రాగో

భాగం-20

– సాధన 

            సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను పలకరించాడు.

            “ఏం గిరిజక్కా! డోంగలో ఇబ్బంది కాలేదు కదా! ఇక్కడ ఇంకా నయం. సరికెడ రేవులోనయితే కుండతోనే దాటాలి. అది మాకే భయమేస్తుంది.”

            “జడుపులేని మగధీరుడు ఫకీరా కూడ తోడుంటే డోంగలో దివ్యంగా దాటినం” అంటూ కిసుక్కున నవ్వింది గిరిజ.

            చెల్లుమన్న గిరిజన సమాధానానికి ఒక్క క్షణం విస్తుపోయి వెంటనే తేరుకుంటూ రుషి మనవాళ్ళంతా ఏం చేస్తున్నరంటూ పొయ్యివైపు నడిచాడు. అన్నం గంజు ముందు సంఘం వత్తే, కూర గంజువద్ద గాండో కనపడేసరికి ‘ఏదో స్పెషల్ గాబోలు’ గాండో ఉన్నాడనుకుంటూ కర్ప, ఫకీరా గూర్చి ఎంక్వయిరీ చేయగా ఒకరు సెంట్రీ పోయినట్టు మరొకరు గోటుల్ దగ్గిర ఎగరడానికి పోయినట్టు తెల్సింది.

            రుషి, గిరిజలు మాట్లాడుకుంటుండగానే సీదో – మిన్కోలు వచ్చి గిరిజ చుట్టూ చేరారు. వెనుక వస్తున్న జైని అప్పుడే వాకిట్లో అడుగుపెట్టింది.

            “గిరిజక్కా! మేము పోలీసులను గెదిమినాం!” అంటూ సీదో ఒక్క మాటలో అనేసరికి గిరిజకేమీ అర్థం కాలేదు.

            “ఎక్కడా! ఏమైంది?” అంటూ గిరిజ గాబరాతో ప్రశ్నించింది.

            పొయ్యి దగ్గరున్న గాండో రయ్యిన ఉరికొచ్చి గాబరాగా “పోలీసులెక్కడ” అంటూ వీరివైపు చూడసాగాడు.

            ‘ఇక్కడ కాదులే’ అన్నాడు తాపీగా రుషి.

            ఈ సంభాషణ మధ్యలోనే జైని అక్కడికి చేరింది.

            “ఏం లేదు. జైని సెంట్రిలో దాడి జరిగింది. పేన్ కస దగ్గర మేం మాట్లాడు కుంటుంటే పెట్రోలింగ్ పార్టీ అటువైపు వచ్చి సెంట్రీ కంట్లో పడేసరికి ఫైరింగ్ అయ్యింది” అంటూ క్లుప్తంగా ముగించాడు రుషి.

            “ఎట్లయ్యింది జైని ఫైరింగ్” అంటూ గిరిజ రుషి జవాబుతో సంతృప్తి పడక అడిగేసింది.

            “ఫకీరన్న, కర్పన్నలు ఏరక్కా” అంటూ ఈ వార్త వెంటనే చేరవేయాలన్న ఆతృతతో అడిగింది సీదో.

            “అక్కలు! అంత గాబరా ఎందుకు. కర్ప సెంట్రీలో ఉన్నాడు. ఫకీర్ గోటుల్ దగ్గర ఉన్నాడు – భోజనాలు అయినాక వివరంగా మాట్లాడుకుందాం అంతా రాం, రాం చేయకండి” అంటూ రుషి జాగ్రత్తలు చెప్పాడు.

            “గోటుల్ దగ్గరికి పోయి ఎగురుతం దాదా మేము” అంది మిన్కో,

            “ఇంగో – కానీ ఈ మాట అక్కడ మీరు విడువద్దు. ఆ తర్వాత మీటింగ్ లో చెప్పుతాం” అంటూ తన అంగీకారం తెలిపిన రుషి గిరిజ, గాండోల వైపు చూస్తూ “మన సెల్ మీటింగ్ వేసుకుందాం. వాళ్ళు ఎగరడానికి పోతారు” అన్నాడు.

