విజయవాటిక-13

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

కళింగరాజ్యము -రాచనగరి-

          అవంతికాదేవి చూడ చక్కని యువతి. మల్లెల కన్న సుకుమారమైనది. ఆమె మేని చ్ఛాయను చూసి గులాబీలు సిగ్గుపడతాయి. పాల నురుగులో చందనం కలిపినట్లు ఉంటుంది మరి. ఆమె కన్నులు కలువరేకులు. ఆమెకు రాజీవనేత్రి అన్న పేరు తగినదని అందరూ అనుకుంటారు. మృదువైన హృదయం ఆమె సొంతం. ఉద్యాన వనంలో లేళ్ళను, కుందేళ్ళను పెంచుతుంది ఆమె. పువ్వులతో సంభాషిస్తుంది. చక్కటి ప్రకృతి ఆమెకు అత్యంత ఇష్టం. ఆ ప్రకృతిని చూస్తూ, చిత్రలేఖనం గియ్యటం మరింత ఇష్టమామెకు. ఆమె కళింగ రాజకుమారి. అనంతవర్మ ఏకైక కుమార్తె. ఆయన గారాలపట్టి.  ఆమెను అపురూపంగా పెంచాడు మహారాజు. సర్వ విద్యలు ఆమె సొంతం. చిత్రలేఖనం ప్రాణం. ఆమెకు వివాహం చెయ్యాలని ఆలోచనలో ఉన్నాడు అనంతవర్మ.

          అవంతిక చెలికత్తెలామెతో ఆటలాడుకుంటున్నారు. 

          “యువరాణి మీ కెటువంటి వరుడు కావాలో…”

          “ఆలోచించలేదు…” అన్నది యువరాణి తన ముందు ఉన్న చిత్రపటం వంక చూస్తూ. ఆమె పర్వతాల మీద నుండి దుముకుతున్న జలపాతాలను చిత్రిస్తున్నది. 

          “మహారాజులవారు మీకు వరుణ్ని వెతుకుతున్నారని కబురు అంతటా…”

          “అలాగే! సరే తండ్రిగారిని చూడనీ! వారికీ అన్నీ తెలుసును…” అన్నదామె ఆలోచనగా.

***

కళింగ రాజ సభా మందిరము

          రాజు అనంతవర్మ మంత్రులతో పరివేష్టితుడై ఉన్నాడు.

          వారితో పాటు వారి అతిథులు కూడా ఉన్నారు.

          కళింగ రాజుకు విష్ణుకుండిన రాజు మాధవవర్మ నుంచి సందేశం తెచ్చారు విష్ణు కుండినుల మంత్రులతో కూడిన బృందం. వారిని స్వాగతించి సమావేశ పరిచాడు రాజు. 

          “కళింగాధీశ, పరాక్రమ ధీర అనంతవర్మ మహారాజులకు జయం! మేము విష్ణు కుండినుల సామ్రాజ్యా విజయాదీశులు, త్రికూటచలపతీశ్వరులు, సముద్రాలు హద్దులుగా గల రాజ్యాధిపతి శ్రీశ్రీ మాధవవర్మ మహారాజులు వద్ద నుంచి తమకు సందేశము తీసుకువచ్చాము…” అన్నాడు విష్ణుకుండిన మంత్రి. 

          “సంతోషము. వారు క్షేమమా. వైదిక మతాభిలాషి, వీర శూర రాజమాత మాహదేవి క్షేమమా?” అడిగాడు అనంతవర్మ. 

          “ప్రభూ! అందరూ క్షేమమే. మీ క్షేమము మా ప్రభువులు వాంఛిస్తున్నారు. వారు చెప్పిన సందేశము మీకు ఇప్పుడు వినిపిస్తున్నాము. ఇది వారి మాటగా తలవమని వారు చెప్పమన్నారు. 

          మనము ఇరుగు పొరుగు వారము. మనకు పల్లవులు శత్రువులు. మనము ఒకరికి ఒకరము మిత్రులము . మన మిత్రత్వం బంధుత్వంగా మార్చుకుంటే మంచిది…” ఈ మాట చెప్పి మంత్రి క్షణం పాటు ఆగి అనంతుడి ముఖంలోకి చూశాడు.

          అనంతవర్మ ఏ భావము కనపడనియ్యక వింటున్నాడు. 

