నిష్కల – 29

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: కొంత కాలం ఎడబాటు తర్వాత నిష్కల దగ్గరకు వస్తాడు సహజీవనంలో ఉన్న అంకిత్. పెద్ద కొడుకు మీద బెంగతో ఉన్న సుగుణమ్మ బతికుండగా చూస్తానో లేదోనని దిగులు పడుతుంది. అత్తగారి దిగులు పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలని శోభ అనుకుంటుంది..  అంకిత్ తల్లి ఫోన్ అందుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల 

***

          తన గుమ్మం ముందు నిలిచిన ఆవిడని ఆశ్చర్యంగా చూస్తున్నది. ఆవిడెవరో అంతకు ముందెప్పుడు చూడక పోయినా పోల్చుకో కలిగింది. కళ్ళ ముందు నిలిచిన ఆమెను సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ అలాగే నిలబడిపోయింది నిష్కల.
 
          ఎన్నడూ ఊహించనిది. తన దగ్గరకు వచ్చిందేమిటి అని ఆలోచిస్తూ కారు పార్కింగ్ చేసి ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని చుట్టూ పరికించింది. 
 
          ఎవ్వరూ కనిపించలేదు. 
 
          నిన్నటి వరకు ఆకులురాలిపోయి జీవం లేనట్లున్న మొక్కలు నిండా పూలతో .. ఇంటి ముందు, నోరు తెరిచి ఆహ్లాదకరంగా మాట్లాడుతున్నట్లు .. ఎవరికో స్వాగతం పలుకుతున్నట్లు .. వసంతం రావడం అంటే ఇదేనేమో .. 
 
          “సారీ నిష్క్ .. ముందస్తు అప్పోయింట్మెంట్ లేకుండా వచ్చేసాను. అంటూ సూటిగా నిష్కల కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ, మెసేజ్ చేసాను. రావచ్చా..  అని. రెస్పాన్స్ లేదు.  ఓ పని మీద ఇటువైపు వచ్చాను. ఇక్కడికి వచ్చాను కదా నిన్ను చూసిపోవాలనిపించి వచ్చాను”. 
 
          ఆశ్చర్యంతో చూస్తున్న నిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ “అసలు నేనెవరో చెప్పలేదు కదా .. నేనెవరో తెలిస్తే నా రాకను అంగీకరిస్తావో లేదో .. ” ఆ గొంతులో సంకోచం. 
 
          ” మీరెవరో నేను పోల్చుకోగలను. రండి కూర్చోండి” అంటూ లోనికి ప్రేమగా ఆహ్వానించింది నిషి. మంచి మల్లెల పరిమళం ఆమెతో పాటు లోపలికి వచ్చి అంతా వ్యాపించింది. 
 
          మంచినీళ్లు కావాలా అని అడిగి ఆమె జవాబు కోసం చూడకుండా కిచెన్ లోకి వెళ్లి గాజు గ్లాసులో నీళ్లు, అంకిత్ కోసం సిద్ధంగా పెట్టిన కాఫీ కప్పు ట్రే లో పెట్టి తీసుకొచ్చింది నిష్కల. 
 
          ఆవిడ రాకలోని ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు. చిరునవ్వుతో కాఫీ కప్పు అందుకుంటున్న మహిళని పరిశీలనగా చూస్తున్నది నిష్కల. ఆవిడ రంగు తప్ప పోలికలు అసలు ఏమీ సారాలో కనిపించవు. 
 
          “మీరిద్దరి పరిచయం స్నేహంగా మారడం గురించి, ఆ స్నేహంలోంచి బయట పడిన విషయాల గురించి చాలా వివరంగా సారా చెప్పింది. సారా మాటల్లో నీ పేరు విన్నాను కానీ ఎవరో తెలియదు. వివరం తెలిసిన క్షణం నుండి నిన్ను చూడాలని, గుండెలకు హత్తుకోవాలని బలమైన కోరిక. 
 
