బతుకు చిత్రం-12

– రావుల కిరణ్మయి

పైసలు మనమిత్తే ఈయనా మీ వదినే ఇద్దరు పోయి చూసేటోళ్ళకు అబ్బా ..!ఎంత బాధ్యతెమ్బడి వచ్చిండు చెల్లెపెల్లిచెయ్యాల్నని ,అని ఊరంత అనుకొని నిన్ను మీ తమ్మున్ని ఆడివోసుకోను ఉపాయం జేత్తాండు.అని అంటుండగా ,

ఎహే ..!ఆపు నీ సోది ..!మా అన్న గంత యావ గల్లోడైతే, రమ్మని మమ్ములనెందుకు పిలుత్తడు.డైరెక్టుగ చార్జీలియ్యుండ్రి.అనేటోడు గదా!పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగనే కనవడ్డట్టు ఆళ్ళను గురించి నువ్వు ఎట్లనుకుంటే అట్నే కనవడుతది.ఆయన కాదా పైసలు లేకనే అడిగుంటడు.రేపొద్దున ఓ వంద రూపాయలైతే ఇత్త అన్నాడు.

ఇచ్చుడేంది?మల్ల పోకుండ ఉండుడేన్దీ ?నువ్వు సుతం పోయిరాపో ..!మీ అయ్యను చెల్లెను చూసినట్టుసుతం ఉంటది అన్నది.

ఎందుకే?వందకు చూసుకుంటే ఎనిమిదివందల రూపాయల పని జెడుతది.ఈ తాపకు అన్న పోయి ముచ్చట తెల్సుకచ్చినంక నిమ్మళంగ మనం పొయ్యేది.అని ఇక ఈ ముచ్చట ఇంతటితోటి ఆపితే బాగుంటది అన్నట్టుగా చెప్పేసాడు.

***

ఇంచుమించు చిన్న తమ్ముని భార్య గూడ ఇట్లనే మాట్లాడింది.దానికి శివుడు,

అన్న పొయ్యత్తే వంద రూపాయలు ఇత్తే సరిపోతది.అదే నేను సుత పోతే నాయనకు, చెల్లెకు పండో,ఫలమో అంటే ఇంకెక్కువ అయితయి.ఇప్పుడైతే పొయిరాని !అన్నడు.

అట్లా ఇద్దరు తమ్ముళ్ళు ఇచ్చిన చార్జీలు తీసుకొని ముత్యాలు భార్య తో కలిసి వాళ్ళ ఊరు బయలుదేరిండు.

బస్టాండ్ల జాజులమ్మ దోస్తాని కమల అన్న అనుకోకుండా కల్సిండు.

చెల్లె లగ్గానికే వత్తాండ్రానే?ఇంకిద్దరు తమ్ముళ్ళు ఎన్కత్తానారే ?అన్నాడు.

‘’పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్టు ‘’ చెల్లెకు సంబంధమే సూడలేదు ,వాల్లచ్చి ఏమ్జేత్తరే?నేనే ఓ మా రాజసొంటి సంబంధం సూసిన నాయన తోనూ ,చెల్లె తోనూ మాట్లాడడానికి వత్తాన.వాళ్ళు సరే అంటే వాళ్లిద్దరు గూడ వత్తనన్నారు.అన్నాడు.

దానికి పరేషానుగా జూస్తూ,

గదేంది?చెల్లె లగ్గం వచ్చే నెల లోనే ఉండే.నువ్వు గిప్పుడు సంబంధం తెచ్చుడేన్దీ ?ఇన్నోద్దుల సంది   

ఎవ్వరు జెప్పలే అన్నాడు.

మేమే ఎక్కడున్నమో తెల్వకుంట దూరంగుంటిమి .వాళ్ళేంజేత్తరు పాపం !అన్నది ముత్యాలు భార్య.

అయితమాయేగని,పిలగాంది ఏ ఊరే ?ఎవలు దెచ్చిన సంబంధం ?అడిగిండు  ముత్యాలు.

దేవుడు తెచ్చిన సంబంధం….!

అయ్యో !గట్లంటవేందే?కారడ్డంగ !అన్నాడు.

కారడ్డం గాదు ,ఏరడ్డం గాదు.మీ చెల్లె చేసుకున్న పుణ్యమే ఇది.

అర్థం కానట్టు చూస్తున్న ముత్యాలు తో ,జరిగిన విషయం అంతా పూస గుచ్చినట్టు చెప్పాడు.

