కథాసంగమం  

పుస్తకాలమ్’ – 19

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

అపురూపమైన కథలకు అద్భుతమైన అనువాదాలు

          ఈ వారం ఎ ఎం అయోధ్యా రెడ్డి అనువాదం చేసిన పదిహేడు దేశాల, పందొమ్మిది మంది కథకుల కథల అనువాద గుచ్ఛం ‘కథా సంగమం’ గురించి మీకు పరిచయం చేయదలచాను.

ఆ అద్భుతమైన అనువాద కథల సంపుటం గురించి చెప్పబోయే ముందు అనువాద కథలు నాకు పరిచయమైన, నన్ను సమ్మోహపరచిన పురాస్మృతిని పంచుకోవాలి. నా ఏడో తరగతి, పన్నెండో ఏటి వరకు మాత్రమే మా ఊళ్లో ఉన్నాను. మా ఇంట్లో మా బాపు కొని పెట్టుకున్న రామాయణ, భారత, భాగవత గ్రంథాలు, ప్రాచీన కావ్యాలు ఒక వైపునా, పెద్దక్కయ్య – మామయ్య (వరవరరావు) వాళ్ళింట్లో ఎక్కువైన పుస్తకాలు, ‘సృజన’కు సమీక్షకు వచ్చిన పుస్తకాలు మా ఇంటికే చేరి అవి మరో వైపునానన్ను సూదంటురాయిలా ఆకర్షిస్తూ ఉండేవి. ఆ గాథలు ఇది వరకు కొంత చెప్పాను గాని, ఇప్పటి సందర్భానికి అలా నన్ను ఆకర్షించిన ఒక అసాధారణమైన పుస్తకం గురించి చెప్పాలి. అది ఒక్క పుస్తకం కూడ కాదు, అప్పటికి మా ఇంట్లో ఉండినవి ఒకే సైజులో, ఒకే ముఖచిత్రంతో ఒకే పుస్తకపు ఐదు సంపుటాలు. ఆరో సంపుటం కూడ ఉందని ఇరవై ఏళ్ల తర్వాత తెలిసింది. ఆ పుస్తకం పేరు విశ్వకథా వీథి. పురిపండా అప్పలస్వామి గారు ముప్పైకి పైగా వేరువేరు దేశాల కథలను (బహుశా ఇంగ్లీష్ నుంచి) అనువాదం చేసి ఆ సంపుటాలు తెచ్చారు. రాజమండ్రికి చెందిన అద్దేపల్లి అండ్ కో ప్రచురణగా ఆ సంపుటాలు 1955-56ల్లో వెలువడ్డాయని గుర్తు. నేనవి నా పది, పదకొండో ఏట, 71-72ల్లో చదివి, అనువాద కథల రుచి తెలుసుకున్నాను.

          తర్వాత గడిచిన  ఐదు దశాబ్దాలలో అనువాద కథలూ, ఇంగ్లీష్ కథలూ, ఇంగ్లీష్ ద్వారా దేశదేశాల కథలూ అడపాదడపా చదువుతున్నాను గాని, ఆ యాభై ఏళ్ల వెనుకటి అపురూప అనుభవం మరొకసారి ఇచ్చిన పుస్తకం ప్రస్తుత ‘కథాసంగమం’. భిన్నమైన నేపథ్యాల, భిన్నమైన భాషా సంప్రదాయాల, భిన్నమైన వస్తువుల, భిన్నమైన కథన శైలుల కథలివి. అప్పలస్వామి గారి లాగనే అయోధ్యారెడ్డి ఒంటి చేతి మీద తెలుగులోకి తెచ్చిన కథలివి.

