అనుమకొండ కైఫియత్

పుస్తకాలమ్’ – 15

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

అనుమకొండ కైఫియత్ – కొంత అడ్డదిడ్డంగా మా ఊరి గాథ

          ఈ వారం రాస్తున్నది అందుబాటులో ఉన్న అచ్చయిన పుస్తకం గురించి కాదు. రెండువందల సంవత్సరాల క్రింద, 1816లో రాసిన ఆ పుస్తకం ఇప్పటికీ ఇంకా చేతిరాత దస్తావేజుగానే ఉన్నది. శిథిలమైపోతున్న పాత కాగితాల నుంచి 1942-43ల్లో ఎత్తిరాసిన ప్రతికి డిజిటల్ రూపం, లేదా 1970ల్లో దాని నుంచి తయారైన మైక్రో ఫిల్మ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పాత, అరుదైన పుస్తకాల బంగారు గని మా కోదాడ బంగారు రామాచారి గారు నాలుగు నెలల కింద నా పుట్టినరోజు కానుకగా ఆ విలువైన పుస్తకపు సాఫ్ట్ కాపీ పంపారు. అది అనుమకొండ కైఫియత్. మా ఊరి గాథ.

          ఇప్పుడంటే జిల్లాలు మారిపోయి స్థానికతా అస్థిత్వమూ సందేహంలో పడ్డాయి గాని, ఎప్పటికైనా వరంగల్ వాణ్ని అని చెప్పుకోవడమే అనేక కారణాల వల్ల నాకు గర్వం. నా బాల్య, కౌమార, తొలి యవ్వనాలు అక్కడే గడిచాయి. నాకు మాటలూ అక్షరాలూ పనులూ నేర్పినదీ, నా వ్యక్తిత్వానికి పునాది వేసినదీ వరంగల్లే. జిల్లా అని మాత్రమే కాదు, ఎనిమిదో తరగతికి వచ్చినప్పటి నుంచి డిగ్రీ దాకా తొమ్మిదేళ్లు బడి చదువులు చెప్పినదీ, సమస్త జీవితానికీ బతుకు చదువులు చెప్పినదీ హనుమకొండ-వరంగల్లులే. హనుమకొండ అగ్గలయ్య గుట్ట నీడలోనే, ప్రతిరోజూ కొండకు చెక్కిన జైన విగ్రహాలను చూస్తూనే పెరిగాను. పదిహేడు-పద్దెనిమిదేళ్ల వయసులో నా కంటె చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ప్రతి రోజూ వెళ్లిన ఇళ్లు హనుమకొండ పాతకోట ద్వారం దగ్గరే ఉండేవి. ఇంటర్మీడియట్ లో మిత్రులం కాలేజీ ఎగ్గొట్టి పద్మాక్షి గుట్ట ఎక్కి కూచునేవాళ్లం. అమరులైన ఎందరో మిత్రులు నాకు ఆ ఊరు ఇచ్చిన వారే. మా అమ్మను శాశ్వత నిద్రలో చివరిసారి చూసి, ప్రకృతిలో లీనం చేసినది ఆ పాతకోట ప్రాంగణంలో, పద్మాక్షి గుట్ట కింద అప్పుడు ఉండిన బీడు భూమిగా ఉండిన శ్మశానం లోనే. ‘ఇటు చివర కాంచీట్ నుంచి అటు చివర లేబర్ కాలనీ దాకా ప్రతి ఇసుక రేణువునూ నా పాదాలు ముద్దాడాయి’ అని ఎప్పుడో ముప్పై ఏళ్ల కింద వరంగల్ మీద కవిత్వం రాశాను. అట్లా అనేక కారణాల వల్ల హనుమకొండ-వరంగల్ అంటే ఒళ్లు పులకించిపోతుంది. అటు వంటి అనుమకొండ-ఓరుగల్లు మీద కైఫియత్ అంటే ప్రాణం లేచివచ్చింది.

