25వ గంట

(ఉమా నూతక్కి పుస్తక సమీక్ష )

 -డా.రాజ్యలక్ష్మి శిష్ట్లా

 

         “25వ గంట”- ఉమా నూతక్కి మనసు కలం నించి జాలువారిన జీవితాల కతల వెతల వెల్లువ. ఇది తన మొదటి పుస్తకం. ఈ 25వ గంట ఇంకొన్ని వందల, వేల గంటలై ,
ఇంకెన్నో జీవితాలని విభిన్న కోణాల్లోంచి తాను స్పృశించి,మనకి పరిచయం చేయాలని ముందుగా కోరుకుంటున్నాను.

         కధలన్నీ టైమ్ లైన్ ప్రకారమే సమకూర్చారు. ఇవన్నీ వివిధ పత్రికల్లో, వెబ్ మేగజీన్లలో వచ్చినవే. మన కోసం ఈ పూలన్నిటినీ ఒక దారంతో గుచ్చి పుస్తకంగా మార్చారు. కధావస్తువుల గురించీ, శైలి గురించీ ముందు మాటల్లో ముందుగానే ప్రభాకర్ గారు, సత్యవతి గారు మనకి చెప్పేశారు. కధలన్నిటిలో ఎక్కువ ఎగువ మధ్య తరగతి మహిళ కనిపిస్తుంది. దాదాపు అన్నీ కధలనీ ఫస్ట్ పర్సన్ లోనే చెప్పే విధానాన్ని ఎంచు కున్నారు రచయిత్రి. అపుడే అది సూటిగా మన మనసులోకి వెళ్తుంది అని అయి ఉండ వచ్చు. ఈ కధలన్నిటికీ మూలం ఒకటే .. పరిస్థితుల్లో చిక్కుకుని బయటకి ఎలా రావాలో తెలీని, ఒకోసారి దారే తెలీని నిస్సహాయత ! వెనక పేజ్ లో తనే చెప్పారు “కధల మధ్య ఏదైనా అంతస్సూత్రం అంటూ ఉంటే,అది మహిళలకు కరువైన స్వతంత్ర జీవననాదం” అని. తన కధల్లో పాత్రలన్నీ ఆ స్వేచ్చ కోసమే పెనుగులాడుతున్నాయి అని కూడా చెప్పారు ఆవిడ. ప్రభాకర్ గారు అన్నట్టు ఆ చెప్పే మార్దవం కారణంగా తిరుగుబాటు కన్నా
పెనుగులాటలాగే ఎక్కువగా అనిపిస్తుంది. వ్యక్తిగత స్వేచ్చ అనేది ఒకో విషయంలో సామాజిక పరిమితులకి లోబడి ఉంటుంది, కొన్నిటిలో మనకి కావల్సిన దాన్ని అందుకో గలిగే మన ధైర్యంలో, క్లారిటీలో ఉంటుంది. రెండింటిలో దేనికైనా ఘర్షణ తప్పదు. నేర్పుగా మనమున్న చట్రంలోంచి బయటపడే చిన్న సందు అయినా వెతుక్కోవాల్సి ఉంటుంది.

         ఇక కధల్లోకి వెళ్తే, “శిశిర” తన మొదటి కధ. తేనెలాంటి మనసున్న స్నేహిత తను. తేనె ఎందులో కలిసినా తన తీయదనాన్ని కోల్పోనట్లే, స్నేహితుడు పోయినా తేనె లాంటి తన స్నేహం, ఆదరణా ఆ కుటుంబం దాకా కూడా వెళ్లగలిగింది. మనుషుల్లో, స్నేహాల్లో స్వచ్చతే తప్ప ఏ రకమైన బేధాలు ఉండకూడదు అన్న తపన చాలా హృద్యంగా కనిపిస్తుంది ఇందులో.

