విజయవాటిక-10

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

అమరావతి రాజమందిరం

          మహాదేవవర్మ తల్పం పైన పవళించి ఉన్నాడు. నిద్రపోవటం లేదు. ఎదో దీర్ఘమైన ఆలోచనలు అతనికి నిద్రపట్టనివ్వటం లేదు. నెమ్మదిగా లేచి ఆ మందిరానికి ఆనుకొని ఉన్న రాజ ప్రాసాదమిద్దె  మీదకొచ్చాడు. చల్లని గాలి శరీరానికి తాకింది. పై పంచ గాలికి వణికింది. కృష్ణానది మీదుగా వచ్చే ఆ చల్లని గాలి అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊహలలో ఆనాటి నర్తకి మెదిలింది. మనస్సు గుబగుబలాడింది. 

          రాజకుమారుడు మహాదేవవర్మ మన్మథుని మించిన అందగాడు. ఐదున్నరడుగుల ఎత్తుతో, ఎత్తుకు తగ్గసౌష్ఠవంతో, కసరత్తు చేసిన శరీరముతో ఉంటాడు. అతని మెత్తని జుట్టు భుజాల వరకూ ఉంటుంది. వీరత్వపు ఛాయలు శరీరము పై కనపడుతూ ఉన్నా, చూడగానే చాలా ఆదరంగా కనపడతాడు. అందరినీ మిత్రులుగా, శ్రేయోభిలాషులుగానే చూస్తాడు తప్ప భేదభావము ఉండదతనికి. 

          రాజకుమారుడు విలాసాలకు కొంత ఎడంగానే ఉంటాడు. అందరు రాజపుత్రులలా అతను మృగయావినోదమో, సురాపానమో, వెలియాళ్ళ పైన మోజునో చూపడు, సాహిత్యపరమైన చర్చలలో కాలం గడుపుతాడు. లేదా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండే యత్నం చేస్తాడు. బలమైన విష్ణుకుండినుల రాజవారసుడైనా అతనికి రాజ్యం వస్తుందన్న నమ్మకం లేదు. అయినా దానికై రక్తపాతానికి ఇష్టపడడు రాజకుమారుడు. కారణం, అతను సున్నితమైనవాడు.  వీరుడైనా కత్తి కన్నా కలానికీ, కుంచెకు ఎక్కువ మక్కువ చూపే సౌందర్యారాధకుడు. మెత్తని హృదయం కలవాడు. 

          పాతిక సంవత్సరాల రాజకుమారుడి నిద్ర చెడగొట్టినది వేరెవరో కాదు హరిక. ఆనాటి ఆ చిన్నదాని నృత్యము, గోపికగా ఆమె అభినయనం అతని మనస్సును కట్టి పడవేసింది. ఆమె నృత్యం మరల మరల చూడాలని, ఆమెతో స్నేహం చెయ్యాలని కోరిక కలిగింది. 

          శ్రీకరునితో వాళ్ళను తెచ్చి రాజాంతఃపురంలో ఉంచమన్నాడు, అందుకే. 
అతని ఆలోచనలలో ఆమె నృత్యము ఆగకుంది. ‘ఈ రాత్రి గడిచేనా’ అనుకున్నాడు రాజకుమారుడు. ఉదయము ఆమెను చూడాలని మరల మరల మనస్సులో చెప్పుకున్నాడు. వెళ్ళి పడుకుంటే మెత్తని తల్పం పాషాణంలా అనిపించింది. ఏ జాముకో నిద్రపోయాడు రాజకుమారుడు.

***

          అది శ్రీకరుని భూగృహము. అతని నివాసము లోలోపల ఉన్న రహస్య మందిరమది. తన ముందు బల్ల మీద పెట్టిన పక్షి, దాని కాలికున్న చిన్న పత్రం వంక దీర్ఘంగా చూశాడు శ్రీకరుడు.  

          ఆ పత్రం తీసుకొని సైగ చేశాడు. అంతరంగికుడు వచ్చి పక్షిని తీసుకు వెళ్ళి పోయాడు.

          ‘నా అనుమానము నిజమయ్యింది’ అనుకున్నాడు. దీపపు కాంతిలో ఆ పత్రంలో లిఖించిన సమాచారం పరీక్షగా చూశాడు. 

          అందులో ఒక తెల్లటి గరుడపక్షి రెక్కలు విప్పుకు ఉన్నది. దాని ప్రక్కన ఒక గీత లిఖించి ఉంది. తెల్లటి గరుడపక్షి విజయానికి సంకేతం. అంటే వారు అనుకున్న వాటిలో ఒక పని విజయవంతమైనదని తెలియచేస్తున్నారు.
‘ఇది పంపినవారు గోవిందుని బృందంలో ఎవరై ఉండాలి’ అనుకున్నాడు శ్రీకరుడు ఆ పత్రాన్ని కాల్చివేస్తూ.

