నిష్కల – 27

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: సారా, నిష్కల ఒక తండ్రి బిడ్డలేనని తెలుసుకుంటారు. సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. కూతుర్ని జంటగా చూడాలని ఆరాటపడే శోభ. కొన్నాళ్ల ఎడబాటు తర్వాత సహజీవనంలో ఉన్న సహచరుడు అంకిత్ ఇంటికి రావడం నిష్కలను ఆశ్చర్య పరుస్తుంది

***

         ఎంత దారుణం. ఎంత కడుపుకోత .. ఆ తల్లిదండ్రులకు. అసలు పిల్లలు ఎందు కంత నిర్దయగా ఉంటున్నారు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వారి తల్లిదండ్రులకు తీరని బాధ  తీవ్ర వేదన మిగిలించి పోతున్నారు.  
 
         టీనేజ్ యువకుడు ఇంట్లోంచి వెళ్ళి దుర్గం చెరువులో శవమై తేలిన వైనాన్ని టీవీ వార్తల్లో చూస్తూ బాధగా అనుకున్నది సుగుణమ్మ. 
 
         ఏ ఛానెల్ మార్చినా  అదే వార్త. కొండను తవ్వి పట్టుకున్నట్టు మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. ఇలా జరిగింది .. అలా జరిగింది అంటూ .. నాలుగు రోజులు నీళ్లలో నాని పోయిన ఆ బిడ్డను చూడలేక టీవీ కట్టేసింది.  
 
         ప్చ్ .. పాపం.  ఏ తల్లి కన్న బిడ్డడో.. 
 
         అయ్యో.. తల్లీ నీవు ఎవరైనా గానీ ఎంత కష్టమొచ్చింది తల్లీ.. అంటూ తన ఇంటి బిడ్డకే ఆ కష్టం వచ్చినట్టు బాధ పడింది ఆమె. 
 
         పెద్ద కొడుకు పిలుపు కోసం, చూపు కోసం కళ్ళు కాయలయ్యేలా ఎదురుచూస్తున్న ఆ తల్లికి తెలుసు మరో తల్లి హృదయం. చెప్పా పెట్టకుండా పోయిన బిడ్డ ఆచూకీ కోసం ఎంత తపన పడి ఉంటుందో.. 
 
         తల్లిదండ్రులతో ఏదైనా గొడవపడి ఇంట్లో నుంచి పోయినా ఏదో రోజు ఇంటికి చేరతాడన్న నమ్మకం ఉండేది ఆ తల్లికి. ఆ భరోసాతో బతుకు వెళ్ళ మార్చేది. కానీ, శవమై ఇంటికి చేరిన చెట్టంత కొడుకును చూసి ఏ తల్లి తట్టుకోగలదు. ఆ తల్లి దుఃఖం ఎవరు మాత్రం తీర్చగలరు. 
 
         ఎంత కష్టం వచ్చింది రా నాయనా.. 
 
         అది ఎంతటి కష్టమైనా కాస్త ఓపిక పడితే కొన్ని రోజులకు కొంతైనా తగ్గిపోతుంది కదరా.. ప్రాణాలు తీసుకుంటే మళ్ళీ వస్తాయా .. నీ దారిన నువ్వెళ్లిపోయావ్.. నీ కన్నవాళ్ళ కడుపుకోత తీర్చేదెవరు? 
 
         ఏం చదువులో ఏవో .. 
 
         జానెడు బెత్తెడు లేని పిల్లలకు బండెడు పుస్తకాలు.. అంతంత పుస్తకాలు ఏమి  నేర్పు తున్నాయి? బతుకు పాఠాలు నేర్పని చదువు ఎందుకు?  జీవితాన్ని పోరాడి సాధించు కోవడం నేర్పని పుస్తకాలు ఎన్ని చదివితే ఏమి లాభం? 
 
         ఏ కష్టమొచ్చినా, సమస్య వచ్చినా అమ్మానాన్నలతో  చెప్పుకునే పరిస్థితి ఇప్పటి పిల్లలకు ఉన్నదా.. తన్నుకు పోవడానికి వచ్చే గద్ద నుంచి తన రెక్కల కింద పిల్లలను దాచుకుంటూ అటువంటి పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో చెప్పే తల్లి కోడిలాగా ఇప్పటి తల్లులు ఉండటం లేదేమో ..  
 