          రెండువందల సంవత్సరాల కిందటి పాత భాషలో, గొలుసుకట్టు రాతలో ఉన్న ఆ పుస్తకం చదవడం కాస్త కష్టం. అయితే ఎంత ఆశక్తితో చదివానో అంత విచారానికి కూడ లోను చేసిన పుస్తకం అది. మనకు చరిత్ర స్పృహ లేదనే మాటను మరొకసారి రుజువు చేసిన పుస్తకం అది. కఠోర వాస్తవం ఉండవలసిన చోట అభూత కల్పనలూ, అతీత ఊహల మిథ్యలూ రాజ్యం చేయడమే, పుక్కిటి పురాణాలు కల్పించడమే చరిత్ర రచనకు మనం ఇచ్చుకున్న అర్థమని మరొకసారి తెలియజెప్పిన పుస్తకం అది. అట్లని ఆ పుస్తకం మొత్తానికి మొత్తం కొట్టేయదగినదనీ అనలేను. రచయిత రాసిన కాల్పనిక, పురాణ, మానవాతీత భావనలను అధిగమిస్తూ ఆ రచనలోకి కూడ కొన్ని వాస్తవాలు, కొంత చరిత్ర, కొన్ని వాస్తవ మానవ సంవేదనలు ప్రవహించాయి.

          ప్రతి జనావాసానికీ సామూహిక జ్ఞాపకాల గాథలుంటాయి. బ్రాహ్మణీకరించి, మిథ్యామయం చేసి స్థలపురాణం అనవచ్చు, సామాజిక శాస్త్రాల భాషలో స్థానిక చరిత్ర అనవచ్చు, మామూలు భాషలో జానపద గాథ అనవచ్చు. ఏదైనా పూర్తి చరిత్రా కాదు, చారిత్రకాంశాలు కొద్దో గొప్పో లేకుండానూ పోదు. రాసినవారి, రాయించినవారి, ప్రాబల్యంలో ఉన్నవారి దృక్పథాన్ని బట్టి ఆ సామూహిక జ్ఞాపకాలకు చేర్పులూ మార్పులూ మసిపూసి మారేడుకాయ చేయడాలూ, లేనిది ఉన్నట్టూ ఉన్నది లేనట్టూ చెప్పడాలూ జరుగుతుంటాయి. అటువంటి గాథలను తప్పనిసరిగా చరిత్రకు ఒకానొక ఆధారంగా తీసుకుంటూనే, అందులోని అంశాలను ఇతర ఆధారాలు ఎంతవరకు బలపరుస్తాయో, తోసివేస్తాయో చూసుకోవలసి ఉంటుంది. కైఫియత్తులు అటువంటి సామూహిక జ్ఞాపకాల గాథల స్థానిక చరిత్రలు, ఆసక్తిదాయక వృత్తాంతాలు, సమాచార పట్టికలు.

          అటువంటి కైఫియత్తుల రచన, సేకరణ కర్నల్ కాలిన్ మెకంజీ (1754-1821) అనే స్కాటిష్ పరిశోధకుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి, మొదటి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో బ్రిటిష్ పాలనలో ఉన్న అన్ని తెలుగు జిల్లాలలో జరిగింది. ఆయన కృషి ప్రధానంగా దక్షిణ భారతదేశంలో, కొంతవరకు మొత్తం దేశమంతటా, బర్మాలో, జావాలో కూడా జరిగింది. మొత్తంగా ఎనిమిది వేల శాసనాలు, ఆరు వేల నాణాలు, పదిహేనువందల గ్రంథాల రాత ప్రతులు, రెండువేలకు పైగా గ్రామ చరిత్రలు, రెండు వేల జానపద గాథలు, దాదాపు మూడు వేల చిత్రాలు, చిత్రపటాలు, దాదాపు నూట యాబై శిల్పాలు సేకరించాడని సమాచారం. అదంతా మరొకసారి గాని, ఇప్పుడిక్కడ తెలుగు కైఫియత్ ల సంగతి మాత్రమే మాట్లాడుకుందాం.

