నిష్కల – 17

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: భూతల స్వర్గంగా భావించే అమెరికాలో భర్తతో కాలు పెట్టిన శోభ తన ప్రమేయం లేకుండానే గోడకేసి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేస్తుంది.  దూరమవుతుంది. ఒంటరి తల్లి ఏకైక కూతురు నిష్కల. స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తున్నది. తన క్లయింట్ తో కలసి వచ్చిన సారా, అచ్చు తన నానమ్మ పోలికలతో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది నిష్కల. అత్తగారు సరోజమ్మను చేరదీసి ఆదరిస్తుంది శోభ. 

*** 

 
నా బంధు మిత్రులందరికీ ఓ బహిరంగ ప్రకటన. 
ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో నాకు తోడు కావాలి. 
నా బాధను సంతోషాన్ని పంచుకునే తోడు కావాలి. 
అది ఆడ, మగ ఎవరైనా కావచ్చు… – మాధురి 
 
          వాట్సాప్ లో ఒక గ్రూప్ లో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ ను ఆశ్చర్యంతో మళ్ళీ మళ్ళీ చదివింది శోభ. 
 
          నిజమా.. ఒక మహిళ ఈ ప్రకటన చేసిందా..  నమ్మలేక పోతున్నది. కానీ నమ్మి తీరాలి కారణం ఆ ప్రకటన కింద ఉన్న పేరు మహిళదే అయినప్పుడు నమ్మకుండా ఎలా ఉండగలదు. .
 
          మన దేశంలో మహిళలు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యవహరించడం .. నిజమేనా అని సందేహంగా,  వింతగా అనిపిస్తున్నది ఆమెకు. ఎంత గుండె దిటవు ఉన్నది కాకపోతే ఆ విధంగా బహిరంగ ప్రకటన చేయగలుగుతుంది.  ఆమె మనః  స్థైర్యానికి మనసులోనే హ్యాట్సాఫ్ చెప్పింది శోభ. 
 
          తోడు కోసం ధైర్యంగా బహిరంగ ప్రకటన చేసిన ఈ భారతీయ మహిళలా అందరూ ఆలోచించగలరా..  
ఆమె ధోరణి ని అందుకోగలరా? ఆమోదించగలరా? 
 
          పితృస్వామిక సమాజంలో ద్వంద్వ విలువలు, స్పందనలు  ఆమెకు తెలియక ఇలాంటి ప్రకటన ఇచ్చి ఉంటుందా .. 
 
          స్త్రీ చుట్టూ గోడల దొంతరలు పేర్చిన సమాజం వాటిని పగలగొట్టి బయటికి వస్తానంటే ఆమోదిస్తుందా ? ఆహ్వానిస్తుందా? 
ఆమెను  దోషిగా నిలబెట్టి ప్రాసిక్యూట్  చేస్తారేమో. ఇకనుండి ఆమెపై ఎంత సామాజిక ఒత్తిడి పెరుగుతుందో .. 
 
          కలగాపులగం అయిన ఆలోచనలతో ప్రశ్నలతో మళ్ళీ ఆ మెసేజ్ చదివింది. 
తనకి కావలసిన తోడుకి ఆడ మగ తేడా లేదన్నది స్పష్టంగా చెప్పింది మాధురి.
ఈ విషయంలో ఆడవాళ్లు ఎట్లా స్పందిస్తారు? మగవాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? 
ఆమె అందాన్ని, స్త్రీత్వాన్ని తాత్కాలికంగా వాడుకుందామని, సరదా తీర్చుకుందామని అని కాకుండా ఆమెకు శాశ్వతంగా తోడుగా నిలబడగలడా? 
 
          ఇంత బాహాటంగా ఆహ్వానించిన ఆమె చొరవను అలుసుగా తీసుకోకుండా ఉంటాడా? నిజమైన ప్రేమను పంచగలడా?నలిగి పోకుండా ఉండగలదా? సమిధగా మారిపోతుందా. అతను బాగున్నా సమాజం ప్రశాంతంగా బతకనిస్తుందా?
ఆమెకు మరొక ఆమె తోడవడం అంటే అది సమాజ విరుద్ధం, ప్రకృతి విరుద్ధం అని కోడై కూయదూ…  వ్యక్తిగత స్వేచ్ఛ మితిమీరుతున్నదా..  సందేహం తొంగి చూసింది. 
ఆ మాధురి ఎవరో తెలియక పోయినా ఆమె బోల్డ్ నెస్ ఆమెను ఒక్కసారి చూడాలని గట్టిగా అనిపించేలా చేసింది శోభ మనసుకు. 
 
          నిన్న కావేరి గురించి ముచ్చటిస్తూ .ఆమె ఇంటి యజమాని, తల్లి కాని తల్లి రామవ్వ  అన్న మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడయితే నేనున్నాను బిడ్డను కాపాడుకుంటాను, నాకు వయసైపోయింది. ఇవ్వాళ కాకపోతే రేపైనా వెళ్లిపోవాల్సిందే.  నేను పోయే లోపల కావేరికి ఒక తోడు నీడ ఏర్పాటు చేయాలి. 
 
          ఏంటో ఈ  లోకం తీరు?!
 
          మగవారి విషయంలో ఆలోచించినట్టు ఆడవాళ్ళ విషయంలో ఆలోచించదు.  సంస్కృతి సాంప్రదాయ విలువలు కాపాడాల్సిన గురుతర బాధ్యత ఆడవాళ్లదే అంటుంది. 
 
          పెళ్ళాం  లేకపోతే వెంటనే అతన్ని రెండో పెళ్లికి సిద్ధం చేస్తుంది. అదే జతగాడికి దూరమైన ఆడపిల్ల తోడు వెతుక్కుంటే శరీర సుఖం కోసమే అన్నట్లు నలుగురు నాలుగు రకాలుగా ముఖం మీద విమర్శిస్తారు. విలువలు, కట్టుబాట్లు తప్పకుండా ఆమెను కావలి కాసే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంటుంది  సమాజం.
 
