ఓ కథ విందాం!

సేద్యం ధీర భోజ్యం

రచన & పఠనం – లలిత గోటేటి

          మెరుస్తున్న కళ్ళు నావైపే చూస్తున్నాయి. నిజానికి క్లాసులో ఉన్న యాభైమంది
విద్యార్ధులు నేను చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు . కానీ అందరిలోకీ ప్రత్యేకంగా ఆ రెండు కళ్ళలో ఏదో మెరుపు ,గొప్ప జిజ్ఞాస, జీవనోత్సాహం నాకు తెలుస్తోంది. మరుక్షణమే నా మనసు పాఠం చెప్పే ఏకాగ్రతలోకి జారిపోయింది.

          విలియం వర్డ్స్ వర్త్ అద్భుత రచన ‘డేఫ్ఫోడిల్స్’ పద్యంలోని పంక్తులను చదువు తున్నాను,

          “వెన్ ఆల్ ఎట్ వన్స్ ఐ సా ఎ క్రౌడ్,
          ఎ హోస్ట్ ఆఫ్ గోల్డెన్ డేఫడిల్స్,
          బిసైడ్ ద లేక్, బినీత్ ద ట్రీస్, ఫ్లట్టరింగ్ అండ్ డాన్సింగ్ ఇన్ ద బ్రీజ్.
చివరి వాక్యాలు చదువుతూ నాకు తెలియకుండానే ఆ మెరుస్తున్న కళ్ళవైపు చూసాను.

          “టెన్ ధౌజెండ్ ఐ సా ఎట్ గ్లాన్స్, టోసింగ్ థెఇర్ హెడ్ ఇన్ స్లైట్లీ డాన్స్.” అన్న వాక్యం ముగించగానే రెండు చేతులు కలిపి తప్పట్లతో “బ్యూటిఫుల్ మేమ్” అనేశాడు. క్లాసంతా ఆశ్చర్యంగా అతనివైపే చూసారు. అనుకోని ఈ స్పందనకు నేనూ రవ్వంత ఆశ్చర్యపోయాను.

          “గుడ్” నీపేరు ? “

          “వెంకట్ మేమ్” అన్నాడు.

          అలా వెంకట్ తో నాతొలి పరిచయం జరిగింది.

          ఆ రోజు ఉదయం ఫస్ట్అవర్ ఏ క్లాసూ లేకపోవడంతో స్టాఫ్ రూమ్ లో కూర్చుని ఉన్నాను. తలుపు తోసుకుని “సారీ మేడం” అంటూ వచ్చాడు వెంకట్.

          “యస్” అన్నాను.

          “మేమ్ మీతో రెండునిమిషాలు మాట్లాడవచ్చా? “ అంటూ వినయంగా అడిగాడు.

          “చెప్పు వెంకట్” అన్నాను.

          “మీరు పాఠం చాలాబాగా చెబుతారు మేడం, వివరణ బావుండటమే కాదు, మీ స్వరంలో ఉండే ఆకర్షణ విద్యార్ధులను కట్టిపడేస్తుంది. “ అన్నాడు.

          “పొగడడానికి వచ్చావా?” అన్నాను నవ్వి.

          “లేదు మేడం! చెప్పాలనిపించింది”

          “కూర్చో” అన్నాను.

          “మేమ్! నిన్న మీరు చెప్పిన డేఫడిల్ల్స్ పోయెమ్ లోని భావుకత, అందం, దానికదే స్పష్టంగా ఉన్నపుడు , నాకు ఎందుకో వ్యాఖ్యానాలు నచ్చవు, గులాబీ పూవుకు రంగులేసినట్టు వుంటుంది.. అన్నాడు.

          “నిజమే” అంటూ నవ్వేశాను. తాను మైక్రోబయాలజీ ఎం ఎస్ సి చదివాననీ, బిఇడీ చదవడానికి కారణం తనకు ఉపాధ్యాయవృత్తి పట్ల గౌరవమనీ చెపుతుండగా బెల్ మోగింది.

***

          “ఏవిటీ ! నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?” ఆఫీసుకు వెళ్ళడానికి రడీ అవుతున్నాడు ప్రకాష్ .

          “మా స్టూడెంట్ అన్నమాటలు గుర్తుకొచ్చి” అన్నాను నవ్వుతూనే.

          “అదృష్టవంతురాలివి ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు.”

          “ఎందుకంటే నాకు ఇష్టమైన పనినే చేస్తాను కాబట్టి” అన్నాను.

