జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-6 

   -కల్లూరి భాస్కరం

          వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతాల్లో తరచు కనిపించే ఘట్టాలలో దేవాసుర సంగ్రామాలు ఒకటి. ఆ యుద్ధాల సందర్భంలో ఆయుధాల ప్రస్తావన వస్తూ ఉంటుంది. కాస్త శ్రద్ధగా గమనిస్తే ఈ ఆయుధాలు తమవైన ఒక పరిణామ చరిత్రను బోధిస్తూ ఉంటాయి. ఆర్థికంగా, సాంస్కృతికంగా, నాగరికంగా వివిధ జనాల మధ్య ఉన్న అంతరాలను కూడా చెబుతుంటాయి. ఉదాహరణకు, మహాభారతం, ఆదిపర్వంలో చిత్రించిన దేవాసుర సంగ్రామాన్నే తీసుకోండి. క్షీరసాగరమథనంలో పుట్టిన అమృతం అసురుల చేతికి చిక్కకుండా చూడడానికి దేవతలు ప్రయత్నిస్తారు. అందుకోసమే విష్ణువు మోహినీ అవతారమెత్తి అసురులను మోసగిస్తాడు. మోసం తెలుసుకున్న తర్వాత అసురులు దేవతలతో యుద్ధానికి దిగుతారు.

చక్రం, ప్రాసం, కుంతం, తోమరం

          ఆ సందర్భంలో ప్రస్తావనకు వచ్చిన ఆయుధాలు ఇవీ: చక్రం, ప్రాసం, కుంతం, తోమరం, శక్తి, పట్టిసం, పరిఘ, ఖడ్గం, గద, విల్లు. వీటిలో ‘ప్రాసం’ అనే మాటకు ఈటె, బల్లెం, శూలం అనే అర్థాలు ఇచ్చారు. ‘కుంతం’ అనే మాటకు ఈటె, బల్లెం అనే కాకుండా బాణమనే అర్థం కూడా ఇచ్చారు. ‘తోమరం’ అనే మాటకు బల్లెమనే అర్థంతో పాటు చిల్లకోల, ఇనపగద(iron club) అనే అర్థాలు ఇచ్చారు. ‘శక్తి’ అనే మాటకు కూడా బల్లెం, ఈటె అనే అర్థాలతోపాటు ‘విసిరే కత్తి’ అనే అర్థం ఇచ్చారు. ఇక ‘పట్టిసం’ అంటే అడ్డకత్తి అనీ; ‘పరిఘ’ అంటే చుట్టూ ఇనప ముళ్ళు ఉన్న గద అనీ, చుట్టూ పదునున్న కత్తి అనే అర్థాలు ఇచ్చారు. ఈ అర్థాలలో స్పష్టత లోపించిన సంగతీ అర్థమవుతూనే ఉంది. స్థూలంగా చెప్పుకుంటే, ఇవన్నీ ఒకనాటి ఆయుధాలను సూచిస్తాయి. మహాభారతంలోనే ఖాండవదహన ఘట్టంలో, ముసలం(రోకలి), గండ్రగొడ్డలి అనే మరో రెండు ఆయుధాల ప్రస్తావన వస్తుంది.

ఆయుధబలంలో అసమానతలు

          అయితే ఇవన్నీ దేవతల ఆయుధాలు మాత్రమే, అసురులు రాళ్ళతోనూ, చెట్లతోనూ యుద్ధం చేశారు. దేవతల మధ్యలో వచ్చి కూర్చున్న రాహువు కంఠాన్ని విష్ణువు చక్రంతో ఖండించడాన్నీ, అతని దగ్గర ఉన్న ఇతర అస్త్రశస్త్రాలనూ చూసి అసురులు భయ భ్రాంతులయ్యారట. విష్ణువు(నారాయణుడు) చక్రంతో చాలా మంది అసురులను చంపేశాడు. నారాయణునితోపాటు నరుడు కూడా యుద్ధంలోకి అడుగుపెట్టి ‘బంగారు బాణా’లతో పర్వత శిఖరాలను కూడా కూల్చేశాడు. ఆయుధాల పరంగా చూస్తే అది సమానుల మధ్య జరిగిన యుద్ధం కాదు. కనుక అసురులు ఓటమిని అంగీకరించి పారిపోయి పాతాళంలోనూ, సముద్రంలోనూ దాక్కున్నారు. 

