కథా మధురం  

సయ్యద్ సలీం

‘ యంత్రం లాంటి ఓ ఇల్లాలి గుండె చప్పుడు వినిపించిన కథ.. ‘

-ఆర్.దమయంతి

సూర్యుడు లేకపోయినా పగలు గడుస్తుంది కానీ, ఇల్లాలు పడుకుంటే ఒక్క క్షణం కూడా ఇల్లు నడవదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి స్త్రీ అనుభవించి మరీ తెలుసుకునే జీవన సత్యం. 

వివాహమైన క్షణం నించి..చివరి శ్వాస దాక ఎడతెరిపిలేని కుటుంబ బరువు బాధ్యతల ను మోసేది ఇల్లలే.  

చాలా మంది మగాళ్ళు అంటుంటే వింటాను. ‘ నాకు ఆఫీస్ కెళ్ళి రావడం తప్ప మరో బాధ్యత తెలీదమ్మా..ఇల్లూ, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పురుళ్ళు, మంచి చెడూ అంతా ఆమే చూసుకుంటుంది.. చివీరికి నా బిపి, సుగర్ టాబ్లెట్స్ సయితం నా చేతిలో పెడితే వేసుకుంటాను. ‘ అంటూ గర్వం గా చెప్పుకుంటుంటారు. నిజానికి నాకనిపిస్తుంది..మరి ఇన్ని బాధ్యతలు మోస్తున్న తన ఇల్లాలి  మనోగతాన్ని ఈయనెప్పుడైనా చదివాడా?, కనీసం చిరు ప్రయత్నమైనా చేశాడా అని. 

  మనం సహజంగా అనుకుంటుంటాం. కుటుంబం – సంపాదించే మగాడి మీద ఆధారపడి వుంటుందని. కానీ ఆ మగాడు సయితం ఇల్లాలి మీదే పూర్తిగా ఆధారపడి బ్రతుకుతాడు..అని అంటే అతిశయోక్తి కాదు. 

ఒక ఇల్లాలు ఆ కుటుంబానికి కేవలం వండి వార్చే మనిషి మాత్రమే కాదు.

ఒక డాక్టర్.

ఒక సైకాలజిస్ట్.

ఒక థెరపిస్ట్

ఒక ప్లానెర్

ఒక టీచర్

ఒక ప్రీచర్

ఒక హీలర్

ఒక గొప్ప శాంతి దూత.  

ఒక మహ సేవకురాలు.

ఇన్నీ బిరుదులూ ఎప్పుడొస్తాయంటే..నిరంతరం మరలా పనిచేస్తున్నంత కాలమూ..అనుక్షణం అన్నీ పనులూ సక్రమంగా  సాగిపోతున్నంత కాలమూ..అదే కనక అటుదిటుదైతే స్కేప్ గోట్..బలిపశువయ్యేది కూడా ఇల్లాలే! ‘ఈ వినాశనం అంతా నీ మూలానే..’ అంటూ  ( ఆమె తప్పు లేకపోయినా) అపనిందలు, అబాంఢాలు భరించాల్సివస్తుంది. అందుకే..అడుగడుగునా అనుక్షణం శతృ దేశాల సరిహద్దులో సిపాయిల కంటే కూడా మరింతఎలెర్ట్ గా కుటుంబాన్ని కాచే వ్యక్తి ఎవరయ్యా అంటే ఇల్లాలు! ఆ దేవుడు తనకిచ్చిన బాధ్యతని ఎంత పవిత్రం గా భావిస్తుందంటే..తన ఊపిరి కంటే మిన్నగా. గొంతులో ప్రాణం వున్నంత కాలమూ..తన బాధ్యతలను నిర్వహిస్తుంది. ఫలితం గా ఏం పొదుంతోంది? 

ఇంటికి దీపం ఇల్లాలు అంటూ పొగిడి, ఆమెనొక వొత్తిని చేసి వెలిగించేస్తారు. కానీ, కాలంతో పాటు  కాలిపోతున్న వొత్తిని కానీ, అడుగంటుతున్న చమురుని కానీ పట్టించుకోరు. దీపానికీ హృదయం వుంటుందనీ, దాని గుండెలో కూడా చీకటి వుంటుందని ఎంతమంది గ్రహించగలరు?    

ఇదిగో ఇన్నాళ్ళకి ..దొరికింది. సరిగ్గా నా సందేహాలకి జవాబుగా  ఈ కథ -‘గరిమనాభి.’ 

అసలు కథేమిటంటే : 

వయసు మీద పడుతున్న కస్తూరి కి శారీరక బాధలు బాధిస్తుంటాయి. అయినా పెదవి విప్పి చెప్పదు. పరిథితి అలాటిది. తలనొప్పి పేలిపోతున్నా, రహస్యం గా టాబ్లెట్ వేసుకుని ఇంటి పనిలోకి దిగాల్సిందే తప్పదు. మంచం మీంచి లేవలేని నాడు సైతం ఓ  కప్పు కాఫీ కాచి చేతికందించె దిక్కుండదు. భర్త వున్నా..ఊహు ఆయన్నుంచి ఆశించే  అవకాశం అబ్బే..అస్సలు  లేదు. ఎందుకంటే  ఇల్లాలి పరిస్ఠితి  అలాంటిది.  

కస్తూరి కి ఇద్దరాడపిల్లలున్నారు. పెళ్ళై కాపురాలు చేసుకుంటున్నారు. వాళ్ళ  సాయం వుంటే కాస్త సేద తీరొచ్చు. కానీ ఆ ఆశే లేదు.  పై పెచ్చు..అమ్మ అండదండల కోసం అర్రులు చాస్తుంటారు.  

‘  తన పరిస్థితి అలాంటిదంటూ..’ జీవితాంతం సర్దుకుపోతున్న కస్తూరికి  తన మీద తనకు జాలేసిన క్షణం వస్తే ఆ హృదయ వేదన  ఎలా వుంటుంది? ఆ ఇల్లాలి మనోవేదనకి ఓ అద్భుత విషాద చిత్రలేఖనం లా నిలిచిన కథ..’గరిమనాభి.’ 

కథలో స్త్రీ పాత్రల తీరు తెన్నెలు, మనస్తత్వాలు, పెర్సొనాలిటీస్ చూద్దాం.

స్త్రీ ఔన్నత్యానికి అద్దం పట్టిన  పాత్రలలో ప్రధాన పాత్రధారి కస్తూరి :

అన్ని ఉద్యోగాలకీ రిటైర్మెంట్ వుంటుంది కానీ, ఇంటి ఇల్లాలి కి మాత్రం వుండదు.  ఎలాటి బ్రేక్స్ కానీ విరామం కానీ, జీతభత్యాలు కానీ, కనీషం శలవు దినాలు సైతం  లేని అవిరామ అవిశ్రాంత  జీవి ఎవరరయ్యా అంటే ఇల్లాలు మాత్రమే – అనడానికి నిలువెత్తు సాక్ష్యం లా నిలిచిన పాత్ర.

వృధ్యాప్యం లో అడుగుపెట్టినా   ఓర్పు, సహనం, నిదానం, ఎదుటవారి ని అర్ధం చేసుకోవడం, నోరు విప్పి అడగకముందే అన్నీ సమకూర్చడం..ఎలా సాధ్యమన్నది కస్తూరి ని చూస్తే అర్ధమౌతుంది. 

తనకు తల నొప్పి వున్నా, లేవలేకపోయినా, లేని ఓపిక తెచ్చుకుని  లేచి, నడుం చుట్టూ చెంగు బిగించి,  అర్జెంట్ గా ఒక టాబ్లెట్ తగిలించి, ఓ  పల్చని బట్ట ని తల చుట్టూ కట్టు కట్టి,  వంటింట్లో అడుగుపెత్తే ఇల్లాళ్ళకి ప్రతినిధి గా,  అద్దం పట్టినట్టుంటుంది – కస్తూరి.  