          అద్దం ముందు నిలబడి, క్రాఫ్ ను పదిసార్లు దువ్వుకుంటూ, నెక్ టైని సరి చేసుకుంటున్న ప్రకాష్ తలతిప్పి చూశాడు.

          “పెద్దగోప్పే, నీకొచ్చే జీతం వారం రోజులు ఖర్చులకు కూడా చాలదు, ఇలా అడ్డమైన మార్కెటింగ్ ఉద్యోగాలు భరిస్తూ, సహిస్తూ చేయడానికి ఎంత ఓపిక కావాలో తెలుసా” అన్నాడు ఉక్రోషంగా .

          “కాదని ఎవరన్నారు మహానుభావా ?” నిజానికి నీ స్వభావానికి, ఈ బిజినెస్ ఫీల్డ్ కు ఎక్కడైనా సరిపోతుందా? అడిగాను.

          “అదే చెబుతున్నాను, నీ అంత తెలివైన వాడిని కాదు, పిల్లలు నాలాగా కష్టపడ కూడదని, కొడుకు అమెరికాలో సెటిల్ అవ్వాలని, కూతురు దానికి ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకోవాలనీ, అప్పులుచేసి మరీ ఇలా అఘోరిస్తున్నాను.”

          “అలా ఎందుకు అనుకోవాలి? ఆ వృత్తినే మరి కాస్త ప్రేమించండి.” అన్నాను నవ్వు ఆపుకుంటూ ప్రకాష్ ఉక్రోషం చూసి. ప్రకాష్ ని టీజ్ చేయడం సరదా నాకు.

          “ అలాగే చిత్తం! తమరు సెలవిచ్చారుగా” అంటూ విసురుగా వెళుతున్న ప్రకాష్ ను ఆపి, లంచ్ బాక్స్ చేతికిచ్చాను.

          “మధ్యాహ్నం తినేందుకు టిఫిన్ కూడా పెట్టాను, బయట ఆహారం ఏమి తినద్దు, ఇంకా కరోనా అక్కడక్కడా కనబడుతోంది.” అన్నాను.

          “ ఓకే బై అన్నాడు ప్రకాష్ బండి స్టార్ట్ చేసి.”

          పరిగెత్తుకెళ్లి గేటు తీశాను, మోటార్ సైకిల్ రోడ్డెక్కిoది.

          కాసేపు నిలబడి అలాగే చూస్తూ నిట్టూర్చాను. “ప్రకాష్ ఉద్యోగానికి ఒక ఆదివారం, ఒక సెలవు రోజు,అంటూ ఉండదు, పిల్లల చదువులు ఎప్పుడు పూర్తి అవుతాయో , ఎప్పుడు ఈ ఒత్తిళ్ల నుంచి బయట పడగలమా అనిపిస్తుంది. కనీసం అబ్బాయి శరత్ సెటిల్ అవ్వగానే ప్రకాష్ చేత ఈ ఉద్యోగం మానిపించాలి అనుకుంటాను రోజూ. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనీ.

          ఆర్థిక సుస్థిరత కోసం, మనుషులందరూ పరుగులు పెడుతున్నారు, ఈ పరుగులో జీవించడాన్నే కోల్పోతున్నారు. పిల్లలు సహజంగానే వాళ్ల జీవితాల్లోకి స్థిరపడే బంగారు రోజులు తిరిగి వస్తాయా ? ఆందోళనల మధ్యకాక ఆనందంగా జీవితం సాగుతుందా పూర్వంలాగా?” అనుకుంటూ ఇంట్లోకి నడిచాను.

***

          కాలేజీలోకి అడుగుపెడుతూనే నాలో ఒక ఉత్సాహం ప్రవేశిస్తుంది. ఆషాఢపు చిరు జల్లులు మొక్కలనూ, మనసులనూ సేద తీరుస్తున్నాయి. ఈ చదువులమ్మ ఒడి నాకు ఒక వేదిక, నా లోపలి తపనకు, తత్వానికి భగవంతుడు నాకు ఏర్పరిచిన దారి, జీవితంలో వికసించడానికి మొగ్గల్లా సిద్ధంగా ఉన్నపిల్లలను చూడగానే ఆనందంగా జీవించటానికి కావలసిన మెలకువను వారిలో కలిగించాలనే తపన కలుగుతుంది. క్లాసులో పాఠాలతో బాటూ, భాష, అభివ్యక్తిలోని అందాలు, భావ సంపద, వీటికి జీవితానికి మధ్య ఉండే బలమైన సంబంధం మొదలైన వాటిని వాళ్లకు చేరవేసే ప్రయత్నాలు చేస్తాను. ఇది నాకూ, నా విద్యార్థులకు మధ్య ఒక బంధం ఏర్పరిచింది. క్లాసు మొదలుపెట్టేముందు , మంచి సూక్తులనో, సామెతలనో చెప్పి పాఠంలోకి వెళ్ళడం నాకు అలవాటు.

