సాహిత్య చరిత్రలో జాషువా స్థానం

-డా. ప్రసాదమూర్తి

‘ఒకడు ప్రోత్సహింప..ఒకడేమొ నిరసింప
ఒకడు చేర బిలువ ఒకడు తరుమ
మిట్టపల్లములను మెట్టుచునెట్టులో
పలుకులమ్మ సేవ సలిపినాడ” – జాషువా.
 
          తెలుగు సాహిత్యంలో ఒక బలీయమైన ముద్ర వేసిన వాడు, కొన్ని తరాలకు చైతన్యాన్ని అందించిన వాడు మహాకవి గుర్రం జాషువా. ఈరోజు జాషువా జయంతి. జాషువా రచనా ప్రస్థానం సాగిన కాలాన్ని, ఆ చరిత్రను పరిశీలించి అతి జాగ్రత్తగా మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఈనాటి సాహిత్య పరిశోధకులకు, సాహిత్యంలో సామాజిక చలన గమనాల పరిశీలకులకు ఎంతైనా ఉంది. తెలుగులో గురజాడ అప్పారావు నుంచి ఆధునిక కవిత్వంలో అన్ని దశలనూ ఆయా సామాజిక ఆర్థిక సాంస్కృతిక దశలతో, పరిణామాలతో ముడివేసి పరిశీలించినపుడు జాషువా స్థానాన్ని సరిగ్గా అంచనా వేయడం జరిగిందా? అన్నది ఈనాడు సాహిత్య విద్యార్థులకు ఎదురవుతున్న ప్రశ్న.
 
          తెలుగు కవిత్వంలో ఆధునిక పరిణామాలను, దశలను అంచనా వేసిన సాహిత్య పరిశోధకులు, విమర్శకులూ, చరిత్రకారులు ఎక్కువగా మార్క్సిస్టు సూత్రాలను ఆధారంగా చేసుకుని తమ పరిశీలనలు సాగించినవారు. తెలుగులో గొప్ప కావ్య సృష్టి చేసిన గొప్ప కవులను తమ సాహిత్య చరిత్ర పుస్తకాలలో విశేషంగా కీర్తించి, తెలుగు సాహిత్యంలో వారి స్థానాలను నిర్ణయించిన ఎందరో విమర్శకులూ విశ్లేషకులూ సాహితీ చరిత్రకారులూ ఉన్నారు. మరి వారంతా గుర్రం జాషువా కి ఇచ్చిన స్థానం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వారు లేరు గాని, వారి కృషి ఫలితంగా వెలుగు చూసిన పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కవుల చరిత్రులు, సాహిత్య చరిత్రలు, విమర్శ గ్రంథాలు చదువుకున్నాం. జాషువా ప్రస్తావన అంతగా మనకు విశేషంగా కనిపించదు. కేవలం ఒక పద్య కవిగా ఎవరైనా ఎక్కడైనా చెప్పవచ్చు. రారా, కె వి ఆర్, చే.రా వంటి విమర్శకులూ, త్రిపురనేని, వెల్చేరు మొదలైన సాహిత్య పరిశోధకులు, శ్రీశ్రీ లాంటి మహా కవులు ఎందరో జాషువాను పూర్తిగా విస్మరించారని చెప్పాలి. తాను మరణించిన నాలుగైదు దశాబ్దాల తర్వాత తెలుగు సాహిత్య లోకంలో కొన్ని తరాలను ఉర్రూతలూగించే శక్తిసామర్థ్యాలున్న కవిగా గుర్రం జాషువాను ఆనాడు ఎవరూ గుర్తించలేదు. ఎందుకిలా జరిగింది? వారంతా జాషువా అంటే వ్యక్తిగతమైన ద్వేషంతోనో, అనాసక్తితోనో ఇదంతా చేశారా? అంటే అలా చెప్పలేం. మరెందుకు అలా జరిగింది? పోనీ కులమే కారణమా అంటే దానికీ అవునని చెప్పలేం. మరి ఆ లోపానికి కారణం ఏమిటి? చరిత్రలో జరిగిన ఈ లోపాన్ని వర్తమానంలో భర్తీ చేసుకోకపోతే, భవిష్యత్తు ఎప్పటికీ శూన్యం గానే మిగులుతుంది
 
