అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 4

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తిచేసి, ఎమ్.బి.ఏ కోర్స్ లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో ట్రోఫీ పొందింది. తండ్రి తీసుకువచ్చిన పెళ్ళి సంబంధం, మొదటిసారి పెళ్ళిచూపులలోనే అబ్బాయి విష్ణుసాయికి నచ్చిందని , నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహుర్తం పెట్టించమని పెళ్ళికొడుకు తండ్రి విశ్వనాథ్ గారు ఫోన్ చేసి చెపుతారు.

***

అది 1999 వ సంవత్సరం.

          తూరుపు తెలతెలవారుతోంది. సూర్యుని లేలేత కిరణాలు కిటికీఊచల సందుల్లోంచి చీల్చుకుని, విశాల నుదురుని తాకాయి. విశాల తన కుడి అరచేతిని చూసుకుంటూ “కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి 
కరమూలే స్థితాగౌరీ, ప్రభాతే కరదర్శనం” అని మనసులో ధ్యానించుకుంటూ కనులు తెరిచింది. 

          నిన్న జరిగిన పెళ్ళిచూపులు, విష్ణుసాయి జ్ఞాపకాల అల అలా మదిలో మెదిలింది.

          “అరె, పెళ్ళివారు రావడానికి ముందు యమున ఫోన్ చేసింది కదా! ఇక్కడే ఉన్నాను, నన్ను చూడడానికి వస్తాను అంది. ఆ సంగతే మర్చిపోయాను, ఏమనుకుందో ఏమిటో? హడావిడిలో తన ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు అనుకుంది.”

          ఆ రోజు ఉదయం పది గంటలకి శ్రీనివాస్ గారు మామగారైన విశ్వనాథం గారికి ఫోన్ చేసి, “మావయ్యా! మీ ఆశీర్వాద బలం. మొదటి ప్రయత్నంలోనే మీ ముద్దుల మనుమరాలు విశాల పెళ్ళివారికి నచ్చేసింది. మరో విశేషం కాబోయే వియ్యంకులు పేరు కూడా మీ పేరే విశ్వనాథ్ గారు. ఈ రోజు నిశ్చితార్థం, పెళ్ళి ముహూర్తాలు పెట్టించడానికి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళబోతున్నాను అని సంతోషంగా శుభవార్త మొదటగా ఆయన చెవిన వేసారు.

          “శుభం! చాలా సంతోషం! నా బంగారు తల్లి విశాలకి త్వరలోనే పెళ్ళి జరుగ బోతోంది. మెల్లిగా నేను వీలు చూసుకుని వస్తాను.” అని పెళ్ళికొడుకు, కుటుంబ వివరాలు తెలుసుకుని విశ్వనాథంగారు ఆనందించారు.

          “అమ్మా! నేను వెళ్ళొస్తాను. ఈ రోజు నా ప్రాజెక్ట్ వర్క్ మొదలెడుతున్నాను. వచ్చే సరికి సాయంత్రం అవుతుంది.” విశాల తల్లికి చెప్పి బయటపడింది.

          ఆ రోజు తను వెళ్ళబోయేది మెడ్విన్ హాస్పిటల్స్ లో తన ఎమ్.బి.ఏ కోర్స్ పూర్తి చేయడానికి అవసరమైన ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం హ్యూమన్ రీసోర్స్ మేనేజర్ ని కలవడానికి వెడుతోంది.

          సిటీబస్ ఎక్కి, నేరుగా హాస్పిటల్ దగ్గిర దిగింది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే అక్కడికి హెచ్. ఆర్ మేనేజర్ మానస్ వచ్చి తన క్యాబిన్ లోకి తీసుకెళ్ళాడు. విశాల తన ప్రోజెక్ట్ డాటా మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ వివరాలు అన్నీ డిస్కస్ చేయగానే అక్కడే అప్రూవ్ చేసి మానస్ విశాలకు హాస్పిటల్ లో అన్ని డిపార్ట్మెంట్స్ చూపించి, స్టాఫ్ అందర్నీ పరిచయం చేసాడు. విశాల ఉత్సాహంగా తనకు కావలసిన డాటా సేకరిస్తూ అన్నీ నోట్ చేసుకోసాగింది. తెలియకుండానే రోజంతా చాలా తొందరగా గడిచిపోయింది కదా అనుకుంటూ, మళ్ళీ బస్ ఎక్కింది.

