వెనుతిరగని వెన్నెల(భాగం-32)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-32)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళిజరుగుతుంది. పెళ్ళైన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే చదువుతూ ఉంటుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుంటుంది.

***

ఎమ్మే రెండవ సంవత్సరం రిజల్ట్సు వచ్చేయి.

కరుణకి మొదటి ర్యాంకు, వరసగా తన్మయికి రెండు, రాజుకి మూడు, అనంతకి నాలుగవ ర్యాంకు వచ్చేయి. దివాకర్ సెకండ్ క్లాసులో పాసయ్యేడు.

కరుణ ముఖంలో మిగతా ముగ్గురి కంటే ముందు ర్యాంకులో ఉన్నానన్న గెలిచిన ఆనందం బాగా కనిపించింది తన్మయికి.

కిందటి ఏడాది నాలుగవ ర్యాంకు వచ్చిందని అతను కుంగిపోతుంటే మెరిట్ స్కాలర్ షిప్పు రాలేదన్న బాధ అని సరిపెట్టుకుంది.

కానీ ఎందుకో అతని మాటల్లో తను గెలవడం కంటే మిగతా వారి కంటే ముందుకు దూసుకు వెళ్ళానన్న భావన కనిపించి ఆశ్చర్యపోయింది తన్మయి.

తనయితే అందరూ గెలవాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది.

తన్మయి తనకు వచ్చిన సెకండ్ ర్యాంకు తనకు లభించిన అత్యున్నత వరంగా భావించింది. 

ఉదయాన్నే మాస్టారింటికి వెళ్లింది. దంపతులిద్దరికీ ధన్యవాదాలు చెప్పింది.

తనకు జే ఆర్ ఎఫ్ కూడా తప్పక వస్తుందని దీవించేరిద్దరూ.

బస్సు దిగి తన్మయి బాబు చెయ్యి పట్టుకుని హాస్టలు వైపు ధీమాగా నడవ సాగింది.

అప్పుడప్పుడే వర్షం కురిసి వెలిసి నేలంతా కళ్ళాపి చల్లినట్లు బహు సుందరంగా ఉంది.

బాట పక్కన లేతాకు పచ్చని తీగెలు, ఆకుపచ్చని చెట్లని అల్లిబిల్లిగా అల్లుకుని చిరుగాలికి తలలూపుతూ తన్మయికి త్రోవ చూపుతున్నట్లున్నాయి.

అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న బుడతడు హుషారుగా నడుస్తూ అమ్మని రకరకాల ప్రశ్నలు అడగసాగేడు.

అన్నిటికీ తన్మయి ఓపికగా సమాధానాలు  వివరించసాగింది.

హాస్టలులో తన రిజల్టు విషయం  తెలియగానే పండగ వాతావరణం నెలకొంది.

వంటామె గబగబా పంచదార పట్టుకొచ్చి నోట్లో పోసింది. దోసె మాస్టర్ ఒరియా వాడు. వచ్చీ రాని తెలుగులో “ఇప్పుడు మీద అమ్మకు పెట్టేది రెండు దోసెలు” అన్నాడు. 

వెంకట్ రెండు దేవగన్నేరు పూల కొమ్మలు తుంచి తెచ్చి “అభినందన పూలమాలలివే, అందుకోండి” అన్నాడు.

మురళి  చేతిలోని కలర్ పెన్సిల్ స్కెచ్ ని చేతిలో పెట్టి, “ఇక మీకు తిరుగు లేదు జీవితంలో” అన్నాడు.

కాగితాన్ని విప్పి చూసింది తన్మయి. అప్పటి వరకూ తమనే హాస్టలు పై నించి చూస్తున్నట్లున్నాడు, అందమైన లతల బాట వెంట తల్లీ, కొడుకూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మాట్లాడుకుంటూ వస్తున్నట్లున్న చిత్రమది. 

తన్మయి కళ్ళల్లోకి అప్రయత్నంగా నీళ్ళు వచ్చేయి! మురళికి నమస్కరిస్తూ చప్పున కళ్ళుదించుకుంది.

