నిష్కల – 19

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: మనసులేని మనువు వదిలించుకుంటే ఒంటరైన శోభ, తెగిన ఊయల లాంటి ఆ బంధం కోసం వెంపర్లాడకుండా సర్వ స్వతంత్రంగా బిడ్డ నిష్కలను పెంచుతుంది. అయినప్పటికీ అతని తల్లి, ఆమె మేనత్త సరోజమ్మను  చేరదీసింది.  నిష్కల  స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న ఆధునిక యువతి. అంకిత్ తో సహజీవనం లోకి వెళ్ళింది.  అమెరికాలో అటార్నీగా పని చేస్తుంది. ఫ్యామిలీ, పిల్లల కేసులు డీల్ చేస్తుంది. తన క్లయింట్ తో కలసి వచ్చిన సారా అచ్చు తన నానమ్మ పోలికతో ఉండడం చూసి నిష్కల ఆశ్చర్యపోతుంది.  అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు కోసం సరోజమ్మ బెంగ పడుతుంది. 

***

          కావేరిని చూసి చాలా రోజులైంది.  రామవ్వ ఉందన్న ధీమాతో కావేరి గురించి అంతగా ఫోన్ చేయడం , మంచి చెడు చేయడం లేదు. 

          మాటల్లో కార్యకర్త గోదావరి చెప్పింది. కావేరికి జ్వరం వచ్చిందని. ఈ రోజు పనిమీద కావేరి ఉంటున్న ఊరు దాటి వెళ్తున్నది. మార్గమధ్యలో కావేరి వాళ్ళని చూసి వెళ్లవచ్చని ముందుగానే బయలుదేరింది శోభ.  కార్యకర్తను  కూడా కావేరి దగ్గరకు వస్తే ఇద్దరం కలిసి పొరుగున ఉన్న చర్లపల్లి వెళదామని చెప్పింది శోభ. 
 
          శోభ వచ్చేసరికి గోదావరి  కావేరితో లోపల ముచ్చట్లు పెడుతున్నది.  రామవ్వ గడప లో కూర్చుని రేడియో వింటున్నది.  ఆమె ఆ ట్రాన్సిస్టర్ ని వదలదు. అది ఆమెకు భర్త ఇచ్చిన మొదటి, చివరి బహుమతి. అందుకే ప్రాణంగా చూసుకుంటుంది.  తాను ఎక్కడ ఉంటే అక్కడ రేడియో పెట్టుకుని ఉంటుంది. నట్టింట్లోకి ఇంట్లోకి టీవీ వచ్చినప్పటికీ ఆమె నేస్తం రేడియోనే . 
 
          ఏ పనిలో ఉన్నా ఉదయం ఏడు గంటల వార్తలు తప్పని సరిగా వింటుంది.  ట్రాన్సిస్టర్ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అదే అలవాటు. ఆమె భర్త ఉన్నప్పుడు అతను వార్తలు వినేవాడు. అతనితో పాటు వినడం రామవ్వకు కూడా అలవాటయింది. 
ఇప్పుడే అందిన వార్త అంటూ చెప్తుంటే ఏమి చెబుతారా అని ఆత్రుతతో ఎదురు చూసేది.  అలా విన్న వార్తలలో ఇందిరాగాంధీ మరణ వార్త ఆమెను చాలా చలింప చేసింది. 
 
          భర్త మరణం తర్వాత రేడియో అత్యంత ఆత్మీయమైనదిగా మారిపోయింది. ఆమె ఒక్కటే ఉన్నప్పుడు కూడా తోడు రేడియో నే.  ఏవి విన్నా వినకున్నా వార్తలు తప్పని సరిగా వింటుంది. అందుకే లోక జ్ఞానం ఎక్కువ. దాంతో పాటు అరుగుల మీద కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుతూ అందరికీ తలలో నాలుకలా ఉంటుంది రామవ్వ. 
ఎప్పటిలానే రేడియో వింటూ కూర్చున్న దల్లా లేచి గడప పై చెంగు పరచి తలపెట్టి గచ్చుపై నడుము వాల్చింది.. 
 
          బయట నుంచి వచ్చే వేడి గాలికి శరీరం ఆర్చుకుపోతున్నట్లుంది.  కానీ ఆ వేడిని  తగ్గిస్తూ  ఇంట్లోని నాపరాయి చల్లదనాన్ని పంచుతున్నది.  పక్కనున్న రేడియో తన పని తాను చేసుకుపోతున్నది.  సన్నని కునుకు రామవ్వను ఆవహించింది. 
 