         తమ  పిల్లల చుట్టూ వాలే గద్దలను పెద్దలు తెలుసుకోలేక పోతున్నారు. గద్ద తన్ను కెళ్లిపోయాక లబోదిబో అంటున్నారు. ఒకరా ఇద్దరా రోజు ఇటు వంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా అవన్నీ పట్టించుకునే తీరిక ఓపిక ఇప్పటి తల్లిదండ్రులకు ఎక్కడిది?
 
         ఇద్దరూ ఉద్యోగాలతో, డబ్బు సంపాదనలో పడి అదే జీవితం అనుకుంటున్నారు.
సంపాదించిన దానితో వస్తువులను దగ్గర చేసుకుంటూ మనుషులకు దూరంగా జరిగి పోతున్నారు. 
 
         ఉన్న ఒకరో ఇద్దరో పిల్లల్ని అతి గారాబం చేసి వాళ్ళు అడిగిందల్లా తెచ్చి ఇవ్వడమే ప్రేమ అనుకుంటున్నారు. ఈ లోకంలో సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారా? ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఎవరికీ ఉండే సమస్యలు వారికుంటాయి. అట్లాగని సమస్య నుంచి పారిపోతే .. ఈ భూమ్మీద మనిషి ఉండేవాడా? 
 
         సమస్యను సవాల్ గా తీసుకోవాలనే చెప్పడం లేదు. మంచి చెడు చెప్పేదే తగ్గి పోయింది. పిల్లలు చాలా సున్నితంగా తయారవుతున్నారు. కుటుంబ సాధకబాధకాలు తెలియడమే లేదు. ఎంత కష్టమైనా, ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే మానసిక స్థితి పిల్లలకి ఉండటం లేదు. ప్రతి చిన్న విషయానికి బెంబేలు పడిపోతున్నారు అని తన ఎరుకలో చూసిన పిల్లలు, తల్లిదండ్రులు మదిలో మెదులుతుండగా అనుకున్నది సుగుణమ్మ.  
 
         డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రేపటి కోసం చిక్కుడు కాయలు వలుస్తున్న శోభ కూడా అదే విషయం ఆలోచిస్తున్నది.  
 
         పాల బుగ్గల లేతదనం పోని ఆ పసి వయసులో ఏ కష్టమొచ్చిందో.. సెల్ ఫోన్ కొనివ్వలేదనో, మోటార్ బైక్ కొనివ్వలేదనో, సినిమాలకు షికార్లకు కాదన్నారనో, పరీక్ష తప్పారనో, మార్కులు తక్కువొచ్చాయనో, ప్రేమ పేరుతోనో, ప్రేమరాహిత్యం తోనో, ఎవరో ఏదో అన్నారనో.. అంటారనో.. చిన్న చిన్న కారణాలే సులభంగా పరిష్కరించుకో గలిగే విషయాలే కానీ ప్రాణాలు గాలిలో  కలిసిపోతున్నాయి. 
 
         ఇట్లా విరిసీ విరియని మొగ్గలు ఎన్ని రాలిపోతున్నాయో.. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది? తల్లిదండ్రులకు పిల్లల పై బాధ్యత తగ్గిందా..బరువు పెరిగిందా..? నిర్లక్ష్యం వహిస్తున్నారా..  సమయం ఇవ్వలేక పోతున్నారా.. అందువల్లే ఇలా జరుగుతున్నాయా.. ?
 
         తన జీవితంలో చూసుకుంటే తన పెళ్లి నాటికి ఇప్పటికి ఎంత మార్పు. అప్పుడు ఎక్కడో ఎన్నడో ఒకటి ఇట్లాటి చావులు.. పిల్లల చావులైతే విన్న గుర్తు లేదు. అయినా ఇప్పటిలా తుమ్మినా దగ్గినా వార్త కాలేదేమో.. టీవీలు వచ్చినంక, సోషల్ మీడియా పెరిగి నంక ప్రతిదీ క్షణాల్లో జనంలోకి పాకిపోతున్నది. అసలు అప్పటి పిల్లలకు ఇప్పటి పిల్లలకు తెలిసినంత తెలుసునా.. అన్ని కోరికలు ఉండేవా..!
 
         ఏదో పెద్దలు పెట్టింది తిని ఇచ్చింది కట్టుకొని చదివిస్తే చదువుకోవడం, లేదంటే పెద్దలు చూసుకోమన్న పనులు చేయడం.. అంతేగా.. ప్రపంచం అంతా అట్లాగే మారిపో తున్నది. 
 
