స్వర్గాదపి

-ఆదూరి హైమావతి 

          బంగారు పాళ్య గ్రామం పక్కగా బాహుదానది పారుతుంటుంది.  నది దాటుకుని రోజూ ఆ పల్లె వాసులు  పక్కనున్న నగరం వెళ్ళి కూలి పనులు చేసుకుని వస్తుంటారు.  ఉన్నట్లుండి వచ్చే వరదల వలన ఇలా జరగడం వాడుకే. తొందరపడి దిగితే ప్రమాదం జరుగుతుంటుంది. రోజూ ఆ నది దాటితేకానీ  ఆ గ్రామ ప్రజల జీవనం సాగదు.

          ఒక రోజున పైవాలున కురిసిన వానల వల్ల బాహుదా నదికి వరద వచ్చింది. కూలి పనులు ముగించుకుని సాయం కాలానికి తమ గ్రామానికి వెళ్ళను నది ఒడ్డుకు  చేరిన గ్రామస్తులంతా, నది దాటే అవకాశం లేక బిక్కు బిక్కుమని కూర్చుని ఆలోచించసాగారు. 

          వారిలో ఒక పడుచు “అంతా బాగా ఆకలి మీద ఉన్నాం కదా!  ఈ రామం పల్లి  ధర్మసత్రంలో వంట చేసుకుని తిందాం. మాదగ్గర రాగి పిండి ఉంది. సత్రంలో పొయ్యీ, కుండలూ ఉంటాయి. గ్రామం నుంచీ దినుసులు కొనితెస్తే , ఇంత పచ్చడి చేసుకుని తిందాం. ఈలోగా వరద తగ్గితే మన గ్రామానికి వెళ్ళవచ్చు” అంది.

          అంతా ఆమె మాటకు సమ్మతించి వెళ్ళి వస్తువులు కొని తెచ్చారు.

          అక్కడ సత్రంలో వంట చేసుకుని అంతా కలసి తినసాగారు.

          దూరంగా స్తంభం ఆనుకుని కూర్చుని అందరినీ చూస్తున్న ఒక యువకుని  గమనించిన గ్రామవాసుల్లోని  వాసయ్య “అయ్యా! తమరు ఏ ఊరివారో, మా ఊరివారు మాత్రం కాదనిపిస్తున్నది, మిమ్ము ఏనాడూ చూడలేదు బాబూ! ఎవరైతేనేం కాని తమరేమీ భుజించినట్లు లేదు. ఏమైనా తింటారా!  బాగా బడలినట్లు కనిపిస్తున్నారు. మేమే మీ పెద్ద వంటలు చేసుకోలేదు. కాస్తంత రాగిసంకటి, ఉల్లికారం”అని పలుకరించాడు.

          దానికాతడు “మీరంతా చాలా స్నేహభావంతో, ఐకమత్యంగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరంతా ఒకే ఊరివారా!” అని అడిగాడు.

          వాసయ్య పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న అతని భార్య వేణమ్మ, ఆ యువకుని మాటలు విని “ఆకలి మీదున్నట్లున్నావు బిడ్డా !మాతోపాటే కాస్తంత సంగటి తీసుకోండి బాబూ!, భుజిస్తూ మాట్లాడు కుందాం” అంటూ ఒక విస్తరాకు లో సంకటి, ఉల్లికారం వడ్డించి ఇచ్చింది .

          ఒక ముంతలో నీరు కూడా ఇచ్చింది.

          అతడా నీటితో చేతులు కడుక్కుని సంకటి ఉల్లికారంలో నంచుకుని ఒక ముద్ద తిని, “ఎంత బావుంది? ఈ  ఉల్లికారం ఇంత రుచిగా  ఎవరు చేశారు. ఏ వంట వారూ ఇలా చేయలేరు. నేనింత వరకూ ఇలాంటి కమ్మని రుచి గల కారం తిననేలేదు”అన్నాడు.

          దానికి వేణమ్మ ” ఇదో ఈ మా మనవరాలు వరాలు చాలా బాగా చేస్తుంది బాబయ్యా! ఇంకా గోంగూర పచ్చడి చేసిందంటే దానితోనే ముంతెడు సంకటీ లాగించే యొచ్చు. మంచి పనిమంతురాలు. ఎవరు చేసుకుంటాడో వాడి నోరు పండినట్లే” అంది.

