భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార

లతామంగేష్కర్

-ఇంద్రగంటి జానకీబాల

శ్రుతి లత లత శ్రుతి అన్నారు బడేగులాం అలీఖాన్ . అంతటి గొప్ప సంగీత కారుడు, విద్వాంసుడు, గాయకుడు మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్ గురించి చెప్పిన మాటలు నిజంగా సరస్వతిదేవి నాలుక నుంచి జాలువారిన సంగీతాక్షరాలు.

లతా మంగేష్కర్ కారణజన్మురాలు. అలాంటి మహా వ్యక్తులు, కళాకారులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఏ దేశంలోనైనా అలాంటి జన్మ జీవితం అపురూప సందర్భాలే!

సాధారణ సమాజం సినిమా అంటే ఎంత వ్యామోహం కనబరిచినా, సినిమా పరిశ్రమలో పనిచేసే వారిపట్ల ఒక చిన్న చూపు కనబరుస్తారు. వారు నటులైనా, నటీమణులైనా, దర్శకులైనా, రచయితలైనా, సినిమా రూపకల్పనలో తమ జీవితాలు అర్పితం చేసినవారైనా.  ఆ పరిశ్రమకి ఊపిరిపోస్తున్న వారిని బయట సమాజం ఒక విచిత్రమైన దృష్టితో చూస్తుంది.

లతామంగేష్కర్ చాలా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను స్వీకరించవలసిన పరిస్థితి వచ్చింది. అకస్మాత్తుగా తండ్రి మరణించటం, గంపెడు సంసారం దిక్కుతోచని స్థితి. లత పెద్ద పిల్లగా తనే ఏదోవిధంగా ఆ యింటిని నిలబెట్టాలని దృఢంగా సంకల్పించుకుంది. నిజానికి అప్పటికి ఆమెకి పెద్ద వయసేం లేదు. తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గొప్ప సంగీత విద్వాంసుడు, మేథావి. సంగీతం మీదనే జీవనం సాగించేవారికి పెద్దగా ఆస్తిపాస్తులు, ఆదాయాలు ఎక్కడినుంచి వస్తాయి?

అప్పుడప్పుడే సినిమా పరిశ్రమ బొంబాయి నగరంలో మొగ్గ తొడుగుతోంది. కళాకారులన్న వారందరూ ఆ పరిశ్రమ వైపు ఆశగా చూస్తున్నారు.

ఇక్కడ లతామంగేష్కర్ కి అంత చిన్నవయసులోనే వున్న ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం గురించి చెప్పుకోవాలి. నిండా పద్దెనిమిదేళ్ళు నిండని ఆడపిల్ల స్వతంత్రంగా, సమాజంలోని ఆటుపోట్లని ఎదుర్కొని  నెగ్గుకు రావాలనే దృఢనిశ్చయానికి రావడం ఆమెలోని గొప్ప లక్షణం. అయితే ఆమె దగ్గర ఏముంది? తన జీవితాన్ని ప్రారంభించటానికి ఒక్క సంగీతం మాత్రమే. ఆమె గాత్రం, ఆమె సంగీత జ్ఞానం, సంగీతాన్నే నమ్ముకునే దృఢసంకల్పం. అంతే! ఇవే ఆమె దగ్గరున్న ఆయుధాలు. ఆమె వాటికే పదును పెట్టి శ్రద్ధగా వాడిగా తయారు చేసుకుని రంగంలోకి దూకింది. ఎంత సంగీత జ్ఞానం, ప్రతిభ ఉన్నప్పటికీ దానిని అర్థం చేసుకుని, అవకాశం యిచ్చేవ్యక్తులు కూడా అవసరం కదా! అదే అసలు సమస్య. కళాకారులకి వేట – అవకాశం యిచ్చేవారికి ఆట.

లత, ఉష, మీనా, ఆశా అందరూ ఆడపిల్లలు. అందరూ సంగీత సప్తస్వరాల గమకాలే. చివరిగా హృదయనాధ్ మంగేష్కర్ మగపిల్లాడు. అతనూ సంగీత దర్శకునిగా బాగా రాణించాడు.

