విజయవాటిక-8

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

 ఇంద్రపురి బౌద్ధారామం

          ఇంద్రపురి విశాలమైన, ఎతైన భవనపు సముదాయాల నగరం. ఆ నగరానికి పశ్చిమాన బౌద్ధ విహారంలో ఆచార్య దశబలబలి నివాసం. ఇంద్రపురిలో ఒక బౌద్ధవిహారం కట్టించాలన్న సత్యసంకల్పంలో ఉన్నాడాయన. కొడిగట్టిబోతున్న ‘జ్యోతి’ బౌద్ధానికి తన చేతులను అడ్డం పెట్టిన మహానుభావుడాయన. బౌద్ధానికి పూర్వపు వైభవం తేవాలన్నది ఆయన ఆశయం. 

          బౌద్ధ గ్రంధాలు కూలంకుశంగా చదివినవాడు, మహా పండితుడు, బౌద్ధ త్రిపీటికలు ప్రజలకు అర్థమవ్వాలని విపులంగా రచించి ప్రజలలో వ్యాప్తి చేసినవాడు ఆచార్య దశబలబలి. త్రిపీటకములు మూడు. అవి వినయ పీటకము, అభిదమ్మ పీటకము, సుత్త పీటకము. ఈ పీటకములలో విజ్ఞానము, ధర్మము భద్రపరచబడింది. 

          వినయ పీటకములో బౌద్ధ సన్యాసులు అనుసరించ వలసిన సూక్ష్మాలు ఉంటాయి. దీనిలో మళ్ళీ భాగాలు అంతర్భాగాలు ఉన్నాయి. రెండవది సుత్త పీటకము. ఇది బుద్ధుని బోద్ధనలతో ఉంటుంది. ధర్మ సూక్ష్మాలను వివరిస్తుంది. బుద్ధుని జీవిత చరిత్ర, శిష్యులతో సంభాషణ, విశ్వం పుట్టుక, పునర్జన్మ, సన్యాసము, బ్రహ్మైక్యము, నిర్వాణము మొదలైన వివరాలు ఉంటాయి. 

          మూడవది అభిదమ్మ పీటకము. ఇందులో ధర్మ చర్చ ఉంటుంది.  “భగవతో        దశ బలబలినః చతుర్వైశారద్యవిశారదస్యాష్టాదశ వేణిక బుద్ధధమ్మ సమలంకృత మూత్తే ద్వాత్రింశన్మహా పురుష లక్షణ వరోవ లక్షితస్య జాతి జరామరణ శోకాదిషు బహు సంసారదుఃఖ నిమగ్నసవ్వ సత్వోత్తారణా యనేక కల్పా సంఖ్యే యోపవీత పుణ్యజ్ఞాన సంభార భారస్యాపగత రాగద్వేష జ్ఞానా స్సమ్యక్సంబుద్దస్య బుద్ధస్య”  అని వర్ణించబడినవాడు దశబలబలి. 

          ఆయనకు బౌద్ధములో పెరుగుతున్ను మార్పులు ప్రచండవేగముగా వస్తున్న తుఫానులా గోచరిస్తున్నాయి. 

***

          ఇంద్రపురిలోనే కతిక, సేరివ దంపతులు ఉన్నారు. వారు బౌద్ధమునాచరించే గృహస్తు భక్తులు. 

          కతిక కొద్దిగా పెంకి. వారి పుత్రుడు శాక్యుడు బిక్షువై విహారంలో ఉన్నాడు. తల్లిదండ్రులను దర్శించటానికి కూడా రాడు. వీరే వెళ్ళి చూసి వస్తూఉంటారు. ఆనాడు కతికకు కోపం పెరిగిపోతున్నది. కారణం ఆమె వెండి చెంబు కనపడటంలేదు. అదే కాదు, ఆ చెంబులో తన చంద్రహారం పెట్టి దానికి మూత కట్టిందామె. ఆ కాలంలో సొమ్ములను, నగలను చెంబులలో పెట్టి మూత కట్టి గోడలలోనో, భూమిలోనో పాతేవారు. అదే వారు రహస్య స్థలంలో దాచటం. చోరుల భయం అంతగా లేకపోయినా అదే అలవాటుగా ప్రజలు చేసేవారు.