          దానికి దూరంగా కూర్చుని తలవంచుకుని సంకటి తింటున్న వరాలు తలెత్తి బామ్మవైపు చూస్తూ” బామ్మా! ఎందుకే ఎప్పుడూ పొగుడుతావు. పొగడ్త అగడ్తలో తోస్తుంది. గర్వం పెరిగి, అహంకారం మనస్సును మత్తెక్కించి , కళ్ళకు పొరలు కమ్మి సర్వనాశనం చేస్తుంది . నామేలు కోరేదానివైతే  పొగడకు, పైగా ‘ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖ మెరుగదు  ‘అంటారు కదా!  ఆకలి మీద అన్నీ రుచిగానే ఉంటాయి ” అంది.

          ఉల్లికారాన్ని మెచ్చుకుని తింటున్న ఆ యువకుడు “సెబాస్ ! భలేచెప్పావు పడతీ! మానవుడు తెలుసుకోవాల్సింది అదే! పొగడ్త శతృవైతే , విమర్శ మిత్రుడు. ఇది ఎరిగినవారెవ్వరూ ఎన్నడూ తప్పుదోవ పట్టరు.” అని తినడం  ముంగించి చేతులు కడుక్కున్నాడు.

          నదికేసి చూసి,” అటు చూడండి పెద్దయ్యా!. వరద ఉధృతి తగ్గినట్లుంది. మనం ఏరుదాట వచ్చేమో!”అన్నాడు.

          దానికి వాసయ్య “నాయనా! మీరు యువకులు కనుక దాటగలరు. మాలో చాలా మంది వయసు మళ్ళుతున్న వాళ్ళం ఉన్నాం.. వరదనీరు నెట్టుకుంటూ దాటగలమో  లేదో! మధ్యలో ఇరుక్కు పోతే కొట్టుకుపోతాం “అన్నాడు.

          దానికా యువకుడు” అయ్యా! కడుపుకు ఇంత భోజనం పెట్టి ,   ముఖం తెలీని నాకు ఆకలి తీర్చారు. కాస్తంత ఋణం తీర్చుకునే అవకాశం నాకూ ఇవ్వండి. నేనే కాక మీలో ఇంకా కొందరు యువకులు ఉన్నట్లున్నారు. మేమంతా కలసి, మీ  అందరినీ ఒక్కోరినీ దాటించగలం. పదండి బయల్దేరుదాం . పచ్చ పువ్వు వంటి పున్నమి వెన్నెల కాస్తున్నది. ఇంత మందిమి ఉన్నాం. భయమెందుకూ!” అంటూ అందరినీ ఉత్సాహపరచాడు.

          నగరం నుండీ వారికి కావలసిన సరుకులు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటుంటారు  చాలామంది.  అంతా లేచి వారి మూటలూ ముల్లెల్లూ సర్దుకుని బయల్దేరారు.

          నది ఒడ్డుకు రాగానే ముందుగా, ఆ కొత్త యువకుడు, మిగతా యువకులతో చెప్పగా,  అంతా మాట్లాడుకుని వారివద్ద ఉన్న పొడవాటి ముల్లు కర్రలను నది మధ్యలో నీటిలో ఉంచి లోతుచూశారు. ముందుగా కొంత మంది  ముసలి వారినీ, స్త్రీలనూ పట్టుకుని నది దాటించారు.  అలా మూడు దఫాలుగా దాటాక చివర్లో వాసయ్య, ఆయన భార్య వేణమ్మ, వారి మనుమరాలు వరాలూ ఇంకా కొందరూ  మిగిలి ఉన్నారు. ఒక్కో యువకుడూ ఒక్కో మహిళనూ, వయసు మళ్ళిన వారిని చేతులు పట్టుకుని నడిపిస్తూ నదిని దాటించను బయల్దేరారు. అప్రయత్నంగా ఆ యువకుడు వరాలు చేయిపట్టుకుని నది దాటిస్తూ మధ్యలో నీరు ఉధృతం పెరిగి వేగంగా రావటాన ఆమెను నడుం చుట్టూ చెయ్యేసి ఎత్తి పట్టుకుని ఒడ్డున దింపాడు.