          ఎందుకు అంటే ఇది అని చెప్పలేను. 
 
          బహుశా నువ్వు  కూడా నా ప్రభా రక్తం కావడం వల్లనేమో.. ప్రభా తాలూకు మనిషివి కావడం వల్లనేమో.. నువ్వు కూడా నా బిడ్డవే అని అనిపిస్తున్నది. నీలో మీ నాన్న పోలికలు కనిపిస్తున్నాయి. 
 
          మీ నాన్న జీవితంలోకి నా రాక మీ ఇంట్లో ఎంత పెద్ద దుమారం లేపిందో, మీ అమ్మ ఎంత నష్టపోయారో అంతా తెలుసు. కాలంలో కలిసిపోయిన రోజుల్ని తెచ్చివ్వలేను. మీ అమ్మ జీవితాన్ని తిరిగివ్వలేను.. ” హృదయం విప్పి గబగబా మాట్లాడేస్తున్నది.  తన లోపల గూడు కట్టుకున్న బాధ వరద పొంగులా ఆ మాటల్లో బయటపడుతున్నది. నాన్న అంటే అమితమైన ప్రేమ అని ఆమె మాట్లాడుతున్నప్పుడు అర్ధమైంది. 
 
          “మీ నాన్న అంటే నీకు కోపం ఉండొచ్చు.. నువ్వు ఎలా ఫీలవుతావో తెలియదు కానీ ఆయన చాలా మంచివాడు. మీ అమ్మకు అన్యాయం చేయాలని ఆయన ఉద్దేశ్యం కాదు. మనసుకు విరుద్ధంగా బతకలేక, సమాజం నిర్దేశించిన కట్టుబాట్లు అమలు పరచలేక ఆయన పడిన నరకయాతన ఏంటో నాకు తెలుసు. అవును, నాకు మాత్రమే తెలుసు. 
కన్నపేగు కోసం కొట్టుకులాడే మీ నాన్నమ్మ పడుతున్న వేదనను నేను అర్ధం చేసుకో గలను” కళ్ళలో ఊరుతున్న నీటిని ముఖానికి ఉన్న కళ్ళద్దాల మాటున నొక్కిపెడుతూ నిషిని కౌగలించుకుంది ఆ మహిళ.  
 
          కొన్నేళ్ళుగా తల్లి హృదయ స్పర్శకు దూరంగా ఉన్న నిష్కలకి కూడా దుఃఖం పొంగుకొచ్చింది. ఆ తల్లి స్పర్శను ఆస్వాదిస్తూ నిలిచిపోయింది. 
 
          “ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్ళు” ఉద్వేగంగా అంటున్న ఆవిడ మనసును అంచనా వేస్తూ ఉన్నది నిష్కల. 
  
          ఆవిడ మాట్లాడుతూ మాటల మధ్యలో ఇండియన్ సమాజం అనే కాదు ఇక్కడైనా ఎక్కడైనా ఈ సమాజం స్త్రీల ఆత్మగౌరవం పాలిట కౌరవ సభ. ఒక సాధారణ స్త్రీకి ఎదురయ్యే అవమానాలు కళ్ళ ముందే జరుగుతున్నా మౌన ముద్ర వహిస్తారు. 
 
          “కౌరవసభ .. మీ నోట “ఆశ్చర్యంగా అంటున్న నిష్కలని చుస్తూ మీ నాన్నతో సహజీవనం మొదలు పెట్టాక ఇండియన్ ఎపిక్స్ తెలుసుకున్నా నిష్. ఇంట్లో తమ మగ పిల్లలకు ఆ నాటి నుండి ఈనాటి వరకూ అందరూ ఆడపిల్లకు సుద్దులు చెప్పేవాళ్లే కానీ మగపిల్ల వాడికి ఎలా ఉండాలని చెప్పరు. ఆడపిల్లను ఎట్లా చూడాలో చెప్పరు.  ఆడ పిల్లల హృదయ వేదనలకు, ఆక్రోశాలకు, ఉక్రోషాలకు ప్రాధాన్యత ఇవ్వరు అంటూ మాట్లాడుతుంటే ఆవిడ తనకు చాలా దగ్గర అనిపించి ఆత్మీయంగా మాట్లాడిందినిష్కల. 
 