            ఎగరడం అంటే ఆదివాసీలకు (నృత్యం | ఏందుముడ్) ప్రాణం. అదే వారి ప్రధాన వినోదం. ప్రతి సందర్భంలోనూ ఎగురుతారు. సందర్భాన్ని బట్టి అందరూ అన్ని వయసులవారు ఎగురుతారు. ఎగరడం వాళ్ళ జీవితంలోనే భాగం. చలికాలంలో, రాత్రులు, పెద్ద పెద్ద నెగళ్ళ చుట్టూ చేరి యువతీ యువకులు కలసి ఎగురుతారు. ఎగరడంలోనే వరుసైనవారి మధ్య ప్రేమలు పుట్టుకొస్తాయి. జోడీలు కుదురుతాయి. పాట, ఆట జోరుగా సాగుతూ ఉంటే మనసు కుదిరిన జోడీలు మధ్యలో మాయమవుతూనే ఉంటారు. అందరూ అన్ని వేళలా ఆట పాటల్లో లీనమవుతూనే ఉంటారు. తెల్లవార్లూ ఎగురుతూనే ఉంటారు. ఎగరడానికి ఎక్కడెక్కడి నుండో పిలుస్తుంటారు. పెళ్ళిళ్ళకు వచ్చినవారు ఎగరడానికి రెండు, మూడు రాత్రులు కూడ ఉండిపోతారు. స్తోమత ఉన్నవాళ్ళు ఇలాంటి ఆటపాటలకు పెద్ద ఎత్తున రోజుల తరబడి నిర్వహిస్తుంటారు. చనిపోయినవారి గొప్పలు పొగుడుతూ చావు దగ్గర కూడ ఎగురుతారు. పండుగల్లో సరేసరి. పెళ్ళి పాటలు, చావు పాటలు, పండుగ పాటలు దేనికవే రకరకాలు ఉంటాయి. దేని అడుగులు దానికే ఉంటాయి. దేవుని పూజలో, ఎగిరే వేళల్లో ‘పేన్ కర్పడ్’ వేరుగా ఉంటుంది. ఎగరడానికి మైళ్ళతరబడి ఉత్సాహంగా పోతారు. ఎగిరేవేళల్లో కల్లు సేవించడం సరదా! కాలిగజ్జెలు కట్టుకోవడం ఓ పిచ్చిగా ఉంటుంది. పాట – ఆట మినహా వారు అనుభవించే ఆనందం మరెందులో ఉంది? ‘రేలా’ అంటూ గొంతెత్తి పురుషులు, ‘రిలో’ అంటూ శ్రావ్యంగా స్త్రీలు అడవి అడివంతా ప్రతిధ్వనించేట్లు తమ అనుభవాలన్నీ పాటల్లో పేరుస్తూ అభినయిస్తూ పాడుతుంటే ఆ ఆనందం మనసున్న వాడికే అర్థమవుతుంది. డోళ్ళు, డప్పులతో, నగారా, కుండుడు, పరై, చిటుకోరలు మొదలైన ఎన్నో వాయిద్యాలతో సంగీతమే లోకంగా మునిగి తేలుతుంటారు. అందుకే ఏ ఊరికి వెళ్ళినా ఎగరడం నడుస్తుందంటే దళం అంతా అందులో పాల్గొనడానికి  ఉవ్విళ్ళూరుతుంటారు.

            ఆదివాసీ వ్యవసాయంలోనూ, వారి సంప్రదాయ జీవితంలోనూ ఎన్నో మార్పులు, అభివృద్ధి వస్తున్నట్టే, వారి ఆట పాటల్లోనూ, సంగీత ప్రపంచంలోనూ కూడ ఇప్పుడిప్పుడు మార్పు చోటు చేసుకుంటుంది. బతుకు తీరులో మార్పులతో పాటు సంగీత రీతుల్లో కొత్తదనం పుట్టుకొస్తుంది. డోళ్ళు వాయిస్తూ, పాడుతూ ఎగరడంలో తరతరాల నుంచి వస్తున్న నిదానమైన రేలా, రీలో రాగాల్లో ఒక ఊపు, వేగమూ వినవస్తున్నాయి. రోజు రోజు పెరుగుతున్న పోరాటం ఆ రాగతాళాల్లో వేగాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. బద్ధలైపోయే సనాతన సాంప్రదాయాల స్థానంలో బలమైన అభివృద్ధికర పద్ధతులు పెంచి పోషించడంలాగే ఆదివాసీల ఆట పాటల్లో పురివిప్పే సంగీత నృత్యాల్ని అందిపుచ్చుకొని పదిలపరచుకోవటం కాలం చేయవలసిన పని. అలా ఇంటరెస్ట్ గా ఎగిరేవారిని ప్రత్యేక కారణాలుంటే మినహా ఆపడు రుషి. అలా అందరు గోటుల్ ముందు ఎగరడానికి పోయినాక గాండో, గిరిజలతో నెగడు దగ్గరే సెల్ సమావేశం ప్రారంభమైంది.