          మెత్తటి అడుగుల చప్పుడుకు మెలకువ వచ్చిన రామవ్వ ఎవరా అని తల ఎత్తి చూసింది. ఎదురుగా శోభ. 
 
          రేడియో లో రుతుపవనాలు వచ్చేసాయి.  తెలంగాణలో భారీ వర్ష సూచన అని చెప్పారు.  కానీ, ఎక్కడ ఆ ఆనవాళ్లే లేవు.  ఉదయం పదిన్నర కూడా కాలేదు ఎండ మండిపోతున్నది అని మనసులో అనుకుంటూ లేచి కూర్చున్నది రామవ్వ. 
 
          ఎండకి వచ్చిన శోభను సంతోషంగా లోనికి  ఆహ్వానించిన రామవ్వ,. బిడ్డా..  మేడమ్ వచ్చింది. మంచి నీళ్లు తెమ్మని కేకేసి చెప్పింది.  
 
          మంచినీటితో వచ్చిన కావేరి వెనుకే గోదావరి నమస్తే మేడమ్ అంటూ . 
 
          జ్వరం తగ్గిందా కావేరీ .. ఎట్లా ఉన్నావ్. బుజ్జి ఏమి చేస్తున్నది? అని నవ్వుతూ పలకరించి  గుక్క నీళ్లు తాగి వాటి కేసి చూసింది. 
 
          ఏంటి  మేడం అట్లా చూస్తున్నారు అడిగింది రామవ్వ. 
 
          “కొన్న నీళ్లా ..” అంది చేతిలోని నీళ్ల గ్లాసు చూపుతూ  
 
          “అవును మేడం . కావేరి కి ఈ నీళ్ళే అలవాటు అట. అవే తెప్పిస్తున్న” చెప్పింది రామవ్వ 
 
          “ఈ నీళ్లు సురక్షితమే అనుకుంటున్నావా కావేరీ” నవ్వుతూ అడిగింది శోభ ‘
         
          “అక్కా నేను కావేరికి చెప్పిన.  అనుమతులు లేకుండా , నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన శుద్ధి నీటి ప్లాంట్ మనదని” వివరించింది గోదావరి. “ఈ నీళ్లు సురక్షితం అని ఎట్లా అనుకుంటాం.  క్యానులో నీళ్లు అనగానే మంచినీళ్లు అని తాగేస్తున్నాం” అన్నది మళ్ళీ తానే. 
 
          అన్ని గ్రామాల్లాగే ఆ ఊరి ప్రజలు కూడా ఇంటి బావి నీళ్ళే తాగేవాళ్లు.  ముప్పయ్యేళ్ల క్రితం  బావి నీళ్లలో ఫ్లోరైడ్ ఎక్కువ స్థాయిలో ఉన్నదని గుర్తించారు.  పొరుగున ఉన్న చెరువు ను  సగం చేసి ఒక భాగం సాగు నీటి కోసం,  మరో భాగం మంచినీళ్ల కోసం కట్టారు. అక్కడి నుంచి చుట్టుపక్కల ఐదారు గ్రామాలకు ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మంచినీరు సరఫరా చేసేవారు.  ఆ గ్రామాల ప్రజలు ఆ సమయంలో గ్రామ పంచాయతీ దగ్గర పెట్టిన నల్లా నుండి నీరు తెచ్చుకోవడం మొదలు పెట్టారు. తెచ్చుకోలేని వాళ్ళు ఎవరినైనా బతిమాలుకొని బిందె కు ఇంత అని ఇచ్చి తెప్పించుకున్నారు. రామవ్వ వాళ్ళ ఊళ్ళో పాండు  రిక్షా మీద అలా చాలా ఇళ్లకు తెచ్చేవాడు.  రామవ్వ కూడా బిందె కు రూపాయి చొప్పున నెలకు ముప్పై రూపాయలు ఇచ్చేది. ఆ తర్వాత ఊళ్ళోనే రక్షిత మంచినీటి పథకం కింద మంచి నీటి ట్యాంకు లు ఏర్పాటయ్యాయి.  ఊర్లో ముఖ్యమైన కూడలులలో నల్లా నీళ్లు ప్రతిరోజూ ఒక గంట వచ్చేవి.  రామవ్వ కూడా అక్కడే తెచ్చుకునేది.  ఆ తరువాతి కాలంలో ఇంటింటికి మంచి నీటి కుళాయి పెట్టించుకునే వెసులు బాటు ఇచ్చింది పంచాయతీ.  ఆ సమయంలో రామవ్వ కూడా తన ఇంటి వాకిట్లో ఓ మూలకి మంచినీటి నల్లా పెట్టించుకుంది.  
అప్పుడప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లు తాగడానికి జనం ఇబ్బంది పడేవారు.  
 