         “మిట్టమధ్యాహ్నపు నీడ” లోని ఇతివృతం .. చిన్నతనంలో లైంగిక దాడి. ఎంతో మంది ఆడపిల్లలకు ఎదురయ్యే ఈ భయంకర పీడకల తాలూకు వేదననీ, దాని
ప్రభావాన్ని ఆర్తిగా ప్రతి అక్షరంలో నింపారు రచయిత్రి. కానీ, ప్రతి ఆడపిల్లకీ మనసున్న అర్జున్ లూ, దయగల బామ్మలూ ఉండరు. ఒకోసారి తనే నిశ్శబ్దంగా తనలోనే ఇముడ్చుకోవాల్సిన, ఎవరితోనూ పంచుకోలేని దయనీయంగా ఉంటుంది చాలా మంది పరిస్థితి. కానీ, ఎంత మంది తోడుఉన్నా, ఆ జ్ఞాపకాలనీ, ఆ నీడలనీ , మోయాల్సింది ఆ మనసే, పసితనంనించి చివరి దాకా ! మిథున పడిన ఘర్షణని వెక్కిళ్ళ గొంతుతో చెప్పినట్టు కధ చదివిన చాలా సేపటి దాకా వినపడుతూనే ఉంటుంది.

         “హుక్” కధలో ఒక మాట అంటుంది మయూర “… శారీరకంగా, అంతకుమించి
మానసికంగా కూడా ధృతరాష్ట్ర కౌగిలే నాకు” అని. ఈ ఒక్కమాట తన వైవాహిక జీవితం లోని పెను అసంతృప్తికి నిలువుటద్దం. ఒక ఉద్యోగిగా, ఈ బాధ్యతల, గాయాల నెప్పులు మోస్తున్న విధానాన్ని కధ చదివే ప్రతి ఒక్క మహిళా తనకి అన్వయించుకోవచ్చు. “నెప్పి ఫీల్ అయ్యే తీరిక లేదు, ఏడిచే తీరుబడి అంతకన్నా లేదు” .. ఇంతకంటే ఎవరూ ఇంత క్లుప్తంగా ఆ బాధని వర్ణించలేరు. చివర్లో అత్తగారు చెప్తుంది “ నో అంటే ఎవరికైనా,
దేనికైనా నో అని మాత్రమే అర్ధం వచ్చేలా చెప్పగలగాలి”. ఆ మాట తనలో స్ఫూర్తిని నింపి మంచితనపు, మొహమాటపు తటపటాయింపుని చెదరగొట్టేస్తుంది. “విముక్తి పొందాలన్న ఆలోచన వచ్చాక నొప్పి తగ్గుతుందన్న ధైర్యం వచ్చింది”.. చాలా తెలివిగా ఇదే పరిష్కారంగా చెప్పారు ఉమ. కధలో ముందు కల గురించిన వర్ణనా, మధ్యలో ఇచ్చిన ఆ పద్యమూ కూడా తెలుగు పట్ల తనకున్న పట్టుని స్పష్టంగా చెప్తాయి. కధలోని మయూరే కాదు, కధ రాసిన ఉమకూడా చిన్నప్పుడు తెలుగు మాస్టారికి ప్రియశిష్యురాలే అయి ఉంటారు. అందుకే సాహిత్యం పట్ల ఆ మక్కువ.

         “నీడ తొక్కిన ఆట” లో మళ్ళీ ఇంకో చిన్నారి గౌరి మీద జరిగిన లైంగిక దాడి. ఆ సంఘటన నించే గౌరీ, మహేశ్వరీ ఇద్దరూ విడిపోయినా, ఆత్మబంధువుల్లా ఒకరిమనసులో ఇంకొకరు పదిలంగా ఉన్నారు. ఆ చిన్నతనపు స్నేహంలో ఎన్ని ఏళ్ళైనా, స్నేహంలోని స్వచ్చతనీ, సువాసననీ నిలుపుకున్న గొప్ప మనసులనీ, ముఖ్యంగా ఒకరి కూతురికి ఇంకొకరి పేరు, పేరే పెట్టుకోడం చదివాక, అంతే స్వచ్చమైన చిరునవ్వు రాకుండా ఆపుకోలేం. దానితో పాటే, కుదిరితే ఒక కన్నీటి బొట్టు కూడా నిశ్శబ్దంగా పలకరించచ్చు మనని. అంత సున్నితంగా ఆ నీడల ఆటని చెప్పారు రచయిత్రి.