          “ఎ ఫ్రూట్ లేడెన్ ట్రీ ఆల్వేస్ బెండ్స్ లో .” అన్నాను ,పిల్లలు రాసుకుంటున్నారు.
“ఎ మేన్ అఫ్ వర్డ్స్ అండ్ నాట్ అఫ్ డీడ్స్ ఈజ్ లైక్ ఎ గార్డెన్ విత్ ఫుల్ అఫ్ వీడ్స్ . అని
చెప్పాను.

          “కలుపు మొక్కలవల్ల కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి మేమ్ , కానీ పని చెయ్యని మేధావి వర్షించని మేఘం వంటివాడు” అన్నాడు వెంకట్.

          వెంకట్ చెప్పిన వాక్యాన్ని వెంటనే బోర్డ్ మీద రాశాను. ఒక పదినిమిషాలు పిల్లలు ఈ అంశాల మీద చర్చచేసుకున్నాకా పాఠం మొదలు పెట్టాను.

***

          ఓ ఆదివారం సాయంత్రం ఇంటి ముందున్న పూలమొక్కల మధ్య తిరుగు తున్నాను.

          గేటుతీసుకుని వెంకట్ వచ్చాడు.

          “రా వెంకట్!” అన్నాను సంతోషంగా. ఇద్దరం వరండాలో కూర్చున్నాం.

          “వెంకట్! ఇంక వారం రోజుల్లో మీ బ్యాచ్ వెళ్ళిపోతారు కొత్తపిల్లలు వస్తారు” .

          “అవును మేమ్, అందుకే మీకు కనపడి పోదామని వచ్చాను.”

          “తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు?”

          గవర్నమెంటు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు,బెంగుళూరులో స్నేహితులు ఉన్నారు, ఎంఎస్సి డిగ్రీతో అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను మేడం” అన్నాడు.

          నేను లోపలికి వెళ్లి పళ్ళముక్కలు ప్లేట్ లో పెట్టితెచ్చి వెంకట్ ముందు పెట్టాను.

          “నాన్న ఆరోగ్యం బాగాలేదు,షుగరు పెరిగి ఒక కిడ్నీ ఫెయిల్ అయింది,అమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఆవిడకు మోకాళ్ళ నొప్పులు, ఉన్న నాలుగు ఎకరాల పొలంతో ఏంతో కష్టపడి నన్ను చదివించారు మేడం! నా తరువాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మానాన్నలను సుఖపెట్టాలని నా కోరిక మేడం!”

          వెంకట్ గొంతులో ఆవేదన ధ్వనించింది.

          “ఊ ….నిట్టూర్చాను జీవితమంటేనే ఒక పోరాటం వెంకట్, నిండా పాతిక ఏళ్ళు కూడా లేవు నీకు, నీధైర్యం, నీ వివేకమే, నీకు శ్రీరామరక్ష.

          “థాంక్యూ మేమ్!” అన్నాడు.

          “వెంకట్ నీకోసం కొన్ని పోయెట్రీ బుక్స్ సేకరించాను ,” అని, పుస్తకాలను తెచ్చి అతని చేతిలో పెట్టాను.

          వెంకట్ ముఖం సంతోషంతో వెలిగింది.

          “థాంక్యూ వెరీమచ్ మేమ్!”

          “నీచేతిలో ఉన్న పుస్తకం ఏమిటి?”

          అతని చేతిలోని నోట్ పుస్తకం తెరిచి చూసి , రాసుకున్న పంక్తులను చదివాను.

“నీ పచ్చని ఒడిలో ఉన్నంతసేపూ,
ఏ ఆలోచనలూ ఉండవు,
నా భ్రమల బాంధవ్యాల గూటికి చేరగానే,
మనోవికారాల కసరత్తుల మధ్య ,
నీలోకి చూసే తీరికే ఉండదు.”

