ఒక్కొక్క పువ్వేసి-8

అట్టడుగు కులాలకు మహిళలకు అక్షరాలద్దిన మొదటి టీచర్ సావిత్రీబాయి ఫూలే

-జూపాక సుభద్ర

కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 1848 లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన , మొదటి ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. బతికినంత కాలం స్త్రీ విద్యకోసం, అంటబడని వారికి చదువు నందించడానికి శ్రమించింది.బ్రాహ్మణాధిక్య హిందూసమాజంపై తిరుగు బాటు చేసింది. మద్యపానం పై పోరాడింది. కార్మిక,కర్షక అభ్యున్నతికి ఉద్యమాలు నడిపింది. జ్యోతిబాపూలె తో కలిసి సత్య శోధక సమాజాన్ని స్థాపించి సామాజిక న్యాయం కోసం కృషి చేసిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే. ఆమె మంచి టీచెరని,గొప్ప సామాజిక సేవకురాలని బ్రిటిష్ ప్రభుత్వాలు గుర్తించి గౌరవించినయి. కాని ఆమె సేవను గుర్తించడానికి బ్రాహ్మణాధిపత్య భారతదేశానికి శతాబ్దిన్నర కాలం బట్టింది. ? ఆ గుర్తింపుకు గుర్తుగా ఆమె పేరు మీద ఒక స్టాంపు వేసి చేతులు దులిపేసుకున్నది కేంద్ర ప్రభుత్వం.
కుల సంఘాల, చైతన్యాల వత్తిడి వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలనే జ్యోతిబాపూలే జయంతి,వర్ధంతి ఉత్సవాలు జరపడానికి నిర్ణయించింది. కాని జ్యోతిబాపూలే తో పాటు సమానంగా సమాజానికి సేవ చేసిన సావిత్రిబాయి పూలే జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని పక్కకు పెట్టింది.
ఆధునిక భారతదేశానికి మొదటి టీచర్ , సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే ‘మాలి’ అనే బీసీ కులస్థురాలు. ఆమె 1931 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఖండాలా ప్రాంతంలో గల నాయగావ లో పుట్టింది. తల్లి లక్ష్మిబాయి, తండ్రి ఖండోజీ . సావిత్రీబాయి వంటకో …..యింటికో పరిమితమైన కులం నుంచి వచ్చినామెకాదు. పని పాటల శ్రమ జీవనంలోబతికే కులం నుంచి వచ్చింది. సావిత్రిబాయి ఆడదిక్కులేని జ్యోతీబాఫూలే యింటికి తొమ్మిదేళ్లకే అతని భార్యగా అడుగు పెట్టింది. అప్పట్నుంచి జీవితాంతం సామాజిక ఉద్యమ కార్యకర్తగా, ఉద్యమ నేతగా కొనసాగింది. జ్యోతిబాఫూలే మరణానంతరం కూడా సత్యశోధక సమాజాన్ని మొక్కవోకుండా ముందుకు నడిపిన ఉద్యమకారిణి.
