ఒక్కొక్క పువ్వేసి-22

సమ సమాజ న్యాయమే – అంబేద్కర్

-జూపాక సుభద్ర

          యిది వరకు అంబేద్కర్ అంటే మాదిగ, మాలల నాయకుడనీ, వాళ్లకే సంబంధీకు డనీ మనువాదులు దూరముంచారు. మనువాదాన్ని వొదిలేయని మార్కిసిస్టులు అంబేద్కర్ బూర్జువా ప్రతినిధి అనీ, బ్రిటీష్ ఏజెంట్ అని పక్కనబెట్టి ప్రచారం చేసిండ్రు. అట్లా కమ్యూనిస్టులు అస్పృశ్య కులాలకు అంబేద్కర్ ని అందకుండా చేసిండ్రు. కానీ సామాజిక అవసరాలు, రాజకీయార్ధిక, తాత్విక అంశాలు అంబేద్కర్ని అవాచ్యమ్ చేయ లేని పరిస్థితులు. అంబేద్కర్ని తలకెత్తుకోక తప్పని కాలం. అంతర్జాతీయంగాఅంబేద్కర్ ప్రపంచ మేధావి అని గుర్తిస్తున్నది. దేశీయంగా రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు కోసం అంబేద్కర్ కొలువక కొనియాడక తప్పుటలేదు.

          అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే ‘చాయ్ అమ్ముకునే అతను ప్రధానమంత్రి అయ్యానని, ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు వేనోల్ల పొగడుతుంటారు. కానీ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో మాత్రం మనుస్కృతినే ఆచరిస్తుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కొత్త సచివాలయా నికి డా॥ బి. ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం, ప్రపంచంలోనే ఎత్తయిన నూట యిరువై ఐదు (125) అడుగుల అంబేద్కర్ విగ్రహం నగరం నడిబొడ్డున (NTR గార్డెన్ పక్కన) నెలకొల్పడం చాలా గొప్పవిషయం. చాలా సంతోషకరము చారిత్రకం. విగ్రహాలంటే కేవలం విగ్రహాలు కాదు. అలంకార ప్రాయం కూడా కాదు. ఒక విగ్రహం వున్నదంటే… ఆ విగ్రహం ఎవరు? ఏంటి ప్రత్యేకత, చరిత్ర, అతని/ఆమె గొప్పతనం అనేవి మాట్లాడు కోవాల్సి వస్తుంది. తెలవని వాల్లకు, పిల్లలకు చెప్పాల్సి వస్తుంది. వారి స్మరణ, పోరాట స్పూర్తిని కొనసాగించేందు కు తోడ్పడ్తాయి విగ్రహాలు. కానీ జనం ముఖ్యమంత్రి అయినంక (తెలంగాణ) ఏనాడు అంబేద్కర్ కి దండేసి దండం బెట్టలే, కేవలం బహుజన ముఖ్యంగా దళిత ఓటుబ్యాంకు పదిల పర్చుకోడానికే అని మాట్లాడుకుంటున్నరు. పైకి అంబేద్కర్ని గొప్పగ చేస్తూ — అతను రాసిన రాజ్యంగాన్ని అంగీకరించక అమలు ఆచరణకు దూరం బెడ్తున్నరు, మనువాదులు.

          అంబేద్కర్ చేసిన సేవలకు తగిన గుర్తింపు రాక పోడానికి అంబేద్కర్ మనువాదులే
కారణం. అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్యం, లౌకిక, సార్వభౌమాధికార, సమానత్వాల విలువల పై నిత్యం దాడులు జరుగుతున్నాయి. అందుకే ప్రజలు ప్రభుత్వాలను కోరు కుంటున్నది అంబేద్కర్ భావజాల వ్యాప్తిని. ప్రజలు కోరుకుంటున్నట్లు ప్రభుత్వాలు విగ్రహాలు పెట్టి చేతులు దులుపు కోకుండా ప్రాతినిధ్యాలు అందరికి సమానంగా వెళ్లాలి. జ్యుడిషియరీ, ఎక్స్ క్యూటివ్, లెజిస్లేచర్ లతో కుల, మత, జెండర్ వివక్షల్లేకుండా అందరికి సమాన ప్రాతినిధ్యం, భాగస్వామ్యాలు చేకూర్చాలి. గ్రామం నుంచి పార్లమెంట్
అధికారంలో అందరికీ భాగం కల్పించి నప్పుడే అంబేద్కర్ ఆశయాలనునెరవేర్చినసట్లు.

