జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-9 

   -కల్లూరి భాస్కరం

         ఇక ఇప్పుడు… ఎట్టకేలకు…మన దగ్గరికి వస్తున్నాను. నిజానికి జెనెటిక్స్ కి సంబంధించి మన దగ్గరికి రావడం అంత అలవోకగా జరగాల్సింది కాదు. దానికి తగిన పూర్వరంగాన్ని రచించుకోవాలి. ఇది ఒక విధంగా పతాక సన్నివేశం. పతాకసన్నివేశాన్ని రక్తి కట్టించాలంటే కొంత అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పాదాల కింద నేల కంపించడం లాంటి ప్రభావం చూపే ఏ విషయాన్ని చెప్పడానికైనా అలాంటి కొంత ప్రయత్నం అవసరమే. వందలు, వేల సంవత్సరాలుగా మనలో పాతుకుపోయిన నమ్మకాలను, ఊహలను తలకిందులు చేసే ఏదైనా విషయాన్ని వెల్లడించినప్పుడు అది ఆశ్చర్యం లేదా దిగ్భ్రాంతితోపాటు కొందరిలో తీవ్రమైన అలజడి పుట్టించడం సహజమే. ఆ విధంగా ఇది ఇంచుమించు ‘గోరా ఎఫెక్ట్’ లాంటిది.

         (ఆయా జనాభాల మూలాలను శోధించే తాజా జన్యుపరిశోధనల గురించి, వాటి ఆవిష్కారాల గురించి ఎంతో కొంత  తెలిసినవారిని కాకుండా; ఈ వ్యాసాల ద్వారానే తెలుసుకుంటున్నవారు ఏ కొందరైనా ఉంటే వారిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పై మాటలు అంటున్నాను).

         ‘గోరా’ రవీంద్రనాథ్ టాగోర్ రాసిన ప్రసిద్ధ నవల. ఆ నవలలోని నాయకుని పేరు గోరా. అతను జాతీయోద్యమంలో పాల్గొంటాడు, జైలుకు వెడతాడు. అయితే, ఛాందస హిందూవాది, నాలుగువర్ణాల వ్యవస్థను, బ్రాహ్మణ ఆధిక్యతను నమ్మేవాడు, కొంత వరకూ  విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలలోని ధర్మారావు లాంటివాడన్న మాట. అయితే ఇద్దరి మధ్యా గొప్ప తేడా కూడా ఉంది. ధర్మారావు మొదటి నుంచి చివరి వరకూ ఒక్కలానే ఉంటాడు; కానీ గోరాలో మార్పు వస్తుంది. అంత వరకూ తను జీవించిన జీవితాన్ని, తన నమ్మకాలను, తన సూత్రీకరణలను సమూలంగా మార్చుకోవలసిన అవసరం తలెత్తుతుంది. అతని పుట్టుకకు గురించిన ఒక దిగ్భ్రాంతికర సత్యం బయట పడడమే అందుకు కారణం. అతని కన్నతండ్రి హిందువూకాడు, భారతీయుడూ కాదు, బ్రాహ్మణుడూ కాదు- ఒక ఐరిష్ జాతీయుడు! ఈ సంగతి తెలిశాక అతను తీవ్ర ఉద్వేగానికి లోనవుతాడు; “ఈరోజున నేను ఎంత పరిశుద్ధుడినయ్యానంటే, అత్యంత నిమ్నకులస్థుని ఇంట్లో కూడా మైలపడతానన్న భయం నాకిప్పుడు లేదు” అంటాడు.

         మన జన్యుమూలాల్లోకి వెడుతున్నకొద్దీ గోరా నవలలోని వస్తువుకూ, వాటికీ మధ్య అచ్చుగుద్దినట్టు పోలిక కనిపించి ఆశ్చర్యం కలిగిస్తుంది.

