కంచె 

-శీలా సుభద్రాదేవి 

                      

నాతాన పైసల్లేవు పీజులు కట్టాల్నంటే ఏడకెల్లి తెవాల్ని? నామిండడితాన కెల్లి తేవాల్నా? ఏంజేస్తె గది సెయ్యుండ్రి. నేనేమనా. పోరల్ని ఇంటికి తోలిస్తమంటారా గట్లే తోలియ్యుండ్రి…” ప్రక్క క్లాసుముందు వరండాలో నిలబడి పెద్దగా అరుపులు విని నాక్లాసునుండి బయటకు వచ్చాను.

“ఏమిటమ్మా ఆ అరుపులు, స్కూలు అనుకున్నావా? బజారనుకున్నావా? స్కూలు జరుగుతున్నప్పుడు వచ్చి మర్యాదలేకుండా అరుస్తున్నావు? విషయమేమిటి?” అనేసరికి ఆవిసురంతా నామీదకి తిరిగింది.

“ఏందీ! నేనరుత్తున్ననా! గిప్పుడు పీజు తెమ్మని ఇండ్లకాడికి తోలిస్తే ఎందలపడి సావాల్న. పీజులు లేవనే ఇ ఇస్కూల్ల షరీకు చేసిన. మల్ల పీజులు అనబట్టిన్రు. నేను గరీబుదాన్ని నాతానలేవు. నాపోరల్ని ఉంచల్నా తోలుకెల్లల్నా ఏందో చెప్పుండ్రి” నిలువెత్తు మనిషినడుం మీద చేతులు పెట్టుకొని పైపైకి వస్తుంటే ముందు తెల్లబోయాను.

అంతలోనే నాలో నేను సర్దుకొని “చూడమ్మా ఫీజులంటే వందలూ వేలూకావు కదా! నెలకి అయిదురూపాయలు. అదికూడా కట్టనంటే ఎట్లా?” సమాధానపరచ బోయాను.
“గిదొ టీచరమ్మా! నువ్వు ఎయ్యిసెప్పు. లచ్చసెప్పు నాతాన పైసలులేవంటే లేవు. ఏడకెల్లి తెచ్చియ్యాల్నో నువ్వు చెప్పు జరపైసలుకోసమేకదా పొద్దుగాల్న లేసినకాడ్నుంచి ఉరుకురికి పనిచేసేది. ఉంటేకట్టనా” కొంచెం శాంతించినట్లే కనిపించింది.

ఇంగ్లీషుమీడియం క్లాసులకి ప్రతీనెలా స్పెషల్‌ఫీజు తాలూకు డబ్బు ప్రభుత్వానికి చలాన్‌ కడితేనే మాకు పేబిల్లు సేంక్షన్‌ అవుతుంది. మాబాధలెవరికి చెప్పుకోవాలి నాలో నేను అనుకున్నాను. అంతలో ఆ గొడవకి హెడ్‌మిష్ట్రస్‌ ఆవిడని తన రూముకు పిలిపించారు.

“హమ్మయ్యా” వానవెలిసినట్లుంది అనుకొంటూ తిరిగి నాక్లాసులోకి వెళ్తూ ప్రక్కక్లాసు టీచర్ని ‘ఎవరావిడ?’ అని అడిగాను.

“మాక్లాసులోని నాగమణి వాళ్ళఅమ్మ. సంవత్సరం పూర్తికావచ్చింది. ఇంత వరకూ ఫీజుకట్టలేదు. ఫీజులు వసూలుకాకపోతే పేబిల్లు ఆగిపోతుందని నిన్న మేడం సర్క్యులర్‌ పంపారు కదా అని ఈరోజు ఆ అమ్మాయిని ఇంటికి పంపించాను. ఇంతలో ఆవిడ రాక్షసిలా వచ్చిపడింది” ఆ క్లాసు టీచరు భయంగా గుండెలమీద చేయివేసుకుంది.

బెల్‌ ఆయ్యేసరికి అటువైపు వచ్చిన మరొక టీచరు “ఏమిటండీ! నాగమణి వాళ్ళమ్మ ఏదో పనిమీద వచ్చినట్లుంది. అమ్మబాబోయ్‌ ఆవిడతో మాటాలాడాలంటే భయం. క్రిందటి సంవత్సరం నాగమణి నా క్లాసేకదా! అప్పుడూ సంవత్సరం అంతా ఫీజుకట్టలేదు. ఇంక ఆఖరికి ఆవిడ నోటికి భయపడి నేనే వేసి కట్టేశాను. ఈ సంవత్సరం ఆవిడ కొడుకులు ఇద్దరూ నా క్లాసులో ఉన్నారు. ఇంత వరకూ స్కూలు ఫీజు సరే కట్టలేదు. ఏడోతరగతి పరీక్ష ఫీజు కట్టాలికదా! అదీ కట్టలేదు ఏంచెయ్యాలో అర్థం కావట్లేదు” అంది.