          బస్ లో విశాల ఆలోచనలన్నీ విష్ణుసాయి చుట్టూ తిరిగాయి. అలా ఒకసారి చూడ గానే ఇలా పెళ్ళి కుదిరిపోవడమేమిటో? అంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. తను ప్రొద్దున్న చేసిన ఒక చిలిపి పని గుర్తొచ్చి నవ్వుకుంది. ప్రొద్దున్నే పేపర్ లో ఒక ప్రకటన అందులో గొంతుని బట్టి భవిష్యత్తు చెపుతాను అనగానే ఆసక్తితో ఫోన్ నంబర్ చూసి వెంటనే ఆ నంబర్ కి రింగ్ చేసింది.

          అవతలి వ్యక్తి ‘రాజహంస’ విశాలను పేరు, ఎక్కడ ఉంటారు అని అడిగి కొన్ని విషయాలు కరెక్ట్ గానే చెప్పాడు. మీరు భవిష్యత్తులో ఇంకా చదువుతారు. మీకు ఏ విధమైనా అడ్డంకులు ఉండవు. మీరు పట్టిందల్లా బంగారమే. ఇంకా వివరంగా తెలుసు కోవాలంటే మీరు ఈ అడ్రస్ కి వచ్చి మాట్లాడవచ్చు అని చెప్పాడు.

          “చెప్పాలంటే ఈ రోజు బాగానే జరిగింది. నా చదువు గురించి, ఉద్యోగం గురించి
ఏ విధమైన ప్రస్తావన పెళ్ళిచూపులప్పుడు రాలేదు. నాకు నేనుగా భారతదేశాన్ని వదిలి వెళ్ళాలి అని ఎపుడు అనుకోలేదు. కానీ ఇపుడు నా ప్రమేయం లేకుండా జీవితం నా చేతిలోంచి జారిపోతోందా? నేను ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువు, నేను చేస్తున్న ఎం.బి.ఏ ఈ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతేనో? నిన్న చందనతో మాట్లాడితే కాస్త క్లారిటీ వచ్చింది. అయినా ఏ మూలనో ఏదో భయం. ఒకసారి మళ్ళీ ఆ జ్యోతిష్కుడిని సంప్రతిస్తే ఎలా ఉంటుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండానా?

          నేను చదివే కోర్స్ వల్ల ఇలా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? బహుశా ఇలానే ఏవృత్తిలో ఉన్నవారు, అంటే లాయర్లు, డాక్టర్లు, పోలీస్ వగైరా వగైరా ఆ కోణంలో నుంచే ఆలోచిస్తారా? అపుడు జీవితం అవతలి వారికి దుర్భరమైపోదు… నేను చదివే డెసిషన్ మేకింగ్ సబ్జెక్ట్ లో థీరీ ఆఫ్ ప్రోబబిలిటీ, ఏ దారి సరైనది? కాస్ట్ ఆఫ్ ఆపర్ట్యూనిటీ చదివి నపుడు ఏమి నేర్చుకున్నాను? ఒకేసారి రెండు బంగారం లాంటి అవకాశాలు వస్తే ఏది ఎన్నుకోవడం. ఒకవేళ ఇటువైపు వెడితే ఫలితం ఇలా ఉంటుంది? కాదు ఈ అవకాశాన్ని వదిలి మరో మార్గం ఎన్నుకుంటే వచ్చే ఫలితం సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. లైఫ్ ఈస్
ఇట్ ఎ స్పెక్యులేషన్? మళ్ళీ ఇదిలా జరిగింది, నేను తప్పు చేసానా అన్న రిగ్రెట్ ఉండ కూడదు. ఎవరి జీవితానికి వారే బాధ్యులు అంటారు కదా. పేపర్లో ప్రతిరోజూ ఎన్ని వార్తలు చూడటం లేదు. ఫారిన్ సంబంధం అనగానే ఇలా వెంటనే ఓకే చెప్పేయడం సరైన నిర్ణయమా, కాదా? నాకు జాతకాలంటే పిచ్చి లేదుగానీ, గ్రహస్థితులు,యోగం దటీజ్ డెస్టినీ లేదా తలరాత అన్నది కొంత వరకు నమ్ముతాను. అందుకే ఒక్కసారి ఆ జ్యోతిష్కుడు ఏమంటాడో వినాలి”