          ఇప్పుడు అంబేద్కర్ రచనల మీద, రాజ్యాంగమ్మీద చాలా చర్చలు జరుగు తున్నయి. అంబేద్కర్ ఒక్క అంటరాని కులాలకే కాదు, అంబేద్కర్ అందరి వాడనీ, బీసీలకు సంబంధించి అంబేద్కర్ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా వున్నయి? అతని ‘హూ ఆర్
శూద్రాస్ ‘ (who are shudras) ని మల్లా అధ్యయనాలు దృక్పథాల్ని చర్చిస్తున్నారు. ఒక కొత్త దృక్పథం నుంచి అంబేద్కర్ ని అధ్యయనం చేస్తున్న సందర్భమిది. అంబేద్కర్ ని ఓన్ (own) చేస్కుంటున్న సమయం. యిట్లా దేశంలోనే గాదు, ప్రపంచంలోని అణచి వేతకు గురవుతున్న జాతులకు అంబేద్కరిజం ఒక ‘ఐకాన్’ గా మారుతున్న దశ. కానీ, మహిళా సంస్థల నుంచి, ఫెమినిస్టు సంగాల నుంచి అంబేద్కర్ భారత దేశానికి, అణ గారిన సమూహలకు, సవర్ణ జెండర్లకు చేసిన సేవ త్యాగాల పట్ల మౌనం. అంబేద్కర్ మహిళల పట్ల కనబర్చిన జెండర్ సమానత్వాలను వాటిని చట్టబద్ధం అతని కృషి హిందూకోడ్ బిల్లు రూపకల్పన అది వీగి పోతే తనమంత్రి పదవిని తృణప్రాయంగా యెంచి త్యాగం చేసిన కమిట్ మెంటు భారతదేశంలో ఏ సంస్కర్త నుంచి, ప్రజాప్రతినిధి నుంచి చూడబోము. మహిళ హక్కుల తక్షణ గోషను రాజ్యాంగ బద్ధం చేయడానికి అంబేద్కర్ పడిన తపన, త్యాగం పట్ల అవాచ్యాలు మౌనాలుగా వుండడానికి ప్రధాన కారణం అంబేద్కర్ని అంటరాని కులంగా చూడడమే.

          మనువాదాన్ని మహిళల్ని కూడా వదల్లేదు. భారతదేశ సంస్కర్తలు, విప్లవకారులు,
మహిళాభివృద్ది కోరుకొన్న వారు ఎవరైనా వున్నారంటే అది అంబేద్కరేననేది చారిత్రక సత్యము. అది హిందూకోడ్ బిల్లు దీని పర్యవసానాలే చాటి చెప్తాయి. మనువాదాల కబంధ హస్తాల నుంచి యింకా విముక్తి కాని మన సవర్ణ మహిళలు, మహిళా సంగాలు, ఫెమినిస్టు సంస్థలు అంబేద్కర్ సేవా, త్యాగాల్ని, తాత్వికతను గుర్తించడానికి వెనకా
ముందాడుతున్నారు. కమ్యూనిస్టు సంగాలు కూడా అంబేద్కరిజాన్ని మాట్లాడ్డం కుల వ్యతిరేక సంగాలు నిర్వహించడం కులం యొక్క వాస్తవాన్ని గుర్తించి నందువల్లనే. కానీ కమ్యునిస్టు, ఫెమినిస్టు మహిళా సంగాలు మాత్రం యీ కుల వాస్తవాల్ని గుర్తించినట్టు లేదు. స్త్రీ విముక్తి సంస్కర్తలంటే రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యా సాగర్ లాంటి బ్రాహ్మణ సంస్కర్తలనే పుంకాను పుంకాల సాహిత్యాలు అవగాహనలు కొనసాగు తున్నాయి.

          కానీ అంబేద్కర్ స్త్రీల హక్కుల రక్షణ కోసం చట్ట బద్దత కోసం చేసిన నిర్విరామ కృషి త్యాగం అప్రస్తుతం, ఆవాచ్యం చేసిన ధోరణులు కనిపిస్తుంటాయి. సవర్ణ మహిళలు రాజ్యాంగ రక్షణ చట్టాలను అనుభవిస్తూ… జెండర్ ప్రజాస్వామ్యాలను, సమానత్వ చట్టాలు రూపొందించిన అంబేద్కరిజం పట్ల మౌనాలు కొనసాగుతున్నాయి. ఆనాడు సరోజనీనాయుడు లాంటి సవర్ణ మహిళలు తమ సొంతకుల మగనాయకులతో చేయి కలిపి మహిళా బిల్లును ఓడించిన భావజాలమే యింకా పనిచేస్తుందకు కావచ్చు. కుల, మత, జెండర్, ప్రాంతముల మధ్య సమానత్వాలుండాలి. లౌకిక, ప్రజాస్వామ్యాలుండాలి. సోదర భావముండాలనే భావజాలాన్ని రాజ్యాంగ బద్దంగా పొందు పర్చింది డా॥ బి. ఆర్. అంబేద్కర్.