కస్తూరి ని ఇలా చూసినప్పుడు నాకు మా పక్కింటి పిన్ని గారు గుర్తొచ్చారు. ‘ఏమిటి బాబాయి గారు పచార్లు చేస్తున్నారు?’ అని అడిగితే..మీ పిన్ని గారు ఇంకా లేవలేదమ్మా. తలనొప్పి పేలిపోతోందట. పడుకుంది. అది లేచి కాఫీ ఇస్తే..బయట పడదామని చూస్తున్నా..’ అన్నారు. వినంగానే ఒళ్ళు మండిపోయింది. ఏం మనిషి?  ఏం భర్త? భార్య లేవలేని పరిస్థితి లో వుంటే, తోడుగా వుండి, సపర్యలు చేసి, సేద తీర్చి, ఓ కప్పు కాఫీ కాచి ఇవ్వాల్సిన మొగుడు..ఇలానా మాట్లాడటం? ఇలాటి మొగుడు ఎక్కడా వుండడు ..అనుకున్నా కానీ కస్తూరి కి అచ్చు అలాటి మొగుడే వున్నాడు. 

అయినా, కస్తూరి మొగుణ్ణి నిందించదు. అసలు తెలిస్తే కదా నిలదీయడం, ఉన్నదున్నట్టు మాట్లాడటం, తన వైపు నించి ఆలోచించమని అడగడం..తెలిస్తే కదా ఆమెకి? అంత అమాయకత్వమా అనుకునే వారికి..కాదని జవాబిచ్చే పాత్ర – కస్తూరి. 

చాలా మంది మొగుళ్ళు శాంతస్వరూపులుగా చలామణి అవడం వెనక వాళ్ళని చల్లగా చూసుకునే భార్యమణులే కారణమని చెప్పిన పాత్ర కస్తూరి.

ఆయన అవసరాలు, మూడ్స్, అడగకముందే అన్ని అమర్చడం, ఆయన కదిలితే మెదిలితే నీడలా వుంటం, ఆయన దగ్గితే కషాయం కాచి ఇవ్వడం, తుమ్మితే ఆవిరిపట్టీయడం, కంచం లో వేడి వేడిగా వడ్డించడం.. ఆయన గారికి దిగులైతే..కొండంత ధైర్యాన్ని నూరిపోసి నిద్రపుచ్చడం..సీనియర్ సిటిజెన్ షిప్ వచ్చినా ..కొందరి ఇల్లాళ్ళకి  అదనపు భారీ బాధ్యతలు వచ్చి చేరతాయి తప్ప, విశ్రాంతి అన్నది ఒక కల అనే సత్యానికి  ఓ ప్రత్యక్ష నిదర్శనం – కస్తూరి.

సేవలందుకున్నా ఆయన గారు  నిశ్చిం త  గా నిద్రపోతాడు. సరే. మరి ఈ ఇల్లాలి తలనొప్పి మాటేమిటీ? నిశ్శబ్దం గా పెదవి బిగువున భరిస్తున్న వికారం సంగతి ఏమిటి? అలా తనూ కసేపు మంచం మీద వొరిగి నడుం వాల్చాలన్న బలమైన కోరికని చంపుకోవాల్సిన దీన స్థితి మాటేమిటి? 

చాలా మంది మగాళ్ళు హేళన గా మాట్లాడతారు. ‘నిన్ను లేచి పని చేయమని ఎవరన్నారు? నేను అన్నానా? నేను కాఫీ అడిగానా? వంట చేయమన్నానా? పడుకోవాల్సింది..’ అంటూ కసురుకుంటారు భార్యని. 

మాట పడటం కొందరి ఇల్లాలికి ప్రాణాంతకం గ వుంటుంది. అందుకే కామోసు..కస్తూరి కూడా భర్తకి చెప్పదు..తను తలనొప్పితో బాధ పడుతున్న సంగతి  కానీ…లేవలేక లేవలేక నిద్ర లేచిందని కానీ కంప్లెయింట్ చేయదు. పై పెచ్చు మనతో చెప్పుకుంటుంది..’పాపం ఆయ నకే ఒంట్లో బాలేదు. నా బాధ చెప్పడం ఎందుకులే..’  అని అంటుంది. 

‘ తన  ఓర్పు సహనాలకి కూడా ఒక హద్దుండాలి..’ అనే వాక్యాన్ని విని కానీ, కని గాని ఎరుగని మహా ఇల్లాళ్ళెందరో! ఆ అందర్నీ రిప్రెజెంట్ చేస్తుంది  కస్తూరి! 

ఆమె సపర్యలతో ఆయన కి జలుబూ తగ్గింది..దగ్గూ తగ్గింది. కానీ ఆమెకి తలనొప్పే తగ్గలేదు. 

పై పెచ్చు, పెద్ద కూతురు ఇంటి కొస్తుంది పసి వాణ్ణి వేసుకుని, చిన్న కూతురు అమెరికా నించి ఫోన్ చేస్తుంది కష్టాలు చెప్పుకోడానికి..

పెళ్ళైతే సుఖమనుకుంటాం. అదొక భ్రమ. పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళైతే, ఇంకేముంది జీవితమంతా  సుఖమే అనుకుంటారు తల్లులు. .కానీ, అది మరింత పెద్ద భ్రమ.  పెద్ద వాళ్ళయాక పెద్ద కష్టాలు, వాళ్ళ పెళ్ళిళ్ళయ్యాక మహా కష్టాలు ఎదురవుతున్నాయి  ఈ రోజుల్లో..

ప్రయోజకులైన పిల్లలు సైతం తమకు ఏ విధం గానూ ఆసరా కాలేని అప్రయోజక సంతానం వుండీ లాభం ఏమిటి తల్లులకి? అలాటి అసహాయరాలి కి అద్దం పట్టిన పాత్ర కస్తూరి.  

ఆ కుటుంబ సుఖ సంతోషాలకి, కష్టనష్టాలను అరికట్టడానికి, ఓదార్పుకి, సలహాలకి, మానసిక వేదనలను సేదతీర్చడానికి, పరిస్థితులకి బలహీనపడిపోకుం బలం గా నిలవడానికి, శారీరక చేతలకీ చాకిరీలకి..అన్నిటికీ కేంద్ర బిందువుగా..గరిమనాభి గా నిలిచిన కస్తూరి గుండె లో ఏ బెంగ దాగుందో ఆ ఇంట్లోవారికెవరికైనా తెలిసిందా?  

అది కాదు..అసలు కస్తూరి కి తెలుసా?..తను కాలిపోతూ కూడా కాంతి నిచ్చే దీపాన్నని..? ఏమో!!

ఆ రహస్యాన్ని కథ చదివి మీరే తెలుసుకోండి.

కస్తూరి పెద్ద కూతురు నీరజ : 

కథలో నీరజ ని చూస్తే కోపమొస్తుంది. జాలేస్తుంది. బాధేస్తుంది కూడా. పెళ్ళై పిల్లలు పుట్టాక, సంసారం సాఫీగా సాగిపోతున్నా..ఆమెలో ఏదో తెలీని నిరాశ తో వీగిపోతుంటుంది.  కొంతమంది అంతే. నిరాశ నిస్పృహ లతో, ‘జీవితం ఇక నిస్సారం ‘ అనే భావనతో ఎప్పుడూ నిరుత్సాహం గా, చప్పగా కనిపిస్తారు. పెళ్ళి చేసుకుని తప్పు చేసామనో..ఈయన్ని కట్టుకుని నష్టపోయాననో..ఏమీ సాధించలేక చతికిలపడ్డామనో.. అని తెగ పశ్చాత్తాపంతో కుములుతుంటారు. నిత్యం ఏదో తెలీని అసంతృప్తి వారిని వేధించేస్తుంటుంది.  ఆ కోవకు చెందినదే నీరజ కూడా!  ‘బ్రతకాలని లేదు..’ అనే మాటలతో భయపెడుతుంటారు తల్లితండ్రుల్ని. అంతే కాదు, నిత్యవారీ జీవనంలో ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలకి, సమస్యలకి,  పెనుగాలికి వొణికిపోయే తీగలా భయపడిపోతుంటారు.  పసి దానిలా అమ్మ చెంత చేరి, ఒళ్ళో తలపెట్టుకుని కష్టాల చిట్టా విప్పుతారు. దుఃఖిస్తారు. ఓదార్పు కోరుకుంటారు. 

