
“నెచ్చెలి”మాట
క్యా కరోనా
-డా|| కె.గీత
కరోనా
కోవిడ్
డెల్టా
ఓమిక్రాన్
…
పేర్లు ఏవైతేనేం?
సర్జులు ఏవైతేనేం?
అసలు భయపడేదుందా?
మరణాలు మాత్రమే
భయపెట్టే సంసృతిలో
ఏదేవైనా లెక్కుందా?
13 లక్షల తెల్లచొక్కాలు పీ ఆర్ సీ లంటూ రోడ్లని ముట్టడిస్తూన్నా
ఆశా వర్కర్లు చిరు ఆశతో కలెక్టరేట్ లోకి దూసుకెళ్తున్నా
హిజాబ్ వర్సస్ కాషాయం అంటూ విద్యార్థుల్ని ఎగదోస్తున్నా
క్యా కరోనా?!
సహస్రాబ్దుల విగ్రహావిష్కరణలు
ఆఘమేఘాల మీద గుళ్ళూ, గోపురాల పనులు
ఎక్కడ చూసినా
గుంపులు
గోవిందాలు
ప్రభుత్వాలకి
జనాన్ని అణచడంలో ఉన్న బాధ్యత
జనాన్ని పోగుచెయ్యడంలో ఉన్న శ్రద్ధ
ఆరోగ్య జాగ్రత్తల్లో ఉంటే ఎంత బావుణ్ణు!
ఎక్కడైనా దూరాలు పాటించడం
మాస్కులు ధరించడం ఉందా?
గడ్డు చలిలో యుక్రెయిన్ మీద రష్యా సైనిక కవాతు
వారానికి పదిసార్లు కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్టు
ఏవైనా ఆగుతున్నాయా?
ఓ పక్క మాస్కులొద్దని కెనడా బోర్డర్ లో ట్రక్కుల సమ్మె
మరోపక్క కోవిడ్ భయంతో విదేశ కాన్సిలేట్ల మూసివేత
ఎవరు మర్చిపోదామన్న
మరుపురానివ్వని
కరోనా
కోవిడ్
డెల్టా
ఓమిక్రాన్
…
పేర్లు ఏవైతేనేం?
సర్జులు ఏవైతేనేం?
…
తగ్గేదేలే!
అయ్యో!
విలన్లు…
ఓ సారీ…
హీరోల డైలాగులు కాదండీ…
ప్రవచనాలు అసలే కాదండీ…
రెండేళ్ల నించి
ఇంటికంటుకుపోయిన
హృదయకాలేయ ఘోష!
*****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటు రాసిన వారికే కాక ఆర్టికల్ కు సంబంధించిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
జనవరి, 2022 లో బహుమతికి ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: విద్యార్థి
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: Carnatic Compositions – The Essence and Embodiment (Part-8), రచయిత్రి: అపర్ణ మునుకుట్ల గునుపూడి
బహుమతిగ్రహీతలకు అభినందనలు!

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