          అందుకేనేమో మనం పూనుకుని  కావేరికి తోడు ఏర్పాటు చెయ్యాలి. చిన్న పిల్ల. లోకం పోకడ తెలియని పిల్ల.  మనసుకు అయిన గాయం మానడం అంత సులభం ఏమీ కాదు కానీ మాన్చలేనిది మాత్రం కాదుగా..  
తొందర పడొద్దు కానీ నెమ్మదిగా  ఆమె మనసును సన్నద్ధం చేయాలి.  మీ ఎరుకలో ఆమె తోడు వెతికే ప్రయత్నం చెయ్యండి అంటూ చాలా హుందాగా చెప్పింది అనుభవాలతో పండిన రామవ్వ. 
 
          ఆ తర్వాత, కొద్దిగా ఆగి, అడిగితే ఏమనుకోరు కదా.. మీరు కూడా నాలాగ, కావేరి లాగా మగ తోడు లేని వారట కదా .. ఆరాతీసింది ఆ పెద్దావిడ. 
అవునన్నట్లు తలూపి ఆ విషయాన్ని దాటేస్తూ మరో విషయంలోకి సంభాషణ మళ్లించిన సంగతి గుర్తొచ్చింది శోభకు. 
 
          చేతిలో మొబైల్ లోని మెసేజ్ మళ్ళీ మళ్ళీ చదివింది.  ఆ ప్రకటన చేసిన వ్యక్తి  మాధురి ఎవరైనా మనసులో ఉన్నది నిస్సంకోచంగా, నిర్భయంగా ప్రపంచానికి వెల్లడి చేసే స్పష్టతకు మనసులోనే అబ్బురపడింది శోభ.  
 
          అంతా బాగానే ఉంది కానీ, ఆమె తనకు తోడయ్యే వ్యక్తిని ఎలా ఎంపిక చేసుకుంటుంది?  
అసలు ఆ స్త్రీ వయసు ఎంతో.. ఏమి చేస్తుందో .. ఎక్కడ ఉంటుందో.. ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నదో.. 
ఎవరైనా ఆమెను ఎలా సంప్రదిస్తారు? మళ్ళీ ప్రశ్నలు , సందేహాలు తొలిచేయడం మొదలుపెట్టాయి. 
 
          ఒక మహిళ ఒంటరిగా జీవితాంతం ఉండలేదా.. ఏదో ఒక తోడు ఉండాల్సిందేనా..? 
అసలు ఆమె  తోడు ఎందుకు కోరుకుంటున్నది? 
ఆర్ధికంగా వెసులుబాటు కోసం తోడు ఆశిస్తున్నదా.. లేక మనసుకు దగ్గరయ్యే మనిషి కావాలనుకుంటున్నదా..? లేక శారీరక అవసరాల కోసమా.. ఆలోచన ముందుకు సాగలేదు.  
 
          ఒక్క క్షణం తర్వాత, ఆడ / మగ ఎవరైనా సరే అంటున్నది అంటే ఆమె థర్డ్ జెండర్ కాదు కద?  సందేహం కొన్ని క్షణాలపాటు గందరగోళ పరిచింది.
 
          ఆ తర్వాత, అసలు ఆమె మానసిక స్థితి సరిగా ఉన్నదా.. ? అనే అనుమానం తో కాసేపు సతమతమైనది.  
నిజంగా మాధురి అనే ఆవిడ ఆ ప్రకటన చేసి ఉంటుందా? లేక ఎవరినైనా ఆట పట్టించడానికో ఆమె పేరు వాడుకునో ఆ పోస్టు పెట్టి ఉంటారా? అంతే అయి ఉండొచ్చు.  లేకపోతే ఎవరు చేస్తారు ఇలాంటి పని. ఇంత పబ్లిక్ పోస్ట్ పెట్టడం అంటే లేని తలనొప్పులు కొని తెచ్చుకోవడమే.. కొరివితో తల గోక్కోవడమే కదా .. 
అసలే ఒంటరి ఆడదాన్ని వేపుకుతినే సమాజంలో ఉన్నాం. అవకాశం కోసం గోతికాడ గుంటనక్కల్లా కాచుకు కూర్చునే వాళ్లకు కొదవలేదు.  ఇప్పుడు అటువంటి అవకాశం ఆమె వాళ్లకు ఇచ్చినట్లేగా .. అంత తెలివి తక్కువ పని ఈ దేశంలో ఏ ఆడమనిషి చేయగలదు? 
 
          నిజంగా ఆమెనే తెలిసో తెలియకో ఆ ప్రకటన ఇచ్చిందని అనుకుందాం.  అయితే ఆమె ఒంటరిగా ఎందుకు ఉంటున్నది? ఆమెకు అసలు భర్త తోడు లేదా? పెళ్లి చేసుకోలేదా? చేసుకుంటే చనిపోయాడా?  వదిలేసాడా లేక ఆమెనే వదిలేసిందా? ఏమో ఇవ్వాళా రేపు ఆడపిల్లలు ఏమీ తక్కువ తినడం లేదు. 
 
          మొగుడ్ని మూడు చెరువుల నీళ్లు తాగించడం చూస్తూనే ఉంది.  మొన్నా మధ్య తన కాలేజీ స్నేహితురాలు వరలక్ష్మి కొడుకు బతుకు బజారు పాలు చేసింది ఆమెకోడలు. 
పెళ్లయి మూడు నిద్రలు కూడా కాలేదు. ఇద్దరి మధ్య ఏదో మాట మాట వచ్చాయి.  దగ్గరవ్వాల్సిన మనసులు  మరింత దూరం పెరిగాయి.  పెద్దల తీరు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. 
నెలరోజులయ్యేసరికి ఎవరి ఇళ్లలో వాళ్ళు. 
ఆ తర్వాత ఆమె తరుపు పెద్దవాళ్ళు పంచాయితీ పెట్టించారు. 
మా అమ్మాయి ఈ ఇంటికి రాదని తేల్చి చెప్పారు. అబ్బాయిలో లోపం ఉందని అభాండం వేశారు. ఊహించని ఆ పరిస్థితికి వరలక్ష్మి కొడుకు నిస్చేష్టుడయ్యాడు. అంత నింద తట్టు కోవడం సున్నిత మనస్కుడైన అతనికి చాలా కష్టం కలిగింది. ఆ అమ్మాయకి  మరో  పెళ్లి కావడం కష్టం అంటూ  నలభై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వచ్చిన పెద్దలు . 
 