మొదటగా లత ఒక సైకిల్ మీద బయిలుదేరి సంగీత దర్శకుల్ని, సినిమా కంపెనీల వారిని కలుస్తూ తనలోని ప్రతిభను వారికి తెలియజేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందరూ విన్నారు, కొందరు తలలూపారు, కొందరు మాటలతో ప్రోత్సహించారు, ‘చూద్దాం’ అన్నట్లుగా తలలూపారు ఇంకొందరు.

అప్పటికే ప్రసిద్ధులైన, సంగీత దర్శకులు గులాం అహ్మద్ లతామంగేష్కర్ లోని ప్రతిభని, ఆమెలోని నిబద్ధతని గ్రహించి ఆమెని పరిశ్రమకి పరిచయం చేయడానికి సిద్ధమైనారు.

అయితే లత గొంతు చాలా సన్నగా ఉందనీ, హీరోయిన్లకి పాడిస్తే, పాట ప్రేక్షకుల్ని చేరుతుందా అని ఆక్షేపించిన వారూ ఉన్నారు. కానీ మైక్రోఫోన్ లో ఆమె గొంతు చక్కగా, స్పష్టంగా వస్తుందని గ్రహించిన గులాం అహ్మద్ ఆమె చేత పాడించారు. కొత్త తరానికి శ్రీకారం చుట్టారు.

అప్పట్లో నూర్జహాన్, సురయా, షంషాద్ బేగం మొదలైన గాయనీ మణులు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తూ వున్నారు. దేశ విభజన సమయంలో నూర్జహాన్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఇంతలో  లతామంగేష్కర్ లోని టాలెంట్ ని అందరూ గ్రహించారు.

ఒక్కొక్కరూ లత చేత పాడించటం మొదలు పెట్టారు. నౌషాద్, ఖయ్యం, సి రామచంద్ర, వసంత్  దేశాయ్, శంకర్ జైకిషన్ లాంటి ప్రతిభావంతులైన సంగీత దర్శకులు లత చేత పాటలు పాడించి, హిట్ చేశారు.

అనతికాలంలోనే లతామంగేష్కర్ తిరుగులేని నేపథ్యగాయనిగా సముచిత స్థానాన్ని సంపాదించుకున్నారు.

రాజ్ కపూర్ చిత్రాలైన  ఆహ్, బర్సాత్ లాంటి చిత్రాల్లో శంకర్ జైకిషన్ సంగీతం దేశమంతా మారుమోగి పోయింది. ఆ సంగీతానికి మూలాధారం లతామంగేష్కర్ గొంతు, ఆమె పాడేవిధానం అని చెప్పకతప్పదు.

హిందీ సినిమా పాట అంటే అది లతామంగేష్కర్ కంఠంగా అందరి మనసుల్లోనూ  నిలిచిపోయింది. ఆ తర్వాత ఆమె సుమారు 40 ఏళ్ళపాటు మకుటం లేని మహారాణిలాగా బొంబాయి హిందీ సంగీత సామ్రాజ్యాన్ని పరిపాలించారు.

ఆమె చెళ్లెళ్ళు ఆశా, ఉష, మీనా కూడా ఆమెతో పాటూ పాడినా ఒక్క ఆశాభోంస్లే  మాత్రమే లతామంగేష్కర్ తో సమానంగా విభిన్నమైన పాటలు పాడి, తన వ్యక్తిత్వాన్ని గాయనిగా నిలబెట్టుకున్నారు.

రాజ్ కపూర్ ప్రేమలేఖలు చిత్రానికి శంకర్ జైకిషన్ తెలుగులో సంగీతం కూర్చారు. అక్కడ లత, ముఖేష్ పాడిన పాటలు ఇక్కడ తెలుగులో జిక్కి  (పి.జి. కృష్ణవేణి), ఏ.ఎమ్. రాజా పాడారు. అవి తెలుగు నాట ఎంతో ప్రాచుర్యం పొందాయి. కల నిజమాయగాఅంటూ ఆ రోజుల్లో పాడని వారు లేరు. మన తెలుగు సినిమాలో లతామంగేష్కర్ చేత పాట పాడించాలని సుసర్ల దక్షిణామూర్తి సంతానంఅనే సినిమాలో నిదుర పోరా తమ్ముడాఅంటూ అందమైన పాట పాడించారు. ఈ నిదుర పోరా తమ్ముడామన తెలుగు వారికెంతో నచ్చింది. ఎంతో పాప్యులరయ్యింది.