            దళంలో వారు ముగ్గురే పార్టీ సభ్యులు – కమాండరే సెల్ కార్యదర్శి. పార్టీ సభ్యత్వం ఇవ్వదగినవారి పేర్లు కొన్ని పరిశీలనలో ఉన్నాయి. కొన్నింటిలో పై కమిటీ అభిప్రాయం రావాల్సి ఉంది. వాటిలో జైని పేరు కూడ ఒకటి. వారందరూ ఇంచుమించు ఒకే కాలంలో వచ్చినవారే. కేవలం సీనియారిటీ మాత్రమే కాక ఆయా వ్యక్తుల చైతన్యం, అభివృద్ధి, వర్గపోరాటంలో వారు నిలబడుతున్న తీరు, చొరవ, ధైర్య సాహసాలు, ప్రజలతో వారి సంబంధాలు మొదలయినవన్ని పరిశీలించిన మీదనే పార్టీ సభ్యత్వం ఇస్తారు.

            “ముఖ్యంగా మనం మాట్లాడాల్సిన విషయం” అంటూ కమాండర్ ఉపోద్ఘాతం మొదలు పెట్టాడు. ముసురులో తడిసిన కట్టెలతో నెగడు మండకుండా ఒకటే పొగ వచ్చి కళ్ళు మండుతున్నాయి. మంట ఎగదోయడానికి రుషి పాట్లు చూసి గాండో పొయ్యిలో కాలుతున్న కొర్రాయి తెచ్చి పెట్టాడు. .

            “పది నిమిషాల నెగడుకే మనకింత అవస్థ అవుతుంటే వంటా వార్పులకి అక్కలు ఎంత అవస్థ పడుతున్నారో – మనకి పట్టదు కదా” అని గిరిజ ఇంకేదో చెప్పబోతుంటే “లాల్ సలాం దాదా” అంటూ లట్టి వచ్చాడు.

            అతని పలకరింపు వాలకాన్ని బట్టి లట్టి ఏదో ముఖ్యమైన సంగతి చెప్పుకోవడానికి ఎవరూ లేకుండా చూసి అప్పుడు వచ్చాడన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది.

            “లట్టి సంఘి (బావ) గోటుల్ దగ్గర మనవాళ్ళు అందరు ఉన్నారు. అక్కడికి పద. మేం కూడ ఇపుడే వస్తా”మంటూ లట్టిని పంపే ప్రయత్నం చేశాడు గాండో.

            “అలాగే దాద!” అన్నాడు గాని లట్టి కదలలేదు.

            “దాదా – గడిసేపాగు – మా ముచ్చట ఉంది. పది నిముషాల్లో మనం మాట్లాడుకుందాం” అన్న కమాండర్ మాటతో లట్టి తృప్తిగా అక్కడే కూచుండిపోయాడు. “మనం తెలుగులో మాట్లాడుకుందాం” అంటూ మళ్ళీ మొదలెట్టాడు రుషి.

            “కామ్రేడ్స్! మేము పేనుకస వద్ద మాట్లాడుకుంటుండగా పోలీసుల దాడి జరిగింది. కారణం ఇంకా ఆలోచించాలి. ఏమైనా ఆ టైంలో జైని సెంట్రీలో ఉంది. అదే టైంలో తేనె కోసం వెళ్ళిన డుంగకూడ అక్కడే ఉన్నాడు. అకస్మాత్తుగా పోలీసులను చూడగానే ఏమాత్రం తత్తరపడకుండా వెంటనే జైని కాల్పులు ప్రారంభించడం, డుంగకూడ తోడుండడం మరింత నయమైంది. ఫైరింగ్ విన్న వెంటనే నేను మన దళ సభ్యులను తీసుకొని అడ్వాన్స్ అయ్యాను. డోలు దాద వాళ్ళకు బాంబులిచ్చాను. జరిగిన ఫైరింగ్ ఐదు నిముషాలేగానీ అందరూ ధైర్యంగా కాల్చారు. పోలీసులు నిలబడలేక పారిపోయారు. అన్నిట్లోకీ కాషన్ ఇవ్వగానే డోలు దాద విసిరిన గ్రెనేడు పేలడంతో పోలీసులు ఖంగుతిని కాలికి బుద్ధి చెప్పారు.

