అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 5

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల ఎం.బి.ఎ మొదటి సంవత్సరం చదువుతుండగా, విష్ణుసాయితో
నిశ్చితార్థమవుతుంది. విష్ణుసాయి తను ఆస్ట్రేలియా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నని చెబుతాడు. విశాల, మెడ్విన్ హాస్పిటల్ లో ప్రోజెక్ట్ వర్క్ కోసం వెడుతుంది.

***

          విశాల, యమున, వసుంధర, మరో ఇద్దరు స్నేహితులు రాజేంద్రనగర్ కాలేజీ ఆవరణలో కలుసుకున్నారు.

          విశాల చేతిలో శుభలేఖలు ఉన్నాయి. స్నేహితులకి, ఇంకా ప్రొఫెసర్లని పెళ్ళికి
ఆహ్వానించటానికి ఆ మీటింగ్. అక్కడ కేఫ్ పాయింట్ లో కర్రీ పఫ్, ఫిల్టర్ కాఫీ ఆర్డర్ చేసి అందరూ గతం తాలూకు జ్నాపకాలను నెమరువేసుకోసాగారు.

          వసుంధర, విశాలవైపు తీక్షణంగా చూస్తూ అంది. “మన బ్యాచ్ లో నువ్వే మొదటగా
పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియా చెక్కేయబోతున్నావన్నమాట.”

          ఇంతలో యమున కాస్త అక్కసుతో “ఏమే విశాలా! మరి నువ్వు ఆ రోజు ముందు జాబ్
తెచ్చుకోవాలి, బాధ్యతలు అంటూ నాకు క్లాస్ తీసుకున్నావు. మరి ఇప్పుడేమో నువ్వు ఎం.బి.ఏ పూర్తి కాకుండానే ఎలా పెళ్ళి చేసుకుంటున్నావ్?

          ఇంతలో భార్గవి అంది, “అవును మన వసుంధర వాళ్ళ అక్క కూడా ఆస్ట్రేలియా లోనే కదా ఉన్నది?”

          “విశాల మరి ఇంతకీ నీకు సైకిల్ తొక్కడం కూడా రాదు. మరి అక్కడ కారు ఎలా
నడుపుతావు?”

          ఇలా ఒకళ్ళ తరువాత ఒకళ్ళు విశాలను ప్రశ్నలతో సంధించసాగారు? వెంటనే సమాధానం చెప్పకుండా అన్నీ విని, “అయ్యాయా, మీ సందేహాలు? ఇంకా ఏమన్నా ఉన్నాయా?

          అందరికీ ఒకే సమాదానం నేనిచ్చేదేమిటంటే ….

          ఇది అక్షరాల అందరి సమక్షంలో, ఇరు పక్షాల పెద్దలు కుదిర్చిన వివాహం. నేను నా డ్యూటీగా డిగ్రీ పూర్తి చేసాను. నా ఎం.బి.ఏ పూర్తి చేయడానికి వాళ్ళు ఏమి అభ్యంతరం చెప్పలేదు. నేను నా వృత్తి, కుటుంబం ఈ రెండింటిని బాలెన్స్ చేయాలనుకుంటాను. కుటుంబానికి, పెంచి పెద్ద చేసిన తల్లి దండ్రులకు, ఇంకా నా దేశానికి ప్రాముఖ్యత నిస్తాను.

          ఇక ఆస్ట్రేలియా వెళ్ళటం మాటకొస్తే ఏమో! గుర్రం ఎగరావచ్చును! అన్నట్లుగా
నేను కూడా డైరెక్ట్ గా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని కారే నడిపేస్తానేమో! ఉద్యోగం కూడా నా సంపాదన డాలర్లతోనే మొదలవుతుందేమో! చూద్దాం దైవేచ్ఛ ఎలా ఉందో?”

          ఇలా గుక్క తిప్పుకోకుండా వసుంధర ఆత్మవిశ్వాసంతో చెప్పిన సమాధానానికి
అక్కడున్న స్నేహితులంతా విస్తుపోయి వింటూ ఉండిపోయారు.

          భేష్! విశాలా! నీ ఆత్మ విశ్వాసం ముందు, సందేహం కూడా బెదిరిపోయి పారి పోతుంది..అంటూ వసుంధర విశాల భుజం తట్టింది.

          తరువాత అందరూ అక్కడ నుంచి ఆ రోజు ఉన్న ప్రొఫెసర్లు ఎంటమాలజీ, పెధాలజీ, అగ్రి ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ప్రొఫెసర్లు దగ్గరకు వెళ్ళి పలకరించారు, విశాల వాళ్ళకి శుభలేఖలు ఇచ్చిన తరువాత, పెళ్ళిలో కలుస్తాము అని వెనుదిరిగారు.

