మా అమ్మ విజేత-4

– దామరాజు నాగలక్ష్మి

అమ్మాజీకి తన పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వుండేది. స్కూలుకి వెళ్ళి చదువుకోవాలని వుండేది. 

వర్ధని, ఇందిర చెల్లెళ్ళు ఇద్దరూ స్కూలుకి పుస్తపట్టుకుని వెడుతూ… తమవంక అలాగే చూస్తున్న అమ్మాజీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు. దిగాలుగా కూచున్న అమ్మాజీని సరోజ వచ్చి పెద్దదానివవుతున్నావు రోడ్డు మీద ఏంచేస్తున్నావు? సరోజ ఏడుస్తోంది వచ్చి ఆడించు అని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూసేసరికి సుశీల బట్టలన్నీ తడుపుకుని పాడుచేసుకుంది. 

అస్సలు పనులు అలవాటు లేని అమ్మాజీ… అమ్మా… పాప బట్టలు తడుపుకుందిఅంటూ… పొట్టకి ఎత్తుకుని సుశీలని దూరంగా కూచోపెడదామనుకుంది. 

అసలే చిన్నపిల్ల, సన్నగా వుండేదేమో పాప ఒక్కసారి విదిలించుకుని కిందపడి గుక్కపట్టి ఏడవడం మొదలు పెట్టింది. సరోజ గబగబా వచ్చి పిల్లని ఎత్తుకోవడం కూడా రాదా… పైగా పడేస్తావా… అంటూ ఒక చేత్తో సుశీలని ఎత్తుకుని మరో చేత్తో అమ్మాజి దబదబా బాదింది. ఊహించని పరిణామానికి అమ్మాజీ గట్టిగా అరుచుకుంటూ… ఏడ్చుకుంటూ… ఎదురుగా వున్న పెద్దమ్మా వాళ్ళింటికి పరిగెత్తింది. 

పెద్దమ్మా… అంటూ ఒక్కసారి పెద్దమ్మ ఒళ్ళోకి పడిపోయింది. ఒళ్ళంతా చెమటలు. వీపంతా తట్లు తేలిపోయింది. ఎగశ్వాస వస్తోంది. 

అమ్మాజీ పెద్దమ్మ అమ్మాడమ్మగారు,  గబగబా దగ్గిరకి తీసుకుని, కొంచెం మంచినీళ్ళు తాగించింది. 

“ఏమైందిరా తల్లీ…. ఎందుకు అలా ఏడుస్తున్నావు?” అని అడిగింది.

అమ్మాజీ అమ్మ పాపని ఎత్తుకోమంది. పాపని నేను ఎత్తుకోలేకపోయాను. చేతులోంచి జారిపోయింది. కిందపడి బాగా ఏడ్చింది. అందుకని అమ్మ నన్ను బాగా కొట్టింది అని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే వుంది. 

అమ్మాడమ్మగారికి కళ్ళనించీ నీళ్ళు వచ్చాయి. అయ్యో… అసలే చాలా సన్నగా వున్నావు. నీకు బలమెక్కడిదే… నేను మీ బామ్మతో మాట్లాడతానుండు

పెద్దమ్మా…. వద్దు వద్దు అమ్మ మళ్ళీ కొడుతుంది… అంది.

ఏమీ కాదులే… నువ్వు భయపడకు. నిన్ను కొట్టకుండా నేను చూస్తానుగా… అంటూ మాట్లాడుతుండగానే అమ్మాజీ ఆవిడ ఒడిలో నిద్రపోయింది. 

సీతా…. ఇటురా… అమ్మాజీని మంచం మీద పడుకోపెట్టు. నేను ఇప్పుడే అలా మామయ్య దగ్గిరకి వెళ్ళి వస్తాను అంది.

సీత అమ్మాజీని అందుకోగానే… తలుపు దగ్గిరకి వేసి అమ్మాడమ్మగారు పెద్దన్నయ్య వీరభద్రం దగ్గిరకి వెళ్ళింది. 

బయట అరుగు మీద కూచుని ఎవరితోనే కబుర్లు చెప్తున్న వీరభద్రం ఏమిటే… అమ్మాడీ… ఇటువచ్చావు. మిట్టమధ్యాహ్నం ఎండ చుర్రుమంటోంది.  ఈ టైములో రావుగా అన్నారు. 

ఏమీలేదన్నయ్యా…. నీతో కొంచెం మాట్లాడాలనిపించింది. వచ్చానంతే… అంది.

సరే వుండు వస్తున్నాను. ఈలోపున మీ వదినతో మాట్లాడుతూ వుండు. వీళ్ళని పంపించేసి వస్తాను అన్నాడు. 