స్త్రీ కి చదువు ఎందుకంటే  కేవలం ఉద్యోగం సంపాదించుకోడానికి మాత్రమే కాదు. తన బ్రతుకుని తాను నిర్ణయించుకుని, ధైర్యం గా ముందుకు సాగిపోయే జ్ఞానాన్ని పొందడానికి. కనీసం పాతికేళ్ళు దాటాకైనా ఆ పాటి ధైర్యాన్ని సంపాదించి పెట్టలేని చదువులు చదివీ ఏం లాభం? అనిపిస్తుంది నీరజని చూసాక!

తన తల్లి తండ్రులకి, తోటి వారికి, సమాజానికి చేయూతనివ్వడానికి..బలహీనులకి బలం గా నిలవడానికి…చదువుకున్న జ్ఞానం వినియోగ్గపడాలి. కానీ దురదృష్టం ఏమిటంటే విద్యాధికులు సైతం చిన్న చిన్న కష్టాలను సైతం అధిగమించలేక  యువతులు ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు.  అసలు జీవితం ఎందుకు అని అడిగిన ఆమె ప్రశ్నకి 

‘జనన మరణాల మధ్య కాలంలో మన బాధ్యతలను సక్రమం గా నిర్వర్తించడం లోనే మనిషికి తృప్తి..’ అని హిత బోధ చేస్తుంది తల్లి.

ఆడపిల్ల వుంటే  ఆ తల్లి కి కొండంత బలం..  పెద్ద కూతురు అంటే మరీ ధైర్యం.. గా వుంటుంది. అది ఒకప్పటి కాలమేమో.  ఈ రోజుల్లో పెద్ద కూతురితో పెద్ద సమస్య చిన్న కూతురితో చిన్న సమస్య లా..వాళ్ల కాపురాలని తీర్చి దిద్దడం లొనే తల్లులు అతలాకులమైపోతున్నారు.

చదివేస్తే వున్న మతి పోవడం అంటే ఏమిటో  నీరజ పాత్ర ద్వారా మనకు సుస్పష్టమౌతుంది. 

పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు అలా బయట చెప్పులెప్పడం  ఆలస్యం..చేతిలో పిల్లాడ్ని అమ్మకి అందించి, హాండ్ బాగ్ నాన్నకిచ్చి..అలా మంచం మీద సోలిపోతారు. ఏదో యుధ్ధం నించి తిరిగొచ్చిన సైనికురాలిలా..

అంతే కానీ, అమ్మా ఎలా వున్నావ్? ఆరోగ్యం బావుందా? నడుం నొప్పి తగ్గిందా? మైగ్రైన్ కి హోమియో తీసుకుంటున్నావా? సరే నీకు రెస్ట్ ఇవ్వడానికే వచ్చాను.  ఈ నాలుగు రోజులు వంటపని, ఇంటి పనీ, నేను చూసుకుంటా. నువ్వు రెస్ట్ తీసుకో..మనవడితో ఆడుకో హాయిగా!  అని పొరపాటున కూడా అనరు. 

అమ్మ అంటే చిలుముపట్టని ఇనప స్థంభం : 

‘Women’s naatural rOle is to be a pilla of the family’ a  అని అంటారు  Grace kelly.  నిజమే కానీ, అమ్మ అంటే చులుము పట్టని ఇనప స్థంభం కాదు కదా!   

 ఈ భ్రమ చాలా మంది ఆడపిల్లల్లో  చూస్తుంటాం. ఇందులో నెగెటివ్ గా చెప్పుకోడానికేం లేదు.  అమ్మ అంటే నిత్య యవ్వనవతి అనుకుంటారో ఏమో! అందుకు నీరజ ఒక గొప్ప నిదర్శనం గా కనిపిస్తుంది.

ఎన్నేళ్ళు కాపురం చేసిన ఆడపిల్ల కైనా అమ్మ అండ కావాలి. ఆవిడ ఇచ్చే  ధైర్యం కావాలి..కానీ అమ్మ కూడా మనిషే..అమ్మ కీ బాధలుంటాయని..అడిగి తెలుసుకోవాలని, ఊరడించాలని, దగ్గరికి తీసుకుని నాలుగు లాలింపు మాటలు చెప్పాలన్న  స్పృహే వుండదు.  సరిగ్గా అలాటి కూతురే   నీరజ పాత్ర ద్వారా మన కళ్ళ ముందు ప్రత్యక్షమౌతుంది. 

పిల్లల తల్లి అయిన నీరజ తల్లి సాయాన్ని ఇంకా కోరుకోవడమే కాకుండా..తన పిల్లాడి పెళ్ళి వరకు  తల్లి సేవలు కొనసాగాలని కోరుకునే అమాయకత్వానికి నవ్వొస్తుంది. 

‘అమ్మా!   నీకేం సాయం  కావాలో చెప్పు.. ‘ అని అడగకపోవడం, ‘ నీ సేవలకి నే సదా సిద్ధం ‘ అని భరోసా ఇవ్వకపోవడం  నేరం కాకపోవచ్చు కానీ. 

కానీ ఆ తల్లి మనసు కి మాత్రం కూతురు పోకడ ఎంతో కొంత నిరాశని కలిగిస్తుంది. అశాంతికి గురిచేస్తుందని గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరిస్తుంది ఈ పాత్ర..ప్రవర్తనా సరళి వల్ల. ఇదొక మేల్కొలుపు.

వొంట్లో నలత గా వున్నప్పుడు..కూతురొస్తే ఆ తల్లికి సేద తీరినట్టుండాలి కానీ..మరింత సెగ రేగినట్టుండకూడదు కదూ? 

కొంతమంది స్త్రీల అమాయకత్వం, స్వార్ధం కూడా మనకి మంచి నే నేర్పుతుంది. ఎలా అంటే..ఇదిగో ఈమెలా మనం ప్రవర్తించకూడదు అని హితబోధ చేస్తుంది. నీరజ పాత్ర స్వభావం కూడ అలాటిదే. 

కస్తూరి రెండో కూతురు :

వివాహమైన యువతి కి ప్రతిరూపం క్షితిజ పాత్ర :  

ఏ స్త్రీ కైనా, భర్తతో కాపురం అంటే చదువు, ఉద్యోగం అంత సులువైన పని కాదు. చదువు కి  ఒక సిలబస్ వుంటుంది. ఉద్యోగం అంటే కష్టమో నష్టమో పని చేసుకుని బయటపడటం  వుంటుంది. కాని, వైవాహిక జీవితం అలా కాదు. ఈ మొగుడితో కాపురం చేయాలా వొద్దా అనేది నిత్యం.. అనుక్షణం తలెత్తే సమస్యే..వెన్నంటి వెంటాడే చిక్కు వీడని ప్రశ్నే..ఎప్పుడూ టెన్షన్, చికాకు, మనస్థిమితం లేకపోవడం, గొంతు హెచ్చు స్థాయిలో ఆన్ అయి వుంటం..మాట్లడబోతే అరిచినట్టు, పలకరించబోతే కరిచినట్టు  కనిపిస్తుంటారు కొందరు స్త్రీలు. వారిని పరిస్థితులు అలా మార్చేస్తాయి అని చెప్పాలి. 