ఇంతలో పిల్లలంతా పరుగున చుట్టూ చేరి కౌగలించుకుని అభినందనల్లో ముంచెత్తేరు.

తన్మయి తనకు లభించిన అపురూప వరానికి పులకించిపోయింది. 

“నా చుట్టూ ఇంత మంది ఆత్మీయుల్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు మిత్రమా!”  తనలో తను అనుకుంది.

ఆధారం కోల్పోయి అలల తాకిడికి ఎటో కొట్టుకుపోతున్న ఒంటరి నావలా ఈ తీరానికి చేరింది. ఇందరి ప్రేమాప్యాయతలు పొందగలగడం తన అదృష్టం.

***

ఆ మధ్యాహ్నం  బాయ్స్ హాస్టలు వాకిట్లో దాదాపు ఇరవై, ఇరవై రెండు సంవత్సరాల వయసున్న అందమైన అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు కాబోసు బయటకు నడుస్తూ  కనిపించేరు.

దు:ఖపూరితంగా ఉన్న ఆమె ముఖం చూస్తేనే అర్థం అవుతూంది, ఆమె ఏదో కష్టంలో ఉన్నదని.

తన్మయి మెట్లు దిగి వెళ్ళబోతూ వాళ్ళని గేటు వరకూ సాగనంపడానికి వెనకే వస్తున్న మురళిని చూసి ఆగిపోయింది.

“ఆమె ఎవరు? మురళికి చెల్లెలా? బంధువా? ఎందుకు దు:ఖ పడ్తూంది?” తనలో తనే ప్రశ్నలు వేసుకోసాగింది.

తన్మయి వైపే వస్తున్న వెంకట్ ప్రశ్నార్థకమైన తన్మయి ముఖం చూస్తూనే, “ఆమె ఎవరని కదా మీ సందేహం!” అన్నాడు.

తన్మయి తలూపే లోగా,”మురళి భార్య” అన్నాడు.

తన్మయి నమ్మలేక ఆశ్చర్యంగా చూసింది.

“మురళికి పెళ్ళయ్యిందా?” తనలో తను గొణుక్కుంటున్నట్లు అంది.

“మరదే, మురళి పెళ్ళయ్యినట్లు కనబడడు కదూ! అదో పెద్ద కథ లెండి, బాల్య వివాహం ” అన్నాడు వెంకట్ చిన్నగా నవ్వుతూ.

తన్మయి తల చిన్నగా విదిలిస్తూ,”అది కాదు నా ప్రశ్న. పెళ్ళయినా మురళి యోగిలా ఎందుకు జీవిస్తున్నాడు? ఆ అమ్మాయి ఎందుకు దుఃఖ పడ్తూంది? కాదు, కాదు మురళి ఆమె దు:ఖానికి కారకుడెందుకయ్యాడు?” అంది గబగబా.

“అవన్నీ పరమాత్ముడికెరుక, సంసార జీవితంలో ఇమడలేని గౌతముడికి పెళ్లయ్యి, పిల్లాడు పుట్టేక ఇంటి నించి వెళ్ళిపోవాలనిపించలేదూ, అలాగే ఇదన్న మాట. మురళికి పెళ్ళయ్యిన సంవత్సరానికి సంసార జీవితమ్మీంచి సన్యాసం వైపు దృష్టి మళ్లింది. కారణాంతరాలు ఎవరు ఎన్ని సార్లు అడిగినా, ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్ళి చెయ్యమని, తను ఈ జన్మకి ఇలా సన్యాసిలాగే మిగిలిపోతానని  సమాధానం చెపుతాడు. గంట కిందట మళ్ళీ జరిగిందదే” అన్నాడు వెంకట్.

తన్మయి ఏమీ మాట్లాడలేక పోయింది. ఎందుకో ఒంటరిగా ఉండాలనిపించింది.

హాస్టలు భవనం వెనక ఉన్న వృద్ధాశ్రమం వైపుగా నడవ సాగింది.