          పెళ్లి కంటే లివిన్ రిలేషన్ ఇష్టపడతావని సారా చెప్పింది. నీ వ్యక్తిగత విషయం అడగకూడదు కానీ నువ్వు కూడా నా బిడ్డవే అని చొరవ తీసుకుని అడుగుతున్నా. లివిన్ లో ఉన్నావా? అడిగింది ఆమె. 
 
          మొదటి పరిచయంలోనే అంత చనువు తీసుకుంటున్న ఆవిడను చూస్తూ అవునని తలూపింది నిష్కల. 
 
          సహజీవనం సహచరులు అనుకున్నా, పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అనుకున్నా  ఒక ఆడ, ఒక మగ కలిసి జీవన బంధం ఏర్పరచుకోవడమే కదా..!
 
          ఆ బంధం బలమైన స్నేహంగా మారితే, స్నేహానికి ప్రేమ కలిస్తే అదొక అద్భుత మైన బంధం అనుకుంటూ ఉంటాను. ఎక్కువ తక్కువ సమానత్వం వంటివి ఉండవేమో.
 
          ఆవిడ మాటలకు ఫిదా అయిపోయింది నిష్కల. 
 
          ఆసియా మహిళల జీవితాలు చూస్తే ఇద్దరు బానిసల మధ్య ఏ బంధం ఉంటుందో అదే బంధం ఉంటుందని అనిపిస్తుంది. స్వేచ్ఛాయుతమైన బంధం కాకపోతే అలాగే అనిపిస్తుందేమో.. నేను పెద్దలు చూపిన వ్యక్తిని కాదని మీ నాన్న మీద ప్రేమతో అమెరికా వచ్చేశాను. భళ్ళున నవ్వింది ఆమె. 
 
          భర్తను నేను కంట్రోల్ లో పెట్టుకోవాలని, అతను నా గుప్పిట్లో ఉండాలని మా నాయనమ్మ, అమ్మమ్మ చెప్పిన మాటలు నా చెవికి ఎక్కించుకోలేదు. పురుషుడు ఆమెను తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని, ఆమె అతన్ని తన గుప్పిట బిగించాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి.. హహ్హా..  
 
          ఒకరి ప్రేమలో ఒకరు, ఒకరి మీద నమ్మకంతో ఒకరు లేకపోతే ఆ బంధం ఎలా ఉంటుంది? బహుశా ఇక్కడి ఈ సమాజాన్ని చూశాక లోతుగా ఆలోచించడం అర్థం చేసుకోవడం మొదలయ్యాక ఇలా మాట్లాడుతున్నానేమో.!
 
          మీ నాన్నతో జీవన ప్రయాణం మొదలుపెట్టాక భారతీయులంతా నా వాళ్ళే అనిపిం చేది. వారి జీవన విధానాన్ని పరిశీలిస్తూ ఉండేదాన్ని. చాలా మంది భారతీయుల్లో ఆడ పిల్లకు వ్యక్తిత్వం ఉండడం ఒక లోపంగా భావిస్తారని నా అవగాహన.. అది తప్పో రైటో .. అని కొద్దిగా ఆగింది ఆవిడ. 
 
          ఆడపిల్లకు సొంత వ్యక్తిత్వం ఉండడాన్ని భారతీయ సమాజం భరించలేదు. ఆ వ్యక్తిత్వమే అనేక ఘర్షణలు, కష్టాలు ఆడపిల్ల ఎదుర్కోడానికి కారణమవుతుందనేది నిజమే. అణిగిమణిగి ఉన్న ఆడపిల్లనే ప్రోత్సహిస్తుంది సమాజం అనుకున్నది నిష్కల.  
 