         ఆ రోజుల్లో టీవీ, మోటార్ సైకిల్, ఫ్రిజ్, ప్రైవేట్ బడులు కొందరికే అందుబాటులో ఉండేవి. సామాన్య జనం వాటి వైపు చూసే స్థితి లేదు. ఇప్పుడు అవి లేని ఇల్లు ఉన్నదా.. వాటికి తోడు మనిషికొక సెల్ ఫోన్. అందులో ఎన్నో యాప్ లు. ప్రపంచమంతా అరిచేతి లోనే.. అది చేసే మాయ అంతా ఇంతా కాదు. 
 
         ఏదేమైనా పెరిగిన జీవితావసరాలు, ఖర్చు, అందుకనుగుణంగా పెరగని జీతాలు, ఆదాయం పెద్దల పై వత్తిడి పెంచుతున్నది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నట్టింట్లో తిష్ట వేసిన టీవీ, చేతిలో ఇమిడిపోయే సెల్ఫోను వారి కోరికల్ని, ఆశల్ని ఆకాశంలోకి పెంచుతున్నది.
 
         బతుకు వేటలో పరుగు.. పరుగు.. ఒకరిని చూసి ఒకరు పరుగు.. ఒకరిని మించి మరొకరు ఉండాలని పోటీ.. పరుగు.. పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నారు తప్ప తృప్తి దొరకడం లేదు. ఇంకా ఏదో తక్కువయిందని, అందుకోలేదని అసంతృప్తి, ఆందోళన.. 
ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో పరిగెత్తలేక కొందరు చతికిలపడి అనారోగ్యానికి గురైతే, మరికొందరు మరింత వేగవంతమైన పరుగుతో మానసిక సమస్యలకు గురవు తున్నారు. 
 
         ఆనాడు ఉన్న ఆరోగ్యం ఈ నాడు ఉన్నదా.. ఆరోగ్యంలో చాలా తేడా వచ్చింది. 
ఇంత టెక్నాలజీ పెరిగింది అని సంబరపడాలో అవగాహనా రాహిత్యం పెరిగిందని ఆందోళన పడాలో అర్థం కాదు.  
 
         మనిషి మనిషి పట్టించుకోని తనం. ఏమి జరుగుతున్నా నాకేంటిలే అని తప్పించుకు పోయే తత్త్వం పెరిగి పోయాయి. ఈ పరుగులో ఆగితే ఎక్కడ వెనుకబడి పోతామోనని భయమేమో.. ఏదేమైనా సామాజిక సంబంధాలు పలుచనయ్యాయి. 
మనిషికి మనిషికి మధ్య కనిపించే అడ్డుగోడలు కొన్ని అయితే  కనిపించని అడ్డుగోడలు కొన్ని. ఆ పరిస్థితులకు కారణం ఎవరు? 
 
         ఈ పరిస్థితుల్లో పిల్లలు ఎలా తయారవుతున్నారు.. దేన్నయినా ఎదుర్కొనే ధైర్యం ఇవ్వని కుటుంబమా.. సమాజమా..  విద్యా వ్యవస్థా..  పరి పరి విధాల ఆలోచిస్తున్నది శోభ 
ఒక సంఘటన జరిగినదన్న వార్త వచ్చినప్పుడు ఆ వెంటవెంటనే మరికొన్ని అటువంటి వార్తలే విన్నప్పుడు ఆత్మహత్య అంటువ్యాధిలా అనిపిస్తుంది ఆమెకు. 
 
         చనిపోయిన పిల్లవాడి పై సానుభూతితో పాటు అతని తల్లిదండ్రుల బాధ్యతా రాహిత్యం పై ఒకింత కోపం వచ్చింది ఆమెకు. 
 
         ఏం.. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? అని అంతరాత్మ నిలదీసింది. 
 
         నిజమే, ఆనాడు కుంగిపోయిన పరిస్థితికి తనకి కూడా చనిపోవాలని ఆలోచన రాకపోలేదు. కానీ బిడ్డ భవిష్యత్తు కాళ్లకు అడ్డం పడింది. నా బిడ్డే లేకపోతే ఈనాటి శోభ ఉండేది కాదు. ఒకవేళ నేను ఆ పని చేసి ఉంటే..  ఇక ఊహ ముందుకు కదలలేదు. 
చేస్తున్న పని ఆపి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నది. 
 