జ్యూతిబాఫూలే చేసిన అన్ని సామాజిక ఉద్యమాల్లో సావిత్రీబాయి ఫూలే ప్రధాన భాగస్వామి. జ్యోతిబా ఫూలే సామాజిక సేవకు భిన్నంగా సావిత్రిబాయి వ్యవహరిస్తే మహిళా పాఠశాలలు, దళిత పాఠశాలలు, సత్యశోధక సమాజాలు నడిపే వాడు కాదేమో ! జ్యోతిబా ఫూలే బాలికా పాఠశాల ఏర్పాటు చేస్తే (1948) పాఠాలు చెప్పడానికి నిరాకరించి దుమ్మెత్తి పోసి నపుడు తీవ్ర అడ్డంకుల నడుమ సావిత్త్రీబాయి ఫూలే టీచరుగా వెళ్లి వాళ్లకు చదువు చెప్పి ఆ పాఠశాలను ఘనంగా నిర్వహించింది. సహచరి అయిన సావిత్రిబాయి తోడ్పాటు భాగస్వామ్యం సహకారం లేకుండా ఫూలే అనేక ఆధిపత్య తీవ్ర వ్యతిరేకతలను తట్టుకొని సామాజిక ఉద్యమాల్ని ఒక్కడే ఒక్క చేత్తో నిర్మించి ఉండేవాడు కాదేమో!స్త్రీ విద్య,పాకీ,మాంగ్ ,మెహర్ లకు పాఠశాలలు ‘సత్య శోధక సమాజ’ స్థాపన యింకా అనేక సంస్థ లలో సామజిక ఉద్యమాల్లో జ్యోతీబా ఫూలేతో సావిత్రీబాయి ఫూలే సగభాగంగా,సమభావంగా నడిచింది,నడిపింది.
‘నువ్వు ఇంటిపట్టునుండు,నే పోరాటం చేస్తా ‘ అనే మగవాళ్ళకన్నా జ్యోతిబా ఫూలే ఆనాడే(దాదాపు రెండు శతాబ్దాల కిందట) వేయిరెట్లు జెండర్ ప్రజాస్వామ్యాన్ని సావిత్రిబాయి ఫూలే పట్ల కనబరచడము గొప్ప విషయం.
జ్యోతిబా ఫూలే తన చదువును చైతన్యాన్ని చదివిన ప్రతి పుస్తకాన్ని సావిత్రీబాయికి పంచేవాడు. అట్లా పంచుకున్న వాటిలో ఫూలేని తీవ్రంగా ప్రభావితం చేసి ,మనిషి హక్కులు, స్వేచ్చ ,సమానత్వాలవైపు నడిపించిన పుస్తకం థామస్ పైన్, రాసిన ‘రైట్స్ ఆఫ్ మాన్.’ అలాంటి చెతన్యం ఫూలేలో అందిపుచ్చుకున్నందువల్లనే హిందూ బ్రాహ్మణ సమాజం నుంచి తీవ్ర ప్రతిబంధకాలెదురైనా ధైర్యంగా సావిత్రిబాయి మొదట బాలికా పాఠశాలకు మొట్టమొదటి భారత మహిళా టీచరయ్యింది. ఆడపిల్లలకు, అంటబడనోల్లకు చదువెందుకు? ఆడదై వుండి బలాదూరుగా బజారు కొచ్చి ,సదువు సెప్పుడేందని సంగానికి కీడనీ,విరుద్దమని ఈసడించినా,ఛీ కొట్టినా, థూ థూ …అని తిట్టినా, అలుకునీల్లు మీద పోసినా… ఆ అవమానాలన్నిటి ని భరించి మహిళలకు నిమ్న జాతులకు చదువు చెప్పింది సావిత్రిబాయి ఫూలే. 
కొల్లాటిల పేరుతో , తమాషాల పేరుతో దళిత కులాల ఆడవాళ్ళమీద జరిగే వ్యభిచార దురా చారాలకు ,బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సావిత్రీబాయి ఉద్యమించింది.
సతి, వితంతు, వైధవ్యం, అనాధ బాలల( సమాజ మోదం లేని సంతానం) వంటి సమస్యలు నిమ్న జాతి స్త్రీలవి గావు. అవి బ్రాహ్మణ స్త్రీల చుట్టు ఆవరించిన దురాచారాలుగా వుండేవి. నిమ్న జాతికి చెందిన సావిత్రి బాయి ఒకవైపు బ్రాహ్మణాధిపత్యం పట్లవ్యతిరేక ఉద్యమాలు నడుపుతూనే బ్రాహ్మణ స్త్రీ బాధితుల్ని అక్కున చేర్చుకుని వారి కోసం ఒక ఆశ్రమం నెలకొల్పింది. వారి సాంఘిక దురాచారాల నిర్మూలన గురించి పోరాడింది.