కారణం..ఇల్లు..సంసారం అనే కంటే..భర్తతో రోజూ ఘర్షణ..ఆర్గ్యుమెంట్స్..అవునంటే కాదని..కాదంటే అవుననే అభిప్రాయ భేదాలు..

ఆంతరంగికులు ఎవరైనా  పలకరింపుగా ‘ఎలా వున్నావ్..’ అని అడగడం పాపం..ట్రిగ్గెర్ నొక్కిన పిస్టోల్ లా ‘మా ఆయనకి విడాకులిచ్చేద్దామనుకుంటున్నా..అంటూ బరస్ట్ అవుతుంటారు.  వింటున్న వాళ్ళకి ఫన్నీ గా వుంటుంది. ‘ఇది రొటీన్ గా వింటున్న డైలాగే’  అని.  కానీ ..ఆమె ఎంతగా రగిలిపోతుందో ఆమె అంతరంగానికే  తెలుస్తుంది..అని చెప్పేందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ గా సజీవం గా నిలుస్తుంది క్షితిజ.

ఈ రోజుల్లో విడాకులు పెద్ద మాటేమీ కాదు..అని అంటాం. కానీ నిజం గా డైవోర్స్ తీసుకుని విడిపోవడం ఎంత విషాదకరమో..అది అనుభవించిన వారికే తెలుస్తుంది. చాలా కొద్ది మందికే ఆ నరకం ఎంత భయంకరం గా వుంటుందో తెలుస్తుంది. 

అయితే..లేని పోని సమస్యలను సృష్టించుకుని, అనుమనాలతో..మొగుడికి తనంటే ఇష్టంలేదనో..ప్రేమ లేదనో, మనసులోంచి పారిపోయిందనో  అపోహలతో..అనుమానాలతో..’ డైవోర్స్ పడేస్తా ‘ అంటూ మాటి మాటికీ బెదిరించడం..కొందరి స్త్రీల బలహీనత కావొచ్చు..మూర్ఖత్వం కావొచ్చు. కాని అలాటి కూతురుంటే..కస్తూరి వంటి తల్లికి ఎంత పెద్ద పరీక్షో! అని చెపుతుంది ఈ పాత్ర. 

  ఈ కారెక్టర్ ని ఎంత సహజం గా చిత్రీకరించారంటే..అచ్చు  ఈమె మనకు తెలిసిన ఓ స్త్రీ లా..మన ఇంట్లోనో..మనలోనో..మన మధ్యలోనో..లేక మన బంధువుల్లోనూ ఎక్కడో అక్కడ తప్పకుండా తెలిసిన ఆమే  అనిపిస్తుంది. ఎవరో ఒక్కరి పేరైనా స్ఫురింపచేస్తుంది.

గరిక పాటి వారన్నట్టు..యువత లో ని ఈ మానసిక పరిస్థితులకి ఆర్ధిక స్వేచ్ఛ కొంత కారణమై వుండొచ్చు. 

ఆ తల్లి  కూడా అదే మాట అంటుంది కూతురితో ‘..మీకేం తక్కువని? ఇద్దరి మధ్య ఎందుకు పోట్లాటలు వస్తున్నాయి?’ అని అడుగుతుంది.

 ఒకప్పుడు ఆడపిల్ల కి పెళ్ళి చేసి అత్తారింటికి పంపితే గుండెల మీద భారం తగ్గినంత రిలీఫ్ గా వుండేది తల్లి తండ్రులకి. ఇప్పుడు అలా కాదు. పెట్టని బరువౌతోంది..అని అనిపిస్తుంది క్షితిజ పాత్ర ని చదివినప్పుడు.

అయితే, క్షితిజ కి ఎదురైన సమస్యలే కనక మన జీవితం లోనూ ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో కూడా నేర్పుతుంది..ఈ పాత్ర!

ఇవీ  గరిమనాభి కథలో ని స్త్రీల పాత్రలు, స్వభావాలు, విభిన్న దృక్పధాలు, మనోసంఘర్షణలు..ఉదాత్త గుణాలు.

ఎంతో మంచి కథని అందించిన రచయిత శ్రీ సలీం గారికి నెచ్చెలి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..

ఫ్రెండ్స్! వచ్చే నెల మరో మధురమైన కథతో కలుస్తాను.

మిత్రులందరకీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

ఆర్.దమయంతి.

*****

  గరిమనాభి

-సయ్యద్ సలీం

                     

 ఉదయం ఏడయినా మంచం మీద నుంచి దిగాలనిపించడం లేదు. ఒళ్ళంతా చితక్కొట్టినట్టు ఒకటే నొప్పులు. జ్వరమొచ్చిందేమో, తలనొప్పిగా కూడా వుంది. కళ్ళు మండుతున్నాయి. హాల్లో నుంచి వస్తున్న శబ్దాలకి కళ్ళు బలవంతంగా విప్పి చూసాను. ఆయన లేచి, బ్రష్ చేసుకుని పేపర్ చదువుతున్నట్టున్నారు.పేజీ తిరగేస్తున్న శబ్దం… మధ్య మధ్యలో కోర్స్ గ ఆయన దగ్గు వినిపిస్తున్నాయి.ఆయనకు డిఁబెటిస్ వున్నా విషయం గుర్తుకు వచ్చి లేని ఓపిక తెచ్చుకుని లేచి కూర్చున్నాను. 

         బాత్రూం కెళ్ళి  వేడినీళ్ళతో  మొహం కడుక్కున్నాను. వంటగదిలోకి వెళ్లి ఒక పొయ్యి మీద పాలు కాగడానికి పెట్టి మరో దానిమీద ఉప్మా చేశాను.ప్లేట్ లో ఉప్మా తో బాటు ధనియాల కారప్పొడి వేసి ఆయన ముందు పెట్టాను.ఆయన తినడం మొదలెట్టాక వంటగదిలోకి వెళ్లి కాఫీ కలిపి రెండు కప్పుల్లో పోసి ఆయన ముందున్న టీపాయ్ మీద పెట్టి దాని మీద సాసర్ తో మూత పెట్టాను. ఆయన పక్కనున్న సోఫాలో కూలబడి మెల్లగా కాఫీ తాగడం మొదలుపెట్టాను. వేడి వేడి కాఫీ గొంతులోకి దిగుతుంటే ప్రాణానికి హాయిగా అన్పించింది. 

       టిఫిన్ తిని ప్లేటులో చేయి కడుక్కున్నాక ఆయన కాఫీ కప్పు అందుకుని తాగుబోతు పెద్దగా దగ్గారు. 

       ఈ దగ్గు చంపేస్తుంది కస్తూరీ … రాత్రంతా దీనివల్ల కలత నిద్రే. “గుండెల నిండా కఫం పేరుకుపోయి నట్టుంది” అన్నారాయన.

    “డాక్టర్ రాసిచ్చిన దగ్గు మందు రాత్రి పడుకునే ముందు ఇచ్చానుగా ”  అన్నాను.  