          వరలక్ష్మి పెట్టిన గొలుసు , నల్లపూసలు ,  కెంపుల హారం , డైమండ్ నెక్ లెస్ తిరిగి ఇవ్వమని తేల్చి చెప్పేశారు. పరువు కోసం పాకులాడే వరలక్ష్మి కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని వాళ్ళకి నోరెత్తి మాట్లాడే అవకాశం లేకుండా చేశారు.  
 
          ఈ మాధురి కూడా అటువంటి రకం కాదు కదా .. లోపలి నుండి అనేకానేక అనుమానాలు ప్రశ్నలు తోసుకొస్తున్నాయి.  వెంటనే తల అడ్డంగా ఊపుతూ ఊహూ కాదనుకుంటా.. మనసులోనే అనుకుంది శోభ ఏమో .. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం.  ఎవరు కేటుగాళ్ళో …, అయినవాళ్లే నమ్మించి గొంతుకోస్తుంటే  చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయగలుగుతున్నారు? 
 
          ముక్కుమొహం తెలియని ఆమె గురించి సందేహపడడంలో ఆశ్చర్యమేముంది అని తనకు తాను సర్ది చెప్పుకుంది.  అంతలో ఈ రోజు ఉదయం వార్తాపత్రికల్లో చదివిన వార్త కళ్ళముందు మెదిలింది. 
 
          జూబ్లీ హిల్స్ లో ఉండే  యాభై ఏళ్ల వ్యక్తి రెండో పెళ్లి కోసం మాట్రిమోని సైట్ లో తన ప్రొఫైల్ పెట్టాడు. ఆ సైట్ లో వివరాలు తెలుసుకుని ఓ  యువతి పేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది.  FB చాటింగ్ తో స్నేహం మొదలైంది . మాటలు కలిశాయి.  ప్రతి రోజు గుడ్ మార్నింగ్ తో మొదలై గుడ్ నైట్ తో ముగిసే దాకా ఎన్నెన్నో కబుర్లు ఇద్దరి మధ్య.  ఓ రోజు నాకంటే డబుల్ వయసున్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.  పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను.  తియ్య తియ్యగా చెప్పిందామె. ఉబ్బితబ్బిబ్బయి పోయాడతను.  పాతికేళ్ల పడుచు పిల్ల తన పక్కనుండబోతుందని సంబరపడిపోయారు. ఆ తర్వాత ఆమె చదువుకు డబ్బు కావాలంటే అడిగినంత ఇవ్వడం మొదలు పెట్టాడు.  అట్లా ఒకటి కాదు రెండు కాదు ముప్పై లక్షల పైనే ఆమెకు అప్పగించాడు.  ఆ తర్వాత మొహం చాటేసింది ఆ అమ్మాయి. అతని మెసేజిలకు రెస్పాన్స్ లేదు.  తర్వాత ఫోన్ పలకడం మానేసింది. నివ్వెరపోయిన అతను ఇప్పుడర్థం చేసుకున్నాడు తాను మోసపోయానని. చివరికి పోలీసులను ఆశ్రయించాడు  మాటలతో దగ్గరితనం చూపింది. 
 
          మాధురి కూడా అట్లాగే ఎవరైనా డబ్బున్న వారికి వల వేయాలన్న ప్రయత్నమా..  
ఎంత ఆలోచించినా మాధురి ఊహాజనిత పాత్ర కాదని, ఆమె వెతుకులాట నిజంగానే అని శోభ మనసు చెబుతున్నది. 
 
          ఎవరీ మాధురి?  నిటారుగా నిలబడి తన ఆలోచన నిండా నిండిపోయింది. తనకు తాను ప్రశ్నించుకుంది శోభ. 
 
          జీవన రహదారిలో ఎన్నాళ్ళుగా  ఒంటరి ప్రయాణం చేస్తున్నదో.. పిల్లలు లేక పోవచ్చు.  ఏకాకి తనం ఆమెను ఎంత క్షోభకు గురిచేసిందో.. 
పిల్లలు ఉంటే ఏ తల్లి ఇటువంటి సాహసం చేస్తుంది?
ఊహించడానికి ప్రయత్నించింది శోభ.  మాధురి ఎవరో తెలుసుకోవాలని ఉత్సాహ పడుతున్నది శోభ మనసు. 
 
          ఎవరికైనా ఒంటరి జీవితం ఎంత నరకం. ఒకరి కోసం ఒకరు ఉండడంలోని స్నేహ బంధం , ఒకరిలో మరొకరు ఏకమవడంలోని ప్రేమ బంధం కోల్పోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో.. ఆ బంధం విలువ ఏంటో .. కుదిపేసే, కుంగదీసే ఒంటరితనాన్ని దాటడం ఎంత కష్టమో..   చిగురించే ఆశలతోనే వివాహబంధం లోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల.  కానీ ఆశల ఆకులన్నీ పచ్చగా కళ కళలాడుతూ ఉంటాయా .. ఊహూ..లేదు
కొన్ని చిగురించకుండా మొదట్లోనే మాడిపోతాయి.  కొన్ని త్వరలోనే వాడి రాలిపోతాయి.  మరి కొన్ని కొంత కాలానికి రాలిపోతాయి. కొందరికి మాత్రమే చిగురించి కొమ్మలు రెమ్మలు వేస్తూ అందమైన ,ఆరోగ్యమైన  జీవితం అందేది. దీర్ఘంగా నిట్టూర్చి వదిలింది. 
 
          తను కూడా అందరు ఆడపిల్లల్లాగే కోటి కలలతో, అంతులేని ఆనందంతో అతని చేయి పట్టుకొని అత్తింటికి నడిచింది.  ఆ ఇల్లు కొత్తది కాకపోవడంతో భయం బెరుకు లేవు. చిన్నప్పటి నుంచి చూసిన మేనబావ అంటే ఆరాధన తప్ప ఎటువంటి భయాలు లేవు.  నిశ్చింతగా అతని వెంట ఏడడుగులు వేసింది.  అతనిలో ఒదిగిపోవాలని తపన పడింది. 
 
