పేషంట్ చెప్పే కథలు – 12

కారుమేఘాలు

ఆలూరి విజయలక్ష్మి

         శ్రావణ మేఘాలు హడావిడిగా పేరంటానికి వెళ్తున్నాయి. క్రొత్త చీరలు, మోజేతికి తోరణాలు, పసుపు పూసిన పాదాలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చేతులలో పచ్చి శనగల పొట్లాలు, సన్నటి తుంపర చల్లగా స్పృశిస్తూంటే తనువులు పులకరించి హృదయాలను అనుభూతి అంచుల్ని తాకుతూండగా కబుర్ల మువ్వలు మ్రోగించు కొంటూ అడుగు ముందుకు కదుపుతున్నారు పేరంటాళ్ళు.

         వసుధ ఎలుగెత్తి ఏడుస్తున్న కొడుకుని సముదాయించడానికి నానా తంటాలు పడుతూంది. ప్రక్కవాటాలోని పేరంటాళ్ళ కోలాహలాన్ని నిర్లిప్తంగా గమనిస్తూందామె. ప్రక్కవాటా సుందరి వారం రోజుల నుంచి వరలక్ష్మీ వ్రతానికి సన్నాహాలు చేస్తూంది. అవతలి వాటా మణిని తోడు తీసుకెళ్లి కంచిపట్టు చీర కొనుక్కుని వచ్చింది. రెండు మూడు రోజుల్నించి తెలిసిన ముత్తయిదువులందర్నీ బొట్టు పెట్టి పేరంటానికి పిలిచి వచ్చింది. ఉదయం వ్రతం చేసుకుని వసుధను, మణిని భోజనానికి పిలిచింది. సుందరి పెట్టిన భోజనం రెండు ముద్దలు తినగానే ఆకలితో నకనకలాడుతోన్న జాన్ గుర్తుకొచ్చి కడుపంతా తెమిలినట్లయి చెయ్యి కడిగేసుకుంది వసుధ. నాలుగు రోజులుగా అర్ధాకలితో నెట్టు కొస్తున్న వసుధకు, జాన్ కి నిన్నటి నుంచి అదీలేక “కడుపునిండా భోజనం” అనేది ఒక తియ్యటి అనుభవంగా అనిపించసాగింది. 

         పసిబిడ్డ ఆకలితో ఎండిన రొమ్ముల్ని పీకుతూ ఉంటె ప్రాణం జివ్వుమంది వసుధకు. అప్పుకోసం వెళ్లిన జాన్ ఎంతో కొంత డబ్బు తెస్తాడు, ఒక గ్లాసుడు పాలైనా కొని బిడ్డకు పట్టొచ్చని ఆశగా ఎదురు చూసిన వసుధ వట్టి చేతుల్తో తిరిగొచ్చిన భర్తను చూసి ఏడుపు నాపుకోలేక పోయింది. 

         “వసూ! ప్లీజ్, ఏడవొద్దు నువ్వు. నీ ఏడుపు చూస్తూంటే నాకు ఉన్న ధైర్యం కూడా కరిగిపోయి పాతాళంలోకి కృంగిపోతున్నట్లుగా వుంది.” వంగి భార్య తలమీద చెయ్యేసి ఓదార్పుగా తడుతున్న జాన్ శక్తి సన్నగిల్లి నిస్సత్తువతో ఒరిగిపోతున్న సైనికుడిలా వున్నాడు. 

         “మనమెలాగైనా ఉంటాం. బాబునేం చెయ్యను చెప్పు?” దీనంగా అడిగింది వసుధ. ఆమె కళ్ళ ముందు ఏం.ఏ. ఫస్ట్ క్లాస్ డిగ్రీలు తీసుకుని ‘ఈ విశాల విశ్వం తమకోసమే సృష్టించబడింది. దీనికి అధినేతలు తామే’ నన్నంత ధీమాతో యూనివర్సిటీ బయటకు అడుగు పెట్టిన రోజు కదిలింది. తరువాత ఉద్యోగం సంపాదించడానికి పడినపాట్లు, అవమానాలు, ఆశాభంగాలు గుర్తుకొచ్చాయి. జాన్ కి ఈ ఊళ్ళో వున్న ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ దొరికిన రోజున ఎంతగా పొంగిపోయారు! “మనసులు కలిసిన స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి, హాయిగా, సుఖంగా జీవించడానికి అంతులేని ఐశ్వర్యం ఉండ నక్కర్లేదు, కనీస అవసరాలు తీరితే చాలు. అనురాగం, ఆప్యాయత దంపతుల్ని కట్టి ఉంచాలి కానీ కులం, మతం, ఆస్తి, అంతస్థు కాదు” అంటూ తన వారందర్నీ ధిక్కరించి జాన్ తో తన బ్రతుకుని ముడేసుకుని ఈ ఊరికి తరలి వచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది.  