“అందరికీ ఆదర్శమైన మురళి ఇతడేనా?…” 

అతని జీవితమ్మీద అతనికి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. వాటిని ఎవరూ కాదనలేరు. కానీ మరొక అమ్మాయి జీవితంతో అతని జీవితం ముడిపడినపుడు అతని హక్కులకు స్థానం ఉందా?! తనతో జీవితం పంచుకుంటూన్న స్త్రీని నిర్దాక్షిణ్యంగా వదిలి వేస్తున్న మురళి, శేఖర్ లాగా స్వార్థపరుడేనా? 

“ఉహూ …” అని తల విదిలించింది తన్మయి. 

“మురళికి శేఖర్ తో పోలిక ఏవిటి? తన పిచ్చి కాకపోతే! మురళి నిస్సందేహంగా గొప్ప వ్యక్తి, పరులకే తన దేహ ప్రాణాలు అంకితం చేసే వ్యక్తి. కానీ ఒకరి కన్నీటి లో కాళ్లు ముంచి ముందుకి ఎలా నడవగలుగుతున్నాడు?”

ఆలోచనలతో ముందుకు నడుస్తున్న తన్మయి ఎదురుగా వస్తున్న మురళిని చూడలేదు.

మురళి ముఖంలో ఎప్పుడూ లేనంత దిగులు కనిపించింది.

తన్మయి దగ్గరకు వస్తూనే “మీరేం అడగబోతున్నారో అవేమీ అడగకండి.  చెప్పాలనిపిస్తే నేనే చెప్తాను.” అన్నాడు.

“అసలు తనేదో అడగబోతున్నానని అతనికెలా తెలుసు?”

కాస్సేపు నిశ్శబ్దంగా నడిచేక, ఆమెకు చెప్పిన మాటల్నే మీకూ చెపుతున్నాను. “ఈ లోకంలో దు:ఖానికి మూలం కోరికలు, దు:ఖాన్ని జయించాలంటే కోరికల్ని జయించాలి.”  ఇవి నా మాటలు కావు, గౌతమ బుద్ధునివి. ఎంతో విలువైనవి.” అని దీర్ఘంగా ఊపిరి పీల్చి,  “చిత్రంగా ఆమె నా మాటలు విని దు:ఖంతో వెళ్ళిపోయింది.  నిజానికి దు:ఖమే జీవితాన్ని పరిశుభ్రం చేస్తుంది. కానీ అజ్ఞానంతో కూడిన దుఃఖం బహు ప్రమాదకారి.” 

తన్మయి మురళి వైపు ఆశ్చర్యంగా చూసింది. “పాతికేళ్ళవయసు ఉంటుందేమో ఇతనికి. దీనిని వైరాగ్యం అనాలా? లేదా జ్ఞానం అనాలా? ఇంత చిన్న వయసులో ఇతనికి ఇటువంటి తాత్త్విక చింతన ఎందుకు కలుగుతూంది?  లౌకిక బంధనాల నుంచి తామరాకు మీద నీటిబొట్టులా ఉండడం ఇతనికి ఎలా సాధ్యమవుతూంది?”

తిరిగి వస్తూ ఉంటే మురళి మాటలే చెవిన మోగుతున్నాయి.

“దు:ఖానికి మూలం కోరికలు. కోరికల్ని జయిస్తే దు:ఖాన్ని జయించవచ్చు” ఏదో అర్థమయినట్లు అనిపించసాగింది. 

తెలిసిన విషయమే కానీ తనున్న కష్ట సందర్భంలో వినడం వల్లనో ఏమో, అక్షరమక్షరం మనసుకి హత్తుకున్నాయి.

***

ఆ ఆదివారం అనంత తన్మయిని కలవడానికి హాస్టలుకి వచ్చింది.

తెల్లని బెంగాల్ కాటన్ చీరలో, చెదరని చిరునవ్వుతో, తేజోవంతంగా ఉన్న తన్మయిని చూసి “ఎంత గొప్ప మార్పు నీలో తన్మయీ!” అంది.

“ఏం నచ్చలేదా?” అంది తన్మయి అదే చిరునవ్వుతో.