          ఈ కథకుల్లో పందొమ్మిదో శతాబ్ది మొపాసా నుంచి చాలా మంది ఇరవయో శతాబ్ది కథకులతో పాటు, నిన్నామొన్నా కరోనా మీద రాసిన మియా కౌటో వరకూ ఉన్నారు. ఐదు ఖండాల పదిహేడు దేశాలున్నాయి. అంటే ఒకరకంగా ఇవి స్థల కాలాలను అధిగమించిన కథలు. సాధారణంగా చెప్పాలంటే, సాహిత్యం ఖచ్చితంగా స్థల, కాలబద్ధం కావలసిందే, నిత్య చలన శీల ప్రపంచంలో ఏ సాహిత్యమైనా స్థల, కాలాతీతం అయ్యే అవకాశం లేదు. “నా రచనలకు కాలం చెల్లిపోవాలని కోరుకుంటాను” అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. “నా రచనలకు ఇంకా ప్రాసంగికత ఉన్నదని సంతోషించనా, నేను రాసి నప్పటి పరిస్థితులే ఇంకా కొనసాగుతున్నాయని విచారించనా” అని కాళోజీ చాలసార్లు విచారించారు. అటు వంటి స్థితిలో దాదాపు నూటయాబై ఏళ్ల కాల క్రమంలో రాసిన ఈ కథలు, ఒక్క ఆస్ట్రేలియా ఖండాన్ని మినహాయిస్తే భూగోళం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించే కథలు ఇరవయ్యొకటో శతాబ్ది మూడో దశాబ్దిలో తెలుగు పాఠకులకు ఎందుకు ప్రాసంగికంగా అనిపిస్తాయి? అనిపించాలి? ఈ స్థల కాలావధులను అధిగమించే శక్తి ఈ కథలకు ఎట్లా వచ్చింది?

          శ్రీశ్రీ అన్నట్టు ‘అట్టడుగున అంతమందిమీ మానవులమే’ అయినప్పుడు ఎక్కడి స్థలమైనా మన స్థలమే అవుతుంది. ఎప్పటి కాలమైనా సమకాలీనమే అవుతుంది. ఎవరి ఉద్వేగాలైనా మన ఉద్వేగాలతో పోలిక ఉన్నవే అవుతాయి. మరీ ముఖ్యంగా కాల స్వభావంలో మార్పు రూపంలోనే తప్ప సారంలో కానప్పుడు, స్థల స్వభావంలో మార్పు మానవ సమాజ వాస్తవ స్థితిలో మార్పు కానప్పుడు ఏ స్థల కాలాల్లో వెలువడిన సాహిత్య మైనా ఆ స్థల, కాలావధులను అధిగమించే శక్తి సంతరించుకుంటుంది. దేశ, కాల, పాత్రల నిర్దిష్టత చెరిగిపోయి, అన్ని దేశాల, అన్ని కాలాల, అన్ని పాత్రల సాధారణీ కరణకు, సమష్టి అనుభవానికి అవకాశం వస్తుంది.

          ఇవి అనువాదకుడు ఎంపిక చేసుకుని అనువదించిన కథలు గనుక వస్తు వైవిధ్యం కూడ విస్తారంగా ఉంది. జాతుల ఆచారాల మధ్య వ్యత్యాసాలు, అసహాయుల పట్ల సమాజపు సాధారణ వైఖరి, విభిన్నమైన, విశిష్టమైన జీవన దృశ్యాలు, అతి సాధారణ పరిస్థితుల్లో కూడ అసాధారణ జీవన వైచిత్రి, పేదరికం, నిరాదరణ, యుద్ధ బీభత్సం, జిప్సీల జీవన విధానం, మానవ పరిణామ చరిత్ర, వలసానంతర సమాజంలో తలెత్తిన కొత్త ఆభిజాత్యాలు, వర్ణవివక్ష, ఒక్క బిందె మంచినీటి కోసం మహిళ పడే తన్లాట, కొవిడ్ కాలపు అసాంఘిక, అనుమాన వాతావరణం వంటి ఎన్నెన్నో వస్తువులను ఆయా దేశాల, భాషల కథకులు ఎంత ఆలోచనాస్ఫోరకమైన కథలుగా తీర్చిదిద్దారో చూస్తే అబ్బుర మనిపిస్తుంది.

