పేషంట్ చెప్పే కథలు – 14

రాజీ

ఆలూరి విజయలక్ష్మి

          “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా మండిపోతుందామె హృదయం.

          ఒక్కసారా, రెండుసార్లా – ప్రతి నాలుగు రోజులకు తల్లిదండ్రులిద్దరూ బద్ధ శత్రువుల్లా తనమీద విరుచుకు పడుతుంటే ఎదుర్కోవటానికి తనకు శక్తి చాలడంలేదు. తాను ఎదురు తిరిగి పోట్లాడలేదని, మాటకుమాట జవాబు చెప్పలేదని వాళ్ళకు బాగా తెలుసు. ఆ అలుసు చూసుకునే వాళ్ళిలా తన మీదకు దండెత్తి వస్తున్నారు. ఆవేశంతో సుచరిత పెదాలు వణుకుతున్నాయి. రోషంతో ఎర్రబడ్డాయామే కళ్ళు! లోలోపల లావాలా ఉడుకుతున్న ఉద్రేకం, తలలోని నరాలు చిట్లిపోతున్న భావన, నెత్తిమీద ఎవరో సుత్తితో మోదుతున్నంత బాధ. కళ్ళు మసకబారి తూలుతున్నట్లయింది. ఆఫీసుకు వెళ్ళడానికి బస్సు కోసం ఎదుచూస్తున్న సుచరిత రిక్షా ఎక్కి శృతి నర్సింగ్ హోమ్ కి వచ్చింది.

          “నీ తలనొప్పిని మాత్రం నేను తగ్గించలేక పోతున్నానమ్మా! నీరసం తప్ప మరే తేడా కనిపించడం లేదు. నీ బాధ చూడలేకే ఎందుకైనా మంచిదని అన్ని టెస్ట్ లూ చేయించాను. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ గా వున్నాయి” సాలోచనగా చూస్తూ అంది శృతి. మౌనంగా కళ్ళు దించుకుని కూర్చుంది సుచరిత.

          “ఎన్నిసార్లు చెప్పినా శుభ్రంగా తిండి తింటున్నట్లు కనపడవు. ఎప్పుడూ ఏదో కొండంత బాధ ననుభవిస్తున్నట్లు ఉంటావు. నీ బాధనూ, సమస్యల్నీ ఎవరితోనూ చెప్పుకోకుండా నీలో నువ్వు కుమిలిపోతూంటే నీలోని టెన్షన్ బయటికి వచ్చేదారి లేకపోతే కూడా యిలా విపరీతమైన తలనొప్పి వస్తుంది” అనునయంగా చెప్పసాగింది శృతి.

          “నాకు సమస్యలూ, బాధలూ ఏమున్నాయండీ?!” తడబాటుగా అంది సుచరిత. చివ్వున నీళ్ళుబికిన కళ్ళు శృతికి కనపడకుండా దాచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. ఓదార్పుగా సుచరిత భుజాన్ని మృదువుగా తట్టింది శృతి. దానితో వేడి తగిలిన వెన్నముద్దలా కరిగి, కరిగి కన్నీళ్లు పొంగివచ్చాయి. ఎగసి వస్తున్న దుఃఖసముద్రానికి వారధి వేస్తూ బేలగా చూసింది సుచరిత.

          “నాకు కావలసింది అడిగి పొందలేని మూగతనం, దొరికిన దానితో సరిపెట్టుకునే గుణం, నా తప్పు లేనప్పుడు కూడా తలవంచుకుని తిట్లు భరించే స్వభావం…ఇలా ఉండకూడదు. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడాలని అనుకుంటూనే లోలోపలికి కుంచించుకు పోవడం…ఒకే కప్పుక్రింద బ్రతుకుతున్నా మా యింట్లో అందరికీ మానసికంగా దూరంగా, పరాయి వ్యక్తిగా పెరిగాను. నా ప్రవృత్తే నాకు ప్రధాన శత్రువయి నేను కోరుకున్న దేదీ పొందలేకపోయాను. అవకాశం అంతంత మాత్రంగా వున్నప్పుడు నాన్నగారికి చదివించే స్థోమత అంతగా లేనప్పుడు అక్క దెబ్బలాడి, అలిగి, సాధించి యూనివర్సిటీ చదువు పూర్తిచేసి మంచి ఫర్మ్ లో జాబ్ సంపాదించుకుంది. అక్క చేతికి అందివచ్చి నన్ను పై చదువు చదివించగల స్థోమత వున్నప్పుడు “యింక చదివింది చాల్లే, ఏదో ఒక ఉద్యోగం చూసుకుందువుగాని” అన్న నాన్నగారితో “యింకా చదువు కుంటానండీ” అని నోరువిప్పి చెప్పలేకపోయాను. చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో చేరాను. నేనందుకోలేని అవకాశాన్ని నా తరువాత వాళ్ళు చెల్లి, తమ్ముడు అంది పుచ్చుకుని చెల్లి మెడిసిన్ లో, తమ్ముడు ఇంజనీరింగ్ లో చేరారు-” సుచరిత కళ్ళల్లో నీరింకిపోయి సూణ్యంలోకి చూస్తూంది. ఎప్పుడూ అతి గంభీరంగా అవసరమైన నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయే అమ్మాయి మొట్టమొదటిసారి మనస్సు విప్పి తన సమస్య ను వ్యక్తం చేస్తూంటే సానుభూతిగా వింటూంది శృతి.