          బస్సులో వెడుతూ ఆ రోజు జరిగిన సన్నివేశాలను విశాల పునరావృతం చేసుకోసాగింది. “నిజంగా నేనేనా అలా వాళ్ళతో మాట్లాడింది? వాళ్ళు నన్ను వేళాకోళం
చేయడానికి, అటాక్ చేయడానికి సిద్ధమవుతున్నపుడు, నాలో తెలియకుండా ఆ ఆది పరాశక్తి ఆవహించి, జరుగబోయే విషయాలు గడగడా చెప్పేసానా? అసలైతే నేను ఇంకా కారు డ్రైవింగ్, ఉద్యోగం గురించి అంతదూరం ఆలోచించలేదు. మన గురించి మనకన్నా, బయటవాళ్ళకే ఎక్కువ ఆలోచనలు, అంచనాలు ఉంటాయా?”

          “నిజమే బలహీనంగా ఊరుకుని ఉంటే ఈ రోజు నాది కాదు కదా?”

          సరిగ్గా మరో పది రోజులలో పెళ్ళి. నిమిషం కూడా వృధా కాకుండా ఇటు కాలేజ్, మరో ప్రక్క ప్రోజెక్ట్ వర్క్, పెళ్ళి పనులతో చురుకుగా అన్ని పనులు చాకచక్యంగా చేసే స్తోంది. ఎంగేజ్మెంట్ అయిన తరువాత, విశాల ప్రతిరోజు సాయివిష్ణు ఫోన్ కోసం ఎదురు చూడటం ఒక భాగమైపోయింది. సాయివిష్ణు ఇచ్చే సలహాలు వింటూ, ఇష్టాఇష్టాలు తెలుసుకుంటూ ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు.

          ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పెళ్లి పేరుతో ఇరువురి
జీవితాలు ఏకమై, మరో క్రొత్త మార్గంలో సరిక్రొత్త జీవితం విశాల, సాయివిష్ణుల పెళ్ళి ముహూర్తం గురువారం రాత్రి. అందుకే రిసెప్షన్ డిన్నర్ కి ముందు ఏర్పాటు చేసి పెళ్ళి మంటపం ముందు రెండు సింహాసనం లాంటి పెద్ద కుర్చీలు సిల్వర్ బోర్డర్, ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్నవాటిని వేసారు. పెళ్ళికూతురు, పెళ్ళీకొడుకు ఇంకో గంటలో అక్కడకి వస్తారు అనగా అపుడే విడిది నుంచి పెళ్ళి మంటపంలోకి అడుగిడిన పెళ్ళికొడుకు మేనత్త భానుమతి…

          “ఏమిటీ! ఈ కుర్చీలు ఆర్భాటం. పెళ్ళికాకుండా అబ్బాయి, అమ్మాయి ప్రక్కన నుంచోటం మన ఆనవాయితీ కాదు. వద్దని చెప్పండి, పెళ్ళికి ముందు రిసెప్షన్ పద్ధతి కాదు” అని అడ్డు పడింది. విశాలకు ఈ విషయం తన మామయ్య పిల్లలు వచ్చి చెప్పారు.
ఆ విషయం విని విశాల ఏమీ చలించలేదు. అంతకు ముందు సాయివిష్ణు రాబోయే మేనత్త, తన చుట్టాల గురించి చిరు పరిచయం ఇవ్వటంతో, “ఫర్వాలేదు” అని అక్కడ ఉన్న వాళ్లకి సర్ది చెప్పింది.

          మగ పెళ్ళివారు, తన స్నేహితులు ఒక్కరొక్కరుగా వచ్చి అటు ఇటు పెళ్ళికొడుకు,
పెళ్ళికూతురు ఇద్దరినీ చూడటానికి వస్తున్నారు. ఎదురు సన్నాహాలు, లాంఛనాలు, పానకపు బిందెలు, సన్నాయ్ బ్యాండ్ మేళంతో పెళ్ళి పందిరి మిరుమిట్లు గొలుపుతూ శోభాయమానంగా ఉంది.

          పెళ్ళి ముహూర్తం రాత్రి తొమ్మిది గంటల ముప్ఫైఎనిమిది నిముషాలకు. పెళ్లికొడుకు, పెళ్ళికూతురు ఇంకా ఎదురు పడలేదు. విశాల తాటాకు వెదురు బుట్టలో కూర్చుని, మల్లెపూలు కుట్టిన జడతో, నుదుట పాపిడిపిందె, ముదురాకుపచ్చ కంచి పట్టు చీరతో, మెడలో చంద్రహారంతో, సాక్షాత్ లక్ష్మీదేవిలా ఉంది.