          జాషువా విషయంలో జరిగిన చారిత్రక విస్మరణ కు కారణాలు ఏమై ఉంటాయో కూలంకషంగా పరిశీలించవలసి ఉంది. మార్క్సిస్టు సూత్రాల చట్రంలో ఒక కవి ఒదగాలంటే అతడు తప్పనిసరిగా భావజాలంలో, రచనా శైలి లో, ఛందస్సులో నవీన పోకడలను అనుసరించిన వాడై ఉండాలి. అలాగే తన కాలపు సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాల పట్ల ఆధునిక దృష్టి అభ్యుదయ దృష్టి కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఆ కవి మార్క్సిస్టు అయి వుంటే మరీ మంచిది. నిజమే. కవులకు వర్గ దృష్టి ఉండటం ఆనాటి విమర్శకు ఒక మంచి గీటురాయిగా పనిచేసింది. కానీ గురజాడ అప్పారావు విషయంలో ఆయన సిద్ధాంతాలు మార్క్సిస్టు సిద్ధాంతాలు కాకపోయినప్పటికీ ఆ కవిని మనం ఆధునిక కవిత్వ వైతాళికుడుగా గుర్తించాం. కారణం ఆయన తీసుకున్న వస్తువు ఆయన అనుసరించిన చందస్సు ఆనాటి కాలానికి ముందు తరాలకు ఆచరణీయమైన, చైతన్యవంతమైన , స్ఫూర్తిదాయకమైనవిగా వుండడమే. అంటే ఒక కవి తాను స్వయంగా మార్క్సిస్టు కాకపోయినప్పటికీ తాను తీసుకున్న కవితా అంశంలోనూ తాను వ్యక్తీకరించిన భావాలలోనూ, అనుసరించిన భాషలోనూ ఆధునికత ఉంటే ఆ కవిని మనం ఆధునిక కవిగా గుర్తించవచ్చు అని గురజాడ అప్పారావు విషయంలో జరిగిన అంచనా ద్వారా తెలుసుకుంటాం. అయితే గుర్రం జాషువా తన కవిత్వానికి తీసుకున్న అంశాలను, వస్తువులను ఆధునికమైనవిగా చూడలేదా? ఆయన భావాలను ఆయన భాషను, ఆయన శైలిని, ఆధునికమైనవిగా చూడడానికి అడ్డం వచ్చిన అంశం ఏమిటి? పోనీ ఆయన తన కవిత్వాన్ని పద్యాలలో ఛందస్సులో పొందుపరచాడని, పద్యం తన కాలం నాటికి ఆధునికం కాదని, భాష ఎంత ఆధునికమైనదైనా పద్యాలలో అది సాంప్రదాయికమైనది గానే పరిగణించబడుతుంది అని అనుకుందాం. పోనీ ఈ వాదనే తీసుకుంటే రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాధ వంటి పద్య కవులకు ఎందుకు మన విశ్లేషకులు పెద్ద పీట వేశారు? మరి అప్పుడైనా జాషువాను ఎందుకు మరచారు? దీనికి ఏమిటి సమాధానం? శ్రీశ్రీ అంతటి మార్క్సిస్టు మహాకవి భావజాలంలో తాను వ్యతిరేకించినా, విశ్వనాథను మహాకవి గానే ఎలా చూశాడు ? కృష్ణశాస్త్రి, రాయప్రోలు, బసవరాజు లాంటి వారిని ఎందుకు బాగా స్మరించాడు ? పిఠాపురం ఆస్థానంలో చెళ్ళపిళ్ళ వెంకట కవి ఉపన్యాసాన్ని నాలుగ్గంటల పాటు నిలబడి విన్నానని తన ఆత్మ కథలో రాసిన శ్రీ శ్రీ, ఒక్కసారి కూడా గుర్రం జాషువా ప్రస్తావన ఎందుకు చేయలేదు?  కృష్ణశాస్త్రి వెనక కథ నడపగా ముద్దు కృష్ణ సంకలించిన వైతాళికులు పుస్తకంలో జాషువా ఎందుకు లేడు? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగా మిగిలిపోయాయి.
 
