రాగో

భాగం-26

– సాధన 

          “అక్కా ఇందులో బూది తప్పేమీ లేదు. కాకపోతే తిట్టినా, కొట్టినా ధైర్యం చేసి లామడేకు ఉండననాల్సింది. కానీ ఆ దెబ్బలకు ఆగలేక ఒప్పుకోవచ్చు పాడై. బలవంతాన పెళ్ళి చేసినా ఆమె ఈయన దగ్గర ఉండదు. ఏనాడో టొక్కలేపుతుంది. అయినా మనసుకు నచ్చిన వాడితో కాపురం చేయాలని కోరుకోవడం సహజమే గదక్క” అంటూ చెప్పుతున్న జైనివంక బీరిపోయి చూస్తుంది గిరిజ.

          “ఇక లామడెకు వస్తే లామడే పద్దతే మంచిది గాదక్కా! పెళ్ళి చేసి లామ్ ఉండడ మంటే ఈ పేచి తగ్గుతుంది. గోపగూడలో రుషి దాద ఇదే చెప్పిండు. రెండేండ్లు పని చేసినందుకు ఈ లామడే రైనుకు జీతం లెక్కకట్టి ఇప్పిస్తేనే బాగుంటుంది తప్ప బూదిని ఉండ మనడమైనా, బూది చెల్లెల్ని ఆశపెట్టడమైనా మంచిది గాదక్కా”.

          “బూది ఎవరికి పోతుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. దానితో ముడి పెట్టకుండ బూదురు తప్పెను రెండేండ్ల జీతం ఇమ్మనాలె, ఇట్ల చేస్తే ఎట్లుంటుందక్క” అని అడుగుతున్న జైనినే చూస్తూ మరోసారి “ఇంగో” (అవును) అంది గిరిజ తనకు తెలియ కుండానే.

          “విషయం అంతా విన్నారు దాద మీరు. మన బాయిలు కూడ విన్నారు. మీరేమనుకుంటున్నారు?” అంటూ జైని మొదలు పెట్టింది. ఎవరు మాట్లాడక పోయే సరికి మళ్ళీ తానే మొదలు పెట్టింది.

          “లామడే పెట్టుకోవడం రివాజేగదా. భయపడో, ఇష్టపడో పోరి ‘ఇంగో” అన్నాకనే లామడే పెట్టుకున్నాను అంటాడు బూదుర్ తప్పె. చేతికెదిగిన కొడుకుల్లేక లామడే పెట్టుకోక నేనేం గావాలంటడు? జీవపారె ఇచ్చి ముత్తి (భార్య)ని తెచ్చుకోలేకే కదా లామడే ఉన్నాను. ముద్దకు నిండేదాక గొడ్డు చాకిరి చేసినాక ఆ పిల్ల రానంటే నా గతేం కావాలంటడు లామడే. తండ్రేమో పనికెళ్ళ దీసుకుంటాడు. లామడే తన సుఖం తాను చూసుకుంటాడు – నేను మాత్రం బతికినన్నాళ్ళు ఇష్టంలేని వాడితో కాపురం చేయాలి. ఇదే న్యాయం. నేను చచ్చినా చేయనంటుంది బూది. తన్ని, గుద్ది కాపురం చేయించే అధికారం మీకుంది కాబట్టి నేనే కాకపోతే నా చెల్లితో బలవంతంగా కాపురం చేయిస్తానంటారు. మేమేం గొడ్లమా అన్నదే బూది బాధ. మరి ఎవరిది తప్పు లేకపోతే ఈ తగువులు ఎందుకు జరుగుతున్నాయి. ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి. ఈ పంచాయితీలు ఏంటి. మీరే విచారం చేయాలి.

          మనం అన్న మాట చెల్లకపోతే తన్నుడు, గుద్దుడే మంత్రం అనుకున్నంత కాలం మనకీ బాధలు తప్పవు. ఫారెస్టు గార్డో, పోలీసోడో తుపాకి చూపించి బూతులు తిడితే ఇన్నాళ్ళు మనం దండం పెట్టి పడుండలేదా! ఇవ్వాళ మనం గట్టిగా నిలబడితే వాళ్ళ పనేమైంది?

