మా అమ్మ విజేత-5

– దామరాజు నాగలక్ష్మి

ఇంటికి వచ్చిన సుబ్బారావు “అమ్మా… ఏంచేస్తున్నావు… నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు. 

ఒక్కడే వచ్చిన సుబ్బారావుని చూసి “సుబ్బారావ్ అమ్మాజీ ఏది? నాతో ఏం మాట్లాడతావు చెప్పు. ఏమైందసలు” అంటూ గాభరాగా వచ్చి సుబ్బారావు పక్కన మంచమ్మీద కూర్చుంది.

“అమ్మా… నువ్వేమీ కంగారు పడకు. ఏమీ జరగలేదు. అమ్మాజీ వాళ్ళ పెద్దమ్మా వాళ్ళింట్లో ఉండి బాగానే ఆడుకుంటోంది. అక్కడే అన్నం తిని వస్తానంది. నేనూ సరే అని వచ్చేశాను.”

“మరి ఏదో మాట్లాడాలన్నావు. చెప్పు” అంది. 

“ఏమీలేదమ్మా… అమ్మాజీని చదువుకోనివ్వకుండా స్కూలు మాన్పించాం. ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు. బయటికి పంపించడం ఇష్టం లేక. సరోజకేమో… ఓపిక లేదు. పిల్లల్ని చూసుకోలేదు. పోనీ వాళ్ళమ్మ దగ్గిరికి పంపిద్దామంటే… ఆవిడ కౌన్సిలర్ గా చేస్తోంది అస్సలు తీరుబడి వుండదు. నీకా పొలం పనులు చూసుకోవడం సరిపోతోంది. సరోజ ఓపిక లేని తనానికి అమ్మాజీ బలైవుతోంది. నాకేం చెయ్యాలో తోచట్లేదు. కానీ వీరభద్రంగారు, అమ్మాడమ్మగారు ఇవాళ సరోజ తమ్ముడు సూర్యంకి అమ్మాజీని ఇచ్చి పెళ్ళిచేస్తే బావుంటుంది. అమ్మాజీని ఒక ఇంటిదాన్ని చేసినట్టుంటుంది. సూర్య కూడా కుదురుగా ఉద్యోగం చేసుకుంటాడు అన్నారు. నువ్వేమంటావు” అన్నాడు. 

వీలక్ష్మిగారు కొడుకు వంక నవ్వుతూ చూసి, “మంచి ఆలోచన సుబ్బారావ్. నాకు ఇది బాగానే అనిపిస్తోంది. సూర్యం కూడా చిన్నవాడే కాబట్టి కుదురు లేదు. పెళ్ళి చేస్తే కుదురు అదే వస్తుంది. కానీ ఇద్దరికీ 11 సంవత్సరాలు తేడా వుంటుంది. పోనీలే తెలిసిన సంబంధం కదా.. నేను మంచిరోజు చూసి ఏలూరు వెళ్ళి అన్నపూర్ణమ్మగారితో మాట్లాడి వస్తాను” అంది. 

సుబ్బారావుకి కూడా తల్లి అలా మాట్లాడ్డంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. మాటల మధ్యలో సరోజతో సుబ్బారావు అమ్మాజీ పెళ్ళి సంగతి మాట్లాడాడు. 

సరోజ “ఏమోమరి నాకేమీ తెలియదు. మా అమ్మతో మాట్లాడండి. అత్తయ్య వెడతానన్నారుగా అమ్మ దగ్గిరకి. అమ్మకి కూడా అమ్మాజీ అంటే ఇష్టమే. మా నాన్న కూడా ఏమీ అభ్యంతరం చెప్పకపోవచ్చు” అంది. 

వీరలక్ష్మిగారు ఏలూరు కలక్టర్ ఆఫీసులో ఏదో పని వుంటే చూసుకుని, అల్లాగే అన్నపూర్ణమ్మగారితో మాట్లాడి వద్దామని బయల్దేరింది. 

మధ్యాహ్నం భోజనం టైముకి ఏలూరులో పని చూసుకుని, వియ్యపురాలు అన్నపూర్ణమ్మగారింటికి వెళ్ళింది.  అలా ఉత్తరం పత్తరం లేకుండా వచ్చిన వీరలక్ష్మిగారిని చూసి అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. 

 “రండి రండి. ఏమిటీ ఇలా చెప్పాపెట్టకుండా వచ్చారు. ఒక ఉత్తరం అన్నా రాయాల్సింది. అసలు నేనే సరోజ ఎలా వుందో చూడ్డానికి వద్దామనుకున్నా. అసలు తీరుబడి వుండట్లేదు. కాళ్ళు కడుక్కుని రండి ముందు భోజనం చేసి, తర్వాత మాట్లాడుకుందాం” అని వంటింట్లోకి దారితీసింది. ఎప్పుడూ ఇంకోమనిషి అన్నం ఎక్కువ వుంటుంది కాబట్టి హడావుడి పడలేదు. 