          కానీ మనసు లేని మనువని తెలియదుగా .. 
మనసు, మమతా లేని బంధం మూన్నాళ్ళ ముచ్చట తీరకుండానే వాడిపోయింది. రాలియింది. అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. నమ్మకం వమ్మయ్యాక , ఆశలు వాంఛలు ముక్కలయ్యాక బాధతో పాటు  అతనంటే ద్వేషం, కోపం ఉండేవి. 
తప్పు అతనిది కాదని అర్ధం చేసుకున్నాక, జీవితాన్ని చూసే కోణం మార్చుకున్నాక కరిగిపోతున్న కాలంతో పాటే ఆ ద్వేషం, కోపం కరిగిపోయాయి. 
 
          అతను తన మనిషి కాదు మరొకరి సొత్తు అని అర్ధమయ్యాక ఇంకా ఆ బంధం కోసం ఆలోచించడం, బతకడం అంత బుద్ధి తక్కువ లేదని నచ్చ చెప్పుకుంది. తనను తాను ఊరడించుకుంటూ గమ్యం కేసి అడుగులు వేయడం మొదలుపెట్టింది. 
 
          ఇప్పుడతను వచ్చి ఇంటి ముందు  కంటి ముందు ఉంటే తాను కూడా మాట్లాడుతుంది. మేనత్త కొడుకుగానే మాట్లాడుతుంది. 
 
          ఈ ప్రపంచం ఎంత విచిత్రమైంది. ఈ ప్రపంచానికి భయపడితే బతుకులను నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తుంది. ఎదురు నిలిస్తే మొదట నడ్డి విరచాలని యత్నించినప్పటికీ తర్వాత వంగి ఉంటుంది. ఈ ప్రపంచం జ్ఞానం ఒకప్పుడు లేదు. నాకు నేను, నా కూతురు ఇదే నా ప్రపంచం అని చుట్టూ గిరి గీసుకుంది. ఆ గిరిలోనే బతికింది.  అలా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలను అనుకుంది.  తన జీవితం చూసి కుంగిపోయిన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడానికి యత్నించేది. 
 
          తన శ్వాస నిశ్వాసలు తన బిడ్డ.  ఆమె గురించి తప్ప మరో ఆలోచన చేసేది కాదు. పెరుగుతున్న తన బిడ్డతో పాటే తన ప్రపంచం విశాలం అవడం మొదలు పెట్టింది.  చంటిదాన్ని సంతోష పెట్టడం కోసం జనంలోకి రావడం ప్రారంభించింది. జనంలోకి రావడం మొదలు పెట్టాక, ప్రతి వారిని నిశితంగా చూడడం అలవాటయింది. గత అనుభవాలు  మరిచిపోయానని ఆమె చెప్పుకున్నప్పటికీ లోనుండి ఆమెను నడపడం మొదలు పెట్టాయి.  ఎన్నో పాఠాలు నేర్పాయి.  జీవితం నేర్పిన పాఠం ఎంతో విలువైనదని శోభకు అనుభవం అయ్యాక ప్రతి అడుగు ఆచితూచి వేస్తుంది. 
మనిషిని చదవడం ఆరంభించాక ప్రపంచం బాగానే అర్థమవుతూ వచ్చింది. తన తోటి వాళ్లకంటే భిన్నంగా ఆలోచన చేయడం మొదలు పెట్టింది.  కూతురు వేసే ప్రశ్నలు, 
ఆ చిన్నారి చేసే విశ్లేషణలు శోభను అబ్బుర పరిచేవి. ఇంత చిన్న పిల్ల కున్న వివేచన , ఆలోచన తనకెందుకు లేదు అని ఆశ్చర్యపోయేది. బిడ్డ ముద్దుమురిపాలు ఆనందిస్తూ, తల్లి తండ్రి అయి బాధ్యతలు నెరవేరుస్తూ అందులోనే సంతృప్తిని వెతుక్కుంది. 
కానీ తనకొక తోడు కావాలని ఆలోచన చేయలేదు. శరీరంతో పోరాటం చేసి దాన్ని తన ఆధీనంలో పెట్టుకుంది. మనసుని  రాయిలాగే  చేసుకు బతికింది. ఇప్పుడు, రెక్కలు వచ్చిన బిడ్డ తనకు నచ్చిన తీరానికి ఎగిరిపోయింది.  ఈ భూమ్మీద ఎవరు ఎవరికి శాశ్వతం?  ఎవరికి ఎవరు తోడు? మనిషికి ఎందుకు ఈ ఆరాటం అని తనకు తాను నచ్చచెప్పుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉండేది.  ఇప్పుడు తన నిషి తనకు దూరంగా ఉందన్న బాధ లేదు. ఎక్కడున్నా ఆమె క్షేమంగా, సంతోషంగా ఉండడమే తాను కోరుకునేది. చుట్టూ ఉన్న తన ప్రపంచంలో కావేరి లాంటి ఎందరో స్త్రీలు, పిల్లలు తన వాళ్ళు గానే అనిపిస్తున్నారు.వాళ్ళతో ఉన్నప్పుడు,వాళ్ళ కోసం ఆలోచిస్తున్నప్పుడు, వాళ్ళ కోసం పనిచేస్తున్నప్పుడు మనసుకు ఆనందంగా ఉంటుంది. తనకు తోచిన తోడ్పాటు అందిస్తున్నందుకు తృప్తిగా  అనిపిస్తుంది. 
 
          కాలం చాలా గొప్పది… మనకి అన్నీ నేర్పిస్తుంది. నేర్చుకుంటూ దైర్యంగా ఓపికతో ముందుకు వెళ్ళితే తప్పకుండా మంచే జరుగుతుంది అని నమ్ముతుంది శోభ. 
 
          ‘నేను జీవితాన్ని గెలిచిన’ అన్నది ఆ పెద్దావిడ రామవ్వ.  అలా అంటున్నప్పుడు ఆ గొంతులో గొప్ప ఆత్మవిశ్వాసం.  కళ్ళలో కాంతి, మొహంలో మెరుపు.  
 
అసలు గెలవడం అంటే ఏంటి ? 
మరుక్షణానికి గ్యారెంటీ లేని జీవితంలో గెలవడం అంటే ఏంటి ? 
ఎవరైనా జీవితాన్ని పిలకాబట్టి నడిపించగలరా .. నడిపించలేం కదా .. అటువంటప్పుడు గెలుపు ఓటముల ప్రసక్తి ఏముంటుంది? పుట్టిన ప్రతి జీవికి జీవన పోరాటం క్షణక్షణం ఉంటూనే ఉంటుంది. 
 