మరొక పేజీ తిప్పాను,

“చల్లని వానజల్లు కోసం నిలువెల్లా కళ్ళు చేసుకున్నాను,

నేల పచ్చని అందంతో పులకిస్తున్న వేళ,
ఆలోచనల అలజడులకు అడ్డుకట్ట వేసి,
నీ అందాల విందుని ఆస్వాదించగలనా?
కొండా కోనా, వాగువంకా, కొమ్మారెమ్మా నీ పరిష్వంగంలో మౌనముద్ర దాల్చాయి .
నిర్జీవమైన వస్తువుల చుట్టూ తిరిగే నాకు నీ జైవికమర్మం తెలుస్తుందా?
ఈ ఆకుపచ్చని వెన్నెలకు దోసిలోగ్గగలనా?
నీ మెరుపు స్పర్శకు మొలకెత్తే విత్తనమయినా బాగుండును నేను,
నీ జీవచైతన్యాన్ని ప్రవహింప చేసే నదినయినా బాగుండును,
చిత్రమైన ప్రాణిని, బుద్ధి జీవిని నేను,
శబ్దార్థాల రణగొణధ్వని లో చిక్కుకుని నన్నునేను చేజార్చుకోకుండా,
“బిడ్డా! మిన్నూమన్నూ మాత్రమే నిజం మధ్యలోని దంతా మిధ్ధ్యే” అన్న నాన్న మాటలు పునశ్చరణ చేసుకునే
రైతు బిడ్డని నేను.”
చదవటం పూర్తి చేశాను.

          “బావుంది, వెంకట్! నీలో అన్వేషణ, సౌందర్య దృష్టి, భావుకత ఉన్నాయి. మంచి కవిత్వం చదువు, నీ అభివ్యక్తి మరింత బాగుంటుంది” అన్నాను.

          సిగ్గుపడ్డాడు, “అవును, మామ్ మీరు చెప్పిందే,

          “ఎ గుడ్ బుక్ యూ రీడ్, దట్ ఏడ్స్ ఎ మిల్లీమీటర్ టు యువర్ మెంటల్ స్టేచర్”
అన్నాడు.

          “యస్” అన్నాను నవ్వి.

          కాసేపు కబుర్లు చెప్పాక నాకు వీడ్కోలు చెప్పి వెళ్ళాడు వెంకట్.

          “భగవంతుడా! తల్లితండ్రుల కోసం ఆరాటపడుతున్నఈ పిల్లాడిని చల్లగాచూడు”అంటూ మనసులోనే నమస్కరించుకున్నాను.

          పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వెంకట్ ని చూడగలనని ఆరోజు నేను అనుకో లేదు,

***

          కాలం ఒక దశాబ్దం ముందుకు నడిచింది. పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ అయ్యాకా కూడా ప్రకాష్ ఆర్ధిక ఒత్తిడినించి బయట పడలేదు, ఏవో బాధ్యతలు మీదపడుతూనే వుంటాయి, నిజానికి అవి పడవు మనమే పెంచుకుంటాము అనుకున్నాను.

          ఆ రోజు సూర్యోదయం కాకుండానే గుంటూరు నుంచి కారులో హైదరాబాద్ కు ప్రయాణం అయ్యాను నేను. అమ్మాయి, అల్లుడు కొత్తగా కొనుక్కున్న అపార్ట్మెంట్ గృహప్రవేశానికి ముందుగానే వెళ్లాడు ప్రకాష్. అమెరికానించి అబ్బాయి శరత్, కోడలు లావణ్య హైదరాబాదుకు ముందే చేరిపోయారు.

          “దామోదర్! కారు నెమ్మదిగా పోనియ్యి, వ్వర్షం పడింది కాబోలు రోడ్డు చిత్తడిగా ఉంది. మనం ఎక్కడున్నాం?” అన్నాను.

          “పిడుగురాళ్ళకు చేరుకున్నాం, రోడ్డు బాగాలేదు అమ్మా!” అన్నాడు డ్రైవర్ దామోదర్.

          సమయం ఆరు అవుతున్నా పొగమంచు వీడలేదు. ఉన్నట్టుండి ఎదురుగా వస్తున్న సైకిల్ మనిషిని తప్పించే ప్రయత్నం చేసాడు. సడెన్ బ్రేక్ వేయడంతో కారు పెద్ద చప్పుడుతో ఒక గోతిలో పడింది. రెండునిమిషాలు మెదడు మోద్దుబారిపోయింది. కారు ముందు అద్దం పగిలి గాజుపెంకులు నా ఒడి నిండా పడ్డాయి. “దామోదర్!” అరిచాను భయంతో.

          “కంగారుపడకండి అమ్మా!” అన్నాడు, అప్పటికే డోరు తీసుకుని నెమ్మదిగా దిగుతున్నాడు దామోదర్.

