యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-4

ప్రయాణం

          మా ఇంటి నుంచి శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు ట్రాఫిక్ లేని వేళల్లో సరిగ్గా గంట వ్యవధిలో ఉంటుంది. ముందు చెప్పినట్టుగా మేం ముందుగా శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కణ్ణించి సిడ్నీ వెళ్లాలి. 

          సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లాస్ ఏంజిల్స్ వెళ్లే ఫ్లైట్ కాబట్టి ఎందుకైనా మంచిదని మధ్యాహ్నం రెండుగంటల కల్లా శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టుకి చేరుకున్నాం. ముందు చెప్పినట్లు వీసాకి సంబంధించిన సమస్యలేవీ లేకుండా అంతా సజావుగా జరిగింది. శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ కి, లాస్ ఏంజిల్స్ నించి సిడ్నీకి బోర్డింగ్ పాసులు అక్కడే ఇచ్చేసారు. ఇక లగేజీ సిడ్నీలో ఏకంగా తీసుకునేలా పంపించేసేరు.  మా దగ్గిర చేతి బ్యాగులు, ఒక చిన్న సూట్కేసు ఉందంతే. చెకిన్ తరువాత రెండు గంటల ముందుగానే వెళ్లిపోయాం కాబట్టి  ఇంకా చాలా సమయం ఉంది కదా అని  పిల్లలు ఆడుకుంటామంటే ఫ్లైట్ గేటుకి కొంచెం ఇవతలగా ఉన్న ప్లే స్ట్రక్చర్ ఉంటే అక్కడే మేమూ కూర్చున్నాం. పిల్లలు ఆడుకుంటుంటే మేం కంప్యూటర్లు వేసుకుని ఎవరి పని వాళ్ళం ప్రారంభించేం. సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు కానీ హఠాత్తుగా చూస్తే బోర్డింగ్ సమయం అయిపోయింది. ఒక్క ఉదుటున గేటు దగ్గరికి పరుగెత్తేం. అప్పటికే మా ముందు గ్రూపులన్నీ బోర్డింగ్ పూర్తయిపోయేయి. అదృష్టం కొద్దీ మేం ఫ్లైట్ లోకి సరైన సమయానికి ఎక్కేం. మొత్తానికి “ఫ్లైట్ కి వేచి చూడాల్సిన సమయంలో  గేటు దగ్గరే కూర్చోవాలి కానీ మరెక్కడా కూర్చోకూడదు” అని పాఠం నేర్చుకున్నాం.    

సిడ్నీ (రోజు-1)

          శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ కి గంటన్నర, లాస్ ఏంజిల్స్ నించి సిడ్నీకి పదహారు గంటల పాటు  ప్రయాణించి చేరుకున్నాం. లాస్ ఏంజిల్స్ లో నాలుగు గంటల లే ఓవర్ స్థిమితంగా ఫ్లైట్లు మారడానికి, డిన్నర్ తినడానికి సరిపోయింది. టైములోని తేడాల వల్ల శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరితే ఆదివారం ఉదయం దాదాపు 8 గంటలకు సిడ్నీ చేరుకున్నాం. పదహారు గంటల ప్రయాణంలో నిద్రొస్తే అధిక భాగం నిద్రపోవడమే  మంచి పని అని చేరేక అర్థమయ్యింది. అలా పడుకోని పిల్లలు దిగగానే జెట్ లాగ్ తో కొత్త ప్రదేశంలో తిరగాల్సి వచ్చినపుడు మధ్యాహ్నానికే కళ్ళు తేలేశారు. 