         నువ్వెవరు ఆ తల్లిదండ్రుల పై  కోపగించుకోవడానికి?  వాళ్ళ గురించి నాకేం తెలుసని? అంతరాత్మ నిలదీసింది.  
 
         నిజమే, నేనేవరిని? ఆ పిల్లగాడి చుట్టాన్ని కాదు. పక్కాన్ని కాదు. నాకేం తెలుసు?
వాళ్ళ జీవితం గురించి గానీ, ఆ మరణం గురించి గానీ వ్యాఖ్యానించి సలహాలివ్వడానికి నేనెవరిని? ఆ అధికారం నాకు ఎవరిచ్చారు? ఎవరి జీవితంలో ఎన్ని లోతుపాతులు న్నాయో, ఉంటాయో ఎవరు చెప్పగలరు? అనుకున్నది. 
 
         నా జీవితంలో లోతుపాతులు నాకు గాక ఇంకెవరికి తెలుసు? రోజూ చూసే అమ్మలక్కలకు నేనెంతో అందమైన జీవితంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కారు వేసుకుని, బండి వేసుకుని ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి పోగల  అదృష్ట వంతురాలని అనుకోవడం చాలా సార్లు విన్నది.  
 
         అమెరికాలో ఉన్న భర్త, బిడ్డ. తరగని ఆస్తి అంటూ తనని అంత ఎత్తున ఉంచి, తన చీరల్ని ఆరాధన పూర్వకంగా చూడడం తెల్సు. అంత మాత్రాన నాజీవితం బ్రహ్మాండంగా వెలిగిపోతున్నట్లేనా.. కాదు కదా.. 
 
         నా జీవితంలో ఉన్న అగాధపు లోతుపాతులేంటో నాకు మాత్రమే తెలుసు.. అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాళ్లకు తెలియదు. అందరికీ చెప్పుకోవాల్సిన సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన సానుభూతి పొందాల్సిన అవసరం ఉందా.. లేదు కదా..  నా మానాన నేను నాకు తోచిన విధంగా, నాకు తృప్తి కలిగే విధంగా, ఒకరికి నష్టం కలగని విధంగా బతుకుతున్నాను. 
 
         పాపం.. ఆ పిల్లాడి జీవితంలో ఏవో అగాధాలు.. సుడిగుండాలు ఉండే ఉంటాయి. ఆ క్షణాన అవే అతన్ని లాక్కెళ్లి ఉండొచ్చు.. అది ఆ పిల్లవాడికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. లేదా అతని కుటుంబానికి లేదా మిత్రులకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. అసలేమీ తెలియక పోయి కూడా ఉండొచ్చు. 
 
         ఎవరైనా ఒకరు ప్రాణం తీసుకుంటున్నారంటే లోలోన ఎంత ఘర్షణ, ఎంత వేదన దహించి వేసిందో..  అది తట్టుకోలేని బలహీన క్షణాల్లో ఈ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. 
ఎవరి మనసు పొరల్లో ఏమి జరుగుతున్నదో.. అగ్ని కీలలు దహించివేస్తూనో.. సునామీలు ముంచెత్తుతూనో.. భూకంపాలు బద్దలవుతూనో ఉండొచ్చు. పైకి ఏమీ ఎరగనట్లు కనిపించ వచ్చు.. 
 
         పై నుంచి ఎవరైనా ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు.. ఎంతైనా వ్యాఖ్యనించొచ్చు.. అను కున్నది శోభ 
 
         ఆ క్షణంలో ఆమెకు కావేరి గుర్తొచ్చింది. ఈ మధ్య కావేరిని ఒకరిద్దరు వేధిస్తున్నారు. రామవ్వ సంరక్షణలో లేకుంటే ఆమె జీవితం ఎటు తీసుకెళ్ళేవారో.. ఏమైపోయేదో.. 
 
         తరచూ ఇంటికి వచ్చే కార్యకర్త రమేష్ తో నవ్వుతూ మాట్లాడుతున్నదని వేరే భావంతో చూసి వెంటపడే జాతి వారెక్కువవుతున్నారు.  
 
