తున్నాడు. 

అమ్మాజీ… అమ్మ…. అమ్మ….”    అని చెప్తుంటే ఇంతలోకే గబగబా వచ్చిన సరోజ నేనే వెళ్ళద్దన్నానండీ… నాకు అస్సలు పనులు అవట్లేదు.  సుశీలతో ఇంట్లో వుండి ఆడుకోమన్నాను. అయినా పదేళ్ళు వచ్చాయి కదా… ఆడపిల్లని ఇంకా స్కూలుకి ఎందుకు? ఇలాంటప్పుడే మనం జాగర్తగా చూసుకోవాలి” అంది. 

పిల్లల పెంపకం తెలియని సుబ్బారావు అన్నింటికీ బుర్ర ఊపాడు. నాన్న ఏమీ మాట్లాడకపోవడం చూసిన అమ్మాజీ ఏడుస్తూ ఓ మూల కూచుంది. సుబ్బారావు జాలి పడడం తప్ప ఏమీ అనలేదు. 

వీలక్ష్మిగారు ఏడుస్తూ అలాగే నిద్రపోయిన అమ్మాజీని తీసుకెళ్ళిలోపల పడుకోపెట్టింది. పిచ్చిపిల్ల ఏమీ తెలియదు. నిజంగానే ఆడపిల్లకి పదకొండు సంవత్సరాలు వచ్చాయంటే ఎప్పుడు ఎలా వుంటుందో తెలియదు అంటూ అలాగే చూస్తున్న సుబ్బారావుని ఏమీ అనలేక లోపలికి వెళ్ళిపోయింది. 

అమ్మాజీ పసి మనసుకి తన మీద ఏదో ఒత్తిడి ఉంటోందని బాగా అర్థమయ్యింది. రోజూ సరోజ అమ్మాజీ చిట్టి ఒళ్ళో సుశీలని పడుకోపెట్టి ఆడించమనేది. పాప ఎందుకయినా ఏడిస్తే  అమ్మాజీ బుగ్గలు గిల్లి, తొడపాసాలు పెట్టేది. అమ్మాజీ గట్టిగా ఏడిస్తే అత్తగారు వీరలక్ష్మి ఏమంటుందోనని…. ఆవిడ అక్కడికి వచ్చేసరికి అమ్మాజీని పలకరిస్తున్నట్లు ఊరడిస్తున్నట్లు మాట్లాడేది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.