          ఇక ఫ్లైట్ నించి బయటపడి ఇమ్మిగ్రేషన్ క్యూలో నుంచి బ్యాగేజీ ఏరియాకి మరో గంటలో వచ్చేసాం. టాక్సీ ఏరియాకి మరో పదినిమిషాల్లో చేరుకున్నాం కూడా. అయితే అక్కడ మరో గంట కూచోవలసి వచ్చింది. మా కోసం సమయానికి పికప్ కి రావాల్సిన టాక్సీ రాలేదు. మాకు ఇచ్చిన కాంటాక్ట్ నంబరుకి ఫోను చేస్తే ఇదుగో పంపుతున్నాం,  అదుగో పంపుతున్నాం అని మొత్తానికి ఓ గంట తరువాత మాములు ఊబర్ వెహికిల్ ని పంపించారు. ఊబర్  ఎక్సెల్ వెహికిల్ లో ఎయిర్పోర్టు నించి  దాదాపు 7 కి.మీ దూరంగా మా హోటలు ఉన్న సిడ్నీ సెంట్రల్  కి వెళ్ళడానికి ఆస్ట్రేలియన్ డాలర్లలో దాదాపు నలభై డాలర్లు అవుతుంది. కానీ మేం దాదాపు  వంద అమెరికన్ డాలర్లు కట్టేం.  ఆస్ట్రేలియన్ డాలర్లలో దాదాపు 150 అన్నమాట. ఆ మాత్రానికి మేమే ఊబర్ బుక్ చేసుకుంటే సరిపోయేది కదా అనుకున్నాం. కొత్త ప్రదేశంలో టాక్సీ సర్వీసులు ఎలా ఉంటాయో అనుకుని ఇలా ఎయిర్పోర్టు నించి హోటలుకి పర్సనల్ డ్రాపాఫ్, పికప్పులు ముందే బుక్ చేసుకున్నాం. కానీ ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్ బోర్న్ వంటి నగరాల్లో ఊబర్ రైడ్ లు చాలా సులభంగా దొరుకుతాయి. ఇలా ముందు బుక్ చేసుకోవడం వృథానే. 

          ఎయిర్పోర్టు నించి బయటికి రాగానే డిసెంబరు నెల ఇక్కడ వేసవి కాలం అయినా చిరు చల్లగా ఆహ్లాదంగా ఉంది. అలాగని స్వెట్టరు వేసుకునేంత చల్లగా లేదు. ప్రతాపం చూపించే వేసవి వేడిమీ లేదు. దాదాపుగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ ప్రాంతం లోని  వాతావరణంలాగే అనిపించింది. అయితే  ఎయిర్పోర్టు బయట బాటల కిరుపక్కలా ఉన్న పొట్టి పొదల వంటివి, గడ్డి నేలా చూస్తే సింగపూర్ గుర్తొచ్చింది. కానీ ఊళ్లోకి వెళ్ళే కొలదీ ఎక్కే కొండా దిగే కొండగా ఉన్న రోడ్లు విశాఖపట్నాన్ని, శాన్ఫ్రాన్సిస్కోని తలపింప జేసేయి. ఆకాశంలో వెలుతురు కాలుష్యం లేకుండా అమెరికాలోలా ప్రకాశవంతంగా ఉంది. మొట్టమొదటిసారి భూమ్మీద దక్షిణార్థగోళంలో వేసిన ఆ తొలి అడుగు మరపు రానిదిగా శాశ్వతంగా మనస్సులో ముద్ర పడిపోయింది. 

          ఇక మేం సిడ్నీ సెంట్రల్ లో ఉన్న నోవొటెల్ హోటలుకి చేరుకునేసరికి పదిన్నర కావచ్చింది. అమెరికాలోలాగే చెకిన్ , చెకవుట్ టైములున్నాయి ఇక్కడా. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాకు గది ఇవ్వలేమని, అంత వరకు మా లగేజీని వాళ్ళ దగ్గిర భద్రంగా దాచిపెడతామని లగేజీలకు టాగులు వేసి మరీ లెక్కగా ఎన్ని శాల్తీలు ఇచ్చామో అన్ని రసీదులు కూడా ఇచ్చారు. 