         “25వ గంట” నిజంగా పెనుగులాటే. “తనకీ భద్ర జీవితమే కావాలి, తను చాలా
సక్సెస్ ఫుల్ అనిపించుకోవాలి “ అన్న మాటతో సగటు మహిళ మనసుకు సరిచెప్పు కున్నట్టు రాసినా, రచయిత్రి అసలు ఉద్దేశం ..అది బలహీనతగా మారితే మిగిలేది తెంచుకోలేని ఇనప సంకెళ్లే , అవి మనసునీ, ఉత్సాహాన్నీ, ఆరోగ్యాన్నీ, చివరికి జీవితాన్నే చంపే మానసిక రోగం అవుతుందని హెచ్చరించడం అయి ఉండవచ్చు. కానీ, 25వ గంట కావాలి అన్న విరక్తి నవ్వుతో, మన అర్ధానికే వదిలేశారు. ఉమ కధలన్నీ ఫస్ట్ పర్సన్ లో చెప్పడం వల్ల ఒకోసారి ఆ పాత్ర పేరు మనకి తెలిసే అవకాశం ఉండదు. ఆమె ఆఫీస్ కి వెళ్తూ ఏలెన Fఎర్రంతె ఆడియో బుక్ “థె దయ్స్ ఒఫ్ అబందొన్మెంత్” వింటుంది. “ ఠె చిర్చ్లె ఒఫ్ అన్ ఎంప్త్య్ దయ్ ఇస్ బ్రుతల్ అంద్ అత్ నిఘ్త్ ఇత్ తిఘ్తెన్స్ అరౌంద్ యౌర్ నెచ్క్ లికె అ నూసె”. ఈ బుక్ లో ఇంకో కొటేషన్ నే పుస్తకం ముందు ఇచ్చారు. “చెడ్డవాడేం కాదు గానీ, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా తీసుకునే భర్తల్లో ఒకడు” అని చెప్తూనే ,
ఇంకోచోట “పాలు కలిపి ఇవ్వాలి కూతురికి. పద్దెనిమిది నిండాయి. కనీసం తనకి పాలు కలుపుకోవడం, తల్లికి చిన్న చిన్న పనుల్లో సహాయంగా ఉండడం కూడా చేయదు.అసలు ఆ పిల్లకి నేర్పాలని తానే అనుకోదు..” అంటూ కూతురి గురించి కూడా చెప్తారు. అన్నీ తామే చేసుకుంటూ పోతే భర్తలే కాదు, పిల్లలూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లనే తయారవు తున్నారు. ఇలా ఈనాటి మహిళ ఇంటా బయటా పనులు చేస్తూ,మానసికంగా కుంగిపోతూ, శారీరకంగా అలిసిపోతూన్న వైనం చదువుతుంటే కోపంగా మనలో ఒక ప్రశ్న వచ్చేలా చేశారు రచయిత్రి .. ఎందుకు కొంచమైనా తన కోసం స్పేస్ , టైమ్ కావాలన్న పోరాటం
చేయట్లేదు తను అని. దానికి దారులు, ధైర్యం ఎవరి పరిస్థితిని బట్టి వారే తెచ్చుకోవాలి. ఈ మధ్య ఝెన్నిఫెర్ ఛూలిద్గె అనే 61 ఏళ్ల హాలివుడ్ నటికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో తను అంటారు “ఛిల్ద్రెన్ హవె గ్రౌన్ ఉప్ అండ్ హవింగ్ రెలతివె ఫినంచీల్ సెచురిత్య్ , వొమెన్ ఒవెర్ 50 అరె హవింగ్ థె తిమె ఒఫ్ థైర్ లివెస్” అనీ, “ంయ్ దౌఘ్తెర్ ఇస్ 17 అంద్ నవిగతింగ్ హెర్ ఔన్ లిఫె ఇన్ అ నెవ్ చౌంత్ర్య్, అంద్ మ్య్ పరెంతింగ్ రెస్పొన్సిబిలితిఎస్ హవె ష్రుంక్ తొ ఒనె ఫొనె చల్ల్ అ దయ్” అని. ఎపుడు
మన దేశంలో అలా అనగలుగుతారో వేచి చూడాలి మరి.