***

         ‘అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా’ అన్నది కొత్తగా విన్నదేమీ కాదు. కాకపోతే, ఆఫ్రికా వెలుపల ఉన్ననేటి వందల కోట్ల ప్రపంచ జనాభా మూలాలు ఒక్క ఆఫ్రికన్ తల్లిలో ఉన్నాయన్న వివరం- గుర్తొచ్చినప్పుడల్లా నాలో సంభ్రమాన్ని రేపుతూనే ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలు అటు, ఇటుగా 70వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఆధునిక మానవులు అరేబియా మీదుగా దక్షిణాసియాకు, అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు సాగించిన వలసల క్రమం గురించి టోనీ జోసెఫ్ రాస్తాడు. ఆఫ్రికా వెలుపల, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాల మైటోకాండ్రియల్ DNA (mtDNA)ను కనుక చూస్తే; వారందరూ ఆఫ్రికాలో వేళ్లూనుకున్న L3 అనే ఒకే ఒక హేప్లోగ్రూప్(haplogroup: జనాభా సంబంధ జెనెటిక్స్ లో ఈ మాటకు శాఖ అని అర్థం)నుంచి వచ్చిన వారేనన్న సంగతి తెలుస్తుంది. mtDNA అనేది తల్లి నుంచి కూతుళ్ళకు, వారి నుంచి వారి కూతుళ్లకు సంక్రమిస్తుంది. తల్లి నుంచి కొడుకులకు కూడా సంక్రమిస్తుంది కానీ, అది వారితోనే ఆగిపోతుంది తప్ప వారి కొడుకులకు వెళ్లదు.

         పైన, ‘ఆఫ్రికా వెలుపల’ అని ఎందుకన్నామంటే, అప్పటికి ఆఫ్రికాలో ఉన్న అన్ని ఆనువంశికతల జనాలూ కాక, కొందరు మాత్రమే వలస ప్రారంభించారు కనుక, ఆఫ్రికాలోనే ఉండిపోయినవారు పైన చెప్పిన ఆఫ్రికన్ తల్లి ఆనువంశికత కిందికి రారు. ఆ తర్వాత టోనీ జోసెఫ్ అన్నది, ఆయన మాటల్లోనే చెప్పుకుంటే: Think about what this means: that all people outside of Africa are descended from a single African woman who originated the L3 mtDNA haplogroup!

పెద్ద గీత-చిన్న గీత

         నాకీ సందర్భంలో పెద్దగీత-చిన్నగీత సామ్యం గుర్తొస్తోంది. మనం ఈ రోజున దేశాలు, సరిహద్దులు, జాతీయతలు, మతాలు, సంస్కృతులు, కులాలు, సెక్టులు, భాషలు, శత్రుత్వాలు, యుద్ధాలు, రాజకీయాలు, ఎన్నికలు సహా ఎంతో పెద్ద అజెండాను మోస్తున్నాం. వీటన్నింటినీ ఓ చిన్న గీత, దాని పైన కొంచెం పెద్ద గీత, దాని మీద ఇంకొంచెం పెద్ద గీత అనుకుంటూ పోతే, చివరిగా పై ఆఫ్రికన్ తల్లి గురించిన  సత్యాన్ని అన్నింటి కన్నా అతి పెద్దగీతగా రాసుకోవాలని నాకు అనిపిస్తుంది. రాసుకోవడమే కాదు; మిగతావాటన్నింటినీ పక్కన పెట్టేసి, ఒక రోజు రోజంతా యావత్ప్రపంచమూ పై సత్యాన్నే మననం చేసుకోవాలనీ, దాని గురించే మాట్లాడుకోవాలనీ; మననం చేసుకోవడానికీ, మాట్లాడుకోవడానికీ ఆ రోజున అంతకన్నా గొప్ప విషయం ఇంకేమీ ఉండకూడదనీ అనిపిస్తుంది.

         ప్రపంచ జనాభా ఈ సత్యాన్ని తనలో ఇంకించుకోవలసినంతగా ఇంకించుకుందా, దీనిని ఉత్సవీకరించుకుందా, ఎన్నో విషయాలకు ఎన్నో రోజుల్ని కేటాయించుకున్నాం కదా, ఈ ప్రాపంచిక సత్యాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక రోజును ఎందుకు కేటాయించుకోలేదనే ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది.