          నేనేమన్నా ఒంటరి జీవితం కోరుకున్నానా..  కోరుకోనప్పటికీ వచ్చి ఎదుట వాలింది.  అంతకు మించిన మార్గం తనకు లేదనుకుంది.  తనవాళ్లు కూడా అదే అనుకున్నట్లున్నారు. ఒంటరిగా బిడ్డతో ఎలా బతుకుతానో అని బెంగటిల్లి పోయాడు నాన్న. కానీ నేను బతకడం లేదూ…  బతుకుతూనే ఉన్నానుగా .. బతకలేం అనుకుంటాం కానీ జీవితం నేర్పిస్తుంది ఎలా బతకాలో.. ఏం చేయాలో.. కొంచెం ఓపిక తో కాలంపెట్టిన పరీక్షల్ని అర్ధం చేసుకుంటూ ముడులు విప్పుకుంటూ పోవడమేనని అర్థమయింది. 
 
          అందుకే, ఎన్ని గాయాలైనా, కాళ్ళ కింద భూమిని ఎవరో లాగేస్తున్నంత బాధకలిగినా అన్నిటిని ఇంకించేసుకుంటూ నడుస్తూనే ఉంది.  నేనేంటి ఎవరైనా అంతే, ఇరుకు అయిపోయిన మనుషుల మధ్య జీవితాన్ని ముందుకు ఈడ్చుకు పోతూనే ఉంటారు. 
ఊహూ.. కాదు, కాదు జీవితమే ముందుకు లాక్కుపోతుంది.  ఏళ్లనాటి గాయాల్ని మాయం చేసి మనసులో కరుణ నింపేస్తుంది.  బతుకు బాట వేసుకొమ్మని మూగ సైగలు చేస్తుంది.  కన్నీటి చినుకుల మధ్య తడిసి పోకుండా అర్ధం చేసుకోవాలి అంతే. 
 
          అందరు ఆడపిల్లల్లాగా పెళ్లితో కలల ప్రపంచం లోకి అడుగుపెట్టా.  భర్త పిల్లలు ఊహల ప్రపంచంలో ఊరేగిన నేను ఏమయ్యాను? తాడు తెగిన ఊయలలాగా.. దబ్బున జారి పడింది. నడ్డి విరిగినా , కాలు చేయి మొరాయించినా  లేచి నిలబడింది.  నడవడం నేర్చుకుంది. కలలు కనడం ఎప్పుడో మరిచిపోయాయిన కళ్ళకు కదలిక నిచ్చింది.
    
          తన భవిష్యత్ జీవితం ఇట్లా ఉండాలని ముందు ఎప్పుడైనా అనుకుందా .. లేదు .
జీవితం ఎటు , ఎట్లా తీసుకుపోతే అట్లా పోవడం అలవాటు చేసుకుంది. ఎప్పుడైతే తన ఎదుట వచ్చిన వ్యక్తులను, బంధాలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలు పెట్టిందో.. వాటికి విలువ ఇవ్వడం మొదలు పెట్టిందో ..  ఆ బంధాలను ప్రేమించడం మొదలు పెటిందో.. అప్పటి నుంచి మనుషులపై  లోపల గూడుకట్టుకున్న అసంతృప్తి, అసహనం  నెమ్మదిగా దూరమవడం మొదలైంది. ఆశ నిరాశల మధ్య కొట్టుకుపోయే జీవితంలోని ఆవేదన కరిగి ప్రవహించడం మొదలైంది. భవిష్యత్ జీవితంపై ఉన్న సందిగ్ధాలు, అయోమయాలు కనుమరుగవడం జరిగింది. బావిలో నీళ్లు చెబుతుంటే మళ్ళీ కొత్త నీరు ఊరుతూ ఉంటుంది. మరెందరికో దాహం తీరుస్తూ ఉంటుంది. 
అట్లాగే జీవితంలో కూడా.. తన కుటుంబానికో , రక్త సంబంధానికో మాత్రమే కాదు ప్రేమ పంచుతూ ఉంటే ప్రేమ తడి ఇంకా ఇంకా ఊరుతూ ఉంటుందని అర్థమైంది. 
 
          మనిషికి మనసును గాల్లొతేల్చేసే అంతులేని ఆనందాన్నిచ్చినా , జీవిత కాలం పాటు మెలిపెట్టే విషాదాన్ని మిగిల్చినా అందుకు మూలం ప్రేమే కదా .. అది ఏ బంధమైనా, ఎవరి మధ్యనైనా 
 