          మెకంజీ సేకరించిన, రాయించిన కైఫియత్ లు మొత్తం రెండు వేల రెండు వందల దాకా ఉన్నాయని అంతకు ముందరి రచనలు చెపుతుండగా, తెలుగు కైఫియత్తులు రెండు వేల ఇరవై ఎనిమిది ఉన్నాయని నడుపల్లి శ్రీరామరాజు గారి సమగ్రమైన పరిశోధన (మెకంజీ కైఫియత్తుల సూచి, నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్, 2019) తెలియజేసింది. వాటిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల కైఫియత్తులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ 1990-2010 మధ్య ప్రచురించింది. సిపి బ్రౌన్ పరిశోధనా కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం 2006-2013 మధ్య కడపజిల్లా కైఫియత్ లు ఏడు సంపుటాలు ప్రచురించింది. నేను ‘ఊరిదారి’ రాస్తున్నప్పుడు ఈ ముద్రిత కైఫియత్తులను సంప్రదించాను. ఇటీవల బొల్లోజు బాబా గారు తూర్పు గోదావరి జిల్లా కైఫియత్తులు ప్రచురించారు. అయితే ఈ ప్రచురిత సంపుటాలన్నీ కలిసి కూడ, మెకంజీ సేకరించిన, రాయించిన కైఫియత్తులలో పదో వంతు కూడ కావు.

          ఆ మెకంజీనే అప్పటి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యానికి కూడ ఆహ్వానించింది. ఆయన హైదరాబాదు రాజ్యంలో ఎన్నో ఇతర పనులు చేయడంతో పాటు తన గుమస్తా నారాయణరావు చేత అనుమకొండ కైఫియత్ కూడ రాయించాడు. నారాయణ రావు డిసెంబర్ 1815 నుంచి డిసెంబర్ 1816 వరకు, మళ్లీ 1818 జనవరి నుంచి మార్చి వరకూ పరిశోధన కోసం హైదరాబాద్ దేశం (హైదరాబాద్ కంట్రీ) లో పర్యటించి, మూడు పర్యటన నివేదికలు సమర్పించాడని మెకంజీ కలెక్షన్స్ లోనే ఆధారాలున్నాయి. అనుమకొండ కైఫియత్ లోనే చిట్టచివర “నారాయణ రావు గుమాస్తా యిలాకే కర్నల్ కాలిన్ మెక్కెంజీ సర్వేయర్ ఆనరల్ అనుమకొండ వోరుగంటిలో దరియాప్తి చేశి వ్రాశినది. బ (?) తారీఖు 20 నవంబర్ 1816 ఈసవి ముతాబకు శాలివాహన శక వరుషంబులు 1038 ధాత నామ సంవత్సర కార్తీక బ 30” అని ఉంది. ఆ నారాయణరావు ప్రతి శిథిలమవు తుండగా 1942-43లో టెంపరరీ కాపీయిస్టు కె. శేషాచార్లు రాసిపెట్టిన ప్రతి సాఫ్ట్ కాపీ ఇప్పుడు అందుబాటులో ఉంది.

          పుస్తకంలోని అనేక గందరగోళాలతో పాటు మరొక గందరగోళంగా, ఈ 186 పేజీల సాఫ్ట్ కాపీలో వాస్తవంగా అనుమకొండ కైఫియత్ ఉన్నది 123 పేజీలు మాత్రమే. అనుమకొండ కైఫియత్ అనే శీర్షికతో ఉన్న ఈ ప్రతిలోనే, అదే చేతి రాతతో 123 పేజీ మధ్య నుంచి 186 పేజీ వరకు “శ్రీ కల్యాణ పట్టణము యందు ప్రభుత్వం చేస్తూ వున్న జైన బిజ్జళరాయని వద్ద ప్రధానత్వం చేశిన దండ నాయక బసవేశ్వరుండును, యీతని మేనల్లుడైన చిన్న దండ నాయక చన్న బసవేశ్వరుండును ప్రధానత్వం చేశిన వివరమున్ను, వీరశైవ మత స్థాపన చేశినదిని కూన పాండ్యరాయని మొదలైన కథా వృత్తాంతం కన్నడంలో వుండగా తెలుగు చేశినది” కూడ కలిసి పోయింది!!