          ఈ కథల్లో ప్రతి ఒక్కదాని గురించీ పంచుకోవాలని ఉంది గాని, మీ అంతట మీరే చదువుకునే ఆసక్తి కలిగించడానికి కొన్ని కథల గురించి మాత్రం చెపుతాను. వీటిలో దాదాపు ప్రతి ఒక్క కథా ఒక నిర్దిష్ట వస్తువు మీద నిర్మాణం అయినప్పటికీ, సాధారణ అవగాహనలకు ప్రతీకలుగా విస్తరించాయని నాకు అనిపిస్తున్నది. ముఖ్యంగా ఐదు ప్రతీకాత్మక కథల గురించి చెప్పాలి.

          గాలివానకు కూలిపోయి, కొన్నాళ్లపాటు అసహాయుడైపోయిన రెక్కలున్న వృద్ధుడి కథగా, ఐంద్రజాలిక వాస్తవికతా కథగా ఉన్న గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ కథ ‘రెక్కల మనిషి’ వాస్తవానికి ఎన్నో పొరల్లో మానవ శక్తి సామర్థ్యాల విస్తృతిని చెప్పే కథ. మనిషి పక్షి లాగ ఎగర గల రెక్కలున్న మనిషే. లేదా, ఆకాశమే హద్దుగా విస్తారంగా ఆలోచించ గల మనిషే. కాని గాలివానలో చిక్కుకుని, బురదలో పడిపోయి, ఎగరలేని స్థితికి వచ్చింది మానవ జీవి. ఆ అసహాయతను ఆసరా చేసుకుని తోటి మానవులే హింసిస్తారు, వెటకరిస్తారు, చేతికందినవి విసురుతారు. దేవదూత అంటారు, రాక్షసుడంటారు. దేనికీ చలించక అలా పడి ఉంటాడు. అంత మంది ఆకతాయిల్లోనూ ఒకటో రెండో ఆదరణ చూపే మంచి హృదయాలూ ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఆ మనిషే, అప్పటిదాకా నిస్సహాయుడుగా, నిర్లిప్తుడుగా, పరాధీనుడిగా, బాధితుడిగా ఉన్న మనిషే, రెక్కలు విప్పార్చుకుని ఎగిరిపోతాడు. దిగంతం మీద గుర్తుగా మిగిలిపోతాడు. ఆ మనిషి శ్రమజీవికి, పీడితులకు, అణగారిన వారికి ప్రతీక కావచ్చు, మొత్తంగా మనిషికే ప్రతీక కావచ్చు. మనుషులు లేచి నిలుస్తారు, తమ అనారోగ్యాన్నీ, అశక్తతనూ, తమ పట్ల హింసనూ అధిగమిస్తారు.

          గై డి మపాసా రాసిన ‘ప్రియురాలి కౌగిలి’ కూడ అటువంటి ప్రతీకాత్మక కథే. యవ్వనంలో ప్రాణాధికమనిపించిన  ఒక యువతి పన్నెండేళ్ల తర్వాత కలిసినప్పుడు, నడి వయసులోనో, వృద్ధాప్యంలోనో ఎటు వంటి భావనలను ప్రేరేపిస్తుంది, ఆమె ఎంత మారి ఉంటుంది, అతను ఎంత మారి ఉంటాడు – ఇదీ ఇతివృత్తం. కాని కాలం ప్రకృతినీ, మనిషినీ మారుస్తుంది గాని మనసును మార్చదు, మార్చజాలదు అనే తాత్విక, ప్రతీకాత్మక సందేశాన్ని ఆ కథ ఇస్తుంది.

