అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 2

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. కాలేజ్లో తన స్నేహితురాలు వసుంధర అక్కపెళ్ళిచేసుకుని ఆస్ట్రేలియా వెళ్లిన తరువాత,  అక్కడి ఫోటోలు చూపెట్టగానే, విశాల ఆస్ట్రేలియా చాలా బాగుందని ప్రశంసిస్తుంది.  విశాల మనస్సులో ఆస్ట్రేలియా సుందరమైన దేశం ఒక్కసారైనా వెళ్ళగలనా అనుకుంటుంది. తన తాతగారు ఇంటికి వచ్చి విశాలకు పెళ్ళి సంబంధం ప్రస్తావన తీసుకురాగానే, తండ్రి విశాలకు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టబోతున్నట్లు మామగారితో చెబుతాడు.

***

         విశాల చదువుతున్నది ప్రొఫెషనల్ కోర్స్ ఐనా ఆమెలో ఎక్కడా గర్వం అనేది మచ్చుకైనా కనిపించదు. పరీక్షలు రాసి, ఇపుడు నాలుగో ఏడు హార్టికల్చర్ బి.ఎస్సీ చదువుతోంది. బి.ఎస్సీ అగ్రికల్చర్ చదివేవారిని గ్రీన్ డాక్టర్స్ అంటారే, మనం మన కార్లమీద గ్రీన్ ప్లస్ పెట్టుకోవచ్చు అని భార్గవి వెయిటింగ్ రూమ్ లో ముచ్చట్లు పెట్టింది. ఇంతలో అక్కడికి జూనియర్స్ బ్యాచ్ వచ్చారు. ఐతే ఇక్కడ కాలేజ్ ర్యాగింగ్ అని కాక పోయినా సరదాగా సీనియర్స్, జూనియర్స్ ని చూడగానే ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నంగాఅపుడపుడు సీనియర్స్ ప్రశ్నలు అడగడం, దానికి జూనియర్స్ స్పోర్టివ్ గా సమాధానాలు చెప్పడం అక్కడ మామూలే. అపుడే అక్కడకు వచ్చిన రాధని చూడగానే భార్గవి, “ఏయ్, రాధా, ఒక పాట పాడవూ” అంది. వెంటనే రాధ, “ఆకులో ఆకునై, పూవులో పూవునై, ఈ రాజేంద్రనగర్ కాలేజ్ దాటిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా” అనగానే అందరూ చప్పట్లతో రాధను ప్రశంసించారు. విశాల జూనియర్స్ తో మాట్లాడుతూ, “మీకు ఫారెస్ట్రీ సబ్జెక్ట్ కి టెక్స్ట్ బుక్స్ ఉండవు. పరీక్షలు దగ్గరికి వచ్చినపుడు, మా దగ్గిర నోట్స్ తీసుకోండి” అని మంచి రోల్ మోడల్ గా వాళ్ళ దృష్టిలో తళుక్కుమని అక్కడనుంచి క్లాస్ కి వెళ్ళిపోయింది. విశాల అపుడపుడు పరీక్షలు దగ్గిర పడుతున్నపుడు ఇంటికి వెళ్ళ కుండా, హాస్టల్ లో ఉండిపోయి, చదువుకుంటుంది. అలా హాస్టల్ లో ఉన్నపుడు వివిధ రకాల మనుష్యుల మనస్తత్వాలను బాగా ఆకళింపు చేసుకుంది. సాయంత్రం కాగానే, హాస్టల్ బయట తోరణాల్లా వేళ్ళాడుతున్న ప్రేమ జంటలను చూస్తూ ఉంటుంది. కొంత మంది, ఫోన్ పట్టుకుని ఎంతకీ వదలకుండా అలా స్వీట్ నథింగ్స్ గంటలు గంటలు మాట్లాడుకోవడం గమనిస్తూ ఉంటుంది. ఒకసారి, తన రూమ్మేట్ యమున తన బాయ్ ఫ్రెండ్ దగ్గిరనుంచి ఫోన్ రాలేదని, డీలా పడిపోవడం చూసింది.

         “యమునా! ఒకటి గుర్తుంచుకో! నీకు స్టూడెంట్ జీవితం మళ్ళీ కావాలన్నా రాదు. నువ్వు వేరే పల్లెటూరి నుంచి వచ్చి ఈ కోర్స్ చేస్తున్నావు. నీ తల్లిదండ్రులు నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు? ఈ ప్రేమ, దోమ అనేవి క్షణికాలు. ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. మనకి ఆఖరి సంవత్సరం పూర్తికాగానే, బోలెడు జాబ్ ఏజెన్సీలు ఉద్యోగం ఇవ్వడానికి క్యూ కడతాయి. తరవాత నీకు పెళ్ళికి, ప్రేమించుకోవడానికి కావలసి నంత సమయం ఉంటుంది.”