“నచ్చకపోవడమా, నాకూ ఇక్కడికి వచ్చి ఉండిపోవాలని ఉంది. వీలైతే రాజుని ఒప్పించి ఇక్కడే ఉద్యోగాలకు కుదురుకోవాలనీ ఉంది. అన్నట్లు నీ కోసం ఏం తెచ్చానో చూడు” అంది అనంత.

“ఏవిటివి?” అంది అప్లికేషన్లు అటూ ఇటూ తిప్పుతూ తన్మయి.

“కాలేజ్ సర్వీస్ కమీషన్, గవర్నమెంట్ లెక్చరర్ సెలక్షన్స్ పరీక్షకు అప్లికేషను, రెండోది స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది లెక్చరర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏ కాలేజీలోనైనా పని చేసేందుకు అర్హతనిచ్చే పరీక్ష” అంది అనంత.

“ఒకేసారి రెండు పరీక్షలా పైగా ఒక దానికొకటి పది రోజుల వ్యవధిలో” అంది తన్మయి సాలోచనగా.

“జే ఆర్ ఎఫ్ రాసిన జ్ఞానంతో  ఏ పరీక్ష అయినా సులభంగా రాయొచ్చు. అందుకే ఈ రెండు అప్లికేషన్లూ పట్టుకొచ్చా నీకు.” అంది అనంత.

తన్మయి బరువుగా ఊపిరి పీల్చింది. 

ఇందులో ఎలిజిబిలిటీ టెస్ట్ జే ఆర్ ఎఫ్ కు సరిసమానమైంది. కేవలం బిట్ పేపర్లు  మాత్రమే ఉండడం వల్ల అంత క్లిష్ట మైనది కాదు. అంతే కాదు స్టయిఫండు కూడా రాదు. కానీ లెక్చరర్ గా పనిచేసేందుకు ఎలిజిబిలిటీ మాత్రం వస్తుంది. జే ఆర్ ఫ్ రాకపోతే ఇది రెండవ ఆప్షనన్నమాట.

కానీ సర్వీస్ కమీషను గురించి లేశమాత్రమైనా తెలీదు. అసలు ఎలా ప్రిపేర్ కావాలో, ఎలా రాయాలో.

అదే అడిగింది అనంతని.

తేలిగ్గా నవ్వుతూ, “చూడు తన్మయీ, ఇవి గవర్నమెంటు పరీక్షలు. ఎప్పుడు పెడతారో ఎవరికీ తెలీదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు హఠాత్తుగా జరుగుతున్నాయి. ఈ పరీక్షకు పాత పేపర్లు కాదు కదా, పరీక్ష ఎలా ఉంటుందో రాసిన వాళ్లు కూడా కనబడరు మనకి. ఏదో ఒక ట్రయిల్ వెయ్యడమే. పైగా రాష్ట్ర వ్యాప్తమైన పరీక్ష కదా. ఒక్క తెలుగు సబ్జెక్టులోనే కొన్ని లక్షల మంది పరీక్ష రాస్తారు. నీకో విషయం చెప్పనా, మొత్తం తెలుగు లెక్చరర్ ఖాళీలు ముప్ఫయ్యట.  అంటే ఎన్ని లక్షల మంది రాసినా  చివరి వరకూ పోరాడి గెలవగలిగేది ముప్ఫయి మంది మాత్రమే. నీకో తమాషా చెప్పనా, ఇలా తక్కువ ఉద్యోగాలు ఉండడం వల్ల పోరాట పటిమ ఉన్న వాళ్లు మాత్రమే బరిలో దిగుతారు. అంటే మనతో సమ ఉజ్జీలన్నమాట. ఒక వేళ ఉద్యోగం వస్తే అందరిలో గెలవడం గొప్ప కాదూ!” అంది అనంత.

ఇంకా తన్మయి ఆలోచన చూసి, “ఇంకేం ఆలోచించకు తన్మయీ, జే ఆర్ ఎఫ్ తో మహా అయితే అయిదేళ్ళు మాత్రమే స్టయిఫండు వస్తుంది.  ఈ ఉద్యోగం వస్తే జీవితాంతం నెలనెలా జీతం అందుకోవచ్చు. లైఫ్ సెటిల్ అయిపోయినట్లే” అంది అనంత.