            మేమిక డిస్పర్స్ అవుతుండగా అక్కడికి చేరిన ఊరివాళ్ళు పోలీసుల గూర్చి మరింత వివరం చెప్పారు. దరోగా – మరో ఇద్దరు ఊళ్ళో ఉంటే నల్గురు ఇటు వచ్చారట. బహుశా ఊళ్ళో ఎవరైనా మన రాక గూర్చి ఉప్పందించారా? లేక మామూలుగా కల్లుబట్టీల కోసం తోగులు తిరగటానికి వచ్చారా తెలియదు. ఏమైనా సెంట్రీలో నున్న జైని అలర్ట్ అందరం అక్కడికి చేరి ఫైరింగ్ చేసినందునే ఏ ప్రమాదం లేకుండా బయటపడినాం. ఇందులో గాబరా ఎవరికి రాలేదు. ఊరి వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. ఇకపోతే అసలు విషయం ఏందంటే –

            వచ్చే సోమవారం ఈ పట్టి పెద్దల మీటింగ్ ఉందట. రోజు రోజుకు ఆడపిల్లలు పెద్దల మాట వినడం లేదని, రివాజులు తప్పుతున్నారని, కాబట్టి పట్టిలో రివాజులు గట్టిగ అమలు చేయాలనీ సమావేశం అవుతున్నారు. ఊళ్ళో మన సంఘాల్లో యువకుల పాత్ర బలపడకుండా అడ్డుకోవడానికి పెత్తందారు వేస్తున్న ఎత్తుగడల్లో ఇది కూడ ఒక భాగమే. దానికి కౌంటర్ గా మనం ప్రజలకు అసలు విషయం అర్థం చేయించాలి.

            మనం మహిళా సంఘాలు పెట్టడానికి చేయాలనుకుంటున్న ప్రచారానికి నిర్దిష్టంగా ఈ సమస్యనే జోడించవచ్చు. .

            అలాగే పోలీసులు మన పార్టీ పేరుతో “భగవాన్ జూట్ హై” అనే కరపత్రం వేసి, మరో కరపత్రం మాజీ హోం మంత్రి బాబూరావు మడాని పేరుతో అచ్చు వేయించారు. ఇలాంటి కరపత్రాలు ఇప్పటికే కొన్ని ఊళ్ళల్లో మన దృష్టికి వచ్చాయి. ఆదివాసీలు మొక్కే విగ్రహాలను విరగొట్టాలనీ, గోటు లను మన సంఘం ఆఫీసులుగా మార్చాలనీ పూజా పునస్కారాల పేరుతో వృథా చేసే డబ్బంతా పార్టీకి ఇవ్వాలనీ, నక్సలైట్లు ఊరూరా ఆదివాసీలను బెదిరిస్తున్నారంటూ ఇలా అడ్డమైన రాతలతో వారిని రెచ్చకొడుతూ “ఆదివాసీ యువక్ క్రాంతి సంఘటన్” అనే సంస్థను సృష్టించి దాని పేరుతో ఆ కర పత్రంలో మరీ నీచంగా రాశారు. ‘నక్సలైట్లను గెదమండి, తరమండి అన్నారు. గొట్టె స్త్రీలను తాత్కాలికంగా వాడుకుంటూ సొంత పెళ్ళాలను నగరాల్లోని ఫైవ్ స్టార్ హోటళ్ళలో కులక పెడుతున్నారని రాశారు. విప్లవం అని కేకలేస్తూ సంచులకొలది డబ్బు బంగారం సంపాదిస్తూ ప్రజలను తప్పు తోవ పట్టిస్తూ పబ్బం గడుపు కుంటున్నామని నానా కూతలు కూశారు. వీటన్నిటిని ప్రజల్లో మన స్పష్టంగా చెప్పాలి.