అంటే మా కులపోడు గాదా ! ‘’ఇంత బతుకు బతికి ఇంటెనక సచ్చినట్టు ‘’ ఇన్నేండ్లు ఆగి గిప్పుడు కులం జెడుడు ఏం పద్ధతిది ?అని ఆవేశపడుతుండగానే ,ఊరు బస్సు రానే వచ్చింది.

ఇదేదో ఈడ అనుకునుడేంది ?పాండ్రి ఇంటికే పోదాం అన్నాడు .

ముత్యాలు భార్య ,అన్నా !ఇగ మేము ఇప్పుడు రాము .ఇషయమైతే తెలిసింది గదా !ఇగ పైసలు కొద్దన్న తయారు చేసుకోని వత్తం.నువ్వు మేము కలసిన ముచ్చట ,మాకు నువ్వు చెప్పిన ముచ్చట ఏది ఎక్కడ జెప్పకే.అన్నది .

లే ..చెల్లే !నేనెందుకు జెప్త ?చెప్పనే చెప్ప.మీరు ఎప్పుడత్తరో అప్పుడే రాండ్రి అనుకుంట ఆయన వెళ్ళిపోయాడు.

***

ఏందే ?మనం సుత పోయి అడిగే పనికి ,తరువాత వత్తం ,ఎవలకు జెప్పకు అని ఎందుకు అన్నవ్?అర్థం గాక అడిగాడు ముత్యాలు.

మేస్త్రీ తెచ్చిన సంబంధ మైతే అందరం బాగుంటమనుకుంటిమి.కానీ నడుమిట్ల గిట్ల జేత్తారని కలగన్నమా?ఇప్పుడు నువ్వొక్కనివి అడిగితే పాయిదా ఏమున్నది?మీ తమ్ముళ్ళను కూడగట్టుకొని పొయి అడిగితే ఏమన్న లాభమున్టది గని. 

అంటే ..!

ఏమున్నది ?మీ తమ్ముళ్ళను కల్సి ఇషయం జెప్పి ఇచారించి ఈ లగ్గం జేసుడా ?ఆపుడా? అనవసరంగా ఒక తాగుబోతుకిచ్చి గొంతుకోసుడు కంటే,మేస్త్రీ తెచ్చిన ఆసామి సంబంధం ఖాయం జెయ్యమని గట్టిగ అడుగుదం.మీరు ముగ్గురు ,మేం ముగ్గురం మొత్తం ఆరుగురం కల్సి అడిగితే తప్పకుండ మనం జెప్పినట్టే ఇంటరు అని విడమరిచి జెప్పింది.

ముత్యాలు అర్థమయి ,కానట్టు మొహం పెట్టి ఆమె వెనకాలే మౌనంగా ఇంటికే నడిచిండు.

***

ఆ మరునాడు తమ్ముళ్ళను ఏగిరంగా రమ్మని కబురు పెట్టిండు.

అన్న పిలుస్తుండు అంటే పని ,పండే అయినట్టు ఉన్నదనుకొని,అన్జులు,శివుడు ఇద్దరు భార్యలతో సహా పని మానుకొని మనకు మంచి రోజులు వచ్చినట్టున్నయని,కూలిపని తప్పినట్టేనని కలలు కనుకుంటూ వచ్చి వాలిండ్రు.

ముత్యాలు జరిగిన సంగతంత భార్యకే చెప్పమన్నట్టుగా చెప్పి సప్పుడుజెయ్యక కూసున్నడు.

ముత్యాలు భార్య మరుదులకిద్దరికీ ఇన్నది ఇన్నట్టు జెప్పి ,

ఒగాల,ఈ లగ్గం అయితే పాయిదా ఏమున్నది?కులం జెడి నాదాను అవడం తప్పితే?ఆసామి సంబంధం అయితే కులం జెడ్డా,సుఖం దక్కినట్టుండే,జాజులమ్మే గాక మీ నాయనతో పాటు మనమందరం బాగుపడి పచ్చగ బతికేటోళ్ళం.ఇప్పటికయినా ఏమయింది?గతి లేక మీ చెల్లె ఒప్పుకొనుండవచ్చు !మనం పోయి ఇవరంగ జెప్పితే ఆ సంబంధం మానుకొని,మన మాట ఇని ఆసామి నే జేసుకుంట అంటే రొట్టె ఇరిగి నేతిల వడ్డట్టే గదా!అని నిమ్మళంగా ఎటు జేసి ఆసామి కే ఇచ్చి చేసి మనం గూడ బాగుపడాలె అని బలంగా చెప్పింది.