          ‘కళింగులకు మాధవవర్మ మాహారాజు పంపిన సమాచారానికి ఇంకా సమాధానము రాలేదు కాబోలు’ అనుకున్నాడతను. లేదా మహారాజు పంపిన వివాహ విషయమై కళింగులు మహాదేవవర్మ విషయం చూడటానికి ఈ వేగులను పంపారా? కళాకారులలో వేగులు సామాన్యంగా స్త్రీ లై ఉంటారు. వారు తమ నృత్య కౌశలంతో మురిపించి, రాజులను మైమరపించి, లోబరుచుకొని, ఎన్నో రహస్యాలను తమ దేశం పంపిన ఆనవాళ్ళు చరిత్రలో కోకొల్లలు. అలా ఆలోచిస్తే ఈ బృందంలో చూపరుల హృదయము దోచినది గోపికగా నర్తించిన నర్తకే తప్ప కృష్ణ పాత్రధారి కాదు. కాబట్టి అలా అనుకుంటే ఈ సందేశం పంపినది ఆమె కావచ్చు. ఆమె పేరు హరిక అని కదూ! అన్నారు. ఆమె పై ఒక కన్నేసి ఉండవలెను…’ ఇలా ఆలోచిస్తూ, తను చెయ్యవలసిన పనులను ఏ లెక్కన చెయ్యాలో అనుకుంటూ, ఏ రాత్రికో నిద్రలోకి జారాడతను.

***

          శ్రీకరుడు ఉండవల్లి గుహాలయాల వద్ద నిలబడి శిల్పుల పనిని పర్యవేక్షిస్తున్నాడు. ఉండవల్లి గుహాలయాలు నాలుగు అంతస్తుల దేవాలయాలు, అద్భుత కట్టడాలు. పూర్వపు రాజులు వాటిలో మొదటి అంతస్తు మాత్రమే కట్టించారు. ప్రస్తుత మహారాజు వాటిని నాలుగు అంతస్తులుగా మార్చారు. 

          మొదటి అంతస్తు అసంపూర్ణముగా వదిలివేశారు. కారణము పూర్వమది జైన సన్యాసులు ఉపయేగించినారని. నరులు వాడినది దేవదేవునికి వాడక పోవటము సహజము.

          రెండవ అంతస్థు నుంచి కొత్తగా కట్టినవి. అందులో అనంత పద్మనాభుడు, పడుకున్న భంగిమలో ఉన్న ఏకశిలా విగ్రహము. పైన త్రిమూర్తులను ప్రతిష్ఠించాలని సంకల్పం జరిగింది. అందమైన శిల్పాలతో, మునుల ప్రతిమలతో అద్భుతమైన కళాఖండాలతో నిర్మితమైనదా గుహాలయము. వాటిని చాలామటుకు విష్ణుకుండిన రాజులు పూర్వమే నిర్మించిన భైరవకొండ ఆలయాలను దృష్టిలో పెట్టుకొని, నేటి రాజధానిలో నిర్మిస్తున్నారు.

          నెల్లూరు మండలంలోని ఉదయగిరి గ్రామానికి ఇరువది యోజనాల దూరంలో భైరవకొండ గ్రామం. అక్కడ విష్ణుకుండిన రాజుల విజయకేతంగా కొండను తొలచి నిర్మించిన ఎనిమిది శివాలయాలు ఉన్నాయి. ప్రతి గుహాలయానికి ద్వారపాలకులు, వారికి ఎద్దుకొమ్ములతో కూడిన శిరోవేష్టనము, దట్టమైన శిరోజాల అలంకరణా, ఒక వైపుకు వంగి గదమీద చేయి అన్చుకుని ఉన్నారు. ఎనిమిది దేవాలయాలలో శివ లింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. వాటి వలననే, విజయవాటికలో కూడా శివాలయాలు నిర్మించాలని మహారాజు సంకల్పించాడు. శ్రీకరుడు శిల్పాచారునితో నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. 

          అక్కడకొచ్చిన కొత్త శిల్పులను విచారించాడు. అనుమానమనిపించిన ప్రతీ దానిని తనే ప్రత్యేకంగా చూస్తున్నాడు. అతనికి మహారాజు యాగరక్షణ కన్నా, రాజ్యానికి ఎటు వైపు నుంచీ ఎలాంటి ప్రమాదం కలగ కూడదన్నదే ప్రథమ లక్ష్యము. 

