
చిత్రలిపి
ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని !
-మన్నెం శారద
ఒకానొక కాఠిన్యపు కిరణస్పర్శకు
తాళలేక తల్లడిల్లి ..కరిగి నీరయి న మంచు శిఖరం ఒకటి ఏరయి సెలయేరయి వాగయి ,వంకయి శాపవిమోచనమొందిన గౌతమిలా తన ప్రియ సాగర సమాగం కోసం మహానదిగా మారి దక్షిణ దిశకు పరుగులు తీసింది ! పట్టలేని పరవశం అది ! ఎన్నో ఏళ్ల కల సఫలం కాబోతున్న సంతోషం అది ! ఆపుకోలేని ఆనందం తో గిరులని తరులని ఒరుసుకుంటూ వురుకుతున్న నదిని చూసి ఆ చెట్టు అడిగింది ‘ఎక్కడకి మిత్రమా …అంత వేగం ?దేనికోసం ఆ దుందుడుకు ?”అని పరిహాసంగా . నది ఒకింత సిగ్గు పడుతూ వేగాన్ని తగ్గించి నిలకడగా గా నిలబడి “నీకు తెలియదా నెచ్చెలీ …సాగరం వైపే నా పయనం ఇన్నాళ్ళకి నా కల సఫలం కాబోతున్నది కానీ …అంది విచారం గా మరెందుకా విచారం అంటూ కొంటె ప్రశ్న వేసి ఉడికించింది చెట్టు “ఏం చెప్పను ,చూడు నా వంటినిండా మట్టీమసానం . విరిగిన కొమ్మలూ కుళ్ళిన శవాలూ … “ఇవా …. నేను నా ప్రియుడికిచ్చే కానుకలు ” అంటూ మరింత కన్నీరు కార్చి …. ..చెట్టు వయ్యారం గా నదిలోకి వంగి వళ్లంతా కదిలించి తన మేని సొగసులు కొన్ని నదికి దారాదత్తం చేసి చిరునవ్వు నవ్వింది ప్రేమగా ….. నది కళ్ళు చెమ్మగిల్లి అలలై పొంగాయి పూలని గుండెలకు హత్తుకుంటూ “ఓ స్నేహితురాలా దేనికి నాపై నీకింత ప్రేమ ” అని గుసగుసలాడింది పట్టరాని ప్రేమతో చెట్టు నవ్వింది … “నీ నీటితో ప్రాణం పోసుకున్నదాన్ని ….నీ బిక్షేకదా నా తనువు “…అంటూ వల్లమాలిన కృతజ్ఞత ఒలకబోస్తూ సాగిపోతున్న నదిని ,, ఒడ్డున చేతులూపి సాగనంపుతున్న చెట్టునీఅంతసేపూ ఆనందంగా వారిని గమనిస్తున్న పిట్ట ఇలా అనుకుంది “ఈ అనుబంధం , .ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని ! ****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