          మా కారుదగ్గరకు నలుగురు మనుషులు పరుగెత్తుకొచ్చారు. కారుదిగే ప్రయత్నం చేసాను. నాకు ఎవరో చేయి అందించారు. చేయ్యందించిన వ్యక్తి ముఖంలోకి చూశాను, సంశయిస్తూ “వెంకట్” అన్నాను.

          “అవును ‘వెంకట్’ నే అమ్మా ! పెద్ద ప్రమాదం తప్పిపోయింది మేడం!” అన్నాడు.

          దామోదర్ కారు కండిషన్ చూస్తున్నాడు. ఎవరికీ దెబ్బలు తగల లేదు, ఊపిరి పీల్చుకున్నాను.

          దగ్గరలోనే మెకానిక్ షెడ్ వుందని చెప్పారు ఎవరో.

          నలుగురు మనుషుల సాయంతో కారుని రోడ్డుమీదకు తెచ్చాడు దామోదర్.

          “మేడం! ఇంటికి వెడదాం రండి.” అన్నాడు వెంకట్.

          చుట్టూఉన్న పోలాలకేసి చూస్తూ ఆశ్చర్యంగా “ఇక్కడా?” అన్నాను.
పిల్లాడిగా ఉండే వెంకట్ ఇపుడు యువకుడిగా మారాడు. లుంగీ, టీషర్టు వేసుకుని తలపాగా చుట్టుకున్నాడు.

          “ఇక్కడే అమ్మా రండి” అన్నాడు.

          “దామోదర్! పిలిచాను,

          “అమ్మా! టైరాడ్ ఎండ్ విరిగింది, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూటర్ వైర్లు కూడా తెగిపోయాయండి, గుంటూరుకు వెళ్ళాలి , పగిలిన అద్దం కూడా వేయించాలి, సాయంత్రం, అవుతుందమ్మా”అన్నాడు.

          “తప్పదు దామోదర్! , రేపటికి చేరాలి, డబ్బులేమైనా కావాలా?”

          “బిల్లు ఇచ్చాకా గూగుల్ పే చేద్దురుగాని” అన్నాడు.

          “ఓకే” అన్నాను. దామోదర్ ఎవరిదో సైకిల్ తీసుకుని మెకానిక్ కోసం వెళ్ళాడు.

***

          “ఎలా ఉన్నావ్ వెంకట్! ఇక్కడ ఏం చేస్తున్నావు? అతని వెనుక, చేనుగట్టు మీద నడుస్తూ అన్నాను.

          బాగున్నాను మేడం, వ్యవసాయం చేస్తున్నాను,పెళ్లి చేసుకున్నాను, ముగ్గురు పిల్లలు నాకు, మొదట్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను, నాన్నకి ఆరోగ్యం బాగా పాడైంది, వచ్చే ముప్పై వేలుతో సిటీ ఖర్చులు భరించలేక, నాన్నకోసం ఉద్యోగం వదిలి వచ్చేసి గుంటూరు లోనే వైద్యం చేయిస్తూ ఇక్కడే ఉండి పోయాను. కానీ వాళ్ళను దక్కిoచు కోలేకపోయాను మేడం! అన్నాడు బాధగా.

          “అయ్యో!” అన్నాను.

          “అదే ఇల్లు మేడం! మిమ్మల్ని నా కుటీరానికి ఆహ్వానిస్తున్నాను.” అన్నాడు.

          నిజంగానే పూలకుటీరం లా ఉంది అన్నాను,ఇంటి చుట్టూ ఉన్న విరిసిన పూల మొక్కలను చూసి. పచ్చని పొలం మధ్యలో ముచ్చటగా ఉన్న మూడు గదుల ఇల్లు, పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోకి అడుగుపెట్టాను.

          వెంకట్ భార్య పద్మను పరిచయం చేసి, జరిగింది చెప్పాడు, “దెబ్బలేమీ తగలలేదు కదమ్మా?” అంది పద్మ. బంతిపూవులా కళగా ,నవ్వుముఖంతో పలుకరిస్తున్న పద్మను చూసి వెంకట్ కు తగిన భార్యే అనుకున్నాను.

          “లేదమ్మా! చేతిమీద గాజుపెంకు గీసుకుంది అంతే” అన్నాను, మంట పెడుతున్న మోచేతిని చూసుకుంటూ,

          పద్మ “అరే! మేడం అంటూ లోపలికి వెళ్లి దూది తెచ్చి తుడిచి కొబ్బరినూనె రాసింది చనువుగా.