          విష్ణుకుండిన మంత్రి కొనసాగిస్తూ “ప్రభూ! మా రాజకుమారుడు మహాదేవవర్మ సౌందర్యోపాసకుడు, ధీరుడు, పరాక్రమవంతుడు. సంగీత ప్రియత్వమే కాదు, సంగీత సాహిత్యాలలో అందె వేసిన చెయ్యి. వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన్మథుడిని తగ్గించి వారు జన్మించారు… వారికి వివాహం చెయ్యాలని మహారాజులు సంకల్పించారు. మీ కుమార్తెతో వివాహము బాగుంటుందని, ఇరు దేశాల మధ్య స్నేహం బంధుత్వముగా మారుతుందని ఆశిస్తూ మీకు ఈ సందేశము చెప్పమని మమ్ముల పంపారు…” అని చెప్పి ముగించాడు. 

          తమ వద్ద ఉన్న రాజకుమారుడి చిత్రపటం, కుండలిని (జాతక చక్రము) ఇచ్చాడు. 
అనంతవర్మ సేవకులకు సైగ చేశాడు. వారు అవి తీసుకొని భద్రపరిచారు. అనంతవర్మ వారితో “చాలా సంతోషం. మీరు మా అతిథులు. కొన్ని నాళ్ళు మా ఆతిథ్యము స్వీకరించి వెళ్ళగలరు. మేము మా రాజగురువులకు ఈ జాతకము చూపించి కబురు పంపుతాము మహారాజులకు…” అన్నాడు ఏ భావమూ కనపడనియ్యకుండా. 

          వారు సంతోషముతో, “చిత్తం మహారాజా! మేము బయలుదేరుతాము. అతికితే కతకదు. మేము బంధుత్వాలను కలుపుకుందామని వచ్చాం. వచ్చిన పని అయినది. వెళ్ళి వచ్చెదము, ఇక సెలవు…” అంటూ కదిలారు, అక్కడ ఉండటానికి సుముఖత చూపక. తమ దేశం బయలుదేరారు. వారిని సరిహద్దుల వరకూ తోడు వెళ్ళమని దండ నాయకులకు చెప్పాడు మహారాజు. 

          వారంతా వెళ్ళిన తరువాత ఆయన ఆలోచనలో పడ్డాడు. 

          ‘ఇది ఎంత వరకు సరి అయిన సంబంధం? 

          వాకాటక మహారాణి మహారాజును చేసుకున్నందున ఆమె మహారాణి కాగలిగినా ఆమె పుత్రుడు యాబది తొమ్మిది సంవత్సరాలైనా యువరాజుగానే ఉన్నాడు. 

          ఆయన ప్రస్తుత మహారాజు మాధవ వర్మ తరువాత మహారాజు అయ్యెందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయనను కాదని మహాదేవవర్మ రాజయ్యే వీలులేదు…

          మహాదేవవర్మ అందరినీ ఎదురించి రాజు కాగలడా? 

          విక్రమేంద్రవర్మకు వాకాటకుల వెన్ను, దన్ను ఉంది. యువరాజుగా ఉన్నాడు కాబట్టి ఆయననే ప్రజలు సమ్మతిస్తారు. మరోలా జరిగితే ప్రజలలో తిరుగుబాటు రావచ్చు కదా?

          అసలు మహాదేవవర్మ ఎటు వంటి వాడు? అతని ఆలోచనలు ఏ విధంగా ఉన్నవో? 

          విక్రమేంద్రవర్మకు ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి తన కుమారుని వివాహము గురించి ఆలోచనలేమిటో?’

          ఇలా పరిపరి విధములుగా ఆలోచనలు సాగాయి అనంత వర్మకు. 

          ఆయన తన ఆలోచనలను ఎంతో నమ్మకమైన మిత్రుడు, ప్రధాన మంత్రి అయిన ఆదిత్యునితో పంచుకున్నాడు. 

          ఆదిత్యుడు కూడా ధీర్ఘాలోచనలు చేసిన అనంతరము హరికను పిలిచాడు. గోవిందుని నాటక కళాసమితిలో ఉన్న హరిక కళింగుల గూఢచారి. ఆమె అందమైనది. నృత్యములో ఆరితేరినది.

          ఆమె వచ్చి మహారాజుకు, ప్రధాన మంత్రికి అభివాదము చేసింది. 

          “హరిక! నీవు నీ నృత్య విన్యాసాలతో విష్ణుకుండినుల రాజకుమారుని మతి పోగొట్టాలి. అతని నిజ రూపమేమిటో, రాజ్యము మీద అతని ఆలోచనలేమిటో తెలుసు కోవాలి…”

          “చిత్తం మహామంత్రి!!” అన్నదామె. 