          ఒకరి అధీనంలో , ఆధిపత్యంలో లేకుండా స్వతంత్రంగా ఆలోచిస్తున్నది, నిర్ణయాలు తీసుకుంటున్నది . అతనితో ఉంటే ఇలా చేయగలిగేదా..?!  అతని ఆలోచనలకు విలువ అతనికి నీడలాగో మరోలాగో ఉండేదేమో. నా ఆశలు, ఆలోచనలు అన్నిటిని కట్టడి చేస్తూ, నియంత్రిస్తూ తన కనుసన్నలలో మెలగాలని కోరుకునే వాడేమో. భర్తే దైవంగా భావించే అమ్మపెంపకంలో పెరిగిన నేను అట్లాగే ఉండేదాన్నేమో. 
ఇప్పుడు అలా కాదు. మంచి చెడు పంచుకునే తోడు లేకపోవచ్చు కానీ ఇదొక సౌలభ్యం ఒంటరి బతుకులోనే లభ్యమవుతుందేమో .. తన ఆలోచనకు తానే చిన్నగా నవ్వుకుంది శోభ.  లేకపోతే తన తోటివారికి భిన్నమైన జీవితం గడిపేదా.. కొత్త మనుషులతో పరిచయాలు, సంబంధాలు ఉండేవా? విభిన్న అనుభవాలు పొందగలిగేదా?  ఇప్పుడు నాకున్న సమయం నాది. నిర్ణయం నాది. అంతా నా చేతుల్లోనే ఉంటుంది.  నాకు నచ్చిన విధంగా ప్లాన్ చేసుకోగలుగు తున్నది.. సమాజంలో తన పరిధి విశాలమైంది. జీవితంలో ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకుంది.  తనను తాను కొత్తగా ఉద్భవింప చేసుకుంది.  లేకపోతే అందరిలాగే మూసలో కొట్టుకుపోయేది.ఇప్పుడు ఒంటరితనంలో ఏ భయాలు లేవు. అందులోంచి వచ్చే ఇన్ సెక్యూరిటీ  లేవు. నా బతుకు ఏంటో నాకు తెలుసు.  నేనేంటో నాకు తెలుసు. నేనిప్పుడు ఎవరిపై ఆధారపడి జీవించే వ్యక్తిని కాదు. సర్వ స్వతంత్రురాలిని.  సర్వస్వతంత్రురాలిని అనుకోవడంలోనే శరీరంలోకి నర నరాల్లోంచి కొత్త శక్తి నిండుతున్న భావన కలుగుతున్నది. అవును, మరయితే ఇంకెందుకు ఆలస్యం.  కొంతకాలంగా ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన పదే పదే వాయిదా వేస్తున్నావెందుకు?  అని ప్రశ్నించింది ఆమె లోపలి మనిషి. నిజమే, రిషి కేశ్, ముస్సోరి, లే లడఖ్, కన్యాకుమారి చూడాలని చిన్న నాటి కల . అది ఎందుకు నెరవేర్చుకోలేక పోతున్నది?
వద్దనేవాళ్ళు, అవరోధాలు కల్పించేవాళ్ళు లేరుగా .. లోపలినుండి ప్రశ్న. 
అత్తను అట్లా ఒక్కదాన్ని వదిలి తాను ఎలా వెళ్లగలుగుతుంది.  అత్తగారిలా కాకపోయినా మేనత్తగానైనా ఆమె వయసుకు గౌరవం ఇవ్వాలి.  ఆమె బాధ్యతలు తీసుకోవాలి ఎప్పుడో నిర్ణయించుకున్నాగా. అట్లాగే అనుకుంటూ, ఏవో సాకులు చూపుకుంటూ వాయిదా మీద వాయిదా వేసుకుంటూ పో .. ముసలి దానివి అయ్యాక కాలు కదపగలవా .. మీ అత్త ని చూడడం లేదూ .. మొట్టికాయ వేసింది మనసు. నలుగురు పిల్లలుండి ఆవిడవైపు కన్నెత్తి చూడకుండా ఆ భారాన్ని నీమీద వేశారు చూడు వాళ్ళని అనాలి అని నాలుగైదు సార్లు గొడవపెట్టుకుంది నిషి.  నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాక ఇక మారు మాట్లాడలేదు.  నన్ను, నా అభిప్రాయాలని గౌరవిస్తూ, ఉత్సాహపరిచే బిడ్డ ఉండడం తన అదృష్టం. 
 
          అందుకే, ఎప్పుడు నాకో తోడు కావాలని ఆలోచన రాలేదేమో..  తెరలు తెరలుగా సాగిపోతున్న భావపరంపరలను చూసి తనలో తానే చిన్నగా నవ్వుకుంది శోభ. 
 
          ఒంటరి జీవితంలో తోడు కోరుకోవడం తప్పు అనిపించడంలేదు.  కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతొ కొండచిలువలా చుట్టుకుపోయిన బంధనాలు తెంచుకొని బయటికి వస్తున్న వాళ్ళను ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. అండదండ అవ్వాలి.  
కరోనా కాలంలో ఆత్మీయులందరిని పోగొట్టుకున్న చిన్న, పెద్ద ఎందరిని చూడడం లేదు. మాధురి కూడా అయిన వాళ్ళందరిని పోగొట్టుకొని ఆత్మీయ స్పర్శ కోసం పిలుపు కోసం తల్లడిల్లిపోతున్న దేమో..  తీవ్రమైన ఒంటరితనంతో వచ్చిన వత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నదేమో .. 
అదే నిజమయితే , మాధురిని  తన ప్రేమ బంధంలోకి , స్నేహ బంధం లోకి ఆహ్వానించగలనా..ఆమెను పచ్చని చెట్టుగా మార్చగలనా.. ఆలోచిస్తున్నది శోభ. 
 
          ఆ వెంటనే తన తలంపుకు తనలో తనే నవ్వుకుంది. ఏమీ తెలియని ఆమె గురించి ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నదేంటి ?  ఒక ప్రకటన ఇంత అలజడి, ఆలోచన కలిగిస్తూ తిష్టవేసుకుందేంటి?  అతిగా స్పందిస్తున్నానా..అంటూ ప్రశ్నించుకున్నది శోభ.  
 
          అయినా తన ఆలోచనలో తప్పేముంది? ఇప్పుడంటే అత్తయ్య తనతో ఉంది. ఆవిడ కనుమరుగైతే.. ఆ ఊహ భరించడం కష్టమై లోపలి గదినుంచి హాల్ లోకి అడుగు లేసింది.  
 
          టీవీ లో నిమగ్నమైన అత్తగారి కేసి కొన్ని క్షణాలు చూసి తర్వాత సండే మాగజైన్ చేతిలోకి తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది.  
 
          చూపు కదులుతున్నది. అక్షరాలు అల్లుకు పోతున్నాయి. ఆలోచనల్లోకి మాధురి వచ్చి కూర్చుంది. తనను తాను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒక భాగమేమో..  నిలబెట్టు కోకపోతే, ఒంగిపోయి వాలిపోతే తప్పుకానీ.. ఆమె ఆలోచన తప్పు ఎలా అవుతుంది? 
ఆడవాళ్లను ఎప్పుడూ ద్వితీయా విభక్తిగానే చూస్తారు, స్త్రీత్వంపై పాట ఏదో వస్తున్నది. సీరియళ్ళలో కూడా ఈ మధ్య పాటలు పెరుగుతూన్నాయి. చివరికి ఈ టీవీ సీరియళ్లు కూడా అంతే.   ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ స్త్రీత్వం, పెళ్లి, కుటుంబం, మాతృత్వం, సంస్కృతీ సంప్రదాయాలు అంటూ  ఆడవాళ్ళ బుర్రల్లో చొప్పించే ప్రయత్నం చేస్తున్నది. సంస్కృతి , సాంప్రదాయ విలువలు కాపాడే గురుతర బాధ్యత ఆడవాళ్లపై మోపుతూ పురుషుల్ని మాత్రం కులాసా రాయుడిగాను, ఆడవాళ్ళని కట్టడి చేస్తూ కట్టుదప్పకుండా చేసే కాపలాదారుగా చూపడం వాటిని ఆడవాళ్లు పడీపడీ చూడడం శోభకు అసహనం కలుగిస్తుంది. 
 
