స్వేచ్ఛాలంకరణ

-శీలా సుభద్రా దేవి

 చిన్నప్పుడు పలకమీద
  అక్షరాలు దిద్దిన వేళ్ళు
  తర్వాత్తర్వాత ఇంటిముంగిట్లో
  చుక్కలచుట్టూరా ఆశల్ని అల్లుకొంటూ
  అందమైన రంగవల్లులుగా తీర్చడం అలవాటైన వేళ్ళు
  రాన్రానూ అక్షరాల్ని సేకరించుకొంటూ
  అర్ధవంతమైన పదాలుగా పేర్చడం నేర్చాయి

  రంగురంగుల పూలని మాలలుగా మార్చడం తెల్సిన చేతులు
  చీరలపై లతల్ని తీర్చేపనితనం తో పాటే
  అనుభూతుల్ని స్పందనల్నీ హత్తుకొంటూ
  పదాల్ని అల్లడమూ నేర్చుకున్నాయ్
  మనసు గుసగుసల్ని కంటితడినే కాక
  సామాజిక సవాలక్షగారడీవలల్నీ
  ఆలోచనల్ని కుదిపే అలజడుల్నీ
  కలగలిపి పద్యాల్ని పొదగడమూ నేర్చాయ్

  దశాబ్దాలపర్యంతం
  అక్షరాలవెంటే మేమూ
  మా వెంటవెంటనే మా పద్యాలూ
  నడుస్తూనడుస్తూనే వున్నాం
  ఇంతకాలమూ మా అక్షరాలకో మాకో
  వర్గాలో వర్నాలో
  ప్రాంతీయతలో అసమానతలో
  ఏవివక్షతల బురదలూ అంటకూడదనుకొన్నాం
  కానీ
  వెనకవెనకే వెంటాడే కిరణాలన్నీ
  వర్ణాలు వర్ణాలుగా
  వర్గాలువర్గాలుగా పలుకోణాల్లో విక్షేపం చెంది
  మమ్మల్నీ మా కవితాక్షరాల్నీ ఎత్తి చూపుతూనే వున్నాయ్

  అయితేనేం
  ఎవరికి వారు చుట్టచుట్టుకు పొయే
  స్వా ర్ధ కుబుసాల్లో  సుళ్ళుతిరుగుతూ తిరుగుతూ
  అంతర్గతంగా ఎవరికివారే

  బట్టలపై అద్దకపు పనిలా
  పదాలపొందికలో అడుగులూ
  అడుగుజాడల్లో అక్షరాలూ
  అద్దుకుంటూ నడుస్తూనేవున్నవాళ్ళం
  అప్పుడెప్పుడో బాల్యం లో
  మట్టిమీదో గచ్చుమీదో
  ఏముగ్గు ఎక్కడ ఎలా వేయాలో నిర్ణయించుకున్నవాళ్ళమే
  తర్వాత నూలుమీదా పట్టుమీదా
  ఏఅద్దకం ఎలాచేయాలో నేర్చుకున్నవాళ్ళమే
  రెండువర్గాల్లోనో రెండు  తరగతుల్లోనో
  ఏ పడగ నీడన ఎలా జీవించాలో అర్ధం చేసుకున్నవాళ్ళమే
  అక్షరాల్ని అల్ల్లుకుంటున్నవాళ్ళం
  నేడు ఏకోణాల్లో పాదాల్ని మోపాలోతెలీక
  నిరంతర పహరాల్లో లుంగలుచుట్టుకు పోతున్నాం
  మా పద్యాలకి ఏరంగు పులమాలో
  అనవరతం మధన పడ్తున్నాం

  ఈ సంధిగ్ధసమయం లో
  మాదైన శైలిలో మాకోసం మేముకాక
  ఏదో ఒక భూమిక ధరించక తప్పదా?
  ఈ సంక్షోభ సమయం లో
  మా ముఖం తో మేముగాక
  ఏదో ఒకతొడుగును ధరించక తప్పదా?
  స్వేచ్ఛగా మాటల్ని ఎగరేయగల హక్కు
  ఇంకా మన చేతుల్లో వాలలేదా?
  సరే ఇకతప్పేదేముంది
  ఇన్నాళ్ళూ ఇంటాబైటా రెండుపడగలనీడలో
  బతకడం అలవాటైనవాళ్ళమే కదా
  ఇప్పటినుండి మన అక్షరాల్ని మనమే మోసుకుంటూ
  మన పద్యాల్ని మనమే హత్తుకుంటూ
  వర్ణాలుగా… ప్రాంతీయాలుగా
  ఇంకా….ఇంకా….అనేకానేకంగా చీలిపోతున్న
  అగ్నిగుండాలమీదుగా
  వామన గుంటల్ని దాటుకుంటూ
  ఒకటీ…రెండేకాదు…వేలాది పడగనీడలు మనపైవాలి
  భూతద్దాలు ఎక్కుపెట్టి వెతుకుతున్నా సరే
  స్వేచ్ఛగా మన జీవితాల్ని మనమే అలంకరించుకుందాం
మనల్ని మనంగానే ఆవిష్కరించుకుందాం.

***

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.