డా. రాచకొండ అన్నపూర్ణ

-ఎన్.ఇన్నయ్య

          డా. రాచకొండ నరసింహ శర్మగారి శ్రీమతి డా. అన్నపూర్ణ గారు యం.బి.బి. యస్., డి. జి. ఓ .చదివి స్త్రీ వైద్య నిపుణురాలిగా పేరొందారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కొమ్మమూరు( కుమ్మమూరు) గ్రామానికి చెందిన కీ. శే. మైనేని వెంకట నర్సయ్య గారి కుమార్తె ఆమె.

          నేడు కులాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకోవడం సామాన్యమైంది.  కానీ దేశానికి స్వాతంత్య్రం వస్తున్న రోజులలో కులాంతర పెళ్ళి పెద్ద సమస్యగా వుండేది. 

          మైనేని అన్నపూర్ణ, రాచకొండ నరసింహ శర్మ మెడిసిన్  చదువుకునే రోజుల్లో పెళ్ళి చేసుకుందామనుకున్నారు.  వుయ్యూరుకు చెందిన అన్నపూర్ణ కమ్మకులానికి, నరసింహ శర్మ బ్రాహ్మణకులానికి చెందినవారు.  శర్మగారు వుయ్యూరు వెళ్ళి అన్నపూర్ణ పెద్దలతో పెళ్ళి విషయం చర్చించారు. ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు.  శర్మ విశాఖపట్టణం తిరిగి వెళ్ళిపోయారు.

          కానీ అన్నపూర్ణ శర్మగారినే పెళ్ళి చేసుకోవాలనే పట్టుదలతో సూట్ కేసులో బట్టలు సర్ధుకుని రైలెక్కి విశాఖపట్టణం వెళ్ళి, అక్కడ శర్మగారిని పెళ్ళిచేసుకున్నారు. 

          ఆమె ఒక తమ్ముడు అమెరికాలోని ప్రిన్స్ టన్ విశ్వవిద్యాలయంలో చీఫ్ లైబ్రేరియన్ గా పనిచేసి రిటైరైన శ్రీ మైనేని గోపాలకృష్ణగారు అమెరికాలోని అలబామా రాష్ట్రంలో  స్థిరపడ్డారు. శర్మగారు 1967 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యునిగా సేవలందించి, 1967 లో వారి కుటుంబం అమెరికా వెళ్ళింది. అక్కడ 38 సంవత్సరాల పాటు మసాచుస్సెట్స్ రాష్ట్రంలోనూ, ఆ తరువాత పెన్సిల్వేనియా రాష్ట్రంలోని లెబనాన్ పట్టణంలోనూ వైద్య సేవలందించారు ఈ దంపతులు. 1995 తరవాత భారతదేశం తిరిగివచ్చిన ఈ వృద్ధ దంపతులు అప్పటినుంచి విశాఖపట్నంలోని తమ స్వంత ఇల్లు రాచకొండ రెసిడెన్సీ లోని ఐదవ అంతస్తులో ప్రశాంతమైన విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం 97 సంవత్సరాలు నిండి 98 నడుస్తున్న డా.శర్మ గారు, వారి సతీమణి డా. అన్నపూర్ణ గారలు సమవయస్కులు.

          రాచకొండ నరసింహ శర్మ తన అన్న విశ్వనాథ శాస్త్రి రచనలు ఇంగ్లీషులోకి అనువదించసాగారు. అన్నపూర్ణ, శర్మగార్లది అన్యోన్యదాంపత్యం. వీరి కుమారుడు సుధాకర్, కుమార్తె జ్యోతి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.

          ప్రాక్టీసులో రిటైర్ అయిన తర్వాత ఉభయులూ విశాఖపట్టణంలో స్థిరపడ్డారు.  రాచకొండ నరసింహ శర్మ నిర్విరామంగా కవితలు,  వ్యాసాలు రచించేవారు. అన్నపూర్ణగారు ప్రశాంతమైన జీవనం గడిపారు.

విశాఖకు గాంధీజీ వచ్చిన సందర్భంగా స్టేషన్ కు వెళ్ళి స్వాగతం పలికిన వారిలో అన్నపూర్ణ వున్నారు. పట్టుదల, దీక్షకు ప్రతీక అన్నపూర్ణ.

   

          శర్మగారు, అన్నపూర్ణగారు సమవయస్కురాలే అయినప్పటికీ వారి సతీమణి        డా. అన్నపూర్ణ గారు మాత్రం వ్యక్తులను గుర్తించలేకపోవడం, వినికిడి కోల్పోవడం వంటి సమస్యలతో  చివరిరోజుల్లో బాధపడడం జరిగింది. 8-3-2022న వీరు ప్రపంచానికి దూరమయ్యారు.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.