          నేనిలా ఉండను ఉండలేను అనకుండా మన లోపలి మనని కాపాడుకుంటూనే అందరితోనూ మనగలగాలి చెప్తున్న ఆవిడను చూస్తుంటే తల్లి బిడ్డతో చెప్పినట్లు, గురువు శిష్యుడితో చెప్పినట్టు జ్ఞానబోధ చేసినట్టు అనిపించింది నిష్కలకు.  
 
          మొదట కొంచెం సంకోచంగా ఉన్నప్పటికీ తర్వాత ఎంతో పాత మిత్రులతో మాట్లాడి నట్లు, చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మీయులతో మాట్లాడినట్లు అరమరికలు లేకుండా మాట్లాడుతున్న ఆమె స్వచ్ఛమైన మనసు అర్ధం అవుతున్నది నిష్కలకు. 
 
          ఆవిడ గురించి అమ్మతో, నాన్నమ్మతో చెబితే ఎలా ఫీలవుతారు?
 
          ఆవిడ ఉన్నంత ఆత్మీయంగా, అభిమానంగా ఉంటారా.. కుటుంబంలో కలుపు కుంటారా.. అవతలి వ్యక్తి చెబుతున్న దానికి తల ఊపుతూ వింటూనే ఆలోచిస్తున్నది నిష్కల.. 
   
          అంతలో అంకిత్ జిమ్ నుండి వచ్చాడు. నిష్కల పరిచయం చేయబోతుండగా సారా తల్లిని అని ఆమె పరిచయం చేసుకున్నది. 
 
          అంకిత్ కి సారాతో కూడా పరిచయం లేదు. ఎవరో నిష్కల మిత్రురాలు అను కున్నాడు. 
 
          మర్యాదపూర్వకంగా కొద్ది క్షణాలు ఉండి లోనికి వెళ్ళిపోయాడు అంకిత్. 
 
          మీ సమయాన్ని నేను తీసుకోవడం భావ్యం కాదు అంటూ, ఇద్దరినీ ఈ వీకెండ్ తమ ఇంటికి లంచ్ కి రమ్మని ఆహ్వానించి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళే వరకు బయట నుంచొని బై చెప్పి లోనికి వచ్చింది నిష్కల. 
 
          ఈ రోజు నిష్కలకు పండుగలా ఉంది. ఆనందంగా ఉంది.  
 
          అమ్మ వయసులో ఉన్న ఇద్దరు అమ్మల హృదయం ఆవిష్కృతమైన రోజిది.  ఎన్నడూ ఊహించని గొప్ప బహుమతి ఆ ఇద్దరితో మాట్లాడడం అనుకున్నది నిష్కల. 
భర్త, ఇద్దరు మగపిల్లలతో చెప్పలేనివి గుండె గది లోపలే గూడుకట్టుకుని దాక్కున్నవన్నీ విప్పి ఒక స్త్రీగా మనస్ఫూర్తిగా మాట్లాడింది అంకిత్ తల్లి. కోడలితో అత్తగారి భేషజం చూపించకుండా చాలా స్నేహంగా ఉన్నది. ఆత్మీయంగా ఉన్న ఆమె మాటలు ఆమెతో సాన్నిహిత్యాన్ని పెంచాయి. 
 
          సారా తల్లి కూడా అంతే. సవతి కూతురు గురించి తెలియగానే ఎంత ఆపేక్షగా వచ్చింది. భర్తను పోగొట్టుకున్న ఆమెలో గూడు కట్టుకున్న వ్యధ తగ్గించుకునే ప్రయత్న మేమో.. 
 