         “మరో వానమబ్బుల కాలం” లో మిధున మాటల్లో మాత్రమే తన స్నేహితురాలు మయూర స్వేచ్చా తత్వం, ఆ ప్రవర్తనా తెలుస్తాయి. “పెళ్లి అనే చట్రంలో ఇమడలేను” అనే మయూరకి అసలు తనకి జీవితంలో ఏం స్వేచ్చ, ఎందులో స్వేచ్చ కావాలో, అసలు స్వేచ్చ అంటే మరో పేరే ఆత్మాభిమానం నిలుపుకోడం అనేది తెలుసో లేదో ..ఇలాంటి స్పష్టత రాలేదు గానీ, తనని అర్ధం చేసుకోడంలో మిధున తనని తాను తరిచి చూసుకోడం గొప్ప నిజాయితీ !! “ప్రదర్శనకీ, నిరూపణ కీ పూనుకుందంటే అది ప్రేమ కాదు” అని తన
వైవాహిక జీవితం గురించి తను మిధున అనుకున్నా, సరిగా ఈ మాటనే మయూర కూడా అనుకుని ఉంటుంది “ప్రేమ ప్రదర్శనకీ, వ్యక్తిగత స్వేచ్చకీ అస్సలు సింక్ అవదు” అని.

         “నిర్జన” లో పాత్ర మనందరిదీ కూడా. పక్కవాడెవరో, ఏంటో కూడా పట్టించుకో లేనంత దౌర్భాగ్యపు పరుగులో ఉన్నాం అందరం. మరల్లా, పెద్ద పెద్ద యంత్రాల్లా బతికేస్తున్నాం. అన్నీ మొబైల్ ప్రపంచంలోనే. ఆ పోయిన పిల్లాడి ఫోటో చూడకుండా “వెతుక్కోవాలనే నిర్ణయించుకుంది” అంటూ ముగిస్తూ , తన దుఖానికి కారణం ఏమైనా ఉండి ఉంటుందా ? అన్న ప్రశ్నా బాణం మన మీదకే తెలివిగా సంధించి వదిలారు
రచయిత్రి, “మీదే ఆలస్యం .. చూసుకోండి మరి .. కాలనీలో ఒక పిల్లవాడు , అందరూ చూస్తూ, మాట్లాడుతూ ఉన్నవాడు, యాక్సిడెంట్ లో పోతే , ఆ పిల్లాడు తనకి మాత్రమే తెలీని, తాను పట్టించుకోలేని స్థితిలో, ఉద్యోగపు హోదా మైకంలో, బాధ్యతల ముద్దుపేరు మాయలో ఉంది నా పాత్ర. మరి మీరూ? ” అని. వెతుక్కోవాలి సమాధానం మనలోనే .