“నేను ఆలోచిస్తున్నది రాయాలా వద్దా అని కాదు, ఎలా రాయాలా అని”  అంది దృఢంగా తన్మయి.

“నాకు తెలుసు నువ్వు ఆలోచన వచ్చిన మరు నిమిషం నించే సంసిద్ధురాలివవుతావని, దటీజ్ తన్మయి” అంది అనంత ధైర్యంగా వీపు తడుతూ.

బాబు పరుగున వచ్చి తన్మయి ఒళ్ళో కూచున్నాడు.

చిన్నారి చేతుల్తో అప్లికేషనుని తడిమి పరుగున మళ్ళీ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లేడు.

“నలగకుండా అతి సున్నితంగా అప్లికేషను వాడు భలే ముచ్చటగా పట్టుకున్నాడులే. వాడి చెయ్యి పడిందిగా నీకు ఉద్యోగం వచ్చేసినట్టే.” అంది అనంత లేస్తూ.

***

ఆ రోజు సాయంత్రం ధ్యానంలో కూచుంది తన్మయి.

ఇక్కడికి వచ్చిన దగ్గరనించి పరీక్షలకు కావలసిన మానసిక సంసిద్ధతని ధ్యానంతో సమకూర్చుకోవడం అలవాటయ్యింది తన్మయికి.

కానీ ఒత్తిళ్ళన్నీ పక్కకు పెట్టి మానసిక ప్రశాంతతని చేకూర్చుకోవడానికి ఎంతో సాధన, సంయమనం అవసరం.

ఒక పక్క కోర్టు చుట్టూ తిరగడమే ఒక పెద్ద ఒత్తిడి. 

మరో పక్క బాబుని వృద్ధిలోకి తీసుకు రావాలంటే తను త్వరగా నిలదొక్కుకోవాల్సిన ఒత్తిడి.

ఇవన్నీ బాలెన్సు చేసుకోగలిగినా అడుగడుగునా సమాజంతో ఎదురవుతున్న ఘర్షణ. 

తప్పు ఎవరు చేసినా స్త్రీని నిందించే సమాజంలో, అడుగడుగునా ఎదురవుతున్న మనుషుల లేకితనం, వంకర మాటలు.

తన్మయికి ముందు వారం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది.

గర్ల్స్ హాస్టల్ వార్డెన్ కావడంతో ఆడపిల్లలకు సంబంధించిన శారీరక, మానసిక ఒత్తిళ్ళలో తల్లి వంటి పాత్ర ధరించాల్సి రావడం తన్మయికి ఎంతో ఆనందదాయకమయ్యింది.

కానీ అయిదో తరగతి లోపు పిల్లలతో ఫర్వాలేదు గానీ, పెద్ద పిల్లలతో చాలా సమస్యలు ఉంటూండేవి.

అసంకల్పితంగా కడుపు నొప్పి అనో, ఒంట్లో బాగా లేదనో ఆడపిల్లలు క్లాసులు ఎగ్గొట్టి హాస్టల్ కి వచ్చేసేవారు.

తన్మయి వచ్చిన కొత్తలో ప్రతీ రోజూ ఇద్దరో, ముగ్గురో ఇదే పద్ధతిలో హాస్టల్ లో ఉండిపోతూ ఉండేవారు.

పేరెంట్స్ ని పిలిచే వరకూ అదే తంతు.

పేరెంట్స్ వచ్చి, హాస్పిటల్ లో చూపిస్తామని ఇంటికి తీసుకు వెళ్ళడమే ఇందుకు మందని అర్థమయ్యేటట్లు చెయ్యడమే వాళ్ళ ఉద్దేశ్యమని అర్థమయ్యింది తన్మయికి.

మొదట్లో పిల్లలకు నిజంగా ఆరోగ్యం బాగోలేదో, లేదా కావాలని హాస్టల్ లో ఉండడం ఇష్టం లేక వంకలు చెప్తున్నారో అర్థం అయ్యేది కాదు తన్మయికి.

అర్థమయ్యేక ఈ సమస్యకి పరిష్కారం వాళ్ళతో స్నేహితురాలిలా మాట్లాడడం ద్వారా చక్కదిద్దగలనని తెలుసుకుంది తన్మయి.