          అలా ఆలోచిస్తూ విశాల అప్రయత్నంగా తను జ్యోతిష్కుడు ప్రొద్దున్న చెప్పిన అడ్రస్ నల్లకుంట దగ్గిర దిగింది. ఫోన్ లో గుర్తులు చెప్పినట్లుగా అక్కడకు చేరుకుంది. రాజహంస రోజుకు కేవలం ముగ్గురికి మించి చూడను. మీకు అంగీకారమైతే, మీరు అడగా లనుకున్న ప్రశ్నలు ఏమిటో చెప్పండి. అందుకు రెండువందలు రూపాయలు అవుతుంది అని చెప్పగానే, విశాల డబ్బు కట్టింది.

          తన పెళ్ళి, ఉద్యోగం గురించి అడగగానే, గురుకృపతో మీకు ఇపుడు దివ్యమైన
కాలం. మీ శక్తితో మీకు విదేశంలోనే ఉద్యోగ అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహానికి కూడా అనుకూలంగా ఉంది అని చెప్పగానే విశాల మనస్సు సమాధానపడింది.

          ఇంటికి వెళ్ళగానే తండ్రి శ్రీనివాస్ గారు విశాలతో అన్ని విషయాలు పూసగుచ్చి నట్లు చెప్పారు. పురోహితుడు వచ్చే నెలలో తాంబూలాలు తీసుకోవడానికి, వెంటనే పది రోజులలో పెళ్ళి ముహూర్తాలు ఖరారు చేసినట్లు చెప్పారు.

          తను వెళ్ళిన రాజహంస జ్యోతిష్కుడు చెప్పినట్లుగా పెళ్ళి ముహూర్తం సరిగ్గా గురువారం రావడం, గురుకృప అంటే ఇదేనా? అని ఆశ్చర్యపోయింది. ఇపుడు విశాలకు ఏ విధమైన అలజడి లేదు. భవిష్యత్తు పై ఒక రకమైన ధైర్యం వచ్చింది. తను చేసిన పనికి ముందు సిగ్గుపడినా నెమ్మదిగా తల్లిదండ్రులకి ప్రొద్దున్న పేపర్లో ప్రకటన చూసి, రాజహంస జ్యోతిష్కుడికి ఫోన్ చేసిన విషయం, తన ప్రోజెక్ట్, ఆ తరువాత తన ఉద్యోగం గురించి రాజహంస ఇచ్చిన సమాధానాలు అన్ని చెప్పింది.

          ఏదీ దాచకుండా అన్ని విషయాలు చెప్పే విశాలని “శారద, శ్రీనివాస్ గార్లు ఏమీ అనకుండా, హమ్మయ్యా! మొత్తానికి నీ భయాలు తీరాయి కదా” అంటూ ఆమె తల నిమిరారు.

          విశాల ఫోన్ మ్రోగినపుడు, ఈ ఫోన్ విష్ణుసాయి నుంచి కాదు కదా, అని ఫోన్ చేస్తాడా అని ఎదురుచూసింది. ఆ తరువాత వారం ఎం.బి.ఏ మొదటి సంవత్సరం పరీక్షల హడావిడిలో పడి, మొత్తానికి మొదటి సంవత్సరం పరీక్షలు బాగా రాసింది.