          సాయివిష్ణు బంగారు రంగు సిల్క్ పంచె, కండువాతో మెడలో సన్నని గొలుసు, వేళ్ళకు ఉంగరాలతో, చిరుదరహాసంతో చూడచక్కని మోముతో అందంగా ఉన్నాడు.
సాక్షాత్ మహావిష్ణు, మహాలక్ష్మీ దేవతల కళ్యాణం జరగటానికి ఏర్పాటు చేసిన వేదికలా పెళ్లి మంటపం సిద్ధంగా ఉంది.

          మేనమామలు పెళ్ళికూతురిని సంతోషంగా బుట్టలో తీసుకువస్తున్నారు. పురోహితుడు మైక్ లో స్పష్టంగా మంత్రాలు చదువుతున్నాడు. మధ్యలో ఛలోక్తులు, ముఖ్యమైన చోట చక్కని వివరణలతో అందరి దృష్టిని చూరగొంటున్నాడు.

          పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఎదురెదురుగా పీటల పై కూర్చొన్నారు. వారిరువురి
మధ్య తెరసాలను ఇరువురు చిన్నారులు శ్రద్ధగా పట్టుకున్నారు. తేటతెల్లమైన ఆ వస్త్రంపై తెరవెనుక అందం, తెర తీస్తే బంధం అని ముత్యాల్లాంటి దస్తూరితో అక్షరాలు లిఖించారు.

          పెళ్ళికూతురికి ఇరువైపులా తల్లి శారద, తండ్రి శ్రీనివాస్ గారు కూర్చున్నారు.
“అయ్యా! ఇక ముహూర్తానికి సమయం ఆసన్నమవుతోంది. జీలకర్ర, బెల్లం కలిపితే
విడదీయడం అసాధ్యం. అలాగే పవిత్రమైన వివాహబంధంతో ఒకటవుతున్న వధూవరు లు కూడా ఆలు మగలుగా, పాలు, నీళ్ళలా కలసిపోయి విడదీయరాని బంధంగా మనుగడ
సాగించాలని ఆంతర్యం.”

          “భజంత్రీలు వాయించండి, వాయించండి” అంటూండగా, వదూవరులిరువురి మధ్య తెరచాప తొలగింది. అదే సమయంలో ఇరువురు ఒకరి తల పై మరొకరు జీలకర్ర, బెల్లం పెట్టుకోగానే, చూపులు కలుసుకుంటున్న శుభవేళలో సాక్షాత్ దేవతా స్వరూపులైన
పెద్దలంతా అక్షింతలతో ఆశీర్వాద ధారలు కురిపించారు. విశాల, సాయివిష్ణు
అపురూపమైన ఆ ఘట్టంలో బుగ్గన చుక్క పై జీవితంలో అపురూపమైన వస్త్రధారణలో ఒకరిని ఒకరు చూసుకుని పరవశులైనారు. గత పదిరోజులుగా ఎన్నో ఊసులు చెప్పు కున్నారు. ఇపుడు ఇరువురు వివాహజీవితంలోకి అడుగుపెడుతున్న క్షణం ఈ ముహూర్త ఘడియ. వధూవరులిరువిరి చేతిలో మధుపర్కాలు పెట్టి లోపలికి పంపారు. ఆ సమయం లో అనంత శర్మ కన్యాదాన ఫలితం గురించి వివరంగా చెబుతూ “కన్యాదానం వల్ల లభించే పుణ్యం అంతా ఇంతా కాదు. ఎన్నో సంవత్సరాల వరకు సత్యలోకంలో నివశించే యోగ్యత కలుగుతుంది. నూరు యజ్ఞాలు చేసిన పుణ్యానికి పైగా మూడు రెట్లు పుణ్యం వస్తుందని మహర్షుల ఉవాచ. కన్యాదాన సమయంలో వధువు తండ్రి మూడు తరాల తన పూర్వీకులను స్మరించి వరునికి కన్యను ధారపోస్తాడు.. అలాగే కన్యను స్వీకరించే సమయంలో వరుడు కూడా మూడు తరాల వరకూ తన పూర్వీకులను స్మరిస్తూ వధువును స్వీకరిస్తాడు.

          ఇదే మన సనాతనధర్మంలో, శాస్త్ర సమ్మత వివాహాలలో మహత్తు. ఈ మంటపం
పై ఆశీనులైన వధూవరులిద్దరు సాక్షాత్ లక్ష్మీనారాయణులతో సమానం.” ముత్తుయిదువులు దీపకాంతులలో మధుపర్కం, వల్లెవాటు వేసుకున్న పెళ్ళికూతురిని తోడ్కొని వస్తున్నారు. వీడియోగ్రాఫర్ ప్రతి మూవ్ మెంట్ ని కెమెరాలో బంధించాలని చూస్తున్నాడు. మాంగల్యధారణ కాగానే, పెళ్ళికొడుకు ఫ్రెండ్స్, విశాల క్లాస్ మేట్స్
మంటపం దగ్గరికి వచ్చి, కంగ్రాట్స్ చెపుతూ, గిఫ్ట్ ప్యాకెట్ చేతిలో పెడుతున్నారు.