          బయట ఆడుకుంటున్న పిల్లలను పిలిచి చూపించాడు వెంకట్, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మూడు ఏళ్ళ వయసున్న బాబు ,పిల్లలు ఆరోగ్యంగా,ముద్దుగా ఉన్నారు.

వెంకట్ రెండు కుర్చీలు తెచ్చి ఇంటి ముందు వేసాడు. టైం ఎనిమిది అయింది. సూర్యకాంతిలో వరిచేను పచ్చగా మెరుస్తోంది. గాలి ఆహ్లాదంగా వీస్తోంది.

          “ఇల్లు చాలా బావుంది వెంకట్! , అయితే చదువులో మూడు డిగ్రీలు తెచ్చుకున్న, ఒక అబ్బాయి ఇలా వ్యవసాయం చేస్తూ పొలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడు, ఈ విషయం నాకు కొరుకుడు పడటం లేదు” అన్నాను.

          “చదువుకుంటే వ్యవసాయం చేయకూడదా మేడం? స్కూల్ లో టీచరుగా కూడా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను, ఈ రెండు వృత్తులనూ నేను ప్రేమిస్తాను.” “వ్యవసాయాన్ని జీవనోపాధిగా కాక జీవన విధానంగా మార్చుకున్నానండీ, నాన్న మరణంతో కుంగిపోయాను, అమ్మకూడా తీవ్ర అనారోగ్యం తో బాధలు పడింది, వ్యవసాయంలో ఈ రసాయనిక ఎరువుల, పురుగు మందుల వాడకం మనిషిని రోగిగా మారుస్తున్నాయనే కారణం చేత, నేను ప్రాకృతిక వ్యవసాయం పట్ల ఆకర్షితుడనయ్యాను మేడం.

          నావి నాలుగు ఎకరాలుగాక పక్కచేను, మరొక నాలుగు ఎకరాలు కలుపుకుని, గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రాకృతిక వ్యవసాయం చేస్తున్నానండీ. ఒక అయిదు ఎకరాల్లో దేశీవరి విత్తనాలూ, కంది, మినుములు రెండు ఎకరాల్లో సాగుచేస్తున్నాను. ఇంకా అర ఎకరంలో ఫుడ్ ఫారెస్ట్ వేసి పండ్లు, కూరగాయలూ సాగుచేస్తాను. మనకు అన్నం పెడుతున్న పుడమితల్లి  గర్భాన్ని, విష రసాయనాలతో నింపకూడదన్నది నా లక్ష్యం అమ్మా! గోఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను.”

          “నేను ఒళ్లంతా చెవులు చేసుకుని వింటున్నాను.”

          “వెంకట్! నీకు వ్యవసాయ పద్ధతులను ఎవరు చెపుతారు, సలహాలను ఎవరు ఇస్తారు?”

          “మేమ్! నేను ‘మసాంబోపుకావొక’ గారి మిశ్రమ వ్యవసాయ పద్ధతులనూ,’సుభాష్ పాలేకర్’ గారి ఫిలాసఫీ ను అనుసరించి వ్యవసాయం చేస్తూ, ‘రైతునేస్తం ఫౌండేషన్’ వారుఇచ్చే తర్ఫీదులో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలిసికొని సమస్యలను అధిగమిస్తున్నాను మేడం!

          పద్మ వేడిగా పాలు పొంగబెట్టి, బ్రూ పవుడర్ కలిపి కాఫీ ఇచ్చింది నాకు.

          “వెంకట్! నువ్వుతాగవా?”

          “లేదండీ, ఇంట్లో పాలూ,కాఫీలు తాగం, ఇంకా పూర్తి శాఖాహారమే తింటాం. పిల్లలకు కూడా ఎక్కువ శాతం నువ్వుల పాలూ, వేరుశనగ గింజలతో తీసిన పాలూ పట్టిస్తాం. వంద గ్రాముల నూపప్పుతో లీటరుపాలు తీయవచ్చు,

          “మైగాడ్ ! అవును హైప్రొటీన్, కాల్షియం కూడా ఉంటాయి.”అన్నాను.

          “నాకున్నరెండు ఆవులనూ లంబాడీలకు ఇచ్చానండి, బదులుగా నాకు వారు పేడ ఎరువు గోమూత్రం ఇస్తారు, గోకృపామృతం, జీవామృతం ఉపయోగించే నేను సేద్యం చేస్తాను. నేను అయితే ఎండుగడ్డి మాత్రమే వేస్తాను,వాటికి,అదే లంబాడీలు అయితే అడవుల్లోకి కూడా తోలుకు పోతారు అక్కడ ఔషధగుణాలు ఉండే మొక్కలను, పచ్చికను
కూడా అవి తింటాయి అందుకని లంబాడీలకు ఆవులను ఇచ్చేశాను.