         “చూపు” లో ప్రసాదం కోసం ఆ బిచ్చగాళ్ళు పడుతున్న తాపత్రయం, ఆ గుడ్డివాళ్ళ మీద దయా తనకి తెలుస్తున్నా, వాళ్ళు గురవుతున్న చీదరింపులకి తను చలిస్తున్నా కూడా, “ఆఫీసు లో యాభై మందికి పెట్టడానికి నాకు కావాలి” అని తను అడగగలిగినా, చివరికి వాళ్ళు గుంపులా గిన్నెలతో చుట్టుముట్టినప్పుడు వాళ్ళ ఆరాటంలో, వాళ్ళమీద చేస్తున్న జులుంలో .. అపుడు, అపుడు “రెండు నేత్రములూ లేని వాణ్ని బాబయ్యా” అనే సింగులర్ శబ్దం దేవుడి వైపు నించి వచ్చినట్టు తనకి అనిపిస్తుంది. ఇక ఆగలేదు తను,
దొరికినన్ని ప్రసాదం పోట్లాలు వాళ్ళకి ఇచ్చేయ్యడానికి కదిలింది. దైవం కూడా సాటి మనిషి ఆకలి తెలుసుకోమని చెప్పినట్టు అనుకుందో లేక ఇలా ధనిక,పేద తేడాలు ఇలాగే ఉంచిన దేవుడికి కూడా కళ్ళు లేవు అని అర్ధం చేసుకుందో .. తనలో ఒక చలనం వచ్చింది. ఒక్కపూట ఆకలి తీరిస్తే మాత్రం ఏం .. ఆ మనసు చాలదూ ..అదే కదా ముక్కోటి దైవ దర్శనం !! ఆ చూపే, ఆ అంతర్దర్శనమే మనలో ఆర్తినీ, దయనీ కదిలించి తెగువా, ధైర్యమూ ఇస్తుందని చెప్పకనే చెప్పారు రచయిత్రి. ఎక్కడికక్కడ మనం ఆలోచించేలా చేయడంలో రచయిత్రి మనకి హోం వర్క్ ఇస్తారు.

         “భ్లొచ్క్ థె లిఫె” లో ఇతివృతం కూడా ఎంతో మంది ఆడవాళ్ళు గురి అవుతున్న
మానసిక హింసే. పని, పాట లేని వెకిలి మృగాలు ఆడ పేరుతో ఒక మొబైల్ నెంబర్
కనిపించగానే చేసి, చెత్త మాట్లాడే హింస, ఏ పోలీసులు (వీళ్ళు కూడా మగాళ్ళేగా!) కూడా ఏం చేయలేమంటూ పైగా నెంబరే తీసెయ్యమనో, బ్లాక్ చెయ్యమనో ఇచ్చే సలహాల చిత్రహింస. ఆ ఉచిత సలహాకి నేనెందుకు నా ఐడెంటిటీ మార్చుకోవాలన్న ఉక్రోషం, ఈ మగ వ్యవస్థల మీద కోపంతో రగిలిపోయే నిస్సహాయతలో ఒక చిన్న సంఘటనతో తత్వం
బోధపడుతుంది తనకి. కొంత మంది బుద్ధి లేని అజ్ఞానపు ఆడవాళ్ళు కూడా మగాళ్లతో ఈ మను ధర్మశాస్త్రాన్ని పదిలంగా కాపాడుతునే ఉంటారని. 

         ఐనా.. ఈ మారే కాలంలో కూడా పురుష స్వామ్యపు మూలాలు అర్ధం అవుతున్నట్టు అనిపిస్తుంది తనకి.

         “అవ్యక్తం” లో ఒక రచయిత కాసేపు ఒక మహిళతో గడిపిన ఇతివృత్తం. పరిచయం అయిన కాసేపట్లోనే చెప్పింది తను శరీరాన్ని అమ్ముకోడం తనకి అసలు ఇష్టం లేదనీ, కానీ వేరే దారి లేదనీ. ఈ రచయితకేమో తన ప్రియురాలు తనని సరిగా, గొప్పగా అర్ధం చేసుకోలేదని వగపు. పాపం ఆ మహిళ ఇతన్ని ఒక రచయితగా నిజంగానే గౌరవిస్తుంది, నిష్కల్మషంగానే మాట్లాడుతుంది. కానీ, అతను తనకి తనే అనుకుంటాడు “మంచి వాడిలా నటించడమే కాదు, చెడ్డవాడిగా ఉండటం కూడా తనకి రాదని. తన ఎదురుగా ఉన్న ఆ మహిళ అతన్ని చాలా ఆలోచనలో, అయోమయంలో పడేస్తుంది. ఏది నైతికమో, ఏది అనైతికమో, మానసిక ప్రేమకీ, శారీరక కోరికకీ పొంతన ఎక్కడో కథ చదివే మనకి మాత్రం స్పష్టంగా అర్ధం అవుతుంది. చివరికి ఒక కవిత రాసుకుంటున్న అతను
అనుకుంటాడు “నాలో రచయిత మరణించి చాలా కాలమైంది” అని. చాలా క్లిష్టమైన విషయాన్ని తేలిగ్గా డీల్ చేసి, మనని ఆలోచింప చేస్తారు రచయిత్రి.