         ఓ రోజు చీకటి పడిన తర్వాత బిడ్డకు మందు అవసరం అయింది. తెలిసిన అతనికి ఫోన్ చేసి మెడికల్ షాపు నుంచి మందు తెప్పించుకుంది. అతను వెళ్లి ఏం చెప్పు కున్నాడో ఏమో తెలియదు కానీ, తెల్లవారే సరికి రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. 
 
         ఒంటరి మహిళ ఆ సమయంలో బిడ్డను వదిలి బయటకు వెళ్లి తెచ్చే స్థితి ఉన్నదో లేదో ఆలోచించకుండా, తెలిసిన వారి సహాయం తీసుకుంటే.. ఇంకేముంది .. చిలువలు పలువలేసుకుంటూ కథలు అల్లేస్తూ ఉంటారు.   
 
         ఒకవేళ తమకే ఆ అవసరం వస్తే ఒంటరిగా వెళ్లగలరా.. అని ఒక్క క్షణం ఆలోచించరు.. కానీ ఊహలకు రెక్కలిచ్చి ప్రపంచమంతా తిప్పేస్తారు.. 
 
         అవసరానికి ఆడపిల్లకి సాయం చేసామనో, ఆమె కాస్త స్నేహంగా మాట్లాడిందనో చిత్త కార్తె కుక్కాల్లా ప్రవర్తించే వాళ్ళకి కొదువలేదు.. ఆ రమేష్ గాడి కన్నా తీసిపోయానా అని కావేరిని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. 
 
         సేవా సంస్థ కార్యకర్తగా రమేష్ చాలా సార్లు కావేరి ఇంటికి రావాల్సి ఉంటుంది.  వస్తున్నాడు. అంతమాత్రాన ఇద్దరికీ సంబంధం అంటగడితే ఎలా.. రమేష్ పెళ్లికాని యువకుడు. సంస్కారం ఉన్న మనిషి. కావేరి పరిస్థితి తెలిసిన వాడు. ఆమె పట్ల సానుభూతి చేతనైన సహాయం చేయాలనుకునే మనిషి. 
 
         నిజంగా, రమేష్ కావేరిని కోరుకుంటున్నట్లైతే, కావేరి అభిప్రాయం తెలుసుకునే తానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తుంది అనుకున్నది కావేరి. 
 
         కానీ, ఇప్పటి వరకు రమేష్ ని అలా చూడలేదు. కావేరిని తలుచుకుని బాధ పడింది శోభ. 
 
         అయినా ఎవరి కడుపు నొప్పి వారికే తెలుస్తుంది.. 
 
         మంచికన్నా చెడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మానవ విలువలు రోజు రోజుకీ చిక్కి పోతున్నాయి. అందువల్లే కావేరి వంటి వాళ్ళు అనేక ఆటుపోట్లకు గురికాక తప్పడం లేదు. 
 
         బహుశా అత్త తనతో లేకపోతే నా గురించి ఇటువంటివి పుట్టేవేమో.. ఒకవేళ తనని కూడా ఆడిపోసుకున్నారేమో.. ఎవరికి తెలుసు? తనలో తానే నవ్వుకుంటూ ఒలిచిన చిక్కుడు కాయలు జిప్ లాక్ కవర్ లో వేసింది శోభ. 
 
         ఎవరు ఏదైనా అనుకోని నేను నమ్మిన పద్ధతిలో నేనున్నాను. అదే నా బలం. అలా ముందుకు సాగడమే నాకిష్టం.  
 
         ఒకవేళ ఎవరైనా ఏమైనా అనుకున్నా అనుకోని.. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా.. ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు.  నా అభిప్రాయాల్ని, నా ఆలోచనల్ని అందరూ ఆమోదించి అక్కున చేర్చుకోవాలని నేనేమీ కోరుకోవడం లేదు. 
నా దృష్టిలో నా విలువైన వ్యక్తిత్వం, స్వతంత్ర భావాలు, అభిరుచులు, అభిప్రాయాలూ, భవిష్యత్ ప్రణాళికలు నావే.. నా నడక, నడత నాదే. నా జీవితంలో నేనే ఉంటాను. 
జీవితంలో కావేరికి ఎదురయిన సవాళ్లు ఒక విధమైనవి అయితే తాను మరో రకంగా అత్త నుంచి భర్త నుంచి, తండ్రి నుంచి వివక్ష ఎదుర్కొంది. రామవ్వ నాకు ముందు తరం వ్యక్తి. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన ఆమె ఎటువంటి అగచాట్లు పడిందో.. ఎంత తన్లాడిందో.. 
 