          ఒకరోజు తల్లి శారద, శ్రీనివాస్ గారు ఎంగేజ్మెంట్ కోసం, విశాలతో బట్టల షాపింగ్ వెళ్ళి బట్టలు, ఉంగరాలు కొన్నారు. నిశ్చితార్థం ముందురోజు తాతగారు, పిన్ని, మావయ్య వచ్చారు. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది.

          ఉదయం పదిగంటలకు నిశ్చితార్థం. విశాల ముదురాకుపచ్చ సిల్క్ చీర కట్టుకుని, మెడలో తండ్రి తనకు చేయించిన మూడు పేటల చంద్రహారం, గాజులు, ఉంగరం పెట్టుకుని చక్కగా తయారైంది. హాలులో నిశ్చితార్థానికి అన్నిఏర్పాట్లు జరుగుతున్నాయి. పురోహితుడు అపుడే వచ్చారు. ఇంతలో ఫోన్ మ్రోగితే చందన ఫోన్ తీసి హలో అనగానే,

          నేనండీ! యమున మాట్లాడుతున్నాను. ఒకసారి విశాలకి ఫోన్ ఇస్తారా? అపుడే అక్కడికి వచ్చిన విశాలకి ఫోన్ ఇచ్చింది చందన.

          “హాయ్, విశాల. మర్చిపోయావా నన్ను? మళ్ళీ నువ్వు ఫోన్ చేయలేదు నాకు.”

          “లేదు యమున, నా దగ్గిర నీ నంబర్ లేదు.”

          “నేను ఇక్కడకు ఇంటర్వ్యూ కి వచ్చాను. నీ దగ్గిగరకి వద్దామను కుంటున్నాను.”

          “యమునా, నీకో విషయం చెప్పాలి. ఈ రోజు నా ఎంగేజ్మెంట్.”

          “అవునా! ఇంత హఠాత్తుగా, ఎవ్వరికీ చెప్పకుండా?”

          “అనుకోకుండా నా ప్రమేయం లేకుండా అలా జరిగిపోతున్నాయి, యమునా.

          పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి, అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుతాను.
బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ” అని పెట్టేసింది.

          కొంత మంది స్నేహితులతో పరిచయం, అనుబంధం చదువు పూర్తయినా గాని,
కొనసాగుతూనే ఉంటుంది. బహుశా విశాల ప్రభావం, యమున పై బాగానే ఉంది, ఎందు కంటే ఆ రోజు హాస్టల్ లో యమున తప్పు దోవ పట్టకుండా పరీక్ష మీద ధ్యాస పెట్టమని బాగా బ్రెయిన్ వాష్ చేసింది విశాల.

          ఇంటి ముందు వరుసగా రెండు కార్లు ఆగాయి. కారులోంచి అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు అందరూ ఒకరొకరుగా లోపలికి వస్తున్నారు. అబ్బాయి తండ్రి  విశ్వనాథంగారు అందర్నీ పరిచయం చేస్తున్నారు శ్రీనివాస్ గారికి. విష్ణుసాయి మెరూన్ కలర్ షర్ట్, క్రీం కలర్ ఫాంట్ తో చాలా స్మార్ట్ గా ఉన్నాడు.

          విష్ణుసాయి, విశాల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఉంగరాలు మార్చుకున్నా రంటే ఇద్దరికీ సగం వివాహం అయినట్లే అంటూ విశ్వానాథం గారు విష్ణుసాయి భుజం తట్టారు.

          విష్ణుసాయి వెళ్ళబోతూ, విశాలా! మనం ఇద్దరం అలా బిర్లా మందిరం, షాన్ బాగ్ రెస్టారెంట్ కి వెడుతున్నాం ఈ సాయంత్రం అని చెప్పాడు. అందరూ కలిసి కారులో తిరిగి వెళ్ళిపోయారు.