          ఇక మిగిలిన 123 పేజీల అనుమకొండ కైఫియత్ లో దాదాపు సగం అనవసరమైన, అభూత కల్పనలతో కూడిన సమాచారం నిండి ఉంది గనుక దీన్ని చాల జాగ్రత్తగా, ఓపికతో, సత్యాసత్య విచక్షణతో చదవవలసి ఉంటుంది.

          మొట్టమొదటి సమస్య ఈ కైఫియత్ రచనలో ఉపయోగించిన భాష. పందొమ్మిదో శతాబ్ది తొలిరోజుల భాషా వ్యవహారం, పాతపదాలు, విచిత్రమైన వాక్య నిర్మాణాలు, ప్రాచీన సంక్లిష్ట శైలి అని ఎంత సరిపెట్టుకున్నా మూల రచయిత లేదా ప్రతి రాసిన లేఖకుడి భాషా వినియోగంలో లోపాలున్నాయని చెప్పక తప్పదు. అనవసరమైన సున్నాలు, అంత అనడానికి “నంత్త” అనడం, వ్యథ అనడానికి “వెధ” అనడం, రా వత్తు బదులు పాత పద్ధతిలో “స్వన౯” అని, “మర౯బడి” రాయడం, కొమ్ముకు రావత్తు బదులు రుత్వం (ద్రు బదులు దృ) రాయడం వంటి విచిత్రాలెన్నిటినో భరించాలి. మరొక సమస్య రచయితకు గాని, లేఖకుడికి గాని పదాల మధ్య ఎడం ఉంచాలని తెలియదు. ‘రామునితోక పివరుండు’ లాగ తప్పు అన్వయం చెప్పుకోవడానికి, అపార్థానికి, అర్థం కాకపోవడానికి దారితీసే ప్రయోగాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఒక పేజి పొడవునా ఒకే వాక్యం కొనసాగి కర్త ఎవరో, కర్మ ఎవరో, క్రియలు ఎన్నెన్ని ఎవరెవరు చేశారో అర్థం కాని గందరగోళం ఉంది.