          నిషి అన్నట్లు సొమ్ములు దండుకోవడం కోసం వచ్చిన ఈ  వినోదాత్మక  చానళ్ళలో సీరియళ్లు,  అవి ఇచ్చే ప్రకటనలు మన జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి.  ఆధునికత పేరిట డాబుసరి జీవితానికి అంగలార్చేలా చేస్తున్నాయి, మనది కానీ జీవితాన్ని మనదిగా చేసుకొమ్మని ఆదేశిస్తున్నట్లుగా ఉంటున్నాయి.  లేనివి మనకు రుద్దే ప్రయత్నం చేస్తున్నాయి అనుకుంది శోభ. 
 
          నిషి నా కడుపునా పుట్టిన బిడ్డే కావచ్చు. కానీ చాలా  విషయాల్లో నా గురువు అదే.   
మంచి చెడు ఆలోచన చేస్తూ  సమాజాన్ని ముందుకు నడిపించే ఆడవాళ్లను పరిచయం చేసింది నిషి.  వాళ్ళ స్ఫూర్తి తోనే తను ఈ మాత్రం బయటికి వచ్చి పని చేయగలుగు తున్నది. ఆత్మ సంతృప్తిని పొందగలుగుతున్నది అనుకుంది శోభ. 
 
          మాధురి విషయం నిషితో చెబితే సానుకూలంగా స్పందిస్తుంది అనుకుంటూ నిషికి మెసేజ్ పెట్టబోయి ఆగింది.  తను ఇప్పుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉంటుంది.  డిస్ట్రబ్ చేయడం ఎందుకు ఉదయం మాట్లాడొచ్చు అని ఆ ప్రయత్నం మానుకుంది.  
 
          ఆ తర్వాత, మెసేజ్ వచ్చిన గ్రూప్ లో ఆ మెసేజ్ కు సమాధానంగా మాధురిని అభినందిస్తూ , ఆమె ప్రయత్నం ఫలప్రదం అవుతుందని ఉత్సాహపరిచింది.
 
          ఆకాశంలో మబ్బులు విడిపోయి వెలుతురు పరచుకున్నట్లుగా ఉంది. శోభకు 
 
“పాపం ఆ తల్లి ఎంత క్షోభ పడిందో .. ” అంటున్న అత్తగారి గొంతు విని మాధురి ఆలోచనల నుంచి బయటపడింది శోభ సమయం తొమ్మిదయింది. ఆవిడ చూసే సీరియళ్లు అయిపోయాయి. వార్తలు పెట్టింది.  అది ప్రతి రోజు సరోజమ్మ దినచర్యలో భాగమే . సీరియల్ చూస్తున్నప్పుడు ఆ పాత్రల్లో లీనమై పోయి తను మాట్లాడేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా అట్లాగే మాట్లాడుతుందేమో అనుకుంటూ టీవీ వైపు దృష్టి సారించింది శోభ 
 
          ఏదో చిన్న పల్లెలో గంజాయికి అలవాటు పడిన కొడుకుని చెట్టుకు కట్టేసి కళ్ళలో కారం కొట్టి కొడుతున్నది తల్లి దృశ్యం బుల్లి తెరపై. అయ్యయ్యో .. దారుణం . పదిహేనేళ్ల పిల్లవాడు తప్పు చేశాడేమో కానీ శిక్ష వేసే పద్దతి ఇదా ..?  అసలు ఆ పిల్లవాడికి తాను చేసింది తప్పు అని తెలుసా .. ఇట్లా కొట్టడం వల్ల ఆ పిల్లాడు మారతాడో లేక పంతం పడతాడో, మరింత మొండిగా తయారవుతాడో ఏమో ..? ” అన్నది అత్తగారి కేసి చూస్తూ 
 
          “అదేంటే.. అట్లా అంటావ్.  చదివేస్తే ఉన్నమతి పోయినట్లుంది నీకు.  ఆ తల్లి కొడుకుని ఎంత కస్టపడి పెంచుకున్నదో.  చేతికి అందిరావల్సిన కొడుకు అట్లా కొరగాకుండా పోతుంటే ఏ తల్లి భరించగలదు? తనకు తోచిన రీతిలో బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తుంది ఏ తల్లి అయినా .. అదే  ఆ తల్లి చేసింది ” తీవ్రంగా అన్నది సరోజమ్మ 
ఆ గొంతులో కరకుదనానికి ఆశ్చర్యపోయింది శోభ. 
 
          ఆ దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ , చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చూపుతూ ముందు రోజు జరిగిన పబ్ లో పట్టుబడ్డ పెద్దవారి బిడ్డల గురించి అటూ ఇటూ తిప్పి గొంతు చించుకుంటూ చెబుతున్నది జర్నలిస్టు.  
 
          అనవసరమైన చెత్తంతా చూసి విని బాగున్న ప్రాణాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని సరోజమ్మ నెమ్మదిగా లేచి కిచెన్ వైపు వెళ్ళబొయింది. 
 
