కొత్త అడుగులు – 41

మొగలి రేకుల పరిమళం – ‘తమ్మెరరాధిక’ కవిత్వం

– శిలాలోలిత

          ‘తమ్మెర రాధిక’ కవిత్వమిది. ఎప్పట్నుంచో రాస్తున్నా ఇప్పుడు పుస్తకం చేస్తున్న సందర్భమిది. ఆమెను చూసీ చూడగానే శాంతంగా అనిపించింది. కవిత్వం పట్ల, కథల పట్లా ఎంతో ప్రేమున్న వ్యక్తిలా అనిపించారు. మాట, మనిషి ఎంత నెమ్మదో కవిత్వం అంత వేగంగా, తీవ్రంగా నడిచింది.

          మీరేం చేస్తున్నారు అంటే, కొంచెం మొఖమాట పడి ‘ఏం చెయ్యట్లేదు, ఇంట్లోనే’ అన్నారు. అంటే ఇంటిని మొత్తంగా మోస్తున్న భారవాహిక ఆమె. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ క్రమంలో ఎందరో రచయిత్రులు, కవయిత్రులు వెలుగులోకి వచ్చారు. బిడియాన్ని పక్కన పెట్టి బిగ్గరగా తమ గొంతును విన్పించే ధోరణి అంతటా కనిపిస్తోంది.

          మహబూబ్ నగర్ జిల్లాలోని తొర్రూరుకు చెందిన వ్యక్తి రాధిక. 60 కవితలతో ఒక కొత్త కవితా సంపుటిని మన ముందుకు తెస్తోంది. తెలంగాణా సమస్యల ప్రతిబింబంగా కూడా చెప్పొచ్చు. రైతు మీదనే 5,6 కవితలున్నాయి. నిశితమైన ఆమె చూపు, భావోద్వేగం, ఇంకా ఇంకా పీడనకు, రోదనకు గురౌతున్న రైతుల బతుకు చిత్రాలనెన్నింటినో తన కోణంలో కవిత్వీకరించింది. వస్తు వైవిధ్యమున్న కవితలెక్కువున్నాయి.

ఇంద్ర ధనుస్సును పారేసుకున్న ఆకాశం వెతుక్కుంటుంది
జట్లుగా ఎగురుతున్న పిట్టల గుంపు నుంచి ఎండతునకల్ని పోగేసి
చలిమంట వేద్దామన్న దురూహ దుర్ముభి
మేఘాలు లేని ఆకాశంలో, చల్లదనం లేని ఉక్కపోతలో
ఎన్ని ఎకరాలు పండించినా కర్షకుడి బతుకు పాటలో
వెలుగు వైభవం కనుమరుగైంది.

కాలపు రథ చక్రాల క్రింద కరువు నీడలు నలిగి పోతున్నా
ఖాతరు చెయ్యని కాలాన్ని మట్టిలో కలిపి

మట్టి మనిషిని బతికించు కోవాలి
కలోగంజో పోసి!

– అని నిర్వేదాన్ని ప్రకటిస్తుందొకచోట.

నేల లోని నిశ్శబ్దం
ఇన్నాళ్ళు నెర్రెలిచ్చిన భూమిగా
కాలంతో యుద్ధం చేసింది.
సుత్తి, దెబ్బలు తిన్న నేల అడవై ప్రతిధ్వనించింది.
పొలం దున్నడానికి అడవి నాగలై వొచ్చింది.
విత్తనమెయ్యడానికి ఎద్దుకు పచ్చగడ్డై ఎదురొచ్చింది.
కలుపు తీసే చేలుగా , మండే కొలిమిలో పని ముట్టుగా
రైతు చేతిలో
కాలపు వారసత్వ సంపద పై
అడవి, ఆకాశం, నేలా, నీరుగా పులకిస్తూ
సుఖ:దుఖాల్లో తోడుంటాయి.
పాటగా ప్రవహిస్తూ పంటగా నేలను ఫలిస్తూ..


రైతన్నను అన్నం గిన్నెగా పోల్చిందొకచోట.

          అలాగే, రోహిత్ పట్ల తనకున్న ప్రేమను ప్రకటించిన మంచి కవితకొటుంది. స్త్రీలపై రోజు రోజుకీ పెరుగుతున్న హింసను, వివక్షను చాలాచోట్ల ప్రస్తావిస్తూ జరుగుతున్న అన్యాయపు మూటల్ని విప్పింది.

‘బతుకంతా నెత్తుటి రహదార్లే 
ఏ మూల తాకినా వేడి రక్తం చిందే మృగత్వం’ అంటుంది.

          ప్రకృతి కూడా ఈ కవయిత్రికి చాలా ఇష్టం. అందుకే పదే పదే చాలా చోట్ల తన
సున్నితమైన భావ ప్రకటనలను ఎన్నో చేసింది. గొంగళిపురుగు, సీతాకోకలా మారే మధ్య దశను కొత్తగా చెప్పింది. మృత్యు స్పర్శ నిండిన కవితల్లో, ఇప్పటి స్థితిని పదే పదే కవిత్వీకరిస్తూ పోయింది. కుందుర్తి నగరంలో వాన అంటే, ఈమె ‘ప్రశ్నార్ధకపు వాన’ అంటూ కొత్త ప్రయోగం చేసింది. చిత్రమైన ఊహలను చాలా చోట్ల బలంగా చెప్పడానికి ప్రయత్నించింది.

‘సూర్యుడు భూమ్మీద నడుస్తున్న ఆనవాళ్లతో కలగంటున్న నేను..తన
బతుకు ముడిని విప్పింది.

          స్త్రీలను ధైర్య వంతులుగా బతకమని, శాసనకర్తగా మారమని స్పష్టం చేసింది .

‘ఎన్ని కాలాలని, ఎన్నియుగాలని అడ్డం పెట్టుకొని తనని తాను రక్షించుకుంటుంది?

బతుకునిచ్చే, బతకనిచ్చే, చేతులే కార్చిచ్చులై వెతారిస్తుండే

శారీరిక గాయాలేమో కానీ, మానసిక మరుగజ్జుతనం జీవితాంతం
….
ఆదిమ సహజీవితాల పరాక్రమం ఆవహింప జేసుకో

నీ బాహువులకు మేం బలవుతాం.
నీ కన్నులకు మేం విస్ఫులింగాల మవుతాం.
మొత్తం సమాజమే నీవవుతాం
ప్రపంచాన్ని శాసించడం నేర్చుకో’

          ఇలా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మంచి కవయిత్రిని ఇలా పరిచయం
చేయగలిగినందుకు సంతోషిస్తూ తమ్మెర రాధికకు అభినందనలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.