          తర్వాత కొంతకాలానికి అంటే దాదాపు పదేళ్ల క్రితం ఊర్లో శుద్ధి చేసిన మంచి నీటి ప్లాంటు ఏర్పడింది.  అప్పటి నుంచి  ఆర్థికంగా ఉన్న కుటుంబాల వారు నీళ్ల క్యాన్  కొని తాగడం మొదలు పెట్టారు.  జనానికి కొనుక్కునే నీళ్లపై మోజు మొదలైంది.  ఇళ్లలోకి వాటర్ క్యాన్లు చొచ్చుకొచ్చాయి.  మొదట పది రూపాయలకు ఇరవై లీటర్ల బాటిల్ ఇంటికి తెచ్చి ఇచ్చినవాళ్లు ఇప్పుడు ఇరవై అయిదు రూపాయలకు అమ్ముతున్నారు. 
 
          కొన్న నీళ్లు రుచిగా ఉంటాయని, నల్లాలో ఇంటివాకిట్లో వచ్చే నీరు అంత రుచిగా ఉండవని  ఒకర్ని చూసి ఒకరు కొన్న నీటికీ అలవాటు పడ్డారు జనం.  ప్రభుత్వం ఏర్పాటు చేసిన రక్షిత నీటి కి విలువ పోయింది.  
 
          “అక్కా, ఈ నీళ్లు రుచిగా ఉండడానికి మందు కలుపుతారు కానీ బాటిళ్లు, క్యాన్లు మాత్రం సరిగ్గా శుభ్రం చేయరు. లోపల నాచు పడుతున్నాయి” అన్నది గోదావరి శోభకేసి చూస్తూ.  
 
          “ప్రభుత్వం మన కోసం కోట్లు ఖర్చు చేసి మంచినీటి పథకాలు పెట్టింది.  తాగు నీరు సరఫరా చేస్తున్నదని ఊళ్లలో ఉన్న వాటర్ ట్యాంకులు చెబుతున్నాయి. కానీ వాస్తవానికి  గతంలో ఉన్న రక్షిత మంచి నీటి సరఫరా వ్యవస్థ నామరూపాల్లేకుండా పోయింది. 
ఉచితంగా వచ్చే రక్షిత నీటిని వదిలి బాటిల్ నీళ్లు కనుక్కోవడం అంటే మన జేబు గుల్ల చేసుకుంటూ ప్లాంట్ వాళ్ళ జేబులు నింపడమే” నవ్వుతూ అని మిగిలిన నీళ్లు తాగింది శోభ . 
 
          మన వాటర్ లో ఫ్లోరైడ్ ఉంటుందంటున్నారు . ఆ నీరు తాగితే ఏమవుతుందో  భయం . అందుకే అటు దిక్కు పరుగులు” అని నవ్వింది కార్యకర్త గోదావరి. 
 
          “వాటర్ ప్లాంట్ నీటిలో నిబంధనల ప్రకారం లవణాలు , ఖనిజాలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో నిర్ధారణ చేయాలి.  పీల్చే గాలి తర్వాత  అత్యంత ముఖ్యమైనది నీరు. మారిన మన జీవన విధానంలో నగరం మొదలు చిన్న చిన్నగ్రామాల వరకు మినరల్ వాటర్ తాగుతున్నారు.  డిమాండ్ నానాటికి పెరుగుతుండడంతో తాగు నీటి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్సర్ధిల్లుతున్నది.  పెట్టుబడి తక్కువ . రాబడి ఎక్కువ .  ఎటువంటి లైసెన్స్ లేకుండా  శుద్ధి చేసిన నీరు అని అమ్ముతున్నారు. 
వాటర్ క్యాన్ కి కంపెనీ పేరు ఉండాలి . మూత సీల్ చేసి ఉండాలి .  కానీ అవి  లేకుండానే అమ్మకాలు జరుగుతున్నా అడిగే నాథుడే లేడు. అందుకే వాళ్ళ వ్యాపారం మూడు పూవులు ఆరు క్యాన్లు గా సాగుతున్నది  అని ,మనసులోనే నిట్టూర్చింది శోభ. 
 
          బుజ్జి ఇంకా లేవలేదు రామవ్వతో , కావేరితో బుజ్జి ముచ్చట్లే మాట్లాడి జాగ్రత్తలు చెప్పి, చర్లపల్లికి బయలు దేరదాం గోదావరీ అంటూ ఇంటి బయటికి అడుగేసింది శోభ . 
 