          నోవొటెల్ నాలుగు స్టార్లున్న బెస్ట్ హోటల్ గ్రూపయినా విచిత్రంగా అమెరికాలోని మూడు స్టార్ల హోటల్లా కూడా లేదు. 18 అంతస్తులున్న భవంతి అయినా పాతగా, ఏదో అపార్టుమెంటు భవనంలా ఉంది లోపల. అక్కడే లాబీలో ఉన్న బాత్రూములకు వెళ్లి రిఫ్రెష్ అయ్యేం. అమెరికాలోని పాత యూనివర్సిటీల్లో డార్మిటరీ బాత్రూముల్లా ఉన్నాయని మా పెద్దమ్మాయి, నేను నవ్వుకున్నాం. అలాగే “టాయిలెట్స్” అని పేరు చూసి విచిత్రంగా చూస్తున్న మా చిన్నమ్మాయికి “రెస్ట్ రూమ్స్” అని వివరించేం. ఇక్కడ మరో ప్రధానమైన విషయం ఏవిటంటే అమెరికాలోలా పబ్లిక్  టాయిలెట్స్ లో  సీటు పైన పరుచుకునే పేపరు కవర్లు ఉండవు. అమెరికా పద్ధతులకు అలవాటైన మా పిల్లలకు చాలా ఇబ్బంది అనిపించింది ఈ విషయం. 

          ఇక ఆస్ట్రేలియా ఇంగ్లీషు బ్రిటిష్ ఇంగ్లీషే కాబట్టి మేం బాగానే అర్థం చేసుకోగలిగేం. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి ఇదంతా వింతే.  “ట్రాష్” ని “రబ్బిష్” అని నాన్ ఫాట్ మిల్క్ ని “స్కిమ్డ్ మిల్క్” అని, అలాగే ప్రతి మాటని సగానికి మింగేసి, చివర “ఏయ్” అనే ఒకానొక యాసని మా పిల్లలు ఒక్కరోజులో పట్టేసేరు.    

          సరే, ఇక సామాన్లు హోటల్లో భద్రపరిచి మధ్యాహ్న భోజనం చెయ్యడం కోసం దగ్గర్లో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచించాం. అప్పటికింకా పదకొండే అవుతుండడంతో దగ్గర్లో ఉన్న సిడ్నీ హార్బర్ బ్రిడ్జిని చూడడానికి ఊబర్ లో వెళ్లేం. హార్బర్ బ్రిడ్జి చాలా పెద్దది, చూడ చక్కనిదే కాకుండా మూణ్ణాలుగు గంటల పాటూ దాని మీదికి ఎక్కగలిగే టూర్లు కూడా ఉంటాయి. అయితే ఈ టూరు ముందుగా బుక్ చేసుకోవాలి. అలాగే ట్రైనింగు కూడా తీసుకోవాలి. అవన్నీ చిన్నపిల్లలతో సాధ్యం కాదు కాబట్టి బ్రిడ్జికి ఇటు తీరాన ఉన్న వాటర్ ఫ్రంట్ ని ఆనుకుని ఉన్న పార్కులోని వాకవేలోకి అడుగుపెట్టేం. 

          ఎదురుగా తళత్తళ్లాడే కెరటాల్లో ప్రతిఫలించే సూర్యకిరణాల్ని చుట్టుకుని శతాబ్దాలుగా మంచులో కప్పడిపోయి ముడుచుకున్న శిలాజంగా మారిన స్వచ్ఛమైన శ్వేత పద్మం గడ్డకట్టిన రేకుల్ని ఆకాశం వైపుకి సాచి తపస్సు చేస్తూ ఉన్నట్లు  అద్భుతంగా సాక్షాత్కరించిన “ఓపెరాహౌస్” ని చూడడానికి రెండు కళ్లూ చాలలేదు. ఫోటోలలో చూసినా, వీడియోలలో చూసినా ఇటు వంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. ఓపెరాహౌస్ మానవ నిర్మిత అద్భుతం. ఎన్నినాళ్ల కలో ఇది! 

          కళ్లొదిలేసి చూస్తూ అటే అడుగులు వేస్తున్న నాకు నా చుట్టూ చేరి ఆనందంగా నన్ను హత్తుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్న పిల్లలు, సత్య కనబడడం లేదు. నేను ఎన్నిన్నాళ్ళుగా ఒళ్ళు గగుర్పొడిచే ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానో ఓపెరా హౌస్ కూడా నా కోసం ఎదురు చూస్తున్నట్టే అనిపించింది. 

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.