ఒక్కొక్క పువ్వేసి-18

ఎవరీ.. బాధిత యువతులు

-జూపాక సుభద్ర

          పల్లెల నుంచి పట్నాల దాకా తరుచుగా యువతులు, పిల్లలు అపహరణకు గురయ్యే కేసులకు సంబంధించిన వార్తలు చదువుతుంటాము. వాటి మీద ప్రభుత్వాలు వ్యవస్థలు తీసుకునే చర్యలు, నేరస్తులకు శిక్షలు ఏమి కనిపించయి, వినిపించయి. ఈ మధ్య సైబరాబాద్ పోలీసులు ఒక పెద్ద సెక్స్ రాకెట్ ని బట్టబయలు చేసిండ్రు. దాదాపు పదిహేను వేల మంది యువతులను వ్యభిచార కూపంలోకి నెట్టివేస్తున్న నేర వ్యవస్థలను పట్టుకున్నారు. వీళ్ళంతా భారతదేశం నలుమూలల నుంచి అపహరణలకు గురయిన బాధితులే కాకుండా యితర పేదదేశ యువతులు కూడా వున్నారు. చాలా వరకు టీనేజి అమ్మాయిలే. ఇక ఈ అమ్మాయిలంతా బహుజన కులాల బాధితులే. పిల్లల్ని అపహరించి వారి ఆర్గాన్స్ ని అమ్ముకొని వారిని చంపేస్తున్న నేరస్తులు రోజురోజుకు పెరిగి పోతున్నరు. యింకా టీనేజీ అమ్మాయిల్ని రకరకాలుగా లోబర్చుకొని వారిని వ్యభిచార రూపాల్లోకి తోసి కోట్లు గడిస్తున్న నేర వ్యవస్థలు బంధువులుగా, స్నేహితులుగా, సోషల్ మీడియాగా, ఆన్ లైన్ మిత్రులుగా, ఆప్స్ గా, ఉద్యోగ ఆన్లైన్ సంస్థల పేరునా ప్రేమ పేరుగా యువతుల్ని ట్రాప్ చేసే నేర వ్యాపారాలు యధేచ్చగా నడుస్తున్నయి.

          హ్యూమన్ ట్రాఫికింగ్ కు గురవుతున్నది భారత దేశంలో బహుజన కులాల యువతులే ఎక్కువ. వీరే సామాజికంగా, ఆర్ధికంగా, భద్రతలేని బతుకులుగా వుండడం వల్ల వీరిని అపహరించడం సులువు అయింది నేరవ్యవస్థలకు. చిన్న చదువుల నుంచి పెద్ద చదువులు చదివిన బహుజన కులాల యువతకు ఉద్యోగ అవకాశ ఎరలతో, ప్రేమ పేరుతో సెక్స్ కూపాల్లోకి బలవంతంగా తరలిస్తున్నాయి. గత పాతిక ముప్పయేండ్ల నుంచి ప్రపంచంలో, దేశంలో కంప్యూటర్, ఐటీ, బిజినెస్ స్కూల్స్, సెక్టార్స్ విపరీతంగా పెరిగినయి. వాటిలో చదివిన ఆధిపత్య కులాలకు ఇచ్చిన ప్లేస్ మెంట్స్, ప్రాధాన్యతల అవకాశాలు బహుజన కులాల యువతులకు చాలా చాలా తక్కువ. యిక కమ్యూనికేషన్ స్కిల్స్ లో కూడా ఆధిపత్య కులాల వాల్లతో పోటీ పడలేని పరిస్థితి. తరాలుగా మాట్లాడ నివ్వని నోరెత్తనివ్వని కుల పర్యావరణంలో వుండి యిప్పుడిప్పుడే తమ స్కిల్స్ ని మెరుగు పర్చుకుంటున్నారు బహుజన కులాల యువతులు. ప్రైవేట్ కంపెనీల్లో రిజర్వేషన్స్ వుండాల్సిన అవసరముంది. ఎందుకంటే కులం కారణంగా మనుషులంతా సమాన అవకాశాలు పొందడంలేదు. హెచ్చుతగ్గులు, నిచ్చెనమెట్ల కుల సమాజంలో అందరు సమానంగా వుండేందుకు భారత రాజ్యాంగం ద్వారా డా॥ బి ఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ఏర్పాటు జరిగింది.