            మన పాత అక్కలైన రేఖ, మెంతక్క ఇర్పిలతో పాటు ఈసారి పిల్లీ, నవురిలు కూడ వచ్చారు. పిల్లి తన పసికందును వెంట పెట్టుకొని వచ్చింది. ఈ రెండు రోజులు లెబుడు దాదా చేయి కాల్చుకోకతప్పదు. నవురిని ఇంట్లో నుండి వెళ్ళనీయకుండా కట్టుదిట్టం చేశారట తల్లిదండ్రులు. ఎట్టకేలకు సాహసం చేసి వచ్చింది. అందరు ఉత్సాహంగానే ఉన్నారు. రివాజుల గురించి, పోలీసుల ప్రచారం గురించి బాగా అర్థం చేయించాలి. కనుక క్యాంపెయిన్ లో కనీసం మొదటి వారం రోజులైనా మన దళం అక్కలు కూడ ఉంటే బాగుంటుందనీ ధీకొండ దాదాలు పట్టుబడుతున్నారు. ఇదీ విషయం. ఇక మీ అభిప్రాయాలు చెప్పండి” అంటూ సమస్యను వారి ముందు ఉంచారు.

            కమాండర్ తెలుగులో చెప్పుకున్నంత సేపు గాండోకు దళంలో తన తొలి దినాలు గుర్తుకు రాసాగాయి. మొదట్లో తెలుగు ఏ మాత్రం వచ్చేది కాదు. ఆనాడు దళంలో తెలుగు వారే అధికం. వారు తెలుగులో మాట్లాడుకుంటుంటే తాను పిచ్చికోతిలా ఎలా చూసేవాడో ఇవాళ పరిస్థితితో పోల్చి చూసుకోసాగాడు. ఇవాళ తెలుగు పత్రికలు కూడ చదవ గలుగుతున్నాడు. తెలుగు పాటలు పాడుతున్నాడు. మాడియా అక్షరాలంటూ వేరే లేకపోయినా, భాషలో పాటలు కట్టి తెలుగులో రాసుకొని పాడుతూ ఊళ్ళో తమ్ముళ్ళకు నేర్పుతుంటే, తాను మాడియాలో రాసిన కథ. తెలుగు పత్రికలో అచ్చు పడిందంటే – గాండోకు పట్టరాని సంతోషంగా, గొప్ప గర్వంగా ఉంది. తాను చదువు నేర్చుకోవటమే గొప్ప అనుకుంటే, రుషి, గిరిజ లాంటి వాళ్ళు మాడియా నేర్చుకొని, ఊళ్ళో అన్నీ మాడియాలోనే మాట్లాడటం, మాడియాలోనే రాజకీయాలు చెప్పటం ఇంకా గొప్పగా కనిపిస్తుంది గాండోకి. లట్టి లాంటి వాళ్ళు మన చర్చలు వినకూడదని తప్పిస్తే, పార్టీ మీటింగులు, దళం మీటింగులు కూడ గోండి భాషలోనే జరుగుతూ ఉండడం గాండోకు కొండెక్కినట్టుంటుంది. తిండి, తిప్పలు, ఎగరడం, ఆట-పాట లన్నింటిలో ఇంటి మనుషుల్లా కలసిపోవడమే గాక పాడేలు దేవర్లతో సహా చుట్టరికాలు కలుపుకునే పార్టీ ఆదివాసుల్లో ఒకటైపోవడం సరేసరి. మాడియాల్లోంచే తన లాంటి వాళ్ళు ఎంతోమంది సంఘ నాయకులు, పార్టీ నాయకులుగా కూడ పుట్టుక రావడం, తాను దళానికి డిప్యూటీ కమాండర్ గావడం ఎప్పుడు అద్భుతం అనిపిస్తూనే ఉంటుంది. ఆదివాసీ విముక్తి ప్రాంతాలు, ప్రజా సైన్యం అంటూ చర్చల్లో అప్పుడప్పుడు దొర్లే మాటలు గుర్తొచ్చినప్పుడల్లా గాండో కలల్లో తేలిపోతుంటాడు.

            “ఏం కామ్రేడ్ – ఏం చేద్దాం చెప్పండి క్యాంపెయిన్” అనే హెచ్చరికతో తేరుకొని గాండో ఏదో చెప్పబోయేసరికి. –

            “మనం కూడ వారి వెంటపోతే వారి చొరవ దెబ్బతిని ప్రతిదానికి మనపైనే ఆధారపడుతుంటారనేది నేను ఆలోచిస్తున్నాను” అంది గిరిజ తన అభిప్రాయంగా.