          “అంతే కాదు నీవు అక్కడ నుంచి ఇంద్రపురికి ప్రయాణమవ్వాలి. ఇంద్రపురి యువరాజు వృద్ధ విక్రమేంద్రుడు. ఆయన కుమారుడు ఇంద్రభట్టారకుడు. నువ్వు అతని గురించి కూడా ఇలాగే సమాచారము సేకరించి పంపాలి…”

          “తప్పక పంపగలను మహామంత్రి…”

          “నీవు రెండు రోజులకొకటి చొప్పున లేఖ పంపు. నీ లేఖలు రాకపోతే నీవు ప్రమాదము లో ఉన్నావని తలుస్తాము మేము…”

          “అంత వరకూ రానియ్యను ప్రభూ. నన్ను నమ్మండి…”

          “సరే నీవు గోవిందునితో కలిసి రేపే బయలుదేరుతున్నావు విజయవాటికకు…”

          “మీ ఆజ్ఞ…” అన్నదామె. 

          ఆమెకు కొంత ధనమిచ్చి పంపేశారు వారు. 

          అలా గోవిందుని బృందం విజయవాటికకు వెళ్ళింది. మహాదేవువర్మ మందిరంలో బంధించబడింది. 

***

          కళింగ రాజుకు చికాకుగా అనిపించింది. 

          విజయవాటికకు పంపిన గూఢచర్యం విఫలమైనదని ఆయనకు వారం రోజులలో తెలిసినది. 

          ఆయన నమ్మకమైన తన చారులను ఇద్దరిని పిలిచాడు. 

          “మీరు పై నెలలో విజయవాటికలో రాబోతున్న నావికోత్సవానికి వెళ్ళండి. అంతా సక్రమంగా ఉంటే నెమ్మది మీద, కాకుంటే గొడవ చేసి బంధీ గృహములో ప్రవేశించి కళింగ గూఢచారుల జాడ కనిబెట్టండి. ముఖ్యంగా కావలసినది హరిక జాడ తెలుసు కోవటము. విష్ణుకుండినుల ఆలోచనలూ, వారి యాగము వివరాలు తెలుసుకొని పంపండి…”  అని వారిని పంపివేశాడు. 

          “చిత్తం మహారాజా!” అని చెప్పి వారు వెళ్ళిపోయారు. 

***

          అనంత వర్మకు రహస్యం అంతు చిక్కట్లేదు. ఆయన తన మంత్రులను మళ్ళీ సమావేశ పరిచాడు. 

          “మనకు విష్ణుకుండినుల వద్ద నుంచి వివాహ సంబంధమైన కబురు వచ్చి నెల రోజులు గడిచింది. మనము ఏదో ఒక సమాధానము చెప్పాలి. ఎవరైనా మూడు నెలలు ఆగుతారు. తదనంతరం వారు మన మీదకు యుద్ధానికి వచ్చినా సందేహ పడనక్కర లేదు…” అన్నాడు మహారాజు. 

          “మహాదేవ వర్మ గురించి మనకు ఏ సమాచారము అందలేదు కదా ప్రభూ…” నెమ్మదిగా అని ఆగిపోయాడు ప్రధానమంత్రి. 

          “జాతకములు రాజగురువులు చూశారా?” మరో మంత్రిని అడిగారు మహారాజు.

          “చూశారు… అది అంతగా కలవటం లేదని సంశయము వ్యక్తపరిచారు వారు…” చెప్పాడా మంత్రి.

          “ ఆ విషయం చెబితే మాధవవర్మ మనలను అనుమానించవచ్చు. మనము ఏదోలా కొంత కాలము ఈ వివాహ ప్రసక్తి ఆపాలి…” అన్నాడు మహారాజు. 

          “యువరాణీ వారు చిత్రలేఖనములో ప్రత్యేక విద్య నేర్చుకుంటున్నారని, మనము ఒక ఏడాది తరువాత వారిని సంప్రదిస్తామని చెబుదాము…”

          “వారు మన మాటలను నమ్మరు. అనుమానిస్తారు…”

          అందరూ కొంత సేపు మౌనం వహించారు. 

          “సరే ఆదిత్యా! నీవు దండనాయుకునితో ఒక బృందం తీసుకు వెళ్ళి యువరాణి చిత్ర పటము, జాతక కుండలి ఇచ్చి, రాజగురువులు ఒక సంవత్సర కాలము వివాహము తలప వద్దని చెప్పారని చెప్పి రండి. వారిని నమ్మించి, వప్పించి రావలసిన బాధత్య నీదే సుమా! నిన్ను నేను పరిపూర్ణంగా విశ్వసిస్తాను. మంచి ముహుర్తం ఎప్పుడో చూడమని రాజగురువులను అడగండి…”

          “చిత్తం మహారాజా! ముందుగా దూతను పంపుదాము, రాజబృందం వస్తున్నారని” అన్నాడు ప్రధానమంత్రి. 

          ఆ సమావేశం అలా ముగిసింది.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.