          అదే రాజ్యాంగ నిబద్ధతతో, సామాజిక బాధ్యతతో ప్రైవేటు రంగాలు సామాజిక బాధ్యతను విస్మరించి విపరీత లాభాలార్జిస్తున్నయి. ప్రభుత్వాలు వీరికి తేరగా భూములు, లోనులిస్తుంది గానీ వారికి నిర్బంధ సామాజిక బాధ్యతలను నెత్తిమీద పెట్టడం లేదు. అట్లా ప్రైవేటు కంపెనీలు సమాజం పట్ల ఎట్లాంటి బాధ్యతను కనబర్చక లాభాల లక్ష్యంగానే నడుస్తున్నయి. వీటి పట్ల ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగానే వున్నయి. కంప్యూటర్ చదువులు, ఐటీ సెక్టార్స్ లో చదువుకున్న యువతులు, పదో క్లాసు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చదువుకున్న, లేదా డ్రాపవుటయిన నిరుద్యోగ యువతులు బాగా పెరిగినారు ఈ మధ్య. వీరు ఉద్యోగార్జన కోసం అనేక రకాల ఆన్లైన్ ఆప్స్ వలల్లో, సోషల్ మీడియా మిత్రుల మోసాల్లో చిక్కి, సైబర్ ట్రాఫికింగ్ ముటాల చేతుల్ల చిక్కి బలవంతపు వ్యభిచారాలకు బలవుతున్నరు.

          గంటకో యువతి ట్రాఫికింగ్ ముటా వలలో పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిలను అక్రమ రవాణచేసి, వారిని వ్యభిచార వృత్తుల్లో పిండేసి తర్వాత వారి అవయవాలని అమ్ముకొని కోట్ల వ్యాపారం చేసే సైబర్ ట్రాఫికింగ్ ముటాలు కొన్నయితే, ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఉద్యోగం పేరుతో స్నేహాల పేరుతో ట్రాప్ చేసి వ్యభిచార కూపాల్లోకి దింపి వ్యాపారం చేస్తున్న ట్రాఫికింగ్ నేరముటాలు కొన్ని.

          బస్తీల నుంచి పల్లెల నుంచి ఆడపిల్లలు అర్థాంతరంగా కనుమరుగైతుంటరు. తల్లిదండ్రులు మా పిల్ల కనిపిస్తలేదు అని పోలీస్ స్టేషండ్లకు బోయిు కంప్లయింట్ యిచ్చే పరిస్థితి లేదు. ఫ్రెండ్లీ పోలీసంటరు గానీ అదిపైకే, ‘మా బిడ్డ యింటికి రాలేదని’ చెప్తే… ‘నీ బిడ్డ ఎవన్ని తీస్క పోయిందో’ అనే పోలీసుల దురుసును చరించలేక యువతులు మాయమైనపుడు ధైర్యంగా వెళ్లి కంప్లయింటు యివ్వలేక పోతున్నరు.
అప్పుడప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ నేరస్తుల ముటాను పట్టుకున్నాం అనే వార్తా కథనాలు వస్తుంటయి తర్వాత వారిమీద ఏం చర్యలు, నివారణ చర్యలు ఏమీ కనబడవు. షరామామూలుగా నడుస్తున్నయి హ్యూమన్ ట్రాఫికింగ్స్. గట్టి నిఘావ్యవస్థల్ని, బందువస్తులు, నిరోధకాలను పటిష్టం చేస్తున్నామంటరు. కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ కొనసాగుతానే వుంది. బహుజన యువతుల జీవితాలు నరక కూపాల్లో నాశనమవుతూనే వున్నయి. ప్రభుత్వాలు, పౌరవ్యవస్థలు నేర వ్యవస్థల్ని లేకుండా చేయాలి.

          హ్యూమన్ ట్రాఫికింగ్ మీద సినిమాలు కూడా వచ్చినయి కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ పట్ల ప్రభుత్వాలు సీరియస్ గా లేవు. మన కులాల పిల్లలు కాదు, మన యువతులు కాదనే ఉదాసీనతతోనే వుంది. మొన్న సైబరాబాద్ చేధించిన పదిహేనవేల మంది యువతుల కు వారి చదువులను బట్టి వారికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు యిచ్చి వారికి పునరావాసాలు కల్పించాలి ప్రభుత్వాలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.