          త్రికూటాచలుని తిరునాళ్ళు దగ్గర పడేసరికి ఎవరికీ అడ్డుకట్ట వెయ్యలేరు. ఆ తిరునాళ్ళు ఎంతో ప్రముఖమైనవి. ప్రసిద్ధి చెందినవి. ఆ లోపలే శత్రువులను అరికట్టాలి. శ్రీకరుని ప్రయత్నమదే.

***

          హరిక ఆనాటి ఉదయము నిద్రలేవలేదు. ఆమె లేచే సరికే మిగిలిన వారు లేచి తమ పనులు చేసుకొని కొత్త నృత్యాన్ని సాధన చేస్తున్నారు. వారికి ఆనాటి ఉదయం రాజ మందిరానికి విందుకు రమ్మని ఆహ్వానం అందింది. హరిక లేచే సరికే సరయు వచ్చి ఆమెకు ఆ ఆహ్వానం గురించి చెప్పింది. 

          “అంటే మన ప్రదర్శన  ఉన్నదా?” అడిగింది హరిక.

          “నేడు లేదనుకుంటాను. కేవలము విందుకు మందిరానికి రమ్మని చెప్పినారను కుంటా. గోవిందులవారు చెబుతారు ఏ విషయము. నీవు లేచి త్వరగా రా…” అని సరయు వెళ్ళిపోయింది. 

          హరిక లేచి తన పనులు కానిచ్చి కుదురుగా తయారై వచ్చింది. 

          అప్పటికే అందరి పలహారము అయినది. వారు తమ తరువాతి నాటకానికి కావలసిన నృత్యాన్ని అభ్యసించే పనులలో ఉన్నారు. 

          ఆమె గోవిందుని వద్దకు వెళ్ళి “నేడు మన ప్రదర్శన ఉన్నదా?” అడిగింది. 

          “లేదు…” చెప్పాడాయన. 

          హరిక నెమ్మదిగా వారున్న వసతి గృహం దాటి బయట తోటలోకి వచ్చింది. వారున్న వసతి గృహం రాజ మందిరానికి కూతవేటు దూరంలో ఉన్నది. ఆమె, సరయు కలిసి తోటలో పువ్వులను ఆస్వాదిస్తూ, నడుస్తూ అక్కడే ఉన్న చిన్న సరస్సు వద్దకు వచ్చారు. ఆ సరస్సు చాలా చిన్నది. దాని లోతు కూడా తక్కువే. దానిలో జలచరాలు అటుఇటు తిరుగుతున్నాయి. పద్మాలు వికసించి ఉన్నాయి. వారు ఆ సరస్సు గట్టున ఉన్న చిన్న ఆసనాలపై కూర్చొని ముందురోజు జరిగిన నాట్యం గురించి సభికుల హావభావాల గురించి ముచ్చటించుకుంటున్నారు. 

          “నీవైపు చూడని వారు లేరు. పురుషుల కళ్ళలో కాంక్షను నేను స్పష్టంగా చూశాను…” అన్నది సరయు. 

          ఫక్కున నవ్వింది హరిక. 

          “నీవూ పురుష వేషం మాని స్త్రీలా వేషం కడితే నిన్నూ అలాగే చూస్తారు, ఇందులో వింతేమున్నది సఖీ…”

          “కానీ హరికా నీవు గమనించినావా మహాప్రభువులను?”

          “అక్కడ ఇద్దరు ప్రభువులున్నారేమిటే సరయు…” 

          “వారిలో ఒక్కరే ప్రభువు…. మిగినవారు భృత్యులే… నీవు గమనించి ఉండవు…”

          “ఏమో నాకు తెలియలేదు సుమీ. ఇద్దరు అందగాళ్ళు కనిపించినారు…” అమాయకంగా చెప్పింది హరిక.

          “నీవెప్పుడూ ఇంతే. ఏమీ తెలియనట్లే ఉంటావు. ఇంత అమాయకత్వమేమిటే… అందులో పచ్చని వస్త్రాలు ధరించిన వారు ప్రభువులు మహాదేవవర్మ. ఆయన ప్రక్కన ఉన్నది వారి మిత్రులు శ్రీకర వర్మ…” వివరించింది సరయు. 

          “అలాగా! నీవు అప్పుడే వివరములు సేకరించావా?”

          “అవును. ప్రభువులు నీవైపు ఆరాధ పూర్వక చూపులే చూసినారు… అందులో కాంక్షలేదు…”

          మళ్ళీ గలగల నవ్వింది హరిక. “అదీ చూద్దాంలే ఈనాడు” అంది. ఇద్దరూ నవ్వుకుంటూ లేచి వారి వసతి గృహం వైపుకు నడిచారు. వారి మాటలను రహస్యంగా వింటున్నఒక అనుచరుడు తోట వెలుపలకు వెళ్ళిపోయాడు.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.