          కళలు మోహించుట ఒక కులీనులనె కాదు, కులము లేదన్న వానిని కూడా వలచునని చెప్పిన జాషువాను వీరందరూ కులం కారణంగానే దూరం పెట్టారా? ఇప్పుడు దళిత బహుజన అంబేద్కర్ భావజాలంతో సాహిత్య విమర్శ, వివేచనా సాగిస్తున్న వారు ఇదే కారణమని చెప్పవచ్చు. కానీ అలా నేను చెప్పలేను. వర్గ దృక్పథానికి పోటీగా కుల దృక్పథాన్ని ముందుకు తీసుకు రావడం ఆనాడు కమ్యునిస్టులకు నచ్చని అంశం. అందుకే అంబేద్కర్ ను దూరం పెట్టారు చాన్నాళ్ళు. వర్గ దృక్పథమే కీలకమని, విముక్తి మార్గం అదేనని బలంగా నమ్మిన మార్క్సిస్టు ధోరణి కేంద్రంగా సాగిన విమర్శ శాస్త్రం కూడా అదే పద్ధతిలో నడిచింది. కానీ జాషువాను బహుముఖీన ప్రతిభ గల కవిగా గుర్తించడానికి వారికి అదే ధోరణి అడ్డువచ్చింది. దానితో వారు జాషువాను సంపూర్ణంగా చదవడం మానుకున్నారు. రాసింది పద్యమే కాని అది వచనం కంటె బలంగా పదుగురి నోళ్ళలో ఎలా నిలిచింది? సామాన్యమైన పదజాలంతో అసామాన్య భావాలను గుప్పించి జనసామాన్యానికి దగ్గరైన అంశాలను వర్ణిస్తే పద్యమైనా పది కాలాలు ఉంటుందని వేమన్న వంటి వారు నిరూపించిన విషయాన్ని మనవారు పట్టించుకోలేదు. ఆయన శైలి, ఆయన నడక, ఆయన భాష, ఆయన భావాలు, ఆయన ఎంచుకున్న అంశాలు, మానవాత్మకు చాలా దగ్గరగా వున్నవని గుర్తించలేకపోయారు. ఇక వర్ణ వ్యవస్థ మీద ఆయన ఎక్కు పెట్టిన ప్రశ్నలు, అస్పృశ్య న్యూనతా భావం నుంచి వచ్చినవే అనుకున్నారు గాని, అవి రానున్న తరాలను అగ్ని తరంగాలుగా మార్చే విద్యుత్ వలయాలుగా గమనించలేకపోయారు. 
 
          మనసార ఏడ్వనీరు నన్ను అని ఆకాశంలో కూర్చిని ప్రియురాలి కోసం ఏడ్చిన వాడిని అక్కున జేర్చుకున్నారు గాని, నాదు కన్నీటి కథ సమన్వయము సేయ ఆర్ద్రహృయంబు కూడ కొంత అవసరంబు అని ఆశించిన జాషువాకి ఆ హృదయాన్ని ఎవరూ ఇవ్వలేకపోయారు. కేవల భారతీయ సమాజంలో వర్ణ వ్యవస్థ ద్వారా సంక్రిమించిన సమస్త జాడ్యాలూ వర్ణవ్యవస్థ పై పోరాటం ద్వారానే కూల్చివేయగలమన్న అవగాహన ఆనాడు లేకపోవడంతో, అదే కురచ చూపు విమర్శ లోకంలో కూడా వ్యాపించి జాషువాను కొన్ని దశాబ్దాల పాటైనా అంటరాని వానిగానే వుంచ గలిగారు. ఆనాడు చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి, విశ్వనాథ వారు జాషువాను కనీసంగానైనా గౌరవించారు గాని, వర్గ దృక్పథం వున్న అగ్రవర్ణ మేధావులు మాత్రం కనీసం దగ్గరకు కూడా రానీయలేదు. 
ఇదంతా చరిత్ర. ఇప్పుడా లోపాన్ని కమ్యూనిస్టులు సవరించుకుంటున్నారు. వారి కార్యాలయాల్లో అంబేద్కర్ బొమ్మ అనివార్యమైంది. వారి మాటల్లో అంబేద్కర్ ప్రస్తావన నినాదమైంది. లాల్ నీల్ ఎజెండా ఇప్పుడు ఓ కొత్త జెండాగా ఎగురుతోంది. అందుకే జాషువా జయంతులు..వర్థంతులు బహుళంగా జరుగుతున్నాయి. జాషువా తెలుగు వారి రాష్ట్ర కవిగా ముందుకొచ్చాడు. అయినా ఇప్పటికీ ఇదంతా రాజకీయంగా చూసే పేరు మోసిన విమర్శకులున్నారు. జాషువా విరాట్ రూపాన్ని అంగీకరించే హృదయ వైశాల్యం ఇంకా చాలా మందిలో తరచి చూస్తే కనిపించదు. జాషువా కేవలం కుల పరమైన సూత్రాల వల్లే కాదు, ఆయన ముందు కవి, తర్వాతే దళితుడు. ఆయన స్పృశించిన ఫిరదౌసి, తాజమహల్, గబ్బిలం, అనాథ, శిశువు, గిజిగాడు, స్మశానవాటిక మొదలైన ఎన్నో కావ్య వస్తువులను కవిత్వం చేసిన తీరు అజరామరం. కాలానికి ఎదురీది నిలబడ్డానికి వచనమా..పద్యమా అన్నది గీటు రాయి కాదని జాషువాని చదివితేనే తెలిసేది. వర్గాన్ని పట్టుకున్న చరిత్ర అప్పుడు ఏ తప్పు చేసిందో కులాన్ని పట్టుకుని ఇప్పుడు ఆ తప్పునే పునరావృతం చేయకూడదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.