         ఒంటరి మహిళను చూస్తే చావు వాకిట నిల్చిన వాడైనా తోక ఊపుకుంటూ లేచి వస్తాడేమో… ఆ ఆలోచనకు చిన్నగా నవ్వుకుంటూ  చిక్కుళ్ళ పీచు ఎత్తి తాను తయారు చేసే ఆర్గానిక్ కంపోస్ట్ బిన్ లో వేసి వచ్చింది.   
 
         మొన్న రామవ్వ, నిన్న నేను, రేపు కావేరి ఎవరైనా నిత్యం సలసలకాగే ఘర్షణ, భగభగ మండే మంటల నుంచి వ్యక్తిత్వం రూపొందించుకోవలసిందే. ఆత్మగౌరవం నిలబెట్టుకోవలసిందే. క్షణికావేశంలో, ఆకలి చూపులకు లొంగిపోతే.. అధోగతే.. బరితెగించిన మనిషిగా అవమానపరుస్తుంది, అగౌరవ పరుస్తుంది ఈ ప్రపంచం. 
 
         అదేంటి? నేను ఇలా ఆలోచిస్తున్నాను ఉలిక్కిపడింది శోభ. ఆమె కూడా ఉప్పూకారం తినే మనిషేగా.. రక్తమాంసాలు ఉన్న వ్యక్తేగా.. ఆమె శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయిగా.. ఆమె శరీరానికి కోరికలు నియంత్రించుకునే శక్తి ఉండొద్దూ… ఆ శక్తి లేకపోతే బరితెగింపు అనుకుంటే ఎలా..?
 
         నైతికత ఆమెకేనా.. అతనికి ఉండనవసరం లేదా. రామవ్వ స్థానంలోనో, నా స్థానంలోనో, కావేరి స్థానంలోనో పురుషుడు ఉండి ఉంటే.. అతను వెంటనే మరో బంధంలోకి వెళ్లిపోయేవాడు. అతని శరీర అవసరాల గురించి లోకం ఆలోచించేది. అతని పిల్లల ఆలనాపాలనా చూసే వాళ్ళు ఉండాలని తాపత్రయ పడేది. ఈలోగా అనే కాదు ఎప్పుడంటే అప్పుడు  అతనికి అతని అవసరాలు తీర్చుకునే మార్గాలు సమాజం ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టింది కదా.. దేవదాసీ వ్యవస్థ, జోగినీ వ్యవస్థ అందులో భాగమే కదా.. 
 
         అదే స్త్రీ విషయంలో అలా జరగకపోగా.. మగాడితో మాట్లాడితే ఆమెకు అవమానిస్తుంది. అనుమానిస్తుంది. పొడుచుకు తింటుంది. మగవాళ్ళతో పాటు ఆడ వాళ్ళు కూడా చూసే దృష్టి చేసే పని అదే. ఏం స్త్రీలు మాత్రం రక్తమాంసాలు లేవా.. ఆ శరీరానికి అవసరాలు, కోరికలు ఉండవా..? 
 
         గతించిన జ్ఞాపకాల్లోంచి వర్తమానంలో బతుకుతూ భవిష్యత్ నిర్మించు కొమ్మని అమ్మ నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంది. అప్పుడు వినలేదు. కానీ ఆ హృదయపు బరువు మోసింది. ఇప్పుడు నీళ్లింకిన చెలిమెలా తయారయింది. అది వేరే విషయం. 
 
         కావేరి చిన్న పిల్ల. లోకం పోకడ తెలియని పిల్ల. వెనక ముందు అండదండలు లేని పిల్ల. వయసుడిగిన రామవ్వ సమయం ఎంత వరకో ఎవరికి తెలుసు? ఆమె సంరక్షణలో ఎంత కాలం ఉండగలదు?  
 
         ఈ  ఆడపిల్లను శారీరక అవసరం కోసం మాత్రమే కాదు మానసిక అవసరాల కోసం కూడా మరో బంధంలోకి పంపే ఏర్పాటు చేయాలి. ఆమె మంచి చెడు చూసే బాధ్యత రామవ్వ, నేను తీసుకోవాలి ఆలోచిస్తూ వంటగది శుభ్రం చేసి తన గదివైపు నడుస్తున్నది శోభ. అంతలో ఫోన్ మోగింది.  
 