“ప్రతీ సంవత్సరం ఎవరో ఒకరం ఫీజులుకడుతుంటే మొత్తం వీళ్ళు ప్రతీక్లాసూ అలాగే దాటిపోతారు సరే. ఇది తెలిసి మిగతా పిల్లలుకూడా ఈదారేనడుస్తే ఎంతమందికని కడతాం” ఇంకో టీచరు అన్నారు.
ఆ విషయం గురించే ఆలోచించుకొంటూ ఎవరి క్లాసులవైపు వాళ్ళం నడిచాము.
తర్వాత నాగమణి ఉన్నక్లాసుకి నేను వెళ్ళినపుడు ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి వివరాలు అడిగాను.

“నేనూ, తమ్ముళ్ళూ టికిలీ పేకెట్లు తయారుచేస్తాం టీచర్‌. పేకెట్టుకి పన్నెండు రూపాయలువస్తాయి. ఇంకానేమో పూలువస్తాయి. అవి మాలలుకట్టి తిరిగి ఇవ్వాలి. మా అమ్మేమో బాసాన్లపనికి పోతుంది.”

“మరి మీరు పనికి వెళ్ళరా?” అన్నాను.

“లేదు టీచర్‌, నన్ను స్కూలుకి తప్ప బయటికి పంపదు. తనే పోతుంది. ఇంటికాడ పనుల్నే చెయ్యనిస్తది.”

“మరి మీనాన్న?” సందిగ్ధంగా అడిగాను

ముందు ఏమీ మాట్లాడలేదు. తర్వాత మెల్లగా “వేరే యింట్ల ఉంటడు” అంది.

“అంటే మీయింటికి రాడా?” ఆదరంగా చూసాను. అడ్డంగా తల ఊపింది. “నాకొచ్చే పైసల్నుండి మా అమ్మకి తెల్వకుండా ఫీజురేపు కట్టేస్తా టీచర్‌” కళ్ళనీళ్ళ పర్వంతమౌతూ నెమ్మదిగా అంది. నేనేం మాట్లాడలేదు.

తర్వాత ఓవారం పదిరోజులకను కుంటాను. లంచ్‌ టైములో చిన్న క్లాసు పిల్లలు పొలోమని స్టాపురూములోకి వచ్చి గొడవ గొడవగా అరుస్తుంటే ఏమిటా అని అడుగుతే-”ఎనిమిదోక్లాసు అక్క, మరోఅన్నా కలిసి టెర్రస ్‌మీద కెళ్ళారు” అని పోటీలు పడి అరిచి చెప్పటం మొదలెట్టారు. కంగారుగా టీచర్లు ఒకరిద్దరం కలిసి టెర్రస్‌ మీదకి పరుగెత్తాం.

ఈలోపునే గబగబా కిందకి దిగుతున్న నాగమణిని ఒక టీచరు పట్టుకొంది. టెర్రస్‌ మీదకి వెళ్ళేసరికి స్కూలుకు చెందని ఇద్దరు కుర్రాళ్ళు కనిపించారు.

ఎందుకొచ్చారని ప్రశ్నిస్తే పొంతన లేకుండా సమాధానాలు చెప్పారు. వాళ్ళని మందలించి కిందకి తీసుకొచ్చాం. ఈలోపున వాళ్ళు చల్లగా జారుకున్నారు.

నాగమణిని వాళ్లెవ్వరని ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. ఆ పిల్లతమ్ముడు సంతోష్‌మాత్రం “మాబస్తీలోనే ఉంటారని చెప్పాడు.

ఇలాకాదని సంతోష్‌ని పంపించి వాళ్ళమ్మని పిలుచుకురమ్మన్నాం. కాసేపటికే ఆవిడ లబోదిబోమనుకుంటూ వచ్చింది.

“ఏమయ్యింది. మాపోరి ఏంచేసింది” ప్రశ్నించింది.