          ఆమె తన తల్లి నుంచి సంక్రమించిన చంద్రహారం వెండి చెంబులో ఉంచి, మూత కట్టి దాచింది. చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ్నుంచి విహారానికి వెళ్ళి వద్దామన్నాడు సేరిక. ఆమె అందుకు సమ్మతించి చెంబు తియ్యబోతే, అది దొరకలేదు. ఆమె చాలా చోట్ల వెతికి, తన ఇంటిలో మూలకున్న భూగృహమంతా గాలించినా కనపడలేదు ఆమెకు వస్తువు. దాంతో ఆమె పెద్ద గొడవ మొదలుపెట్టింది. అది తన తల్లి నుండి తనకు సంక్రమించిందని ఆమె చేస్తున్న గొడవకు చుట్టు ప్రక్కలున్నవారు మూగారు. 

          “ఈ మధ్య ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయట నగరంలో…” అంది ప్రక్క ఇంటి ఇల్లాలు. 

          “అన్నీ సరిగ్గా చూసుకున్నావా?” అడిగింది ఎదురింటి ఇల్లాలు. 

          కన్నీరు మున్నీరవుతుంటే…“అంతటా వెతికాను. నా సొమ్ము నాది కాకపోవటానికి నే చేసిన పాపమేమిటి? తథాగతుని సేవలో లోపమా?” అన్నది బిగ్గరగా ఏడుస్తూ. 

          ఆమె ఏడుపుకు అప్పటికే సేరివకు మతి తప్పింది. ఆయన ఓదార్చలేక పోతున్నాడు. ఆయనకు కూడా వింతే, నగ ఎటు పోయిందోనని.

          ప్రక్కింటి ఉపాసకుడు ముందుకొచ్చి, సేరివ భుజం పై చెయ్యి వేసి “ మీరు కోప్పడనంటే మీకో ఉపాయం చెబుతాను…” అన్నాడు. 

          ఏడుస్తున్న కతిక కన్నీళ్ళు తుడుచుకుంటూ “ఏమిటది అన్నా?” అన్నది.దిగులుగా ఉన్న సేరివ కూడా అదే భావము కళ్ళలో చూపుతున్నాడు.

          “మీరు మరోలా అనుకోకండి. రత్నకరుడు మీకు సాయం చెయ్యగలడు.మమ్ములను ఎన్నో సార్లు ఆయన ఆదుకున్నాడు…” అన్నాడు. 

          ఈ రత్నకరుడు ఇంద్రపురి తూర్పున ఉన్న వనంలో ఉంటాడు. తంత్రము తెలిసిన వాడు, వజ్రయాన బౌద్ధుడు. ఆయనకు రకరకాల మంత్రాలు, కనికట్టు తెలుసు. అంజనము వేస్తాడు, కనపడనివి చూపుతాడు. ఏ రోగానికైనా మందు మంత్రమేనంటాడు. ఆయన చేసే హోమాలలో జంతుబలులు కూడా సామాన్యమే. అది తప్పని, అహింస బౌద్ధానికీ, వ్యతిరేకమని ఎవ్వరూ చెప్పలేరు ఆయనకు. అందరికీ ఆయన అవసరం, ఉపయోగం ఉంటుంది మరి! 

          సేరివ, కతిక ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. దుఃఖం దిగిమ్రింగి భర్త వేపు చూసింది కతిక. “నగ ముఖ్యము మనకు…” అన్నాడు సేరివ. అలా రత్నకరుని వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. 

          ఆ మరునాడు పక్కింటి మిత్రుడు, కతిక, సేరివ అందరూ రత్నకరుని వద్దకు వెళ్ళారు.  ఆయన ఇంటి ముందు ఉన్న హోమ గుండంలో ఏవో సమిధలు జల్లు తున్నాడు. 

          “ఏమిటిలా వచ్చావు ఉపాసకా?” పలకరించాడు రత్నకరుడు చేస్తున్న హోమము ఆపి. 

          ఉపాసకుడు నడచి వచ్చి, రత్నకరునికి నమస్కరించాడు. 

          “వీళ్ళు మా వీధిలో ఉంటారు. నాకు మిత్రులు. వారి ఇంటిలో నగలు పోయాయి.మీరే వారినాదుకోవాలి…” నెమ్మదైన కంఠస్వరముతో అర్థించాడు. 