            “మనం ఉన్నంత మాత్రాన్నే వారి చొరవ దెబ్బతినదు. వారి చొరవ, ధైర్యం, పెంచే పద్ధతులు మనం ప్రోత్సహించాలి. వారిని ట్రేనప్ చేసుకోవాలి. మనం ఉంటే ఊళ్లల్లోని రియాక్షనరీలు కూడ కంట్రోలుగా ఉంటారు. అసలే రివాజులపై క్యాంపెయిన్. మనం ఉండడమే మంచిదని నా అభిప్రాయం” అన్నాడు రుషి.

            “ఔనక్కా! పోవడమే మంచిది” – అన్నాడు గాండో.

            “ఇంగో” అంటూ తలూపింది గిరిజ. .

            క్యాంపెయిన్ ఎన్ని రోజులు – ఏ యే గ్రామాలు అనే వివరాలు కూడ మాట్లాడుకున్నారు. క్యాంపెయిన్ కు జైనిని కమాండర్ చేయాలన్న గిరిజ ప్రపోజల్ కాదంటూ గాండో, రుషిలు గిరిజనే కమాండర్‌గా ఉండాలన్నారు.

            ఊరి అక్కలకు కాలకృత్యాల నుండి క్యాంపెయిన్ కర్తవ్యాల వరకు క్రమశిక్షణను ప్రవర్తనను అన్నింటిని దగ్గరుండి నేర్పాలని తీర్మానించుకున్నారు. సబ్బులు, నూనెలు దళం వారు తమ కోటానే వాడుకోవాలనీ ఊరి అక్కల కోసం అదనంగా ఖర్చు పెట్టాలనీ కూడ వారు నిర్ణయం చేశారు.

            దూరంగా కూచుని వీరి చర్యనే తదేకంగా చూస్తూ నిశితంగా పరిశీలిస్తున్నాడు – లట్టి. ఈ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి కూచొని ముచ్చట చేయగా తానెవరినీ చూడలేదు. పండుగనాడైనా, పొల్వనాడైనా కూడ పని ఉంటే కేడోలకు పురమాయించటమే తప్ప, ఇలా ఔను-కాదు అని మాట్లాడుకోవడం ఎరగని బట్టి విస్తుపోతున్నాడు.

            జంగలోన్ని (గార్డుని) గజగజలాడించే రేంజర్ ని, పోలీసోన్ని హడలెత్తించే దరోగని, బాబులను గంటల తరబడి నిలబెట్టించి మాట్లాడే మిల్లు సాయబులను మాత్రమే ఎరిగి ఉన్న లట్టికి కమాండర్ ముందు గిరిజ – గాండో కూడ నవ్వుతూ కూచొని మాట్లాడడం వింతగానూ, ముచ్చటగానూ ఉంది. ఆ ధ్యాసలో ఆలోచిస్తున్న బట్టి తను వచ్చిన పని మరచిపోయి కళ్లప్పగించి చూస్తూ కూచున్నాడు.

            “దాదా – లట్టి దాదా” అంటూ పిలిచే వరకు ఈ లోకంలోకి రాలేదు లట్టి.

            “దాదా – మన అన్నలు – అక్కలు గోటుల్ దగ్గర ఉన్నారు. వంట అయ్యింది. పిలువు” అంటూ కమాండర్ పురమాయించాడు.

            లట్టిని పంపించి గాండో భుజంపై చేయి వేసి పక్కకు తీసుకెళ్ళాడు.

            క్యాంపెయిన్ అక్కలతో సహా మొత్తం 18 మందికి కూర సర్దాలని వడ్డన చూసుకోడానికి వెళ్లిపోయింది గిరిజ.

            “గాండో దాదా! రేపు మన అక్కలు క్యాంపెయిన్ కి పోతారు. మిగిలిన ఎనిమిది మందిమి డివిజనల్ కమిటి అపాయింట్‌మెంటుకు పోవాలి. వారం తర్వాత కలుసుకోడానికి అపాయింట్ మెంట్ పెట్టుకో. ఎవరమైనా అన్ని జాగ్రత్తలతో ఉండాలి. పోలీసు మూవింగ్ పెరిగింది” – అంటూ బాధ్యతలు అప్పగించాడు.

            రుషి చెప్పే మాటలన్నిటికి గాండో “ఇంగో-హే” అంటూ జవాబు ఇస్తున్నాడు.

            గిరిజ తినే స్థలం అంతా ఒకసారి చీపురుతో ఊడ్చి ఆకులు కడిగింది. నెగడు మంట కష్టమని కిట్టులోనుండి క్యాండిల్ తీసి తిండికి వచ్చే వారికై ఎదురు చూడసాగింది.