ప్రపంచమానవుల ఉమ్మడి గోత్రం

         పైన చెప్పుకున్న L3 ఆనువంశికత మనం సాంప్రదాయికంగా చెప్పుకునే గోత్రం లాంటిది; అంటే అది ‘సైంటిఫిక్’ గోత్రమేకాక, నేటి ప్రపంచ మానవులందరి ఉమ్మడి గోత్రం అన్నమాట. టోనీ జోసెఫ్ ప్రకారం, ఆఫ్రికాలో ఇలాంటి గోత్రాలు పదిహేనుకు పైగా ఉన్నాయి. అయితే ఒక్క L3 తప్ప మిగిలినవేవీ ఆఫ్రికా బయటి ప్రపంచ జనాభాకు మూలం కాలేదు. L3 గోత్రం నుంచి పుట్టిన M, N అనే రెండు ఉపగోత్రాలు, లేదా ఉప-హేప్లోగ్రూపులు ఈ రోజున ఉన్నాయి. వీటిలో N కు తనదైన అతిపెద్ద ఉపహేప్లోగ్రూపు R ఉంది. ఆఫ్రికా వెలుపల ఉన్న ప్రపంచజనాభా మొత్తం ఈ M, N లేదా R నుంచి వచ్చిన ఆనువంశికతల కిందికే వస్తాయి. విశేషమేమిటంటే, దక్షిణాసియాలో ఈ మూడు ఉప హేప్లోగ్రూపులూ ఉంటే, యూరప్ లో N, R అనే రెండు గ్రూపులు మాత్రమే అస్తిత్వంలో ఉన్నాయి.

ఒక తల్లిలానే ఒక తండ్రి

         తండ్రి నుంచి కొడుక్కి, అతని నుంచి అతని కొడుక్కి సంక్రమించే Y-క్రోమోజోమ్ ఆనువంశికత కూడా పై దానికి దాదాపు నకలుగానే ఉంటుంది. ఆఫ్రికా వెలుపలి ప్రపంచ జనాభా ఒక ఆఫ్రికన్ తల్లి నుంచి వచ్చినట్టే, ఒక ఆఫ్రికన్ తండ్రి నుంచి వచ్చింది.అతను ప్రారంభించిన CT అనే Y-క్రోమోజోమ్ హేప్లో గ్రూపు నుంచి పుట్టిన C, D, F అనే మూడు హేప్లోగ్రూపులు మాత్రమే ఆఫ్రికా బయటి ప్రపంచ జనాభాకు మూలమయ్యాయి.

         తల్లి నుంచి సంక్రమించే mtDNAకు, తండ్రి నుంచి సంక్రమించే Y-క్రోమోజోమ్ కు మధ్య ఒక తేడా ఉంది. mtDNA కూతురికీ, కొడుక్కీ కూడా సంక్రమిస్తే; Y-క్రోమోజోమ్ మాత్రం ఒక్క కొడుక్కి మాత్రమే సంక్రమిస్తుంది.

ఒక ఐతిహాసిక యాత్ర

         ఆఫ్రికా నుంచి వలసలకు జరిగిన ప్రయత్నాలూ, అందుకు కారణమైన పరిస్థితులూ, తొలి వైఫల్యాలూ, అనంతర విజయాలూ, అందుకు పనికొచ్చిన మార్గాలూ వగైరాల గురించి చదువుతున్నప్పుడు అదో గొప్ప ఇతిహాసానికీ, కావ్యానికీ, నవలకూ వస్తువా అనిపిస్తుంది. వాస్తవానికి నేటి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయిల్ లను కలిపి చెప్పే ప్రాంతమైన లెవాంట్(Levant)లోకి 1,80,000 వేల సంవత్సరాల క్రితం; అరేబియాలోకి 88,000 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి జనం వలస వెళ్ళడం ప్రారంభించారు. అయితే, తమ ప్రపంచ జనాభాకు మూలం కాగల ఆనువంశికతలను నెలకొల్పడంలో మాత్రం విజయం సాధించలేకపోయారు. దాంతోపాటు వారు అక్కడినుంచి దక్షిణాసియా, తూర్పు ఆసియా దిశగా మరింత ముందుకు వెళ్లలేకపోవడానికి అప్పట్లో లెవాంట్ లో ఉన్న నియాండర్ తల్స్ ఒక కారణం కావచ్చునంటాడు టోనీ జోసెఫ్. ఆ నాటికి యూరేసియాలో  నియాండర్ తల్స్ ప్రాబల్యంలో ఉన్నారు. యూరప్ శీతల వాతావరణానికి బాగా అలవాటుపడి మంచి దారుఢ్యంతో కూడా ఉన్నారు కనుక వారిని దాటుకుని ఆఫ్రికన్ వలసదారులు యూరేసియాలో మరింత ముందుకు వెళ్లలేక పోయారు. ఎట్టకేలకు నియాండర్ తల్స్ పై ఆధునిక మానవులు పై చేయిని సాధించడానికి మరికొన్ని వేల సంవత్సరాలు పట్టింది.