         నిషి కావచ్చుననుకొని గబగబా  వెళ్లి ఫోన్ అందుకుంది శోభ  
 
***
 
“ఇదెక్కడి విడ్డురం బిడ్డా.. 
ఆవును ఆలింగనం చేసుకోవటమేంది.. ఎన్నడన్న విన్నమా.. సర్కారు అట్లా చెప్పుడేంది?”  ఆశ్చర్యంగా ముక్కు మీద వేలేసుకుని టీవీ వార్తను విడ్డూరంగా చూసింది రామవ్వ. 
 
         “అవునే అవ్వా .. వాట్సాప్ గ్రూపుల్లో అదే ముచ్చట. ఆవును ఆలింగనం చేసుకుంటే ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తదట” అన్నది కావేరి. 
 
         “మనిషిని మనిషి ఆలింగనం చేసుకున్నడంటే సరే.. మంచిదే. ఆడపిల్ల, మగ పోరడు ఆలింగనం చేసుకున్నారంటే సరే.. మంచిదే అట్లా కాకుండ గోవును ఆలింగనం జేసుకొమ్మంటరు.. ఆళ్ళకి పిచ్చి గాని లేసిందా ఏందీ ..?” కావేరి మొహంలోకి చూస్తూ రామవ్వ 
 
         ప్రేమికులు పార్క్ లో కూచుంటే ఏదో తప్పు చేసినట్టు వెంటబడ్డారు. ప్రేమికుల దినం మనది కాదని వెంటబడ్డారు.. గతించిన కాలంలో లోకనాథ్ తాను పార్క్ లో కూర్చున్నప్పటి అనుభవం గుర్తొచ్చింది కావేరికి. 
 
         “మనిషైనా .. జంతువైనా ముక్కు మొహం తెలియని వాళ్ళు దగ్గరకొస్తే నచ్చదు.  అటువంటిది.. పని పాట లేనోడు ఇంగితం లేకుండా ఆ నోరువాయిలేని గోవును బెదర గోట్టుడు కాకుంటే.. దాన్ని ఆలింగనం చేసుకునుడేంది? అది ఊకుంటదా.. ” అన్నది రామవ్వ. 
 
         లోనికి వస్తున్న ఆరోగ్య కార్యకర్తను చూసి కావేరి కూతురు ఏడుపు అందుకుంది. 
 
         ” నీ బిడ్డకు నేను ఎర్కనే. అయినా అలవాటు లేని మనిషినని నన్ను చూడంగనే అరిచింది. ఇగ ఆవు ఊకుంటదా.. గందుకేనేమో.. ఆ ముచ్చట సర్కారు ఎన్కకు తీసుకున్నదట” అన్నది అప్పుడే వచ్చిన ఆరోగ్య కార్యకర్త జయ. 
 
         “బతికిపోయినరు.. లేకుంటే జనం ఆవులతోని ఎన్ని తన్నులు తింటుండెనో .. 
ఇంకా కాలు లేపి లాగి తన్నిందంటే.. ఎట్లుంటది.. వాడి పని గంతే..”పకపకా నవ్వింది రామవ్వ .
 
         ఆ నవ్వులు విని పాప కూడా ఏడుపు ఆపేసి నవ్వుతూ.. చప్పట్లు కొడుతూ అమ్మను, అవ్వను చూస్తున్నది. 
 
         “ఈ దేశంలో ఆవు వై పుట్టు కౌగిలించుకుంటారు. మనిషివై పుట్టకు అంటరానివాడి వంటూ దూరం నెట్టేస్తారు” పాప బరువు చూస్తూ వ్యంగ్యంగా ఆరోగ్య కార్యకర్త. ఆ మాటల ఆంతర్యం అర్ధమైన రామవ్వ “మంచిగ చెప్పినవ్ బిడ్డా ..” అన్నది. అర్థం కాని కావేరి తెల్లమొహం వేసుకొని చూస్తున్నది. 
 
         తొమ్మిదో నెలలో వేసే వ్యాక్సిన్ చేయించుకోవడానికి పంచాయతీ ఆఫీస్ దగ్గరకు రేపు రావాలని రమ్మని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. 
 
         “తింగిరేషాలేస్తే ఆవులే తంతయో.. జనాలే తరుముతరో” పసిదాన్ని దగ్గరకు తీసుకుంటూ రామవ్వ 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.