ఆ తర్వాత 80 లలో లత చేత ఇళయరాజా ఆఖరి పోరాటంలో పాడించారు. అప్పటికే ఆమె గొంతులో కొంత మార్పు వచ్చింది.

రేడియో సిలోన్వల్ల మన తెలుగు వారికి హిందీ సినిమా పాటలు చాలా సుపరిచితాలు. ఆ విధంగా లతామంగేష్కర్, ఆశాభోంస్లే, మహమ్మద్ రఫీ , మన్నాడే, కిషోర్ కుమార్ మొదలైన వారు తెలుగు వారికి ఆత్మీయులే. 

ఆకాశవాణి వారు వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభించాక, హిందీ సినిమా పాటలు తెలుగువారికి మరీ చేరువయ్యాయి. ఆ విధంగా బొంబాయి గాయనీ గాయకులు తెలుగువారికి ఎంతో చేరువయ్యారు.

లతా మంగేష్కర్ సంపూర్ణ జీవితం జీవించారు. ఎన్నో పురస్కారాలు, గౌరవాలు, మన్ననలు పొందారు గానీ, ఆమె భారతదేశ చరిత్రలో పక్కకి వెళ్లింది  లేదు. జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ, వాజ్ పాయ్ అందరూ ఆమెని ఎంతో గౌరవించారు. మన దేశ ప్రెసిడెంట్లు అందరూ ఆమెను ఏదో విధంగా సత్కరించారు. ఆమె సినిమా నేపథ్యగాయని అయినా ఒక సంగీత సామ్రాజ్యానికి మహారాణీగా గౌరవాలందుకున్నారు. ఆమెకు సుమారు 70 ఏళ్ళ సంగీత ప్రస్థానం వుంది. చాలా చిన్న వయసులో ప్రారంభించారు. 92 ఏళ్ల వయస్సులో మరణం సహజమే. అయినా లత లేని లోటు పూడ్చలేనిది. 

ఆమె మాతృభాష మరాఠీ అయినా ఆమె మన జాతీయ భాషైన హిందీలో ప్రథమ వ్యక్తిగా గౌరవం పొందడం ఆమెకి ఉచిత సన్మానం, సత్కారం అని చెప్పుకోవాలి.

సంగీతానికి మరణం లేనట్లే లతామంగేష్కర్ కి మరణం లేదు. ఆమె భౌతికంగా ఇక్కడ మనతో కలిసి లేకపోయినా భారతీయుల గుండెలలో ఆ మాటకొస్తే, ప్రపంచ సంగీతాభిమానుల మనస్సులో ఆమె గానం శ్రుతి, లయ, రాగాలతో నాట్యం చేస్తూనే వుంటుంది.

ఆమె సంగీతానికి ఎప్పటికీ మరణం వుండదు. ప్రతీ ఇంటా ఆమె సంగీతం ఎప్పటికీ మారుమ్రోగుతూనే వుంటుంది.

ఈ గాలిలో, ఈ వెలుగులో , ఈ నదులలో,  ఈ పర్వతాలలో లతా మంగేష్కర్ గానమై ఎప్పుడూ కదులుతూనే వుంటుంది.

నాకు ఇష్టమైన లత పాటలు కొన్ని:

  1. ఆయేగా ఆయేగా – మహల్
  2. ఎ జిందగీ ఉసీకి హై – అనార్కలి 
  3. జియా చేకరార్ హై – బర్సాత్ 
  4. నయనా బర్ సే –  ఓ కౌన్ థీ 
  5. ప్యార్ కి యాతో  – మొఘల్ –ఇఅజామ్ 
  6. జిందగీ భర్ నహీ భర్సాత్ కి రాతే 
  7. ఓ సజనా – ఫరఖ్ 
  8. అల్లా తేరో నామ్ 
  9. పియో తోరే నయనా 
  10. సకిరే పికనా 
  11. నామ్ నా పూఛో 
 

*****

Please follow and like us:

One thought on “భారతదేశ సంగీత వినీలాకాశంలో నిలిచిన మహోన్నత ధృవతార – లతామంగేష్కర్”

  1. భారతదేశ  సంగీత వినీలాకాశంలో వ్యాసం చాలా బాగుంది. సంగీత శిఖరమైన లతగారి గురించి చక్కగా వివరించారు.

Leave a Reply

Your email address will not be published.