కాళరాత్రి-13

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

          వేసవికాలం ముగింపు కొచ్చింది. యూదు సంవత్సరం ముగింపుకు వస్తున్నది ` రాష్‌హషనా. ముందటి సాయంత్రం ఆ భయంకరమైన సంవత్సరపు ఆఖరు సాయంత్రం అందరం ఆవేదనతో ఉన్నాము. ఆఖరిరోజు ‘సంవత్సరాంతం’ మా జీవితాలకు గూడా ఆఖరి రోజు కావచ్చు.

          సాయంత్రం చిక్కని సూపు ఇచ్చారు. ఎవరికీ ముట్టాలనిపించలేదు. ప్రార్థన తరువాత చూద్దామనుకున్నాము.

          అపెల్‌ ప్లాట్‌లో వేల మంది యూదులం కరెంటు ముళ్ళ కంచె మధ్య చేరాము నిశ్శబ్దంగా.

          రాత్రి అవుతూ ఉన్నది. అన్ని బ్లాకుల నుండి ఖైదీలు వస్తూనే ఉన్నారు. ‘‘దేవుడా! అసలు నీ సంగతేమిటి? అని కోపంగా ప్రశ్నించాను. ఈ బాధితులంతా తమ నమ్మకం, తమ కోపం, తమ తిరుగుబాటు తెలుపటానికి కూడారు. ప్రపంచాధిపతివి, మేమంతా పిరికివాళ్ళం, సగం చచ్చినవాళ్ళం, అతి హీన  పరిస్థితిలో ఉన్న మా ముందు నీ గొప్పతనం ఏమిటి? మనసు విరిగి ఉన్నాం, శరీరాలు ఛిద్రమవుతున్నాయి. ఇంకా మమ్మల్ని ఎందుకు బాధిస్తున్నావు?’’ అని ప్రశ్నించాను.

          వేల మంది ఆ ప్రార్థనకు పోగయ్యారు అధికారులతో సహా.

          శక్తిమంతుడు స్తుతించబడు గాక! అని ప్రార్థన లీడ్‌ చేసే గొంతు వినిపించింది. దేవుని నామము స్తుతించుబడుగాక అని అతనంటే అందరూ రిపీట్‌ చేస్తున్నారు. నేనెందుకు స్తుతించాలి? నాలో అణువణువు తిరుగుబాటు చేసింది.

          వేల మంది నిప్పుల గుండంలో కాలి బూడిదవుతున్నారు. నిప్పుల గుండాలు రాత్రింబవళ్ళు పని చేస్తున్నాయి. సబాత్‌ రోజు సెలవు రోజు కూడా. తన బలంతో దేవుడు ఆష్‌విట్స్‌, బర్కినా, బ్యూనా, యింకా మరెన్నో మృత్యుకూపాలు సృష్టించాడు. అమ్మలను, నాన్నలను, సోదరులనూ హింసించి అగ్ని గుండాలలో మసి చేస్తుంటే మేమెందుకు దేవుని పొగడాలి? మమ్మల్ని వధించి చంపుతుంటే అందుకు ప్రతిగా నిన్ను పొగడాలా? అని ఆవేదన, ఉక్రోషం నాలో వెల్లువెత్తాయి.

          ప్రార్థన మధ్యలో అందరూ ఏడుస్తున్నారు. ‘‘ప్రపంచం, ఈ భూమి అంతా దేవునిది’’ ప్రార్థన చెప్పే అతని గొంతు పూడుకుపోతున్నది.

          ఒకప్పటి మార్మిక వాదినైన నేను ఇలా తలంచాను. ‘‘నీకంటే మనిషి బలవంతుడు. ఆడం, ఈవ్‌ నిన్ను మోసం చేసినప్పుడు వారిని స్వర్గం నుండి వెళ్ళగొట్టావు. నోవాతో వచ్చిన వారంటే యిష్టపడక, వరదలు సృష్టించావు. సోడోం నీ దృష్టిలో పతన మైనప్పుడు నిప్పుల వర్షం కురిపించావు. ఇక్కడ ఉన్న వారిని చూడు. నీవు వీరందరినీ మోసం చేశావు. హింసకు గురి అయి నరకబడి, కాలి బూడిద చేయబడబోతున్నారు. వారిని అలా వదిలి వేశావు. అయినా నీ నామం స్తుతిస్తున్నారు వాళ్ళంతా.’’