          అనవసరమైన సగాన్ని వదిలేస్తే, మిగిలిన సగంలో కూడ ఎన్నో విషయాలు ఎన్నోసార్లు పునరుక్తమయ్యాయి. ఉదాహరణకు వరుసగా మూడు నాలుగు వందల ఏళ్ల పాటు అనుమకొండను పాలించిన రాజులందరూ, ముత్తాత నుంచి ముని మనవడి దాకా “కటకం రాజు భల్లహుడి తల ద్రుంచి”, అతని కొడుకుకు పట్టం కడతారు. తులాపురుషం చేయడం, సహస్ర సువర్ణ పుష్పాలు, లక్ష సువర్ణ పుష్పాలు సమర్పించడం కొన్ని డజన్ల సార్లు వస్తాయి. ఎన్నో పుక్కిటిపురాణాలు, అనుమకొండకు, కాకతీయులకు సంబంధం లేని విషయాలు, కొన్నిచోట్ల అనవసరమైన సూక్ష్మ వివరాలు, కొన్నిచోట్ల అత్యవసరమైన వివరాలు కూడా లేకపోవడం, యుద్ధాలలో పాల్గొన్న గజ, తురగ, పదాతి దళాల సంఖ్యలు, రాజులు చేసిన పూజల వివరాలు విసుగు కలిగిస్తాయి. ఆ సందర్భాలలో చెప్పిన సంఖ్యలు కూడ ఎంత అసందర్భమైనవీ అతిశయోక్తులూ అంటే అక్కడ చెప్పిన జన సంఖ్యలూ, జంతువుల సంఖ్యలూ, ధనరాశి లెక్కలూ ఆ కాలానికి ఉండడానికి అవకాశమే లేదు. ఓరుగల్లు నగరంలో ఒక్కొక్క కులపు ఇళ్లు ఎన్ని ఉన్నాయో చెప్పిన లెక్క అంతా కలిపితే అప్పుడు ఆ పన్నెండో శతాబ్ది లోనే 3,86,000 ఇళ్లు ఉన్నాయని తేలుతుంది. అది నిజమైతే జనాభా పది, పన్నెండు లక్షలు ఉండి ఉండాలి. కాని 1901 జనగణన నాటికి వరంగల్ జనాభా ముప్పై రెండు వేలు, 2011 నాటికి ఎనిమిది లక్షలు. ఇళ్లు రెండు లక్షలకు మించవు. అంతకు ఒకటిన్నర రెట్లు ఎనిమిది వందల సంవత్సరాల కింద ఉండడం అసాధ్యం. విస్తీర్ణం రీత్యా చూసినా, ఇప్పటి వరంగల్ లో అప్పటి ఓరుగల్లు పదో వంతు కూడా ఉండి ఉండదు. కాకపోతే ఈ వివరమైన ఇళ్ల లెక్కలో అప్పుడు ఓరుగల్లులో ఉన్న అన్ని కులాల పేర్లు రాయడం సామాజిక చరిత్రకు అవసరమైన అంశం. అలాగే కొందరు బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, వేశ్యల పేర్లు కూడ రాశారు. అయితే ఈ సమాచారం పూర్తిగా పన్నెండో శతాబ్దిదే కాకపోవచ్చు. పందొమ్మిదో శతాబ్ది మొదట్లో రాస్తున్న రచయితకు తెలిసిన సమాచారం కూడ చొరబడి ఉండవచ్చు. 

          ఈ సమస్యలు అలా ఉంచి మూడు నాలుగు చోట్ల విషయం పక్కనే “ఇది సరి కాదు” అనే వ్యాఖ్యలు కూడ ఉన్నాయి. అంటే మొదటి రచయిత రాసిన దానిలో తప్పు ఉందని లేఖకుడు సవరిస్తున్నాడా, లేక మొదటి రచయితే మరొక వనరు నుంచి గ్రహించినది యథాతథంగా రాసి, దానిలో తప్పు ఉందని చూపుతున్నాడా అర్థం కాని పరిస్థితి ఉంది.

          ఇది ప్రధానంగా స్థానిక చరిత్ర పుస్తకం గనుక, మిగిలిన లోపాలన్నిటినీ పక్కనపెట్టి, చరిత్ర సంగతి చూద్దామన్నా ఇందులో ప్రకటించిన రాజుల పేర్లు, వాళ్ల కాలక్రమాలు ఊహాతీతంగా ఉన్నాయి. ఏ సాహిత్య, చారిత్రక, పురావస్తు, సమకాలీన లిఖిత, శాసన, నాణాల ఆధారాలతో నిర్ధారించడానికి వీలులేని, సరిపోలని, అసంభవనీయమైన అంశాలు ఎన్నో అడుగడుగునా తగులుతాయి. ఆ కాలపు రాజవంశాలన్నీ తమను తాము సూర్య వంశస్తులమనో, చంద్ర వంశస్తులమనో చూపుకోవడానికి, రాముడి నుంచీ, కృష్ణుడి నుంచీ, జనమేజయుడి నుంచీ తమ వంశధారను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. సరిగ్గా అట్లాగే ఈ అనుమకొండ కైఫియత్ కూడ పురాణ పురుషులెందరినో కాకతీయుల మూల పురుషులుగా చూపుతుంది. వాస్తవంగా అన్ని చారిత్రక ఆధారాల ప్రకారం కాకతీయ వంశ పాలన సాగినది 323 సంవత్సరాలు మాత్రమే కాగా, ఈ కైఫియత్ దాన్ని వెయ్యి సంవత్సరాల పాటు సాగిందని చెపుతుంది. దేశంలోని ఇతర రాజవంశాల ప్రముఖుల పేర్లు, అభూత కల్పనల పేర్లు జోడిస్తుంది. శ్రీమహావిష్ణువు నాభిలో జనించిన ధాత నుంచి సోమదేవుడి వరకు ఒక వంశావళి రాసి, అక్కడి నుంచి మాధవవర్మ అనే పాత్రను సృష్టించి, ఆ మాధవవర్మ అనుమకొండను ఏలిన మొదటి కాకతి వంశపు రాజు అని, ఆయన 160 ఏళ్లు పాలించాడని, అక్కడి నుంచి ప్రతాపరుద్రుడి వరకు వెయ్యి సంవత్సరాల “చరిత్ర కాలక్రమణిక” చెపుతుంది. వీటిలో ప్రతి రాజుకూ విశ్వసనీయత కల్పించడం కోసం శాలివాహన శక వరుషంబులు అని నిర్దిష్టమైన అంకెలు కూడ ఇచ్చారు.