          రత్నకరుడు నవ్వాడు బిగ్గరగా. “ మీరు వెళ్ళవలసినది రక్షక భటుల వద్దకు. మన ప్రభువు సత్యసంధులు. న్యాయదేవతను ఆరాధించేవారు కూడా…” అన్నాడు బిగ్గరగా.

          రత్నకరుడు ఎర్రని పంచె కట్టుకొని, మెడలో మాలలు ధరించి ఉన్నాడు. 

          ఆ ప్రాంగణంలో మూలన పెద్ద దిమ్మె మీద తార ఎడమ చేయి తో దీవిస్తూ కుడి చేత్తో స్వీకరిస్తున్న ముద్రతో ఉన్నది. ఆమె కిరీటములో మణులు నీలి ఆకాశ వర్ణములో మెరుస్తున్నాయి. ఆమె ముందు ధూపం వెలుగుతోంది. 

          కతిక వచ్చి రత్నకరుని పాదాలనంటి, నమస్కరించి బిగ్గరగా ఏడవటము మొదలు పెట్టింది. 

          “స్వామి!! అవి మా అమ్మ నగలు. నాకు అమ్మ గురుతులు. వాటిని నేను కోల్పోలేను…”  అన్నది కన్నీరు తుడుచుకుంటూ. 

          రత్నకరుడు జాలిపడి “మరి ఖర్చు పెట్టుకోగలరా?” అడిగాడు

          తల ఊపారు భార్యాభర్తలు.

          “రెండు బంగారు నాణేలు ఇచ్చి వెళ్ళండి. వచ్చే ఆది వారం మధ్యహ్నానానికి రండి…”  అన్నాడు. 

          సేరివ నడుముకున్న పట్టీ నుంచి రెండు నాణేలు తీసి ఇచ్చాడు. అవి బంగారు నాణేలు. విష్ణుకుండినుల కాలములో నాణేలు బంగారము, వెండి,రాగి నాణేలు. వాటి మీద పంజా విసరటానికి లేచిన సింహం బొమ్మ ఉన్నది. మరో నాణెం పై నౌక సముద్రంలో సాగుతోంది. ఆ రెండు నాణేలు రత్నకరునికిచ్చి వచ్చేశారు ఇద్దరూ. వెనకే ఉపాసకుడు వారితో కలిశాడు.

          ఆనాటి రాజులలో నాణేలు ముద్రించిన రాజులు బహు కొద్ది మంది. ముఖ్యంగా తెలుగు గడ్డను ఏలిన రాజులలో శాతవాహనుల తరువాత విష్ణుకుండినులే నాణేలను ముద్రించుకున్నారు. వారి రాజ గుర్తు పంజా విసరటానికి తయారుగ ఉన్న సింహం.    మరో గుర్తు నౌక. అవే గుర్తులతో బంగారు, వెండి, రాగి నాణేలను ముద్రించారు విష్ణుకుండినులు. (ఈ నాణేలు ఆనాటి రాజుల సాంఘికస్థితికి గుర్తులు)

***

          ఆదివారం ఉదయం సేరివ, కతికలిద్దరూ తయారై రత్నకరుని వద్దకు వెళ్ళారు. ఆయన అప్పటికే సిద్ధం చేసిన హోమగుండం వద్ద ఉన్నాడు. పచ్చని వస్త్రాలు కట్టుకున్నాడు. నుదుటన గంధం రేఖలుగా దిద్దిన తిలకం, తలకు కాషాయపు తల గుడ్డ కట్టాడు. మెడలో మాలలు. కళ్ళు మూసుకు ధ్యానం చేస్తున్నాడు. హోమగుండం ప్రక్కనే తారాదేవి దివ్య ప్రతిమ పువ్వులతో పూజా ద్రవ్యాలతో పూజించబడి ఉంది. ఆయన ఎత్తైన పీట మీద కూర్చోని ఉన్నాడు. అటునిటూ ఇద్దరు శిష్యులు అడిగినవి అందిస్తున్నారు. 

          వచ్చిన భార్యాభర్తలను చూసి సైగ చేశాడు రత్నకరుడు. వీరిద్దరిని దూరంగా ఉన్న ఆసనాలపై కూర్చోమని శిష్యులు చెప్పారు. ఒక గడియ సేపు రకరకాల ద్రవ్యాలతో హోమము చేసిన తరువాత  చేస్తున్న పనిని ఆపి, శిష్యుని వైపు చూసి తల ఊపాడు. 