         “ఐతే విశాల, అబ్బాయిలతో మాట్లాడటం తప్పు అంటావా?” 

         “యమునా, మాట్లాడటం తప్పని నేననడం లేదు. అబ్బాయ్ ఫోన్ చేయలేదు అని
సమయం వృధా చేయద్దు, బంగారం లాంటి భవిష్యత్తు పాడుచేసుకోవద్దు అంటున్నాను.”
త్వరగా రేపు జరుగబోయే ఫారెస్ట్రీ పరీక్ష గురించి ఆలోచించు.”

         ఇద్దరు నిశ్శబ్దంగా సబ్జెక్ట్ చదవటంలో లీనమైపోయారు.

         విశాల పెద్ద మనవరాలు కావడంతో, తాతగారి ఊరు వెళ్ళినపుడు అమ్మమ్మ, తాత గార్లు చెప్పిన పంచతంత్రం కథలు వింది. భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంది. అందుకని, ఆమెకు చిన్నతనంలోనే గట్టి పునాది పడింది. ఎక్కడ ఉన్నా తనేమిటో తనకు తెలుసు. ఎపుడు తన హద్దు తను మీరదు. పరీక్షలపుడు సిటీబస్ ప్రయాణం లేకుండా, హాస్టల్ లో ఉంటే తగిన విశ్రాంతి దొరుకుతుంది, పరీక్ష బాగా రాయచ్చు అని తల్లితో చెప్పటంతో వాళ్ళు పరీక్షలు బాగా రాయమని బెస్ట్ విషెస్ చెప్పారు.

         అలా కష్టపడి మొత్తం అన్నీ సబ్జెక్ట్స్ పూర్తి చేసేసి, ప్రొఫెషనల్ డిగ్రీ పట్టా  అందు కుంది విశాల. ఆ రోజు స్నేహితులంతా విడిపోతూ యూనివర్సిటీ నుంచి బయట పడ్డారు.

         మరోప్రక్క తండ్రి శ్రీనివాస్ గారు విశాల వివరాలు మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్  చేసారు. విశాలమటుకు తన భవిష్యత్ బంగారు బాట కావడానికి ఎందులో పోస్ట్
గ్రాడ్యుయేషన్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించసాగింది. ఇపుడున్న ప్రొఫెషనల్ డిగ్రీకి, బిజినెస్ లో మాస్టర్స్ చేస్తే తనకు ఉద్యోగంలో స్కోప్ ఎక్కువ ఉంటుంది అని భావించి, ఎమ్.బి.ఎ కోర్స్ ఎంట్రన్స్ రాయగానే, మంచి ర్యాంక్ వచ్చింది. తల్లి, తండ్రి ఆమె పై చదువులకు ఏమీ అభ్యంతరం పెట్టక పోవడంతో మేనేజ్ మెంట్ కోర్స్ సీరియస్ గా చదువుతూ, అక్కడ కూడా స్టార్ గా ఎదిగింది. మొదటి సంవత్సరంలో సీనియర్స్ జూనియర్స్ కి మేనేజ్ మెంట్ గేమ్స్ నిర్వహించారు. విశాల ఆ రోజు గేమ్ లో ఇచ్చిన అంశానికి వెంటనే స్పందించి, అన్ ఇన్వైటెడ్ గెస్ట్ ఇంటికి వస్తే …. “నా చిన్ననాటి స్నేహితురాలు నన్ను కలుసుకోవడానికి వచ్చింది. కానీ నేను అపుడు సరిగా తనని రిసీవ్
చేసుకోలేక పోయాను. ఇంట్లో మా బంధువులలో ఒకరికి అనారోగ్యంగా ఉండటంతో ఆ విషయం గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నాము. అపుడే వచ్చిన స్నేహితురాలితో సరిగా మాట్లాడలేదు. కనీసం కాఫీ కూడా ఇవ్వలేక పోయాను. పరిస్థితి గమనించి, నా స్నేహితురాలు మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోయింది. నా మనసులో తెలియని వెలితి. బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు, ఏది ముందు, ఏది వెనుక అన్నిటినీ బాలెన్స్ చేసుకుంటు ముందుకు సాగటమే జీవితం.” అలా అనర్గళంగా విశాల వాక్ప్రవాహం కొనసాగింది. తరువాత స్పోర్ట్స్ రౌండ్ లో చదరంగం పోటీలో ఏ ఒక్క గేమ్ లోను ఓడ కుండా వీరనారిలా అందరితోను గెలిచింది. అందరూ ఆమెని ప్రశంసిస్తూ, స్టేజ్ మీదకు పిలిచి ట్రోఫీ, సర్టిఫికెట్ ఇస్తూంటే విశాల వావ్, దీస్ ఆర్ మై బెస్ట్ మూమెంట్స్ విత్ మెమెంటోస్ అనగానే చప్పట్లు మారుమ్రోగాయి. మెమొంటోస్ తీసుకుని, ఇంట్లోకి అడుగు పెడుతూ ఈ రోజు సరస్వతీ మాత కటాక్షంతో వాక్కు వరదలా ప్రవహించింది, ఇంక ఛెస్ నేను ఊహించలేదు, అందరితో నెగ్గాను. దానికి ఈ ఛాంపియన్ ట్రోఫీ ఇచ్చారు అంటూ తల్లిదండ్రులకు చూపించింది.

