విజయవాటిక-7

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

ఇంద్రపురి బౌద్ధారామం.

విశాలమైన ఆ ఆరామము పూర్ణ చంద్రుని ఆకారంలో ఉంది. మహాస్థూపము గుండ్రని పెద్ద డోలు ఆకారంలో ఉన్నది. దాని మీద బుద్ధుని పాద ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. మరో ప్రక్క బోధిచెట్టు, ధర్మచక్రం ఉన్నాయి. చుట్టూ జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. బుద్ధుని జీవిత విశేషాలు, మాయావతి స్వప్నం, తెల్ల ఏనుగు, పద్మము ఇత్యాదివి ఆకర్షణీయంగా రచించి ఉన్నాయి. ఒకప్రక్క బౌద్ధ భిక్షుల విశాంత్రి గుహలు వరుసలుగా ఉన్నాయి. మరో ప్రక్క బుద్ధ ధ్యాన మందిరం ఉంది. ధ్యాన మందిరంలో బుద్ధుని అతి పెద్ద విగ్రహము ఉంది. పాలరాయి విగ్రహపు తథాగతుడు, అర్థనీలిత నేత్రాలతో,  భుజాల వరకూ సాగిన చెవులతో ఉన్నాడు. ఆయన పెదవుల పైన అలౌకికమైన చిరునవ్వు, తల పై కొప్పు, గుండ్రని ఉంగారాల జుత్తు కలిగి ఉన్నాడు. పద్మాసనములో, ధ్యానముద్రలో ఉన్న తథాగతుడు, ప్రపంచానికి శాంతి, అహింసలను బోధిస్తున్నట్లుగా ఉన్నాడు ఆ మహావిహారంలో.  

గౌతమ బుద్ధుడు మరణించిన వెంటనే ఆయన శిష్యులు సమావేశమయ్యారు. వారు గౌతమబుద్ధుని బోధలను గ్రంధస్తం చెయ్య ప్రయత్నించారు. అది ‘సుత్త పీటికగా’ పేరు పొందింది. ఇది ప్రధానంగా బుద్ధుని ప్రియ శిష్యుడు, బుద్ధునికి చివరి వరకూ సేవ చేసుకున్న ఆనందుడు రాసిన సూత్రాలు.

మొదట, గౌతమబుద్ధుని మానవునిగా భావించారు. అందుకే కేవలం ధర్మ చక్రం, బోధివృక్షం, త్రిరత్నాలను పూజించేవారు. తరువాత సమావేశంలో కొందరు బుద్ధుని పాదుకలు, బుద్ధుని మూర్తిని పూజించటము మొదలుపెట్టారు. అది గౌతముని బోధకు వ్యతిరేకమని కొందరు వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించినవారు హీనయాన బుద్ధులు. 

బుద్ధుడ్ని దేవుని అవతారంగా పూజించే వారు ‘మహాయానులుగా’ పేరు పొందారు. శాతవాహనులు మహాయాన బౌద్ధంను ఆదరించారు. ఆచార్య నాగర్జునుడు మహాయాన బౌద్ధవ్యాప్తి చేశాడు. విష్ణుకుండిన రాజులు మొదట బౌద్ధ మతము ఆవలంబించినా, వాకాటక మహారాణి మహాదేవి వారి గతిని మార్చి వైదీకాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. దీనికి బలమైన కారణాలు రెండు. ఒకటి, బౌద్ధం క్షత్రియులు పాటించకూడదని ఆమె నమ్మింది. రెండవది, బౌద్ధంలో ప్రవేశించిన వజ్రయాన బౌద్ధం. 
వజ్రయాన బౌద్ధం పూర్తిగా తాంత్రిక బౌద్ధం. శాక్యముని బుద్ధుడే ఈ తంత్రం బోధించాడని వారి నమ్మకం. వారు తారను శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. రకరకాల క్రతువులు చేసి బలులు ఇస్తారు.
ఈ రెండు కారాణాల వల్ల శాతవాహనులు నిర్వీర్యమయ్యారని మహాదేవి నమ్మకం. ఆమె అందుకే వేద పాఠశాలను ఘటికలుగా వ్యాప్తిచేయ్యటంలో సఫలీకృతమయ్యింది. 