          సృష్టి అంతా దేవుని గొప్పతనం చూస్తున్నది (ప్రార్థన)

          పాతరోజుల్లో రాష్‌హషనా అంటే నాకెంతో విలువ ఉండేది. మనిషి చేసే పనుల మీదే అతని మంచి చెడు ఆధారపడు తుందనుకున్నాను. విముక్తి కొరకు ప్రార్థించాను.

          కాని ఇప్పుడు నిన్నేమి అడగను, కోరను. నేనిప్పుడు బలవంతుడను దేవుడా! నీవు నిందితుడివి, మేము బాధితులం. నేను దేవుడు లేని జగత్తులో ఒంటరిని, మంచిలేదు, ప్రేమ లేదు, దయలేదు. నేను బూడిదతో సమానం యిప్పుడు. ఇప్పటిదాకా గొప్పగా భావించిన నీకంటే నేనే బలవంతుడను. ప్రార్థిస్తున్న ఈ జన సందోహంలో నేను భాగంకాను. నేను గమనిస్తున్న ఒక కొత్త వ్యక్తిని.

          కడిష్‌తో ప్రార్థన ముగిసింది. అందరూ తమ తల్లితండ్రుల కోసం, పిల్లల కోసం, తమ కోసం కడిష్‌ వల్లె వేశారు.

          అలా చాలా సేపు నిలబడ్డాం. నిద్ర వేళయింది. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకోవటం విన్నాను. తమతమ బ్లాక్స్‌కి నెమ్మదిగా చేరుకుంటున్నారు.

          నాన్నను చూడటానికి వెళ్ళాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయనకు తెలపాలేమొ! నాకసలు దానిమీద యిప్పుడు నమ్మకం పోయింది.

          నాన్న గోడకు చేరపడి ఎంతో భారం మోస్తున్నట్లు అనిపించాడు. నాన్న చేయి ముద్దు పెట్టుకున్నాను నాన్న కన్నీటి బొట్టు నా చేతిమీద రాలింది. ఒకరినొకరం ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకున్నాం.

          నిద్ర గంట మోగింది. నాన్న ముఖంలోకి చూశాను. ఆ వాడిన ముఖంలో చిరునవ్వు చూడ ప్రయత్నించాను. అలాంటిదేమీ లేకపోగా ఓటమి స్ఫురించింది ఆయన ముఖంలో.

          యామ్‌కిప్పూర్‌ క్షమాపణ కోరే దినం. మేము ఉపవాసము ఉండాలా అని ఆలోచించ వలసిన దినం. ఉపవాసం ఉన్నామంటే చావుకు దగ్గరవుతున్నామన్న మాట. ఇక్కడ మాకు రోజూ ఉపవాసమేగా! సంవత్సరమంతా మాకు యామ్‌కిప్పూర్‌! చాలా మంది ఉపవాసముండాలన్నారు. కొందరు మేమున్న స్థితిలో ఉపవాసం అపాయకరమన్నారు. ఈ నరకంలో కూడా దేవుని స్తుతించటానికి సిద్ధంగా ఉన్నాం.

          నేను ఉపవాసం చేయలేదు. నాన్న నన్ను వద్దని వారించాడు. ఆ అవసరం కూడా నాకు కనిపించ లేదు. దేవుని నిశ్శబ్దం నేను ఖండిస్తున్నాను. సూపు తిని దేవుని పట్ల తిరుగుబాటు చేశాను. వ్యతిరేకం ప్రకటించాను. నా రొట్టె నమిలి తిన్నాను, నాలో ఏదో శూన్యం భరించాను.

          ఎస్‌.ఎస్‌. నూతన సంవత్సరం నాడు, మాకు చక్కని బహుమతి యిచ్చాడు. పని నుండి తిరిగివస్తుంటే ద్వారం దగ్గరే ఏదో జరుగుతున్నట్లు అనుకున్నాం. హాజరు పట్టీ త్వరగా ముగిసింది. సూపు వేగంగా పంచారు. తినేశాం. మాలో ఆతురత పెరిగింది.

          నేను ఇప్పుడు నాన్న ఉన్న బ్లాక్‌లో లేను. నన్ను కన్‌స్ట్రక్షన్‌ కమాండో అధీనంలోకి మార్చారు. అక్కడ రోజులో 12 గంటలు నేను రాళ్ళ బరువులెత్తాలి. మా కొత్త బ్లాక్‌ అధికారి జర్మన్‌ యూదు. చిన్నసైజు వ్యక్తి, నిశితమైన కళ్ళు. సాయంత్రం సూపు తరువాత ఎవరూ బ్లాక్‌ బయటికి పోరాదని ఆర్డరు వేశాడు. సెలెక్షన్‌ అని అందరూ భయపడ్డారు.