         కాపురం పెట్టిన కొద్ది నెలలకే ఎదురయిన అనుభవాలు చూసి తబ్బిబ్బు పడి పోయారు భార్యాభర్తలిద్దరూ. సంతకం చేయించుకునే అంకె వేరు, చేతికందే జీతం వేరు. ఆ అందేది కూడా నెలల తరబడి చేతికందక పోవడంతో ఎలా బ్రతకాలో తెలియక బెంబే లు పడిపోసాగారు. అప్పు చేయడమనే ఆర్ట్ బోత్తిగా తెలియక పోవడంవల్ల, తమ పరిస్థితుల్ని ఇతరులకు తెలియనివ్వడం నామోషీగా భావించడం వల్ల పస్తులుండడ మనే ఆర్ట్ ని ప్రాక్టీస్ చెయ్యక తప్పింది కాదు. 

         చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక విసిగి ఊరుకున్న వసుధ, ఈ విషమ పరిస్థితి లో ఎంతో కొంత తాను కూడా సంపాదిస్తే తప్ప బ్రతుకు గడవదని తెలిసొచ్చి, మళ్ళీ ఉద్యోగపు వేటలో పడింది. ఒక కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా టెంపరరీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందని తెలిసి అప్లై చేసింది. అయితే ఆ జాబ్ ఎలా పొందాలో వివరాలు తెలిసు కొచ్చిన మిత్రుడు చెప్పే సరికి నిర్ఘాంతపోయారు. ఆ జాబ్ వెల కేవలం ఇరవై వేల రూపాయలేనని, సకాలంలో మేల్కొని ఆ ధర చెల్లించకపోతే ఇంకో వెయ్యి ఎక్కువగా కట్టి అయినా సరే జాబ్ సంపాదించడానికి లెక్కలేనంత మంది కాచుక్కూర్చున్నారని చెప్పి అప్పోసప్పో చేసయినా సరే జాబ్ దక్కించుకోమని ఉద్బోధించాడా మిత్రుడు. “లంచ మిచ్చి జాబ్ సంపాదించడమా? ఇంత ఆత్మన్యూనతతో కూడిన వ్యవహారానికెలా పాల్పడడం!” అని గుంజాటన పడ్డారు. పస్తులతో పడుకోనైనా పడుకుంటాంకాని, ఇంత సిగ్గుచేటైన పనికి తలపడలేమన్నారు. వారి అమాయకత్వానికి జాలిపడ్డ మిత్రుడు, ప్రస్తుత వ్యవస్థలో ప్రతి చిన్నదీ ఎలా అమ్మకపు వస్తువుగా మారిందో మనకు కావలసిన దాన్ని తల తాకట్టు పెట్టయినా సరే ఎలా కొనుక్కోవాలి, అలా కొనుక్కోకపోతే ఎలా బ్రతక లేమో జ్ఞాన బోధచేసి ఎట్టకేలకు అంగీకరింపచేసాడు. వసుధ తన మేడలో వున్న గొలుసును అమ్మి జాబ్ ని  కొనుక్కుంది.

         వసుధ మొదటి జీతం తీసుకునే నాటికి జాన్ కి మూడు నెలల జీతం ఒక్కసారి చేతికి వచ్చింది. జారిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని ఉత్సాహంతో తమ ఉద్యోగ విధు లను నిర్వహించసాగారు భార్యాభర్తలిద్దరూ. వసుధ కడుపులో ఊపిరి పోసుకుంటున్న పాపాయిని సంతోషంగా, గర్వంగా ఆహ్వానించారు. 

         “డెలివరీ గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. హాస్పిటల్లో ఉన్నంత కాలం నీకే లోటూ లేకుండా, ఏ కష్టం లేకుండా చూసుకునే భారం నాది”- డెలివెరీ గురించి భయ పడుతున్న వసుధను ఊరడించింది శృతి, అనుక్షణం అమ్మను తలచుకుని కలత చెందుతున్న వసుధ, శృతిని చూసి ధైర్యం తెచ్చుకుంది.

