ఒక్కొక్క పువ్వేసి-21

ఉద్యమాలల్ల గూడ యెట్టి సేతనే మాది

-జూపాక సుభద్ర

          తెలంగాణ మాజీ ఎంపి, తెలంగాణ సీయెమ్ బిడ్డ,యిప్పటి ఎమ్మెల్సీ చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్లో పెట్టాలని సడన్ సడన్ గా ఢిల్లీలో ధర్నా చేసింది. ఎన్నాళ్ల నుంచో మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో బెట్టినారనీ సగం జనాభాగా వున్న మహిళ లను యింట్ల కూచోబెట్టి దేశాన్ని సూపర్ పవర్ గా,విశ్వ గురువుగా ఎట్లా మారుస్తారు?ప్రతి ఒక్కరికి వారి జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగ బద్దంగా ఉపకోటా వుండాలన్నదే తమ ఆకాంక్ష.బీజేపీ 2014 లో, 2019లో మహిళా రిజర్వేషన్ మీద మాట తప్పింది. పార్లమెంటు లో మూడు రైతు వ్యతిరేక చట్టాల్ని ఆమోదించిన బీజేపి మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ఆమోదించలేదు? అని ప్రశ్నిస్తుంది. మా పార్టీతో సహా ఏ పార్టీకూడా మహిళలకు తగిన ప్రాతినిధ్యం యివ్వట్లేదు అని, ఒక మంచి వాస్తవాన్ని కూడా చెప్పక తప్పినట్లు లేదు.

          కాని, తెలంగాణ మహిళలు ఏమంటున్నారంటే- ‘ అమ్మా సీయెం బిడ్డవు నువ్వు, తెలంగాణ ఉద్యమంలో సుట్టూత మెత్తలు, పరుపుల మీద కూసొని ధర్నాలు చేసిన సుకూన్ వు. తెలంగాణ ఉద్యమంలో అట్లా కనిపిచ్చినందుకు నువ్వు ఎంపీ అయితివి. తర్వాత ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీవైతివి.ఎంపీ గున్నపుడు గానీ,సొంత పార్టీలో మహిళ లకు టికెట్లు 119 సీట్లకుగాను పదకొండు సీట్లిస్తే మాట్లాడింది లేదు.ఒక్క మహిళకు కూడా కాబినెట్లో మంత్రి పదవి యివ్వకుండా మహిళల్లేని మంత్రి వర్గం విషయంలో నోరిప్ప లేదు. యిది అన్యాయం అని అరిచింది లేదుగాని,ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో యిరుక్కున్నప్పుడే మహిళా బిల్లును పార్లమెంట్లో పెట్టాలనేది యాదికొచ్చిందా?

          అరే తెలంగాణ వస్తే మా బతుకులు బాగైతయని కోటి కలలుగన్నమ్.మా తెలంగాణ మాకు లేకనే మా జీవితాలు గిట్లా పాడుబడ్డయనుకున్నం.మా ఎట్టి సేత బోతది.మాకు భూములొస్తయి, జాగలొస్తయి,మా పంటలకు నీల్లోస్తయి,నిధులొస్తయని మేము కలలు కనుకుంటమి.సదువుకున్న మా పోరగాండ్లకు కొలువులొస్తయి.మా పేదరికం బోతది, కులం బోతది, సమాన పనికి సమాన జీతాలొస్త యనుకున్నమ్.కనీస వేతనాలు అందుతయనుకున్నమ్.సమానంగా ఎదుగుతము,సమానత్వమ్ తోని, స్వయం గౌరవం తోని బతుకుతా మనుకుంటిమి.మా మీద నిత్యం జరిగే దాడులు, అగాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు ఆగి పోతయని ఆశపడ్తిమి.

          అన్నిరంగాలతో పాటు రాజకీయ రంగంలో కూడా మేముంటము,మా తొవ్వకడ్డం బడేది ఆంధ్రోల్లే. గీ ప్రత్యేక తెలంగాణ వస్తే, గా అడ్డంకులన్ని సాఫ్ అయితయని ఆశ పడితిమి. గట్లా అశ పడే, తొల్త తెలంగాణ ఉద్యమం కంటే మల్త తెలంగాణ ఉద్యమంల మేము, యిల్లు వాకిలి యిడ్సిపెట్టి పెద్ద ఎత్తున బైటి కొచ్సినమ్.తెలంగాణ సాదించు కోనీకి.

          కుటుంబాల్ని పిల్లల్నిడిసి పెట్టి పాదయాత్రలు జేసినమ్, రోడు యాత్రలు చేసినమ్. దీక్షలు, బత్కమ్మలు,బోనాలు ఉద్యమంగా నిర్వహించినము.రైలు రోకోలు, బస్సు రోకోలు, సాగర హారా లు, మిలియన్ మార్చ్ లు , రోడ్ల మీద వంటావార్పులు జేసినం. ధర్నాలు, మీటింగులు. కాలికి బట్ట గట్టకుంటా తిరిగినము. యూనివర్సిటీల ఆడపిల్లల హాస్టల్లు మూసేసినా, ఉప్పిడి వుపాసముండి పోరాడిండ్రు. బాష్పవాయువుల్ల, లాఠీ దెబ్బలు తిన్నారు. మేమంత అనేక కేసుల్లో యిరుక్కున్నము. తెలంగాణ వస్తే,ఒక మంచి జీవితమ్ కోసం కలగని,ఆశలు పెట్టుకొని యిన్నిన్ని పోరాటాలు చేసి, పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలల్ల మా బిడ్డల్ని,కొడుకుల్ని,అన్నల్ని తమ్ముల్ని పోగొట్టుకున్న దుక్కాలు మాయి.ఒక్కటా రెండా తెలంగాణ కోసం యిట్లా కంటి మీద కునుకు లేకుంట పోరు జేసినం.ఉద్యమంలో బెట్టిన కేసుల మీద యింకా తిరుగుతున్నము.కొంత మంది ఉద్యోగాలు కూడ పోయినయి. యింతింత త్యాగాలు,పోరాటాలు జేస్తే … మాకు మిగిలిందే మున్నది? రెక్కలు తెగిన పక్షులమైనమ్. తెలంగాణల ఆడోల్లున్నరా!? మా అస్తిత్వా లేడన్న కనిపిస్తున్నయా? తెలంగాణ వొచ్చినంక మేము కంటికి కనిపించకుండా బొయినం.