          ఈ పట్టిలో రివాజులు (ఆచారాలు) గట్టిగా జరిపించాలనీ పటేళ్ళు, సేన్యల్లు మీటింగులు కూడ పెడుతున్నారు. మంచిదే. కాదన్న వాళ్ళను ఎందరిని తన్ని కాపురాలు చేయిస్తారో! రవికలు తీయని బాయిలను ఎంత మందిని కాలుస్తరో; బాయిలందరికి ఒకేసారి అగ్గి పెట్టేసుకుందామా మీరే ఆలోచించండి”, అంటూ జేబు రుమాలు తీసి మొఖం తుడుచుకుంది.

          పక్కనున్న గిరిజ రెప్ప వాల్చకుండా జైని మొహంలోనికి చూస్తుంది.

          జైని మళ్ళీ ఎత్తుకుంది.

          “దొంగచాటుగా ఇల్లు చోరడమో, కేరై ఊళ్ళు పట్టుక తిరగడమో, ఏడుస్తూ బలవంతంగా కాపురాలు చేయడమో తప్ప ఇష్టంలేని పెళ్ళి నాకొద్దని మొదట్లోనే నోరిడిసి చెప్పకుండా, పడుచులు నోరు మూసుక పడి ఉంటే చివరకు ఈ పంచాయితీలు తప్పవు. తన్నులు, గుద్దులు తప్పించుకోడానికి జీవపారె ఎగొట్టడానికి మాకు పెళ్ళి వద్దు. అన్నల్లో కలసి పోతమంటే బూదికి కాకపోయినా బూది చెల్లెకి ఈ బాధలు తప్పవు. ఎన్నేళ్ళయినా మన మాడియాల బ్రతుకు లిలాగే ఉంటాయి.

          ఒంటి గాళ్ళు పని వెళ్ళలేదనుకుంటే ఊళ్ళోవాళ్ళ సహాయం తీసుకొని పని తీసుకోవాలి గానీ, పూటకు గడవకపోతే గొడ్లో, గోదో అమ్ముకొని నూకలు తెచ్చుకున్నట్టు బిడ్డల్ని చూపెట్టి లామడే పెట్టుకోవడం, ఇష్టం లేదంటే బలవంతంగా కాపురానికి తోలడం – ఇది పద్దతి కాదు. లామడే పెట్టుకోవాలనుకుంటే ముందే పెళ్ళి చేసి ఇంట్లో పెట్టుకోవడం వేరు.

          బూది తన ఇష్టం అయినవాడికి పోతే ఆ దొరికే జీవపారె లామడేకే ఇవ్వాలి. అది ఎవరికి పోతుందో, వారు జీవపారె ఇస్తారో లేదో అది తర్వాత ముచ్చట. ఈ రెండేళ్ళు చాకిరి చేసినందుకు లామడేకి బూదుర్ తప్పె జీతం కట్టివ్వాలి. పని కోసం మనిషిని పెట్టుకుంటే పైసలో, గింజలో ఇవ్వాలి తప్ప బిడ్డల్ని ఆశ చూపే పద్దతి రద్దు గావాలి.

          మన బతుకులు చాలా మారుతున్నాయి. రివాజులు కూడా మారాలి” అంటూ ముగించి “ఏమంటావు పటేల్ దాద. లామడే జీతం మాట” అంది జైని.

          జనాలందరు ‘ఇంగో’ (ఇంగో” అంటూ తలోమాట అంటున్నారు. బూదుర్ తప్పె “లోకులందరి మాట అదే అయితే అలాగే కానివ్వండి. ఈ పంట రాగానే జీతం కొలుస్తా. నాకు ఇగ లామడే వద్దు” అనేసరికి జనాలు మళ్ళీ ‘ఇంగో) అన్నారు.

          పంచాయితీ ముగిసిందని చెప్పడంతో అందరు లేచారు. చేతులు కలుపుతూ అక్కల నుండి సెలవు తీసుకొంటున్నారు. ఆ ఊరి సంఘం ముఖ్యులు ముగ్గురక్కలు అక్కడే నిలబడి ఉన్నారు.

          లామడే వెనక్కి చూడకుండా చరా చరా వెళ్ళిపోతున్నాడు.

          “అక్కా ఈ లొల్లి మొదటి నుండి మేం చూస్తున్నాం. ముందర పడనిది మనం వేలు పెట్టుడు ఎందుకని జోలికి పోలేదు. ఏమైనా ఇట్ల మేం చెప్పుడు కూడ నేర్చుకోవాలి” అంటూ ఆ ముఖ్యుల్లో నుండి ఒకామె అంది.