          వాటర్ బాటిల్ రూమ్ లో పెట్టానని శోభ చెప్పడంతో నెమ్మదిగా ఆమె అడుగులు తన రూమ్ వైపు పడ్డాయి. వెళ్లి  బెడ్ లైట్ వేసుకుని పడుకుంది కానీ కంటి మీదకు కునుకు రావడం లేదు. కళ్ళు మూసుకుంది. కంటి ముందుకు పెద్ద కొడుకు వస్తున్నాడు. 
మిగతా ఇద్దరు కొడుకులూ రావడం కుదరక రాక పోయినా  నెలకో రెండు నెలలకో కనీసం ఫోన్ చేసి మాట్లాడతారు. సుధా మాత్రం రాడు. ఫోన్ చేయడు.  ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఆ గొంతు విని.  తనను అమ్మను చేసిన, అమ్మా అని మొదట పిలిపించుకున్న వాడి పిలుపుకోసం ఎదురుచూస్తున్నది. నెర్రెలువారిన గుండెతో ఎదురు చూస్తున్నది.  అతని పిలుపు పన్నీటి జల్లులా ఆ హృదయాన్ని తడుపుతుందేమోనన్న ఆశతో ఏ రోజుకు ఆరోజు గడుపుతున్నది. ఈ తల్లి అంత కానిది అయి పొయిందా.. భారమైంది ఆ తల్లి హృదయం. ఏడాదికి ఒకసారి పంపే  పూలగుత్తి  గిఫ్ట్ అందుకుని కొడుకే కళ్ళముందు ఉన్నట్లు వాటిని గుండెకు అదుముకుంటుంది, భద్రంగా పెట్టు కుంటుంది సరోజమ్మ.  వాడిపోయి , ఎండిపోయిన పూలగుత్తిని పారేయడానికి ఆమెకు ఏ మాత్రం మనసురాదు. నిషి ఎంత ఎగతాళి చేసినా తన అల్మారాలో భద్రపరచడం మానదు. 
 
          సుధా.. నీ జీవితంలో తప్పటడుగుకి కారణం ఈ అమ్మ.  నువ్వు ఏ తప్పు చేయలేదు నాన్నా.. నీతో ఆ పని చేయించింది నేను. నేనే నేరస్థురాలిని. నన్ను క్షమించు బేటా .. నాతో మాట్లాడరా నా చిట్టి తండ్రీ.. ఒక్క సారి వచ్చిపోరా.. రాలేకపోతే ఫోనులోనైనా అమ్మా అని పిలవరా.. ఈ క్షోభ నేను భరించలేకపోతున్నాను.  అనుక్షణం కుమిలిపోతున్నాను.  శిక్ష అనుభవించేసానురా.. ఇంకా ఈ అమ్మని శిక్షించకు. నా గుండె చప్పుడు వింటే తెలుస్తుంది నీ కోసం ఈ తల్లి ఎంత పరితపిస్తున్నదో .. అని కొడుకుని తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నది సరోజమ్మ. 
 
          అమెరికాలో కరోనా విలయతాండవం చేసినన్ని రోజులూ పెద్దకొడుకు గురించి వాకబు చేయడం కోసం ఆరాటపడింది . మదర్స్ డే కి ఎప్పటిలాగానే పూలగుత్తి అందడంతో ఆమె మనసు శాంతించింది. అయితే ఒక్క ముక్కయినా మాట్లాడడంలేదని మూగగా రోదిస్తూనే ఉంది.   ఈ జీవుడు పోయేలోగా సుధని చూడగలనా లేదా అని బెంగ పడుతున్నది సరోజమ్మ.  ఈ తల్లి వేదనని, ఆవేదనని కొడుకుకు తెలియచేసే మార్గాల కోసం ఆలోచిస్తున్నది సరోజమ్మ . 
 
          నిషి  చదువు అయిపోయినప్పుడు అమ్మని, నాన్నమ్మని గ్రాడ్యుయేషన్ కి రమ్మని చాలా బతిమాలింది.  రానంటే రానని మొండికేసింది సరోజమ్మ.  నానమ్మకోసం అమ్మ తన కోరికను మన్నించలేదనుకుంది నిషి . నిన్ను అష్టకష్టాలపాలు చేసిన ఆమె కోసం నా సంతోషాన్ని ఫణంగా పెడుతున్నావా అంటూ తల్లితో దెబ్బలాండింది నిషి .  అసలు అమెరికా వెళ్లడమే శోభకు ఇష్టం లేదు. గతంలో కలిసిపోయిన జ్ఞాపకాల ఆనవాళ్లు అక్కడ ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి రాదలచుకోలేదు అని స్పష్టం చేశాక తల్లిఅభిప్రాయాన్ని మన్నించింది నిష్కల. 
 
          రిమోట్ తో వార్తా చానళ్ళు తిప్పుతున్న శోభ ఓ వార్త దగ్గర ఆగిపోయింది. మగతోడు లేకుండా ఆడవాళ్ళని ఇస్లామాబాద్ లో విమానం ఎక్కనీయడం లేదని ఆ వార్త. విస్తుపోయింది. ఎంత అన్యాయం అని మనసు ఆక్రోశిస్తుండగా టివి కట్టేసింది. స్త్రీని దారుణాతి దారుణంగా అవమానిస్తున్న వ్యవస్థపై , మతంపై కోపం ముంచుకొస్తున్నది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఆమె స్థానం అతని వెనుకనే, అతను లేకపోతే ఆమెకే ఉనికి లేదని చెప్పకనే చెప్తున్నట్టు తోచింది శోభకు . 
 
లేవాలి , నిద్దుర లేవాలి . 
మహిళా లోకం నిద్దుర లేవాలి . 
పంజరంలో బంధించిన చిలకలాగా బతకడం కాదని తెలుసుకోవాలి. అతనిలాగే ఆమె కూడా బతికే రోజుల కోసం నిద్దుర లేవాలని శోభలో సరికొత్త ఆలోచనలు పురుడు పోసుకుంటున్నాయి. . 
 
          కొడుకు బాగుకోసమే తనేం చేసినా అని తలిచి అతని మెడలు వంచి పెళ్లి చేసింది. కానీ తనకి ఇంత క్షోభ మిగులుతుందని అస్సలు ఊహించలేదు.  తల్లిని విపరీతంగా ప్రేమించే సుధాకరుడు ఇంత దూరం జరిగిపోతాడని ఎలా అనుకుంటుంది?  తన కలల ప్రపంచంలోకి పోతున్నాడని ఇక తన కుటుంబానికి డబ్బుకు కొదువే ఉండదని ఎగిరిపడింది.  బొక్క బోర్లా పడి ,మూతి పళ్ళు రాలగొట్టుకుంది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం?!  చేనుకు గట్టువేయొచ్చేమో గానీ, చెరువుకు గట్టు వేయొచ్చేమో గానీ సరోజమ్మ ఆలోచనలకు అడ్డుకట్ట వేయడం కష్టం అయిపోతున్నది. 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.