తెలంగాణ వొస్తే కనీసం ముప్పయి నలుభై మంది ఆడోల్ల కన్నా ఎమ్మెల్యే సీట్లు వత్తయనుకుంటే, మొత్తం 119 సీట్లల్ల మాకు యిచ్చిన టిక్కెట్లు పదకొండు. అప్పుడే గుండెల రాయబడ్డది. ఏంది? గీ పదకొండు టిక్కెట్లేంది? మా వాట యాబై టిక్కెట్లు రావాలని అడిగినమ్. ’ గిది మొదటి సారి,జరా ఓపిక వట్టుండ్రి మనల్ని బొందలేసి భోరిగ పిస్కనీకి ఆంధ్ర పార్టీలు సూస్తున్నయి.మీ అందరి కష్టమ్ యేడికీ బోదు’ అని మాట్లాడిండ్రు. కానీ బిడ్డెకు మాత్రం ఎంపీ సీటిచ్చిన గౌరవాలు!

కనీసం మున్సిపల్ ఎన్నికల్లో కార్పోరేటర్ గా కూడా టిక్కెట్లివ్వ లేదు. ఏ కార్పొరేషన్ పదవులు, నామినేటెడ్ పోస్టులల్ల గూడ మమ్ముల నియమించకుండా బోలెడు బొచ్చెడు అవుమానాలు. వచ్చిన ఎమ్యెల్యే టిక్కెట్లు పదకొండయితే గెలిచింది ఆరుగురు! ఒక్క మహిళకు క్యాబినేట్ లో మంత్రి పదవి యివ్వలే.మహిళా కమిషన్ పోస్టు కూడా పాత చైర్ పర్సన్నే (త్రిపురాన వెంకటరత్నం ను) కొనసాగించారు!చాన కాలం తరువాత యెన్నటికో హైకోర్టు యాజ్జేసి మొట్టికాయలేస్తె, గప్పుడు కమిషన్ చైర్మన్ గా ఒక మహిళను నియమిం చింది,తప్పదనట్లుగ తెలంగాణ ప్రభుత్వము. ఉద్యమంలో పంజేసిన,త్యాగాలు చేసిన దన్నుతోని మేమంతా సెక్రెటరియట్ సుట్టు తిరిగి తిరిగీ యిసిగి యేసారిపోయి ఆశలు కొట్టేసుకున్నం.గిసోంటి తెలంగాణా మేము పిల్ల జెల్ల బట్టక,యిండ్లు వాకిల్లిడిసివెట్టి, మొగలతోని లొల్లి పెట్టుకొని,కుటుంబాలకు దూరమైంది? ఆగమైనమని మా మీన మాకే కోపమొస్తది.

ఓడ దాటేదాక ఓడ మల్లయ్య, ఓడ దాటినంక బోడ మల్లయ్య కతయింది మాది. సెప్పిం దోటి సేసిందోటికి అయింది.గిదొక్క తెలంగాణ ఉద్యమమేనా అంటే? అంతకు ముందు కూడ రజాకార్ల మీద పోరాటం,సాయుధ పోరాటం కమ్యూనిస్టులమై,నక్సలైట్లమై పోరాడి, కొట్లాడి సచ్చి పొయినోల్లము.సంపబడోల్లమ్. కారంచేడు,చుండూరు లాంటి ఉద్యమాల్లో కూడ దెబ్బదిన్నం. జెండాలు మోసినం,కేసుల బడ్డమ్, నిర్బందాల నుంచి ఉద్యమాల్ని కాపాడినం.ఫాసిజాలను ఎదుర్కొని ఎన్ కౌంటర్లయినం. కానీ, ఫలితాలల్ల యేం బావు కున్నం? ఎప్పటి సిప్ప యెనుగుల్నే. రాజ్యాంగ హక్కులు యింకా మేము పొందకుంట చేస్తున్నయి,పాలక కులాల మగ సమాజాలు.రాజకీయ పార్టీలన్నీ ఆధిపత్య కుల మగ వాల్ల కంట్రోల్లోనే వున్నయి.యిక్కడ మేమంతా వోటు బ్యాంకుగానే వున్న పరిస్థితి. ఎన్నిక ల మానిఫెస్టోల్లో, ఎలెక్షన్ సందర్బంగా, మహిళా సంక్షేమం,సాధికారత రిజర్వేషన్ బిల్లు పెట్టిస్తామని ప్రకటిస్తారు.వాల్ల సొంతపార్టీలో కనీసం ఓ పది మంది మహిళల క్కూడా టిక్కెట్లు యివ్వరు గానీ, మహిళా సాధికారత కోసం పాటు పడ్తారా? మనం నమ్మాలా? యిన్ని గాయాల్నించి బైటపడాలంటే… మహిళలు రాజకీయ పార్టీలన్నా పెట్టాలి.లేదా శక్తి లేనపుడు కోటాలో కోటాగా, మహిళా బిల్లు సాదించుకోవాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.