అన్జులు,శివుడు ఇద్దరూ విషయం విని నీరుగారి పోయారు.ఆశలన్నీ అడియాసలు అయ్యాయని బాధ పడుతూ,

అంతా జరిగాక ఇప్పుడు మన మాట విని జాజులు లగ్గం మాని ఆసామిని ఒప్పుకుంటుందా?నాయన ఒప్పుకుంటాడా?అని అనుమానపడసాగారు.

ఎందుకు ఒప్పుకోరు?ఇంటికి పెద్ద దిక్కు మీరే.రేపటికి మీ నాయ్నను చూసే బాధ్యత గూడా మీదే కదా!ఇప్పుడన్న ఆసామి పుణ్యమాని ఇంత కడుపునిండ తిని మంచిబట్ట గట్టి ఆ గుడిసె జాగల ఇంత ఇల్లు కట్టుకొని దర్జాగ మన కులం ల ఎవనికి లేని సర్గం తోని బతకచ్చు.ముసలితనాన తండ్రిని జూసే బాధ్యత కొడుకులదేనని,మీ నాయ్నకు మాత్రం ఎరుకలేనిదా?ఏంది?అన్నది అన్జులు భార్య.

ఇద్దరు అక్కలు జెప్పేది సబబుగానే ఉన్నది ఆలోచించుండ్రి అన్నట్టు చిన్నామె చెప్పింది.

ఇట్లా అందరూ కూడబలుక్కొని ఈ పెళ్లి మనమనుకొనే ఆసామి తోనే ఎట్లన్న జరిపియ్యాలనే ఆలోచన జేసి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యారు.

  ***

 ఎంతో అభిమానం ఉన్నట్టు ,పండ్లు ఫలాలు,అదోటిదోటి తినేవి ,తాగేవి ముగ్గురు అన్నదమ్ములు ఎవరికి వారు సంచులల్ల పట్టుకొని ఊరు బయలుదేరారు.

బస్సులో వీళ్ళు పరిచయం ఉన్నవాళ్ళందరూ పెళ్ళికే వత్తాండ్రని అడుగుతుంటే అవునన్నట్టుగా తలాడించుకుంట ముగ్గురు ఒక్క మాట మీదనే ఉన్నారు.మూడు,నాలుగ్గంటల ప్రయాణం తరువాత ఊరు చేరారు.

ఊరు మొదట్లోనే తమ కులాల పాకల మధ్యన తమ గుడిసె ఎర్రగ జాజు అద్దుకొని బురదల ఉన్న కలువపువ్వోలె అందం గా కనబడింది.ఆరుగురు జట్టుగా నడుస్తుండే వరకు రోడ్డు మీద పొయ్యేవారు ఆగి ఆగి చూడసాగారు.

పరిచయం ఉన్నవారిని బాగున్నారా !అని మందలించుకుంటూ మెల్ల మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తమ గుడిసెకు చేరుకున్నారు.

గుడిసె కు అడ్డంగా తడిక వేసి ఉంది.గుడిసె చుట్టూ చాలా శుభ్రంగా ఉండి రకరకాల పూల మొక్కలు,కూరగాయల పాదులు,గుడిసె కప్పుకు సోర,బీర,కాకర ,గుమ్మడి తీగలు ఎగబాకి పచ్చని పందిరి లాగా విరగ కాసిన కాయలతో వేలాడుతుండడం వారిని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది.

గుడిసె గోడలకు తెల్లని సున్నం తో వేసిన ముగ్గులు ఎంతో కళను తెచ్చిపెట్టాయి.గుడిసె ను చూస్తున్న అన్నదమ్ములకు పెండ్లికి ముస్తాబయి కూర్చున్న జాజులమ్మలా కనిపించ సాగింది.

ఆరుగురూ సిగ్గుపడ్డారు,తాము ఏనాడు గుడిసె ను పట్టించుకున్నది లేదు.ఎప్పుడూ నాకేమి అక్కెర?అన్న స్వార్థం తో ఆలోచించి పాడవుతున్నా లెక్క చేయక ఊరు వదిలిన గతం గుర్తుకు వస్తుండగా వాకిలి లోనే నిలబడి చూస్తుండగా ,జాజులమ్మ మంచినీళ్ళ బిందె తల పై ఎత్తుకొని వస్తూ ..దూరం నుండి వీళ్ళను చూసి అత్తగారు తరుపు వాళ్ళేమోనని మరింత గాబరాగా రాసాగింది.