ఖాండవదహనంలో అర్జునుడే ‘హీరో’

          మహాభారతంలో కృష్ణార్జునులు ఖాండవ వనాన్ని దహించడం ఇంకో ప్రసిద్ధఘట్టం. అప్పుడు వారికి, దేవతలకు మధ్య యుద్ధం జరుగుతుంది. పలకడానికి బాగుండదు కనుక ‘అర్జునకృష్ణు’లన లేదు కానీ, ఈ ఘట్టంలో హీరో అర్జునుడే, కృష్ణుడిది అతనికి సహాయకుడి పాత్రే. అగ్నిదేవుడు ఆ సమయంలో అర్జునుడికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ వరుణదేవుని ప్రార్థించి తెప్పించిన గాండీవాన్ని, ఎప్పటికీ తరగని అమ్ముల పొదిని, దివ్యాశ్వాలను పూన్చిన, కపిధ్వజం కలిగిన గొప్ప రథాన్ని ఇచ్చాడు. వీటినే వివిధ ఉపమానాలతో, ఉత్ప్రేక్షలతో కవి వర్ణిస్తాడు. ఆ రథాన్ని మొదట అర్జునుడే అధిరోహిస్తాడు. అర్జునుని ‘సిఫార్సు’ మీదే ఆ తర్వాత కృష్ణునికి అగ్ని చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గదను ఇస్తాడు. ఇక దేవతల్లో ఇంద్రుడు వజ్రాయుధంతోనూ, యముడు కాలదండంతోనూ, కుబేరుడు గదతోనూ, వరుణుడు పాశంతోనూ, కుమారస్వామి శక్తి అనే ఆయుధంతోనూ, జయుడు రోకలితోనూ, త్వష్ట పర్వతాన్నే ఆయుధంగా చేసుకునీ, మృత్యుదేవత గండ్రగొడ్డలితోనూ, అర్యముడు ముళ్ళగదతోనూ, మిత్రుడు చక్రంతోనూ; ఇంకా అనేక మంది దేవతలు అనేక ఆయుధాలతోనూ యుద్ధానికి దిగుతారు. దేవతల్లో నలుగురు మాత్రమే ధనుస్సును పట్టుకుంటారు.

నరునికి గాండీవం, నారాయణునికి చక్రం

          అర్జునుడికి గాండీవాన్ని, రథాన్ని ఇచ్చి కృష్ణుడికి చక్రాన్ని, గదను ఇవ్వడం ఒక కోణంలో అర్థవంతంగానే కనిపిస్తుంది. అర్జునుని నరునిగానూ, కృష్ణుని నారాయణుడనే దేవతగానూ మహాభారతం పరిచయం చేస్తోంది కనుక అర్జునుని చేతిలో అప్పటికి అత్యాధునికమైన వింటిని ఉంచితే; దేవతల్లో చేర్చిన కృష్ణుని చేతిలో చక్రం, గద లాంటి పురాతన ఆయుధాలు ఉంచారన్నమాట. పైన పేర్కొన్న దేవతల చేతుల్లో ఉన్నవి కూడా ఆ రెండింటితోపాటు, అలాంటి ఇతర పురాతన ఆయుధాలే.