          “మన్నించాలి. వరద ఉధృతి మరలా ఎక్కువ కావటాన మిమ్ము అనుమతి లేకుండా ఎత్తుకుని దించాల్సి వచ్చింది. మరోలా భావించకండి, మంచి విద్యావంతులనీ, వివేకవంతులనీ మీ మాటలను బట్టి తెలుస్తున్నది. అర్థం చేసుకుంటారని భావిస్తాను.”అని మెల్లిగా ఆమెకు మాత్రమే వినిపించేలా చెప్పి , బాటమీద ముందుకు నడచి పోతుండగా, వాసయ్య…

          ” నాయనా! అలా వెళ్లకు ఏ ఊరు వెళ్ళాలో ఏమో రాత్రికి మా ఇంట విశ్రమించి, ఉదయాన్నే బయల్దేరవచ్చు కదా!మొత్తం ముప్పై మందిని మమ్ము వరదలో ఉన్న నదిని దాటను సహకరించావు. మమ్మల్నీ మీ ఋణం తీర్చుకోనివ్వండి  ” అన్నాక ఆ యువకుడు ఆగి వారితో సాగి ఆ రాత్రికి వాసయ్య ఇంటి వసారాలో, ఆయనతో పాటుగా  వారు చూపిన మరో నులక మంచం మీద పడుకుని, ఉదయాన్నే లేచి బయల్దేరను తయారయ్యాడు.

          వాసయ్య మనుమరాలు వరాలు “ఈ రోజు శనివారం తాతయ్యా! ఉత్త కడుపుతో ప్రయాణం  చేయకూడదు. కాసిన్ని పాలుత్రాగి వెళ్ళమని చెప్పండి మన అతిధులకు” అంటూ ఒక గ్లాసులో వేడిపాలు తెచ్చి తాత గారికి అందించింది.

          ఆ యువకుడు ఆ పాలు అందుకుని త్రాగేసి” అయ్యా! మీ మనవరాలికి  మీకూ నా ధన్యవాదాలు. వస్తాను. ఇప్పుడు బయల్దేరితే మధ్యాహ్నం భోజనం వేళకు నా గ్రామం చేరుకుంటాను.” అంటూ ఓరగా తలుపు వారగా నిల్చునున్న వరమ్మ కేసి చూసి బయల్దేరాడు.

          ఒక వారమయ్యాక ఆదివారం నాడు , వాసయ్య ఇంట అంతా విశ్రాంతిగా కూర్చుని ఉన్న సమయాన  ఇంటి ముందు ఒక జట్కాబండి ఆగింది.

          “అయ్యా! ఎవరండీ లోపల ? వాసయ్య గారి ఇల్లు ఇదేనా?” అంటూ ఇరువురు భార్య, భర్తా దిగారు.

          మంచి ఖరీదైన పట్టు వస్త్రాలూ, ఆడ మనిషి మంచి నగలూ ధరించి ఉన్నారు. బయటికి వచ్చి వారిని చూసిన వాసయ్య “అయ్యా! తమరెవరో ఏ వాసయ్య కోసం వచ్చారో, నా పేరు వసుదేవ వాసయ్య. ఊరికి ఆ చివర వాసుదేవ వాసయ్య ఉన్నారు.  అంతా మా ఇద్దరిని తెల్సుకోలేక ఒకరి కోసం ఒకరి ఇంటికి  వచ్చి తికమక పడుతుంటారు. తమరు ఏ వాసయ్య కోసం వచ్చారో తెలుసుకోవచ్చా!” అన్నాడు వినయంగా.

          వారిలో మగ మనిషి “అయ్యా! ఏ వాసయ్యో నాకు తెలీదు. ఉల్లికారం అద్భుతంగా చేసిన మనవరాలున్న వాసయ్యే మాకు కావాలి.” అన్నాడు చమత్కారంగా.

          “అయ్యా! ఐతే  ఆ వాసయ్యను నేనే. తమరు ఆ రాత్రి మమ్మల్ని నది దాటించిన యువకుని తాలూకూ వారై  ఉంటారు. అతడు మా మనవరాలి ఉల్లికారాన్ని మెచ్చుకున్న యువకుడు.” అంటూ , “లోనికి రండి. మాది చిన్న వసారా పూరిల్లు. దర్వాజా అనే పేరే కానీ , చాలా కురచది. తల వంచి , చూసుకు రండి తలకు తగలవచ్చు. ఇలా ఈ మంచం మీద కూర్చోండి. మా ఇంట కూర్చోను కుర్చీలూ  గట్రా లేవు.పేదలం.” అంటూ ఆహ్వానిస్తుండగానే , కొత్తవారి మాటలు విని.