    “ఈ మందులు పనిచేయడం లేదు ఇప్పటికే ఈ దగ్గు మందు ఇప్పటికే రెండు సీసాలు తాగేసాను. ఇది మూడో సీసా. ఇది ఎప్పటికి తగ్గదేమోనని భయమేస్తుంది” 

     “తగ్గుతుందండి యాంటీబయోటిక్స్  వాడేస్తే ఓ వారంలో తగ్గిపోయి  ఉండేది. ఈ వయసులో యాంటీబయోటిక్స్ వాడకూడదని కదా ఈ సిరప్పు లు తాగుతున్నారు. సమయం పడుతుంది దేనికైనా ఓపిక అవసరం”

  “తగ్గుతుందంటావా” 

“తప్పకుండా తగ్గుతుంది”  

   “ఏంటో ఈ రోగాలు… ముసలితనం నాలాంటి వాడికి శాపమేనేమో.ఇన్నిన్ని మందులు మింగాలన్నా విసుగనిపిస్తున్నది. షుగర్ కి ఓ మాత్ర,కొలెస్ట్రాల్ తగ్గడానికి ఒక మాత్ర,రక్తపోటు కో  మాత్ర,రక్తం పలచబడడానికో మాత్ర,వీటన్నిటివల్లా ఎసిడిటి రాకుండా మరో మాత్ర. ఉదయం టిఫిన్ ఎలా తింటున్నానో ఆలా మంత్రాలని కూడా తింటున్నాననిపిస్తుంది”

      “వయసు పైబడే కొద్దీ  ఇలాంటి జబ్బులు సహజమండీ. ఇంకా మీరు నయం. మీ రిటైర్మెంట్ కి  ఇంకా రెండేళ్లు ఉందనంగా మీకు డయాబెటిస్ వచ్చింది. ఈ రోజుల్లో పాతికేళ్ల కుర్రోళ్ళకి కూడా షుగర్లు, బీపీలు వస్తున్నాయి కదండీ.ఆ రకంగా ఆలోచిస్తే మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి”

    “ఏం అదృష్టం లే కస్తూరి.ఈ జబ్బుల గురించి ఆలోచిస్తున్న కొద్దీ డిప్రెషన్లోకెళ్ళి పోతున్నాను” 

    “వద్దండీ. ఈ జబ్బుల కన్నా డిప్రెషన్ మరి ప్రమాదకరం. ఇవేమున్నాయి… రోజు ఓ మాత్ర వేసుకుంటే చాలు. మన జోలికి రాకుండా పడి ఉంటాయి”

     “గతేడాది గుండె నొప్పి వస్తే  డాక్టర్లు గుండెలో మూడు బ్లాక్స్  ఉన్నాయని స్టంట్లు వేశారు చూడు అప్పటి నుంచి మరి భయం వేస్తుంది కస్తూరీ.. ఈ అర్ధరాత్రో, అపరాత్రో మళ్ళా  గుండెల్లో నొప్పి వస్తే ఏమైపోతానోనని”

    “అలాంటిదేమి జరగదు. పది పదిహేనేళ్ల వరకు ఢోకా ఉండదని డాక్టర్ భరోసా ఇచ్చాడు కదా. మీకిప్పుడు అరవై ఐదేళ్లు,అంటే ఎనభై ఏళ్ళు వచ్చేవరకు మీ గుండె కొచ్చే ప్రమాదమేమీ లేదు”

             “అన్నేళ్లు బతుకుతానంటావా”

 ఛ… అవేం మాటలండీ .. మీరు నిక్షేపంగా వుంటారు.పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. సాయంత్రాలు అలా వెళ్లి స్నేహితులతో గడిపిరండి. ఉత్సాహం వస్తుంది. 

     “నాకు ఇవేవి అక్కరలేదు కస్తూరీ… నువ్వు పక్కనుంటే చాలు. నీ మాటలు చాలా ధైర్యాన్నిస్స్తాయి.చెవుల్లో అమృతం పోస్తున్నట్లు” 

   నేను నవ్వి వంట చేయడానికి కిచెన్ లోకి వెళ్ళాను. పనిమనిషి అంట్లు తోమి కసువూడ్చి వెళ్ళిపోయింది.బెండకాయ వేపుడు చేద్దామని వాటిని కడిగి ముక్కలుగా తరుగుతున్నపుడు మొబైల్ ఫోన్ మోగింది. అమెరికా నుంచి రెండో అమ్మాయి క్షితిజ… 

  “అమ్మా.. నేను ఇండియా వచ్చేద్దామనుకుంటున్నా” అంది క్షితిజ. 

“నువ్వొక్కదానివేనా.. అల్లుడూ నువ్వూ కలిసి రండి.  ఓ నెల రోజులుండి వెళ్ళవచ్చు”

“ఈయనతో నాకసలు పొసగడం లేదమ్మా.. వారం నుంచి రోజూ  పోట్లాడుకుంటున్నాం”

“జీవితం అంటేనే సర్దుకుపోవడం తల్లి. అల్లుడు మంచివాడు. మీకేం తక్కువని.. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. సంతోషం వుండొచ్చుకదా.. ఎందుకు పోట్లాడుకుంటారు?”

“నాకీ మధ్య చాలా చిరాగ్గా వుంటోది మమ్మీ .అతనేం మాట్లాడినా కోపం వస్తుంది. డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నా. ప్రేమించి కదా పెళ్లి చేసుకున్నాను.నాకిప్పుడు అనుమానం వస్తుంది.  ఇతనికి నా మీద ప్రేమలేదని. “

అలా అనుకోవటం తప్పమ్మా .అల్లుడికి నువ్వంటే చాల ఇష్టం”

“ఏమో .. నాకలా అన్పించడం లేదు”

“ఇదంతా నీకున్న థైరాయిడ్ సమస్యవల్ల అనే విషయం నీకర్ధం కావడం లేదా? థైరాయిడ్ వల్ల చిరాకు, కోపం,డిప్రెషన్ కలుగుతాయి. కొద్దిగా స్థిమితంగా ఆలోచించు. అల్లుడితో నేను మాట్లాడతాను. డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు సరిగ్గా వాడు. అయినా చిన్నపిల్లవి. నీకీ కష్టమేమిటో.”

“నాకూ ఈ అనుమానమొచ్చి రెండు రోజుల క్రితం డాక్టర్ దగ్గరి కెళ్లాను మమ్మీ. థైరాయిడ్ రెండు పాయింట్లు పెరిగింది”

  “మీరిద్దరూ చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకోకండమ్మా.. అల్లుడికి అర్థమయ్యేలా నేను చెప్తాలే. నువ్వు చిరాకు పడినా అది నీ థైరాయిడ్ సమస్య వల్ల అని  అర్థం చేసుకుని అతను సర్దుకు పోవాలి కదా. మూడ్ సరిగ్గా ఉంచుకో తల్లీ.. టీవీలో నీ కిష్టమని హారర్  సీరియళ్లు చూడకు.జోకులు పుస్తకాలు  కొనుక్కో. సరదాగా వుండే సినిమాలు చూడు. మీరిద్దరూ ఇప్పుడు అన్యోన్యంగా గడిపే క్షణాలే మీ వార్ధక్యంలో తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందమైన జీవితాన్ని అనుభవించడం అంటే అందమైన జ్ఞాపకాల్ని మూటగట్టుకోవడమే.”

  “ఈ మధ్య కాళ్ళు కూడా బాగా గుంజుతున్నాయి మమ్మీ. కొద్ది దూరం నడిచినా నీరసమనిపిస్తోంది.”

  “పాలు తాగమంటే ఆ వాసన పడదంటావాయే.ఆడపిల్లలకు కాల్షియమ్ చాల అవసరం తల్లీ.మధ్యాహ్న లప్పుడు పెరుగు తిను. రాత్రుళ్ళు మజ్జిగ తాగు.ఇంతకూ అమెరికా లో పాలు పెరుగు బాగానే దొరుకుతాయి గా..”

“ఎందుకు దొరకవూ.. ఎటొచ్చి రుచే ఏదోలా ఉంటుంది.”

 “రుచి గురించి ఆలోచించకు. మన శరీరానికి అవసరం కదా. తప్పదు.”అప్పటికే నా గొంతు రాసుకు పోయినట్టు అయిపోయింది. గొంతు నొప్పిగా వుంది. బహుశా ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది. దాని వల్లనే జ్వరం వచ్చినట్టుందేమో. మాట్లాడటం కష్టంగా వుంది. బలవంతంగా ఓపిక తెచ్చుకుని మాట్లాడుతున్నా. 