అన్నసాధనాలే మారణాయుధాలు

          ఈ ఆయుధాల పరిణామక్రమాన్ని ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ అనే పుస్తకంలో కొంత స్పృశించాను. సంగ్రహంగా చెప్పుకుంటే, మారణాయుధాలుగా పురాణాలకెక్కిన అనేక ఆయుధాలు మొదట్లో అన్నసంపాదన సాధనాలుగానే పుట్టినట్టు కనిపిస్తుంది. ఉదాహరణకు, త్రిశూలం చేపలు పట్టుకోడానికి ఉద్దేశించిన సాధనం అంటారు రాంభట్ల కృష్ణమూర్తి, తన ‘వేదభూమి’ అనే రచనలో. త్రిశూలమంటే మూడు కొనలూ పైకి ఉండేది కాదు; ఒక కొన వెనక్కీ, రెండు కొనలు ముందుకీ ఉండేది. అలాంటిదే చేపలు పట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. పాశం కూడా చేపల్ని పట్టుకోడానికి ఉద్దేశించినదే. ఇక మూలమట్టంగా ఉన్న కొయ్యను చక్రంగా మలచుకుని జంతువుల మీద ప్రయోగించేవారు. అది గురి తప్పితే విసిరినవాడి చేతికే తిరిగి వస్తుంది. తెలుగులో దీనిని ‘వలరి’ అనీ, తమిళంలో ‘వలయత్తడి’ అని అన్నారు. ఆస్ట్రేలియా ఆదివాసులు ‘బూమరాంగ్’ అన్నారు. అలాగే ఆదిమానవుడు ముడి గల చెట్టుకొమ్మను గదగా మలచుకున్నాడు.

విల్లమ్ములకు మంత్రాలూ, మహిమలూ అందుకే

          విల్లమ్ముల విషయానికి వస్తే, అవి శావేజి తృతీయదశలో పుట్టాయని రాంభట్ల అంటారు(లూయీ హెన్రీ మోర్గన్ ప్రాక్చరిత్రను శావేజి, బర్బర అనే రెండు మహాదశలుగా విభజించాడు. మళ్ళీ ఒక్కొక్క దశను మూడేసి అంతర్దశలుగా విభజించాడు). విల్లమ్ములు చాలా సంక్లిష్టమైన యంత్ర సాధనాలని, వేల సంవత్సరాల అనుభవం రాశి పడిన తర్వాతే ఈ గుణాత్మక నైపుణ్యం అలవడిందని కూడా ఆయన అంటాడు. మిగతా ఆయుధాలు ముఖాముఖి యుద్ధానికి మాత్రమే పనికొస్తాయి, వాటిలో ప్రాణాలకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది.  చక్రం లాంటివి కూడా దగ్గరగా ఉన్న శత్రువు మీదికి ప్రయోగించడానికే అనువుగా ఉంటాయి. విల్లమ్ములు అలా కాదు; అవి దూరంగా ఉన్న శత్రువును కూడా కొట్టగలగడమే కాదు, చాటు నుండి కూడా కొట్టగలుగుతాయి కనుక వాటిని తొలిగా ప్రయోగించేవారి ప్రాణాలకు ముప్పు తక్కువ. రామాయణంలో వాలి, సుగ్రీవులు చెట్లతోనూ, రాళ్ళతోనూ, మహా అయితే గదలతోనూ యుద్ధం చేస్తుంటే, రాముడు చెట్టుచాటు నుంచి బాణం ప్రయోగించి వాలిని చంపడం పురాతన, ఆధునిక ఆయుధాల మధ్య నున్న తారతమ్యాలను స్పష్టంగా చెబుతుంది. మిగతా ఆయుధాలకు భిన్నమైన ఇలాంటి లక్షణాలు ఉండడం వల్లనే విల్లమ్ములకు మంత్రాలు, మహిమలు ఆపాదించినట్టు కనిపిస్తుంది. అది నేటి అణ్వస్త్రాలతో వాటిని పోల్చేవరకూ వెళ్లింది. 

          సురవరం ప్రతాపరెడ్డిగారు ‘రామాయణ విశేషములు’ అనే రచనలో ఆయుధాల మధ్య ఉన్న ఈ తేడా గురించి రాస్తూ, ఆర్యులే ధనుర్విద్యలో ప్రవీణులైనట్టు కనిపిస్తుందని, రావణుడు కూడా విల్లమ్ములతో యుద్ధం చేసినట్టు చెప్పినా అది కల్పన కావచ్చని అంటారు.  పైన చెప్పిన దేవతలు కొందరు విల్లమ్ములతో యుద్ధం చేశారని చెప్పడం కూడా అలాంటిదే కావచ్చు.