          హిందూ కోడ్ బిల్లులో చాలా స్పష్టంగా ఈ బిల్లు హిందూ సవర్ణ మహిళల స్వేచ్చా స్వాతంత్రాల కోసం అని పేర్కొన్నాడు. ఆస్తిహక్కు, వివాహహక్కు, విడాకుల హక్కు, వారసత్వ హక్కు, దత్తత స్వీకార హక్కుల్లాంటివి యింకా వితంతు వివాహం, పునర్వివాహా ల్లాంటివి చట్టబద్ద హక్కులుగా రూపకల్పన చేశాడు. ఇట్లాంటి రాజ్యాంగ బద్ద హక్కల వల్లనే యీరోజు ‘అసూర్యంపశ్యలుగా, నాలుగు గోడలే జీవితంగా వున్న సవర్ణ మహిళలు ప్రధానమంత్రి (ఇందిరాగాంధి) రాష్ట్రపతి (ప్రతిభా పాటిల్) గవర్నర్లు, మంత్రులు,ముఖ్య మంత్రులు, ప్రజాప్రతినిధులయ్యారు. విదేశాలకు వెళ్లి అక్కడ కూడా తమ ఆస్థిత్వాన్ని చాటుతున్నారు. అనేక వ్యాపార వాణిజ్య సంస్థలకు, బ్యాంకులకు, కంపెనీలకు సియీవో లుగా (CEO) వున్నారు. అకాడమిస్టులుగా, సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు జడ్జీలుగా,
కలెక్టర్లుగా అంతరిక్షాల క్కూడా వెల్తున్న సైంటిస్టులుగా యింకా అనేక రంగాల్లోప్రముఖం గా విస్తరించారు. యిలా ఎదగడానికి గల చారిత్రక నేపద్యాల్ని గుర్తించాల్సిన  అవసర ముంది.

          అణగారిన కులం నుంచి వచ్చిన వాడిగా శ్రమలో లేని మహిళలు, శ్రమలో వున్న మహిళల కుల జెండర్ ప్రత్యేకతల్ని గుర్తించినందు వల్లనే అంబేద్కర్ ‘డిప్రెస్డ్
వుమన్ ఫెడరేషన్’ ఏర్పాటు చేసి దీనికి అదే కులాల నుంచి వచ్చిన మహిళలచే నడిపిం చాడు. సులోచనా బాయి డోంగ్రీ లాంటి లీడర్లు అట్లా ఎదిగొచ్చిన వాళ్లే. 1942 లో డిప్రెస్డ్ మహిళా ఫెడరేషన్ మహాసభలు నాగ్ పూర్ లో పెద్ద ఎత్తున 25వేల మందితో జరిగినయి. ఈ సభలోనే మహిళా కార్మికుల కోసం, కార్ఖానాలు, కంపెనీల్లో పంజేసె మహిళా కార్మికుల కోసం అనువైన పని స్థలాలుండాలనీ, ఎనిమిది గంటల పని దినాలుండాలనీ, సమాన పనికి సమాన వేతనం వుండాలనీ కనీస వేతనాలుండాలనీ, కార్మిక పిల్లలకు నిర్బంధ విద్య వుండాలనీ, బాల్యవివాహాలు నిషేధించాలనీ, చదువుకునే ఆడపిల్లలకు హాస్టల్స్ ఏర్పాట్లు చేయాలనీ, స్కాలర్షిప్ లు యివ్వాలనీ, పనిప్రదేశాల్లో ప్రమాదాలు జరిగితే కంపెన్జేషన్ కట్టివ్వాలనీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు యివ్వాలనే తీర్మాణాలు చేసింది. తర్వాత చట్టాలైనాయి. అవన్ని యిప్పుడు సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలంతా చట్టబద్దంగా పొందు తున్న హక్కులు. అసంఘటిత రంగాల్లో కూడా అమలు కావాల్సిన శ్రామిక మహిళా చట్ట బద్ద హక్కులు. కానీ ప్రైవేటు అసంఘటిత
రంగాల్లో కూడా హక్కుగా పొందే చట్టాలు. డిప్రెస్డ్ వుమెన్ కులాల కన్నా సవర్ణ మహిళలు ఎక్కువ లబ్ది పొందారు హిందూ కోడ్ కల్పించిన హక్కుల వల్ల.

          ఈనాడు అంబేద్కర్ ఆకాంక్షించిన రూపకల్పన చేసిన రాజ్యాంగవిలువలైన సమాన న్యాయాలు, జెండర్ ప్రజాస్వామిక దృక్పథాలు, లౌకిక, సార్వభౌమాధికార విలువల పై ఫాసిస్ట దాడులకు వ్యతరేకంగా పోరాడుతూ కులంలేని సమాజనికై ప్రగతిశీల శక్తులన్నీ కలిసిరావల్సిన సందర్భమిది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.