పేషంట్ చెప్పే కథలు – 6

ఉషస్సు

ఆలూరి విజయలక్ష్మి

          పొగమంచు  తెరల వెనుక మెరుస్తున్న ఆకాశపు వెండి చాందినీ, సుశిక్షితులైన సైనికుల్లా ఒక వరసలో ఎగురుతున్న పక్షుల గుంపు, యౌవన భారంతో వంగుతున్న కన్నెపిల్లల్లా కొబ్బరిచెట్ల సమూహం, గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న గుడిగంటలు. 

          సూర్యకిరణాల స్పర్శతో తూర్పు చెక్కిళ్ళు కందాయి. నిద్ర లేస్తున్న నగరపు రొద ప్రాతః కాల ప్రశాంతతను బగ్నం చేస్తూంది. కళ్ళు విప్పుతున్న చైతన్యం చీకటి చారికల్ని తుడిచేస్తూంది. బ్రతుకు యుద్ధం పునఃప్రారంభమవుతూంది. 

          కెవ్వుమని కేక వినపడడంతో ఆతృతగా మెట్లు దిగింది శృతి. పది మంది ఆడవాళ్ళు గాబరాగా ఆమెను చుట్టేశారు. వారి మాటలు వింటూ పరిశీలనగా చూస్తూందామె. దోసెడు వెడల్పున్న జరీచీరలు, ఒక్కొక్కరి ఒంటిమీద అధమపక్షం ఏభై తులాల బంగారం, వాళ్ళ ముఖాల్లో డబ్బువల్ల వచ్చిన దర్పం, అభిజాత్యం. 

          “ఆమ్మా!” పక్కకు తిరిగింది శృతి. 

          “పిల్ల కడుపు గుండెలకు తాచేసిందని గోలెడతాంది. తమరోసారి చూడండమ్మా!” చిరిగి పీలికలై, అతికష్టం మీద ఆమె శరీరాన్ని కప్పుతున్న గుడ్డలు, ఎండి కృశించిన శరీరం, ఆమె కళ్ళలో భయం, దైన్యం, దుఃఖం. 

          పక్క గదిలో మంచంమీద పడుకుని పురిటినొప్పుల్ని పళ్ళబిగువున శబ్దం బయటకి రాకుండా భరిస్తూందా అమ్మాయి. పరీక్ష చేసి, పురుడు త్వరగా వచ్చేస్తుందని ధైర్యం చెప్పి డెలివరీ రూమ్ లో వున్న కలవారి అమ్మాయి కవిత దగ్గరకు వచ్చింది శృతి. 

          “నాకు మత్తింజక్షనివ్వండి డాక్టర్! నేను పడలేని బాధని” పెద్దగా ఏడుస్తూ శృతి చెయ్యి పట్టుకుని ప్రాధేయపడసాగింది. 

          “ఇంకెంతోసేపు పట్టదు. వచ్చేస్తుందమ్మా!”

          “ఇందాకటి నుండి మీరలా అంటూనే వున్నారు. ఈ నొప్పులతో నా ప్రాణం పోతూంది. పోనీ, ఆపరేషన్ చేసి తీసేయ్యండి డాక్టర్!” కేకలు పెడుతూ, ఏడుస్తూ అడిగింది కవిత. కవిత బంధువులంతా బయటినుండి యధాశక్తి తమ ఆదుర్దాను వ్యక్తం చేస్తున్నారు. కవిత తల్లి, కూతురు కెవ్వుమన్నప్పుడల్లా మిన్ను విరిగి మీదపడినంత హంగామా చేస్తూంది. 