విష్ణకుండినుల రాజ్యములో బౌద్ధానికి తిరిగి పునః గౌరవము తీసుకురావాలన్న ప్రయత్నంలో ఉన్నవారు ఆచార్య దశబలబలి. ఆయన ఇంద్రపురి మహావిహారానికి పర్యవేక్షకుడు. ఆచార్య దశబలబలి, బౌద్ధ త్రిపీటికలను ప్రజలలోకి తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నవాడు.  రాజమాత మాహాదేవిని కలిసి, ఆమెను కుదిరితే మార్చాలని, లేనిచో ఆ రాజ్యంలో బౌద్ధం పునః ప్రతిష్ఠించ అనుమతి కోరాలని గట్టి ప్రయత్నం మీద ఉన్నాడు. ఆ విషయమై ఆ రోజు మహావిహారంలో సభ జరిగింది. కొందరు ముఖ్యమైన సభ్యులు పాల్గొన్న ఆ సభలో ‘ఎలా రాజమాత మహాదేవి మనస్సు మార్చాలా’ అన్న విషయమే పెద్ద చర్చనీయాంశమైంది. ఆచార్య నాగార్జున శిష్యులలో ముఖ్యులైన ఆచార్య మహానాగ, ఆచార్య మాహానందాలు సంఘంలో స్త్రీలను బహిష్కరించాలన్న విషయమే గట్టిగా పట్టుబట్టారు. వారు మహాయానబౌద్ధులు. 

అసలు బౌద్ధ సంఘంలోకి స్త్రీలను బుద్ధుడే అనుమతించాడు. ఆయన మొదట స్త్రీలను అనుమతించినప్పుడు కాని, తరువాతి కాలములో కాని ఎటు వంటి అభ్యంతరం రాలేదు. కానీ, ఆచార్య నాగార్జునకు స్త్రీల ఉనికి నచ్చేది కాదు. ఆయన శిష్యులు మరింత ముందుకేగి, బౌద్ధ సన్యాసినులను బహిష్కరించాలన్న ఒక సిద్ధాంతము చేసి దానిని ప్రచారం చెయ్యసాగారు. సంఘంలో కొందరు బిక్షుకుల ప్రవర్తన కూడా అందుకు కారణమైయింది. 

ప్రస్తుతం మహావిహారంలో ఈ విషయమై పెద్ద గొడవే జరిగుతోంది. 

“మనము మన సంఘమును బాగుచేసుకున్న తరువాత రాజమాతను సందర్శిస్తే నయం. లేదంటే ముఖము చెల్లదు మనకు. మనలోని లోపాలు తీర్చుకోకపోతే ఎలా మనము బయటివాళ్ళను ఎదురుకుంటాము?” అన్నాడు ఆచార్య మహానాగ తీవ్ర స్వరంతో. 

అతనిని సమర్థిస్తూ మహానందుడు కూడా మాట్లాడాడు. “చంచల హృదయం కల స్త్రీలు మన సంఘం పెట్టిన సూత్రాలు తప్పి ప్రవర్తించారు. మన సంఘాన్ని పందికొక్కుల వలె తవ్వి, బౌద్ధాన్ని నాశనం చేస్తున్నారు…” అంటూ తీవ్రంగా నిందించాడు.

“బుద్ధుడే స్త్రీలను సంఘములోకి అనుమతించాడు. కాదనటానికి మనమెవరము? సూత్రాలు పాటించని వారిని మనం బహిష్కరిస్తూనే ఉన్నాము. మనము చూసినంతగా అది స్త్రీల  కంటే పురుష బిక్షుకులు ఎక్కువగా సూత్రాలు తప్పుతున్నారుగా…” అన్నాడు ఆచార్య దశబలబలి సర్ది చెప్పే ధోరణిలో. 

స్త్రీ జీవితాలలో దుర్భలమైన దుఃఖం ప్రతిబింబిస్తుంది. వారి వైవిహాక జీవితం బాగోక పోవటమో, మరొకటో, వారి జీవితాన్ని కంబళించివేస్తాయి. నిస్సహాయత పెనవేసుకున్న వారి జీవితాలకు బాసటగా నిలబడాలని వారిని సంఘంలోకి అనుమతినిచ్చాడు తథాగతుడు. 

జ్ఞానానికి, సుఖవంతమైన జీవితానికి స్త్రీలను దూరంగా ఉంచింది ఆనాటి సంస్కృతి. అటువంటి దీనులను దగ్గరకు చేర్చుకున్నవారు మొదట జైనులు, తరువాత తథాగతుడు. వారి వల్ల సంఘం మర్యాద తప్పుతున్నదనటం భావ్యం కాదని దశబలబలి భావన. ఆయన తథాగతుని వలె సర్వజీవులలో ఉన్న ఏకాత్మను దర్శిస్తాడు. అందరూ నిర్వాణానికి అర్హులని నమ్మకం ఉన్నవాడు. 