దగ్గరవుతున్న కొద్దీ వాళ్ళు తన అన్నలు,వదినెలు అని పోల్చు కొని కొత్త ఉత్సాహం తో గుడిసెను చేరింది.

నీళ్ళ బిందె తో వచ్చిన జాజులమ్మను చూసి ముత్యాలు భార్య ఆప్యాయంగా ఎదురెళ్ళి అమాంతం బిందెను అందుకొని దింపి ,

గట్టిగా కౌగిలించుకొని ,

జాజులూ !ఎలా ఉన్నావమ్మా?అంటూ పలకరించింది.

మిగతావారు కూడా చుట్టూ చేరారు.

అందరినీ తన చుట్టూ చూసి జాజులమ్మ కళ్ళలో ఆనందం తో నీళ్ళు తిరుగుతుండగా ,

నేను బాగానే ఉన్నాను వదినా !మీరందరూ ఎలా ఉన్నారు?అంటూ అన్నలనూ ,వదినెలను తడిమి చూసింది.

బాగున్నమమ్మా ..!నువ్వే ఇంతలా చిక్కిపోయావేమ్మా?అడిగింది కడుపులోనుండి కాక పెదాలపై నుండే ప్రేమ ఒలక పోస్తూ అన్జులు భార్య.

గడెం లేదు వదినే!మీరే చానా దినాలయింది గదా !చూసి.అందుకే అట్ల అనిపిస్తుందేమో!పాండ్రి..పాండ్రి..లోపలికి.అంటూ ,గుడిసె లోకి దారి తీసింది.

తాము తెచ్చిన సరంజామా జాజులు కు ఇచ్చి అందరూ లోపలి వస్తువులను కలియ జూడ సాగారు.కొత్త మంచం,పక్కనే రెండు కుర్చీలు ,ఆ పక్కనే గ్యాస్ స్టవ్….ఇలా అన్నీ కొత్త కొత్త వస్తువులతో గుడిసె హుందాతనం సంతరించుకుంది.

మంచం వాల్చి ..

అన్నలూ …!కూసోన్డి.మంచినీళ్ళు గిన తాగుతరా?అని గ్లాసులల్ల మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.

అయ్యో ..!నా మతి మండ.కాళ్ళన్న కడుక్కోమనక పోతినా ..అని చెంబుల నీళ్ళు తెచ్చి చేతులకు అందియ్యబోతుంటే,

శివుని భార్య ,వదినమ్మా !నువ్వు ఇంటి ఆడబిడ్డవు.ఇంటి ఇలవేల్పు అసొంటిదానవు.మాకు మర్యాదలు చేసుడేంది?అని చెంబు అందుకొని,తనే అందరికి నీళ్ళిచ్చింది.

జాజులమ్మ అందరికీ చాయలు పోసింది.

కొంచెం స్థిమితమైనాక జాజులమ్మ అడిగింది.

అన్నా ..!మీకు నా లగ్గం గురించి ఎట్ల తెలిసెనే?అని.

దానికి ముత్యాలు భార్య,అదేందమ్మ ఇంగువ గుడ్డల గట్టినంత మాత్రాన వాసనా దాగుతదా?మేం దవ్వున ఉంటే మాత్రం,నీ లగ్గం జెయ్యాల్నని మాకు మాత్రం సోయి లేదనుకుంటివా?ఏమి?మంచి సంబంధం చూస్కొని రావాల్ననే ఇన్నోద్దులు రాలేదుగని,ఇప్పుడు నీకు లాగగా బలం వచ్చి ‘’కలిసచ్చిన కాలానికి నడిసచ్చే కొడుకన్నట్టు’’ నీ కాడికే మంచి ఆసామి నిన్ను గావాల్నని ఎదుక్కుంట అచ్చిండు అన్నది ,జాజులు తల పై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ.

జాజులు కొంచెం అయోమయంగా చూస్తుండగా..

అదేంటి తల్లీ…!గట్ల పరేషాను గావడితివి?అయ్య రాని,అన్ని ఇవరంగ చెబుతం ,ఇంతకూ అయ్యెటు వోయినట్టు?అడిగాడు ముత్యం.

నాయన ఊర్లకు పని మీద వోయిండు.వస్తుండచ్చు.అని చాట్ల బియ్యం పోసి చెరగడం మొదలు వెట్టింది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.