వారానికి ఒకసారో రెండు సార్లో ఫోన్ మాట్లాడుతుంది. దానికీ ఆరోగ్యం బాగోలేదు. నాకు ఒంట్లో నలతగా ఉందని తెలిస్తే దిగులు  పడుతుంది.నా ఆరోగ్యం గురించి చెప్పి దాన్నెందుకు బాధ పెట్టాలి అన్పించింది. 

క్షితిజ మరి కొద్ది సేపు  మాట్లాడి ఫోన్ పెట్టేసింది. గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించాను.తలనొప్పిగా కూడా వుంది. ఆవిరి పడితే తగ్గుతుందేమోనని విక్స్ వేసి ఆవిరి పట్టాను. 

ఆయనకు తెలియకూడదని వంట గదిలో ఆవిరి పట్టిన ఎలా గ్రహించారో ఏమో కస్తూరి ఆరోగ్యం బాగోలేదా.. ఈ రోజు బాగా డల్ గా  కనిపిస్తున్నావు.అని అడిగారు. 

“అబ్బే.. ఏమీ  లేదండీ.. కొద్దిగా జలుబు గా అన్పిస్తుంటేనూ” .. అన్నాను తేలిగ్గా తీసేస్తూ. . 

“నీ ఆరోగ్యం జాగ్రత్త కస్తూరి. ప్రస్తుతం నువ్వే ఇంటికి మూలస్థంభం లాంటి దానివి. నా బాగోగులతో పాటు పిల్లల గురించి పట్టించుకోవలసింది కూడా నువ్వే” అన్నారాయన. 

“నాకేమండీ.. గుండ్రాయిలా వున్నాను. నా గురించి మీరేమి దిగులు పడకండి మీ ఆరోగ్యం చూసుకోండి.  చాలు” అన్నాను. 

ఆయనకు భోజనం పెట్టాను. నాకేమీ తినాలనిపించలేదు.నోరంతా చేదుగా వుంది. వంటగది సర్దేసి కొద్దీ సేపు నడుం వాల్చాను. ఆయనకు మధ్యాహ్నం భోంచేశాక ఓ కునుకు తీయడం అలవాటు.నిద్ర పట్టినట్టుంది. సన్నటి గురక విన్పిస్తుంది. 

 నాకు కళ్ళు మండుతున్నాయి తప్ప నిద్ర రావడం లేదు. తల తిప్పి ఆయన వైపు చూసాను.రెండు చేతుల్ని గుండెల మీద పెట్టుకుని నిద్ర పోతున్నారు. ఆర్ధిక బాధలేం లేవు. పెన్షన్ డబ్బులు,బ్యాంకు డిపాజిట్లు మీద వచ్చే వడ్డీ కలుపుకుంటే మా అవసరాలకు సరిపడినంత డబ్బు.. “ఇంటిని చూసుకోడానికి నువ్వున్నావుగా. నాకు నిశ్చింత.” అంటారాయన.  

నాకేమైనా అటు ఇటు అయితే ఈయనేమైపోతారోనన్న దిగులు నాలో. పిల్లలు అంతే. పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళైనా ఇంకా పసితనం పోలేదు. ప్రతీదానికి నా మీద ఆధారపడుతుంటారు. “మాకు నువ్విచ్చే మోరల్ సపోర్ట్ కొండంత బలాన్నిస్తుంది మమ్మీ” అంటూ ఉంటుంది పెద్దమ్మాయి నీరజ. వీళ్ళందరూ నా మీద ఆధారపడితే నేనెవరిమీద ఆధార పడాలో తెలియడం లేదు. తలవాల్చి తనివిదీరా ఏడవడానికి నాకో భుజం ఆసరా కావాలనిపిస్తోంది. 

సమయం రెండు కావస్తోంది. చల్లింగ్ బెల్ మోగితే ఈ సమయం లో ఎవరా అని తలుపు తీసాను. పెద్దామ్మాయి నీరజ.. దాని భుజం మీద నా మనవడు. వాడిప్పుడు ఏడాది నిండింది.అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్. హైటెక్ సిటీ లో ఉద్యోగం.. అందుకే మాదాపూర్ లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని వుంటున్నారు. 

“ఏంటి తల్లి.. ఫోన్ అయినా  చేయకుండా వచ్చేశావు? “అన్నాను కంగారుపడుతూ .

వీడికి ఉదయం నుంచి ఒళ్ళు వేడిగా ఉందమ్మా. వాంతులు చేసుకుంటున్నాడు. నాకు భయమేసి తెచ్చేసాను. అంది లోపలికొస్తూ. 

వాణ్ణి ఎత్తుకొని నా భుజం మీద పడుకోబెట్టుకున్నాను ఒళ్ళు కాలి పోతున్నట్టుంది.

“డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళక పోయావా తల్లి..”అన్నాను. 

“వాళ్ళ దగ్గరకెళ్తే ఏవేవో మందులు రాసి పడేస్తారమ్మా. అల్లోపతి మందులన్నిటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి… మరీ అవసరమైతే తప్ప వడ కూడదు అని నువ్వే చెప్పావు కాదమ్మా. నువ్వేమైనా చిట్కా మందు వేస్తావని తెచ్చేసాను.”

అది చెప్పింది నిజమేననిపించింది. పిల్లలు కొద్దిగా పెద్దయి స్కూలుకెళ్ళటం  ప్రారంభించాక ఏమి తోచటం  లేదంటే  ఈయన నన్ను హోమియోపతి సర్టిఫికెట్ కోర్స్ లో చేర్పించారు. అది ఆరు నెలల కోర్స్.అశోక్ నగర్లో మోడీ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన కోర్స్. చిన్న చితక రుగ్మతలకు మా పిల్లలకు కూడా హోమియో మందులే వాడటం అలవాటు. వాడి నోట్లో హోమియో మాత్రలు నాలుగు వేసి నిద్రపుచ్చాను. 

నీరజ విచారంగా కన్పించింది. “పిల్లలకు జ్వరాలు రావడం మాములే నమ్మా. దానికే అంత  పడిపోతే ఎట్లాగమ్మా”. అన్నాను. 

“అది కాదమ్మా నాకే ఎందుకో జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. ఇంతేనా జీవితం? పెళ్లి, పిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేయడం.. వాళ్ళ పెళ్లిళ్లు.. తర్వాత ముసలితనం.. చావు… ఇంతేనా.. దీనికైతే దేనికింత తాపత్రయ పడాలి… ఎందుకీ పరుగు.. ఎందుకీ ఆరాటం.” అంది. 

“జీవితమంటే అంతే కదా తల్లీ. అయినా ఇంత చిన్న వయసులో వైరాగ్యం  కాదు. జీవితానికి అర్ధమంటూ ఉంటుందని నేననుకోను. జనన మరణాల మధ్య కాలంలో మన బాధ్యతలని  సక్రమంగా నిర్వర్తించడంలోనే మనిషికి తృప్తి… జీవన సాఫల్యమదే”

“బాధ్యతలంటే పిల్లల్ని కనీ పెంచటమీనా అమ్మా?నాకెన్ని కలలుండేవి?సివిల్ సర్వీసెస్ రాసి అయ్యేయస్సో, ఐపీఎస్సో సాధించి సమాజానికి నా వంతు సేవ చేయాలని…. ఏమైంది చూడు. రెండు సార్లు ప్రయత్నించాను.సెలెక్ట్ కాలేక పోయాను.మూడోసారి రాద్దామనుకునేటప్పటికీ వీడు కడుపులో పడ్డాడు. ఓ సంవత్సరం ఆలా గడిచి పోయింది. వీడు పుట్టాక వాణ్ణి పెంచడంలోనే సమయం మించి పోతుంటే ఇంకా చదవడానికి టైమెక్కడ దొరుకుతుంది చెప్పు.” 