          ఆ వెనుక రెండడుగులు వేసిన గోదావరి మొబైల్ రింగయింది 
 
          ఆవలి వైపునుండి చెప్పిన మాటలు వింటున్న గోదావరి మొహంలో రంగులు మారిపోతున్నాయి .  
 
          తన హోండా యాక్టీవా ఆన్ చేసి గోదావరి కోసం ఎదురు చూస్తున్న శోభ ఇంకా రాదేమిటి అని వెనక్కి తిరిగి చూసింది. 
 
          చేతిలో ఫోన్ తో కుప్పకూలి పోయింది ఆమె.
 
          ఏమైందో అర్థం కాక అందరు స్థాణువులా చూస్తున్నారు. ముందుగా తేరుకున్న శోభ బండికి స్టాండ్ వేసి,  ఇంటి ముందు  కుడివైపు ఉన్న నీటి తొట్టిలో నీళ్లు తీసుకుని గోదావరి ముఖంపై చిలకరించింది. 
 
          నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమె దుఃఖం .. ఆపడం ఎవరి తరం అవడం లేదు. ఏమైందో అర్థం కావడం లేదు. 
 
          ముందు లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టండి అంటూ ప్లాస్టిక్ కుర్చీ ముందుకు జరిపింది రామవ్వ.  
 
          వెంటనే గోదావరిని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు శోభ, కావేరి.  
 
          సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో  నిరుద్యోగ యువకులు రైళ్లు తగులబెట్టారు .  పోలీసులు కాల్పులు జరిపారు.  ఆ కాల్పుల్లో గోదావరి  చిన్న తమ్ముడు గంగాధర్ కి  తీవ్ర గాయాలయ్యాయి. గాంధీకి తీసుకుపోతున్నారు.  అది ఫోన్ సారాంశం. 
 
          గంగాధర్  మూడు రోజుల క్రితం పని ఉందని హైదరాబాదు వెళ్లాడు.   గంగాధర్ కి చిన్నప్పటి నుండి ఆర్మీలో పని చేయాలని కోరిక. దేశ భక్తి ఎక్కువ.  దానికి తోడు గోదావరి  పెద్ద తమ్ముడు కూడా ఇండియన్ ఆర్మీలోనే  హవల్దార్ గా పనిచేస్తున్నాడు. అవన్నీ అతన్ని ఆర్మీ వైపు నడిపించాయి. 
 
          రెండేళ్ల క్రితం జరిగిన ఆర్మీ సెలెక్షన్స్ లో శరీర దారుడ్య పరీక్షల్లో, ఆరోగ్య పరీక్షల్లోనూ నెగ్గాడు . మరో పరీక్ష జరగాల్సి ఉంది.  ఇప్పటికి రెండు సార్లు పోస్టుఫోన్ అయింది . మూడోసారి మే నెలలో రాత పరీక్ష ఉంటుందన్నారు.  ఆ పరీక్షా అయితే వాళ్ళు ఉద్యోగం లో చేరొచ్చు. ఇప్పుడు ఆ పరీక్ష రద్దు చేశారు.  భారత సైన్యంలో చేరాలని కలలు కనే ఔత్సాహికులు తీవ్ర నిరాశకు గురయ్యారు .  దానికి తోడు అగ్నిపథ్ కొత్త పథకం అగ్గిమీద ఆజ్యం పోసినట్లయింది. 
 
          సాధారణంగా ఆరోగ్య పరీక్షలు , శరీర దారుడ్య పరీక్షలు జరిగిన నలభై రోజుల్లో రాత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ వల్ల ఆ పరీక్ష వాయిదా పడింది. అప్పటి నుండి  ఇప్పటి వరకు జరగలేదు.  కోవిడ్ ను సాకుగా చూపుతూ వాయిదా వేస్తూ వచ్చారు.  ఆర్మీ జవానులై దేశ సేవ చేయాలనుకునే నిరుద్యోగుల ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి.  ఎప్పటికప్పుడు ఇవ్వాలో రేపో తాము కలలు కనే కొలువులో చేరిపోతాము అని కలలు కంటున్న యువకుల్లో అప్పుడప్పుడు ఆవేశం వస్తున్నది.  ఏమీ చేయలేక తమ గ్రహచారాన్ని తిట్టుకున్నారు. 
 