          బెన్ ఒక్రి ఏమి రాసినా కవితాత్మకత, ప్రతీకాత్మకత, తాత్వికతల మేళవింపుగా ఉండడం పాఠకులకు తెలిసిందే. ఇక్కడ అయోధ్యారెడ్డి అనువదించిన ‘ఎవరికీ చెందనివాడు’ పైకి చూడడానికి పొరపాటున ఒకరిని మరొకరిగా గుర్తించిన గందరగోళాన్ని చిత్రించిన కథగా అనిపిస్తుంది గాని అది అసలు సిసలైన మానవ అస్థిత్వ సమస్యకు చిత్రణ. ఒక వ్యక్తి తన గురించి తానేమనుకుంటున్నారో అది అవునా? ఆ వ్యక్తి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అది అయినా అవునా? ఏ వ్యక్తి ఎవరికి చెందుతారు? అసలు చెందడం అంటే ఏమిటి? అసలు చెందడం అనేది ఆస్తికి సంబంధించిన భావన కదా? మానవ సంబంధాలకు ఆ భావనను వర్తింపజేయవచ్చునా? “నేను నేను కాకుండా ఇంకొకరు కావడం నాకు చాలా సరదాగా ఉన్నది… వాస్తవానికి అతడనుకొన్న వ్యక్తిని నేనే కావచ్చు. అసలు నా పాత ఐడెంటిటీనే ఒక స్వప్నం కావచ్చు”. ఎంత గొప్ప, విశాలమైన, లోతైన, నిగూఢమైన వాక్యాలివి!

          ఇరాక్ యుద్ధంలో శత్రు సైన్యాల చేతిలో హింసకూ, అవమానాలకూ, హత్యకూ గురైన ముజాహిదీన్ సైనికుడి ఆత్మ ప్రధాన పాత్రగా ఇరాక్ కథకుడు హసన్ బ్లాసిమ్ రాసిన కథ, యుద్ధ బీభత్సానికి గురై పాడుబడిన, ఒక తల్లీ బిడ్డా మాత్రమే మిగిలిన గ్రామంలో ఆ ఆత్మ చూసిన, అనుభవించిన విషాదాలను చూపుతుంది. ఇది కూడా ఒక ఆత్మ కథా, ఒకానొక పాడుబడిన గ్రామపు కథా మాత్రమే కాదు. యుద్ధానికీ, మానవ దౌష్ట్యానికీ, దుర్మార్గానికీ, నిస్సహాయతకూ ప్రతీక కథ.

          ఇటాలో కాల్వినో ఇటాలియన్ కథ ‘అనగనగా ఒక నీతిమంతుడు’ కూడా పైకి చూడడానికి ఒక ఊరి కథగా, ఆ ఊరి నిండా మినహాయింపు లేకుండా ఉన్న దొంగల కథగా, ఆ ఊళ్లోకి దొంగతనంతో సంబంధం లేని ఒక వ్యక్తి ప్రవేశంతో మారిపోయిన గ్రామ వ్యవస్థ కథగా కనబడుతుంది. కాని అక్కడ గ్రామం గ్రామం కాదు, ఆ దొంగలూ, ఆ నీతి మంతుడూ వ్యక్తి మాత్రులు కారు. అది మొత్తంగా సమాజ స్వభావానికి, సమాజ పరిణామా నికి ప్రతీక.