          వాళ్ళ గొడవకు నవ్వొస్తూంది, చికాగ్గా ఉంది. బాధగానూ వుంది. పెళ్ళయ్యాక గర్భం వస్తుందనీ, నెలలు నిండాక పురుడొస్తుందనీ, పురుడొచ్చేటప్పుడు నొప్పులొస్తాయనీ, నొప్పులొచ్చేప్పుడు ఓర్చుకుంటూ శిశువు ప్రయాణం పూర్తిచేసి ఈ లోకంలోకి రావడానికి తన వంతు ప్రయత్నం తాను చెయ్యాలని, తమ సానుభూతితో, అర్ధంలేని మాటలతో ఆ అమ్మాయిని భయపెట్టడం కాక, దగ్గర వాళ్ళంతా యివన్నీ సహజమైనవేనని నచ్చచెప్పి ఆమె మనోధైర్యం పెంచాలని ఎప్పటికి అర్ధం చేసుకుంటారు?

          ఓదారుస్తూ, ధైర్యం చెప్తూ, సహాయంచేస్తూ, శిశువు బయటకు వచ్చాక సంతోషంగా ఊపిరి పీల్చింది శృతి. 

          “డాక్టర్! ఏం బిడ్డ?” ఆతృతగా అడిగింది కవిత. 

          “ఆడపిల్ల” ఒక్కసారి పెద్దపెట్టున కవిత వెక్కివెక్కి ఏడవడం చూసి నిర్ఘాంతపోయింది శృతి. 

          “ఆడపిల్లయితే ఆయన నా ముఖం చూడనన్నారు” కవిత జవాబు విని షాక్ తింది శృతి. “మొదటి బిడ్డకే ఈ సంపన్నురాలింత దుఃఖపడుతూంటే, మళ్ళీమళ్ళీ ఆడపిల్ల పుడితే?”

          “సరదాకి, వేళాకోళానికి అలా అనుంటారతను” తేల్చివేయ బోయింది శృతి.

          “మీకు తెలియదు డాక్టర్ ఆయన సంగతి. ఆయన సీరియస్ గానే అన్నారు. అన్నంత పనీ చేయాలనీ మొండి మనిషి కూడా. అసలు మా అత్తవారింట్లో అంతా అదే సజ్జు. ఆడపిల్లైతే ఆస్తి పట్టుకుపోతుందని ఏడుపు.” భర్తను, అత్తవారిని తలుచుకున్న కవిత ముఖంలో బాథల నీడలు, కళ్ళల్లో కన్నీటి వరదలు. శృతి మనసంతా చేదుగా అయింది. 

          ఆమె ఎంత అఙ్ఞానంలో ఉందో, ఎంత తప్పు దోరణిలో ఆలోచిస్తోందో ఆ మూర్ఖుల్నేలా ఎదిరించి నిలబడాలో, విడమరచి చెప్పి కవిత ఏడుపు మానేలా చేసింది శృతి. 

          కవితని రూంలోకి పంపగానే నొప్పులు పడుతున్న రెండో అమ్మాయిని బల్లమీద కెక్కించారు, సరైన పోషణలేక, బలహీనంగా, అలసటగా ఉందామె. జాలిగా ఆమెవంక చూస్తూ గ్లోవ్స్ చేతికి తోడుక్కుంటూంది శృతి. 

          “ఎమ్మో! ఏం బిడ్డకావాలి?” అడిగిందా అమ్మాయిని. ఈ బల్ల మీద పడుకుని మొదటి బిడ్డను కనే ప్రతీ తల్లి జవాబు ఆమెకు స్పష్టంగా తెలుసు – “మగపిల్లాడు” ఎప్పుడో, ఎక్కడో ఒక్క మినహాయింపు. కుతూహలంగా ఆమెవంక చూస్తూంది శృతి. 

          “ఏ బిడ్డయినా నా బిడ్డే కదమ్మా! ఎవరైనా ఫరవాలేదు. నిండు ఆయుస్సుతో సుఖంగా బతికితే చాలు.” ఆ అమ్మాయి నీలవేణి కళ్ళల్లో ఉషస్సు తొంగిచూసినట్లనిపించింది శృతికి.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.