          తమ పరీక్ష నిర్వహించడానికి కోవిడ్ ను సాకుగా చూపుతున్న సర్కారు ఇతర కార్యక్రమాలు ఏవీ ఎందుకు ఆపడం లేదు.  కరోనా మహమ్మారి ఉధృతంగా విరుచుకు పడిన సమయంలో కూడా కుంభమేళా నిర్వహించారు.  లక్షలాది మంది ద్వారా కరోనా విచ్చలవిడిగా అన్ని ప్రాంతాలకు ఎగబాకింది.  అదే సమయంలో ఎన్నికలు నిర్వహించారు . వేలాది మంది ప్రజలు, కార్యకర్తలను తరలించి సభలు, సమావేశాలు, లక్షలాది మందితో మెగా మీటింగులతో పార్టీల ప్రచారం చేశారు.  అలాగే ఎన్నికల ర్యాలీలు జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు.. కోవిడ్ మహమ్మారి తన పని తాను చేసుకుపోయింది . అది వేరే విషయం. 
 
          అవి అన్నీ జరగగా లేనిది మా పరీక్షకు ఎందుకు అడ్డంకులు  అని అభ్యర్థులు తమలో తాము మదనపడేవారు.  మనసులోనే తిట్టుకునేవారు. అసహనానికి గురయ్యేవారు. 
 
          దేశవ్యాప్తంగా కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇకనైనా పరీక్ష పెడతారని, అది ఎప్పుడెప్పుడా అని ఆశతో, అతృతతో ఎదురుచూస్తున్న సమయంలో  మే నెలలో రాత పరీక్ష ఉంటుందని తెలిసింది. అందరిలో నూతనోత్సాహం.  రాత పరీక్షకు సిద్ధంగా ఉన్నారు.  ఆ సమయంలో మళ్ళీ ఆ పరీక్ష రద్దు చేస్తూ  ప్రకటన   వెలువడింది.   
అది అలా ఉంటే మరో వైపు వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తూ వచ్చింది అగ్నిపథ్ పథకం గురించి ప్రకటన వెలువడింది.   
 
          ఆ ప్రకటన ప్రకారం ఇక ముందు ఆర్మీ సర్వీసు నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఎంపికైన వారిలో 25 శాతం మాత్రమే సర్వీసు కొనసాగించగలరు. మిగతా వారంతా ఇంటికొచ్చి తగిన ఉపాధి అవకాశాలు చూసుకోవాల్సి ఉంటుంది.  మిలిటరీ ఖర్చు తగ్గించుకునే మార్గంగా  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
          అది ఆర్మీ ఉద్యోగ ఆశావహుల గుండెల్లో అగ్ని రగిల్చింది.  జ్వాలలు ఎగిసేలా చేసింది. 
 
          ఆ నేపథ్యంలోనే గంగాధర్ హైదరాబాద్ వెళ్ళాడు.  సోషల్ మీడియా అంది పుచ్చుకున్న యువత క్షణాల్లో పథక రచన చేశారు. అనుకున్న ఇరవై నాలుగు గంటల లోపే తమ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  
 
          తమ నిరసన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేస్తే అది ఢిల్లీ పెద్దలని చేరుతుందని తమ గోడు వింటారని వారు తలిచారు.  అందుకే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని తమ నిరసన క్షేత్రంగా ఎంచుకుని  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు చిన్న చిన్న పాయలుగా అక్కడికి చేరి సముద్రం గా మారారు. 
 
          తమ కలలు కల్లలు అయిపోయే క్షణాలు  ముందు నిలిచిన ఆ ఆందోళనకారులు రెచ్చిపోయారు. తీవ్ర మానసిక ఉద్వేగానికి లోనైన యువత స్టేషన్ లో నిలిచి ఉన్న మూడు రైళ్లకు నిప్పు పెట్టారు,  రాళ్లు రువ్వారు.  బస్సులు  అగ్నికి ఆహుతి చేశారు. 
కొద్ది క్షణాల్లో విధ్వంసం జరిగిపోయింది . ఆందోళన కారులను చెల్లా చెదురు చేయడం కోసం హుటాహుటిన పోలీసుల రంగప్రవేశం చేసి కాల్పులు జరిపారు. 
 
          ఈ విధ్వంస రచన వల్ల కోల్పోయింది కోట్లాది రూపాయల  ప్రజల ఆస్తి మాత్రమే కాదు, ఒకటి రెండు ప్రాణాలు, కొందరు తీవ్రగాయాలతో..  దెబ్బతిన్న శారీరక మానసిక ఆనారోగ్యంలో ..  మరికొందరు అభ్యర్థులపై ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించి విధ్వంసం సృష్టించారన్న నేరారోపణతో అరెస్టు అయ్యారు. 
 