          అసలు మొదటి ముప్పై పేజీల్లో పార్వతీ పరమేశ్వరుల వివాహం దగ్గరి నుంచి, మడికొండ హిడింబాశ్రమం నుంచి, అనుమకొండ సిద్ధేశ్వరాలయం దగ్గరి నుంచి, ఎరుక దేవరాజు కొడుకులైన అనుమడు, కొండడు అనే గాథ నుంచి, ఎన్నో అనవసర, అనుమానాస్పద అంశాలున్నాయి. తర్వాతి కాలంలో తిక్కన రాక గురించీ, పాల్కురికి సోమనాథుని మహిమల గురించీ, మొల్ల రామాయణానికీ, భాస్కర రామాయణానికీ పోటీ గురించి, మొల్ల రచన శూద్ర రచన అని ఆదరించక పోవడం గురించీ ప్రస్తావనలు కూడ ఉన్నాయి.

          అవి చిన్న లోపాలని పక్కన పెట్టినా, కైఫియత్ లో ఉన్న ప్రధాన అనుమానాస్పద అంశాల గురించి కాస్త జాగ్రత్త పడాలి.

          వోరుగల్లు ఒకటే రాయి, ఏకశిల నుంచి వచ్చిందని ఇప్పటిదాకా అనుకుంటుండగా, బండి చక్రాలు అక్కడ వోర బడ్డాయని అందువల్ల అది వోరగల్లు అయిందని కైఫియత్ అంటుంది. చాల వివాదాస్పదంగా రుద్రమదేవి గణపతిదేవుని భార్య అని ఈ కైఫియత్ రాసింది. ఏదో ఒకచోట పొరపాటున రాయడం కాదు, ఆ మాటను ఐదారుసార్లు రాసింది. గణపతిదేవుని మరణం తర్వాత వితంతువుగా ఆమె రాజ్యాధికారాన్ని చేపట్టిందని రాసింది. మార్కోపోలో కూడా ఈ మాట రాశాడు గాని అది తప్పు అని లిఖిత, సాహిత్య, శాసన ఆధారంగా నిర్ధారణ అయింది.

          అలాగే, గణపతి దేవునికీ రుద్రమ దేవికీ వుంమ్మక్క అనే కూతురు ఉందని, ప్రతాపరుద్రునికి పదహారు మంది కన్నెలతో పెండ్లి చేశారని, ప్రతాపరుద్రుడు దక్షిణాదినంతా జయించాడనీ, గుజరాష్ట్రం దాకా పశ్చిమ దేశాలను జయించాడనీ, ఆ పన్నెండు సంవత్సరాల దండయాత్రలలో భాగంగా ఢిల్లీకి, ప్రయాగకు కూడ వెళ్లాడనీ అతిశయోక్తులో, అర్ధసత్యాలో చాల ఉన్నాయి. ప్రతాపరుద్రునికి దేశదేశాల నుంచి వచ్చే కప్పాల జాబితా, ఓరుగల్లు రాజాస్థానంలో జరిగే ఖర్చుల జాబితా ఎంత విశ్వసనీయమో తెలియదు గాని వివరంగానే ఉన్నాయి.