            దళ సభ్యులను పిలవడానికి వెళ్ళిన లట్టి గబగబా వస్తూనే “ఊళ్లి దాదాకు దేవుడొచ్చింది. దేవుని జండా పట్టుకొని ఎగురుతున్నాడు” అని చెప్పేసి చూడాలన్న గాబరాతో వచ్చినంత వేగంగా వెళ్ళిపోయాడు.

            గాండో ఉత్సాహంతో చూడ్డానికి పరుగుదీశాడు. గతంలో పార్టీలోనికి రాకముందే ఇంటివద్ద పోల్వ (పండుగ) సందర్భాలలో ఊల్లెకు దేవుడు పూనేవాడని కమాండరు తెలుసు. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇపుడు ఆ అవకాశం వదలకూడదని గిరిజను వెంట పెట్టుకొని గోటుల్ వైపు బయలుదేరాడు రుషి.

       “ఈ దేవుళ్ళు రావడం చాలా గమ్మత్తుగా ఉంటుంది కదూ! దేవర పూజల్లో ఎగిరే వేళల్లో డోళ్ళు, డప్పులు రణగొణ ధ్వనిలో, ధూపదీపాల వేడిలో ఒక హిప్నటిక్ వాతావరణం తయారై ఆ భక్తి పిచ్చిలో ఉన్నవాళ్ళకి ఆ క్షణంలో వారు ఏం చేస్తారో వారికే తెలియదు.

            ఓసారి మా అమ్మ కూడా అలా చేసింది. అయితే పొట్ట కూటికై దేవుడు పూనడం వేరు అనుకో!” అంటూ ముచ్చట చెప్పుకుంటూ గోటుల్ చేరుకున్నారు రుషి – గిరిజలు.

            అప్పటికే గ్రామస్తులు తంతు అంతా పూర్తి చేయడంతో అప్పుడే ఊల్లె తెలివికి వస్తున్నాడు.

            “క్యా హై కామ్రేడ్ ఊల్లె – తెలివి వచ్చినట్టుందే. నిన్ను చూద్దామనే మేము వస్తున్నాం. మళ్ళీ ట్రై చేయి కామ్రేడ్” అంటూ జోక్ చేశాడు రుషి.

            “నువ్వుంటే రాదు దాదా” అంది మిన్కో,

            “దాదా భయం దాదా అంటే గాదు. నక్సల్ వాది అంటేనే ఈ దేవర్లకి అందరికి భయం ” అంది జైని.

            “వెరీ గుడ్ జైని. ఇది పక్కా” అంది గిరిజ.

            “అన్ని తీర్మానాలు మీరే చేసేస్తున్నారే” అంటూ నవ్వుతూ అందరినీ వెంట పెట్టుకొని భోజనాలకై వచ్చాడు రుషి.

            గిరిజ తొందర చేసినంత వేగంగా తిండ్లు ముగించుకున్నారు. గిరిజకు జైని వడ్డనలో తోడయింది. భోజనాలు ముగించుకున్నవారు ఎవరి పనుల్లోకి వారు పోయారు. రుషి లట్టితో కూచున్నాడు. కుల్లె, మూర సెంట్రీలు పోయారు. డుంగ ఊరివాళ్ళతో చర్చల్లోకి దిగాడు. టుగె పిల్లల్లో కలిశాడు. అక్కలు అక్కల్లో కలిశారు. లట్టి తన అవస్థ చెప్పసాగాడు. రుషి శ్రద్ధగా వింటున్నాడు. తనకున్న రెండెకరాలకు జతగా ఆనుకొని ఉన్న అడవిని అన్నల నడిగే నరుక్కున్నాడు. జంగలోల్లు పి.ఓ.ఆర్. (ప్రైమరీ అఫెన్సివ్ రిపోర్ట్) పత్రాలపై సంతకం పెట్టమంటే పెట్టాల్సిన అవసరం లేదన్న అన్నల మాట అక్షరాల పాటించాడు – కానీ ఓనాడు పోలీసులతో వచ్చిన జంగలోల్లు ఒంటరిగా చూసి బలవంతంగా లభిచే సంతకం తీసుకున్నారు. అది మొదలు ఇవ్వాల్టి వరకు నాలుగేండ్ల నుండి కోర్టుకు నడుస్తున్నాడు. చంద్రపూర్ కోర్టుకు పోయి రావడానికి కనీసం యాభై రూపాయలు లేనిది కాని పని. భూమి కోసం జైలుకు వెళ్ళి విడుదలకై చేసిన అప్పు రెండు వేలు తీరనే లేదు. ఎన్నాళ్ళు ఈ కేసులకు తిరగడమో అర్థం కాని లట్టి రుషి ముందు తన సమస్యను ఉంచాడు.