సావిత్రిబాయి ఫూలే సంస్కరణోద్యమాలు తన జాతి వరకే పరిమితం కాకుండా సమాజం లో బాధితులందరి పట్ల సేవ దృక్పథం కనపరిచింది. ఆమె ఈ విశాల దృక్పధానికి చరిత్రలు ఏ గుర్తిం పులు, విలువలు యివ్వలేదు…. సావిత్రి బాయి నిమ్నజాతిలో కాకుండా ఆధిపత్య బ్రాహ్మణ కులంలో పుట్టి ఉంటే ఆమె చేసిన సామాజిక సేవలకు చరిత్రంతా మోకరిల్లేది. ఆమె మాలి, కులంలో పుట్టి కుల వ్యవస్థను, దాని వివక్షలని, విలువలను ప్రశ్నించి సామాజికంగా నిమ్న వర్గాలకోసం ఉద్యమించింది గనకనే బ్రాహ్మణాధిపత్య భారతజాతి చరిత్రలు సావిత్రిబాయి ఫూలేని విస్మరించినయి. వీరికి సంఘసంస్కర్తలుగా రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి వంటి బ్రాహ్మణ సంస్కర్తలే కనిపించారు. వీరు పెట్టిన బ్రహ్మసమాజాలు, ప్రార్థనా సమాజాలు, సార్వజనిక సమాజాల్లాంటి వాటిని భారత సంస్కరణ ఉద్యమ చరిత్రనిండా గానుగులాగ తిప్పిండ్రు. ఈ సమాజాల్లో పేరు పెత్తనమంతా బ్రాహ్మణ కులాలదే. ఈ సమాజాలన్నీ వారి చుట్టున్న సమస్యల సంస్కరణల కోసం ఏర్పాటు చేసుకున్నవే . కానీ సార్వజనీనమనీ ,సామాజికమనీ,చరిత్రంతా అబద్ధపు ప్రచారం జేసికొన్నరు.
వీరి బ్రహ్మ సమాజాల్లో నిమ్న జాతుల సమస్యలుగాని, మనుషులుగాని కనిపించరు . ఫూలే ‘సత్యశోధక సమాజం’ లాంటి సమాజాల్ని దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నెన్ని సమాజాల్ని మరుగున పడేసిండ్రో.
బ్రాహ్మణ జాతులకు, సమాజాలకు భిన్నమైంది సత్యశోధక సమాజ్. బ్రాహ్మణ దోపిడికి, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, నిమ్న జాతుల అభివృద్ధి కోసం సాంఘిక ఉద్యమాలు నడిపిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే. ఈ వాస్తవాల్ని కులం,బలం,పరపతి,పలుకుబడి వున్న బ్రాహ్మణ చరిత్రకారులు పక్కన పెట్టి అబద్ధం చరిత్రను ప్రజల ముందుంచారు.
శూద్ర,అతిశూద్ర జాతుల విముక్తి కై పోరాడిన సత్యశోధక సమాజాన్ని,దాన్ని స్థాపించిన జ్యోతి బాయి ఫూలే , సావిత్రిబాయి ఫూలేల చరిత్రలను ప్రగతి శీల చరిత్రకారులు మేధావులు, సంఘాలు, కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరు వెలుగులోకి తీసుకురాలేదు. చివరికి మహిళా సంఘాలు, మహిళా చరిత్ర కారులు,ఫెమినిస్టుల పేరుతో వున్న సవర్ణ మహిళలు కూడా సావిత్రీబాయి ఫూలే ని గుర్తించక పోవడం కులవివక్ష గానే అర్థం అవుతుంది.
నిజానికి ఈ ముసుగులతో నాయకత్వాలు చెలాయిస్తున్నాదంతా బ్రాహ్మణ ఆధిపత్య కులాలే. అందుకే వెనుకబడిన జాతికి చెందిన గొప్ప ఉద్యమకారిణి ,సంఘసంస్కర్త స్పూర్తి,
చైతన్యం వ్యాపిస్తే వారి ఆధిపత్యాలు అడుగంటి పోతాయని జంకి జ్యోతిబాయి ఫూలే,సావిత్రీబాయి ఫూలే చరిత్రల్ని చీకటి చేయ ప్రయత్నించినయి అట్లా మరుగున పడిపోయిన చరిత్రల్ని బయటకు తీసుకు వస్తున్న శక్తులు నేడు దళిత బహుజనులే. ఆ క్రమంలోనే సావిత్రిబాయి ఫూలే చరిత్ర ను బయటకు తెచ్చిన ఎం. జి. మాలి(1982) పూల్ వంత్ బాయి ఘోగడే(1999), రజనీ తిలక్, విజయ్ చేన్ లకు తెలుగులోకి తీసుకొచ్చిన బి. యం. లీలా కుమారి గారికి అభినందనలు చెప్పాలి.
సావిత్రీబాయి సామజిక ఉద్యమ నాయకురాలు, సంస్కర్త నే కాదు,ఆమె గొప్ప రచయిత్రి. కావ్యాఫూలే,భావన్ కషి ,సుభోధార్ లాకర్ వంటి రచనల్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు.
సావిత్రిబాయి ఫూలే గొప్ప ఆచరణా వాది , సమాజ ఆమోదం లేని సంతుని దత్తత తీసుకొని సమాలించింది. 1890 లో తన భర్త జ్యోతీబాఫూలే మరణిస్తే సమాజరీతికి భిన్నంగా, నియమాలన్నింటిని ధిక్కరించి పితృస్వామిక విలువల్ని తృణీకరించి తనే అంతిమసంస్కారాలు నిర్వహించిన ఘనత సావిత్రి బాయిఫూలేది.ఆ కాలంలోనే వందల కులాంతర వివాహాలు చేసింది. స్వయాన తన దత్త పుత్రునికి కూడా కులాంతర వివాహం చేసింది. అనేక వ్యతిరేకతలను ఎదుర్కొన్నది. తన పెరట్లో బావిని తవ్వించి అంటరాని వాళ్ళకు నీటికొరత తీర్చింది.(ఆ బావి ఇంకా వాళ్ళ పెరట్లో వుంది)
అట్లాంటి గొప్ప సంఘ సేవకురాలు ఫూలే మరణం తర్వాత కూడా దళిత,బహుజన కులాలకు,స్త్రీలకు విద్యనందిస్తూ,సాంఘిక దురాచారాల నిర్మూలనకు పాటుపడుతూ,ప్లేగువ్యాధి పీడితులకు సేవ చేస్తూ ,ప్లేగు వ్యాధికి గురై 1897 మార్చి 10 వ తారీఖున అమరత్వం పొందినది. సావిత్రీబాయి జీవితాదర్శాన్ని విస్తృతి చేయడానికీ,గౌరవించడానికి,ప్రభుత్వాలు ఆమె జయంతి,వర్ధంతి ఉత్సవాల్ని నిర్వహించాలి. నిమ్న జాతులకూ,స్త్రీలకూ చదువు చెప్పిన మొదటి మహిళా టీచర్ అయినందుకు ఆమె జన్మదినమైన జనవరి 3 ను టీచర్స్ డే గా,జాతీయ మహిళా దినంగా ప్రకటించాలి. ఏదైనా యూనివర్సిటీ కి (రాబోయే) సావిత్రీ బాయి ఫూలే పేరు పెట్టాలి. స్ఫూర్తి ప్రదమైన ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయాలి. ఆమె శిలావిగ్రహాలు ఏర్పాటు చేయాలి.

  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.