          తలంబ్రాలు వధూవరుల శిరస్సుల పై జాలువారుతున్నపుడు, వీక్షిస్తున్న బంధువుల ముఖాలలో నవ్వులు, పువ్వులై విరిసాయి.

          పెళ్లి తతంగం ముగిసాక, విశాల కళ్ళు తాతగారి కోసం వెదికాయి. విష్ణుసాయిని
తీసుకుని ఆయన వద్దకు వెళ్లి, తాతగారి కాళ్ళకు ఇద్దరు వంగి నమస్కారం చేసారు.
తాతగారు, “నిండు నూరేళ్ళు ఆనందంగా వర్ధిల్లండి. ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు. రెండు చేతులా మంచి ఉద్యోగంతో డాలర్లు సంపాదించి, సంతోషంగా ఉండండి” అని దీవించారు.

          విశాల పెళ్లి తతంగంలో పురోహితుడు చెపుతున్న అన్ని విషయాలు చాలా
శ్రద్ధగా వింది. అత్తవారింట్లో సరదాలు, ఆట పట్టింపులు, మధ్య మధ్యలో అక్కడక్కడ
పుల్ల విరుపు మాటలు అన్నిటిని వీక్షిస్తూ విశాల, విష్ణుసాయి ఒకటయ్యారు.

          పెళ్ళి అయిన తరువాత, విష్ణుసాయి, విశాల కలిసి వాళ్ళకు వచ్చిన గిఫ్ట్ ప్యాక్స్ అన్నీ ఒకచోట చేర్చారు.

          “విశాల, నువ్వు ముందు గిఫ్ట్ ఓపెన్ చెయ్యి. లేడీస్ ఫస్ట్” అని విష్ణుసాయి అనగానే
అక్కడున్న అన్ని పాకెట్స్ లో, ఒకటి చేతిలోకి తీసుకుని, విశాల తెరవగానే షిర్డీసాయి బాబా చిత్రం గోల్డ్ ఫోటో ఫ్రేమ్ ప్రత్యక్షమైంది. అది చూడగానే ఆమె ఆశ్చర్యానికి, ఆనందానికిలోనైంది. అక్కడున్న అత్తగారు కూడా “అమ్మా, విశాలా! నీకు బాబా ఆశీస్సు లు పుష్కలంగా ఉన్నాయి, చాలా అదృష్టవంతురాలివి” అన్నారు.

          ఆ మాటకి విశాల ముఖం వెలిగిపోయింది. పెళ్ళి అయిన పది రోజులకి, పెళ్ళి ఫోటోల ఆల్బమ్, వీడియో క్యాసెట్ ఫోటో గ్రాఫర్ తీసుకువచ్చాడు. ఆ రోజు అందరూ కలిసి వీడియో చూస్తూ, పెళ్ళికి వచ్చిన వాళ్ళ పేర్లు విశాల, విష్ణు చెప్పుకోసాగారు.

          “విశాల, ఈ పెళ్ళి ఫోటో తీసుకుని రేపు మనం రిజిష్టర్ ఆఫీస్ కి వెడుతున్నాము.
అక్కడ మనం మ్యారేజ్ సర్టిఫికెట్, అలాగే నీ సర్ నేమ్ ఛేంజ్ సర్టిఫికెట్ అన్నీ ఒకేసారి తీసుకోవచ్చు. మనం ఆస్ట్రేలియా వెళ్లడానికి, ఇది అవసరం”

          “నిజమే, నేను ఇంకా కెరీర్ మొదలెట్టకుండా ఇంటిపేరు మారింది కాబట్టి, ఇబ్బంది ఉండదు. మా కజిన్, జాబ్ వచ్చాక, పెళ్లి చేసుకుంది. అందుకని జాబ్ పేస్లిప్స్ అన్నిటి మీద, పుట్టింటి సర్ నేమ్ ఉంటుంది.” 

          ఇద్దరు రిజిష్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని, ఆ రోజు సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళారు.

          “నాకు పుస్తకాలంటే ప్రాణం అండీ! పుస్తకం పట్టుకుంటే వదిలి పెట్టకుండా చదివే స్తాను. దేవాలయంలాగా పుస్తకాలున్ననిలయాన్ని గ్రంథాలయం అంటారు. మనకున్న ఆలోచనా పరిథి పుస్తక పఠనం ద్వారా విస్తృతమవుతుంది. ఈ పుస్తకం చూడండి, ‘టూరింగ్ అట్లాస్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇది నాకు కావాలి. మనం వెళ్లబోయే ఆస్ట్రేలియా గురించి ఈ పుస్తకం ద్వారా కొద్దిగ అవగాహన వస్తుంది.” అంది విశాల.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.