          అసలు ఈ సంఘటనకు కారకులెవరు? దోషులు ఎవరు? ఎవరిని నిందించాలి ? 
 
          చిన్న చిన్న పాయలుగా చిన్న చిన్న ఊర్ల నుంచి  బయలు దేరిన వాళ్ళు ఉత్తుంగ తరంగమై సికింద్రాబాద్ స్టేషన్ చేరి నిరసన తెలపాలనుకొనే విషయాన్ని  రాష్ట్ర ఇంటెలిజెన్స్ పసిగట్టలేక పోయింది. ప్రతిపక్షాలు ఏదైనా నిరసన కార్యక్రమం చేపట్ట బోతుంటే ముందే హౌస్ అరెస్టులు చేసే ఇంటెలిజెన్స్ ఈ విషయం తెలుసుకోలేక పోవడం ఏంటో..! 
  
          ఫలితం కోట్ల అష్టి నష్టం తో పాటు ప్రాణం ఫణంగా పెట్టాల్సి వచ్చింది. కొత్త పథకం పై ఆగ్రహం తో విరుచుకుపడ్డ నిరుద్యోగ యువతరం ఇప్పుడు కేసుల్లో.. 
 
          రేపు వారి  జీవితం ఏ దిశకు చేరనుందో .. ఏ అంధకారంలో కూరుకుపోనుందో .. 
 
          అసలు దోషులు ఎవరైనా కానీ బాధితులు మాత్రం అన్ని విధాలా యువతే.  
 
          అనేక మంది ప్రయాణికులు ఏమి జరుగుతున్నదో , ఎందుకు  జరుగుతున్నదో అర్థం కాక, ఆగిన రైళ్ల వల్ల ప్రయాణం  ఆగిపోయి ఎటుపోవాలో తోచక నానా ఇబ్బందులు పడ్డారు.
 
          ప్రజల భాగస్వామ్యం లేకుండా అధికారం, ఆధిపత్యం ఏసీ రూముల్లో కూర్చొని  చేసే ఏకపక్ష నిర్ణయాల వలన ఇటువంటి ఫలితాలే వస్తాయేమో..! 
 
          గోదావరి తమ్ముడికి ఏమి కాదని రామవ్వ, శోభ ధైర్యం చెప్పారు.  అంతలో గోదావరి భర్త గోదావరి కోసం మోటార్ సైకిల్ పై వచ్చాడు. 
 
          పెద్ద పెద్ద వాళ్లంతా తమ జీతాలు పెంచుకుంటారు. రిటైర్మెంట్ వయస్సు పరిమితి పెంచుకుంటారు.   రిటైర్ అయినా వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలిస్తారు. ఒకరిటికి రెండుసార్లు పెన్షన్ పొందుతారు. సదుపాయాలు అందుకుంటారు. మా బోటి చిన్న ప్రాణాలకి మాత్రం నాలుగేళ్లు జీతం ఇస్తే సరిపోతుందా .. 
 
          ఆ ఆలోచన ఇచ్చిన వాడెవడో కానీ వాళ్ళ ఉద్యోగాలకు కత్తిరెయ్యరు రాజకీయ నాయకులకు ఎన్నికల్లో పోటీచేయడానికి , పదవులు అనుభవించడానికి వయసుతో సంబంధంలేదు. కాటికి కాళ్ళు చాచినవాడు కూడా పదవులకోసం వెంపర్లాడతాడు.  అసలు ఎవరికీ లేని నిబంధన జవానులకే వచ్చిందా ..? దేశం కోసం ప్రాణాలు అర్పించే జవానులంటే అంత చులకనా? అంటూ ఆ యువకులకు మద్దతుగా ఆవేశం వెళ్లగక్కాడు.  ఆ తర్వాత గోదావరిని తీసుకుని వెళ్ళిపోయాడు. 
 
          తాను కూడా బయలుదేరిన శోభ ఆలోచిస్తున్నది.  వాళ్ళ ఆవేశంలో అర్ధం ఉన్నదని అనిపిస్తున్నది.  తాను చర్లపల్లిలో జరిగే మీటింగ్ కి రాలేకపోతున్నానని ముందే ఫోన్ చేసి చెప్పింది కాబట్టి ఇంటికి బయలుదేరింది. 
 