“ఏమీకాలేదు. కానీ నాగమణి ప్రవర్తన సరిగాలేదు. ఇంతకుముందు ఒకటి రెండుసార్లు ఆ కుర్రాడితో మాట్లాడుతుండగా చూశాము. ఇప్పుడు ఏకంగా స్కూలులోకే వచ్చేసి టెర్రస్‌మీదకి పిలుచుకువెళ్ళాడు. స్కూల్లో ఇలాంటివి నడవవు. ఒకరు చేశారంటే మిగతా పిల్లలు కూడా మొదలెడతారు. స్కూల్లో ఉన్నంతసేపూ మేము కట్టడి చేయగలుగుతాం. స్కూలువిడచిన తర్వాత ఏంజరుగుతాయో మేము కనిపెట్టలేంకదా! ఆ పిల్లాడు మీ బస్తీవాడేనట. వాడెవడో ఏమిటో నెమ్మదిగా కనుక్కోని మందలిస్తావని పిలిపించాం…” ఇంకా హెడ్‌మిస్ట్రస్‌ మాట్లాడుతోనే ఉంది.

“ఏందే రండదాన! ఎవడాడు. బుద్దిగా సదూకుంటవని ఇస్కూలికి తోల్తే ఇసుమంటి పనేంటే? నేనెట్టాగా చెడిపోతిని మీ బతుకులన్నా బాగుండాలని నాలుగచ్చరాలు నేరుత్తారని నాపాట్లు నేపడతంటే నిన్ను దొంగల్దోలా. నీకేపిశాచి పట్టిందే. ఇంటికి రాయే నిన్ను చంపి నేసత్తాను.” శివమెత్తినట్లు ఊగిపోతూ నాగమణిని బాదుతోన్న ఆమెని చూసేసరికి మాకందరికీ భయం వేసింది. నిజంగా నాగమణిని చంపినా చంపుతుందేమోననిపించింది.

“దీనంత పున్నప్పటి సంది నాఎంటబడితే అవ్వబాపులకాడ సల్లంగ ఉన్నదాన్ని ఒళ్ళు బలిసి ఇల్లొదిలి ఆసచ్చినాడితో అచ్చేసిన. నాకష్టంతోనే తిని తిరిగి ఒక దెబ్బకాదు ఒక సావుకాదు రేతిరిపొగలు తాగి నన్ను ఇరగదీసేసి దీని బాబు నాబతుకల నిప్పులుపోసి ఆడుమాతరం కులుకతా సస్తన్నాడు. మీ బాబుతానకే పాండ్రి. నువ్వూ నీతమ్ముల్లూ, నాబతుకునేను సత్తా. మిమ్మలందర్నీ నేనుసాకలేను. నా ఎదాన మిమ్మల్ని వడేసి ఆడు మరో పెల్లంతో పాయి సక్కంగనే ఉండే….” నెత్తిబాదుకుంటూ మధ్యలో పిల్లల్ని ఒకదరువు వేస్తూ, తిడుతూ, ఏడుస్తూ అరుస్తోనేఉంది.

“ఇదిగో! కాస్త మా మాట విను. ఆ పిల్లని చంపటానికో నువ్వు చావమని చెప్పటానికో కాదు నిన్ను పిలిచింది. కొంచెం ఆవేశం తగ్గించుకొని మేము చెప్పేది చెవిని వేసుకో”

“స్కూల్లో ఉన్నంతసేపూ మేము కనిపెట్టి చూసుకోగలం కానీ స్కూలు బయటో, దార్లోనో ఎక్కడ ఏం జరిగినా చూసుకోలేం కదా! నువ్వు కొంచెం కనిపెట్టుకొని పిల్లని చూసుకోవాలని చెప్పటానికి పిలిపించాం”

“నిజానికి పిల్లది కాదుతప్పు. తెల్లారిలేస్తే టీవిల్లోనూ, సినిమాల్లోనూ ప్రేమపేరున ఈ తిరుగుళ్ళే! తెలిసీ తెలియని వయస్సు అదే నిజమనుకొంటారు.”

ఇట్లా తలో ఒకమాట చెప్పి ఆమెని శాంతపరచటమేకాకుండా నాగమణికి కూడా మంచీ చెడూ బోధపరచి మళ్ళీ అలాంటి సంఘటన జరగకుండా ప్రవర్తించాలని హెచ్చరిక కూడా చేసి పంపించాం.

ఇక ఆ రోజంతా ఇవే కబుర్లు. టీనేజి పిల్లల్ని ఆకర్షణలో పడేస్తున్న ప్రేమ పేరున వస్తోన్న సినిమాల గురించి ఇలా అనుకోవ టమే కాని వాటిని ఆపలేని అసహాయత అందర్లోనూ కలిగింది.