అమ్మాడమ్మ లోపలికి వెళ్ళింది. వెంకాయమ్మగారు ఏవో సద్దుకుంటూ…. ఉన్నఫళాన వచ్చిన అమ్మాడమ్మతో…. రా… ఇలా కూర్చో… ఏమిటీ సంగతి. మీ అయనతో ఏదైనా గొడవయ్యిందా…. అతను మంచివాడే కదా… ఏం జరిగింది?” అడుగుతూనే వుంది. 

ఏమీలేదు వదినా…. పాపం అమ్మాజీ సంగతే… పిల్లని ఎత్తుకోలేకపోయిందని సరోజ దాన్ని చావబాదింది. వీపంతా తట్టుతేలిపోయి, ఎగశ్వాసతో వచ్చి నా ఒళ్ళో పడిపోయింది. పాపం అది ఒకటే ఏడుపు… అసలే అర్భకురాలు. తల్లిలేని పిల్ల అంటూ చెప్తూనే వుంది.

ఇంతలోనే వీరభద్రకూడా వచ్చి అమ్మాడమ్మ చెప్పేది వింటూనే వున్నాడు. గట్టిగా ఓ నిట్టూర్పు విడచాడు. పెళ్ళి చేసుకోవద్దు అని వయసులో ఉన్న సుబ్బారావుని అనలేకపోయాం. మనం పెంచుతామంటే లేదే నేనే చూసుకుంటా అని తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదో ఒకటి ఆలోచచేయాలి. పిల్లకి పదకొండు సంవత్సరాలు వచ్చాయి…..  అంటూ సాలోచనగా కూచున్నాడు. 

ఇంతలోనే వెంకాయమ్మ ఒక పని చేస్తే సరి. అమ్మాజీని సరోజ తమ్ముడు సూర్యంకి ఇచ్చి పెళ్ళి చేస్తేసరి. సూర్యం బావుంటాడు. ఇద్దరికీ జోడీ బానే సరిపోతుంది అంది. 

సరే ఆ విషయం ఆలోచిస్తే బాగానే వుంటుంది. పిల్లాడు మంచివాడిలాగే వుంటాడు. బుద్ధిమంతుడని విన్నాను. మొన్నెప్పుడో వాళ్ళమ్మగారు కూడా ఏవైనా సంబంధాలుంటే చెప్పమన్నారు అంది. 

వీరభద్రం నేను మెల్లిగా సుబ్బారావుతో మాట్లాడతాను. పాపం దీనికి కొంచెం ఊరటగా వుంటుంది అన్నాడు. 

ఎప్పుడొచ్చొడో సుబ్బారావు గుమ్మంలో తల వంచుకుని నిలబడి వున్నాడు. 

రా సుబ్బారావ్… అక్కడే నిలబడిపోయావేం…? రా వచ్చి కూచో… అన్నాడు వీరభద్రం.

సుబ్బారావు కొంచెం ఇబ్బందిగా వచ్చి కూచుంటూ… అమ్మాజీ… వచ్చిందా… వాళ్ళమ్మ కొట్టిందని ఇంట్లోంచి పరిగెత్తిందిట. నేను ఇప్పుడే వచ్చాను. ఇంట్లో కనిపించకపోతే ఇటు వచ్చాను అన్నాడు. 

మా ఇంటికి రాలేదు కానీ… అమ్మడమ్మ దగ్గిరకి వెళ్ళిందిట. నిద్రపోతోందిట. మేము సాయంత్రం పంపిస్తాములే…. ఆ… మర్చిపోయాను. నీకు ఖాళీ అయినప్పుడు ఒకసారి రా… నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. 

సుబ్బారావు అమ్మాడమ్మ వైపు తిరిగి ఇంట్లో ఎవరున్నారు… నేను అమ్మాజీని తీసుకుని వెడతాను అన్నాడు. 

సీత వుంది కానీ… నేనూ వస్తున్నాను వుండు అంటూ అమ్మాడమ్మ ఇంటివైపు దారితీసింది. 

ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి అమ్మాజీ ఇంకా నిద్రపోతోంది. సుబ్బారావు దగ్గిరగా వెళ్ళి తల నిమిరి వచ్చాడు.

ఆ స్పర్శకి అమ్మాజీ ఒక్క ఉదుటన లేచి కూచుంది. నాన్నా…. నాన్నా… అంటూ ఏడవడం మొదలుపెట్టింది. 

రా… ఇంటికి వెడదాం… అమ్మకి నేను చెప్తాలే… అన్నాడు.

ఊహూ… నేను ఇక్కడే వుంటాను. రేపు వస్తా… అంది.

అమ్మాడమ్మ…. పోనీలే సుబ్బారావ్… ఇవాల్టికి ఉండనీ…. పిల్లలతో కాసేపు ఆడుకుంటుంది. ఎదురుగానే కదా… మీరుండేది. రేపు తీసుకుని వెడుదువుగానిలే…. అంది. 

అమ్మాజీని ముద్దుపెట్టుకుని సుబ్బారావు ఇంటికి వెళ్ళిపోయాడు. 

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.