నాలుగు దారులు; పనికొచ్చిన నాలుగో దారి

         మొదట్లో నియాండర్ తల్స్ కు అదనంగా వాతావరణ పరిస్థితులు యూరేసియాలోకి ఆఫ్రికా వలసదారులు రాకుండా అడ్డుకున్నాయి. వారు యూరేసియాలోకి వెళ్లడానికి మొత్తం నాలుగు దారులున్నాయి. మొదటి రెండు మార్గాలనూ ఉపయోగించిన దాఖలాలు లేవు కనుక వాటిని పక్కన పెడితే, మూడవది, ఈజిప్టు మీదుగా లెవాంట్ కు వెళ్ళి అక్కడి నుంచి ఆసియాలోకి రాగలిగిన ఉత్తరాది మార్గం. ఆ మార్గంలో జరిగిన ప్రయత్నం ఎలా విఫలమైందో పైన చెప్పుకున్నాం. నాలుగవది, తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియా నుంచి ఎర్రసముద్రపు దక్షిణపు కొన అయిన బాబ్ ఎల్ మాందేబ్(Bab el Mandeb)మీదుగా యెమన్, సౌదీ అరేబియాలలోకి వెళ్ళే దక్షిణాది మార్గం. మంచు యుగంలో వాతావరణం శీతలంగానూ, పొడిగానూ ఉన్నప్పుడు సముద్రపు నీటి మట్టం తగ్గి, సముద్రం మీదుగా ఇప్పుడు ముప్పై కిలోమీటర్లున్న ప్రయాణదూరం కూడా మూడో వంతుకు తగ్గుతుంది కనుక ఈ మార్గంలో ఆఫ్రికా వలసజనం అరేబియాలోకి అడుగు పెట్టడం అంత కష్టం కాదని, సముద్రం తీరం వెంబడే జీవించి, ప్రయాణించిన అపార అనుభవం వారికి ఉన్నట్టు ఆధారాలున్నాయి కనుక, వారికి పడవ నిర్మాణం కూడా తెలిసే ఉంటుందని టోనీ జోసెఫ్ అంటాడు.

కొంత కరుణించిన మంచుయుగం

         ఉత్తరాది మార్గంలో లెవాంట్ చేరుకున్న ఆధునికమానవులకు నాటి మంచుయుగపు శీతల, పొడి వాతావరణం నరకం చూపించిందిగానీ;  దక్షిణాది మార్గంలో అరేబియా చేరుకున్నవారిని కొంత కరుణించింది. కనీసం తీరం వెంబడైనా ఋతుపవనాలు పొడి వాతావరణ తీవ్రతను తగ్గించాయి. అంతకు ముందే, అంటే 88వేల సంవత్సరాల క్రితమే, అత్యంత శీతలవాతావరణంలో కూడా ఆధునిక మానవులు దక్షిణాది మార్గంలో ఆసియాకు చేరుకున్నట్టు కొందరు పురాతత్వశాస్త్రవేత్తలు ఆధారాలు చూపించారు. సౌదీ అరేబియాలో దొరికిన ఆ కాలానికి చెందిన ఒక ఆధునిక మానవుడి వేలి తాలూకు శిలాజం వాటిలో ఒకటి. అలాగని 88వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా నుంచి విజయవంతంగా వలస వచ్చి మిగిలిన ప్రపంచ జనాభాసృష్టికి వీరు కారణమైనట్టు భావించకూడదనీ, జన్యు ఆధారాలు అందుకు అవకాశమివ్వడం లేదనీ జోసెఫ్ అంటాడు. సుమత్రా దీవుల్లో, ఇప్పుడు టోబా(Toba)అనే సరస్సు ఉన్నచోట 75వేల ఏళ్లక్రితం సంభవించిన అతి పెద్ద అగ్నిపర్వతం పేలుడు వల్ల, మరికొన్ని ఇతర కారణాల వల్ల ఈ ఆఫ్రికా వలస బృందాలు అంతరించిపోయి ఉండచ్చని ఆయన అంటాడు.