ఆమర్నాటి నుండి నాగమణిని ఆమె తమ్ముళ్ళని స్వయంగా వాళ్ళ అమ్మ తీసుకు వచ్చి స్కూల్లో దింపి ప్రార్ధన పూర్తై క్లాసులు మొదలెట్టేవరకూ ఉండివెళ్తోంది. సాయంత్రంకూడా స్కూలు విడిచే సమయానికి వచ్చి తీసుకెళ్తోంది.

క్రమం తప్పకుండా ఆమె అలా కూతురికి అంగరక్షకురాలిగా మెలగుతూ ఉండటం చూసి ముగ్ధురాలినైపోయాను ఇలా రోజూ రావటం నీ పనికి ఇబ్బంది కావటంలేదా” అని ఓసారి పలకరించాను.

“ఇంకేంజేతు. పోరిఏడ బదనాం అయితదోనని బుగులైతది. నేను పనిచేసేకాడ జరలేటు అయితదని కాల్‌మొక్కిన.” అంది.

ఈమెలో కరుకుతనమేకాదు. కొద్దిపాటి మెత్తతనం కూడా ఉందని ఆరోజు తెలిసింది.
మరి కొద్దిరోజులకే ఆమెలోని మరో కోణాన్ని చూసే సంఘటన జరిగింది.

ఆ రోజు స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమంలో నాగమణి కూడా పాల్గొంది.

లంగా ఓణీవేసుకొని పొడుగుజడ, జడ నిండా పూలతో విరిసీ విరియని గులాబిలా, బాపుబొమ్మలా ఉంది.

ఏదో సినిమా పాటకి సోలో డాన్సు చేస్తోన్న నాగమణి ముగ్ధమనోహరంగా ఉంది. మేకప్‌లో ఉండి, డైరెక్టరు చెప్పిట్లు నర్తించే తారలకన్నా అసాధారణంగా ఉన్న అందంతోనే కాక పాటకి అనుగుణంగా హావభావ ప్రకటనతో నర్తిస్తోన్న ఆపిల్ల ముద్దుగా అనిపించింది. అంతలోనే పక్కన కూర్చున్న టీచరు “ఆమెని చూడండి కూతురు డాన్సు మొదలెట్టిన దగ్గర నుండి ఏడుస్తోనే ఉంది” అంది.

చటుక్కున అటు చూసాను. వరండాలో దూరంగా స్థంభంకి ఆనుకొని కూర్చొని కారుతోన్న కన్నీళ్ళు తుడుచుకొంటేనే ఉంది నాగమణి తల్లి. ఒక విద్యార్థిని పంపించి ఆమెని పిలిపించాను. “అమ్మాయి చూడు ఎంత చక్కగా చేస్తోందో. సంతోషించటానికి బదులుగా ఎందుకమ్మా అంతలా కుమిలి కుమిలి ఏడుస్తున్నావ్‌” ఆప్యాయంగా అన్నాను.

“చూస్తున్నకొద్దీ గుబులు గుబులైతందమ్మ. బూవంతా సెడిపోయింది. ఈ పాడు పెపెంచంలో ఈ పోరిని నారెక్కల సందుల ఎన్నొద్దులు కాసుకోగలను సెప్పు. గయ్యాళిలా నోరెట్టుకుపడతానని మీ అసుంటోల్లు తిడతారు. ఆ నోటికి బయపడే నా బిడ ్డజోలికి ఎవరూ రానీకి ధైర్నం సేయట్లేదు. నేనెట్టాగ మొగుడుండీ లేనట్టుగా బతకతన్నా, గా మొగపొరలు నా తిండి తింటూ బాపు ఎనకాలే తిరుగుతారు. ఆళ్ళమీద నాకేబెమలూ లేవు. గీపోరినే గెట్లన్నా పది సదీపించి మంచి పోరణ్ణి సూసి లగ్గం సెయ్యాలనుంది. నాచేతనైతదా! నేనెట్టకాసుకోవాల” ఎన్నేళ్ళ దుఃఖమో పొరలు పొరలుగా తెరలు తెరలుగా అగ్నిపర్వతం నుండి వెళ్ళుకొస్తున్న లావాలా దుముకుతోంది.

ఏమనటానికీ నాచుట్టూ ఉన్న ముళ్ళ కంచెలు అంతకంతకూ బిగుసుకుంటోంటే నిశ్చేతనంగా అలాగే ఉండిపోయాను.

         

******

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.