యాత్రాగీతం
బహామాస్
-డా||కె.గీత
భాగం-2
అనుకున్నట్టు గానే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యి పోయింది. అయితే అదృష్టం కొద్దీ మరో రెండు గంటల్లో ఇంకో ఫ్లైట్ ఉండడంతో దానికి టిక్కెట్లు ఇచ్చేరు. అలా ఫ్లైట్ తప్పిపోవడం నిజానికి బానే కలిసొచ్చింది. అట్లాంటా ఎయిర్ పోర్టులో రాత్రి భోజనం కానిచ్చి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాం. అయితే అక్కణ్ణించి మయామీ చేరేసరికి అర్థరాత్రి అయిపోయింది.
ఎయిర్ పోర్టు నించి కారు రెంట్ కి తీసుకుని హోటల్ లో చెకిన్ అయ్యేసరికి తెల్లారగట్ల అయిపోవడంతో అంతా బాగా అలిసిపోయేం. అయినా మర్నాడు మరే కార్యక్రమమూ పెట్టుకోకుండా విశ్రాంతిగా గడపాలని ముందే అనుకున్నాం కాబట్టి మెలకువ వచ్చినపుడే లేచేం. లేవగానే హోటల్ లోని 15వ అంతస్థు లో ఉన్న మా గది బాల్కనీ నించి కనిపిస్తున్న విశాలమైన సముద్ర దృశ్యాన్ని కళ్ళనింపుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూచున్నాం.
అయితే కాలిఫోర్నియాకి, ప్లోరిడాకి సమయంలో మూడు గంటల తేడా ఉండడంతో లేచేసరికే అందరికీ ఆకలి నకనకలాడసాగింది.
పదకొండు గంటలవేళకే మధ్యాహ్న భోజనం మేమున్న హోటల్ రెస్టారెంటులోనే కానిచ్చాము. మాది బీచ్ హోటల్ కావడంతో హోటల్ ఆవరణని ఆనుకుని ఉన్న బీచ్ లో ఆ తరవాత రెండు గంటలపాటు హాయిగా ఆడుకున్నాం. నిజానికి ఈ బీచ్ లో మంచి తెల్లని ఇసుక ఉన్నా ఎక్కువ సీ వీడ్ ఒడ్డుకి కొట్టుకురావడంతో ఈగలు బాగా ముసురుతూ ఉన్నా లెక్కచెయ్యకుండా నీళ్లు వెచ్చగా ఉన్న సంబరంతో పిల్లలతో బాటూ అందరం పిల్లలమై ఆడేము.
తిరిగొచ్చి స్నానాలు కానిచ్చి అలా ఊరు చూసొద్దామని బయలుదేరేం.
ఫ్లోరిడా రాష్ట్రానికి దాదాపు దక్షిణపు కొసన తూర్పు తీరాన ఉన్న మెట్రోపాలిటన్ నగరం మయామీ. మేమున్న ఉత్తర మయామీ సముద్ర తీర ప్రాంతమంతా ఇలా ఖరీదైన రిసార్ట్ స్టైల్ హోటళ్ళతో, జనంతో రద్దీగా ఉంది. అందునా వేసవికాలం కావడంతో జనం మరింత ముమ్మరంగా ఉన్నారు.
ఈ మయామీ నగరానికి ఆ పేరు నగరం మధ్యలో ఉన్న మయామీ నది వల్ల వచ్చింది. ఈ మయామీ నదికి ఆ పేరు నగరపు నడిబొడ్డున ఉన్న అతిపెద్ద మంచి నీటి సరస్సయిన లేక్ ఒకీచోబి (Lake Okeechobee) వల్ల, ఆ చుట్టుపక్కల నివసించే ‘మయామీ’ ప్రజల వల్ల వచ్చిందట. స్థానిక రెడ్ ఇండియన్ భాషలో ‘మయామీ’ అంటే పెద్ద జలాశయం (Big water) అని అర్థమట.
మయామీ నగరంలో మొదటగా చూడాల్సిన ప్రదేశం, ముఖ్యంగా సాయంత్రం పూట చూడాల్సినది డౌన్ టౌన్ కి దగ్గర్లో ఉన్న బే సైడ్ మార్కెట్ ప్లేస్ (Bayside Market Place).
అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీలుగా రంగురంగుల చిన్న కార్ రైడ్ల దగ్గరనించి, సముద్రమ్మీద సరదాగా వెళ్ళిరాగలిగే స్పీడ్ బోట్ ట్రిప్పు వరకు ఉన్నాయి. ఇక స్థానిక వస్తువులమ్మే దుకాణాలు, రకరకాల రెస్టారెంట్లతో కళకళ్ళాడుతూ ఉందా ప్రదేశం.
కోకోనట్ ఐస్ క్రీం తినడంతో మొదలుపెట్టి, రాత్రి భిజానం వరకు సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతం నుంచి రాత్రి తొమ్మిది వరకు అక్కడే గడిపేసేం.
నేను, సిరి చిన్నపిల్లల ఆటల దగ్గిర గడిపితే, మిగతా వాళ్లంతా స్పీడ్ బోట్ ట్రిప్పుకి వెళ్ళేరు.
రాత్రి భోజనానికి చేప పళంగా వేపిన ఫిష్ ఫ్రై , చికెన్ నగ్గెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పచ్చిరొయ్యల ఫ్రైడ్ రైస్ వంటివి తిన్నాం.
ముఖ్యంగా ఆరుబయట చక్కగా వెచ్చని వాతావరణం బాగా నచ్చింది.
భోజనాల తరువాత అక్కడ జరుగుతున్న మ్యూజిక్ ప్రదర్శనలతో సరదాగా గడిచిన మయామీలోని మొదటి సాయంత్రం బాగా గడిచింది.
****