            కొట్టి కొట్టి అరిగిపోయిన గిరకలో ఇరుక్కున్న మోట దండెడలాగ మొలతాడుకు బిగించిన గోచి పేగు తప్ప మరో గుడ్డ ముక్కే లేదు బట్టి ఒంటి మీద. ఇంట్లో ఓ పూట ఉంటే మరో పూటలేని బ్రతుకు. ఇప్పపూలు, వెదురు కక్కు అంబలితోనే ఉదయం నడుస్తుంది. సాయంకాలం నాలుగు మెతుకులు. ఎండాకాలం గడ్డలు – బిడ్డలు ఏరుకొని ఇల్లు గడపడం మహాకష్టంగా ఉంటుంది. సహజమైన చావుల కన్నా ఆకలి చావులే ఎక్కువ ఈ అడవిలో. అలాంటి లట్టి జీవితంలో కోర్టు కేసులు అంటే ఎట్లుంటుందో ఊహించు కోవచ్చు. ఇలాంటి అభాగ్యులు కేసులు అంటూ, కోర్టులకు పోవడం జరగని పని అని రుషికి తెలుసు. రుషి అదేమాట లబ్దికి నచ్చచెప్ప సాగాడు.

            “లట్టి దాదా! కేసుకు పోకు – ఏమవుతుందో చూద్దాం. ధీకొండ సంఘం వాళ్ళకు మేం చెప్పుతాం. రైతులపై బనాయించిన కేసులన్నీ ఎత్తివేయాలని మనం మోర్చా (ప్రదర్శన) జరుపుదాం. రైతాంగాన్ని కూడగట్టాలి. బలవంతాన పోలీసులు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అన్ని గ్రామాల్లోని ఆడ – మగ – పిల్లలు ఎదురు తిరగడం మినహా మార్గం లేదు. జంగలోళ్ళు భూముల్లో పిచ్చితుమ్మలు నాటే ప్రయత్నం చేస్తే వారిని గెదమాలి. అలాంటి కూలి పనులకు ఎవరు పోకుండా చూడాలి. ఒక్క విషయం దాదా! మన ఊళ్ళల్లోని యువకులు పోలీసులకు దొరకకుండా చూడాలి. పోలీసులు ఏ యువకుడు దొరికినా నక్సలైటు అంటారు. చంపేస్తారు. పైగా ఎదురు కాల్పులు అంటారు. మొగిలాయి (ఆదిలాబాద్)లో అమాయక యువకులను ఇరవై ఐదు మందిని చంపినారు. అందరు నక్సలైట్లే అని దబాయించారు. ఏమైనా పోలీసుల ఆట చెల్లు తుందని చూస్తున్నారు. నీవు మాత్రం వచ్చే వాయిదాకు పోకు. పోలీసులకు ఒంటరిగా దొరకకుండా ఉంటేసరి” తనకు కావలసిందే రుషి చెప్పేసరికి లట్టి ముఖంపై చిరునవ్వు కనపడింది. “ఎదురు తిరగాల్సిందే” అన్నాడు లట్టి.

రుషి లేచివచ్చి దళ సభ్యుల్ని కిట్లు వేసుకోమన్నాడు. క్యాంపెయిన్ అక్కలు ఒక పక్క నిలబడ్డారు. దళం అన్నలు ఒకవైపు నిలబడ్డారు. “కామ్రేడ్స్! ఇక్కడి నుండే ఎవరి రూట్ ప్రకారం వారు పోవాలి. తిరిగి కలుసుకుందాం” అని రుషి అనగానే వీడ్కోలుగా అందరు షేక్ హాండ్లు ఇచ్చుకోవడం మొదలైంది. నెగడు వెలుగులో ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుంటూ “మళ్ళీ కలుద్దాం కామ్రేడ్” అన్నట్టు ఆప్యాయంగా చూసుకుంటున్నారు. జైని చేయి కలిపినపుడు “జాగ్రత్త” అంటూ రుషి చూపులు క్షణకాలం ఆమె చూపుల్లో నిలిచిపోయాయి.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.