నేటి క్షిపణులతో విల్లమ్ములకు పోలిక

          నాటి విల్లమ్ముల సాంకేతికతను నేటి అత్యాధునిక క్షిపణి(missile) సాంకేతికతతో పోల్చవచ్చు. విల్లమ్ముల్లానే క్షిపణులు దూరంగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలుగుతాయి. వాటిలో కొన్నింటికి కొన్ని అడుగుల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల రేంజి ఉంటే; కొన్నింటికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల రేంజి ఉంటుంది. ఈ రోజున క్షిపణిరంగంలో ఆయాదేశాల మధ్య ఉన్న పోటీ తెలిసినదే. ఆ నాడు రాముడు చెట్టుచాటు నుంచి వాలిని చంపడం ధర్మమా, అధర్మమా అన్న చర్చ వచ్చి ఉండచ్చు కానీ; ఇప్పుడు అలాంటి చర్చకు అవకాశమే లేదు. ఎంత దొంగదెబ్బ తీయగలిగితే అంత గొప్ప.

          మరోసారి మహాభారతానికి వస్తే, బల్లేన్ని ప్రయోగించడంలో సిద్ధహస్తుడని పించుకున్న ధర్మరాజు కానీ, గదా యుద్ధంలో నేర్పరులైన భీమ, దుర్యోధనులు కానీ; ఖడ్గవిద్యలో నేర్పరి అనిపించుకున్న నకులుడు కానీ హీరోలుగా గుర్తింపు పొందలేదు. ధనుర్విద్యలో నిపుణులు కనుకనే పాండవుల పక్షంలో అర్జునుడికి, కౌరవుల పక్షంలో కర్ణుడికి ఇంకెవరికీ లేని గుర్తింపూ, ప్రాధాన్యం లభించాయి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి మీద ధర్మరాజు, కర్ణుడి మీద దుర్యోధనుడు ఎలా ఆశలు పెట్టుకున్నారో, ఎలా ఆధారపడ్డారో తెలిసినదే. ఆనాటికి ధనుర్బాణాలు ప్రతిష్ఠను పెంచేవి కనుకనే కాబోలు పరశురాముని చేతిలో కూడా వాటిని ఉంచి భీష్ముడికీ, కర్ణునికీ గురువును చేశారు. నిజానికి ఆయన ఆయుధం గొడ్డలి అన్న సూచన ఆయన పేరు(పరశువు)లోనే ఉంది.

***

          కిందటిసారి ప్రస్తావించుకున్న డేవిడ్ డబ్ల్యు. ఆంథోనీని ఒకసారి పలకరిస్తే, పురాతనకాలపు ఆయుధాల గురించిన ఈ పూర్వరంగం ఎందుకు ఇవ్వాల్సివచ్చిందో, ప్రస్తుత సందర్భానికీ దీనికీ సంబంధమేమిటో అర్థమవుతుంది. క్రీ.పూ. 5200 నుంచి 5000 సంవత్సరాల క్రితం పాంటిక్-కాస్పియన్ స్టెప్పీలలోని(నల్లసముద్రం ఉత్తరతీరం నుంచి కాస్పియన్ సముద్రం ఉత్తరప్రాంతం వరకూ వ్యాపించిన స్టెప్పీలను ఇలా పిలుస్తారు) ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష మాట్లాడే జనంలో అధినాయకులు ఎలా అవతరించారో ‘గోవులు-రాగిలోహం-అధినాయకులు(Cows, Copper, and Chiefs)’ అనే ఉపశీర్షిక కింద ఆయన వివరిస్తాడు.

నాయకులు-అనుచరుల అవతరణ

          అప్పటికి పశువులు, గొర్రెలు, మేకల పెంపకం మొదలైంది. రవాణాసాధనంగా గుర్రం అందుబాటులోకి వచ్చింది. అశ్వసంపద ఉన్నవాడు, అది లేని జనంతో పోల్చితే ఎక్కువ పశుసంపదను ఎలా పెంచుకోగలిగాడో, దాంతో జనాల మధ్య రకరకాల అంతరాలు ఎలా ఏర్పడ్డాయో కిందటి భాగంలో చెప్పుకున్నాం. సామాజికమైన హోదాలను, అధికారిక పదవులను ఈ ప్రోటో-ఇండో-యూరోపియన్ జనమే వ్యవస్థీ కరించారు. నాయకులు-అనుచరులన్న తేడా; నాయకులపట్ల అనుచరులు విధేయత చూపడం; నాయకులు విందు-వినోదాలతో, కానుకలతో అనుచరులను  సంతోష పెట్టడంతో పాటు, తమ సంపదను ఆడంబరంగా, అట్టహాసంగా ప్రదర్శించుకోవడం వంటి పరిణామాలు వచ్చాయి.