          వెళుతున్నదల్లా ఆగి ఎండిపోయిన మొద్దు దగ్గర వచ్చిన పుట్టగొడుగుల పై ఎండపడి విచిత్రంగా మెరుస్తున్నాయి. వాటిని చూస్తూ ఒక్క క్షణం ఉండిపోయింది. ఆ తర్వాత ఫోటో తీసి, ఆదిత్యునికి ఛత్రం పడుతున్న పుట్టగొడుగులు అని కాప్షన్ రాసి  కూతురికి వాట్సాప్ లో పంపింది. 
 
          మొన్నీ మధ్య పడిన పెద్ద వర్షం తర్వాత వచ్చినట్టున్నాయి పుట్టగొడుగులు. వీటిని కూర వండితే చాలా రుచిగా ఉంటుంది.  నాయనమ్మ వండేది.  విషపూరితమైన పుట్ట గొడుగులు కూడా ఉంటాయట. మరి ఇవి మంచో  కాదో ఎలా తీసుకునేది అంటూ కొన్ని క్షణాలు ఆలోచించి వాటిని వదిలేసి తన వాహనం దగ్గరకు నడిచింది. 
 
          అంతలో నిషి నుంచి మెసేజ్. 
 
          అమ్మా .. మనం ఆస్వాదించాలే కానీ ప్రకృతి ఎల్లవేళలా మనసును పరవశింప చేస్తుంది .  దేహాన్ని పరవళ్లు తొక్కిస్తుంది కదా …అంటూ  
 
          లాఫింగ్ ఎమోజి పెట్టింది  కానీ శోభ మనసు పరవశించి పోవట్లేదు. ఆమె మనసులో గోదావరి తమ్ముడు గంగాధర్ మెదులుతున్నాడు.  అతన్ని గతంలో చూసి ఉన్నది కూడా.  
 
          అదంతా కూతురితో ఈ సమయంలో పంచుకోలేదు. అందుకే లాఫింగ్ ఎమోజీ పెట్టింది.  
 
          అది చూసిన నిషి 
         అమ్మా .. దృష్టికోణం, హృదయ కోణం రెండూ సింక్ అయినప్పుడు ప్రతి కోణం, ప్రతి క్షణం ఆహ్లాదమే కదా .. అంటూ మరో మెసేజ్ చేసింది. 
 
          అది చూసి నవ్వుకుని నిషికి ఇప్పుడు అర్ధరాత్రి దాటి ఉంటుంది. ఇది ఇంకా పడుకోలేదా అనుకుంటూ  బండి స్టార్ట్ చేసింది శోభ. 
 
          అత్తగారు సుగుణమ్మ టీవీ సీరియల్ లో నిమగ్నమై ఉన్నారు. ఇంటికి వెళ్లిన శోభ భోజనం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చొని  వాట్సాప్ మెస్సేజ్ లు చూస్తున్నది. 
 
          “నా రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నాను. ముగ్గురు అందమైన పిల్లలకి పాలిచ్చి పెంచాను.  వాళ్ళను జాగ్రత్తగా పెంచి పోషించాను.  నా శరీరం మొత్తాన్ని వాళ్లకు అంకితమిచ్చాను. నా రొమ్ములు బయటకు కనిపించడం గురించి (పోలీసులతో గొడవపడిన సమయంలో )  వెకిలి రాతలు రాసినవారు కూడా తమ తల్లి దగ్గర చనుపాలు తాగే ఉంటారు.  నా రొమ్ములను ఎగతాళి చేస్తూ మీమ్స్ తయారుచేసి నవ్వుకునే లోపల మరోచోట క్యూలో ఇంకో శ్రీలంక పౌరుడు మరణించి ఉంటాడు తెలుసుకోండి ” హిరుణిమ  అని ఉంది. 
 
          ప్చ్.. పాపం ఆ తల్లి ఎంత ఆవేదన చెంది ఉంటుందో ..  కుసంస్కారులకు తగిన రీతిలో సమాధానం చెప్పిందని అనుకుంది కానీ ఆ వాక్యాలు శోభని వెంటాడుతున్నాయి. 
 
          ఆ మాటలు శ్రీలంక మహిళవి అని అర్ధమవుతున్నది.   ఇట్లాటి కూతలు కూసే వాళ్ళను ఏమనాలి?  Mentally challenged people అనొచ్చా .. ? ఉహు .. కాదు వీళ్ళు బలుపెక్కిన వాళ్ళు .. చెప్పుకి పేడ రాసి కొట్టాల్సిన వాళ్ళు .. మన మధ్యలో ఇట్లాటి వాళ్ళు ఎందరో .. కుక్కకాటుకు , పాముకాటుకు మందు ఉంది కానీ అట్లా విషపు కూతలు కూసే వాళ్ళ బుద్ధికి మందు ఉందా.. లేదు.  ఎలా? తప్పుడు మాటల్ని , అవి మాట్లాడే వాళ్ళని దూరం పెట్టడం ఎప్పుడు మంచిది. అదే ఆరోగ్యానికి, మనసుకు మంచిది. 
 