         కబురు తెలిసి చూడడానికి వచ్చిన వసుధ ఫ్రెండ్ మాలతి తల్లీబిడ్డల్ని తనతో తీసుకు వెళ్లి రెండు నెలలుంచుకుని పంపింది. ఇంటి దగ్గర బిడ్డను చూసుకోవడానికి మనిషిని ఏర్పాటు చేసుకుని డ్యూటీలో చేరడానికి వెళ్లిన వసుధ తన స్థానంలో మరొకర్ని అప్పోయింట్ చేసి తనకు మొండిచెయ్యి చూపించడంతో నిస్చేష్ట అయ్యింది. విపరీత మైన ఆవేశంతో దెబ్బలాడింది. తాను చెల్లించిన డబ్బు మాటేమిటని క్రోధంగా నిల దీసింది. చివరకు తన ఆవేశం, కోపం, కేకలు నిష్ప్రయోజనమని తేలిపోయాక పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది.  

         పులిమీద పుట్రలా అప్పుడే రెండు నెలల నుంచి జాన్ కి  జీతం రావడం లేదు. కూడబెట్టిన డబ్బంతా వసుధ డెలివరీ టైములో అయిపోయింది. క్రమేపి అవసరం అప్పులు చెయ్యడం కూడా నేర్పింది. దొరికిన చోటల్లా అప్పులు చేశారు. ఇప్పుడదీ పుట్టని పరిస్థితి వచ్చింది. 

         వసుధ కళ్ళు తుడుచుకుంది. మనసంతా తిక్కతిక్కగా ఉంది. గోడకు వ్రేలాడు తున్న డిగ్రీలని చూస్తే కసిగా ఉంది. హైస్కూల్ చదువు కూడా దాటకుండా పై సంపాదన పుష్కలంగా ఉండే చిరుద్యోగం చేస్తున్న ప్రక్కవాటా ఆంజనేయులు భార్య సుందరి చేస్తున్న పేరంటపు కోలాహలం విపరీతమైన ఆవేశాన్ని రగిలిస్తూంది.

         “వసూ! బాబల గుక్కపెట్టేడుస్తున్నాడు, కడుపు నొప్పిగా ఉందేమో! డాక్టర్ గారికి చూపించి రారాదూ?” జాన్ మాటలు విని వసుధ మౌనంగా బాబుని భుజానేసుకుంది.

         “బాబుకి పాలు పట్టి ఎంతసేపయ్యిందమ్మా?” బాబుని పరీక్షచేసి వసుధని అడిగింది శృతి. 

         “ఇంతకు  ముందే-” వినీ వినపడనట్లుగా జవాబిచ్చింది వసుధ.    

         “బహుశా ఆకలి తీరుండదు. పాలు పట్టు మళ్ళీ. అప్పటికీ ఏడుపు మానకపోతే ఈ మందుపట్టు” వసుధ కృంగిపోతూంది. ఆమెకు తెలుసు బాబుకు ఆకలి నొప్పేకాని, కడుపు నొప్పి కాదని.  

         “నువ్వేమిటిలా వున్నావు వసుధా?” వసుధ భుజంమ్మీద చెయ్యేసి మృదువుగా అడిగింది శృతి. మేఘాలు చిట్లాయి. వర్షంలో తడిసి ఒణుకుతున్న పాలరేకుల్లా ఉన్నాయి వసుధ కనురెప్పలు. 

         “సారీ! కదిలించి నిన్ను బాధపెట్టానేమో!” అంది శృతి. 

         “అబ్బే! బాధేం లేదు మేడం! అలవాటయిపోయింది. బాధలకు చలించే సౌకుమార్యం కూడా హరించిపోతూంది. వెయ్యేళ్ళు తపస్సు చేసినా పొందలేని మనో నిబ్బరాన్ని నేర్పుతోందీ నిరుద్యోగ పర్వం. సాధన పూర్తికాక అప్పుడప్పుడే తడబాటు.” కన్నీళ్లతో నవ్వింది వసుధ. కొల్పోతున్న ఆత్మస్థైర్యాన్ని బలవంతాన కూడదీసుకుని శృతి దగ్గర సెలవు తీసుకుంది. 

         మేఘాలు ముసురుకోవడం వల్ల బయట చిమ్మచీకటిగా వుంది. ఒక క్షణం భయమేసినా, నడుస్తూ ఉంటె అంతలోనే మబ్బుల్ని చీల్చుకుని వెన్నెల రేకలు వికసిస్తాయేమోనని ఆశపడుతూ అడుగు ముందుకు కదిపింది వసుధ.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.