          “మొత్తానికి పట్టీ పెద్దల మీటింగ్ చెప్పి మంచి పని చేసినావ్ అక్కా, మా పటేల్ కూడ అండ్ల షరీకైనోడే. ఇగ ఏమంటడో చూడాలి” అంటూ మరో అక్క నవ్వుతూ చెప్పింది.

          “ఏమక్కా ఇటు పోలీసుల కదలిక ఎట్లుంది. మొన్నటి కరువు దాడి ప్రభావం ఎట్లుంది. మన దళం ఇటు రాక చాలా రోజులైంది, ఈ నడుమ” అంటూ గిరిజ ఎంక్వయిరీ చేయసాగింది.

          “ఒక్కటి, రెండు రోజులు కుక్కల తీరే తిరిగిండ్రక్కా, మాకు కూడ ఏమంటరో అన్నట్టే ఉండే అక్కా. కానీ ఇపుడేం కనపడుత లేరు” అంటూ జవాబు ఇచ్చింది.

          వారందరు ఊరు పొలిమేర దాటారు. “ఇక మేం పోతాం అక్క. మీరుండండి. ఏమైనా ధైర్యంగ ఉండండి. ఊళ్ళో శేడోలందరికి మన పాటలు, మాటలు నేర్పండి” అంటూ గిరిజ వారికి వీడ్కోలు పలికింది.

          క్యాంపెయిన్ నడుస్తుంది. అందరూ హుషారుగానే ఉన్నారు. ఊళ్ళల్లో అందరూ మీటింగ్ కు వస్తున్నారు. పంచాయితీలు మంచి-చెడ్డ అన్ని దళంలో చెప్పుకున్నట్టే జరుగుతుండడంతో దళం అక్కల్లో నమ్మకం పెరుగుతుంది.

          దార్లు తప్పి అడవిలో సర్వే చేస్తూ తిరిగిందెన్నడూ లేదు. జైని పైలట్ గా బాగానే నిర్వహిస్తుంది. ఊరక్కలు కూడా పాటలు నేర్చుకోవడమే గాకుండా మెల్ల మెల్లగా ఉపన్యాసాలిస్తున్నారు. ఆదివాసీ మహిళా సంఘాలు లేని దగ్గర ఆదివాసీ మహిళా సంఘాలు పెడుతున్నారు. .

          అదే చివరి రాత్రి. ఆ సాయంకాలం క్యాంపెయిన్ దళం జువ్వి చేరుకుంది. జైని ఇంటి నుండి పోయాక రావడం అదే మొదలు.

          కరువు దాడిలో పాల్గొన్న ఆ ఊరి వారందరూ ఉత్సాహంగానే ఉన్నారు. జైని తండ్రి, కాక, తల్లీ, కూచీలు అందరు ఇపుడు ఆ ఊరి సంఘం వారికింద లెక్కే. పాండు తిరగడం లోనే ఆ పట్టీలో సంఘలు గట్టిపడుతున్నాయని అందరికి తెలుసు.

          జువ్వి చేరిన క్యాంపెయిన్ దళం దల్సు ఇంట్లోనే ఆగింది. హడావుడిగా వసారాలోకి వస్తూ రామ! ‘రాగో, రాగో’ అని వెతుక్కుంటూ ఉంటే పిల్లీబాయి, ‘జైనీ’ అని కేకేస్తూ, ఆమెను లాగి కాక ముందుకు తోసింది. అలవాటుగా చేయి ముందుకు జాపిన జైని రెండు చేతుల్నీ పట్టుకొని బలవంతంగా గొంతు పెగిలించుకొని “బేషమంత?” (బాగున్నవా) అన్నాడు రామ.

          దళంలో కూతురిని చూసుకుంటున్న ఇంటి వారందరూ ‘మన రాగోయే’ అనుకుంటూ కొత్త మనిషిని చూస్తున్నట్టే అబ్బురంతో ఆనందంతో తబ్బిబ్బయి పోతున్నారు. ఊరి శేడోలంతా వచ్చి దళం వారిని, ప్రత్యేకంగా జైనిని పలకరిస్తున్నారు. దాదలు వచ్చి సావడి (వాసరా)లో కూచున్నారు. ఈ బిడ్డ వచ్చిందన్న సంతోషంలో రాగో కూచి (రాగో చిన్నమ్మ) పోంగ మిగిలిన కోడిపోరిని కోసింది. ఇంటి వారందరూ, జైని గతాన్నీ మరిచిపోయినట్టే ఉన్నారు.

          మీటింగ్ ప్రారంభమైంది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.