          “రైతంటే పెట్టుబడులూ నష్టాలూ,కష్టాలూ అంటారుగా,ఎలా చేయగలుగుతున్నావు ఆశ్చర్యంగా అడిగాను.

          “లంబాడీలకు కోడే దూడలు కావాలి,నాకు ఎరువు కావాలి అదీ మేమ్ మా ఒప్పందం. అప్పులు తీర్చడం కోసం ఇతర రైతులు ధాన్యాన్ని కేజీ ముప్పై రూపాయలకే అమ్ముతుంటారు,నేను పండించే ధాన్యాన్ని బియ్యం చేసి కేజి డెబ్బై రూపాయలకు అమ్ముతాను, ఆదాయం తగ్గి పెట్టుబడులు పెరిగితే నష్టంకాక ఎమొస్తుందీ? నాకు ఎరువుల కొట్లో పెట్టుబడులుండవు. నేను కలుపు మొక్కలు తీయించే పనికూడా చేయను.

          “కలుపుతీయించవా? ఎలా సాధ్యం ?”

          అవసరంలేదు మేడం! కలుపు తీయించిన కొద్దీ వస్తుంది, మనం కలుపు అనుకునే
మొక్కల్లో, ఎన్ని ఔషధగుణాలు ఉన్న, ఆకు కూరలు ఉన్నాయో, జహీరాబాద్ లోని ‘ ఫారెస్ట్ అగ్రికల్చర్ ఎకాడెమీలో’ లో అన్ కల్టి వేటేడ్ గ్రీన్స్ లో శిక్షణ ఇచ్చారు.

          “ఈ మధ్య జహీరాబాద్ వెళ్ళానండీ ,తెలంగాణా గ్రామీణ పెద్దలైన ఆడవారి దగ్గర
విలువైన,ఆరోగ్యకరమైన ఆహార సంపద ఉంది. పోలాన్ని దున్నకుండా, విష రసాయనాలు వాడకుండా,ప్రకృతి వ్యవసాయం చేసేవారికి ఇది గొప్పవరం , మనం కలుపు అనుకునే ఆకు కూరలతో రుచికరమైన వంటలుచేసి మరీ నేర్పిస్తున్నారు మేడం! వారు, అక్కడున్న విత్తన నిధిని చూస్తే, నాకు గొప్ప ఆనందం కలిగిందండీ. నరసన్నగారు 1987 లో మొదలు పెట్టిన అరణ్య వ్యవసాయ క్షేత్రం ఇపుడు అంతులేని సంపద ఉన్న అడివిగా మారిపోయింది.పెద్దపెద్ద వృక్షాలతో రకరకాల పక్షులకు ఆలవాలమై కళకళలాడుతోంది” అన్నాడు సంబరపడుతూ వెంకట్.

          పద్మ మమ్మల్ని భోజనానికి పిలిచింది, సమయం ఒంటిగంటకు చేరింది,
పచ్చని అరిటాకులో వడ్డించింది, బియ్యంలో పోట్టు తీయకుండా వండిన వరి అన్నం, చింత చిగురుపప్పు, గొంగూర, మిరపపళ్ళ పచ్చడి, ఒకకప్పులో ఉంచిన పప్పుచారు, వెన్నతీసిన మజ్జిగ, సువాసనలతో ఘుమఘుమలాడుతున్నాయి.

          “పిల్లలభోజనాలు ఇపుడే అయ్యాయి ! ఆలస్యం అయింది, మీరూ కూర్చోండి” అంది పద్మ.

          “నువ్వుకూడా రా పద్మా!” అన్నాడు వెంకట్, పద్మ మరొక ఆకు తెచ్చుకుని వడ్డించుకుంది.

          కడుపు నిండా తిన్నాను, నాజీవితంలో తిన్న అత్యంత రుచికరమైన భోజనం అది.

***

          ఆరుబయలు కావడంచేత సమయం నాలుగుగంట లైనా , సూర్యప్రతాపం తగ్గలేదు, వెంకట్ కోసం ఎవరోవస్తే వారితో బయట నిలబడి మాట్లాడుతున్నాడు.

          “పద్మా! మరి వెంకట్ ఈ వ్యవసాయ సంబంధిత జ్ఞానాన్ని ఇతర రైతులతో పంచుకుంటున్నాడా?” అడిగాను.