         “నిశ్శబ్ద స్వరం” ఒక మహేశ్ కథ. మహి అనతగ్గ మహేష్ కథ. ఇతను హాస్పిటల్ లో అటెండెంట్. తను హాస్పిటల్ లో ఉన్న సమయంలో అతని శారీరక అసహజత్వాన్ని గ్రహించ గలుగుతూనే, సమాజం చేసే హేళనలతో అతను చేస్తున్న యుద్ధపు సహజత్వాన్ని కూడా సమతూకంగా అర్ధం చేసుకోగల్గుతుంది మహేశ్వరి. అటు వంటి సమస్యల పట్ల తనకి ఏ అవగాహన లేదు అనుకుంటుంది. అతని పట్ల చాలా కనికరంగా ఉంటుంది. వెళ్తూ అతను ఇష్టపడిన తన కాలి పట్టీ ఇస్తుంది. హృదయం ద్రవించే దయ అది.

         “అంతర్వాహిని” ఈ సంపుటిలో ఆఖరి కధ. ప్రశాంతి తన అమ్మ శారద హాస్పిటల్ లో ఉందని తెలిసి వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నతన వైవాహిక జీవితం సరిలేక పోతే, విడాకులకి ప్రోత్సహించిన తల్లిని అప్పటినించి పట్టించుకోదు. ఆవిడ ఆరోగ్యం అసలు ఎలా ఉందో కూడా తెలీనంత. హాస్పిటల్ బెడ్ మీద తల్లిని చూసి దుఖిస్తూ అనుకుంటుంది “నా జీవితంలో నేను చేసుకున్న పొరపాటుకు నేను ముడుచుకుపోయి తనని ఎందుకు దూరం చేసుకున్నానో తెలీదు, అది నాకు వేసుకున్న శిక్ష” అని. అది తన అహం దెబ్బ తినడమా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నా అన్న మీమాంసలో పడుతుంది. ఈ అమ్మ పెంచిన అమ్మ. కన్న తల్లి చనిపోతే తను తెచ్చి పెంచిన అమ్మ.
భర్తతో విడాకులతో, తల్లి మీద ఆ నిరసన వచ్చి ఉండవచ్చు. మనకిష్టమైనది దూరం అయినప్పుడు మనం ఎప్పుడు ఇతరులని కారణంగా మనసు లోపలి పొరల్లో ముద్రించేసుకుంటాం. అది సహజం, అది ఉక్రోషం. వాస్తవానికి దూరంగా వెళ్ళడం. ప్రశాంతి అలసత్వాన్ని అహం దెబ్బ దినడంగానే చాలా వరకు అనుకోవచ్చు. చివర్లో “నువ్వు బావుంటావ్, మనం కబుర్లు చెప్పుకుంటాం” అని తల్లితో అన్నట్టు చదవగానే “హమ్మయ్య” అనుకుంటాం. అంతలోనే “బయటకి అనలేదు తను” అని రచయిత్రి మనని వెనక్కి నెట్టేస్తారు. ఆ తల్లి కూతురి రక్షణలో హాయిగా, భద్రంగా ఉంటుందని ఆశించమనీ, ఆశీర్వదించమనీ గడుసుగా మననే అడిగినట్టుంది, ఆ పల్చటి తల్లి చేయి మీద కూతురి ముద్దు !!

         ప్రశాంతికి ఒకప్పటి తన అశాంతికి తల్లే కారణం అనిపించింది గానీ, ఇప్పటి తన శాంతి తల్లి మాత్రమే అని అర్ధం అయింది. అది చాలు. ఈ పాత్ర ఆలోచనలకి మనస్తత్వ కోణంలోంచి అద్భుతంగా అక్షర రూపం ఇచ్చారు ఉమ. 

         మొత్తం మీద, ఈ పుస్తకం లోని కథలు “మహి” గీసిన “మహి”ళల మనోచిత్రాలు !!!

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.