          హోమగుండానికి ప్రక్కనే ముగ్గు వేసి, ముగ్గులో పసుపు, కుంకుమ అద్ది ఉన్నది. ఆ శిష్యుడు ఒక ఆరు సంవత్సరాల బాలికను తీసుకువచ్చాడు. ఆ బాలికను ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి ఆమె మొఖానికి హోమము నుంచి వచ్చిన భస్మము రాసారు. ఆ బాలిక ఎదురుగా అద్దం పెట్టాడు రత్నకరుడు. 

          ఆ బాలిక వైపు చూసి “ఏమైనా కనపడుతున్నదా? “ అడిగాడు రత్నకరుడు.

          “ధాన్యం…” అన్నది బాలిక.

          “వస్తువులేమైనా కనపడుతున్నవా?” బిగ్గరగా అడిగాడు.  

          ఆ బాలికలో చిన్నపాటి వణుకు కనపడింది. అమె మళ్ళీ అద్దంలోకి చూసి “ధాన్యం క్రింద పేటిక ఉన్నది…” అంది

          “ఏ దిక్కున?”

          “సూర్యుడుదయిస్తున్నాడు…” చెప్పిందామె. 

          “ఏదేశము…ఎవరైనా మానవులున్నారా?”

          “…” మౌనం సమాధానం.

          తరువాత ఎంత పిలిచినా ఆమె సమాధానమివ్వలేదు. 

          శిష్యులు ఆమెను లేపి తీసుకుపోయారు. ఆ బాలికను, ఆమె తల్లితండ్రులకు అప్పజెప్పి వచ్చారు. 

          రత్నకరుడు లేచి సేరివ, కతికల వైపు వచ్చాడు. 

          “మీరు తూర్పు దిక్కున మీ ధాన్యపు రాసుల క్రింద తవ్వండి. మీకు వడ్ల కుప్పలుంటే వాటిని తొలగించి క్రింద తవ్వండి, దొరుకుతుంది. దొరికాక వచ్చి కలవండి, రక్ష ఇస్తాను. మీకే సమస్య రాదు…” అంటూ లోనికెళ్ళిపోయాడు. 

          భార్యభర్తలిరువురూ ఇంటికి వచ్చేశారు. వారి పొలములో తూర్పు మూలనే ధ్యానపు నిల్వలు ఉన్నాయి. వాటిని తొలగించాడు సేరివ. అక్కడ వారికి నగల పేటిక లభించింది అందులో కతిక చంద్రహారము కనపడినది. ఆ పేటిక అక్కడికెలా వెళ్ళిందో ఇద్దరికీ అర్థం కాలేదు. కానీ, వస్తువు దొరికినందుకు సంతోషపడ్డారు. వీరే కాదు, వీరి మిత్రులు, పేటలోని బంధువులు రత్నకరుని నమ్మి అతనిని ఆశ్రయించటము మొదలుపెట్టారు. 

          వారు ఇంద్రపురి భౌద్ధారామానికి వెళ్ళటం దాదాపు మానివేశారు. వారి కుమారుని చూడటానికి మాత్రం ఒక్కసారి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు నగలు పోవటం, రత్నకరుని సాయం చెప్పారు. 

          వారి కుమారుడు, భిక్షుకు బాధపడ్డాడు.”తథాగతుని నమ్మి ఇలాంటివి ఇకపై చెయ్యకండి. భౌతిక లంపటము కొంతైనా మానండి…” అన్నాడా భిక్షుకు. 

          “సంసారములో ఉన్న మాకు కుదరదు భిక్షు. నీవు మమ్ములనధిక్షేపించకు…” అన్నది కతిక.

          భిక్షుకు మౌనంగా వెళ్ళిపోయాడు. 