హాస్టల్ లో ఉంచి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆకాంక్షలు, చదువు- ఆవశ్యకత, శారీరక శుభ్రత, క్రమశిక్షణ, ఏకాగ్రత … ఇలా ఎన్నో టాపిక్స్ పిల్లలతో మాట్లాడేది తన్మయి.

పిల్లలంతా చుట్టూ చేరి ఆసక్తిగా వింటూండేవాళ్లు.

ప్రతి రోజూ రాత్రి పూట కాస్సేపు పిల్లలతో కబుర్లు చెప్పడం అలవాటు చేసుకుంది తన్మయి.

చిన్న పిల్లలు అటు ఇటూ చేరి ఒళ్లోనే నిద్రపోయే వాళ్ళు.

ఇదిలా ఉండగా అస్తమాటూ ఈ వంకన వచ్చీ, పోయే మగ పేరెంట్స్ తో తరచూ సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది తన్మయికి.

వచ్చిన వాళ్ళకి కొందరికి తన జీవితమ్మీద ఆసక్తి ఎక్కువ ఉండేది.

బాబు తండ్రిని గురించి, ఒంటరిగా ఇక్కడ ఎందుకు వుందనే ఆరాలకు సమాధానం చెప్పవలసి వచ్చేది.

అడిగిన వాళ్ళకు అబద్ధం చెప్పడం ఇష్టం లేని తన్మయి ధైర్యంగా విడిపోయామని చెప్పడం అలవాటు చేసుకుంది.

అందులో ఒక అమ్మాయి తండ్రి అవసరం ఉన్నా లేకపోయినా వివరాలు కనుక్కోవడానికన్నట్లు  తరచూ రావడం మొదలు పెట్టేడు.

అక్కడ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు వారానికోసారి వచ్చి చూసి పోవచ్చు.

“ఉన్నట్లుండి ఒక రోజు ఇంత చిన్న వయసులో మీకెంత కష్టమొచ్చింది! అయినా ఎన్నాళ్ళు ఇలా ఉండిపోతారు? రెండో భార్య గా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు” అన్నాడు.

ఒక్కసారిగా రక్తం సలసలా మరిగింది తన్మయికి.

పిల్లల పేరెంట్ కావడంతో కోపాన్ని అణచుకుని, “దేశాన్ని మీరు తర్వాత ఉద్ధరిద్దురు గాని, ముందు ఎవరితో ఏం మాట్లాడాలో నేర్చుకోండి. మరోసారి ఇటువంటివి మాట్లాడితే మేనేజ్ మెంటుకి కంప్లయింట్ చెయ్యాల్సి ఉంటుంది.” అంది.

తర్వాత అతనెప్పుడు వచ్చినా అసలేమీ ఎప్పుడూ మాట్లాడనట్లే మసలసాగేడు.

ఇటువంటి సంఘటనలు తన్మయికి బాగా డిస్ట్రబెన్స్ కాసాగేయి.

ఎందుకు ప్రపంచం స్త్రీని ఒంటరిగా, ధెర్యంగా బ్రతకనివ్వదు?

మగవాడు తోడు లేకుండా బతికే స్త్రీ పట్ల సమాజంలో ఒక విధమైన చులకన భావం పాతుకుపోయి ఉందని తన్మయికి చాలా త్వరగా అర్థం అయ్యింది.

విడాకులు కేవలం ఇద్దరు వ్యక్తుల జీవితాలను, రెండు కుటుంబాలను మాత్రమే కాదు, సమాజాన్ని మొత్తం ప్రభావితం చేస్తాయని ఎక్కడో చదివింది.

కానీ సమాజమే అందులో ఉన్న వాళ్ళ మానసిక సంఘర్షణకు కారణమవుతూ ఉంది. 

తన్మయి ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతూంది.