“ఇంకా ఎన్ని చాన్సులున్నాయి?”

ఇంకేం ఛాన్సులు మమ్మీ. వయసైపోయింది. నా కల ఇప్పటికీ నెరవేరదు. ఇలా అనుకోగానే ఎక్కడ లేని డిప్రెషన్ కి లోనవుతున్నా. మా ఆయనను చూస్తే కోపం వస్తుంది. ఇతని వల్లే కదా నా ఆశయం సాధించుకో లేక పోయానని. చివరికి బాబు ని చూసిన చిరాకొస్తుంది. 

“తప్పు తల్లీ అలా అనుకోగూడదు.సమాజానికి సేవ చేయాలంటే సివిల్ సర్వీసెస్ ఒక్కటే మార్గమని నేననుకోను.చాలా రకాల మార్గాలున్నాయి. ఏదైనా స్వచ్ఛంద సంస్థ ని ప్రారంభించు.నువ్వు ఎవరికీ నీ సేవల్ని అందించాలనుకుంటున్నావు?”

       “అనాథలు, అన్నార్తులు ,ఈ ఆసరా లేని మహిళలు.”

 “వాళ్ళని ఉద్దరించడానికి ఇప్పటికే దేశంలో బోలెడన్ని స్వచ్ఛంద సంస్థలు  ఉన్నాయి.ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం అనేక పథకాల్ని ప్రవేశపెట్టింది.ఇప్పుడు మన కళ్లెదుట జరుగుతున్న దారుణం రైతుల ఆత్మహత్యలు. ఆ కోణంలో ఆలోచించు.కొన్ని గ్రామాల్ని ఎంచుకుని రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్లకు కౌన్సిలింగ్ అందించవచ్చు.వాళ్ళది డిప్రెషనే.వాళ్ళని ఆ డిప్రెషన్ నుండి బయట పడేయడం ద్వారా నువ్వు కూడా నీ డిప్రెషన్నీ అధిగమించవచ్చు.ఏమంటావు?” 

“చాలా మంచి సలహా ఇచ్చావు మమ్మీ. నా జీవితం నిరర్ధకం అనుకుని అశాంతి లోకి జారిపోబోతున్న నన్ను చేయి పట్టి బయటకు లాగి రక్షించావు.వెంటనే ఆ ప్రయత్నాలు మొదలుపెడతా.”

“సాయంత్రమయ్యింది.బాబిగాడి జ్వరం నెమ్మదించింది.మందేశాక వాంతులు కూడా కాలేదు.”

“ఆయనొచ్చే టైమైంది మమ్మీ.నేను వెళ్తాను.ఈ ట్రాఫిక్ ని దాటుకుని వెళ్లాలంటే కనీసం గంటన్నర పడుతుంది.” అంది నీరజ. 

వెళ్లే ముందు నా భుజం మీద చేయి వేసి ప్రేమగా నొక్కుతూ “మమ్మీ… నాకేం సమస్య వచ్చిన నువ్వున్నావన్న ధైర్యం తెలుసా.నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మమ్మీ. నీకేమైనా అయితే మేము తట్టుకోలేం” అంది. 

“అలా అనుకోగూడదమ్మా. మాదీ పెరిగే వయసు కదా.ఈ నాటికైనా పోక తప్పదు.”

“వెంటనే నా నోరు నొక్కేస్తూ,”ప్లీజ్ అలా అనకు మమ్మీ.నేను వినలేను.నువ్వు నా కొడుకు పెళ్లి చూడాలి అప్పటి దాకా ఆరోగ్యంగా తిరుగుతూ ఉండాలి.”అంది. 

అది వీడ్కోలు తీసుకుంటూ నవ్వినప్పుడు నేనూ బలహీనంగా నవ్వాను. 

రాత్రి ఆయనకు భోజనం పెట్టి మందుబిళ్ల  లిచ్చాక, నేను కొద్దిగా చారన్నం తిన్నాను. 

పడక మీద వాలితే నన్నాక్రమిస్తూ భయంకరమైన నిస్సత్తువ.ఉదయం నుంచీ లేని ఓపిక తెచ్చుకుని పనులు చేశానేమో శరీరమంతా చచ్చుపడినట్టు … జ్వరం తగ్గినట్టు లేదు. వేసుకున్న హోమియో మందు పనిచేసి నట్టు లేదు.నాకున్న అనారోగ్యానికి ఏ మందులూ, పనిచేయవేమో.నా భర్తా ,పిల్లలూ తమ అనారోగ్యాల గురించి,

భయాల గురించి,దిగుళ్ళ గురించి నాతో చెప్పుకుని స్వాంతన పొందారు. నేను ఎవరితో చెప్పుకోను? వాళ్ళ డిప్రెషన్ల నుండి బయట పడడానికి వాళ్ళు నా ఆసరా తీసుకున్నారు. మరి నా మనసులో చెలరేగుతున్న అలజడి ని ఎవరితో పంచుకుని స్వాంతన పొందాలో అర్థం కాని పరిస్థితి. 

తప్పదు. నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి.వీళ్లందరికోసం మానసికంగా బలాన్ని తెచ్చుకోవాలి.నాకు ఆసరాగా ఎవరి భుజమూ దొరకదు. నా భుజం మీద  నేనే వాలి విశ్రాంతి పొందాలి. నన్ను మా ఆయనా,పిల్లలూ ఇంటికి మూలస్థంభం అని భ్రమ పడుతున్నారు. దానికి చెదలు పడుతున్న విషయం ఎవ్వరికీ తెలియదు. అది నన్ను లోపల్నుంచి తినేస్తూ, గుల్ల చేస్తూ… నా కన్నీళ్లతో దిండంతా తడిచి పోయింది. 

నిద్రలో ఆయన ఏదో కలవరిస్తున్నారు.ఆయన లేస్తే నేను ఏడుస్తున్న విషయం తెలుస్తుందేమోనని   కంగారుగా పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకుని అటు తిరిగి పడుకున్నాను.  

                                   *****

రచయిత పరిచయం :           

పేరు :      సయ్యద్ సలీం 

విద్యార్హత:  భూ భౌతిక శాస్త్రం లో ఎం ఎస్ సి (టెక్ ),ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు

జన్మస్థలం:  త్రోవగుంట గ్రామం ,ఒంగోలు,ప్రకాశం జిల్లా

ఉద్యోగం:    అడిషనల్ కమిషనర్   ఆఫ్ టాక్స్( రి )

కవితలు:

   కాలేజీ రోజుల నుంచే రచనా వ్యాసంగం ప్రారంభమై,ఇప్పటి వరకూ యాభైకి పైగా కవితలు,వివిధ పత్రికల్లో అచ్చయినాయి. కొన్ని కవితలు కన్నడం,ఆంగ్ల భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి.మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి. 

 •  నీ లోకి చూసిన జ్ఞాపకం… 1999
 • ఆకులు రాలే దృశ్యం     …  2005
 • విషాద వర్ణం               …  2013

కథలు:

ఇప్పటికి రెండు వందల యాభై కి పైగా కథలు వివిధ దిన,వార, మాస పత్రికల్లో ప్రచురించబడ్డాయి. మొదటి కథ మనీషి 1980 లో ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురింపబడింది. చాలా కథలకు బహుమతు లొచ్చాయి. పలు కథలు ఇతర భాషల్లోకి 

తర్జుమా చేయబడ్డాయి.వీటిలో ప్రముఖంగా మానవత్వాన్ని గుర్తుచేసే కథలు,మంచితనాన్ని తట్టి లేపే కథలే ఎక్కువ.ఇప్పటివరకు పది కథాసంపుటాలు వెలువడ్డాయి. 