          డెబ్బై ఏడుగురు వెలమ, పద్మనాయక కులస్తులు ఓరుగల్లు కోటకు ఉన్న డెబ్బై ఏడు బురుజులకు నాయకులని, యోధులని కైఫియత్ చెపుతుంది. మొదట శూద్రులే అయిన వెలమలు ఎట్లా ఆధిపత్య స్థానాలలోకి వచ్చారో వివరంగానే చెపుతుంది. అలాగే ఓరుగల్లు మీద ఢిల్లీ సుల్తానుల దాడి గురించి చారిత్రక వాస్తవాలూ అభూత కల్పనలూ కలిసిన వృత్తాంతం కొంత ఉంది. ప్రతాపరుద్రుడిని బంధించి ఢిల్లీ తీసుకుపోయారని, మంత్రి శివదేవయ్య మాయోపాయంతో విడిపించుకు వచ్చాడని, ఐతిహ్యంలో ఉన్న, ధ్రువీకరించడానికి వీలులేని గాథలు కూడ ఇందులో చేరాయి.

          కాకతి వంశ ప్రారంభకుడు మాధవవర్మకు దేవత పద్మాక్షి వెయ్యి సంవత్సరాల పాలనా వరం ఇచ్చిందని,  ప్రతాపరుద్రుని నాటికి అది ముగిసినందువల్ల కాకతీయ పాలన ముగిసిందని కైఫియత్ అంటుంది. ప్రతాపరుద్రుడు గోదావరిలో మునిగి శివైక్యం చెందాడనీ, ఆ తర్వాత ప్రతాపరుద్రుడి తమ్ముడు అన్నమదేవుడు రాజు కావలసి ఉండగా, అన్నమదేవుడు తనకు అధికారం వద్దని ప్రతాపరుద్రుని కొడుకు వీరభద్రయ్యకు పట్టం గట్టాడని అంటుంది. తర్వాత గజపతుల దండయాత్రలు, ఢిల్లీ సుల్తానుల తరఫున షితాబ్ ఖాన్ పాలన, కృష్ణదేవరాయల పాలన, ఖుతుబ్ షాల, ప్రత్యేకించి తానేషా పాలన, అప్పుడు జఫరుల్లా (ధంసా) దాడి, ఓరుగల్లును దోచి వేల్పుగొండ కోటను బలోపేతం చేసి, దానికి జఫర్ గడ్ అని పేరు పెట్టడం, తరవాత అసఫ్ జాల పాలన, ఈ కైఫియత్ రాస్తున్న సమయానికి నవాబు శికిందర్ జాహా వారి పాలన అన్నీ నాలుగైదు వందల ఏళ్ల చరిత్ర పది పన్నెండు పేజీల్లో చుట్టబెట్టేసింది. కొన్ని చోట్ల ముస్లిం వ్యతిరేకత కూడ స్పష్టంగా బైటపడుతుంది.