తను కోల్పోతున్న విషయాల లిస్టు రాయసాగింది. అందులో ఒంటరిగా చెయ్యలేని పనుల జాబితా రోజురోజుకీ పెరిగిపోసాగింది. అందులో పొద్దుపోయిన తర్వాత బయటికి ధైర్యంగా వెళ్ళలేకపోవడం ఒకటి. తను ఒక్కతే పరిష్కరించగలిగినది కాదు కాబట్టి, వెళ్ళడమే మానుకుంది.  

బహుశా: తనే పిరికిదనుకుంటా. ఇప్పటి వరకూ ఒక్కతే సినిమాకి వెళ్ళే సాహసం ఎందుకు చెయ్యలేకపోయింది? 

తన చుట్టూ తను గీసుకునే గీతలు, కట్టుకునే గోడల ఎత్తు పెరుగుతున్న కొలదీ తన్మయికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోసాగింది.

ఒక విధంగా ఆలోచిస్తే తనకీ హాస్టలు జీవితం చాలా సరైనది. ఒంటరి స్త్రీలకు బయట ప్రపంచం లో ఎదురయ్యే సమస్యలు, ప్రశ్నలు ఇక్కడ తరచూ ఎదురుకాకాపోవడమే కాదు, తనలాంటి  పిరికివాళ్ళకు ఇలాంటి భద్రతా వలయాలే సరి అయినవి. కానీ ఇప్పుడిప్పుడే ప్రపంచంలోకి అడుగుపెడుతున్న బాబుకి ఇంత చిన్న ప్రపంచం నించి బయటికి వెళ్ళినపుడల్లా ఆశ్చర్యమే.  

ముఖ్యంగా మగవాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు వాడి చిన్ని బుర్రలో ప్రశ్నలు పుట్టించసాగేయి.

తల్లిదండ్రుల ఇద్దరి సంరక్షణలో పెరిగిన  పిల్లగా తన్మయికి తన సంరక్షణలో ఒంటరిగా పెరుగుతున్న బాబు గురించి దిగులు ఎక్కువ కాసాగింది.

స్కూలుకి వచ్చే తల్లిదండ్రులు  పిల్లల్ని ముద్దాడే ఏ సంఘటనైనా తన్మయిని కలచి వెయ్యసాగింది.

పైగా అలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా “అమ్మా, మా నాన్నేడీ?” అనే బాబుకి సమాధానం చెప్పలేకపోతూంది తన్మయి.

తమనీ స్థితికి గురి చేసిన శేఖర్ పట్ల కోపం, ద్వేషం విపరీతంగా పెరగసాగేయి.

***

స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్ అయిన వారంలోనే గవర్నమెంట్ లెక్చరర్ ఉద్యోగాలకు కూడా రాత పరీక్షలు పూర్తయ్యేయి.

అందులో సరైన మార్కులు వస్తే ఇంటర్యూకి పిలిస్తారు.

పరీక్షలు బానే రాసినట్లనిపించింది తన్మయికి.

కానీ ఉద్యోగం వస్తుందన్న భరోసా లేదు.

అందుకు కారణం కొన్ని లక్షల మంది పరీక్షలు రాయడమే కాదు, కేవలం ముప్ఫయి ఉద్యోగాలు మాత్రమే ఉండడం కూడా. ఎంతో ప్రతిభ ఉంటే గానీ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్లడం కూడా కష్టమే. ఇక ఏకంగా ఉద్యోగం రావడం అంటే మాటలా?

జే ఆర్ అఫ్ రిజల్స్టు వచ్చే సమయం అయ్యింది.

రిజల్ట్సు వచ్చిన రోజు యూనివర్సీటీలోని జే ఆర్ ఎఫ్ ఆఫీసు లో తెలియజేస్తారు.

తర్వాతే డిపార్టుమెంటుకి తెలియజేస్తారు.

ఇక సెలక్టు అయిన వారికి ఇంటికి పట్టా పంపిస్తారు. 

ఆ రోజు బాబుని స్కూలుకి పంపించి, తన్మయి ఉదయాన్నే యూనివర్శిటీ బస్సెక్కింది.

“తనకి సెలక్షన్ రాకపోతే?” అనే ఆలోచనకే ఒణుకు రాసాగింది.