          ప్చ్.. ఆ  తల్లి మనసు ఎంత క్షోభ పడిందో .. 
 
          బహుశా ఆమె ఓరిమి కి కారణం  ఒక ధైర్యం , ఆ ధైర్యానికి తెగువ , ఆ తెగువకి ఒక లక్ష్యం , ఆ లక్ష్యానికి ఒక విలువ ఉండి ఉంటాయి .  తప్పుడు కూతలు కూసే పనికి మాలిన వెధవల్ని ఒక్క జవాబుతో తన నుండి తరిమేసి ఉంటుంది.  ప్రశాంతంగా ఉండి ఉంటుంది.  
 
          హీనమైన ఆలోచనలు, వాంఛలు ఉన్న వాళ్ళు ఎదుటి వారిని ఆ కోణంలోనే చూస్తారేమో ..!  తమ తప్పులు బలహీనతలు , కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి వేషాలు వేస్తుంటారేమో..  బలహీనతలు కప్పిపుచ్చుకోవడానికే ఎదుటివారిని బదనాం చేస్తుంటారు.  పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఇలాంటి వాళ్ళను చూసే అన్నారేమో .. 
 
          ఆ శ్రీలంక మహిళలో చాలా శక్తి ఉంది. ఆమె అని ఏముంది? ప్రతి మహిళలో చాలా శక్తి ఉంది. అందులో సందేహమే లేదు.  కష్టం నుంచి బయటపడ్డ మహిళ వానొచ్చి తగ్గాక స్వచ్ఛంగా మెరిసే పచ్చదనం  తలపిస్తుంది.  మిల మిల మెరుస్తూ ఉంటుంది. 
 
          సంతోషంగా ఉండటం ఎలాగో ఒకసారి తెలుసుకుంటే చాలు. అది ఆమె నుండి ఎవరు తీసుకోలేరని అనుభవపూర్వకంగా తెలుసుకుంది శోభ. 
 
          ఒకనాడు గుండెలు పగిలేలా ఏడ్చింది.  తన కష్టాన్ని,  బాధల్ని ఎవరు తీర్చలేరని అర్ధం చేసుకున్నాక వాటిని  బండెక్కిచ్చి పంపించేశాక జీవితం అర్ధమవడం మొదలైంది.  
 
          జీవితం కష్టమైంది, క్లిష్టమైంది కావచ్చు.  వాటిని అర్థం చేసుకుంటే ఎదుగుతామని,  లేదంటే కుంగిపోతామని తెలుసుకుంది . ఒక్కసారి పక్కకు చూస్తే అందమైన ప్రకృతి అద్భుతాలు కళ్ళకు అగుపిస్తాయి. స్ఫూర్తినిస్తాయి.  ఎవరి కోసం వాళ్లే తమకొక పేజీ సృష్టించుకోవాలి. ఆ పేజీని అద్భుతంగ మలుచుకోవాలి. అది ఎదుటివారికి స్ఫూర్తి ఇవ్వగలగాలి.  
 
          అయితే, ఎగుడు దిగుడు రోడ్డు లాంటి జీవితంలో నడక అంత సులభం ఏమీ కాదు .  కానీ గమ్యం చేరే బాట ముందు ఉందని, ఒకవేళ లేకపోతే బాట చేసుకుంటూ ముందుకు  పోవడమే మనిషి చేయాల్సింది. 
 
          జీవితంలో ఒక తప్పటడుగు పడిందని, బలహీనం అయిపోయానని ఏడుస్తూ కూర్చుంటే ఈ రోజు తన పరిస్థితి ఎలా ఉండేదో .. కళ్ళముందు కదలాడుతున్న బిడ్డ జీవితపు పరుగుపందెంలో నిలబడేటట్లు చేసింది. లేకపోతే తన నిర్ణయాలు ఎలా ఉండేవో .. 
 
          ఇప్పుడు నా బలం, నా బలహీనత నా బిడ్డ అనుకునే శోభకు ప్రశాంతంగా, ఆనందంగా , పాజిటివ్ గా పెదవులపై చిరునవ్వుతో ఎలా ఉండాలో తెలుసు. అదే ఆమె మొహం వెలిగించే రహస్యం.  

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.