రాతి గదాధరులు

          ఈ నాయకులు అనేక కటిబంధాలు(నడుముకు పెట్టుకునే బెల్టులు)ధరించేవారు, మెరుగు పెట్టిన గవ్వలు, ఎముకలు, గుర్రపు దంతాలు వగైరాలతో చేసిన దండలు; పంది కోరలతో చేసిన టోపీ ధరించేవారు; దుస్తులకు కూడా పందికోరలతో మలచిన ఫలకాలను అలంకరించుకునేవారు, మెరుగు పెట్టిన రాతి కంకణాలను, రాగి ఉంగరాలను ధరించే వారు. పచ్చిక భూముల పై ఆధిపత్యానికి పెరిగిన పోటీ ఘర్షణలకు దారితీయడంతో ఈ నాయకులే యుద్ధవీరులుగా అవతరించారు. ఈ యుద్ధాల తొలిదశకు చెందిన ఆనవాళ్ళు పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి. అవలా ఉంచితే,  ప్రస్తుతానికి మనకు అవసరమైన ముఖ్య వివరం-వీరి దగ్గర మెరుగు పెట్టిన రాతి తలలు కలిగిన గదలు ఉండడం! వీరు చనిపోయినప్పుడు వీరితోపాటు ఈ గదలతో సహా వీరి వస్తువులన్నింటినీ సమాధి చేసేవారు. పాంటిక్-కాస్పియన్ స్టెప్పీలలో పుట్టిన ఈ రాతిగదలు, ప్రాచీన యూరప్ లోకి ఎలా విస్తరించాయో డేవిడ్ ఆంథోనీ సచిత్రంగా చూపించాడు. ఈ గదల తలలను గుర్రపు తల ఆకారంలో మలచడం కనిపిస్తుంది.

          ఈ రాతిగదలతో పాటు ప్రోటో-ఇండో-యూరోపియన్ తాలూకు సంస్కృతీ, మత పరమైన విశ్వాసాలూ, హింసతో కూడిన ఇతర జీవన విధానాలూ యూరప్ లోకి వ్యాపించడంలో, మనం కిందటి భాగంలో చెప్పుకున్న యామ్నాయ ముఖ్యపాత్ర పోషించింది. అదే యామ్నాయ ఇటు తూర్పున మనవైపునకు కూడా వాటిని వ్యాపింప జేసింది.

సింటాష్ట సమాధుల్లో రథాలు, బల్లెపు సూచిలు

          ప్రోటో-ఇండో-యూరోపియన్లకు సంబంధించి పురాతత్వ పరంగా ప్రాముఖ్యమున్న ప్రదేశాలలో సింటాష్ట(Sintashta) ఒకటి. ఇది రష్యాలోని ఉత్తరపు స్టెప్పీలలో, ఉరల్ పర్వతాలకు తూర్పుగా ఉన్న ఒక జనావాసం. ఆ పేరుతో ఒక నది కూడా ఉంది. చుట్టూ రక్షణ వ్యవస్థను ఏర్పరచుకున్న ఈ జనావాసం ఆ నాడు లోహపరిశ్రమ కేంద్రం కూడా. ఇక్కడి సమాధుల్లో అత్యంత ప్రాచీనకాలానికి చెందిన రథపు అవశేషాలూ, గుర్రం లాగే ఒక తేలికరకం రథమూ బయటపడ్డాయి. ఇక్కడే ఎనిమిది గుర్రాలను బలిచ్చిన ఆనవాళ్ళతోపాటు కొన్ని కొత్త రకం ఆయుధాలు కనిపించాయి. వాటిలో బల్లేనికి తగిలించే పొడవైన సూచులు ఉన్నాయి. ఈ జనావాసాన్ని, ఇక్కడి సమాధులను క్రీ.పూ.2100-1800 మధ్యకాలానికి చెందినవిగా అంచనా వేశారు.  ఇవన్నీ పెరిగిన ఘర్షణల స్థాయిని సూచిస్తాయని డేవిడ్ ఆంథోనీ అంటాడు.