          భార్యాభర్తలు ఇరువురు విహారం నుంచి ఇంటికి వచ్చేశారు, అలాగే బౌద్ధం నుంచి కూడా. ఆ రోజు వారికి ఒక పేటికి చేతికందింది. అందులో వంద బంగారూనాణెలున్నాయి. అది వారి గుమ్మం ముందు పెట్టిఉంది. ఎవరు పెట్టారో…ఎందుకో అర్థం కాలేదు. కాని ఎదురు చూడని సిరి కాదనకూడదని ఇంట్లోకి తెచ్చుకొని లక్ష్మీదేవి మూర్తి ముందు పెట్టిందామె. “శ్రీలక్ష్మీదేవి మన గృహ దేవత నేటి నుంచి…” అన్నది భర్తతో అధికార స్వరంతో.

          ఇలాంటివి ఎన్నో జరుగుతున్నవి ఇంద్రపురిలోనే కాదు… దేశ మంతటా…

***  

          “జ్ఞానప్రాప్తి కోసం గృహ పరిత్యాగము చేయవలసిన పనిలేదు. ఆ విషయము బుద్ధుడు కూడా చెప్పాడు. అంతరంగ ప్రభోదం లేనిదే ఎవ్వరూ సన్యసించకూడదు. తీవ్రమైన వైరాగ్యము కలవారే పరివ్రాజకులు కాగలరు. ప్రపంచానికి దూరంగా ఉండటము, అడవులలో వనాలలో ఉండటము సన్యాసము కాదు. ఎవరికి వారుగా సొంత లాభము కోసం ఆలోచించుకోవటము బుద్ధదేవునికి నచ్చదు. శాక్యముని బోధలో సంఘ పరివారము కూడా ముఖ్యమైనది. 

          ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ, లోకానుకంపాయ’అని చెప్పారు తథాగతుడు. కాబట్టి మీరు గృహస్తులుగా ఉండి కూడా బుద్ధదేవుని బోధనలు స్వీకరించి సంఘ హితానికి పాటుపడవచ్చు…” దశబలబలి ప్రవచిస్తున్నాడు. ఎందరో గృహస్తులు, సన్యాసులు వారి బోధనను నాగస్వరము వింటున్న నాగులలా మైమరచి వింటున్నారు. 

          ఇంతలో ధర్మ గంట వినపడింది. ఆచార్య దశబలబలి చెబుతున్న ప్రవచనం ఆపి, లేచి విహారం వైపుకు నడిచాడు. ఇంద్రపురి వాసులే కాక ఎందరో ఆచార్యుల దర్శనం చేసుకుపోతున్నారు. ఆయన తన విహారంలోకి వచ్చాడు. అక్కడ భిక్షుకు పిండకుడు ఎదురుచూస్తున్నారు. పిండకుడు కొంత రహస్య సమాచారం ఆచార్యునికి నివేదించటానికి వచ్చాడు. 

          అతనిని చూసి పలకరింపుగా నవ్వాడు ఆచార్యుడు. 

          “ఏమి సమాచారం తెచ్చావు పిండకా?” అన్నాడాయన ఆదరణగా.

          “ఆచార్యా! మన ఈ నగరములోనే కాదు దేశమంతటా కొంత వ్యతిరేకత పెరుగు తున్నది. మొన్న మన భిక్షుకుని తల్లి తండ్రులు హైందవము లోనికి నడిచి పోయారు…” అంటూ రత్నకరుని గురించి వివరించాడు.

          ఆచార్య దశబలబలి ఆలోచనా ముద్రలో ఉండిపోయాడు.  

          “మనము ఏదో ఒకటి చెయ్యకపోతే మిగలము. పైపెచ్చు మహారాజులు వారు అశ్వమేధము తలపెడుతున్నారని విన్నాను. ఇక నేనూ ఈ విషయం ఆలోచిస్తాను. నీవు వెళ్ళిరా పిండకా!” అంటూ అతనిని పంపించివేశాడు. 

          పిండకుడు నిష్క్రమించినా దశబలబలి మౌనంగా ఉండిపోయాడు. 

          ‘శాక్యముని! నన్ను నడిపించు. ఈ ప్రజలకు దుఃఖాన్ని దూరం చెయ్యాలని ప్రేమతో నీవు మార్గం చూపినా, వీరి మాయ తగ్గటం లేదు…’ అనుకున్నాడు. 

          ‘నేను ఇక ఉపేక్ష చెయ్యరాదు. దేశాటన చేసి ప్రజలను బౌద్ధం వైపుకు మరలుస్తాను. ముందు మహారాణిని కలవటం కూడా ముఖ్యం…’ అనుకున్నాడు బలంగా.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.