          వ్యక్తిగా ఆమె స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండే వ్యక్తి అని అర్ధమైంది. నాన్నకు ఆవిడ మంచి అవగాహన ఉన్న భాగస్వామి. మూడుముళ్లు, ఏడడుగులు లేదా ఒక కాగితం పై చేసే సంతకం ఒక స్త్రీ, ఒక పురుషుడి జీవితాన్ని నిర్ణయయించలేవని, నిర్దేశించలేవని, నియంత్రించలేవని వాళ్ళిద్దరి కథ స్పష్టం చేస్తున్నది. 
 
          అమ్మకు వాళ్ళకు ఉన్నంత విశాల ప్రపంచంతో పరిచయం లేకపోవచ్చు. ఆమె జీవన పరిధి చిన్నదే కావచ్చు. ఆమె ఉన్నకుటుంబం, సమాజం ఎలా ప్రవర్తిస్తాయో, వత్తిడి ఎలా ఉంటుందో అమ్మకు బాగా తెలుసు. లోపలి ఆలోచనలను అవి ఎలా నోరు మూయిస్తాయో తెలుసు. అయినా అమ్మ నా ఆలోచనలను, ఆచరణను ఆమోదించింది. అంగీకరించింది. నేనిలా ధైర్యంగా అడుగు ముందుకు వేయడంలో అమ్మ సహకారం, తనిచ్చే భరోసా , ఆమె తోడు ఉంది. ఒక వేళ సమాజం, కుటుంబం తనను దూరం పెట్టినా పట్టించుకోదు. 
 
          స్త్రీగా ఎలాంటి వత్తిడులు, పరిమితులు లేని జీవితం కావాలని, స్త్రీ అంటే ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనే నియమాలు నిబంధనలు నేను ఒప్పుకోను. నాకు నచ్చిన బాటలో నేను నడుస్తాను అని ధైర్యంగా ప్రకటించ గలిగానంటే అమ్మ పెంపకంలో నేను పొందిన స్వేచ్ఛ స్వతంత్రతలే  ..  నేను అనుకుంటా.  
 
          సంస్కృతీ సంప్రదాయాలు కాపాడే బాధ్యత స్త్రీ నెత్తిన పెట్టిన వ్యవస్థలో, సహజీవనం వల్ల కుటుంబ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని గగ్గోలు పెట్టే సమాజంలో ఉన్నది అమ్మ. నా నిర్ణయాల వల్ల , నా జీవన విధానం వల్ల అమ్మ ఇబ్బందులు పడాల్సి వస్తుందా..? 
 
          నా కోసం ఎంతటి వత్తిడులు, ఇబ్బందులు ఐనా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అమ్మ. నదీ ప్రవాహంలో కొన్నిటిని కలుపుకుంటూ కొన్నిటిని వదిలేస్తూ పోయినట్లే మన జీవితంలోను చేయాల్సిన అవసరం గురించి నాన్నమ్మకు అర్ధమయ్యే విధంగా చెప్పాలి. 
 
          అంకిత్ కూడా నా స్వతంత్ర ఆలోచనను, స్వేచ్చా పిపాసను, నా ఆత్మగౌరవం, నా భావజాలం అర్ధం చేసుకున్నాడు. మా ఇద్దరి మధ్య ఆత్మీయత ఉంది. సాన్నిహిత్యం ఉంది. 
 
          చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఆర్ధికంగా ఉన్న కుటుంబాల్లోని వాళ్ళు సహజీవనం చేసినప్పుడు పెద్ద సమస్యలు రాకపోవచ్చు. కానీ ఆర్ధిక స్వతంత్రం లేని ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయగలరా.. ? ఒకరి పై ఒకరు ఆధారపడకుండా నిలబడ గలరా?
 
          వేడి వేడి కాఫీ తో వచ్చిన అంకిత్ ఓ కప్ నిషికి అందించడంతో ఆలోచనల తీగ తెగింది. 
 
          గడిచిన విషయాల గురించి ఆలోచిస్తూ ఈ రోజుని, ఈ క్షణాలని పణంగా పెట్టడం అవివేకం అని ఆమెకు బాగా తెలుసు    

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.