“ఇదంతా ఆ స్త్రీల వలననే. అందుకే చెప్పేది, ముందు వారిని వెళ్ళగొడితే బౌద్ధవ్యాప్తిని ఎవ్వరూ ఆపలేరు…” అన్నాడు మొండిగా మహానాగ.

అలా ఆ వాదన ఎంతో సేపు గడిచినా ఒక ముగింపుకు రాలేకపోయారు. 

“మనము ఇలా తగువులాడుకుంటూ ఉంటే ఉన్న విహారాలు మాయమవుతాయి, ఏదో ఒక ముగింపుకు రాక తప్పదు. రాజమాతను కలవకా తప్పదు…” స్థిరమైన కంఠంతో చెప్పాడు దశబలబలి.

“రాజమాతను బిక్షమడిగి ఒక మహావిహారం ఏర్పాటు చేయించి, ఈ స్త్రీ సన్యాసినులను అక్కడికి తరలిద్దాం. సరిపోతుంది…” అన్నాడు మహానాగ.

“దాని కోసమైనా మరి మనము రాజమాతను కలవాలి. మనము ఏదో ఒకటి చెయ్యకపోతే ఇక్కడ బౌద్ధము కనుమరుగవటం తథ్యం…” చెప్పాడు దశబలబలి. 

వారు అంత తీవ్రంగా గొంతు ఎత్తటానికి కారణం సంఘంలో ముందు రోజు బయట పడిన వర్ధనుడు, వనసరికల ప్రేమ వ్యవహారం. 

***

ఇరువురు బిక్షుకులు అదే విహారంలో ఉన్నారు. 

నిరుడు జరిగిన ప్రకృతి వైపరీత్యాలలో అదే మండలములో ఉన్న గ్రామ సేవకై వారిరువురు ఇతర సంఘ బిక్షుకులతో కలసి ప్రయాణించారు. వారు వనసరిక, వర్ధనుడు.

వనసరిక చాలా బీద యువతి. ఆమె తండ్రి ఆమె చిన్నతనంలో మరణించాడు. తల్లి పేదరికంలో మరిదిని ఆశ్రయించింది. అప్పటికి వనసరికకు పది సంవత్సరాలైనా లేవు. మరిది వారిద్దరినీ భరించటము కష్టమైనా, ముందు ఏమీ మాట్లాడలేదు. కానీ, కొద్ది నెలల తరువాత ముందు వదినను, తరువాత వనసరికను బలవంతంగా వశపరుచుకున్నాడు. 

పసితనంలో ఆ అఘాయిత్యానికి వనసరిక తల్లడిల్లింది. ఆమె హృదయం ముక్కలైయింది. దానికి తోడు తల్లి ఈ విషయం గ్రహించినా మరో దారి లేక మరిదిని ఏమీ అనలేక పోతున్నది. ఈ విషయం భరించలేక వనసరిక ఇంటిని విడిచి, బౌద్ధ సంఘాన్ని ఆశ్రయించింది. బౌద్ధ సంఘాలలో చేరాలంటే కొన్ని నిబంధనలు తప్పని సరిగా ఉండేవి. ఇంటి వారి అనుమతి, ఇరువది సంవత్సరాలు నిండి ఉండటము, అప్పటికే సంఘంలో ఉన్న బిక్షుకుల అనుమతి వంటివి. కానీ ఎవరూ లేని అనాధ అయిన వనసరికను జాలితో సంఘం స్వీకరించింది. 

ఆమె తన ఇరువై సంవత్సరాల వరకూ సంఘంలో వారు చెప్పిన పనులు చేస్తూ గడిపింది. తదనంతరం బౌద్ధ సన్యాసినులకు భయం లేదని తలచి, ఆమె బౌద్ధం స్వీకరించింది. 

ముందు రెండేళ్ళు వాళ్ళకు విద్యను నేర్పుతారు. వారిని ‘సిఖమన’ అంటారు. 

స్త్రీలకు నిబంధనలు హెచ్చు. వారు ఒంటరిగా ఉండకూడదు, సమూహాలుగా ఉండాలి. పురుషుల విహారాలకు వెళ్ళకూడదు. పురుషులు స్నానమాడు నదుల వద్దకు వెళ్ళకూడదు. ఒంటరిగా నదులు దాటకూడదు, జనావాసాలకు వెళ్ళకూడదు. ఇటువంటి ఎన్నో నియమాలు బుద్ధుడే పెట్టాడు. 