          అయితే ఈ కైఫియత్ లో జల్లెడ పడితే అక్కడక్కడ, ముఖ్యంగా  చివరి పది పేజీల్లో చాల విలువైన సమాచారం కూడా ఉంది. ఎన్నో శాసనాల గురించి, వాటి మీద రాసిన ఉన్న లేఖనాల గురించి ఆసక్తిదాయకమైన వివరాలు ఉన్నాయి. వరంగల్ కోటకు ఉన్న ఏడు వలయాల పూర్తి వివరాలు, 1816 నాటికి ఓరుగల్లు – అనుమకొండ స్థితి, వేయి స్తంభాల గుడి శిల్ప సౌందర్యం గురించి ఉంది. పాకాల చెరువు గురించి, రామప్ప (“గుండ్ల రామప్ప గుడ్లు”) చెరువు, అక్కడి దేవాలయాల గురించి రాసి, “ఆ మార్గమున చోరభయం ఉండడం వల్ల” తాను స్వయంగా అక్కడికి వెళ్లలేకపోయానని రాశారు. మడికొండ గుడి గురించి విన్నానని కాని ఆ ఊరిని “దేశాయి దోచినందువల్ల” ఆ ఊరు చూడలేకపోయానని రాశారు. మొత్తం మీద ఆ ప్రాంతంలో “జమిందార్ల ఉపద్రవం మెండుగా” ఉందని రాశారు. వోరుగంటి సర్కారులో ఉండే పదహారు పరగణాల పేర్లు, వోరుగంటి సర్కారులో ప్రసిద్ధి చెందిన చెరువులు, పండే పంటలు, పరిసర అరణ్యాలలో ఉండే మానవ సమూహాలు, వృక్షాలు, జంతువులు (“హనుమాద్రి కొండలో చిరతగండ్లు విస్తారం. అస్తమానం కాగానే గ్రామంలోకి వచ్చి పశువుల చంపుతున్నది. ఆ చిరతగండ్లు మనుష్యులనున్ను చంపేది కలదు. వోరుగంటి రాతి కోటలోనున్ను చిరత గండ్లు పెద్దపులులు రాకడ కలదు”), జంపుఖానాల తయారీ, నేత పని, అనుమకొండ-ఓరుగల్లులలో ప్రముఖుల పేర్లు, చుట్టుపట్ల అనేక గ్రామాల పేర్లు (కొండపర్తి, అయినవోలు, మొగలిచర్ల, వడ్డిపల్లి, మడికొండ, గణపురం, మంథెన, పోలవాస) వంటి 1816 నాటి వివరాలెన్నో కూడ ఈ కైఫియత్ లో ఉన్నాయి. “నూట యిరువది గుంజ వఖ తులము ఇట్టి తులంబులు నూట యిరువదిగూడ నొఖ వీశ యనబడు/ అట్టి వీశలు నూట యిరువై అయితే వఖ భారువ” వంటి ఆ కాలపు కొలమానం వివరాలూ ఉన్నాయి.

          “సంత్తూరను గ్రామంబున కృష్ణమాచార్యుల తంమ్ముండు అనంతాచార్యులు రజక స్త్రీతో కూడంగా ఆ రజకుడు యిద్దరిని పొడిచితె మృతంబైరి. అప్పుడు విపృలు యీ శూద్ర పీనిగెతో కూడ సమశిరి గనుక యా విపృలు మోయకుండిరి. అది విని కృష్ణమా చార్యులు తన మదిని విచారించి వాసుదేవ మూతి౯ని కీతి౯0చిన ఆ శవంబు తనంతకు తానే కాష్టంబునకు నడుచుటయు ఇది గని సకల జనంబులు విపృలు యేతెంచి కృష్ణమా చార్యుల పాదంబులకు ప్రణమిల్లి మా యపరాధంబులు క్షమియింపుమనుటయు” వంటి అభూత కల్పనల వెనుక దాగిన వాస్తవఘటనల సూచనలు కూడ ఉన్నాయి.

          వినుకొండ వల్లభరాయని పద్నాలుగో శతాబ్ది రచన ‘క్రీడాభిరామము’లో కూడా వరంగల్ వర్ణన ఉంది. వెల్చేరు నారాయణ రావు, డేవిడ్ షుల్మన్ కలిసి దాన్ని ‘ఎ లవర్స్ గైడ్ టు వరంగల్’ (పర్మనెంట్ బ్లాక్, 2002) అని ఇంగ్లిష్ కూడ చేశారు. అది సాహిత్య రచన కాగా, మరొక ఐదు శతాబ్దాల తర్వాతి ఈ ‘అనుమకొండ కైఫియత్’ భిన్నమైన ప్రక్రియకు సంబంధించినదైనా, లోపాలు ఉన్నప్పటికీ వరంగల్ ప్రేమికులూ మన సామాజిక చరిత్ర ప్రేమికులూ అందరూ తప్పనిసరిగా చదవవలసినది.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.