విల్లమ్ములతో తొలి యుద్ధాలు పశ్చిమాసియాలో

          స్టెప్పీ రథాలు బల్లెంతో యుద్ధం చేయడానికే ఎక్కువ అనుకూలంగా ఉండేవి. బల్లేనికి సరిపోయే పొడవైన సూచిలు సింటాష్ట సమాధుల్లో ఎక్కువ సంఖ్యలో కనిపించాయి. ఈ సమాధుల్లో పాతిపెట్టిన రథాల పక్కనే నడుముకు తగిలించుకునే లోహపు కటారులు(daggers), లోహపు గొడ్డళ్ళు, కాడ దూర్చడానికి రంధ్రమున్న లోహపు గొడ్డళ్ళు ఉన్నాయి. అయితే, స్టెప్పీల నుంచి పశ్చిమాసియాకు రథసాంకేతికత విస్తరించింది మాత్రం క్రీ.పూ.1800 తర్వాతేనన్న డేవిడ్ ఆంథోనీ, రథికయోధులు విల్లమ్ములు ఉపయోగించడం కూడా పశ్చిమాసియాలోనే మొదలైనట్టు కనిపిస్తుందని- ఇంకొక ముఖ్యమైన సూచన చేస్తాడు. 

          మొత్తానికి పై సమాచారం మొత్తంలో రాతిగదలతో మొదలు పెట్టి, బల్లేలు, కటారులు మీదుగా విల్లమ్ముల వరకూ జరిగిన పురాతన ఆయుధాల పరిణామక్రమం స్థూలంగా కళ్ళకు కడుతుంది. అర్జునుడి గాండీవమూ, దివ్యాశ్వాలను పూన్చిన రథాల ‘తొలి చిరునామా’ ఏదో కూడా స్పష్టంగా తెలుస్తుంది.

***

          యామ్నాయ సంస్కృతీవ్యాప్తి జన్యుపరమైన మార్పులను ఎలా తీసుకొచ్చిందో డేవిడ్ రైక్ వివరిస్తాడు. ఈ జన్యుపరమైన మార్పులు ఇంత నాటకీయంగా వెల్లడవుతాయని, 2015లో ప్రాచీన DNA సమాచారం విస్ఫోటించడానికి ముందు ఎవరూ ఊహించలేదని ఆయన అంటాడు. నేటి యూరప్ జనంలో కనిపించే జన్యువారసత్వ మిశ్రమంతో జనాభాను సృష్టించడానికి తొలినాటి యూరప్ వ్యవసాయజనానికి, వేట-ఆహారసేకరణ జనానికి ఏ రకమైన జన్యువారసత్వాన్ని కలపాల్సి ఉంటుందో సరిగ్గా అదే జన్యువారసత్వాన్ని యామ్నాయ అందిస్తోందని ఆయన అంటాడు. యామ్నాయ జనం తమ వెనకటి జనాభాల నుంచి ఎలా రూపొందారో కూడా ప్రాచీన DNA సమాచారం స్పష్టంగా వెల్లడిస్తోందని కూడా ఆయన అంటాడు.

4 డిసెంబర్ 2021..కల్లూరి భాస్కరం

(కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా కన్నుమూసిన సీనియర్ జర్నలిస్టు షేక్ అబ్దుల్ కరీం గారితో నాకు ఫేస్ బుక్ ద్వారానే పరిచయం. ఆయన నా రచనల్ని అభిమానించేవారు. కొన్ని షేర్ కూడా చేశారు. ఆయన పుట్టినరోజున నేను కూడా శుభాకాంక్షలు తెలిపాను. అంతలోనే అదే రోజున ఆయన కన్నుమూసినట్టు తెలిసి చాలా షాకయ్యాను, ఎంతో బాధ పడ్డాను. ఈ వ్యాసపరంపరలోని ఈ చిరుభాగాన్ని ఆయన స్మృతికి అంకితం చేస్తున్నాను. –కల్లూరి భాస్కరం)

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.