          “దాహానికి ఈ చల్లని చల్ల త్రాగండి” అంటూ అతని భార్య రెండు గ్లాసులతో బయటకు వచ్చి, తెచ్చిన చల్ల గ్లాసులు  వారికి అందించింది వేణమ్మ.

          అది ఆ ఊరి  ఆచారం. ఎవరు వచ్చినా కమ్మని  చల్ల ఇస్తారు ముందుగా.

          వారు చల్ల త్రాగి ” మనస్సు చల్లబడేలాగా చల్ల చల్లగా బాగుందండి!  ఇదీ మీ మనవరాలే చేసి ఉంటుందని భావిస్తాం. ఇంత రుచిగా, మాకు రోజూ కమ్మని వంటలూ, పచ్చళ్ళూ  ఇలాంటి చల్ల  రుచి చూడాలనే కోరికతో వచ్చాం. మా ఇంట్లో మా వంట వారికి తరిఫీదిచ్చే మా ఇంటి యజమానురాలిగా  మీ మనవరాలిని  మా ఇంటి కోడలిని చేసుకోవాలని. అదీ మీకూ, మీ మనవరాలికీ ఇష్టమైతేనే. బలవంతం లేదు. మా పరిచయం చేసుకోకుండానే  మాట్లాడేస్తున్నాను. మా గురించీ చెప్పుకోవాలి కదా! మేము ఈ పక్కనే ఉన్న రామగిరి ఆస్థానానికి జమీందారులం.  ఒద్దికైన పిల్ల కోసం వెతుక్కుంటూ మా కుమారుడు బయల్దేరి   మీ మనవరాలిని చూసి వచ్చాడు. మాకూ కాస్త మీ బంగారు తల్లిని చూసే భాగ్యం కలిగిస్తారా!”  అన్నాడు, తమను జమీందారుగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి..

          వెంటనే వేణమ్మ”అదెంత భాగ్యం ఒక్క క్షణం ”  అంటూ లోనికెళ్ళి తమ మనవరాలు వరమ్మను భుజం పట్టుకుని  నడిపించుకు వచ్చింది.

          తలదించుకుని మెల్లిగా నడుస్తూ వచ్చిన వరమ్మ వారికి నమస్కరించి నిలుచుంది వినయంగా. సాదా నేత చీరలో ఉన్నా పచ్చని ఛాయతో అందంగా , ఒద్దికగా ఉన్న వరమ్మను చూసి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారా దంపతులు .

          “ఈ బంగారమే మా మనవరాలు. భగవంతుడు మా కొడుకునూ, కోడలినీ నది వరదలో నెట్టుకుని, కొట్టుకుని తీసుకెళ్ళాడు. ఈ బంగారాన్ని మాకు వరంగా ఉంచాడు. అందుకే వరలక్ష్మి అని పేరు పెట్టుకున్నాం. మా సర్వస్వం ఈ బంగారమే. మా వరాలు విద్యావంతురాలు , యోగ్యురాలు, పనులన్నీ వచ్చు…” అని చెప్తుండగా వరాలు బామ్మకేసి చూసి , చెప్పవద్దని తల ఊచి సైగ చేసింది..

          ఆ జమిందారు భార్య “అన్నగారూ !  వదినమ్మా! బంగారూ వరాలూ! మా ఇంటి వరంగా రాను నీకేమన్నా  అభ్యంతరమైతే చెప్పమ్మా! నీ ఇష్టం లేకుండా ఏమీ జరగదు.” అంది.

          దానికి వరలక్ష్మి ” మా బామ్మగారూ, తాతగారూ ఒంటరి వారైపోతారని నా బాధ. ఇప్పటికే పెద్ద వారైపోయారు. వారికి ఆసరా మరెవ్వరూ లేరు. కొడుకునూ కోడలినీ కోల్పోయినా ఆ బాధ గుండెల్లో దాచుకుని ,నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేశారు . పైగా మేము  ధనికులం కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేదలం,  కయ్యానికైనా, వియ్యానికైనా  సమఉజ్జీ ఉండాలని పెద్ద లంటారు కదా!మేము అల్లుడు వస్తే వారికి తగిన మర్యాద చేసే స్థోమత లేనివారం. కేవలం రాగి సంకటి , కారం మాత్రమే తినేవారం. చూశారుగా మా ఇల్లు పూరి వసారా. చాలా ఇరుకైనది. ” అంది తల వంచుకునే.