వనసరిక సంఘంలో బుద్ధుని తలుస్తూ, దీనులను సేవిస్తూ స్వస్తత పొందింది. ఆమె బుద్ధుని బోధలు విని, మనసును అంతర్ముఖంగా చేసి తథాగతుని పాదాలనాశ్రయించింది.

‘కాంతులిడే ఈ దేహము నవరంద్రాల కుండ…

శరీరం చీము నెత్తురు కూడిన పెంటకుప్ప…

దీని మీద మోహము నన్ను నిలపలేదు…

నేను తథాగతుని పాదాలను…

ధర్మచక్రం వదలను…

నేను నా జీవితం లోంచి…దుఃఖాన్ని, మగవాళ్ళను తరిమివేశాను’ అనుకున్నది. మనసులో తథాగతుని పూర్తిగా ఆశ్రయించింది.

వర్ధనుడి తల్లితండ్రులు గృహస్తు బౌద్ధులు. వారు పుత్రుని బౌద్ధ విహారానికి ఇచ్చివేశారు. అలా వర్ధనుడు బిక్షువుగా మారి సంఘంలో నివసించటం మొదలుపెట్టాడు. 

ఆ వానాకాలపు వరదలకు చెదిరిపోయిన గ్రామాలకు సేవలందించటానికి, వైద్యశాలను నెలకొల్పారు బౌద్ధభిక్షువులు. ఆ వైద్యశాలలో ఉదయం సేవకై వనసరిక, మరో భిక్షుక వచ్చేవారు. 

ఆమె తరువాత వర్ధనుడు సేవకై వచ్చేవాడు. ఒక్కోసారి అతను మరేదో పనిలో పడి వైద్యశాలలో తన సేవా సమయం తప్పేవాడు. ఆ సమయాలలో వనసరికే ఉండేది. వారిరువురికీ స్నేహం కుదిరింది. లేత యవ్వనపు వనసరిక శిరోముండనముతో, కాషాయవస్త్రంలో శరీరం మీద శ్రద్ధలేనట్లే ఉండేది. కాని యవ్వనం చాలా దుర్లభం. అందునా భిక్షుకలకు. వారి హృదయంలో లేని భావాలను కలిగించటానికి ఎన్నో శత్రువులు పొంచి ఉంటాయి.  అందుకే వారు ఒంటరిగా ఉండరు. 

వైద్యశాల సేవ తరువాత ఒకనాడు భిక్షుకులు నదిపై విహారానికి వెళ్ళారు. అనుకోకుండా వచ్చిన ప్రవాహంలో నౌక మునకలు వేసింది. ఆ ప్రమాదంలో వర్ధనుడు, వనసరిక ఒక దీవి పైకి నెట్టబడ్డారు. వారు అక్కడ్నుంచి తప్పించుకోలేకపోయారు. బలవంతమైన ఏకాంతం, చలి వారిని చుట్టుమట్టాయి. కొంతకాలానికి వారు నేర్చిన సన్యాసం మరచి, వివాహం చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. సంఘానికి వచ్చినా, వారి విషయం ఎవ్వరూ గమనించలేదు. వనసరికే వచ్చి దశబలబలితో సంఘం వదిలి వెళ్ళటానికి అనుమతిని అర్ధించింది. దానితో వారి విషయం బయటపడింది. 

శాంతస్వరూపుడైన దశబలబలికి ఇది చాలా మనస్తాపం కలిగించింది. ఆయన, వారిని సంఘం వదిలి వెళ్ళటానికి అనుమతినిచ్చాడు. ఆ రోజంతా తథాగతుని ధ్యానిస్తూ మహావిహారంలో ఉండిపోయాడు.

వనసరిక, వర్ధనుడి  విషయం చర్చనీయాంశమైంది. ఇటు వంటి విషయాల వలన సంఘం పై గౌరవం పోతున్నదని మహానాగ, మహానందుల అభిప్రాయం. స్త్రీ భిక్షుకులను వెలి వెయ్యమని పట్టుపట్టారు. అప్పటికే సమాజంలో బౌద్ధ భిక్షుకు స్త్రీలను చాలా చెడు అభిప్రాయంతో చూడటం జరుగుతోంది. అందుకే మరింతగా ఈ ఉదంతం సంఘంలో అలజడిలేపింది. ఈ విషయము అంతటా వ్యాపించక మునుపే, రాజమాతను కలవాలని దశబలబలి నిశ్చయించాడు. మరో సంగతి కూడా రాజమాతను వెంటనే కలవవలసిన అవసరం కలిగించింది. అందుకే, మహానాగుడుతో పాటు మరికొందరు వృద్ధ సన్యాసులు కూడా ఆయనతో కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు.  

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.