          ఇటు వంటి ప్రతీకాత్మకత మాత్రమే కాక, అద్భుతమైన, సంకీర్ణమైన తాత్విక స్థాయి కథా వస్తువుల మీద నిర్మాణమైన నాలుగు గొప్ప కథల గురించి కూడా చెప్పాలి. కెన్యన్ మహారచయిత గుగి వా థియోంగో రాసిన ‘నిటారు విప్లవం’ మానవ సమాజపు ఐక్యతకూ, ఘర్షణకూ, అసమానతకూ మూలాలను మానవ పరిణామ చరిత్రలో వెతుకుతుంది. చతుష్పాద జంతువు ద్విపాద జంతువుగా మారుతున్నప్పుడు చేతులకూ కాళ్లకూ మధ్య వచ్చిన ఘర్షణను, దాని పర్యవసానాలను చిత్రించి, “మనుషులు తమ అవయవ నిర్మాణ వ్యవస్థ ద్వారా పాఠాలు నేర్చుకుంటూ నిబద్ధులై ఉన్నంత కాలం నిట్ట నిలువుగా ఉంటారు. అలాకాక, తల వేరు, మిగతా భాగాలు వేరుగా, దేహం పైన ఉన్నవి గొప్పవని, నేలనున్న పాదాలు నీచమని విర్రవీగినా, ఒకరి కంటె ఒకరు తామే గొప్పవాళ్లమని భావిస్తూ యుద్ధభూమిలో శత్రువుల్లా మారిపోయినా, అప్పుడే మనుషులు నిటారు విప్లవ వ్యతిరేకులైన నాలుగుకాళ్ల జంతు బంధువులకు మళ్ళీ చేరువై పోతారు” అనే మహత్తర సామాజిక, చారిత్రక జీవన సత్యాన్ని ప్రకటిస్తారు.

          ఈ సంపుటంలో ఏ కథకు ఆ కథ ఆణిముత్యమే. ఏ ఒక్క కథనూ విడదీసి ఇది అద్భుతమైనది అనడానికి వీలు లేదు. అయినా నా వరకు నాకు మో యాన్ రాసిన ‘పొద్దు తిరుగుడు పొలం’ మహాద్భుతమైన, బహుళార్థ బోధకమైన కథ. అది పైకి చూడడానికి ఒక పొద్దుతిరుగుడు పొలంలో ఒక వ్యక్తికి ఒక ముక్త శిశువు (వదిలేసిన శిశువు) దొరకడం, తదనంతర పరిణామాల కథగా ఉంటుంది. కాని చైనా సమాజపు సమకాలీన స్థితి, ఆడ బిడ్డల పట్ల వివక్ష, ఆడ శిశువులను వదిలేయడం, ప్రభుత్వ అధికారుల దుర్మార్గాలు, 1980ల తర్వాతి పరిణామాలు, విప్లవపూర్వపు పాత చైనా సమాజపు అవలక్షణాలు 1980ల తర్వాత పునరావృతం కావడం వంటి ఎన్నెన్నో పొరల సామాజిక, చారిత్రక వాస్తవాల మీద వెలుగు ప్రసరిస్తుంది. డెంగ్ తర్వాత చైనా “మహత్తర తిరోగమనాని”కి గురయిందని ఎందరో మేధావులు విశ్లేషించిన విషయాన్ని కథారూపంలో అత్యంత విశ్వసనీయంగా చిత్రించిన రచన ఇది. చైనా ఇంకా సోషలిస్టు మార్గంలో సాగుతున్నదని అమాయకంగా లేదా మూర్ఖంగా నమ్ముతున్నవారి కళ్లు తెరిపించే కథ ఇది.

          పీడితులలో కూడా పీడక భావజాలపు ఛాయలు ఉండడం, ఒక ప్రత్యేక సందర్భంలో పీడితులు కూడ తాము అనుభవించిన వివక్షను, హింసను మరిచిపోయి, తమ వంటి పీడితుల మీదనే అంతకన్న ఎక్కువ హింసనూ వివక్షనూ చూపడం ఒక సాధారణ అనుభవమే. ఆఫ్రో అమెరికన్ మహా రచయిత టోనీ మారిసన్ ‘నల్లకలువ’ ఆ సాధారణ జీవన సత్యాన్ని ఒకానొక నిర్దిష్ట సందర్భంలో, తల్లీ బిడ్డల సంబంధంలో చిత్రించింది. నల్లజాతి ఆత్మన్యూనతనూ, జాతి వివక్షనూ, వేర్వేరు స్థాయిలపితృస్వామ్య, జాత్యహంకార భావనలనూ చిత్రించింది.