          జమీందారు భార్య” వరలక్ష్మీ ! నీవు చెప్పక్కరలేదమ్మా! వారూ మన తోనే ఉంటారు, మరేమన్నా ఉంటే చెప్పమ్మా! స్తోమత అంటే మనం కల్పించుకున్నదే కదా! మనం ఒకటయ్యాక ఇక మనమధ్య  స్తోమతల ప్రస్తావనే రాదు సరా! ఇల్లు ఇరుకు కాదు హృదయం వైశాల్యంగా ఉంటే చాలు. అది మీకుందని మావాడు గ్రహించి చెప్పాకే, మేము వచ్చాం తల్లీ! మరి అంగీకారమేనా! “అనగా,

          వరలక్ష్మి ” అమ్మా! అడిగారని కోరారని కోరికలు కోరను. మా అమ్మ  నాయనా ఈ బాహుదా నది వరదలో కొట్టుకు పోయి, పార్ధివ దేహాలూ కూడా దొరకలేదని , మా తాత, బామ్మ  బాధపడటం గుర్తుంది. ఈ నదికి మీరు ఒక వంతెన కట్టించాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే మా ఊరికి ఒక పాఠశాల పెట్టించండి. బహుశా ఇది మీ జమీలోకే రావచ్చు. మా ఊర్లో కాస్త అనారోగ్యం చేస్తేనే వైద్య సౌకర్యం లేక  జనం నానా బాధా పడుతున్నారు. అందుకని ఈ మూడు సౌకర్యాలూ చేసి మీ జమీ జనాలను ఆదుకుంటారని భావిస్తాను. అధిక ప్రసంగమని భావించకండి. జననీ జన్మభూమిశ్చ అన్నారు కదా! నేను పెద్దింటి కోడలినై మా ఊరి జనాల బాధలు మరచిపోయి హాయిగా జీవించలేను. అందుకే అడుగుతున్నాను. గొంతెమ్మ కోరికలని  భావించక మన్నించమని మనవి.” అంది వినయంగా  .        

          “ఇవన్నీ మాజమీ బాగుచేసుకోనే కదా! బంగారు తల్లీ!, ఎన్నడూ ఇలాంటి మాటలు మా ముందు చెప్పినవారే లేరు. మాకూ ఈ ఆలోచనలు రాలేదు ఇంత వరకూ, ఇక నుండీ ఈ ఊర్లోనే కాక మా జమీలోని గ్రామాలన్నిట్లో పాఠశాలలూ, వైద్యశాలలూ ఇంకా ఏమేమి అవసరాలు కావాలో అన్నీ అడిగి తెలుసుకుని ఏర్పాటు చేయిస్తాను.” అని జమీందారు అనగానే, ఆయన భార్య ” ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా వరాలమ్మా! మరి మా కోరిక అంగీకరించినట్లేనా! మానట్టింట వరలక్ష్మి నడయాడుతుందా!” అనగా వరాలు  అంగీకారంగా తల ఊచింది.   

          వెంటనే జమీందారు భార్య లేచి , బండికేసి చూసి ” లక్ష్మీపతీ ! ఆ  బుట్ట ఇలా పట్టుకురా!” అంది.

          బండిలోంచీ గబుక్కున దూకి దిగి వచ్చిన యువకుని చూసి వరమ్మ సిగ్గుతో తలదించుకోగా ,”పొగడ్త అగడ్తలో తోస్తుంది అమ్మా! మీ కోడల్ని పొగడకండి.” అంటూ తాను తెచ్చిన బుట్ట తల్లికి అందించగా, ఆమె బొట్టు పెట్టి ఆ గంపలో ఉన్న పట్టుచీరా , నగలూ పండ్లూ అన్నీ వరమ్మ చేతికి అందించింది. వరలక్ష్మి వంగి ఆమె పాదాలకు నమస్కరించింది .

          వరలక్ష్మిని పైకి లేపి హృదయానికి హత్తుకుని” వదినమ్మా! ఇక మనమంతా ఒక్కటే. మీ బంగారం మన  బంగారమై పోయింది”అందామె.

          సిగ్గుతో వరాలు బుగ్గలు ఎరుపెక్కగా ఓరకంట చూశాడు లక్ష్మీపతి. కథ సుఖాంతం.

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.