          ఆ సాయంత్రం విష్ణుసాయి హీరోహోండా స్కూటర్ మీద వచ్చి, విశాలను తీసుకుని బిర్లా మందిర్ వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకున్నారు. షాన్ బాగ్ రెస్టారెంట్ కి చేరుకుని స్నాక్ ఆర్డర్ చేసారు. నెమ్మదిగా విష్ణుసాయి విశాలతో తను లీవ్ ఎపుడు తీసుకున్నది చెప్పాడు. విశాల తను చేస్తున్న ఎం.బి.ఏ సబ్జెక్స్, ప్రాజెక్ట్ గురించి, పరీక్షలు ఎప్పుడున్నాయో చెప్పింది.

          “విశాల, నువ్వు వెంటనే పాస్ పోర్ట్ కి అప్లై చేయాలి. నీ క్వాలిఫికేషన్ ఆధారంగా, నా అప్లికేషన్, నా దానికి తోడైతే త్వరగా మనం ఇద్దరం ఒకేసారి ఆస్ట్రేలియా కలిసి  పెర్మనెంట్ రెసిడెంట్స్ గా వెళ్ళవచ్చు. ఈ లోపుగా ఆరు- ఏడు నెలల వ్యవధిలో నీ ఎం.బి.ఏ పైనల్ ఇయర్ పరీక్షలు కూడా పూర్తి చేసేయవచ్చు. ఆస్ట్రేలియాలో  పరిస్థితు లని బట్టీ దాదాపుగా 120 రకాల వీసాలు ఉన్నాయి. మనం చదివిన చదువు ద్వారా వచ్చిన స్కిల్స్ వల్ల పాయింట్స్ ఆధారంగా స్కిల్డ్ నామినేటెడ్ వీసా నీకు వచ్చేస్తుంది. నువ్వు IELTS పరీక్ష రాయవలసిన అవసరం కూడా లేదు. నేను అల్రెడీ నా కన్సల్టెంట్ తో మాట్లాడాను మన ఇద్దరి గురించి.”

          “అవునా! ఈ విషయాలు ఇప్పుడు చెబుతున్నారు. చాలా మంచి ప్లానింగ్ లో
ఉన్నారు కదా!.”

          “విశాలా! అనుకోకుండా మన ఇద్దరి క్వాలిఫికేషన్స్ చాలా బాగా నప్పాయి, మన లాగానే. దీనికి ముందు నేను ఏ విధమైన ప్లానింగ్ చేయలేదు. ఎపుడైతే నేను మొదటి సారిగా నిన్ను చూసి, మాట్లాడానో, తరువాత నుంచి, థాట్ ప్రోసెసింగ్ నాలో మొదలైంది. కార్యరూపం దాలిస్తే గాని, అనుకున్న ఎండ్ రిజల్ట్ తెలియదు. రాదు.

          నువ్వు MIS – Management Information Systems ప్రాజెక్ట్ చేస్తున్నాను అన్నావు కదా! ఆ సబ్జెక్ట్ లో నేను ఇక్కడ చేస్తున్న జాబ్ లో డాక్యుమెంట్ సబ్ మిట్ చేసాను మేనేజ్మెంట్ ట్రైనింగ్ చేసినపుడు.”

          “వావ్! అది నాకు నిజంగా హెల్ప్ అవుతుంది. సరైన సమయంలో అవసరమైన
సమాచారం దొరికితే, సగం పరీక్ష పాసైపోయినట్లే. నాకీ రోజు చాలా ఆనందంగా ఉంది. మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు, కొన్నిరోజుల నిశ్శబ్దం తరువాత.”

          “విశాలా, ఇకపై నిశ్శబ్దం ఉండదు. ఐ విల్ కీప్ అప్ డేట్ ఎవ్విరిథింగ్ విత్ యు. ఉయ్ విల్ వర్క్ టుగెదర్” అంటూ విశాల చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు  విష్ణు సాయి.”

          విశాల బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి.

          తరువాత విశాలను, విష్ణుసాయి వాళ్ల ఇంటి దగ్గిర దిగబెట్టి, నేను రేపు ఫోన్ చేస్తాను అని వెనుదిరిగాడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.