తన ప్రయత్నం తను చేసింది. అంతే. ఫలితం వచ్చేదీ, రానిదీ అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ అలా అని సరిపెట్టుకోలేక అస్థిమితంగా అడుగులేస్తూ బస్సు దిగి డొంకదారి వెంట నడవసాగింది.

రాత్రి కురిసిన వర్షానికి దారంతా గడ్డి మీద నీటి బిందువులు అందంగా అమిరి ఉన్నాయి.

యూనివర్శిటీలో డొంకదార్లు విద్యార్థులు ఎక్కువగా వాడుతూంటారు. అసలు దారుల్లో నడవాలంటే ఎంతో సమయం పడుతుంది. తన్మయికి ఈ బాట అంటే చాలా ఇష్టం. ఒక విధమైన నిశ్శబ్దంతో ఎక్కడో అడవిలో ఉన్నట్లు  ఉంటుందేమో దారి మలుపుల్లో అలికిడి వినిపించినప్పుడల్లా ఉడుతలు అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటాయి. తూనీగలు బాట పక్కని బఠానీ పూల మీద వాలి చిన్న సంగీతం ఆలపిస్తూ జుమ్మని శబ్దాలు చేస్తూ  చెవుల చుట్టూ గింగిరాలు తిరుగుతుంటాయి.

చిన్న కాలిబాట పక్కన ఒత్తుగా పెరిగిన మొక్కల మధ్య నడుస్తున్న తన్మయి కాళ్ల మీద ఆకుల మీంచి నీటి బిందువులు కరిగి రాలి చీర అంచులు తడిసిపోసాగేయి. అడుగులు పడకుండా తడిచీర అంచులు అడ్డుకోసాగేయి.

జే ఆర్ ఎఫ్ ఆఫీసు ఇంకా తెరిచినట్లు లేరు.

ముందు రోజు రిజల్ట్సు వచ్చేసినట్లయితే సాయంత్రం ఆఫీసు మూసివేసే సమయానికి లిస్టు అతికించి ఉండాలి.

మెట్ల కింది నుంచి తలుపు  వైపు చూసింది తన్మయి.

యాభై మెట్ల పైనున్న ఆఫీసు తలుపులకి ఏదో కొత్త కాగితం అతికించినట్లే ఉంది.

తన్మయికి గుండె దడదడా కొట్టు కోసాగింది. తన నాడి తనకే స్పష్టంగా వినిపించసాగింది.

ఒక్కో మెట్టు  ఎక్కుతూండగా ఒంట్లోని ఓపికంతా ఆవిరి అయిపోతున్నంత నీరసం రాసాగింది.

మొత్తం ఇరవై పేర్ల లిస్టు అది. 

రెండు విభాగాలుగా ఉన్న లిస్టులో లెక్చరర్ షిప్పుకి మాత్రమే సెలక్టయిన పేర్లు కిందన ఉన్నాయి. అందులో కరుణ, రాజు, అనంత ల పేర్లు  ఉన్నాయి. తన పేరు లేదు.

పైన ఉన్న  విభాగంలోజే ఆర్ ఎఫ్ స్కాలర్ షిప్పు కి సెలక్టు అయిన లిస్టులో ఒకే ఒక్క  పేరు ఉంది.

తన్మయి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది.

తన పేరులో మొదటి అక్షరం “టి” చూడగానే తన్మయి తట్టుకోలేక మొదటి మెట్టు పైనే కూలబడింది.

తన పేరు చూడగానే ఆపుకోలేని దుఃఖం తో ఆకాశం కేసి చూస్తూ  వెక్కి వెక్కి ఏడవ సాగింది. 

“మిత్రమా! నన్ను కరుణించావా! “

“నా చిన్నారి బాబూ, ఇక మనకి భయం లేదురా!”

ఆనందాతిరేకపు దుఃఖపు మాటలు అప్రయత్నంగా మాట్లాడసాగింది. 

చుట్టూ ఎవరూ లేని ఆ పొద్దుటి పూట తన్మయికి లభించిన అత్యుత్తమ విజయం తాలూకు సంతోషానికి  భూమ్యాకాశాలు కూడా కరిగి కన్నీరైనట్లు వాన కురవసాగింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.