నియాండర్ తల్స్ తో సాంకర్యం

         అరేబియాలోనే ఆధునిక మానవులకు నియాండర్ తల్స్ ఎదురుపడడమే కాదు; వారి మధ్య సాంకర్యం జరగడానికి కూడా ఎంతైనా అవకాశముంది. ఆఫ్రికా వెలుపలి జనానికి నియాండర్ తల్ మానవుల జన్యువారసత్వం రెండు శాతం మేరకు సంక్రమించడానికి తొలి మూలం ఇదే. విశేషమేమిటంటే, ఆధునికమానవుల్లో నియాండర్ తల్ జన్యువు ఉన్న సంగతి 2010 వరకూ మనకు తెలియనే తెలియదు. ఆ సంగతి తెలిసి యావత్ప్రపంచం దిగ్భ్రాంతి చెందింది. అంత వరకూ నియాండర్ తల్ మానవులు మన కన్నా చాలా వెనకబడిన రకమనీ, వేరే జాతనీ అనుకునే వాళ్ళం.

మధ్యా ఆసియా మీదుగా యూరప్ కు

         ఈ విధంగా ఆఫ్రికాలో బయలుదేరిన వలసదారులు అరేబియా మీదుగా దక్షిణాసియాకు అక్కడి నుంచి తూర్పు ఆసియాకు, ఆస్ట్రేలియాకు వ్యాపించారు. దక్షిణాసియాను ఆక్రమించుకున్న తర్వాత ఆధునిక మానవులు నేడు పాకిస్తాన్ ఉన్న ప్రాంతం మీదుగా సింధుతీరం వరకూ, అక్కడి నుంచి మధ్యఆసియాకు బహుశా కాలినడకన వెళ్లారని అంచనా. 57వేల సంవత్సరాల క్రితం వాతావరణం వేడెక్కడం మొదలైన తర్వాత, అరేబియా ద్వీపకల్పంలో అప్పటికింకా నివసిస్తున్న, లేదా దక్షిణాసియా సమీపంలో ఉన్న ఆఫ్రికా వలసదారుల వారసులు జగ్రోస్ పర్వతాలను దాటి టర్కీ, సిరియా, ఇజ్రాయిల్ మీదుగా యూరప్ కు చేరుకున్నారు.

***

         ఈ యాత్రాక్రమాన్ని ఇంకా అనేకానేక వివరాలతో టోనీ జోసెఫ్ విస్తారంగా రాసుకుంటూ వచ్చాడు. దానిని రేఖామాత్రంగా రూపుకట్టిస్తూ, దానికి గల ఒక ఇతిహాస లక్షణాన్ని ఎత్తిచూపడం కోసమే నా ఈ చిన్న ప్రయత్నం. ఉపాహారం లాంటి ఈ చిరు పరిచయం మీ ఆకలి తీర్చదని నాకు తెలుసు. విందుభోజనాన్ని ఆరగించాలనుకుంటే టోనీ జోసెఫ్ పుస్తకం ఇంగ్లీష్ లోనూ, తెలుగులోనూ కూడా అందుబాటులో ఉంది.

దగ్గరి వారసులు అంజ్ తెగ

         ఇప్పుడు లిటిల్ అండమాన్ దీవుల్లో ఉన్న అంజ్(Onge)తెగవారు ఆనాటి ఆఫ్రికా వలసదారులకు దగ్గరి వారసులనీ, వారు ఇతర బృందాలలో అతి తక్కువగా సాంకర్యం చెందారనీ టోనీ జోసెఫ్ అంటాడు. తల్లికి సంబంధించిన వారి హేప్లోగ్రూపు M అయితే, తండ్రికి సంబంధించిన హేప్లోగ్రూపు D. ఈ రోజున వీరు కేవలం వందమంది మాత్రమే ఉన్నారు. అయితే, ఆఫ్రికా మూలాల నుంచి వచ్చిన తొలి భారతీయులు అచ్చంగా వీరిలానే ఉండేవారని అనుకోకూడదనీ, ఇన్ని వేల ఏళ్లలో తొలి వలసదారుల రూపురేఖల కు మనం ఎంత దూరమయ్యామో అంజ్ తెగవారు కూడా అంతే దూరమయ్యారని టోనీ జోసెఫ్ అంటాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.