          అంటే ఏమిటో మాకు తెలుసు. ఎస్‌. ఎస్‌. రోజూ మమ్మల్ని పరీక్షిస్తాడు. మాలో బలహీనంగా ఉన్న వాళ్ళ నంబరు మంటలకు రెడీ అని రాసుకుంటాడు.

          సూపు తిని అందరం బంకుల మధ్య చేరాం. ‘నీవు లేటుగా ఇక్కడకు తేబడ్డావు, అదృష్టవంతుడివి. రెండేళ్ళ క్రితం వరకూ నరకమే. కంబళ్ళు లేవు నీళ్ళు లేవు. మరీ కొంచెం రొట్టె, సూపు, రాత్రుళ్ళు చలిలో గడగడలాడుతూ పడుకునే వాళ్ళం. పని కఠినంగా ఉండేది. ఇప్పుడు ఇది చిన్న స్వర్గం కింద లెక్క. ఖైదీలు రోజూ యింతమంది కపోలకు కోటా నిర్ణయింపబడేది. ‘‘ప్రతివారం సెలెక్షన్‌ దయాదాక్షిణ్యంలేని సెలెక్షన్‌ నీవు అదృష్ట వంతుడివి’’ అన్నారు. ‘‘ఇక చాలు మీ కథలు, రేపుగాని ఎల్లుండిగాని చెబుదురు గాని’’ అన్నాను. వాళ్ళు భళ్ళున నవ్వారు.

          ‘‘భయపడ్డావా? అప్పుడు మేము భయపడ్డామన్నారు. ముసలివాళ్ళు ఒకమూల నిశ్శబ్దంగా పడి ఉన్నారు. కొందరు ప్రార్థన చేస్తున్నారు.’’

          ఇంకో గంట టైమున్నది. అప్పుడు తెలుస్తుంది మాకు చావో, రేవో అని.

          నాన్న బాగా ముసలివాడయ్యాడు. సెలక్షన్‌ తప్పించుకోలేడేమో అని నాన్న గురించి ఆలోచించాను.

          మా బ్లాక్‌ల్‌ టెస్ట్‌ 1933 నుండి కాన్‌సంట్రేషన్‌ క్యాంపు బయటలేడు. అన్ని వధ్యశాలలు చూశాడు. మృత్యు ఫ్యాక్టరీలన్నీ చూశాడు. 9 గం॥ల ప్రాంతంలో అతను మా వద్దకు వచ్చాడు.

          సైలెన్స్‌ అన్నాడు. అంతా నిశ్శబ్దం. ‘‘నేను చెప్పబోయేది సరిగ్గా వినండి’’అన్నాడు. అతని గొంతులో వణుకు మాకు తెలిసింది. కాసేపట్లో సెలక్షన్‌ జరగబోతున్నది.

          మీరొక్కొక్కరూ ఎస్‌.ఎస్‌. డాక్టర్ల ముందుకెళతారు. మీరు పాసవుతారని ఆశిస్తున్నాను. అలాంటి అవకాశాలు పొందండి. మీరు పక్క గదిలోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు బాగా ఆడించి రండి. పాలి పోకుండా కొంత ఉత్తేజం పుంజుకోండి. నెమ్మదిగా నడవకండి. దయ్యం వెంట తరుముతున్నట్లు పరుగెత్తండి. ఎస్‌.ఎస్‌. వైపు చూడకండి. తిన్నగా పరుగెత్తండి.

          ఒక్క క్షణం ఆగి మరలా అన్నాడు. అన్నిటి కంటే ముఖ్యం భయపడకుండా ఉండటం.

          ఆ సలహా పాటించాలనుకున్నాం. నా బట్టలు విప్పి మంచం మీద పడేశాను. అవి ఎవరైనా ఎత్తుకు పోతారనే భయం లేదు.

టిబి, యోసీలకు నాతో పాటే కమాండోలను మార్చారు. ముగ్గురం కలిసి ఉందాం. కొంచెం బలం ఉన్నట్లు అనిపిస్తుందని అర్థించారు.

          యోసి గొణుగుతున్నాడు. బహుశ ప్రార్థన అయి ఉంటుంది. యోసి భక్తుడని నేనెప్పుడూ ఊహించలేదు. టిబి పాలిపోయాడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అందరం మొండి మొలలతో బంకుల మధ్య నిలబడ్డాం. ఆఖరి జడ్జిమెంట్‌ కోసం అలాగే నిలబడాలి గాబోలు!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.