         వరలక్ష్మిగారు ఆనందంతో ఉబ్బి, తబ్బిబ్బై కూతురి నోట్లో పూతరేకు పెట్టారు. ఇక శ్రీనివాస్ గారైతే, ఇదిగో నీకు ఇంకో గుడ్ న్యూస్. నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అబ్బాయి ఉద్యోగం, కుటుంబం అన్నీ బాగున్నాయి. అని చెప్పగానే “ఓ నాన్నగారు, అపుడేనా, దిసీస్ ఓవర్ వెల్మింగ్. మై మైండ్ ఈస్ కంప్లీట్ లీ బ్లాంక్” అంటూ గదిలోకి వెళ్ళి టీ.వి ఆన్ చేసింది. అపుడే టీవీలో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు అన్నపాట రాసాగింది. ఓహో! విశాల, నీకు తగ్గట్టుగానే పాట వస్తోంది చూడు అంటూ అక్కడకు వచ్చిన పెదనాన్నగారి అమ్మాయి చందన ఆట పట్టించింది. విశాలకు రోజంతా తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

         జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్ళి. రేపు నన్ను చూసుకోవడానికి మొదటిసారి వస్తున్న అబ్బాయికి నేను నచ్చాలి, అలాగే నాకు నచ్చాలి. 

         విశాలకి తెలియకుండానే ఆలోచనల పరంపర కొనసాగింది. అసలు అమ్మాయికి,
అబ్బాయికి ఒకరికొకరు నచ్చడం అంటే ఏమిటి, ఏ విషయంలో…. ఎత్తు, రంగు, ఉద్యోగం, అందం ఇవన్నీ చూస్తారా, గుణగణాలు, జాతకాలు ఇవేనా నచ్చడం అంటే? కాదు కాదు వివాహం అంటే రెండు కుటుంబాల మధ్య సంబంధ, బాంధవ్యాలు. అటేడు తరాలు, ఇటేడు తరాలు చూసి వివాహం చేయమన్నారు కదా! సందర్భం వచ్చింది కాబట్టి, అంతకుముందు పిన్ని పెళ్ళికి అమ్మమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు డిన్నర్ చేస్తున్నపుడు శ్రీనివాస్ గారు పెళ్ళివాళ్ళ వివరాలు, అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళు రేపు ఎన్నింటికి వస్తారు అన్న విషయాలు చెప్పారు. భోజనాలయ్యాక తల్లి వరలక్ష్మి గారు వచ్చి, “విశాల! నాన్నగారు కొన్న ఈ పింక్ కలర్ బనారస్ సిల్క్ చీర కట్టుకో!” అని బీరువా లోంచి చీర, నగలు ప్రక్కన పెట్టారు. ఇల్లంతా నీటుగా సర్ది,అందరూ పెళ్లిచూపులకి తగిన ఏర్పాట్లు చేయసాగరు. ప్రొద్దున్న విశాల, తయారై, తన ఇష్ట దైవం, గురువు షిర్డీ సాయిబాబా ముందు ధ్యానంలో కూర్చుంది. నా జీవితానికి సరైన బాట నువ్వే నిర్ణయించు. నీట ముంచినా, పాల ముంచినా నీదే భారం అని బాబా పాదాలకుప్రణమిల్లి,
నిర్మలమైన మనస్సుతో బయటికి వచ్చింది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.