          యూరపియన్ మానవ అస్తిత్వ వేదనను అనితర సాధ్యంగా చిత్రించడం ద్వారా మహా రచయితగా సుప్రసిద్ధుడైన చెక్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా కథ ‘చట్ట ద్వారం ముందు’ వ్యక్తికీ రాజ్యానికీ, వ్యక్తికీ చట్టానికీ ఘర్షణను, మనిషి చేసే నిరంతర సత్యాన్వేషణను, దాన్ని అన్ని రకాలుగా అడ్డుకునే రాజ్య స్వభావాన్ని అద్భుతంగా చిత్రిస్తుంది.

          కథలు గొప్పవి కావడం మాత్రమే కాదు, వాటి అనువాదం మొత్తంగా అద్భుతంగా ఉంది. తెలుగులో స్వతంత్ర రచనలా ఉంది. మూలంలో, లేదా మూలం నుంచి ఇంగ్లీష్ అనువాదంలో ఎలా ఉన్నాయో తెలియవు గాని తెలుగు కథలు మాత్రం కవితాత్మక, సాంద్ర, ఆర్ద్ర, తాత్విక వ్యక్తీకరణలతో హృదయానికీ, మేధకూ హత్తుకునేలా ఉన్నాయి.

          కథా ప్రక్రియలో కీలకమైనది శీర్షిక. కథకులు కథలో తాము చెప్పదలచుకున్న మొత్తం భావానికి ప్రతీకగా శీర్షికను నిర్ణయిస్తారు. ఇంగ్లిష్ మూల శీర్షికలను అనువదిం చడంలో అయోధ్యారెడ్డి మరింత జాగరూకత వహించి కొన్ని సందర్భాల్లో మూల శీర్షిక కన్న మెరుగైన, అర్థస్ఫోరకమైన శీర్షికలు పెట్టారు. ఉదాహరణకు ముల్క్ రాజ్ ఆనంద్ ‘లల్లబీ’ ని ఊరికే ‘జోలపాట’ అనో, ‘లాలిపాట’ అనో అనకుండా ‘అమ్మా, నా కోసం పాడవూ!’ అన్నారు. గైడి మపాసా ‘ఫేర్వెల్’ ను ‘ప్రియురాలి కౌగిలి’ అన్నారు. టోనీ మారిసన్ ‘స్వీట్నెస్’ ను ‘నల్లకలువ’ అన్నారు. స్వేత్లానా అలెక్సీవిచ్ ‘కింగ్ ఆఫ్ క్లబ్స్, కింగ్ ఆఫ్ డైమండ్స్’ ను ‘సంచార జీవులు’ అన్నారు. అదే సందర్భంలో ‘అబాండన్డ్ చైల్డ్’ (పొద్దుతిరుగుడు పొలం), ‘ది బ్లాక్ షీప్’ (అనగనగా నీతిమంతుడు), ‘బిలాంగింగ్’ (ఎవరికీ చెందనివాడు) మూల శీర్షికలే ఎక్కువ అర్థవంతమైనవని అనిపిస్తుంది.

          చివరిగా, “నిబద్ధత గల్గిన రచయితలు వ్యక్తిగతమైన ఆస్తి కాదు. ఉమ్మడి సామాజిక సంపద. వాళ్ల సాహిత్యం కూడా ఉమ్మడి సామాజిక సంపదే. అందుకే వాళ్ల రచనలు ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితమైనవి కావు. అవి అందరికీ చెందాలి. అందరినీ అలరించాలి. అనుభూతుల్ని పంచాలి” అనే ఉద్దేశంతో ఈ కథలు అనువదించానని అయోధ్యారెడ్డి ‘నా మాట’లో చెప్పారు.

          మొత్తం మీద చూస్తే ఇంత గొప్ప అనువాద కృషి చేసినందుకు, ఈ సంపుటం వెలువరించినందుకు అనువాదకుడు ఎ ఎం అయోధ్యారెడ్డినీ, ప్రచురణకర్తలు అన్వీక్షికినీ అభినందించవలసి ఉంది.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.