వియ్యపురాళ్ళిద్దరూ ఎక్కడెక్కడివో కబుర్లన్నీ చెప్పుకుంటూ తృప్తిగా భోజనం కానిచ్చారు. మాటల మధ్యలో అన్నపూర్ణమ్మగారు  “ఇంతకీ మా పెంకి ఘటం సరోజ ఎలా వుంది? ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదు ఆ బుద్ధులు పెళ్ళయి పిల్లలు పుడితే అన్నీ సద్దుకు పోతాయిలే అనుకున్నాము. పోనీలెండి మీ అబ్బాయి సుబ్బారావు మంచి వాడు దొరికాడు దానికి. ఓపికమంతుడు. అసలు సంగతి పక్కన పెట్టి ఏవేవో మాట్లాడేస్తున్నాను. మీరిలా  రావడానికి కారణం ఏమిటి?  ఏమిటి విశేషం. కాసేపు నడుం వాల్చి మాట్లాడుకుందా రండి” అంటూ పడక గదిలోకి దారితీసింది. 

ఒక పక్కన అలసటగా వున్నా… ఉన్న విషయం మాట్లాడేస్తే అయిపోతుందని, వీరలక్ష్మిగారు… “వదినగారూ… ఏమీలేదు అమ్మాజీకి 11 సంవత్సరాలు పూర్తవుతాయి. స్కూలు మాన్పించేశాం. సరోజకి పిల్లలని ఎత్తుకునే విషయంలో సాయం చెయ్యమందామంటే… బక్కపల్చటి పిల్ల. దానికే బలం లేదు. సరోజకీ అంతంత మాత్రం ఓపిక. మేము మీ సూర్యంని అమ్మాజీకి ఇచ్చి పెళ్ళి చేస్తే ఎలా వుంటుంది అని ఆలోచించాము. మీరు కూడా ఆలోచించుకుని చెప్పండి. సూర్య కూడా ఏదో ఉద్యోగం చేస్తున్నాడుగా…” అని వియ్యపురాలి ముఖంలోకి చూసింది. 

అన్నపూర్ణమ్మకి తొందరలేదు. ఏ సమస్యనైనా సావధానంగా ఆలోచిస్తుంది. 

“వీరలక్ష్మీ మీరు చెప్పింది బాగానే వుంది. నాకు తల్లిలేని పిల్ల అమ్మాజీ అంటే ప్రేమే… వయసు తేడా ఎక్కువ వుంటుందేమో.. అయినా ఫర్వాలేదు. మాకూ తెలిసిన పిల్లంటే మా పిల్లలాగే చూసుకుంటాం. నేను సూర్యంతో కూడా మాట్లాడి మీకు ఉత్తరం రాస్తాను. లేకపోతే నేనే వస్తాను. మీరు కాసేపు రెస్టు తీసుకోండి. మెల్లిగా సాయంత్రం భోజనం చేసి, రేపు పొద్దున్న వెళ్దురుగాని” అని మెల్లిగా నిద్రలోకి జారుకుంది. 

వీరలక్ష్మిగారు ఒక గంట పడుకుని మళ్ళీ లేచి, “నాలుగు గంటల బస్సుకి వెళ్ళిపోతాను. రేపు వరినాట్లు వేయించాలి. చాలా పనుంది. మీరు ఏ సంగతీ చెప్పండి”  అని, అన్నపూర్ణమ్మగారు సరోజకి ఇచ్చిన లడ్డూలు, జంతికలు అన్నీ సద్దుకుని బస్టాండ్ కి బయల్దేరింది. 

బస్టాండ్ కి వెళ్ళగానే సిద్ధాంతం బస్సు వచ్చింది. అది ఎక్కి కూచుంది. ఏడవుతుండగా ఏలేటిపాడు చేరింది. ఇంటికి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని సుబ్బారావుకి, సరోజకి జరిగిన విషయం చెప్పింది. 

బయటి నుంచి పరుగెత్తుకుని వచ్చిన అమ్మాజీ.. “బామ్మా…” అంటూ మీదకి ఎక్కింది. 

“నా బంగారు తల్లే ఎక్కడి వెళ్ళావు? ” అంటూ వీరలక్ష్మిగారు దగ్గరకి తీసుకుంది.

“ముందు నువ్వు చెప్పు బామ్మా… పొద్దుటి నుంచీ నువ్వు కనిపించలేదు. ఇల్లంతా వెతికాను. ఎక్కడికి వెళ్ళిపోయావు” అంటూ గారాబంగా అడిగింది. 

“నేనా నీకు పెళ్ళి చేద్దామని, ఏలూరులో అన్నపూర్ణ అమ్మమ్మ వుంది కదా… ఆవిడతో మాట్లాడి వద్దామని వెళ్ళాను”.

“బామ్మా… నాకు పెళ్ళి ఎందుకు చేస్తావు… నేనేమో చదువుకుంటాను బామ్మా… నాకు బోల్డు పుస్తకాలు కావాలి. అలా అనకు బామ్మా..” అంటూ ఏడుపు మొహం పెట్టింది. 

“అలాగేలే పోయి ఆడుకో… ఏడవకు” అని బయటికి పంపించేసింది వీరలక్ష్మి. 

“ఏమిటో సుబ్బారావ్ ఈ అమాయకపు పిల్ల ఎలా బతుకుతుందో ఏమో… దాని జీవితం ఓ దారిన పడితే బావుండును” అని గట్టిగా నిట్టూర్చి వంటగదిలోకి వెళ్ళిపోయింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.