          “క్రమేపీ మా యింట్లో అందరికీ నేనంటే చిన్నచూపు బలపడింది. అక్కలా దూసుకువెళ్ళి నా అంతట నేను మంచి జాబ్ సంపాదించుకునే చొరవలేదు. చలాకీ కబుర్లతో, ఉత్సాహంతో పరవళ్ళు ద్రొక్కుతూ భర్తను సంపాదించుకునే చాకచక్యం లేదు. చెల్లిలా, తమ్ముడిలా పెద్ద చదువు చదివే తెలివితేటలూ లేవు. చెప్పుకోదగని చిన్న ఉద్యోగాన్ని వెలగబెడుతున్న నేను ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేసి పని చేయించుకునే యంత్రంలా మారాను” ఎన్నాళ్ళుగానో అణచి ఉంచిన వ్యధ ఒక్కసారిగా పొంగివచ్చి నిగ్రహించుకోలేక సతమతమవుతుంది సుచరిత.

          “అందుకూ నేను బాధపడలేదు. నాకు వీలున్నంత వరకు అమ్మకు యింటి పనుల్లో సాయం, మిగతావాళ్ళేపని చెప్తే ఆ పనిని కిమ్మనకుండా చేస్తూనే వున్నాను. కానీ… ఈ మధ్య మరో కొత్త సమస్య తలెత్తింది. ప్రైవేట్ ఫర్మ్ లో పనిచేస్తూ ఉండడం వల్ల ఏవైనా అర్జెంటు పనులుంటే సాయంకాలం ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఆఫీసులో చాకిరీ చేసి చేసి మళ్ళీ ఇంట్లో పనికూడా చెయ్యడానికి నాకు శక్తీ ఉండడం లేదు. దాంతో ఇంట్లో వాళ్ళంతా ముష్టి మూడొందల ఉద్యోగాన్ని మానిపారేసి ఇంట్లో కూర్చోమని నా ప్రాణం తీస్తున్నారు.”

          “ఏం చేసావు? మానేశావా ఉద్యోగాన్ని?” ఆదుర్దాగా అడిగింది శృతి.

          “లేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఎదురు తిరిగాను. నిజానికి వాళ్ళకూ నేను జాబ్ మానేయడం ఇష్టం లేదు. నేను సంపాదించే ముష్టిమూడొందలే ఇంట్లో ఎన్నో ఖర్చుల్ని ఆదుకుంటున్నాయి. ఆ మూడొందలూ కలవకపోతే బండి యింత సాఫీగా నడవదు. అది వాళ్ళకూ తెలుసు. నేను జాబ్ చేసి తీరాలి. కానీ వాళ్ళ ఇష్టాయిష్టాలకు, ఆజ్ఞలకు బద్ధురాల్నయి చెయ్యాలి. ఇంటెడు చాకిరీ చేస్తూ మరీ జాబ్ చెయ్యాలి. క్రమేపీ నేను బ్రతుకుతున్న బ్రతుకు ఎంతో ఇరుగ్గా ఊపిరాడనట్లుగా ఉంది. నేను స్వేచ్ఛగా గుండెలనిండా గాలి పీల్చుకోవాలంటే నాకున్న ఈ చిన్ని ఆధారాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే ఎదురు తిరుగుతున్నాను. అంతలోనే తిరుగుబాటు, మళ్ళీ అంతలోనే నా వాళ్ళేకదా అన్న భావనతో రాజీ… కానీ.. నలుగురు బిడ్డల్నీ నాలుగు కళ్ళుగా చూసుకో వలసిన కన్న తల్లిదండ్రులే పక్షపాతం చూపిస్తూంటే, బ్రతుకునేర్వని బిడ్డను కడుపులో పెట్టుకుని కాపాడవలసిన అమ్మే అనుక్షణం సాధిస్తూంటే… తట్టుకోలేక పోతున్నాను. నేనింత దురదృష్టవంతురాల్నా అని సెల్ఫ్ పిటీతో కృంగిపోతున్నాను” సుచరిత కంఠం వణికింది.

*****     

Please follow and like us:

One thought on “పేషంట్ చెప్పే కథలు-14 రాజీ”

  1. డా.ఆలూరివిజయలక్ష్మిగారి ‘పేషెంట్ చెప్పే కథలు- రాజీ కథ బావుంది. సుచరిత పడే బాధను కథలో చెప్పారు చెప్పారు రచయిత్రి.

Leave a Reply

Your email address will not be published.