 1. స్వాతి చినుకులు … 1996
 2. నిశ్శబ్ద సంగీతం  … 1999
 3. రూపాయి చెట్టు  … 2004
 4. 4. చదరపు ఏనుగు … 2006
 5. రాణి గారి కథలు … 2008
 6. ఒంటరి శరీరం   … 2009
 7. రెక్కల హరివిల్లు … 2011
 8. అంతర్గానం      …  2014
 9. నీటి పుట్ట         … 2017
 10. మాయ జలతారు… 2018  

రాణి గారి కథలు మతసామరస్యాన్ని చాటిచెప్పే కథలు.ముస్లిం మతస్థుడైన సైఫ్,సనాతన బ్రాహ్మణ కుటుంబానికి  చెందిన రాణి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు.ఆ క్రమంలో 

వాళ్ళ కెదురైన సామాజిక,సాంస్కృతిక,వ్యావహారిక,మతపరమైన  సమస్యలు… వాటి సామరస్యపూర్వకంగా ఎదుర్కొని ఆదర్శ జంటగా ఎలా నెగ్గుకొచ్చారో సున్నితమైన హాస్యాన్ని, సునిశితమైన వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథలివి. మతాలకతీతంగా ప్రేమనీ,మానవత్వాన్నీ

ఎలా బతికించు కోవచ్చో ఈ కథల్లో విశదపరచడం జరిగింది. ఇవి మా టీవీ లో  సీరియల్ గా 56 ఎపిసోడ్లలో ప్రసారం చేయబడ్డాయి.ఈ కథలు అనేక భారతీయ భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. 

నవలలు:

  ఇప్పటివరకు 27 నవలలు ప్రచురించబడ్డాయి.రెండో నవల “వెండి మేఘం”

తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారాన్ని దక్కించుకుంది. “కాలుతున్న పూలతోట” నవలకు 2010 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.  “అనూహ్య పెళ్లి” నవల  ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక శాఖ నిర్వహించిన నవలల పోటీలో బహుమతి గెలుచుకుంది. “అనామిక డైరీ” నవలకు ఆట ,నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి లభించింది.”మేధా  017”,

“ఆపరేషన్ కైటిన్ “,”గుహలో ఒక రోజు” నవలికలకు తానా ,మంచిపుస్తకం సంయుక్తంగా నిర్వహించిన బాల సాహిత్యంలో నవలల పోటీలో బహుమతి లభించింది. 

టీవీ సీరియల్స్:

 1. “రాణి గారి కథలు” మా టీవీ లో 56 ఎపిసోడ్లుగా ప్రసారమైనాయి . శ్రీ అక్కినేని కుటుంబరావు గారు దర్శకత్వం వహించారు. 
 2. “సలీం కథలు “ పేరుతో దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో ప్రసారమైనాయి. శ్రీ శంకు గారు దర్శకత్వం వహించారు. వీటి కి 2015 సంవత్సరానికి గాను ఉత్తమ టీవీ ఫిలిం సిరీస్ కింద బంగారు నంది బహుమతి లభించింది. 

అవార్డులు-బహుమతులు:  

 1. “కాలుతున్న పూలతోట” నవల కు 2010 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు  
 2. వెండి మేఘం నవల ఉస్మానియా యూనివర్సిటీ,పాలమూరు యూనివర్సిటీ,మహాత్మా గాంధీ యూనివర్సిటీ,తెలంగాణ యూనివర్సిటీ మరియు బెంగుళూరు యూనివర్సిటీ ల్లో  ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్య పుస్తకం గా  నిర్ణయింపబడింది.  
 3. “ఆరో అల్లుడు” కథకు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన వరల్డ్ బెస్ట్ స్టోరీస్ రెండో  సంపుటి లో స్థానం. 
 4. “వెండి మేఘం “నవలకు తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారం 2004
 5. అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భాష పురస్కారం 2003
 6. కథా రచనకు గాను తెలుగు యూనివర్సిటీ నుంచి ధర్మనిధి పురస్కారం.  
 7. “రూపాయి చెట్టు” కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం 2004 
 8. ఢిల్లీ తెలుగు అకాడమీ నుంచి రాష్ట్రీయ వికాస్ శిరోమణి అవార్డు 2005
 9. నవలా రచనకు గాను వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం 2007
 10. కథా రచనకు గాను చాసో సాహిత్య పురస్కారం 2008
 11. “కాలుతున్న పూలతోట” నవలకు కొవ్వలి సాహితి పురస్కారం 2009
 12. కాలుతున్న పూలతోట నవల హిందీ అనువాదం “నయీ ఇమారత్ కె ఖండ హర్” కి ,

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ,ఢిల్లీ వారి పురస్కారం

 1. “వెండి మేఘం” నవలకి వి.ఆర్ నార్ల సాహితి పురస్కారం 2005
 2. నవలా రచనకు గాను విశాలాంధ్ర స్వర్ణోత్సవ పురస్కారం 2003
 3. రూపాయి చెట్టు,చదరపు ఏనుగు  కథా సంపుటాల  కు విశాల సాహితీ పురస్కారం 2008
 •  జ్యోత్స్న కళా పీఠం వారి ఉగాది పురస్కారం 2007 
 1. ఆంధ్ర నాటక కళా సమితి నుండి తటపర్తి వరలక్ష్మి స్మారక ఉగాది పురస్కారం 2011
 2. అభ్యుదయ ఫౌండేషన్ ,కాకినాడ నుంచి అభ్యుదయ సాహితీ పురస్కారం 2012
 3. కథా రచనకు గాను పులికంటి సాహితీ సత్కృతి 2005 
 4.  మొజాయిక్ లిటరరీ అవార్డ్ , విశాఖపట్నం 2018. 

           *****     

  

Please follow and like us:

4 thoughts on “కథా మధురం- సయ్యద్ సలీం”

 1. Excellent story, reflecting todays situation of all most of all mothers. Present day daughters are as explained in this story. Congratulations.

 2. నా కథ “గరిమనాభి” గురించి ఇంత విస్తృతమైన, వివరణాత్మకమైన, అద్భుతమైన విశ్లేషణ చేసిన మేడం గారికి వినమ్రం గా నమస్కరిస్తున్నాను. ఓ చిన్న కథ ను తీసుకుని, దాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి, దాన్లోని గుణదోషాల గురించి చర్చించాలంటే విద్వత్తు తో పాటు సాహిత్య విమర్శ లో చక్కటి నైపుణ్యం కూడా ఉండాలి. ఈ రెండూ మెండుగా కలిగిన విదుషీమణి శ్రీమతి దమయంతి గారికి అభినందనలు. నా కథ నచ్చి మెచ్చుకుని నెచ్చెలి పత్రిక లో పరిచయం చేసినందుకు మేడం గారికి, నెచ్చెలి పత్రిక సంపాదకులకు ధన్యవాదాలు.

  1. సలీం గారు నమస్తే.

   మీ ప్రశంసలకు చెప్పలేనంత సంతోషం కలిగిందండి.
   మీవంటి గొప్ప రైటర్ నించి ఇంత గొప్ప ప్రశంసలనందుకోవడం నాకెంతో ఆనందంగాను, గర్వం గానూ వుంది.

   అయితే ఈ ఘనత అంతా మీ కథకే చెందుతుంది అని మాత్రం కచ్చితం గా చెప్పగలను.

   మీ కథల్లోని స్త్రీ పాత్రలకు ఓ ప్రతేకత వుంటుంది అని చెప్పడానికి ఈ కథ ఓ మచ్చు తునక అని చెప్పాలి.

   ‘కథా మధురం కోసం’ మీ కథ కావాలి అని అడిగిన వెంటనే మంచి కథని పంపినందుకు, నా సమీక్ష పై మీ అమూల్యమైన హృదయస్పందన తెలియచేసినందుకు చాల చాలా ధన్యవాదాలు సలీం గారు!
   శుభాభినందనలతో..

Leave a Reply

Your email address will not be published.