          “నిన్ననే మాట్లడడం కోసం నల్గొండ వెళ్ళి వచ్చారు మేడం, తిరుమల తిరుపతి దేవస్తానం వారు కూడా పిలిచారు.

          మీరు ఈ వీడియోలు చూడండి అని సెల్ ఫోన్ నా చేతిలో పెట్టింది. వీడియో ప్లే చేసాను. వెంకట్ రైతునేస్తం ప్రోగాంలో ప్రసంగిస్తున్నాడు. అతని ముందు ఒక యాభై మంది రైతులు ఉన్నారు, వారి చేతుల్లో పుస్తకాలూ,పెన్నులూ, పెట్టుకుని రాసు కుంటున్నారు. బోర్డుమీద బొమ్మలు వేస్తూ మల్టీలేయర్ ఫామింగ్ గురించి వివరిస్తున్నాడు అతను. ఇందులో నాలుగు సూత్రాలు ఉన్నాయి,మొదటిది ఆదాయం, రెండవది
ఆర్గనైజేషన్ అండ్ ప్లానింగ్, మూడవది, బయోడైవర్సిటి అంటే జీవవైవిధ్యమూ, నాలుగు పెన్షన్ ,అంటే రైతుకు కూడా ఒక ఉద్యోగస్తునిలా నెలనెలా వచ్చే ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి? నిర్జీవంగా ఉన్న నేలను ఎలా సజీవం చేసుకోవాలి,గోఆధారిత వ్యవసాయం ఎలా చేసుకోవాలి ,ప్రకృతిని రక్షించుకుంటూ,మనం ఆరోగ్యంగాఎలా
జీవించవచ్చు అంటూ నేలను దున్నకుండా,కలుపు తీయకుండా వారానికి వెయ్యి రూపాయల కూరగాయలను తాను ఎలా పండిస్తున్నదీ, వివరిస్తున్నాడు వెంకట్.
గోకృపామృతం వేయగానే నేల తొందరగా గుల్లబడిపోతుందనీ,పైరు పచ్చగా వస్తుందనీ, గో కృపామృతమ్ లో అరవైరకాల ఆర్గానిజమ్స్ ఉన్నాయనీ ఈ సూక్ష్మజీవులవల్ల పైరు ఆరోగ్యం గా పెరుగుతుందనీ,ఒక రైతు మూడువందల అరవై రోజులూ సంపాయించు కునేలా చేయాలనే పట్టుదలతోనే తాను ఉన్నాననీ, రైతుల సందేహాలకు సమాధాన మిస్తూ,వందే గోమాతరం, “జైభారతమాతా !” అంటూ ముగించాడు. ఇలా మరో నాలుగు
వీడియోలు చూస్తూ కూర్చున్నాను. ఎంత పరిణతిని సాధించాడు! వెంకట్ పట్ల పుత్రవాత్సల్యం కలిగింది నాకు.

          దామోదర్ ఫోన్ చేసాడు, కారు రిపేర్ అయిపోయిందనీ తాను ఒక అరగంటలో వస్తున్నాననీ చెప్పాడు.

          వెంకట్ వచ్చాడు లోపలికి.

          వెంకట్ దామోదర్ వస్తున్నాడు, ఇక నేను బయలుదేరతాను, చాలా సంతోషంగా ఉంది నాకు, మీ ఆతిధ్యం ఎప్పటికీ మరువలేను,ఈ రోజు, రైతు అంటే అప్పులూ, ఆత్మహత్యలేనన్న భావాలకు తెరదించి, సేద్యాన్నిధీరభోద్యం చేసే తరం నీతో మొదలు అయింది, నీ ప్రసంగాలు అన్నీ విన్నాను, నీకు ఎలాంటి సాయం కావలసివచ్చినా నాకు ఫోన్ చేస్తావుగా అన్నాను.. అతని చేయి అన్దుకుని కాస్త ఉద్వేగంగా.

          తప్పకుండా అమ్మా! ఈరోజు మా అమ్మవచ్చినంత సంతోషంగా ఉందినాకు అన్నాడు కార్యశూరుడు వెంకట్.

*****

Please follow and like us:

One thought on “ఓ కథ విందాం! “సేద్యం ధీర భోజ్యం””

  1. సైద్యం ధీర భోజ్యం ‘ కథ కాదు మీ స్వానుభవం అనిపించింది. మీతో పాటు కూర్చుని ఆ పైరు మధ్య వెంకట్ కుటీరంలో కూర్చుని నేనుకూడా అన్నీ అనుభవించాను అనిపించింది.అభినందనలు రచయిత్రి గారు.

Leave a Reply

Your email address will not be published.